తెల్లారగట్ల ప్రయాణం

“ఎన్నిగంటలకి పెట్టమంటావ్  అలారం,” అంటూ గడియారం పట్టుకొచ్చారు మా అత్తగారు.  మా అత్తగారికి తెలిసిన అతికొద్ది విద్యల్లో అలారం పెట్టడం ఒకటి.

ఆ గడియారంలో సెకన్ల ముల్లు నడుం విరిగి అందులోనే పడిపోయింది. ఇన్నాళ్ళూ తమతోపాటూ కలిసి తిరిగింది అలా పడుందన్న బాధ కాస్తయినా లేకుండా ఒకదాన్నొకటి రాసుకు పూసుకు తిరిగేస్తున్నాయి గంటలముల్లూ నిమిషాల ముల్లూ. “ఎప్పుడో  తెల్లారగట్ల పెళ్ళి ….ముహుర్తం  వరకూ ఎవరుంటున్నారు  రాత్రి భోజనాల్లో అయితే అందరూ కనిపిస్తారు. అంటే సాయంత్రానికి చేరుకుంటే సరిపోతుంది. పోనీ  మధ్యాన్నానికి  వెళ్ళగలిగితే ఊళ్ళో మిగతా చుట్టాల ఇళ్ళుకూడా చుట్టి రావచ్చు లేదంటే మళ్ళీ నిష్టూరాలు.  కాబట్టి పొద్దున్నే బయల్దేరాలి. తప్పుతుందా…తెల్లారు  గట్టే లేవాలి.”

“అవునవును   నాలుక్కి లేవలేకపోయినా కనీసం అయిదయ్యేసరికన్నా లేవాల్సిందేనండీ  హ…ఆ…..ఆ….” అని హాయిగా అవులిస్తూ నా అమూల్యమయిన సలహా ఆవిడముందు  పరిచాను.  ఆవిడ దాన్ని అధికారికంగా చుట్టేసి ఓ మూలకి విసిరేస్తూ…

“నీ మొహంలావుంది …..నాలుక్కి లేచి, టిఫినూ, అన్నంకూరా వండి ,నీళ్ళుకాచుకుని  స్నానాలు చేసి …  దేవుడికి దీపం పెట్టుకుని, ఇద్దరం టిఫిన్ తిని కాఫీ తాగి, మగమహారాజులిద్దర్నీ లేపి, వాళ్ళకీ ఇంత కాఫీ పోసి ….  ఇల్లు చూస్తుండమని శారదత్తయ్యకి చెప్పి మనం  ఎదురుచూసుకుని  బయల్దేరేసరికి  దుర్ముహుర్తం  వచ్చెయ్యదూ! రేపు శనివారం , అయితే అయిదు లోపులో లేదా ఎనిమిది తర్వాత పెట్టుక్కోవాలి ప్రయాణం.  అయిదు గంటలకి ప్రయాణం అంటే రెండు గంటల కైనా  లేవొద్దూ ….. అందుకనీ  ఒంటి గంటకి పెడతాను . అలారం మోగాకా బద్ధకంగా ఓ గంట అటూ ఇటూ దొర్లి లేచినా పర్లేదు.”  అంటూ ….అలారం  సెట్ చేసిన గడియారం  నా గదిలో టేబుల్మీద పెట్టి, “పడుకో పడుకో……మళ్ళీ  తెల్లారగట్లే లేవాలి,” అంటూ వెళ్ళిపోయేరు.  ఆ మాత్రం దానికి  “ఎన్నింటికి పెట్టనూ?” అని అడగడం ఎందుకూ…అన్నీ అబ్బాయి పోలికలే  అని అసందర్భపు అక్కసుని వెళ్ళబోసుకుంటూ.   టైం చూస్తే  పన్నెండున్నర !!

హత్తెరీ బేగ్గులు సర్ధుకోటంలో టైం చూసుకోలేదు  ఇంకేం  నిద్ర  అనుకుంటు తలుపు జారేయబోతుంటే  అత్తగారు , వీధరుగు మీద నిద్రపోతున్న అబ్బులు గాడిని  నిద్రలేపి “ఒరేయ్ తెల్లారగట్లే లేవాలి గుర్తుందా  పడుకో పడుకో ” అనడం వినిపించింది.

“మర్చేపోయాను…..నా గంధం రంగు చీర పెట్టేవా ?” అంటూ మళ్ళీ  వచ్చేసారు .  “ హా…….పెట్టానేమో లెండి!!” అన్నాను.  నాకు అర్జెంటుగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అసలే అలారం మోగడానికున్న టైం అరగంటేనాయే….

“ఏ గంధం రంగనుకున్నావూ …….మొన్న దీపావళికి మా పెద్దన్నయ్య పెట్టాడూ అదీ ……చింతపిక్క రంగు అంచూ……అక్కడక్కడా మామిడిపిందె బుటాలూ……”
“హా….హ……ఆ ……..” పెట్టానండీ అని ఆపద్ధర్మంగా అబద్ధం ఆడేసాను. ఇప్పుడు బీరువా తీస్తే …….ఆ బరబరలకి   నిద్రాభoగమయితే ముసుగులో  సింహం మేల్కొనవచ్చు….ఏమో మీదపడి నమిలేయొచ్చు. . ఇప్పటికే పది గాండ్రింపులయ్యాయి. “పగలంతా ఏ పెద్దగుర్రాలకి  పళ్ళు తోమారు  అత్తాకోడల్లిద్దరూ అర్ధరాత్రి  అపరాత్రి లేకుండా …వెధవ సర్దుళ్ళూ మీరూనూ” అంటూ.

