‘పురుష’ భారతం మీద స్త్రీ స్వరం నిరసన

kalluri-1మహాభారతం గురించి కొంచెమైనా చెప్పుకోకుండా మహాభారత కథాంశంతో రచించిన ఏ రచన గురించీ చెప్పుకోవడం కుదరదు. ప్రసిద్ధ ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్ రచించిన ‘యాజ్ఞసేని’కి కూడా ఇదే వర్తిస్తుంది. మహాభారతం భారతదేశమంత విశాలమైనది. భారతదేశ చరిత్ర, సమాజం, సంస్కృతి, విశ్వాసాలంత లోతైనది. వైవిధ్యవంతమైనది. అసలు మహాభారతమంటే భారతదేశమే. మహాభారతంలో లేనిదేదీ భారతదేశంలో లేదు. భారతదేశంలో ఉన్నదేదీ మహాభారతంలో లేకుండా లేదు. ఒక దేశానికీ, ఒక ఇతిహాసానికీ ఒకే పేరు ఉన్న ఇలాంటి ఉదాహరణ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా?!

మహాభారతం ఈ దేశవాసుల మూలచరిత్ర. ఇప్పటికీ భారతదేశం మహాభారత సమాజంగానే ఉంది ఉంది కనుక మహాభారతం భారతదేశపు నడుస్తున్న చరిత్ర. మహాభారతంలో భారతదేశాన్ని పోల్చుకోలేనివారికీ, భారతదేశంలో మహాభారతాన్ని దర్శించలేనివారికీ భారతదేశమూ, మహాభారతమూ ఎప్పటికీ అర్థంకావు. భారతదేశపు వర్తమానంపై వ్యాఖ్యానించగల సాధికారత ఎప్పటికీ లభించదు. మహాభారతాన్ని సొంతం చేసుకోనివాడు, జీర్ణించుకోనివాడు సంపూర్ణ భారతీయుడు కాలేడు.

భారతదేశపు నడుస్తున్న చరిత్రను ఏ కోణం నుంచి వ్యాఖ్యానించాలన్నా కనీసం అయిదువేల సంవత్సరాల గతంలోకి వెళ్ళాలి. భారదేశపు భవిష్యత్తును ఏ కోణం నుంచి అంచనావేయాలన్నా కనీసం వెయ్యి సంవత్సరాలు ముందుకు చూడాలి.

మహాభారతం లాంటి ఒక జాతి మూలచరిత్ర  ప్రతికాలంలోనూ తనను తాను పునః సృజించుకుంటూ ఉంటుంది. పునర్నవీనమవుతూ ఉంటుంది. ప్రతి తరమూ తన సంస్కృతీ, సాహిత్యవారసత్వాన్ని కొత్త అనుభవాలనుంచి దర్శిస్తుంది. వ్యాఖ్యానిస్తుంది. యవ్వనవంతమైన ప్రతి తరమూ, ప్రతి కాలమూ నూతన వైజ్ఞానిక వనరుల కొత్తరక్తంతో తన వైజ్ఞానిక వారసత్వానికి నూతన యవ్వనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో నిన్నటి తరంనుంచి, లేదా కాలంలో ఘనీభవించిపోయిన వ్యక్తులు, వ్యవస్థలనుంచి ప్రతిఘటననూ ఎదుర్కొంటూ ఉంటుంది.

విశ్వాసానికీ, విజ్ఞానానికీ ఆజన్మ శత్రుత్వం. మహాభారతం సహా మన పౌరాణిక సంపద అంతా కాలగతిలో విశ్వాసంలో భాగమైపోయింది.  ఈ విశ్వాసపు మూకబలం మహాభారత వైజ్ఞానిక మథనానికి ఏయే కాలాలలో ఏమేరకు అడ్డంకిగా మారిందో, ఆ ప్రయత్నం ఎన్నెన్ని ప్రచ్ఛన్న రూపాలు ధరించిందో-దానికదే ఒక అధ్యయనాంశం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది…కవిత్వం, కథ, నవల, ఇతర కళారూపాలు అన్నీ సత్యాన్ని విశ్వాసపు దాడినుంచి తప్పించడానికి ఉద్దేశించినప్రచ్ఛన్న రూపాలు కావచ్చు నేమోనని!

మహాభారతం మౌలికంగా పురుష భారతం. మాతృస్వామ్యంపై పురుషస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కాలంలో జరిగిన భారీ ప్రయత్నంలో అది కూడా భాగం. ఆ ప్రయత్నం చరిత్రే ఒక ఉద్గ్రంథమవుతుంది. ప్రస్తుతానికి వస్తే, పురుషభారతంగా మహాభారతం ‘సగం’ రచన. అయితే, పురుషస్వామ్యాన్ని స్థాపించే కథకుని ప్రయత్నాన్ని ధిక్కరిస్తూ మరెన్నో అవశేషాలతోపాటు మాతృస్వామ్య అవశేషాలూ మహాభారతంలో ఉండిపోయాయి. కథను నేర్పుగా ‘ఎడిట్’ చేసుకోలేకపోయిన కథకుని వైఫల్యం ఒకవిధంగా మనకు వరం అయింది. కథకుడు విడిచిపెట్టిన ఖాళీలనుంచి కొత్త కథలు, కొత్త అన్వయాలు సృజించుకునే అవకాశం కలిగింది.

