ఈ ఇందిర ‘కాలాతీత వ్యక్తే!’

kalateeta vyaktulu

vanaja vanamaliస్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలన్నింటిలోనూ కొన్ని నవలలను పంచ కావ్యాల్లాంటివని సాహితీ కారులు పేర్కొన్నారు.  అందులో డా ॥ పి.శ్రీదేవి రాసిన “కాలాతీత వ్యక్తులు ”  ఒకటి.

స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి రాసిన నవల ఇది. గోరా శాస్త్రి గారి సంపాదకత్వం లోని “తెలుగు స్వతంత్ర”  లో  21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన సీరియల్ ఇది.  దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో  వచ్చిన మార్పులకి,   వారి  ఆలోచన విధానానికి, మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి  ఈ నవల అద్దం  పట్టింది. ఈ నవల ఇప్పటికీ సమకాలీనమనే చెప్పవచ్చు.  ఇందిర లాంటి స్త్రీలని ఇప్పటికీ మనం అంగీకరిచలేకపోతున్నామనేది వాస్తవం.

55 సంవత్సరాల క్రితం డా ॥ పి  శ్రీదేవి రాసిన   ఈ నవల లోని “ఇందిర”పాత్ర ఇప్పటి కాలం లోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానిని  కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.
అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి ఎవరు  అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. “కల్యాణి” పాత్ర  ఆ నవల లో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవల లోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది. నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.  అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు . చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ అలాంటి వ్యక్తి కాదు ఇందిర. చిన్న తనం లోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు బాధ్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది.  చాలీ చాలని జీతం మధ్య అన్నీ అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే  పోషించాల్సి  రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని లోక మర్యాదలని ఎదిరించింది . తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది.  ఒక విధంగా కాలానికి లొంగకుండా  తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని  మోసం చేయడం  వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది .

అందుకే ఇందిర పాత్ర  చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర.   కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు ప్రకాశంతో స్నేహం చేస్తుంది  షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం  వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నాను అని చెప్పుకుంటుంది .

తానూ ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ  కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణి ల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది అనుకుంటుంది .ఇందిర పాత్ర  ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది. “ఏమిటి ఆలోచిస్తున్నావ్” ప్రకాశం అని అడుగుతుంది ఇందిర. కల్యాణి గురించి అంటాడు అతను.  “అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు.  నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకొస్తున్నాను. నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది నాన్న సంగతి నీకు తెలుసు. అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా  ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు వాళ్లతో  నేను కాలక్షేపం చేయలేను.  ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు. అంత  నంగనాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు .నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది ” అంటుంది.

kalateeta vyaktulu

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది. ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం. ప్రకాశం కల్యాణి  కి ఆకర్షితుడవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది . పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది.  అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది. తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.

ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అదినాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ  నా మీద పెట్టు అని అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు  కావాలి  . ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నోవ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషి లా ప్రవర్తిస్తావనుకున్నాను పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కాని అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు అని నిర్మొహమాటంగా చెపుతుంది .

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి  అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిరా ఇంట్లో ఉంటుంది  . ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు   సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి  మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే  ఇందిరా ఇలా అంటుంది .పశువు కాకపొతే మరో నందికేశుడు జీవితమే పశువుల సంత లా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకం లో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని నెట్టు కుని ముందుకు వెళ్ళడమే అంటుంది.

కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తి పాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది  మనిషి లోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది.  ఆమె అతన్ని  ఎప్పుడూ ఇష్టపడదు.  అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా  ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన  కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని  చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో  మధ్య తరగతి కుటుంబం లో  డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర  ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా  నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో  కనిపిస్తుంది జీవిస్తుంది  ఇందిర లాంటి  స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు  సమాజం లో  కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని  చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది .

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు .మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్నలోపాలు ని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని “కాలాతీత వ్యక్తులు” నవల చెపుతుంది.

పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి  ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల లో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి  అభిరుచి ల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితం ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర.  కాల గమనం లో అందరూ మరుగున పడిపోతారు .కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన  వ్యక్తిత్వం తో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ  కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.

ఈ నవల లోని ఇందిర పాత్ర ని నేడు  అధిక సంఖ్యలో నిత్యం  మన సమాజంలో చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా “ఇందిర ” ని  హర్షించలేక పోతున్నాం  ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి  లాంటి స్త్రీల మధ్య “ఇందిర ” కాలాతీత వ్యక్తి  తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీరువు . చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర.

 

Download PDF

13 Comments

 • రమాసుందరి says:

  నిజమే, మీరన్నట్లు ఇందిరా పాత్ర నావెల్టి ఉన్న పాత్ర. అయితే ప్రకాశం లాంటి భీరువులు, వసుంధర లాంటి సున్నిత మనస్కులు అయిన కుటుంబం చాటు బిడ్డలు, క్రిష్ణమూర్తి లాంటి తన తనకు తెలిసిన వాళ్ళూ మనకు ఇప్పటికి కనిపిస్తారు. ఎటొచ్హి కల్యాణి పాత్రే నాకెందుకో యద్దనపూడి నవల హీరోయిన్ లాగా అనిపిస్తుంది. మీ సమీక్ష బాగుంది.

