ఊదారంగు తులిప్ పూలు

kunaparaju (కూనపరాజు కుమార్ కథల సంపుటి ‘న్యూయార్క్ కథలు’

మార్చి 16, హైదరాబాద్ లోఆవిష్కరణ )

ఊదారంగు అంటే ఎలా చెప్పాలి? వైలెట్ రంగులో కొంచెం తెలుపు కలిపితే ఊదా రంగు వస్తుంది. బహుశా తూటి పూలరంగులా ఉంటుంది. వంకాయ రంగుని కొంచెం డార్క్ చేస్తే నేరేడు పళ్ల రంగు వస్తుంది. తూటి పూలు, నేరేడు పళ్ళూ.. మా వూరి నిండా అవే.

మాది కొల్లేరు సరస్సుకు ఆనుకొని ఉన్న గ్రామం. పూర్వం వర్షాకాలంలో కొల్లేరు ఉబికి పైకి వస్తే ఊరి చివరి పొలాలు మునిగిపోయేవి. అక్కడ వేసవి కాలం ముందు ఒకసారి వరి వేసేవారు. మార్చిలో దాళ్వా వరి వ్యవసాయం పూర్తి అయిన తరువాత ఏప్రియల్, మే నెలల్లో ఎండాకాలం ఆ పొలాలన్నీ ఖాళీగా వుండేవి. అక్కడ పిల్లలు అందరం చేరి క్రికెట్ ఆడేవాళ్ళం.

ఆటకు ఊరి చివరకు వెళ్ళేటప్పుడు ఎండిపోయిన కాలువ వారమ్మటా, మురికికోడులో తడిగా ఉన్నచోట్ల ఈ తూటికాడలు విపరీతంగా పెరిగేవి. ఆ కాలంలో వాటి నిండా తూటిపూలే. ఊళ్ళో గుడి చెరువు దగ్గర సంగలో అక్కడక్కడా  పెద్ద నేరేడు పళ్ళు వుండేవి. వేసవి సెలవల్లో మా ఆటలన్నీ వాటి నీడల్లోనే. కానీ వాటికీ ఈ తులిప్ పూలకు కొంచెం తేడా వుంది.

తులిప్ పూలు చాలా సినిమాలలో చూశాను. “దేఖా ఏక్ క్వాబ్ తో యే సిల్‌సిలే హువే … “అనే పాటలో అమితాబ్, రేఖల ప్రణయం తులిప్ వనాలలోనే. అవి చాలా రంగుల్లో భలే వుండేవి. కానీ మొదటిసారి అమెరికా వెళ్ళేటప్పుడు కె.ఎల్.ఎం. విమానం ఆమ్‌స్టర్‌డామ్‌లో  ఆగింది. లింక్ ఫ్లైట్  లేట్ అయినందువల్ల నగరం చూసే అవకాశం కలిగింది. ఎక్కడ చూసినా తులిప్ పూలే. నగరం చివరం కనుచూపు మేర పరుచుకొని వుండే తులిప్ వనాల తుళ్ళింతని తనివి తీరా చూసి తీరాలి.

కానీ ఇక్కడ న్యూయార్క్‌లో ఈ తులిప్ పూలు ఇంకా అందంగా విచిత్రంగా వున్నాయి. వీటిని మన్‌హటన్‌లో సెంట్రల్ పార్క్‌లో కూడా చూడలేదు. ఇవి నేరేడు పళ్ళ రంగుతో నిగనిగలాడుతూ వుండి, రేకుల అంచులు తూటిపూల రంగులో మెరుస్తున్నాయి. ఇవి నాజూకుగా, చిత్రంగా, అందంగా వున్నాయి. ఆ రోడ్డుపై నడుస్తూ ‘గ్రౌండ్ జీరో ట్విన్ టవర్స్ పడిపోయిన’ చోట రైలింగ్ పక్కన పెట్టిన ఈ తులిప్ పూలగుత్తి  మమ్మల్ని ఆకర్షించింది. దగ్గరగా వెళ్ళి చూసాం. అక్కడో కొవ్వొత్తి వెలుగుతోంది.

కొంచెం వెనక్కి తగ్గి చూసేసరికి అవి ఎవరికో నివాళిగా పెట్టిన పూలు అని తెలిసింది. ఆ పక్కనే తలవంచుకొని ఓ అమ్మాయి కూర్చుని వుంది. రఘువీర్‌ని చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాను. ఇద్దరం నాలుగు అడుగులు వెనక్కి వచ్చాకా “బహుశా నైన్ ఎలెవన్ మృతులలో ఒకరి బంధువై వుండవచ్చు” అన్నాను.