పురుషభారతంలో స్త్రీపాత్రలు చాలావరకు వ్యక్తిత్వమూ, హృదయమూ వ్యక్తం కాని బుట్టబొమ్మలు. నేను గమనించినంతవరకు ద్రౌపది తన వ్యక్తిత్వాన్ని స్థాపించుకున్న ఘట్టాలు రెండే: మొదటిది, వస్త్రాపహరణ ఘట్టంలో లేవనెత్తిన ధర్మమీమాంస. రెండవది, ఉపపాండవులను వధించిన అశ్వత్థామపై పగ తీర్చుకోడానికి భర్తలపై ఒత్తిడి తెచ్చిన ఘట్టం. కొడుకులనే కాక, తండ్రి ద్రుపదునీ, సోదరుడు ధృష్టద్యుమ్నునీ, అతని కొడుకులనూ కూడా  కోల్పోయిన పాంచాల రాజపుత్రిగా ఆ ఘట్టంలో ఆమె ‘పుట్టింటి పగ’కు అచ్చమైన ప్రతినిధి.  అశ్వత్థామ శిరసున ఉన్న మణిని తెచ్చి భీమార్జునులు తనకు ఇచ్చినప్పుడు ద్రౌపది ఆ మణిని ధర్మరాజుకు ఇవ్వడంలో ఆమె నిర్వహించినది అసలు సిసలు రాచకార్యం. తండ్రి ద్రోణుడి ద్వారానే కాక, ధృష్టద్యుమ్నుని చంపినవాడుగా అశ్వత్థామ పాంచాలసింహాసనంపై కనీసం సాంకేతికంగానైనా హక్కును స్థాపించుకునే అవకాశం ఉంది కనుక, అధికార చిహ్నమైన అతని శిరోమణిన ద్రౌపది ధర్మరాజుకు ఇవ్వడం పాంచాలరాజ్యంపై అధికారం ఇవ్వడమే.
కథకుడు విడిచిపెట్టిన ఖాళీలనుంచి కొత్త కథ, లేదా కొత్త అన్వయం సృజించడానికి ప్రయత్నించిన రచనలలో నేను చదివినంతవరకు ఇరావతీ కార్వే ‘యుగాంత’ ఒకటి. ఆ రచన పురుషభారత ప్రభావాలకు దూరంగా మహాభారతాన్ని స్త్రీ పరంగా, స్త్రీవాదపరంగా వ్యాఖ్యానించింది. ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ మాతృస్వామ్యం, పురా చరిత్ర, పురామానవచరిత్ర కోణాల నుంచి మహాభారతాన్ని పునఃకథనం చేయడానికి ప్రయత్నించింది. ఒక పురుష రచయితగా స్త్రీ హృదయపు లోతును, గాఢతను భైరప్ప పూర్తిగా ప్రతిబింబించగలిగారా అన్న సందేహానికి ఆస్కారం ఎలాగూ ఉంటుంది. అది పురుష రచయితకు సహజంగా ఉండే ఒక పరిమితి.

ఎం.టి. వాసుదేవన్ నాయర్ ‘సెకండ్ టర్న్’ బ్రాహ్మణీయతా వ్యతిరేకతను ధ్వనింపజేస్తూ భీముని గిరిజనుడిగా చూపిస్తూ అతని పరంగా చెప్పిన కథ.ఆ విధంగా అది పురుషభారతానికి ఆధునికమైన కొనసాగింపు. వీటికి భిన్నమైన మరాఠీ రచన విష్ణు సఖారామ్ ఖాండేకర్ ‘యయాతి’. మహాభారతంలోని యయాతి కథను ఈ రచన తాత్విక కోణం నుంచి అన్వయిస్తుంది.నేను చదవని రచనలు ఇంకా ఎన్నో ఉండి ఉండచ్చు.

 

pratibha rayఇక ప్రతిభా రాయ్ ‘యాజ్ఞసేని’. ఈ రచన ‘యయాతి’లా తాత్వికంగా ఉంటూనే తాత్వికతను భౌతికతతో సమన్వయించేలా ఉంటుంది. పాఠకుల రుచి భేదాన్ని బట్టి ఈ రచనలో రుచించని అంశాలూ ఉన్నాయి; ఒక తాత్వికమైన, మానవీయమైన లోతుకలిగిన పరిణత రచనగా రుచి భేదాలకు అతీతంగా ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. మొదట, ఆకట్టుకునే అంశాలలోకి వెడదాం. రచయిత్రి ఈ రచనలో మూల భారతంలో లేని కొన్ని సరికొత్త సన్నివేశాలను సృష్టించారు. అలాంటి మూలాతిక్రమణ ఎంతవరకు భావ్యమన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే, ఆ సన్నివేశాల కల్పన ఆశ్చర్యకరంగానే కాక ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఆ కల్పన మనకు తెలిసిన మహాభారతపాత్రలకు కొత్త పుష్టినీ, కొత్త మెరుపునూ ఇచ్చి మహాభారతకథ నుంచి నూతన అనుభూతిని అందుకునే అవకాశమిస్తుంది. చిరపరిచయం వల్ల  కథను అంటిపెట్టుకుని ఉండే  మొనాటనీని తగ్గిస్తుంది.

