తాతయ్య వేదాంతం- నా గాలిపటం!

Sriramana1 (2)

పడమటి ఆకాశం తెల్లటి మబ్బు చారలతో విబూది పట్టెలు పులుముకున్న బైరాగి నుదురులా వుంది. జారిపోతున్న సూరీడు కుంకుమబొట్టులా ఆ పట్టీల నడుమ అమరీ, అమరక, అస్థిమితంగా వున్నాడు. సాయంత్రపు ఆటకు బయలుదేరుతున్న నాకు గొప్ప అదృష్టం ఎగురుతూ వచ్చి  నా  కాళ్లముందు వాలింది. అది అందమైన గాలిపటం!

మిరప్పండు రంగులో వుంది. దానికి తెల్ల తగరపు తోక వుంది. నాలుగు మూలలా మెరుస్తున్న డాబురేకులు మొనలను సూచిస్తున్నాయి. గాలిపటం సూత్రం, దానికి పది మూరల దారం కూడా వుంది.

తెగిన గాలిపటం గాలివాటున మా వాకిట్లో నా ముందు పడింది. అది తెచ్చిపెట్టిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎంతో సుతారంగా దాన్ని రెండు చేతులతో అందుకున్నాను. ఎక్కడా చిన్న చిరుగు కూడా లేదు. దాన్ని  అటూ ఇటూ తిప్పి చూసి గుండెలకు హత్తుకున్నాను. విశాల్‌గాడు, బబ్లూ దీన్ని చూస్తే కుళ్లుకుంటారు.  ఆ ఆలోచన నాకు మరింత ఖుషీ ఇచ్సింది.

నా ఆనందం మనసుకి ఇంకుతుండగానే, “అదిగోరా.. అదిగో,” అంటూ కేకలు వినిపించాయి. నా గుండెలు ఝల్లుమనేలోగా మలుపు తిరిగి ముగ్గురు పిల్లలు పరుగులు, కేకలతో వస్తున్నారు. వాళ్లు ఉత్సాహంతో వెలిగిపోతున్నారు.

ఆ ముగ్గురిలో ఓ ఆడపిల్ల కూడా వుంది. ముగ్గురూ ఏడెనిమిదేళ్లు మించని నా తోటివాళ్లే. నా ఎదురుగా, దగ్గరగా వచ్చి నిలబడి ఆయాసపడుతున్నారు. వాళ్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎక్కడో దూరంగా నక్షత్రం నేలకు దిగినప్పుడు, దాని జాడ పసిగట్టిన జ్ఞానులు నిలువెల్లా ఎలా వెలిగిపోయారో తాతయ్య చెబుతుంటాడు. ఆ బొమ్మలు కూడా నాకు ఎరికే.

ఆ పిల్లకి చొరవ ఎక్కువనుకుంటాను. మాటా మంచి లేకుండానే, నేను రెండు చేతులా హత్తుకున్న రంగుహంగుల గాలిపటాన్ని ఆ అమ్మాయి సున్నితంగా లాగేసుకుంది. రెప్పపాటులో ఆ ముగ్గురూ గాలిపడగతో సహా మలుపు తిరిగి మాయమయ్యారు. నాకందుకే మలుపులంటే చచ్చే భయం!

నేను నీరుకారిపోయాను.  నా కళ్లలో నీళ్లురికాయి. అయినా గాలిపటం స్పష్టంగా నాకు కనిపిస్తూనే వుంది. నిస్పృహగా తిరిగి యింట్లోకి వస్తుంటే తాతయ్య గమనించాడు. నా కళ్లలో తడి గమనించాడు తాతయ్య. ఆయన చూపులో ప్రశ్నని గమనించి  జరిగిందంతా చెప్పాను.

తాతయ్య దగ్గరగా తీసుకొని తన కండువాతో కళ్లు అద్దాడు. “నీకో కథ చెప్పనా” అంటూ మొదలుపెట్టాడు. గోదావరి ఒడ్డున నిలబడి ఒకడు నాలాంటివాడు భోరు భోరున ఏడుస్తున్నాడు. ఆ దారిన వెళ్తున్న ఋషి నీకొచ్చిన కష్టమేమిటని అడిగాడు.

