ప్రతి గురువారం ఇక ‘సారంగ’ వారమే!

mandira1పుస్తకాలు లేని గది మూగది! నిజమే…కానీ-

వొక పదేళ్ళ క్రితం మంచి చదువరి అంటేనో, పుస్తకాల పురుగు అంటేనే చుట్టూ పుస్తకాలు పోగేసుకుని లేదంటే చేతిలో కనీసం వో పుస్తకం కచ్చితంగా ఛాతీకి ఏటవాలుగా అమిరేట్టు పెట్టుకునో కనిపించడం వొక రొటీన్ దృశ్యం! ఇవాళ ఆ దృశ్యం నెమ్మదిగా కనుమరుగయిపోతోంది. ఇది పుస్తకాలకే కాదు, పత్రికలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మూడు నాలుగు పుస్తకాలేమిటి, రెండు మూడు పత్రికలేమిటి వొక్క చిన్న నోట్ బుక్ లాంటి పరికరంలో వందల పుస్తకాలూ పత్రికలూ అగ్గిపెట్టెలో చీరలా ఇమిడిపోతాయి! చూస్తూ చూస్తూ వుండగానే మన పుస్తకాల ‘గది’ ఎంత చిన్నదైపోయిందో! కానీ, ఆ గదిలో ఇమిడిన ప్రపంచం రెప్పపాటులోనే, మన చేతివేళ్ళ ఇంద్రజాలంతో ఇట్టే ఆకాశమంత విస్తరించింది.

చిన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక ఏ రోజు వస్తుందా అని రోజులు – మరీ ఆ సస్పెన్స్ తీవ్రతని నాటకీయంగా  చెప్పాలనుకుంటే- క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేవాళ్లం. నిజంగానే! వారపత్రిక లేని అలనాటి  చదువరి బాల్యాన్ని నేను వూహించలేను. ‘ఈవారం కవిత, కథ’ అనగానే కళ్ళలో చక్రాలు గిర్రున తిరిగి, ఆ పేజీల్లో ఎవరున్నారా అని ఆతృతగా వెతుక్కోవడం, ఆ చదివిన పేజీల్ని, వాటికి వాడిన చిత్రాల్ని అందంగా నెమరేసుకోవడం, ఎప్పటికయినా ఆ పేజీల్లో నేనొక పేజీ కాగలనా అనుకుంటూ కలలు కనేయడం…ఇవాళ నలభైలకి అటూ ఇటూ వున్న ప్రతి రచయితకీ  పఠితకీ అనుభవమే! ‘ఈ వారం మీ పత్రిక చదివాము, ఇంటిల్లి పాదీ ప్రతి పేజీ చదువుకునీ మళ్ళీ చదువుకుని ఎంత హాయిగా కాలక్షేపం చేశామో చెప్పలేను’ లాంటి లేఖలు నిన్నటి నాస్తాల్జియాకి గురుతులుగా మిగిలిపోయాయి. ఆ ‘ఇంటిల్లిపాదీ’ అన్న పదం ఇప్పుడెక్కడా వినిపించనే వినిపించదు ఆశ్చర్యంగా!

చాలా మంది స్నేహితులు ఇప్పటికీ వొక వారపత్రిక వుంటే భలే బాగుంటుంది అని ప్రకాశంగా అనడమూ, ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విషాదమో/ విషాదం లాంటి ఆనందమో!” అంటూ కవి తిలక్ లాగా బాధపడిపోవడమూ తెలుసు. అంటే, వెబ్ లోకంలో  ఇన్ని ద్వైమాసిక. మాస పత్రికలు వున్నా అలాంటి వార పత్రిక లేదే అన్న వెలితి మనలో వుండిపోయింది. ఆ వెలితిని తలచుకుంటూ ఇదిగిదిగో సారంగ సాహిత్య వారపత్రిక! నిస్సందేహంగా ఇది సారంగ బుక్స్ మరో ముందడుగు, మిమ్మల్ని చేరుకోడానికి! మీ పుస్తక ప్రపంచంలో మీ ఆలోచనల్లో మీ ఉద్వేగాల్లో  మీతో వో  కరచాలనానికి!

వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

సారంగ బుక్స్ నించి వొక సాహిత్య వారపత్రిక రాబోతున్నదంటే అది అచ్చు పత్రిక అయి వుంటే బాగుణ్ణు అని ఆశపడ్డారు చాలా మంది సాహిత్య మిత్రులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అక్షర ప్రయాణం మొదలయిన ఈ రెండేళ్లలోనే సారంగ  బుక్స్ అంటే వొక మంచి ప్రచురణ సంస్థ అన్న గౌరవం ఏర్పడింది. ‘సారంగ’ నించి ముందు ముందు ఏ పుస్తకాలు వస్తాయన్న ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అయితే, సారంగకి మొదటి నించీ సాంకేతిక వెలుగుల మీద గొప్ప ఆసక్తి. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త వెలుగుల్నీ, మెరుపుల్నీ సాహిత్యానికి ఎలా అద్దగలమన్నదే ‘సారంగ’ అన్వేషణ. ఇవాళ ఈ గురువారంతో ‘సారంగ’ అన్వేషణ వొక కొలిక్కి వచ్చింది. వొక శుభవార్త ఏమిటంటే ఈ వెబ్ వార పత్రికలో అచ్చయిన కొన్ని రచనలు ఏడాది చివర సారంగ బుక్స్ సిరీస్ లో అచ్చు రూపం కూడా తీసుకుంటాయి.

మరో అంతర్జాల పత్రిక అవసరమా అన్న ప్రశ్నకి సారంగ దగ్గిర సమాధానం వుంది. మన రోజు వారీ జీవితంలో కనీసం కొంత భాగం కాగల సాహిత్య వారపత్రిక వుండాలన్నది మొదటి సమాధానం. అయితే, తెలుగు సాహిత్య ప్రచురణ రంగంలో సారంగ బుక్స్ మొదటి నించీ చేయాలనుకుంటున్నది రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలన్నది. లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల. అందులో భాగంగానే ఈ ఏడాది సారంగ బుక్స్ వొక పూర్తిస్థాయి ప్రచురణ సంస్థగా మీ ముందుకు రాబోతోంది. కేవలం ఫిక్షన్ మాత్రమే కాకుండా నాన్- ఫిక్షన్ రచనలు కూడా మరిన్ని తీసుకురావాలనే సత్సంకల్పం వొక ఎత్తు అయితే, ఆ రచనలు అత్యాధునిక సాంకేతిక పరికరాల ద్వారా మీ చేతుల్లోకి పదిలంగా చేరాలన్నది సారంగ కల. అలాగే, కొత్తగా ఏర్పడుతున్న పాఠక ప్రపంచానికీ సాహిత్యంలో వున్న రెండు భిన్న ప్రపంచాలకూ- వొకటి నిన్నటిదీ, రెండోది ఇవాల్టిదీ- మధ్య వంతెనగా వుండాలన్నది సారంగ ఉద్దేశం. అందుకే, ఈ సంచికలో ఆ రెండు ప్రపంచాల మేలుకలయికని మీరు చూస్తారు. సాహిత్యం పట్ల మీ అభిరుచిని పెంచే భిన్న శీర్షికల్ని మీ ముందుకు తెస్తోంది సారంగ.

ప్రతి గురువారం సారంగ వారపత్రిక మీ కంటి తలుపులు తడుతుంది, మీ పుస్తకాల గదిలోంచి కనుమరుగైపోయిన వారపత్రికా దరహాసమే కాంతిగా! ఈ కాంతిని అక్కున చేర్చుకోండి. ఈ రచనల వెలుగులో కాసింత తడవండి!
శీ ర్షి క లు
ప్రతి నెలా మొదటి గురువారం సారంగ అన్ని శీర్షికలతో కొంచెం ఎక్కువ సందడిగా వస్తుంది. ఆ తరవాతి గురువారాలు పరిమితమయిన శీర్షికలతో వస్తుంది. తెలుగు పత్రికా ప్రపంచంలో సాహిత్య జర్నలిజానికి శ్రీకారం చుట్టిన శ్రీరమణ గారు చాలా కాలం తరవాత ‘సారంగ’ కోసమే రాస్తున్నశీర్షిక  ‘రెక్కల గుర్రం’  మీ కోసం! కథారచనలో ఆరితేరిన పి.  సత్యవతి గారు ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ రోజుకు కొన్ని గంటల తరబడి పస్తక పఠనంలో గడుపుతారు. అలా చదువుతున్న  కొన్ని పేజీల్ని మనతో పంచుకుంటారు. సమకాలీన కథ అనగానే గుర్తొచ్చే ఆత్మీయమయిన పేరు ఆర్. యం. ఉమా మహేశ్వర రావు. ‘సారంగ’ కోసం తన వర్తమాన కథానుభవాన్ని మనసు విప్పి చెప్పబోతున్నాడు ఉమా  ‘కథా సమయం’ లో నెలనెలా!