మీకేం తెలుసు మా అవస్థలు .  అనుకోటానికి నాలుగు జతల బట్టలేకానీ….ఎన్నెన్ని చూసుకోవాలి . మేచింగు ప్రకారం   సాల్తీలన్నీ సర్దుకోవాలి , క్రితం సారి పెళ్ళికి కట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళకూడదు ,  రోజులో నాలుగు చీరలు  ఆ నాలుగు ఒకదానికొకటి సంబంధం లేని రంగులు వెతుక్కోవాలి,  ఆ రంగులకి సరిపోయే  బొట్టూ, గాజులూ…..అంటూ నాలువేళ్ళు ముడిచేసరికే నిద్రలోకి జారుకున్నారు .

“మా పెద్దొదిన  దిగుతుంది  పెళ్ళికి ….ఆవిడముందు ఆ చీర కట్టుకుని తిరిగితేకానీ   సిగ్గురాదు ….. జానాబెత్తెడు  కొలతతో ఉంది కొని పంపింది చూడు. పవిటేస్తే కుచ్చీళ్ళు రావు కుచ్చీళ్ళు పోస్తే పవిట చాలదు. చీరపెట్టలేదని నేనేవన్నా ఏడ్చానా?” తనధోరణిలో చెప్పుకుపోతున్నారావిడ. ఏంటో   పీత కష్టాలు పీతవి   హా…..ఆఅ….ఆ….అ.  గాట్టిగా ఆవులించి  గడియారం వంక చూస్తే  హమ్మో !! పెద్దముల్లపుడే పదడుగులేసేసింది.

నాకక్కడే  నేలమీద పడి  గడపమీద తలపెట్టుకునయినా  పడుకుండిపోవాలనిపించేంతగా  ముoచుకొచ్చేస్తుంది నిద్ర…..

“అవునూ ఎన్నిబేగ్గులయ్యేయీ…..మరీ ఎక్కువ లగేజీ అయితే బస్సుల్లో ఎక్కీ దిగీ కష్టం . అలాని మరీ కుక్కి పెట్టేసేవంటే వచ్చేప్పుడు బేగ్గులు పట్టవ్….ఇస్త్రీ బట్టల్లా  ఇడిసిన బట్ట్టలు సర్దలేం కదా! పోయిన సారి ఇలాగే   నీలపల్లి పెళ్ళిలో  బేగ్ పట్టక మూడు లంగాలు వదిలేసొచ్చాను. నే తర్వాత పంపిస్తాలే పిన్నీ అంది  మా చిన్నన్నయ్య మూడో కోడలు సుభద్ర . ఒకటే పంపటం….నిక్షేపంలాంటి లంగాలు. పరకాళ్ళా గుడ్డలే అనుకో తుని నించి తెప్పించేను    పదేల్లబట్టీ కట్టినా పిసరు రంగు దిగితేనా !!” ఓరి నాయనో…  ఈవిడని నీలపల్లిలో ఆపకపొతే యానం లో లాంచీఎక్కి , అలా  ఎదుర్లంక ,మురమళ్ళ ,అమలాపురం పెళ్ళిళ్ళకి కూడా పోయి  ఆయా పెళ్ళిళ్ళల్లో  వదిలేసొచ్చిన తువ్వాళ్ళూ, జేబురుమాళ్ళూ లెక్కేస్తూ కూర్చుంటారు  అని భయం వేసి, “అవన్నీ బస్సులో చెప్పుకోవచ్చులెద్దురూ ఇప్పుడు పడుకుందాం,” అనేసాను.

“సర్లే పడుకో…..మళ్ళీ తెల్లారగట్లే  లేవాలి. పొద్దున్న ఉప్మా లోకి కర్వేపాకు కోసిపెట్టేవాలేదా ! చీకట్లో దొడ్లో కెళీతే పురుగో పుట్టో ఉంటాయ్. ఓ సారిలాగే  తెల్లారు ఝాము ప్రయాణం… అపుడు మీ ఆయనకి మూడో ఏడు…మీ మావయ్యా నేనూ …..”

అబ్బాయిగారు నిద్రకీ మెలకువకీ మధ్య ఇబ్బందిగా కదులుతున్నారు. లేచారంటే ఓ గసురు గసురుతారు…….అని భయపడి . “హుష్…..అత్తయ్యా ఇలా రండి” అని ఆవిడ్ని  గుమ్మం బయటికి పిలుచుకెళ్ళాను.

ఏంటీ…..అని ఆవిడా గుసగుసగా అంటూ  నా చెవి దగ్గర చేరి చెయ్యడ్డుపెట్టి, ఆ  వస్తువులెక్కడ పెట్టేవ్. చంద్రహారం విడిగా జేబురుమాలులో ముడేయమన్నాను వేసేవా ……..ఏ బేగ్గులో పెట్టావో  నాకూ చెపితే  ఓ కన్నేసి ఉంచుతాను.  అసలే బస్సు ప్రయాణం  …..జాగ్రత్తగా పెట్టావా….అని అతి రహస్యంగా అడుగుతున్నారు. అంతే, …….

