మల్లెల తీర్థం

siddhartha

ఈ   వనభూమి కానుకగా

కొన్ని చినుకుల్ని చిలకరించింది
తన పిల్లలతో వచ్చి
కాండవ వన దహన హృదయమ్మీద…
దహనం రెట్టింపైంది
రక్తంలో కొత్త లిపి పరిణమించింది
ఎముకల్లోపలి గుజ్జు
ఏకాంతాన్ని చెక్కుకుంటూంది
నా వందల దుఃఖరాత్రుల
పారవశ్యాల చుట్టూ
ఒక పచారి తీగ …లాగ…
తెలుసు నాకు తెలుసు నాకు
నా లోపల వొక స్త్రీ దేహముందని తెలుసు
జువ్వికొమ్మగా కనునీలాలను

                               పెనవేసుకుందనీ తెలుసు

ఆమె ముద్దుతో నా మాటకు
కొబ్బరి నీళ్ళ సువాసన వొచ్చిందనీ తెలుసు
గాలిలో దూది మొగ్గ ఎగిరినట్టుగా
వుంది నిశ్శబ్దం
ఇది క్షేత్రమో తీర్థమో
బట్టలు తొడుక్కోలేదింకా
అదింకా అమ్మ పాలకోసం వెదుక్కోలేదు
కొన్ని అమూర్త ఛాయలు
కనుపాపలపై గురగురమంటూ
ఈ శబ్దసందర్భం… నిద్రాభంగం కలలకు
దూరాన్నుంచి వచ్చాను
అక్కడెక్కడ్నుంచో
అవుటర్ రింగ్ రోడ్డుల్లోంచి
ఫ్లైవోవర్ల ఉరితాళ్ళల్లోంచి
పువ్వులా జారిపడ్డాను…
ఇక్కడ…
జనసమ్మర్ధం లేని కలలు
వాక్యసమ్మర్ధం కాలేని జనం
శూన్యమవుతూన్న కణం
రాలిపోయే సుఖం
అలల కంటి కొసపై ఊయలూగే కిరణం
గాలి కౌగిలింత
దాని లోపల ఔషధాల సువాసన
భూమి నిద్ర వాసన
చర్మం లోపలి ద్రవఫలకాలపైన
తడిసిన ఆకులు అలమలు
పిందెలు మొగ్గరేకులూ  నీటి బుగ్గలూ
ఎగిరే… ఎవ్వరూ…
నా పలుదెసలా
అన్నీ నేనేనా
నేనే నా వనాన్నా
వనాన్ని భోగిస్తున్న మృణ్మయ పేటికనా
లోతుల ఇక పాడనా…
ఈ వనాన…
“చెండూ గరియమ్మ బోనాల మీద
ఎవరొస్తుంర్రే పిల్లా… ఎవరొస్తుంర్రే…
చెండూ గరియమ్మ బోనాల మీద
పిలగో…
పద్యమొస్తుందే జుమ్ జుమ్ పద్యమొస్తుందే
చెండూ గరియమ్మ బోనాల మీద
పిల్లా
పాట వొస్తుందే పాటల గద్యమొస్తుందే…
మాట వొస్తుందే…
మాయల మూట వొస్తుందే…”
అంటూ…
Download PDF

9 Comments

  • M S Naidu says:

    నమస్తే అఫ్సర్ గారు. మీ పత్రిక బాగుంది. సిద్ధార్థ కవితని మీ మొదటి సంచికలో ప్రచురించటం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

  • udugula venu says:

    అఫ్సర్ అన్న సారంగ బాగుంది.నా గురువు , మా అన్నయ్య సిద్ధార్థ కవితని మీ మొదటి సంచికలో ప్రచురించటం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

  • సిద్దార్థ గారి మల్లెల తీర్థం కవిత జనసమ్మర్థంలోంచి వాక్య సమ్మర్థంలోంచి పువ్వులా ఓ పచ్చిక తివాసీపై పడేసింది. సారంగ మరో సాహిత్య వారథిగా పరిఢవిల్లాలని ఆశిస్తూ శుభాభినందనలు..