 • sasikala says:

  ఇందిరను విభిన్నంగా పరిచయం చేసారు వనజ గారు.చాలా బాగుంది

  • శశి కళ గారు .. ఇందిరని నేను విభిన్నంగా పరిచయం చేయడం కాదు 55 ఏళ్ళ క్రితం ఇందిర పాత్రని సృష్టించిన
   డా. శ్రీదేవి గారి గురించి చెప్పుకోవాలి . ఇందిర ఈ నాటి అమ్మాయిల స్వేచ్చా భావన కి ప్రతీక
   ఆ పాత్ర పట్ల ఆకర్షణ ఉంది చూడండి అది మనలని ఆ నవల ని ఏక బిగిన చదివింప జేస్తుంది ఇందిరని నిరశిస్తూ కూడా చదువుతూనే ఉంటాం

   మీకు నచ్చినండులకు ధన్యవాదములు.

 • అద్భుతమైన కథ..ఇప్పటికీ కాంటెంపరరీ అనిపించే పాత్రలు. గ్రేట్ బుక్.

 • డియర్ వనజ

  ఈ సమీక్ష భూమికలో వేయ్యోచ్చా??

  సత్యవతి

 • Manasa says:

  చాలా చక్కటి విశ్లేషణ, వనజ గారూ!
  ఇందిర పాత్రలో ఎన్ని షేడ్స్ ఉంటాయో, అవన్నీ సమర్థవంతంగా విప్పి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మనస్తత్వం ఆనాటికీ ఈనాటికీ కూడా విచిత్రమేం కాదు ఈ సమాజంలో. కానైతే రచయిత ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసిన తీరూ..గుర్తుండిపోయేలా మలచిన తీరూ అద్భుతమనిపిస్తాయి. మీ వ్యాసం పుస్తకమంతటినీ కాక ఇందిర చుట్టూనే తిరగడం వలన శీర్షికకు న్యాయం చేస్తూ సమగ్రంగా అనిపించింది.

  మీ ఈ వ్యాసంలో మొదటి వాక్యం పట్ల చిన్న కుతూహలం – కాలాతీత వ్యక్తులూ, చివరకు మిగిలేదీ సరే – మిగిలిన మూడూ ఏమిటి? వేయి పడగలొకటా?

  • మానస గారు … నేను ఇందిర పాత్రని దృష్టిలో పెట్టుకునే సమీక్ష చేసాను

   మీకు నచ్చినందుకు ధన్యవాదములు . అసమర్ధుని జీవ యాత్ర , చివరకు మిగిలేది , అతడు -ఆమె, అల్పజీవి , కాలాతీత వ్యక్తులు .. ఈ అయిదు నవలలు ని పంచ కావ్యాలు అంటారట.

   నా కైతే ఇందిర పాత్ర కాలాతీత వ్యక్తి అనిపించింది.

 • బాగుంది వనజ గారు. ఈ నవలని మొదటి సారి ఆరేడేళ్ళ కిందట చదివాను. చదివినప్పుడు చాలా ఊగిపోయాను, దాన్ని గురించి ఏదో రాసెయ్యాలని. ఐతే కందిరీగల్లా ఎగురుతున్న నా ఆలోచనలని క్రమబద్ధీకరించలేక ఆలస్యం చేశాను. ఇంతలో దానికి కాలదోషం పట్టింది. ఇందిర నిజంగా కలర్‌ఫుల్ పాత్ర. ఆమెని అంత సజీవంగా నిర్మించడమే రచయిత్రి సాధించిన ఘనకార్యం. నైతిక విచారణలని పక్కన పెడితే రచనా శిల్పం దృష్ట్యా ఈ నవలలో చాలా చోట్ల నాకు చిరాకేసింది గానీ ఇందిరని మాత్రం సులభంగా మరిచిపోలేం.

 • వనజగారు, మీ వాడుకలని గురించి ఒక రెండు సూచనలు. అన్యధా భావించరని తలుస్తాను.
  ధీరువు అనే మాట లేదు, స్త్రీ అయితే ధీర అంటాము.
  రెండవ విభక్తి (ని)ని వాడే చోట సాధారణంగా విభక్తికి ముందున్న అక్షరం రూపాంతరం చెందుతుంది.
  ఉదాహరణకి – జీవితం + ని = జీవితాన్ని; లోపాలు + ని = లోపాలని.
  మీరు స్పష్టంగా చక్కటి వచనం రాస్తారు. ఇటువంటి చిన్న డిటెయిల్సుని కూడా పట్టించుకోవాలని నా కోరిక.

 • నారాయణ స్వామి గారు .. ఈ వ్యాసం మీకు నచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు.

  మన మాతృ బాష కూడా నాకు సరిగా రాదండీ! తప్పులు ఉంటాయని తెలుస్తుంది నేర్చుకుంటాను. మీ సూచనలు,సలహాలు ఎల్లప్పుడూ అవసరమే! మీరు చదివినప్పుడు లోపాలు కనిపిస్తే నిర్మొహమాటంగా చెప్పండి

  మరో మారు ధన్యవాదములు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)