ప్రతి ఏడాది వొక ప్రముఖ కథా రచయిత  ‘కథా సారంగ’  శీర్షికని నిర్వహిస్తారు. ఈ ఏడాది  ప్రముఖ కథకుడు వేంపల్లె షరీఫ్ నిర్వహించబోతున్నారు. ఈ శీర్షిక కోసం ప్రముఖ కథకులతో ప్రత్యేకంగా కథలు రాయించి మనకి అందించబోతున్నారు వేంపల్లె షరీఫ్. ప్రసిద్ధ సినీగేయ రచయిత భువనచంద్ర చాలా మందికి పాటల రచయితగానే తెలుసు. కానీ,ఆయనలో అందమయిన కథకుడు కూడా వున్నాడు. ఆయన అనుభవాల అమ్ములపొది నించి చేస్తున్న శరసంధానం  ‘Untold stories’  ప్రతి నెలా మీ కోసం!

తెలంగాణ చరిత్ర శోధనకి మారుపేరు సంగిశెట్టి శ్రీనివాస్. తెలంగాణ సాహిత్య చరిత్రని ప్రతి నెలా  మన కళ్ల ముందు వుంచే శ్రీనివాస్ శీర్షిక  ‘కైఫియత్’ . అత్తగారిని కూడా నవ్వించగల అల్లరి కోడలు దాట్ల లలిత కథా శీర్షిక  ‘ఈదేసిన గోదారి’  ప్రతి నెలా మీ ఇంట నవ్వుల పంట! ప్రతి వారం మీ కోసం సీరియల్ నవల  ‘అల’  అనే శీర్షిక కింద మీ కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ఈ సీరియల్ వచ్చే గురువారం మొదలవుతుంది. ప్రపంచ సినిమాని మీకు పరిచయం చేస్తున్నారు  ‘తెర’చాప’  శీర్షికలో మద్దూరి శ్రీరాం.

ఇవిగాక వారానికి కేవలం వొకే వొక కవితతో  ‘తరంగ’  ఈ వారం కవిత మీకు ప్రత్యేకం! వొక కవిత చదివిన అనుభవాన్ని మీ దోసిట వుంచే  ‘అద్దంలో నెలవంక,’  అచ్చయిన కథ వెనక దాచేసిన అసలు కథల్ని చెప్పే  ‘చెప్పని కథ’  శీర్షిక వచ్చే గురువారం.  ‘ఓ కప్పు కాఫీ’   ‘అక్షరాల వెనక’   ‘తలపుల నావ’  శీర్షికలు. మీకు ఇష్టమయిన రచయితలతో హాయిగా గడుపుకునే కాఫీ సమయాలు, ఉత్తమ పాఠకుల వేదిక  ‘పాఠకచేరీ’  మంచి కథల తలపోత  ‘కథనరంగం’  ప్రసిద్ధ రచయితలతో మీ జ్నాపకాల వెలుగు  ‘దీపశిఖ  అప్పుడప్పుడూ!

Painting by Mandira Bhaduri

Download PDF

13 Comments

 • HEMA says:

  దీర్గాయుష్మన్భవ

 • తొలిచూపులకి చాలా బావుంది. శీర్శికల పేర్లు వాటిని రాసిన వారి పేర్లు కూడా నోరూరిస్తున్నాయి. చిన్నారి సారంగకి శుభాశీస్సులు, నిర్వాహకులకి శుభాకాంక్షలు.

 • “సారంగ ” చాలా బావుంది. ముందు ముందు ఇంకా బాగుంటుంది అన్నది శీర్షికలని బట్టి తెలుస్తుంది.

  ఉత్తమాభిరుచి గల పాఠకులను అందరిని సారంగ కలుపుతుంది

  నిర్వాహకులకి హృదయ పూర్వక అభినందనలు

 • సారంగ పత్రిక చాలా బాగుంది. సారంగ సారధులకు అభినందనలు.