టేబుల్ మీద గడియారం  కర్ర్……..ర్ర్ర్….ర్ర్ర్ర్……………..ర్ర్ర్ర్ర్ర్ర్…..ర్ర్ర్ర్ర్ర్ మంటూ   రాక్షస స్వరంతో   గుక్కెట్టి ఏడ్చింది.  మా ఇంట్లో మగాళ్ళకి లానే దానికీ అత్తాకోడళ్ళిద్దర్నీ కలిపిచూస్తే కన్ను కుట్టేస్తుంది కాబోలు.

అప్పుడే తెల్లారిపోయిoదా లే…లే… ( అసలు పడుకుందెక్కడా!!). పొయ్యంటించు, అని మా అత్తగారు  తెగ హైరానా పడిపోయారు.  ఆ గోలకి అబ్బాయిగారు అదాట్న మంచమీంచి లేచి  నన్ను నమిలి మింగెయ్యాలన్న కోరికని అతికష్టం మీద ఆపుకుని ( పరగడుపున పచ్చిమాంసం అరగదనుకున్నారేమో), దుప్పటీ తలగడా తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. మాం గారు  లేచి ఓసారి పెరట్లో కెళ్ళొచ్చి పడుకున్నారు ( బాగా గుర్తుచేసావ్ అన్నట్టూ).

ఇక నా పరిస్తితి ఏం చెప్పుకోనూ…..హాఅ….ఆఆ…హా…ఆ…..    సీన్ కట్ చేస్తే,
నేనూ మా అత్తగారూ మా ట్రాక్టర్ డ్రయివరు అబ్బులూ విత్  అవర్ బేగ్స్ అండ్ బెడ్డింగ్స్  మా ఊరి పుంతరోడ్డులో ఉన్నాం.

సమయం మూడుగంటలా నలభై  అయిదు నిమిషాలు.   చెప్పానో లేదో…..మా అత్తగారు గడియారానికి గంటంపావు ముందుంటారు   ప్రయాణాలప్పుడు మరీనూ…
మా ఊరు  పెద్దరోడ్డుకి  దగ్గిరిలెండి. ఎలాగో ఆ రోడ్డుకి  చేరితే అక్కడినుంచి ప్రయాణం నల్లేరుమీద బండి నడకే.  ఇప్పుడు మేం వైజాగ్ వెళ్ళాలంటే వెనక్కి రామిండ్రీ వెళ్ళి బస్సెక్కి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇలా ముందుకెళ్ళటం సుద్ధ దండగ కదా ! అందుకే ఇక్కడే  కాపుకాసి   ఆగిన బస్సులో ఎక్కేస్తుంటాం. అవును మేం చెయ్యెత్తితే బస్సులు ఆగుతాయ్   ‘ ఒక్కోసారి ‘ నిద్ర మొహాన లేపుకొచ్చేసాం ఏమో… అబ్బులు కునిపాట్లు పడుతూ  దెయ్యాలు తిరిగే ఏళప్పుడు ఈ పయాణేలేటండీ. కుంత తెల్లారేకా ఎల్లకూడదేటండీ అని  చనువుగా ఇసుక్కుంటున్నాడు.

నేను బితుకూమంటూ  “అవున్రోయ్ ” అనుకుంటూ చుట్టూ చూసాను. ఎదురుగ్గా తళ తళలాడే తార్రోడ్డున్నా. మా వెనకున్నది సన్నగా మలుపులు తిరిగిన డొంక దారి.  ఈ పక్కా ఆ పక్కా   చింపిరి   దెయ్యాల్లాగా   కనిపించాయి  అడ్డడిడ్డంగా పెరిగిపోయిన చెట్లూ కంపలూ.  ఎక్కడా నరవాసన  చీ…చీ…ఎక్కడా నరసంచారం లేదు.   “ఇక్కడవుతే మలుపుంది గనక  బస్సులు ఇసులో ( స్లో )అయ్యినపుడు మనల్ని  సూడగానే  ఆటోమేటిగ్గా ఆగుతాయండి”   అని మా అబ్బులి ఆలోచన. ఆందుకే  ఏ వాహనం ప్రయాణించవీల్లేని  చిట్టడవిలాంటి ఈ చీకటి ప్రదేసానికి అడ్డదారిన నడిపించి తీసుకొచ్చేసేడు.

ఇంట్లోకూడా దుప్పటి ముసుగేసి భయపడుతూ చూసే  పాటొకటి చప్పున గుర్తొచ్చేసింది. నిను వీడని నీడను నేనే………   నాకు భయం వేసి , మా అత్తగారికీ అబ్బులుకీ మధ్యకొచ్చి నుల్చున్నాను. చేతిలో బేగ్గు భుజం లాగేస్తుంది. కింద పెడదామంటే అంతా మట్టి ..పెంట…ఏమో ఇంకేవేం వున్నాయో!