కృష్ణ (రచయిత్రి ద్రౌపదికి ఈ పేరునే ఎక్కువగా ఉపయోగించారు)-కర్ణుల మధ్య; కొంతవరకు కృష్ణ-కృష్ణుల మధ్య కల్పించిన సన్నివేశాలు అలాంటివే. వివాహమై భర్తలతో కలసి కృష్ణ హస్తినాపురం వచ్చినప్పుడు వారికి స్వాగతం చెప్పడానికి కౌరవులతోపాటు కర్ణుడు కూడా వెడతాడు. అతను తనకు ఇష్టమైన నీలి గులాబీ గుచ్ఛం సమర్పించినప్పుడు కృష్ణ విచిత్రస్పందనలకు లోనవుతుంది. తన భర్తలెవరూ తనకు నీలి గులాబీలు కానుక చేయలేదని అనుకుంటుంది. కర్ణుని తన ‘ధర్మపుత్రు’డిగా చెప్పుకుంటూ మొదటినుంచీ అతని ఇంటికి రాకపోకలు సాగిస్తూ వచ్చిన కుంతి, ఒక రోజు కృష్ణను కూడా కర్ణుని ఇంటికి తీసుకు వెడుతుంది. అతనికి ప్రణామం చేయిస్తుంది. అప్పటినుంచీ అత్త హృదయం నుంచి కర్ణుని అర్థం చేసుకోడానికి, సానుభూతి చూపడానికి కృష్ణ ప్రయత్నిస్తుంది. స్వయంవర పరీక్షలో పాల్గొనడానికి కర్ణుని నిరాకరించిన క్షణం నుంచే కృష్ణ-కర్ణుల మధ్య ఒక విధమైన హృదయ సంబంధం ఏర్పడింది. అప్పుడు కృష్ణలో కలిగిన సానుభూతి మొలక క్రమంగా పెరిగి పెద్దదైనట్టు కనిపిస్తుంది.

పాండవులు ఇంద్రప్రస్థంలో సభాభవనం నిర్మించుకున్న సందర్భంలో కౌరవులతోపాటు అతిథిగా వచ్చిన కర్ణునికి భోజనం స్వయంగా తీసుకు వెళ్ళమని కుంతి కృష్ణను పురమాయిస్తుంది.  అప్పుడు కర్ణుడి మాటలు కృష్ణ మనసును గాయపరుస్తాయి. రాజ్యం కోల్పోయి పాండవులు వనవాసం వెడుతున్నప్పుడు, కృష్ణ  ఒంటి మీద ఆభరణాలు ఉంచుకోడానికి దుశ్శాసనుడితో కలసి కర్ణుడు అభ్యంతరం చెబుతాడు.  అవి దుర్యోధనుడి సంపద అంటాడు. కృష్ణ ఆభరణాలు ఒలిచి ఇచ్చేస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కర్ణుడు భార్య ద్వారా వేరే ఆభరణాలు కృష్ణకు  పంపుతాడు. ఇవి కర్ణుడి ఆస్తి కనుక తీసుకోమని కర్ణుని భార్య అంటుంది. దుర్యోధనుడు ఇచ్చిన ఆస్తే కాని కర్ణుడికి సొంత ఆస్తి ఎక్కడుంది అంటూ కృష్ణ  తిరస్కరిస్తుంది.  వనవాస సమయంలో యమునా నదిలో కొట్టుకుపోతున్న కృష్ణను కర్ణుడు కాపాడతాడు. మరో సమయంలో అడవిలో పాము కాటుకు గురైన కర్ణునికి తన మంత్రప్రయోగంతో కృష్ణ ప్రాణదానం చేస్తుంది.

ఇటువంటి సన్నివేశాల కల్పనద్వారా కృష్ణ-కర్ణుల మధ్యగల అనుకూల-ప్రతికూల స్పందనలను రచయిత్రి అద్భుతంగా చిత్రిస్తారు. కర్ణుడి గురించి పాండవులకు తెలియని కొన్ని రహస్యస్పందనలను అత్తా-కోడళ్ళు ఇద్దరూ పంచుకుంటున్నారనీ, అవి కేవలం స్త్రీ హృదయానికే తెలిసిన రహస్య స్పందనలనే భావన కలిగిస్తారు. తనలానే అయిదుగురి సంబంధంతో సంతానం కన్న అత్తతో కృష్ణ అడుగడుగునా మమేకం అవుతుంది. కుంతి కర్ణునిపట్ల మాతృత్వంతో స్పందిస్తే, కృష్ణ స్పందనలో అత్తతో సహానుభూతే కాక, మరో రకం స్పందన కూడా ఉందా అన్న అనుమానం కలుగుతుంది.

యుద్ధ ప్రారంభఘట్టంలో పాండవులు అందరితోపాటు తన మానసిక దౌర్బల్యాలను కూడా కృష్ణ వెల్లడిస్తూ, నా హృదయ దౌర్బల్యమే కుంతీమాతకు కూడా ఉందనీ,  కుంతీ పుత్రులే తన దౌర్బల్యమనీ అంటుంది. అంతటితో ఆగకుండా, “కుంతి జ్యేష్టపుత్రుడితో ప్రారంభించి కుంతి కనిష్ట పుత్రుడివరకు అందరివైపు నాకు ఆకర్షణ ఉంది” అంటుంది. అప్పటికే కర్ణుడు కుంతి జ్యేష్టపుత్రుడని తనకు తెలుసు కనుక కర్ణుని కూడా కలుపుకునే ఆ మాట అందా అనిపిస్తుంది. అయితే ఆ వెంటనే, “నా మూడవ దౌర్బల్యం నా మూడవ భర్త అర్జునుడు” అనడం ద్వారా పంచ పాండవులనే ఉద్దేశించిందన్న భావన కలిగిస్తుంది. కర్ణుడి పట్ల కృష్ణ విచిత్రస్పందనను రచన పొడవునా సూచిస్తూ వచ్చిన రచయిత్రి  చివరివరకూ అది ఎలాంటి స్పందనో చెప్పకుండా స్పష్టాస్పష్టంగానే  విడిచిపెట్టారు. మరోవైపు, కర్ణుని ఆరవ భర్తగా కృష్ణ కోరుకుందన్న జానపద చిత్రణ నుంచి స్పూర్తి పొంది రచయిత్రి కృష్ణ-కర్ణ పాత్రలను మలచినట్టు అర్థమవుతూనే ఉంటుంది.