 • ఆరంభంలోనే ఆంధ్రజ్యోతిని రిఫర్ చేశారు…ఆశగా వుంది.వారం వారం సాహిత్యవిందు అంటే బోలెడంత మందీమార్బలం కావాలి. శీర్షికల జాబితా చూస్తే నోరూరుతోంది.ఇన్నేసి ఇ-పత్రికలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి..ఎన్నదగిన పత్రికగా ఎలా తీర్చిదిద్దుతారో..ఆసక్తిగానే వుంది. స్వరాష్ట్రంలోనే వున్నవారికి ఇంకా అచ్చు పత్రికలు అందుబాటులోనే ఉన్నాయి..ఆ పోటీని తట్టుకుని నిలబడటం లక్ష్యంగా వద్దు కానీ.. ఖండాంతరాల్లో దిగబడిపోయిన అక్షర పిపాసుల దాహార్తిని వారం వారం తీర్చే పుణ్యం కట్టుకోమని మనవి. లబ్దప్రతిష్టులకు వేదికలు తక్కువేం లేవు..కాబట్టి..కొత్తతరం కొత్తఆలోచనలకు ప్రోత్సాహం ఇస్తే…తెలుగు సాహిత్యం విశ్వసాహిత్యస్థాయికి ఎదిగేందుకు మీవంతు సాయం చేసిన వారవుతారు. అనువాద సాహిత్యానికి అవకాశం కల్పించండి. ప్రపంచ సినిమా మీద మీ దృష్టి పడటం హర్షించదగ్గ అంశం.కవిత్వధోరణులూ కేవలం ప్రాంతీయస్థాయికి పరిమితమవకుండా జాగ్రత్త పడితేనే అందరి ఆమోదం పొందగలిగేది.బాలసాహిత్యం వూసు కనిపించ లేదు మీ ప్రస్తావనలో.కేవలం సాహిత్యకారులను మాత్రమే లక్ష్యించకుండా.. సాధారణ పాఠకశ్రేణి అభిరుచుల అభిరుచులను పరిగణలోకి తీసుకొనగలిగితే ప్రారంభంలో మీరన్న ‘ఆంధ్రజ్యొతి’ అందుకోటానికి అవకాశం ఉంటుందేమో! సారంగ ఇ-పత్రిక రంగప్రవేశం మరిన్ని గొప్ప సాహిత్య పత్రికల ఆరంభానికి ప్రేరణయ్యే విధంగా కొనసాగాలని..ఇప్పుడున్న సారథ్యసంఘ సభ్యుల సామర్థ్యం అందుకు సరితూగేదేనని..నా నమ్మకం. పాత కొత్తల మేలు కలయికగా సాగి కొంగొత్త రూపానికి ‘సారంగ’ విత్తు కావాలని…మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను.(శీర్శికలు ఇంకా చదవ లేదు కనక ప్రస్తుతానికి స్పందించడం సమంజసం కాదు)

 • M.Sampath kumar says:

  ఈ ప్రారంభం అద్భుతం. ఇది మరింతగా వర్దిలాలి, సాహిత్యకారులను వర్దిల్లచేయాలి.

 • ఒకప్పుడు గూగుల్ మొత్తం వెతికి వెబ్ పత్రికల చిట్టా పట్టాను.. కానీ.. ప్రస్తుతం ఆన్ లైన్ లో.. వున్న పత్రికలు.. అంతగా అక్షర భోజన తృప్తిని ఇవ్వడం లేదని అనిపించేది. సమకాలీన కవులు, రచయితలు అందులో కనిపించక పోవడమే కారణమని ఇప్పుడు అర్థం అయ్యింది. అందుకే…మన తెలుగులో మనసు నింపే వెబ్ పేజీలు వెతికినా దొరకలేదు… సారంగ తొలి అడుగు తేట తెలుగు మబ్బు గొడుగులా అనిపిస్తోంది. మై బెస్ట్ విషెస్ టు అఫ్సర్ జీ, కల్పన గారు, రాజ్ కారంచేడు, ఇంకా వేంపల్లె షరీఫ్ గారు..! ఈ సుందర అంతర్జాల పత్రిక కి మనస్ఫూర్తి ఆహ్వానం….

 • సారంగ బృందానికి హృదయపూర్వక అభినందనలు..
  చూడటానికి.. చదవడానికీ చాలా బావుందండీ!