ఏడ్చేవాడు శ్రుతి పెంచి నా వెండి పొన్నుకర్ర గోదాట్లో కొట్టుకుపోయింది. చాలా గొప్ప చేతి కర్ర… మంచి కొయ్య, దాన్నిండా చెక్కుడు పని. పైగా వెండిరేకు తాపడం… నా బంగారు వెండిపొన్ను కర్ర అంటూ ఎక్కిళ్లు పెడుతున్నాడు ఆ నా బోటిగాడు. ఋషి తాత్వికంగా నవ్వి “బిడ్డా! నాలుగుక్షణాల క్రితం నీది కాదు. మూడు క్షణాలు నీ చేతిలో వున్నందుకే యింత రోదన అవసరమా,” అని మొదలుపెట్టి రాజ్యాన్ని, రాణుల్ని పోగొట్టుకున్న రాజుల నిజాలు చెప్పాడు.

తాతయ్య చెప్పింది వేదాంతం. నా బాధ నా పోయిన గాలిపటం గురించి.

మా నాన్న ఫోను మాట్లాడుతూనే కారు దిగి ఇంట్లోకి వస్తున్నాడు. పొద్దున నేను చెప్పగానే, “మీరు బ్లాక్ చేసి వుంటే చాలా తేడా పడేది. ఎంతసేపు హోల్డ్ చేశామన్నది కాదు పాయింటు…”

నాన్న మాటల్లో చాలా ఆసహనం ధ్వనిస్తోంది. నేను, తాతయ్య పక్కకి తప్పుకున్నాం. నాన్న అనుక్షణం షేర్ల మీద నడుస్తుంటాడు.

***

Download PDF

3 Comments

 • mercy margaret says:

  హ్మ్మ్ .. మళ్ళీ బాల్యం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్టుగా ఉంది .. ఇలాంటి అనుభవం ఎదురైంది కాబట్టి కళ్ళ ముందు ఆ దృశ్యాలు తారస పడుతున్నాయి

 • లలిత says:

  శ్రీ రమణ గారు ,
  ఇక సాయంత్రం పూట ఆకాసం చూస్తే , గాలిపటం కోసం కళ్ళు వెతికేంతగా మనసులో నాటుకుపోయిందండీ మొదటిపేరా .
  కాసేపు మన దగ్గరున్నంత మాత్రాన ఎప్పటికీ మనదే అయిపోదు. ఎవరికెంత ప్రాప్తమో అంతే …..ఇది నేను అర్ధం చేసుకుంది

 • Radha Manduva says:

  శ్రీ రమణ గారికి, నమస్కారం.

  సార్! మీరు 17 డిశంబర్ నాడు కడప ఆకాశవాణి లో ‘ నవ్వులో శివుడున్నాడు ‘ ప్రసంగం లో ఈ కథ చెప్పారు. ఇక్కడ ఆ కథ పూర్తిగా ఇవ్వలేదా లేక ఎడిటింగ్ చేసినప్పుడు కథ మిస్ అయ్యిందో తెలియలేదు.
  (ఏడుస్తూ కర్రని వర్ణిస్తున్న మనిషిని ఋషి అడిగాడట. ‘ ఎక్కడ సంపాదించావు నాయనా దాన్ని’ అని. ‘ ఇందాకే అలా ఒడ్డు వైపు కొట్టుకొచ్చింది. దొరికించుకున్నాను’ అన్నాడు అతను. ‘ అయిదు నిమిషాలకే ఇంత వ్యామోహం పెంచుకున్నావా? అలకీ అలకీ మధ్య దొరికిన వాటి మీద అంత వ్యామోహం తగదు’ అన్నాడట ఋషి)
  ఇది ముళ్ళపూడి వారికి ఎంతో ఇష్టమైన కథని చెప్పారు కదా మీరు ఆరోజు?
  ఇంత మంచి కథను విన్నందుకు ఇన్ని రోజుల తర్వాత మీకు కృతజ్ఞ్త్తతలు చెప్పుకునే అవకాశం కలిగింది.
  థాంక్స్

  రాధ, రిషీవ్యాలీ స్కూల్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)