పురుష భారతం లోని స్త్రీ-పురుష పాత్రల చుట్టూ ఇన్ని వందల ఏళ్లలో గాఢంగా అల్లుకున్న కాల్పనిక తేజోవలయాన్ని ఈ రచన మరింత గాఢం చేస్తుంది.

అయితే,  కర్ణుని పట్ల కృష్ణది ఎలాంటి ఆకర్షణ? అది శారీరక సంబంధమైనది కాదని చెప్పలేం. శారీరక సంబంధమైనదే ననీ చెప్పలేం. శారీరక సంబంధానికి అతీతమైనదీ, అంతకంటే అత్యున్నతమైనదీ కూడా కావచ్చు. ఇక్కడే రచయిత్రి స్త్రీ హృదయమూలాలను అత్యద్భుతంగా ఆవిష్కరించారనిపిస్తుంది.  కృష్ణ దేహసంబంధమైన పరిమితులను దాటి హృదయగతంగా జీవించే స్థాయిని అందుకుంది. పత్నీత్వానికీ, మాతృత్వానికీ మధ్య ఆమెలో ఎల్లలు చెరిగిపోయాయి. ఆమె దృష్టిలో దేహసంబంధం ఒక అనాసక్తయోగం. దేహాన్నీ, ఆత్మనూ ఆమె విభజించుకోగలిగింది. వ్యక్తిత్వాలలో ఎంతో వైవిధ్యమున్న అయిదుగురితో తన దేహాన్ని ఎప్పుడైతే ఆమె పంచుకోవలసివచ్చిందో అప్పుడిక ఆమె దేహ చింతనుంచీ అది విధించే పరిమితులనుంచీ విముక్తురాలైంది. ఆమెలోని స్త్రీ హృదయం కట్టలు తెంచుకుని ప్రవహించింది. శత్రు, మిత్ర భేదం లేకుండా ఎందరినో తనలోకి తీసుకుంది. ఎన్నో అద్భుతాలు చేసింది. కామ్యకవనంలో తల్లిని కోల్పోయి తల్లి పాలు లేక శుష్కించిపోయిన ఇద్దరు ఆటవిక శిశువులకు కృష్ణ స్తన్యమిచ్చి జీవం పోయడం ఆమె మాతృత్వ స్పందనకు ఒక నిదర్శనం. స్త్రీ మగజాతి కంతటికీ తల్లిగా సంరక్షణ బాధ్యత తీసుకున్న మాతృస్వామ్యపు రోజులు కృష్ణ పాత్రలో లీలగా స్ఫురిస్తాయి.

కృష్ణ సతీత్వం, పవిత్రతల నిర్వచనాన్ని విశాలం చేసింది. తనలో ఇలా అనుకుంటుంది: ”నిజానికి పంచపతీగ్రహణం నాకోసమే కాదు, సమగ్రస్త్రీజాతికి ఒక ఆహ్వానం. ఒకే సమయంలో ఒకరి కన్నా ఎక్కువమంది భర్తలను వరించినా స్త్రీ పవిత్రత మలినం కాదు-అన్నదానిని రుజువు చేసే సందర్భం.” మరో సందర్భంలో ఇలా అనుకుంటుంది: “ప్రపంచంలో అధికాంశం స్త్రీలు శరీరపరంగా అసతులు కాకపోయినా మానసికంగా అసతులు. ఒకే భర్తకు భార్యగా ఉన్నా ఇతర పురుషులు వారి మనస్సులో అలజడి రేపుతారు. శరీరాలు వేరైనా మానసికంగా వారు పరపురుషులతో శయనిస్తారు. కానీ నా విషయంలో ఇది జరగదు. యుధిష్టరునితో ఏకాంతంలో ఉన్నప్పుడూ నేను అర్జునుని కోరుకోను. సంయమనం, కట్టుబాటుతో ఉండేందుకు నేను సాధన చేశాను” .

అయిదుగురు భర్తలు ఉన్నా మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించిన కృష్ణ జీవన పార్స్వాన్ని కూడా రచయిత్రి కరుణరసాత్మకంగా చిత్రించారు.  స్వయంవరంలో కృష్ణను వాస్తవంగా గెలుచుకున్నది అర్జునుడు. కృష్ణ వరించినది కూడా అర్జునునే. అయితే, కుంతి కోరిక ప్రకారం, అన్నదమ్ముల ఐక్యత కోసం అయిదుగురికీ ఇల్లాలు కావలసివచ్చింది. ఆ పరీక్షా సమయంలో అర్జునుడు తన అసమ్మతిని తెలిపి ఆదుకుంటాడని కృష్ణ అనుకుంది. కృష్ణ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి తనను ఆదుకుంటుందని అర్జునుడు అనుకున్నాడు. అలా జరగలేదన్న అసంతృప్తి ఇరువురిలోనూ ఉండిపోయింది. దాంతో అర్జునుడు ఎక్కువ కాలం కృష్ణను తప్పించుకు తిరుగుతూ ఆమెకు మానసిక క్షోభ కలిగించాడు. హృదయపూర్వకంగా వలచిన అర్జునునితో ఎక్కువ సాంగత్యానికి కృష్ణ  నోచుకోలేకపోయింది. ఇద్దరూ దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా వియోగమే అనుభవించారు. మిగిలిన నలుగురు భర్తలూ ఎవరి ప్రపంచంలో, ఎవరి ఆసక్తులలో వారు గడిపారు తప్ప కృష్ణ హృదయప్రపంచంలోకి అడుగుపెట్టలేకపోయారు. చివరిలో ఆమె కృష్ణుని ఇలా వేడుకుంటుంది: ”ఎప్పుడూ ఏ స్త్రీకీ ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువమంది భర్తలను ఇవ్వవద్దు. అవిభక్తగా ఉండికూడా తనను తాను విభజించుకునే దుఃఖం నాకు తెలుసు”.