 • HEMA says:

  జయశ్రీ గారు
  ఈదేసిన గోదారి / దాట్ల లలిత గారి వండి వార్చిన భోజనం లో కొన్ని
  అక్షర భోజన తృప్తి…………………………………………………………… మెతుకులు

  మా అత్తగారికి తెలిసిన అతికొద్ది విద్యల్లో అలారం పెట్టడం ఒకటి.

  ఆ గడియారంలో సెకన్ల ముల్లు నడుం విరిగి అందులోనే పడిపోయింది.
  ఇన్నాళ్ళూ తమతోపాటూ కలిసి తిరిగింది అలా పడుందన్న బాధ కాస్తయినా లేకుండా
  ఒకదాన్నొకటి రాసుకు పూసుకు తిరిగేస్తున్నాయి గంటలముల్లూ నిమిషాల ముల్లూ.

  పెద్దముల్లపుడే పదడుగులేసేసింది.

  ఇస్త్రీ బట్టల్లా ఇడిసిన బట్ట్టలు సర్దలేం కదా!

  నిక్షేపంలాంటి లంగాలు. పరకాళ్ళా గుడ్డలే అనుకో తుని నించి తెప్పించేను పదేల్లబట్టీ కట్టినా పిసరు రంగు దిగితేనా !!”

  టేబుల్ మీద గడియారం కర్ర్……..ర్ర్ర్….ర్ర్ర్ర్……………..ర్ర్ర్ర్ర్ర్ర్…..ర్ర్ర్ర్ర్ర్ మంటూ రాక్షస స్వరంతో గుక్కెట్టి ఏడ్చింది.
  మా ఇంట్లో మగాళ్ళకి లానే దానికీ అత్తాకోడళ్ళిద్దర్నీ కలిపిచూస్తే కన్ను కుట్టేస్తుంది కాబోలు.

  “కరకెస్టుగా నాలుగున్నరకీ అయిదున్నరకీ మజ్జిలో ఎంతో అయ్యుంటాదండి,”అన్నాడు ఇబ్బందిగా కడుపు నొక్కుకుంటూ.

  పిలిచిన ప్రతీ పెళ్ళికీ వెళ్ళిపోటమే మీ తిప్పలు మీరు పడండి అనేసారు చూడు”.
  కడుపే కైలాసం అన్నట్టు వాడికి కడుపే గడియారం.

  సంబరంగా బస్సెక్కెయ్యబోతుంటే ఆ నిర్దాక్షిణ్యపు కండక్టరు, ఇది నాన్ స్టాప్,ఎక్కడపడితే అక్కడ దించుతాం కానీ ఎవళ్ళని పడితే వాళ్ళని ఎక్కించుకోం లేండి…లేండి, అని మా పరువు దుమ్ములో కలిపేసి పోయేడు.

 • vamsykrishna says:

  సారంగ పత్రిక సంకల్పం చాలా నచ్చింది. చెప్పాల్సిన విషయాలని కటువుగా కాదు కనీ కచ్చితం గా చెప్పి మరచిన దారి మళ్ళీ వేసేందుకు చాలా సాహసం అవసరం . అది పుష్కలంగా వుందని ఆసిస్తూ

  వంశీ కృష్ణ

 • sasikala says:

  అబ్బ ఒక్కో శీర్షిక చదువుతుంటే మనసు ఉప్పొంగిపోతోంది.
  మేము కూడా కదా సారంగా లో పల్గోనవచ్చా అండి?

 • Indu says:

  ముందుగా ‘సారంగ ‘ ఈ పేరే అందంగా ఉంది. ఇక ఇది వారపత్రిక. కాబట్టి ఎంచక్కా వారం-వారం దర్శనం చేసుకోవచ్చు. ఇకా ఆ శీర్షికలు ఎవరి ఆలొచనలోకాని, భలే కొత్తగా, ఉత్సాహంగా ఉన్నాయ్ :) చప్పని శీర్షికలు, నోరు తిరగని సగమ మందికి తెలీని పదాలు వాడకుండా… భలే సింపుల్ గా ఉన్నాయ్! ఇంకా ఎంచుకున్న టాపిక్స్, వ్రాస్తున్న రచయితలు/రచయిత్రులు ఈ సారంగకి పెట్టని ఆభరణాలు!

  సారంగ టీం కి అభినందలు :)

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)