అత్తగారు  చేతులు రెండూ నడుమ్మీద పెట్టుకుని, ఒరేయ్ ఏదో బస్సొస్తుంది చూడు అంటూ ఆర్డరేసారు కలిదిండి మహారాణిలా ( ఆవిడ పుట్టిల్లు అదేలెండి). వాడు నెత్తినున్న మూడుబేగ్గుల్నీ  ఓ చేత్తో కాసుకుంటూ  భుజాన్నున్న ఇంకో సంచీని సర్దుకుని రోడ్డు మధ్యకెళ్ళి చూసొచ్చాడు. “వత్తవయితే  రైటేగానండి  బస్సో లారీయో దగ్గిరికొత్తేగానీ తెల్దండి….” అనేసాడు.

చుట్టూ చీకటి, పక్కనున్న మాకు మేవే కనప్డటం లేదు. ఇంక మమ్మల్ని చూసి ఏ బస్సు ఆగిచస్తుంది. తెల్లారగట్ల కీ అర్ధరాత్రికీ తేడా తెలొద్దూ ఈ పెద్దావిడకి  విసుగ్గా మనసులో అనుకున్నా… ఆవిడకి కాస్త దూరంగా  జరిగి.

దూరం నించీ లైట్లు  కనపడగానే అబ్బుల్ని రోడ్డుమీదికి తోలేస్తున్నారు మా అత్తగారు.  వాడు  మూటలన్నీ నెత్తినపెట్టుకుని ముఠామేస్త్రిలాగా పోజుగా  చెయ్యూపుతూ నుంచోటం, ఆ వాహనం ఒంటికన్నో రెండుకళ్ళో వేసుకుని బోయ్….అంటూ దగ్గరికొచ్చేసరికి వీడు అమ్మోయ్ అని  పక్కకి ఒక గెంతు గెంతడం.     రక్షించండీ రక్షించండీ అని చేతులూపుతూ హాహా కారాలు చేస్తున్నట్టున్న మా అబ్బులి గాడి సైగలు చూసి రోడ్డు వొంపులో  ఒకటో రెండో బస్సులు కీచుమంటూ  స్లో అయ్యి , మళ్ళీ వేగంగా వెళ్ళిపోయేవి. బస్సు మమ్మల్ని దాటెళ్ళిపోయేకా ఒకటిరెండు బండబూతులు గాలికి ఎగిరొచ్చి పడేవి. మేం వచ్చి  అరగంట అయినట్టుంది. ఎక్కడో కోడికూత  వినిపించింది . హమ్మయ్య పోన్లే  బస్సు రాకపోతే పోయే వెలుగన్నా వస్తుంది అనుకొని నేను ఆనందపడుతుంటే… బస్సుకంటే ముందు  వెలుతురెక్కడ వచ్చేస్తుందో అని మా అత్తగారు కంగారుపడుతున్నారు.

టైమెంత అయ్యుంటుందంటావ్ అన్నారు మా అత్తగారు. నేను నా ఎడంచెయ్యి వెనక్కి దాచేసి  పైకి కిందికీ వెనక్కీ ముందుకీ చూసి ఏమో తెల్దండీ  అనేసాను. అబ్బులుగాడయితే ఎటూ చూడకుండా ….. “కరకెస్టుగా నాలుగున్నరకీ  అయిదున్నరకీ మజ్జిలో ఎంతో అయ్యుంటాదండి,”అన్నాడు  ఇబ్బందిగా కడుపు నొక్కుకుంటూ.

అంత కరకెస్టుగా ఎలా చెప్పేసేవ్రా బాబూ….అని మేం ఇద్దరం అడగలేదు. అప్పుడే …   పైనుంచీ రాలిపడ్డట్టూ  మా ముందు కొచ్చి నుంచుందో ఆకారం. నేను హడలిపోయి, తు…తు..తు..అనుకుని  తేరుకున్నాను. మా అత్తగారు  నువ్వట్రా సింగినాధం అన్నట్టు ఓ తేలిక చూపు విసిరి, గుళ్ళగొలుసు ఓసారి సర్దుకుని  రోడ్డుకేసి చూస్తూ ఠీవీగా నిలబడ్డారు.

“ఏట్రా అబ్బులూ……అయ్యగారిని ఇక్కడ నిలబెట్టేవ్.  బస్సు కోసరవా?  నీకు తెల్దేటిరా…..పైన దాబా ఒటేలు ఎట్టినకాడ్నించీ అక్కడే ఆగుతున్నాయ్ బస్సులు.  ఈర్ని అక్కడకి తీసుకుపో”  అందా సాల్తీ .

అబ్బులు గాడ్ని రెండు తన్నాలనిపించింది.  వివరం తెలకుండా ఇంత సేపూ అక్కడ నిలబెట్టినందుకు.  అత్తగారుండగా కోడలు పెత్తనం చేసిందంటారని ఊరుకున్నా . ఎలాగో  ఆయన్ని బ్రతిమాలి బస్సెక్కించే ఏర్పాట్లు చేయిద్దామనుకుంటే, “ఎందుకండి బాబూ….. గంపకింద కోడి కూయ్యకముందే  మిమ్మల్ని బస్సెక్కిచ్చీ పూచీ నాది,” అని  ఆ కబురూ ఈ కబురూ చెప్పేసి అర్జెంటుగా అవసరం పడిందని యాభైరూపాయలు పట్టుకుపోయాడు రాత్రి.