కృష్ణ-కృష్ణుల సంబంధం మరో ఆసక్తికర చిత్రణ. కృష్ణలోని దేహాంశ పాండవులదైతే, సూక్ష్మాంశ కృష్ణుడిది. అది భక్తురాలికీ, దైవానికీ ఉండే సంబంధం. కృష్ణ మొదట కృష్ణునే వరించింది. కానీ అర్జునుడే నీ భర్త కావాలని కృష్ణుడు చెప్పాడు. నువ్వు నీ తండ్రి శత్రునాశనానికే యాజ్ఞసేనిగా జన్మించావనీ, ప్రపంచంలోని దుర్మార్గుల వినాశనమే నీ పుట్టుక ఉద్దేశమనీ చెప్పాడు. ధర్మస్థాపన కోసం కోరికలను, ఆశలను, మనసును, హృదయాన్ని, బుద్ధికుశలతను త్యజించాలన్నాడు. వెంటనే కృష్ణ మనసులో అర్జునుని స్థాపించుకుంది.

కృష్ణుడు అన్న ఈ మాటలు ఈ రచనను పురుష భారత ప్రభావంలోకి, పురుష భావజాలంలోకి తీసుకువెడుతున్నాయి.  మహాభారతాన్ని విజేతల పక్షాన చెప్పిన కథగా భావించేవారికీ; ధర్మాధర్మాలు ఎవరి పక్షాన ఉన్నాయో, అవి ఎటువంటివో ఇంకా లోతుగా పరిశీలన జరగాలని భావించేవారికీ ఇది రుచించే విషయం కాదు. పాండవులు ధర్మాత్ములు, కౌరవులు అధర్మపరులన్న స్టీరియో టైపును ఈ రచన అనుసరించింది.  విశేషమేమిటంటే, మూల కథ కూడా ఈ స్టీరియో టైపును ఇంతగా గీత గీసినట్టు అనుసరించలేదు. యుద్ధంలో పెద్ద ఎత్తున బంధునాశనం చేసినందుకు ధర్మరాజు, యుద్ధాన్ని తప్పించనందుకు కృష్ణుడు జననిందను ఎదుర్కొన్నారు. కృష్ణుడు గాంధారీ శాపానికి కూడా గురయ్యాడు.

ఈ రచన ఆయా పాత్రలను మరీ ఆదర్శీకరించడం, మోయలేని ఆదర్శాల బరువు కింద అవి అణిగిపోతున్నట్టు, ఆదర్శాల స్వాప్నిక ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉండడం వాస్తవిక దృష్టిని కోరుకునేవారికి నచ్చదు. పురుష భారతం లోని స్త్రీ-పురుష పాత్రల చుట్టూ ఇన్ని వందల ఏళ్లలో గాఢంగా అల్లుకున్న కాల్పనిక తేజోవలయాన్ని ఈ రచన మరింత గాఢం చేస్తుంది. పురుష భారతంలోని అతీంద్రియ లక్షణాలను, విశ్వాసాలను, మహిమలను యథాతథంగా స్వీకరించడం మరో నిరుత్సాహకర అంశం.  గిరిజనులకు, అసురులకు క్షత్రియులతో ఉన్న సహజ వైరాన్ని, వైరుధ్యాలను కప్పి పుచ్చి వారి మధ్య ఆదర్శవంతమైన మైత్రీనీ, శాంతి సామరస్యాలనూ స్థాపించబోవడం కూడా వాస్తవాల నేల విడిచి సాగించే ఆదర్శాల సాము మాత్రమే. ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన పురా చరిత్ర, పురామానవ పరిణామ చరిత్ర వంటి వనరుల స్పృహ ఈ రచనలో లోపించడం ఒక వెలితి. స్త్రీ హృదయాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన రచయిత్రి తన రచనను వాస్తవికతా పునాదుల మీద కాకుండా నిరూపణకు అందని భావజగత్తు పునాదులమీద నిలబెట్టడం పురుష భావజాల ప్రభావఫలితం.

Front Image: Hidimba Reveals their Identity, Scene from the Story of the Marriage of Abhimanyu and Vatsala, Folio from a Mahabharata ([War of the] Great Bharatas), circa 1850, Painting; Watercolor, Opaque watercolor on paper, Wikimedia Commons
Download PDF

6 Comments

 • kalluri bhaskaram says:

  చిన్న సవరణ. “తనలానే అయిదుగురు సంబంధంతో సంతానం కన్న అత్తతో కృష్ణ అడుగడుగునా మమేకం అవుతుంది” అనే వాక్యాన్ని, “తనకు అయిదుగురితో సంబంధం ఉన్నట్టే, నలుగురితో సంబంధంతో సంతానం కన్నఅత్తతో…” అని చదువుకోవాలి.

 • ns murty says:

  “యవ్వనవంతమైన ప్రతి తరమూ, ప్రతి కాలమూ నూతన వైజ్ఞానిక వనరుల కొత్తరక్తంతో తన వైజ్ఞానిక వారసత్వానికి నూతన యవ్వనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో నిన్నటి తరంనుంచి, లేదా కాలంలో ఘనీభవించిపోయిన వ్యక్తులు, వ్యవస్థలనుంచి ప్రతిఘటననూ ఎదుర్కొంటూ ఉంటుంది”… ఒక మంచి పరెశీలన.

  “కవిత్వం, కథ, నవల, ఇతర కళారూపాలు అన్నీ సత్యాన్ని విశ్వాసపు దాడినుంచి తప్పించడానికి ఉద్దేశించినప్రచ్ఛన్న రూపాలు కావచ్చు నేమోనని” ఇది మంచి Thesis .