రఘువీర్‌కు ఆశ్చర్యంగా వుంది. కళ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు.

రఘువీర్ నా హైస్కూల్ మిత్రుడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజే కలిసాం. అతను అమెరికా వచ్చి రెండు సంవత్సరాలు అయినా, న్యూయార్క్ రావడానికి ఇంత సమయం పట్టింది. ఫోన్‌లో టచ్‌లోనే వున్నాడు. చలికాలం పోయి వసంతకాలం విరబూస్తున్నప్పుడు వస్తే న్యూయార్క్ బాగుంటుందని చెప్పాను. అందుకే ఇప్పుడు వచ్చాడు. రఘు కాలేజీలో అతివాద భావాలు గల విద్యార్థి సంఘంలో పని చేసేవాడు. ఎప్పుడూ అమెరికాను విమర్శించడమే వాళ్ల పని. ఎక్కడెక్కడో తిరిగి, ఆఖరికి ఇలా స్థిరపడ్డాడు.

“ఏమోయ్! ఫ్లేటు ఫిరాయించావా?” అన్నాను.

“మరి తప్పలేదు.. వేరే మార్గం కూడా లేదు.కుటుంబం కోసం.” అన్నాడు.

“అనుకున్నంత చెడ్డగా లేరు ఇక్కడి ప్రజలు” అన్నాడు.

“అందుకే విన్న దానికి, చూసిన దానికీ అంత తేడా” అన్నాను.

“కానీ కొన్ని విషయాల్లో రాజీ పడ్లేను. ఈ ప్రభుత్వం కొన్ని చెడ్డ పనులు చేస్తోంది. అందుకే ఈ సెప్టెంబర్ 11 దాడులు” అన్నాడు.

ఈరోజు న్యూ‌యార్క్ రాగానే ‘సెంట్రల్ పార్క్’ వెళ్ళాం.

వసంతం విరబూసింది. ఎక్కడ చూసినా పూలే, పూల సముద్రంలా వుంది. జనం ఈ శోభను చూడటానికి విపరీతంగా వచ్చారు.

“ఇన్ని  బిల్డింగ్‌ల మధ్యలో ఈ పార్క్‌ని ఎంత బాగా మెయింటేన్ చేస్తున్నారు!” అన్నాడు రఘు.

తరువాత “టైమ్ స్క్వేర్”, మళ్ళీ సబ్‌వేలో ప్రయాణం.. వాల్‌స్ట్రీట్.. ఇపుడు, ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతం.

ఇప్పటికి ఆరు సంవత్సరాలయ్యింది. 9/11 విషాద సంఘటన జరిగి, మళ్లీ నన్ను నిస్పృహ ఆవరించింది. ఏదో పెద్ద సమాధి కట్టడం కోసం చేస్తున్న పనిలా వుంది ఇక్కడ ‘వర్క్ ప్లేస్’. మళ్లీ కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. “ట్విన్ టవర్స్”తో అనుబంధం గుర్తుకు వచ్చింది.

ఆ రోజుల్లో ‘బ్యాటరీ పార్క్‌లో స్టీమర్ ఎక్కి లిబర్టీ విగ్రహం వైపు వెళుతూ వెనక్కి తిరిగి చూస్తే నీటిలో నుంచి మొలుచుకు వచ్చిన ఆధునిక శిల్ప సముదాయంలా వుంది ‘మన్‌హటన్ దీవి’. వీటి మధ్యలో ఠీవిగా గుమ్మం ముందు నిలబడ్డ నవదంపతులవలె వుండేవి “ట్విన్ టవర్స్.”

చాలా సార్లు  క్వీన్స్ నుండి న్యూజెర్సీ వెళ్ళేటప్పుడు ఈ భవనాల కింద వున్న ‘సబ్‌వే’ స్టేషన్‌లలోనే ట్రైన్ మారేవాళ్లం. అక్కడ వున్న ఓ కిళ్ళీ షాపులో  ‘న్యూయార్క్ పోస్ట్’  పేపర్ కొనేటప్పుడు ఆ షాపు యజమాని సర్దార్జీ హాయిగా పలకరించేవాడు.

“ఎంత కాలం అయ్యింది బాస్ ఇక్కడకు వచ్చి” అని అడిగాను.

“25 సంవత్సరాలు” అన్నాడు

పంజాబ్‌లో లూధియానా దగ్గర ఓ గ్రామంలో వ్యవసాయం చేసేవాడట. ట్రాక్టర్ కూడా వుండేది. ఎప్పుడో అమెరికా వచ్చిన ఇతని బంధువులు ఇతని ఫ్యామిలీని స్పాన్సర్ చేసారు.