ప్రయాణం అనుకున్నప్పటినుంచీ మూడు అయిదులు మా అత్తగారిదగ్గరా, మూడు యాభైలు నా దగ్గరా గుంజేసినట్టు లెక్కతేలింది. “వాణ్ణనుకోటం ఎందుకూ మన బంగారం మoచిదయితే ….పెళ్ళికెళ్ళాలని ముచ్చట పడుతున్నారు. దగ్గరుండి రైలో బస్సో ఎక్కిద్దాం అని ఉండొద్దూ. పైగా పిలిచిన ప్రతీ పెళ్ళికీ వెళ్ళిపోటమే  మీ తిప్పలు మీరు పడండి అనేసారు చూడు”. అని మా అత్తగారు నిన్న రాత్రి భోజనాల దగ్గర బాధపడ్డారు. నేనూ నా వంతుగా  ‘భామాకలాపం’ సాగించినా  ఫలితం లేకపోయింది.

“లేదు మాయ్యా బస్సులిక్కడా ఆగుతాయ్……ఆ మద్దిన మా యమ్మనీ, మా యావిడ్నీ ఇక్కడే కదేటీ  గోపాలపొరం బస్సెక్కిచేను”  అని అడ్డoగా దబాయించేస్తున్నాడు  అబ్బులు.

ఏం చేద్దావండీ అని మా అత్తగారిని అడుగుదామని చూద్దును కదా ఆవిడప్పుడే పిలుపుకు అందనంత దూరంలో  ఉన్నారు  ఆది చూసి, ఆబ్బులుమాయ్య ( అదే ..అబ్బులుకి మాయ్య)  “అదేటండీ పెద్దయ్యగారు అటెల్లతన్నారు….. ఇటెల్లాలండి” అని   చెంబున్న చెయ్యెత్తేడు. ఈవిడేమో చుట్టున్న చెయ్యివేపు వెళ్ళిపోతున్నారు లేడికి లేచిందే పరుగంటే ఇదే మరి.

ఏలాగో అరిచీ కేకలేసీ ఆవిడ్ని పట్టుకుని పూర్తి అపసవ్య దిశలో నడిపించుకొచ్చేసరికి అప్పటివరకూ మేం నుల్చుని ఉన్న ఆ చోట్లో  ఇత్తడి చెoబు మైలు రాయిలాగా  మసగ మసగ్గా కనిపించింది….తుప్పల వెనకనుంచీ  అలా తిన్నంగా ఎల్లిపోండి అని  అబ్బులు మాయ్య గారి సలహాకూడా వినిపించింది.

నాకు ఇంటికెళ్ళి ఇంకోసారి తలస్నానo చేసి రావాలనిపించింది. మా అత్తగారు ససేమిరా అంటారని ఊరుకున్నాను. మేం ఆ ‘ దాబా ఒటేలు కాడికి ‘  నడిచొచ్చేసరికి  ఎంచక్కా తెల్లారిపోయింది.   ఒకటో మూడో బస్సులు బోయ్..మని హారని కొట్టుకుంటూ మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయాయి.

మా మొదటిపెళ్ళిరోజు శ్రీవారు బహుమతిగా ఇచ్చిన (అంకెలేలేని ) టైటన్ వాచీలో చుక్కల్ని లెక్కపెట్టుకుని పెద్దముల్లుకీ చిన్న ముల్లుకీ ఉన్న దూరాన్ని బట్టి చూస్తే టైము అంచనాగా  అయిదున్నర  లెక్కకొచ్చింది.

ఇక దుర్ముహుర్తం వచ్చేసినట్టే అని మా అత్తగారూ ……ఇంకో అరగంట వరకూ పర్లేదని నేనూ వాదించుకున్నాం.

ఇదేం ఖర్మే ….దరిద్రగొట్టోడు  దండుకోటానికెళితే వడగళ్ళవాన కురిసిందనీ ……కదలక కదలక ఇల్లు కదిలితే ఇలా అయ్యిందేవిటీ అని అవిడ నానా హైరానా పడుతూ అబ్బులు కేసి కొరకొరా చూసి  ……టైమెంతయ్యిందీ అన్నారు పద్దెనిమిదోసారి. నేను వాచీ ఆగిపోయిందండీ  అని అలవాటుగా అబద్ధం ఆడేసాను.  అబ్బులుగాడు కడుపు పాముకుంటూ “కరకెస్టుగా ఆరయ్యుంటాదండి,” అన్నాడు కడుపే కైలాసం అన్నట్టు వాడికి కడుపే గడియారం.

ధాబా ఒటేలు నించి వస్తున్న కమ్మని వాసనలకి మా కడుపులో ఎలకలు  కలియతిరిగేస్తున్నాయి.  బస్సొచ్చేలోగా ఓ పనయిపోతుందని  అన్నవరం దాటాకా తిందామని  మేం తెల్లారగట్ల వొండితెచ్చుకున్న కరివేపాకు వేయని ఉప్మాని ముగ్గురం   నుంచున్న పళంగా  పంచుకు తినేసాం.