  కాకపోతే, నాదో సందేహం. మనం ఎన్ని విశ్లేషణలు చేసినా, ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా, అవి ఎప్పుడూ మన అవగాహన పరిథిలోనే, మనం చెప్పాలనుకున్న లక్ష్యాలపరిథిలోనే ఉంటాయి తప్ప, పురావస్తువులద్వారా ఆ కాలంలో వాడిన వస్తువుల గురించి చెప్పినంత ఖచ్చితంగా, మనం పాత్రల మనస్తత్వ్వాన్ని ఇదీ అని నిర్థారించలేమో నని నా అభిప్రాయం. మన సానుభూతులు , మనవాదాలు, మనం అలనాటి పాత్రలకి ఆపాదించడం ఎంతవరకు సబబు? మనకి ఒక Text గాని అందులోని విషయంగాని నచ్చనపుడు, మన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు కొత్త కథని రాయాలి తప్ప, పాత కథని Meddle చెయ్యడం ఎంతవరకు సబబు? When we can respect a fellow being, why can’t we respect the text of a writer? Poor fellow, other than moving uneasily in his grave, he can’t counter our arguments and establish the truth of his times. మన అభిప్రాయాలు, నిర్వచనాలు, వ్యాఖ్యలూ నూటికి నూరుపాళ్ళూ నిజమే అనుకున్నా, అవి సత్యం కావు కదా. What I mean is, however exact we might be in our opinions, definitions,and interpretations of a text, truth can still be different from what we opine, define or interpret. For analogy, let me take cue from the field of medicine. Surgeons surely know, for all the lab tests, X-rays and MRIs and second opinions and a host of others on a particular case, when they open the body for surgery, it could still be a totally unexpected situation there, compatible with all the lab tests, x-rays and MRIs, but not with the interpretations.

  • kalluri bhaskaram says:

   మూర్తి గారూ, మీ స్పందనకు కృతజ్ఞుణ్ణి. “మనం ఎన్ని విశ్లేషణలు చేసినా, ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా అవి ఎప్పుడూ మన అవగాహన పరిధిలోనే, మనం చెప్పాలనుకున్న లక్ష్యాల పరిధిలోనే ఉంటాయి…” అన్న మీ అభిప్రాయంతో స్థూలంగా ఏకీభవిస్తాను. అయినా ఆ పని ఎందుకు చేస్తామంటే, అందుకు కారణం మీరు కోట్ చేసిన “యవ్వనవంతమైన ప్రతి తరమూ, ప్రతి కాలమూ నూతన వైజ్ఞానిక వనరుల కొత్త రక్తంతో తన వైజ్ఞానిక వారసత్వానికి నూతన యవ్వనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది” అన్న నా అభిప్రాయంలో ఉందనుకుంటాను. అందుకే ప్రతి రచనా ఆ కాలపు భావజాలాల మధ్య తన ఉనికిని స్థాపించుకునే ఒక ‘వ్యూహ’మే. “తనకూ, లోకానికీ మధ్య సమాధానం కోసం కవి చేసే బహిరంతర్యుద్ధారావమే కవిత్వం” అన్న చలం నిర్వచనం(అక్షరాలా ఆయన ఇలాగే అని ఉండకపోవచ్చు. జ్ఞాపకం మీద ఆధారపడి కోట్ చేశాను)లోని అంతరార్ధం కూడా ఇదే ననుకుంటాను. ఆయన యుద్ధమన్న చోట నేను వ్యూహం అనే మాట వాడాను. ఒక ఉదాహరణ చెబుతాను. మహాభారతంలో జరత్కారుని కథ ఉంది. బ్రహ్మచర్యం పాటిస్తూ తపస్సు చేసుకుంటున్న జరత్కారుడు పితృదేవతలకు సద్గతి కలిగించడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే, అందుకు కొన్ని షరతులు పెడతాడు. తన పేరే ఉన్న కన్య దొరకాలని ఒక షరతు. తను పోషించనవసరం లేని కన్య దొరకాలని ఇంకొక షరతు. అతడు తపశ్శాలి అని సంస్కృత భారతం చెబుతూనే భార్యను పోషించలేని అతని పేదరికం గురించి కూడా చెబుతోంది. నన్నయ తన అనువాదంలో అతని రెండవ షరతును, అతడు పేదవాడన్న సంగతిని పరిహరించి కేవలం అతడు గొప్ప తపశ్శాలి అనీ, తపస్సు కోసమే పెళ్లి చేసుకోలేదనీ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అందులో నిర్దిష్టమైన ‘వ్యూహం’ ఉంది.
   “పురా వస్తువుల ద్వారా ఆ కాలంలో వాడిన వస్తువుల గురించి చెప్పినంత ఖచ్చితంగా, మనం పాత్రల మనస్తత్వాన్ని ఇదీ అని నిర్ధారించలేమేమో, మన సానుభూతులు, మన వాదాలు మనం అలనాటి పాత్రలకు ఆపాదించడం ఎంతవరకు సబబు?” అని మీ ప్రశ్న. పురా భావాలు కూడా పురా వస్తువుల లాంటివే. భావాలకు కూడా చరిత్ర ఉంటుంది. భావాల మధ్య చారిత్రక అవిచ్చిన్నత ఉంటుంది. జరత్కారుని రెండో షరతును చూద్దాం. పోషించనవసరం లేని భార్యను అతను కోరుకుంటాడు. ఆ భావన వెనుక గణసమాజ వాస్తవికత ఉంది. గణసమాజంలో స్త్రీ పోషణ బాధ్యత భర్తదికాదు, ఆమె అన్నదమ్ములది. ఆ గణ సమాజలక్షణాన్ని కూడా సంస్కృత భారతం సూచిస్తూ ఉండచ్చు. నేటికీ ఆడపడుచుకు పసుపు, కుంకుమ, చీర పెట్టి పంపించాలనే సెంటిమెంటు వెనుక ఒకప్పటి గణధర్మమే ఉంది. నన్నయ తన అనువాదంలో ఆ షరతును తొలగించడం వల్ల మహాభారతంలోని ఒక ముఖ్యమైన గణసమాజధర్మం తెలుగు భారతంలో రికార్డ్ కాకుండా పోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి. నూతన వైజ్ఞానిక వనరుల సాయంతో ప్రతి తరమూ తన వైజ్ఞానిక వారసత్వానికి కొత్త యవ్వనం ప్రసాదిస్తుందని నేను అన్నది అందుకే. హెన్రీ లూయీ మోర్గన్ పుణ్యమా అని మన ప్రాచీన రచనల్లో గణసమాజ లక్షణాలను పోల్చుకునే అవకాశం మనకు కలిగింది.