  • బాంబుల దెబ్బకు గాల్లోకి లేచే అమాయక జీవుల దేహఖండాలు కూడా ఎలక్ట్రానిక్ తెరమీద muteలో పెట్టి చూస్తే మెత్తగానే వినిపిస్తాయి. కవి చెబుతున్నది ఆ ‘ఆవు మొహం ముసుగులోని పులి’ నిశ్శబ్దం కాదు. గాలిలో ఎగిరే దూదిమొగ్గ నిశ్శబ్దం.
    గన్-కంట్రోల్ లేని ఈ హింసాయుగంలోనూ లోపల ఇంకా ఓ స్త్రీ దేహాన్నిదాచుకోవడం గొప్ప వరమే! పరిమళభరితమైన ఆ స్త్రీ ముద్దు దొరకడం అంతకన్నా అదృష్టం. ఆముద్దు చలవవల్లే .. కవి మాటలకు అంతటి కొబ్బరి నీటి సువాసన! ఆ తీర్ధంతో మన దాహార్తినీ కొంత తీర్చే సిద్ధార్థ సౌహార్దతకు సౌసౌ వందనాలు. కొన్ని అమూర్త ఛాయలు కవి కనుపాపలపై గురగురమంటూ కదిలి స్వప్నభంగం చేసుండకపోతే ఇంకెలా ఉండేదో! పోన్లేండి. ఎక్కణ్నుంచో..అవుటర్ రింగ్ రోడ్డుల్లోంచి ..ఫ్లైవోవర్ల ఉరితాళ్ళల్లోంచి..వచ్చినా పువ్వులా మాట్లాడుతున్నాడు..
    అదే పదివేలు. అంత ఆశగా వస్తే ఇక్కడేమో.. జనసమ్మర్ధం లేని కలలు! వాక్యసమ్మర్ధం కాలేని జనాలు! ఖాళీ ఐపోతోన్న కణాలు!రాలిపడుతున్న సుఖాలు! భూమి నిద్ర వాసన. గాలి కౌగిలింతలోనూ ఔషధాల సువాసన! చర్మం లోపలి ద్రవఫలకాలపైన తడిసిన ఆకులు, అలమలు, పిందెలు, మొగ్గరేకులూ, నీటి బుగ్గలూ! బైటికంతాఅ ఓ ఆత్మాశ్రయ భావకవి అర్థనిద్రావస్థ స్వప్నప్రేలాపనలా అనిపిస్తుందేమో కానీ..నిజానికి మనం మరింత లోతుకు ఆ దూదిపింజ ఆత్మతో ప్రయాణించగలిగితే కవి పూర్తికాండవ వనాన్ని చూసేయవచ్చు. వనాన్ని భోగించే మృణ్మయ పేటికతో సంభాషించనూ వచ్చు. వినే చెవులుండాలే కానీ ఎక్కడుండదు కవిత్వం! చెవులు దోరబెట్టి ఆ ఆలాపన వినండి.చెండూ గరియమ్మ బోనాల మీదొచ్చే జుమ్ జుమ్ పద్యం ..పాటల గద్యం..రెండూ..వినిపిమ్చడం లేదూ నిండుకొబ్బరి బోండాంలోని నీళ్ళకు మల్లే బొళబొళా ..గలగలా..! మన కాండవవన హృదయ దహనాన్ని రెట్టింపుచెస్తో!

  • కొందరే రాయగలరు ఇలాంటి కవిత్వం….

  • the tree says:

    చాలా బాగుంది,సిద్దార్థగారు, మీ కలల కవిత్వం,.తీయని కలలాగా,..

  • *జనసమ్మర్ధం లేని కలలు
    వాక్యసమ్మర్ధం కాలేని జనం
    శూన్యమవుతూన్న కణం
    రాలిపోయే సుఖం *

    పదంతో పాటూ.. వెళ్ళిపోయే హృదయం

  • సి.వి.సురేష్ says:

    మొదట అఫ్సర్ గారికి ధన్యవాదాలు. ఈ పత్రిక ప్రార౦బి౦చి కవుల్ని పోగు చేస్తున్న౦దుకు. వారి లోని సృజనాత్మకత కు కిటికీ తెరిచి కా౦తి ప్రసరి౦ప చేస్తున్న౦దులకు. వళ్ళు విరుచుకు౦టున్న ఉదయ౦ ఎ౦త అ౦ద౦గా ఉ౦టు౦దో కవులను తట్టి లేపుతున్న సార౦గుడి కి (అఫ్సర్) ధన్యవాదాలు. చీకటి హిపోక్రటిక్ చేతులను౦డి మనల్ని బయట వేసే అఫ్సరిజ౦ (ఇక్కడ అఫ్సరిజ౦ అని ఎ౦దుకన్నాన౦టే ఆయన సృజి౦చే ఏ అ౦శ౦ లోనైనా ఆయన మార్క్ వు౦టు౦ది. కాబట్టి) ఈ పత్రికకు మూల౦. కావడ౦ నిజ౦గా కవిత్వానికీ, కవులకు రహదారి లా౦టిది. ఎ౦త రాసినా తక్కువే…..మరొక సారి ధన్యవాదాలు..!

  • సిద్దిగొ నువ్వుర్క నెనుర్క…..సిద్దిగొ వనమూ బాయె కొడక, వదెనే బాయె కొడక…సిద్దిగో నువ్వుర్క నేనుర్క….బోనమ్ బాయె కొడక గూనమ్ బాయె కొడక….సిద్దిగో నువ్వుర్క నేనుర్క…పొలమూ బాయె కొడక ….జలమూ బాయె కొడక….సిద్దిగో నువ్వుర్క నేనుర్క…..బాయిల బడ్దామ్ కొడక, మెడలూ మెట్రోల కింద…..సిద్దిగో నువ్వుర్క నేనుర్క…………సిద్దిగో….

Leave a Reply to సి.వి.సురేష్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)