“ఎలా వుంది ఇక్కడి జీవితం?” అంటే

“చల్తా.. చల్తా” అనేవాడు. అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం సరదాగా అనిపించేది. షాపు లోపల స్టూలు వేసి కూర్చోమనేవాడు.

ఇంటికి వచ్చిన చుట్టాలను, మిత్రులను ఈ ట్విన్ టవర్స్ పైకి తీసుకొని పోయి “అదిగో అది హడ్సన్ నది, అది సముద్రంలో కలిసే చోటు వున్న ఆ చిన్న దీవి పైనే ‘లిబర్టీ స్టాట్యూ’ వుంది. ఎడమ పక్క ‘క్వీన్స్’, లాంగ్ ఐలెండ్, నదికి ఇటువైపున  న్యూజెర్సీ రాష్ట్రం వున్నాయి” అని వారికి చూపించేవాడిని.

ఇక్కడకు వచ్చినందుకు గుర్తుగా ట్విన్ టవర్స్ బొమ్మలున్న కీ్‌చైన్‌లు వాళ్లకు బహుమతులుగా ఇచ్చేవాళ్లం. ఈ బొమ్మలమ్మే నల్ల అబ్బాయి నన్ను గుర్తుపట్టేవాడు. నేను రాగానే చిన్న చిన్న గిఫ్ట్‌లు చూపించేవాడు. రెండు డాలర్లు టిప్‌గా ఇస్తే వాడి మొహం వెలిగిపోయేది. అక్కడే వున్న బైనాక్యులర్స్‌తో అన్ని పక్కలా చూసేవాళ్లం. హడ్సన్ నదిలో తిరుగుతున్న స్టీమర్లను పరిశీలించే వాళ్లం. ఈ భవనంలో పని చేసేవారు, పలకరించే వారు, నవ్వులు చిందించేవారు ఏమయ్యారు.?  కొన్ని క్షణాలలో జరిగిన సంఘటన వల్ల భూమి గర్భంలో సమాధి అయిపోయారు. వారి కలలూ, ఆశలూ గాలిలో కలిసిపోయాయి. వారి స్మృతులను మనకు మిగిల్చి చీకటి చరిత్రలో లీనమైపోయారు.

“ఏమిటి ఆలోచిస్తున్నావ్?” అన్నాడు రఘువీర్.

“ట్విన్ టవర్స్ గుర్తుకు వస్తున్నాయ్” అన్నాను.

“భవనాల మీద కూడా ప్రేమేనా! అంత విశాలహృదయమా తమరిది!” అన్నాడు వ్యంగ్యంగా.

“అనుబంధం వున్న దేనిపైన అయినా సరే ప్రేమ పుడుతుంది. సొంత ఇల్లు, ఊళ్ళో పొలాలు, ఎంతో కాలం వాడిన పాత డొక్కు సైకిల్, ఇవన్నీ నిర్జీవాలే అయినా వీటిని ఇష్టపడతామా,  లేదా?” అని అడిగాను.

“కాని ఈ విషయంలో అంత బాధ పడాల్సిన అవసరం లేదు. ఇది స్వయంకృతం ” అన్నాడు

“కారణాలు వెతకను కాని ఈ ఘటనలో ఎంతో విషాదం వుంది. వేల సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోయారు. ఆఖరికి డ్యూటీలో వున్న వందలాది ఫైర్ ఫైటర్స్ కూడా చనిపోయారు” అన్నాను.

రఘుకు కొంత భిన్న అభిప్రాయం వున్నా ఈ సమయంలో ఎక్కువగా వాదించదల్చుకోలేదు . మౌనంగా వుండిపోయాడు.

***

“ఇదిగో రఘు, ఆ అమ్మాయి మన రెస్టారెంటు వైపు వస్తోంది, పలకరిద్దామా!?” అన్నాను.

“ఇప్పుడెందుకు ఆ అమ్మాయిని మరోసారి బాధపెట్టడం?” అన్నాడు రఘు.

“లేదు ఆ అమ్మాయి కథ విందాం, అలాగే ఆ అమ్మాయి కూడా మనతో బాధ పంచుకొని కొంత రిలీఫ్ పొందుతుంది” అన్నాను.

“సరే నీ ఊరు,  నీ యిష్టం” అన్నాడు రఘు.

నెమ్మదిగా ఆ అమ్మాయి కూర్చున్న మూల టేబుల్ దగ్గరకు వెళ్ళి “మీరు ఏమీ అనుకోకపోతే ఇక్కడ కూర్చోవచ్చా?” అన్నాను.