   • kalluri bhaskaram says:

    “మనకు ఒక టెక్స్ట్ కానీ, అందులోని విషయం కానీ నచ్చనప్పుడు, మన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పూర్తి స్వేచ్చ ఉన్నపుడు కొత్త కథను రాయాలి తప్ప పాతకథను meddle చేయడం ఎంతవరకు సబబు?” అని మీ మరో ప్రశ్న. పాతకథ, పాత దగ్గరే ఆగిపోకుండా కొత్త అనుభవాలలోకి కూడా చొచ్చుకు వస్తోంది కనుక దానిని కొత్తగా వ్యాఖ్యానించుకునే అవసరం ఏర్పడవచ్చు. మహాభారత సందర్భంలో మాట్లాడుకుంటున్నాం కనుక దానిని ‘ఒక టెక్స్ట్’గా తీసుకోవడంలో ఉండే ఇబ్బందులు చూద్దాం. మహాభారతం చాలాకాలం మౌఖిక ప్రచారంలో ఉండి తర్వాత గ్రంథరూపం ధరించింది. మౌఖిక ప్రచారంలో ఉన్నప్పుడే దానికి అనేక టెక్స్ట్ లు రూపొందాయి. గ్రంథరూపం ధరించాక కూడా కొత్త టెక్స్ట్ లు తయారవుతూనే ఉన్నాయి. ఆ వైవిధ్యం పురాణకథలకు ఒక స్వాభావిక లక్షణం. వ్యాసుడికి కర్తృత్వం కల్పించిన టెక్స్ట్ కూడా అనేక టెక్స్ట్ లలో ఒకటి. వ్యాసుడు జయమనే పేరుతో ఎనిమిదివేల శ్లోకాలనే చెప్పగా ఆయన శిష్యులు దానిని లక్షశ్లోకాలకు పెంచారంటారు.
    మహాభారతాన్ని ఇతిహాసంగా అంటే చరిత్రగా కూడా చూడచ్చని కథకుడే చెప్పాడు. అయినాసరే మహాభారతాన్ని చరిత్రగా చూసి వ్యాఖ్యానించే సంప్రదాయం మనకు ఏర్పడలేదు. ఒక కథగా లేదా సాహిత్యంగా చూడడానికే అలవాటు పడ్డాం. కావ్యంగా చెప్పే రామాయణానికీ ఇది వర్తిస్తుంది. వాటిలోని పాత్రలనో, ఆయా ఘట్టాలనో తీసుకొని నాటకంగా, కావ్యంగా మలచే ప్రయత్నం వెనకటి కాలంలో జరిగినట్టే, కథగా, నవలగా, ఖండకావ్యంగా మలచే ప్రయత్నం ఆధునిక కాలంలోనూ కొనసాగింది. అది కూడా మీరన్నట్టు మన సానుభూతులు, మన వాదాలు అలనాటి పాత్రల మీద ఆపాదించే రూపంలో జరుగుతోంది. ఆ క్రమంలో పురాణపాత్రలు సమకాలీన సంవేదనలు, ఆదర్శాలతో కొత్త అవతారాలు ధరిస్తున్నాయి. వాటి బరువు కింద అణగారి పోతున్నాయి. ఇలాంటి రచనలు చాలావరకు భౌతిక వాస్తవికత అనే నేల విడిచిన భావాల సాముగా కూడా పరిణమిస్తూ ఉంటాయి. ఇందులో ఒక అపసవ్యత ఏమిటంటే వర్తమానం నుంచి ఇవి గతాన్ని వ్యాఖ్యానిస్తుంటాయి. నా ఉద్దేశంలో సవ్యమైన పద్ధతి గతం నుంచి వర్తమానాన్ని దర్శించడం, వ్యాఖ్యానించడం.
    ప్రతిభారాయ్ యాజ్ఞసేని కూడా మౌలికంగా ఈ అపసవ్య దృష్టికోణానికి చెందినదే. అందులో పురుష భావజాల, పురుష భారత ప్రభావాలు పుష్కలంగా ఉన్నాయి, ఈ సంగతి నా వ్యాసంలో ప్రస్తావించాను, కాకపోతే, ఈ కోవకు చెందిన అనేక పేలవమైన రచనలతో పోల్చితే యాజ్ఞసేని కొంత లోతు, గాఢత ఉన్న రచన. స్త్రీ హృదయధర్మాన్నిరచయిత్రి హృద్యంగా ఆవిష్కరించారనిపించింది. ద్రౌపది అయిదుగురికి భార్యగా దైహికమైన కట్టడినుంచి బయటపడిన ఫలితంగా హృదయగతంగా జీవించే అవకాశం కలిగిందని రచయిత్రి ధ్వనింపచేశారు. ఒకప్పటి మాతృస్వామ్య లక్షణాలకు దగ్గరగా ఉండడం ద్రౌపది చిత్రీకరణలో నన్ను ఆకర్షించిన అంశం.
    ఇక సత్యం గురించి మీ అభిప్రాయం స్థూలంగా నిజమే. అయితే, సాహిత్యమైనా, సైన్స్ అయినా సత్యానికి దగ్గరగా వెళ్లడానికి నిరంతరప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నమే లేనప్పుడు సాహిత్యమూ లేదు, సైన్సూ లేదు.