మేం మూతులు కడుక్కుని మంచినీళ్ళు తాగేసరికల్లా  బస్సొచ్చి సరిగ్గా మా ముందే ఆగింది. ముందు బోర్డు చూసుకుని, ఎందుకయినా మంచిదని కండక్టర్ని  కూడా అడిగి సందేహం లేకుండా గబగబా అందిన బేగ్గులు పుచ్చుకుని ముందు నేనూ,  వెనక అత్తగారూ బస్సులో కాళ్ళుపెట్టేసాం. తీరా చూస్తే ఇంకో రెండు బేగ్గులు కిందవుండిపోయాయ్. అబ్బులుగాడు అయిపూపజాలేడు. కండక్టరేమో “ఏటమ్మా ఎక్కుతే ఎక్కండి లేపోతే దిగండి. డోరుకడ్డంగా నిలబడిపోతే ఎలాగా అని  మమ్మల్ని అయితే బస్సులోకి లాగెయ్యడానికి లేకపోతే కిందకి తోసేయ్యడానికీ రెడీగా వున్నాడు.  అత్తగారు ఉండు నేను తెస్తా అని దిగేరు….అయ్యో పెద్దవిడ ఆవిడెక్కడ మోస్తారు అని నేనూ దిగాను. డ్రయివరు బస్సుని రయ్యిన లాగించేసేడు.  అపుడొచ్చాడు అబ్బులు ….. “ఊ కంగారడిపోతారేటండీ నోనొత్తన్నాను కదా”  అంటూ …అత్తగారు యధాలాపంగా వాడి నెత్తిన నాలుగు అక్షింతలు చల్లి శాంతించారు. అదయ్యాకా మాకు తెలుసున్నవాళ్ళు ఒకరిద్దరు కనిపించారు కానీ మేం వాళ్ళని చూళ్ళేదు  ఎక్కడికీ ప్రయాణం అనడుగుతారని.  అలా అడిగితే ప్రయాణం సాగదనీ….అనుకున్న టైముకి ఆశించిన విధంగా ప్రయాణం జరగనందుకు  కారణాలను మేం విశ్లేషించుకుంటూ ఉండగా ఓ రెండు బస్సులు ఖాళీ లేదు అని  అబ్బుల్ని లెక్కచేయకుండా వెళ్ళిపోయాయి.

నిన్న రాత్రనగా మొదలయిన ప్రయాణం  నిద్రలేక నిలబడలేక నీరసం వచ్చేస్తుందిరా దేవుడా.  నా సంగతొదిలేయ్….పాపం ఆ మహతల్లి  నీకు నైవేద్యం పెట్టకుండా ఏనాడన్నా తాను తిందా ….మాకు పెట్టిందా !! (ఏదో ఇలా ప్రయాణాలప్పుడూ ప్రాణం బాగోనప్పుడూ ఎలానూ తప్పదనుకో )  మహా సాద్విని  ఇలా కష్టపెడతావా? “కరుణామయా దేవా కరుణించగా రావా…..ఆపద్భాంధవ రావా …ఆపదలో కాపాడవా …” భక్త తుకారం పాట పూర్తయ్యేసరికి దేవుడే పంపినట్టూ  సరాసరి మాముందుకొచ్చి ఆగిందొక బస్సు. హమ్మయ్యా  నిరీక్షణ ఫలించింది అని సంబరంగా బస్సెక్కెయ్యబోతుంటే ఆ నిర్దాక్షిణ్యపు కండక్టరు, ఇది నాన్ స్టాప్,ఎక్కడపడితే అక్కడ దించుతాం కానీ ఎవళ్ళని పడితే వాళ్ళని ఎక్కించుకోం లేండి…లేండి, అని మా పరువు దుమ్ములో కలిపేసి పోయేడు.  నువ్వు చెప్పి చావొచ్చుకదా  మా అత్త్తగారు అబ్బులుమీద పడ్డారు.

వాడికి చాలా పౌరుషం వచ్చేసింది. దాంతో  ఏవైనాసరే ఈసారి వచ్చిన బస్సులో మమ్మల్ని ఎక్కించి తీరుతానని పంతం పట్టేడు .దాని ప్రకారం  నిద్రలో జోగుతున్నట్టూ ఆగాగి వస్తున్న  బస్సును రోడ్డుకు అడ్డం పడి ఆపేసాడు.