ఆ అమ్మాయి తలపైకి ఎత్తి “ఎందుకు కూర్చోకూడదు?” అంది.

“థాంక్యూ!” అంటూ కూర్చొని మెల్లగా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను.

‘జూలీ’ కరేబియన్ ఐలెండ్స్ నుంచి వచ్చిన స్పానిష్ అమ్మాయి. స్కూల్ టైంలోనే వాళ్ల తల్లి తండ్రులు వచ్చి ఇక్కడ ‘జెర్సీ సిటీ’లో సెటిల్ అయ్యారు. ఫైన్ ఆర్ట్స్‌లో వుద్యోగం చేయాలని కోరిక. తక్కువ జీతాలతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి విసిగిపోయింది. అప్పుడు పరిచయమయ్యాడు ‘వినోద్’. తను ‘కొలంబియా’ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ పొందాడు. తను దగ్గిర వుండి కంప్యూటర్ నేర్పించాడు. తానే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేర్పించాడు. 2001 ఆగస్టు నెలలోనే వినోద్ చేస్తున్న కంపెనీలో  తన టీంలో చేర్చుకొన్నాడు. దీనికి మూడు నెలల క్రితమే ఆ కంపెనీ ట్విన్ టవర్స్ లోనికి మారింది.

తన కథ చెబుతున్న జూలీ తెల్లని ముఖం ఎర్రగా మారింది. కళ్లలోని తెల్లని గుడ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. కనురెప్పల అంచుల్లో నల్లటి రేఖలు.. మేం కొంచెం సేపు మౌనంగా కూర్చున్నాం.

నెమ్మదిగా మళ్ళీ అంది. “వినోద్ ఇండియనే, చాలా మంచివాడు. రెండు మూడు సంవత్సరాలు నాకు ఓపికగా కంప్యూటర్ నేర్పించాడు. ఆర్ధికంగా ఆదుకొన్నాడు. అమ్మా నాన్న పోయినప్పుడు నన్ను ఎంతో ఆదరంగా చూసుకొన్నాడు.” అని ఆగిపోయింది.

కళ్ళవెంట నీరు ఉబికి వచ్చింది. “సారీ” అంటూ పేపర్ నాప్‌కిన్‌తో కన్నీరు తుడుచుకుంది.

“ఆ రోజే వినోద్‌తో పెళ్ళి చేసుకుందామని ప్రపోజ్ చేద్దామనుకున్నాను. ఏడు గంటలకి ఫోను చేసాను. అప్పటికే తను ఆఫీసులో వున్నాడు. నేను ఈ రోజు త్వరగా వచ్చేస్తున్నా అన్నాను. ఏమిటి విశేషం అని అడిగాడు. నీకు సర్‌ప్రైజ్ చేస్తూ ఓ విషయం చెప్పాలి అన్నాను. ‘యూ ఆర్ వెల్‌కమ్’ , ‘బట్ నాకు తెలుసు’ అన్నాడు. ‘ఎలా!’ అని అడిగాను. ‘నిన్నటి నుంచీ నీ వాలకం వల్లనే కనిపెట్టాను. బట్ ఐయాం లక్కీ’ అన్నాడు. మరి నేనైతే ఇంకా అదృష్టవంతురాలిని. నేను ఆనందంలో తేలియాడుతూ ఆఫీసుకి బయలుదేరాను.

“సబ్‌వే ట్రైన్‌లో ‘వాల్‌స్ట్రీట్’ స్టేషన్‌లో దిగి ఇలా పైకి వచ్చానో లేదో జనాలు పరుగులు తీస్తున్నారు. కారు  హారన్‌ల  హోరు.. ఎక్కడ చూసినా బూడిద, కాగితాలు వీధుల్లో ఎగురుతున్నాయి. ట్విన్ టవర్స్ లోని  ఓ టవర్‌ని ఏదో టూరిస్ట్ విమానం ఢీకొట్టిందంట. టవర్స్ వైపు పరిగెత్తాను. పైనుంచి నిప్పురవ్వలు రాలుతున్నాయి. కానీ మా ఆఫీసు రెండో టవర్‌లో వుంది. ఆ టవర్ దగ్గరకు ఎవ్వరినీ వెళ్లనీయడం లేదు. పరిస్థితి ఘోరంగా వుంది. ఎవరో అరుస్తున్నారు ఇది టెర్రరిస్ట్ ఎటాక్ అని. భయంతో వినోద్‌కు కాల్ చేద్దామని ఫోన్ తీసాను. అప్పటికే చాలా మిస్డ్ కాల్స్ . వినోద్‌కు కాల్ చేసాను. చాలా భయంతో, ఆందోళనతో వున్నాడు. లిఫ్ట్‌లు పని చేయడం లేదట. మెట్లు జామ్ అయ్యాయి, దిగడం చాలా కష్టంగా వుంది అన్నాడు వినోద్.. “మైడియర్, మనం తప్పక కలుస్తాం, భగవంతుడు మన ప్రేమను పండిస్తాడు. నీ కోసం ఎదురు చూస్తూ వుంటా..” అంటూ ఏడుస్తూ ఏదేదో అంటున్నాడు.