 • Radhika says:

  1) కర్ణుని పట్ల కృష్ణది ఎలాంటి ఆకర్షణ? అది శారీరక సంబంధమైనది కాదని చెప్పలేం. శారీరక సంబంధమైనదే ననీ చెప్పలేం. శారీరక సంబంధానికి అతీతమైనదీ, అంతకంటే అత్యున్నతమైనదీ కూడా కావచ్చు. ఇక్కడే రచయిత్రి స్త్రీ హృదయమూలాలను అత్యద్భుతంగా ఆవిష్కరించారనిపిస్తుంది. కృష్ణ దేహసంబంధమైన పరిమితులను దాటి హృదయగతంగా జీవించే స్థాయిని అందుకుంది.
  2) మరో సందర్భంలో ఇలా అనుకుంటుంది: “ప్రపంచంలో అధికాంశం స్త్రీలు శరీరపరంగా అసతులు కాకపోయినా మానసికంగా అసతులు. ఒకే భర్తకు భార్యగా ఉన్నా ఇతర పురుషులు వారి మనస్సులో అలజడి రేపుతారు. శరీరాలు వేరైనా మానసికంగా వారు పరపురుషులతో శయనిస్తారు. కానీ నా విషయంలో ఇది జరగదు. యుధిష్టరునితో ఏకాంతంలో ఉన్నప్పుడూ నేను అర్జునుని కోరుకోను. సంయమనం, కట్టుబాటుతో ఉండేందుకు నేను సాధన చేశాను” .

  వ్యాసంలో ప్రక్క ప్రక్కనే వున్న రెండు విషయాలలో ఇంత వైరుధ్యం చూస్తే ఆశ్చర్యం కలగలేదు.
  ఎందుకంటే ఈ నవల మొత్తం (ముందు మాటతో సహా) వైరుధ్యాలమయమే.
  ఈ క్రింది లింక్ లో కొన్ని వివరించబడ్డాయి.
  http://alochanaamrutam.blogspot.in/2012/06/blog-post_10.html

  • kalluri bhaskaram says:

   రాధిక గారూ, మీ స్పందనకు కృతఙ్ఞతలు. మీరు రెండు వ్యాఖ్యలను కోట్ చేసారు. మొదటిది నా వ్యాఖ్య. రెండోది రచయిత్రి తన నవలలో చేసిన వ్యాఖ్య. నాకు అర్థమైనంతవరకు ఈ వ్యాఖ్యలలో వైరుధ్యం లేదు. కృష్ణ దేహసంబంధమైన పరిమితులను దాటి హృదయగతంగా జీవించగల స్థాయిని అందుకుందని రచయిత్రి చిత్రణ ద్వారా నేను అర్థం చేసుకున్నాను. అయిదుగురు పురుషులతో సంబంధమే అందుకు అవకాశం ఇచ్చి ఉండచ్చని అన్నాను. ఆవిధంగా చూసినప్పుడు కుంతి ధర్మపుత్రుడిగా పరిచయమై ఆ తర్వాత కుంతి నిజపుత్రునిగా తెలిసిన కర్ణుని పట్ల ఆమె ఆకర్షణ శారీరకమో, హృదయగతమో చెప్పలేమని అన్నాను . ద్రౌపది కర్ణుని ఆరవభర్తగా కోరుకుందన్న జానపద భావన రచయిత్రి చిత్రణను ప్రభావితం చేసి ఉండచ్చని అన్నాను.
   ఇక రెండో వ్యాఖ్య. ఒకే భర్త ఉన్న స్త్రీలు దైహికంగా పతివ్రతలు అయినా మానసికంగా పత్రివ్రతలు కాకపొవచ్చనీ,నేను అయిదుగురు భర్తలు ఉన్నా ఒక భర్తతో ఉన్నప్పుడు ఇంకో భర్తను కోరుకోననీ ఆ విధంగా నేను పతివ్రతననీ ద్రౌపది అంటోంది. సాంప్రదాయికంగా ద్రౌపదిని పతివ్రతలలో ఒకరిగా చెప్పడం మనకు తెలుసు. అలా చెప్పడానికి కారణాన్ని రచయిత్రి ఇలా ద్రౌపది నోట పలికిస్తూ ఉండచ్చు.
   మీరు సూచించిన మీ వ్యాసాన్ని చదివాను. మీరు అన్నట్టు యాజ్ఞసేనిలో చదివించే గుణం తక్కువే. అలాగే మీరు అన్నట్టు అక్కడక్కడ వైరుధ్యాలూ ఉండచ్చు. వాటిలోకి వెళ్ళను. ఈ రచన మన సంస్కృతిపై గౌరవం పెంచేలా లేదని మీరు అన్నారు. సంస్కృతిపై గౌరవం పెరగాలనే ఉద్దేశం తోనే మీరు మూల భారతం చదివితే మరింత ఆశాభంగం చెందుతారు. మన సామాజిక సాంస్కృతిక పరిణామక్రమంలో భాగంగా మన పురాణ రచనలను అర్థం చేసుకోవడమే న్యాయమని నా ఉద్దేశం.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)