బస్సు ఆగగానే అబ్బులు కండక్టరుకీ డ్రయివరుకీ, ఆ మాటకొస్తే  యావన్మంది ప్రయాణికులకీ వినిపించేలా  “ఎవరనుకుంటునారండీ …పెసిడెంటుగారి తాలూకా ఈరు. బస్సెక్కిచుకోకపోతే  రేపీరూట్లో వొత్తారుకదా అప్పుడు సూద్దిరిగాని ఏవవుతదో . డోరు తియ్యండి డోరు తియ్యండి ….” అంటూ పెద్ద హడావిడిచేసి  లగేజీ  ముందు ఇంజను  మీదా  డ్రయివరు వెనక సీట్లో కూర్చున్నవాళ్ళ కాళ్ళమీదా సర్దేసి, “కుదుపులేకుండా వుంటాది ఇక్కడ కూకోండి అయ్యగారూ” అని, ముందు నించీ మూడో సీటు దులిపి  మేం కూర్చున్నాకా  దిగి డోరేసి, రైట్ రైట్  అనేసరికి బస్సుకదిలింది. వాడు ఇవతలపక్క కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ఆయ్….జాగర్తండి, బేగ్గులులన్నీ సరీగా ఉన్నయోలేదో సూసుకోండి, పెళ్ళవగానే బీగొచ్చేయండి …ఆయ్ ….మరెల్లిరండి….ఆయ్…అని చేతులూపేసాడు. బతుకు జీవుడా అనుకుంటూ  సీట్లో జారబడి అత్తగారు చూడకుండా వాచీ చూస్తే   పెద్దముల్లు పైచుక్క  మీదా చిన్నముల్లు కిందచుక్కకి కాస్త అవతలగానూ ఉన్నాయి…అంటే టైము   ఏడేకదండీ….ఏడే…..ఏడే…
ఎక్కెడ దిగుతారమ్మా – కండక్టర్ .
వైజాగు రెండు టిక్కెట్లు -అత్తగారు.
వైజాగయితే ఈ బస్సెక్కేరేటీ – వెనక సీటు ప్రయాణికుడు.
డయివరు గారూ బస్సాపండి  పాపం ఈళ్ళు సూసుకోకుండా ఏరే రూటు బస్సెక్కేసేరు  -ముందు సీట్లో మదర్ తెరీస్సా.
ఏటమ్మా  ఓ లగేజీలేసుకుని తోసుకుని బస్సెక్కేటవేనా ?  దిగండి దిగండి  -కండక్టరు డ్రయివరు తోపాటూ యావన్మంది   ప్రయాణికులూ.
అత్తగారు నేనూ ఒకేసారి తలతిప్పి ఒకర్నొకరం చూసుకున్నాం . కంగారులో ఇద్దరం చూడలేదు ఆ బస్సు ఎటువేపెళుతుందో!
బస్సాగింది . మేం  మోయలేని మా లగేజీ తో సహా మళ్ళీ రోడ్డున పడ్డాం .   ఆ కంపలూ  ఆ తుప్పలూ, ఆ  డొంకలూ  “హత్తేరీ …..మా ఊరు పుంతరోడ్డు.”

***

నోట్ :  ఇంట్లో పనివాళ్ళు ఆడవారిని అమ్మగారు అనీ, మగవారిని అయ్యగారు అనీ పిలుస్తారు కదా అన్నిచోట్లా . కానీ మా ఊర్లో ( చాలా ఊర్లల్లో) మగవారిని  రాజుగారు, పంతులుగారు , కాపుగారు ఇలా ….ఆడవారిని  చిన్నయ్యగారు, పెద్దయ్యగారు ,  అనీ అంటుంటారు . కథలో అదే రాసాను .

Download PDF

39 Comments

  • మరో భానుమతి రామకృష్ణ.
    హాయిగా నవ్వుకున్నాం. ఇంకా నవ్వుతూనే ఉన్నాం.

    • లలిత says:

      బులుసు గారు ,
      అబ్బే …నేనంత లావు కాదండి . సరిగ్గా చుస్తే ఆవిడ వేలంత .
      మీ వ్యాఖ్యని దీవెనగా భావిస్తున్నాను . ధన్యవాదాలు

    • లలిత says:

      మహేష్ గారు మీరు నవ్వారంటె విషయం ఉన్నట్టే . ధన్యవాదాలు

  • Rajkumar says:

    కుమ్మేసారు బాబోయ్ ;)

    • లలిత says:

      ఎవర్ని ? ఇంకా అబ్బులుగాడు దొరకందే !
      ధన్యవాదాలు

  • ఈ సంచికలో నేను చదివిన వాటిల్లో ది బెస్ట్..వేరే పత్రికల్లో కొన్ని రచనలు చదివి మాఖర్మ ఇలా కాలిందని నవ్వుకునేవె తప్ప, ఇలా ప్రత్యక్షంగా హాస్యంకొసమె రాసి, దాన్ని పండించి, మమ్మల్ని హాయిగా నవ్వించిన కథ….ఇలాంటీవే ఇంకొన్ని రాస్తారంటే ఇక ప్రతీ గురువారం పుస్తకాల షాపుదగ్గర నిలబడ్డట్టు సారంగ కొసం నిరీక్షించమూ?

    • లలిత says:

      మీ వ్యాఖ్య చదివి నేను హాయిగా అనుకున్నానండి ‘ హమ్మయ్య ..కథ పండింది ‘ అని .
      ధన్యవాదాలు

  • బాగుందండి.
    హమ్మయ్య !ఎలాగైతే బస్సేక్కేసేరు అనుకున్నా.. కథ మళ్ళి మొదటికొచ్చింది :) ) మీ కథ చదువుతుంటే మా రోడ్ గుర్తొచ్చింది.మేము వైజాగ్ వెళ్ళాలంటే అంతే …

    • లలిత says:

      రాధిక , ఎక్కేస్తే కథ ఏవుంటుంది అందుకే దిగేసాం .
      ధన్యవాదాలు .

  • హహహహ…కధ మళ్లీ మొదటికి వచ్చింది..భలే బాగుంది :)

  • చాలా బాగా రాసారండీ…మంచి హాస్యం…వారం వారం మీ శీర్షిక కోసం ఎదురు చూస్తాం…

    • లలిత says:

      మీ రాక కోసం మేము ఎదురుచూస్తాం
      ధన్యవాదాలు

  • చాలా బావుంది. :) :)

  • Sudha says:

    ఎంత బాగా రాసారు లలితగారూ. నడుంవిరిగిపోయిన సెకెన్ల ముల్లు ..దానిసంగతి పట్టించుకోని రెండు ముళ్లు-ఇలా ఒకటా రెండా ఎన్ని అబ్జర్వేషన్లు…..మొదటిసారి సారంగ చదవడం మీ శీర్షికతోనే. మనసుకు మళ్లీ కొత్తగా రెక్కలొచ్చినట్టుంది. ప్రతిగురువారం గుచ్చుకోబోయే మీ హాస్య శర పరంపర కోసం ఇక నిరీక్షణ.

    • లలిత says:

      సుధ గారు .’ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ‘ తెచ్చుకోటం మర్చిపోకండి :))
      ధన్యవాదాలు

  • సూపర్ కథ.. :) :)

  • మీ సహజమైన శైలిలో బావుంది. నెట్ లో చదువుకోడానికి నిడివి కొద్దిగా ఎక్కువైందేమో ననిపించింది. చివరి పావు వంతు విహంగ వీక్షణంగా లాగించాను!

  • అన్నట్టు చెప్పడం మరిచాను. ఈదేసిన గోదారి అని కాలం శీర్షిక గమ్మత్తుగా ఉంది.
    అవునూ, దాట్లవారికీ కలిదిండి వారికీ వంశపారంపర్యంగా డిశుం డిశుం ఏవన్నా ఉందా? శ్రీపాద వారి వడ్లగింజలు కథలో కూడా ఇట్లాంటి నేపథ్య చరిత్ర ఏదో ఉన్నట్టు గుర్తు!

    • లలిత says:

      నారాయణస్వామి గారు,
      రమణ గారికి ఒక నమస్కారం పెట్టుకుని ఇలా కానిచ్చేసా మండి .

      <>
      అంటె …మాతోనే మొదలవలేదన్న మాట . ఎంత మంచి మాట చెప్పారు రక్షించారు :))

      (మీ జ్ఞాపక శక్తికి జోహార్ అనాల్సిందే !)
      ధన్యవాదాలండి .

      • లలిత says:

        నారాయణ స్వామి గారు
        పై వ్యాఖ్యలో డిషుం ..డిశుం లు ఎగిరిపోయాయి . ఇవి అక్కడ వేసుకోండి

  • Anupama says:

    ఎంత బాగా రాసారు!

    • లలిత says:

      అనుపమ గారు,
      అంత బాగా రాసానా ….నిజ్జంగా !!

  • హహ్హహ్హా… బాగుందండీ మీ తెల్లారగట్ల ప్రయాణం.. :)
    గోదారి అత్తగారి కథలు మొదలెట్టారన్నమాట.. బాగు బాగు..

    • లలిత says:

      మధురా…ధన్యవాదాలు
      అవును… తోసుకెళ్ళటానికి మీరంతా ఉన్నారనే ధైర్యంతో మొదలు పెట్టేసాను :)

  • రామ్ says:

    “శనివారం తెల్లారగట్ల దాట్లా?”

    “ఎప్పుడో దాట్లా లలితం గానూ!”

    “మరి రెండో కథ ఇంకా కనపడదేం ?”

    “గోదారి ఈదుకుంటూ రావద్దూ . చిన్నయ్య గారు ఆ అబ్బులు కి ఇస్తే- వాడి గోల లో ఇంకా పోస్ట్ చేసి ఉండడు బహుశా !! ”

    ” అయినా రాజు గారి ఇంటో పెళ్లి కి వెళ్ళారు కాదూ – అక్కడ చిక్కడి ఉంటారు … రాజుల పెళ్ళీ , వారం రోజుల పెళ్లి కామోసు !!”

    ” పైగా ప్రెసిడెంటు గారి తాలూకా కూడాను – తొందరగా పంపుతారా !!”

    ” చిన్నయ్య గారూ – మీ హడావిడీ చూసుకుని రెండో కథ తొందరగా దయ చేయించండి “

    • లలిత says:

      రామ్ గారు ,
      మీ అభిమానానికీ, మీ వ్యాఖ్యకు చాలా చాలా సంతోషం వేసిందండీ .
      వారం వారం వస్తే విసుక్కుంటారనీ, నెలకోమాటే కనిపిస్తానని మాటిచ్చానండీ.
      మరి మాట తప్పకూడదుకదండీ.

  • padmaja.k says:

    చాల బాగా రాసారండి.బాగా నవ్వుకోన్నాము

  • బాలాంత్రపు వేంకట రమణ says:

    ఆహా…ఎన్నాళ్ళకెన్నాళ్ళకి ..అసలు సిసిలైన తెలుగు హాస్యరచనని చదువుకుని మనసారా నవ్వుకుని….తలుచుకుని తలుచుకుని మరీ నవ్వుకుంటూ ఉన్నాం! అమ్మా లలితా గారూ… కీపిటప్.

    • లలిత says:

      వేంకట రమణ గారు , మీకు నచ్చడం నా అదృష్టం.
      మీ వ్యాఖ్యని దీవెనగా భావిస్తూ…. ధన్యవాదాలు

Leave a Reply to kiran Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)