ఇంతలో చెవులు బద్ధలయ్యే పెద్ద శబ్దం వచ్చింది. ఆకాశం వైపు చూశా.. మరో విమానం మా టవర్ పై అంతస్థుని ఢీకొట్టింది. ఆకాశంలోంచి అగ్ని వర్షం కురిసింది. దుమ్ము,మేఘాలు, కాగితాలు, చెత్త ఈ మన్‌హటన్ నగరం అంతా నరకంలోనికి కుంగిపోతున్నట్లు అయిపోయింది. మంటలు చెలరేగుతున్నాయి. ‘ఓ మైగాడ్.. వినోద్.. ప్రియతమా అంటూ పిచ్చి ఎక్కినట్లు పరుగులు తీస్తున్నాను. ఇంతలో పెద్ద శబ్దం, ఏవో కూలిపోతున్నట్లు, భూమి కుంగిపోతున్నట్లు .. నేను స్పృహ తప్పాను. జీవితం అంతా ఓ క్షణంలో బూడిద ఐపోయింది” ఆమె తలవంచుకునే వుంది. ఆమె కళ్ల నుంచి కన్నీటి వాన కురుస్తోంది.

చాలా సేపు మౌనంగా వుండిపోయాం. నేను సంకోచిస్తూ ఆమె చెయ్యిపై చెయ్యి వేశాను. ఓదార్పుగా, చల్లగా వుంది. చిన్నగా వణకుతోంది. “క్షమించండి మిమ్మల్ని చాలా ఇబ్బంది  పెట్టాం: అన్నాను.

కొద్ది సేపు నిశ్శబ్దం.

వినోద్ చాలా మంచివాడు. వాళ్ళ తల్లితండ్రులు కూడా లేరు. పది సంవత్సరాల క్రితమే అమెరికా వచ్చాడు. అక్కడి వారితో సంబంధాలు  లేవు. దయచేసి వారికి ఈ విషయం తెలియచేయండి. ఇదిగో వినోద్ నాకు ఇచ్చిన ఈ వుంగరం అతని బంధువులకు ఇవ్వండి. ఈ సంఘటన జరిగిన ఆరు సంవత్సరాలలో నన్ను ఎవరూ  పలకరించలేదు. నా కథ వినలేదు. నా ప్రేమను మీరు అర్ధం చేసుకున్నారు. నాకు అదే చాలు. ఇప్పుడు నాకు తృప్తిగా వుంది. నా మనస్సు శాంతించింది. ఇక వెళతాను” అని చెప్పి రెస్టారెంట్ బయటికి వెళ్ళి చీకటిలో కలిసిపోయింది… జూలి.

కొద్ది సేపటికి ‘సబ్‌వే’ ఎక్కి  ‘క్వీన్స్’ బయలుదేరాం. ఇద్దరికీ కొంచెం ఇబ్బందిగానే వుంది. హఠాత్తుగా రఘు అన్నాడు. “అతని పూర్తి పేరు వినోద్ కుమార్ కదూ!”

“అవును ఉస్మానియాలో 89th బ్యాచ్” అన్నాను.

“యస్! అతను ‘వినూ’ యూనివర్సిటీ టాపర్. రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు. మేం కూడా అతనిని  పట్టించుకునే వాళ్లం కాదు.

కొద్దిసేపు ఆగి “అయ్యో అతనికి ఇలా అయ్యిందా!” అని తెగ బాధపడిపోయాడు.

179 స్ట్రీట్‌లో సబ్‌వే నుంచి బయటకు వచ్చి, రూమ్ వైపు నడుస్తున్నాం. బయట వాతావరణం చల్లగా వుంది. అప్పుడే చందమామ ఆకాశంలో ప్రశాంతంగా ప్రకాశిస్తున్నాడు.

“ఈ ఎటాక్‌లో తొంభై దేశాలకు చెందిన మూడు వేలమంది చనిపోయారు తెలుసా!”

“ఎవరైతేనేం రెండు పక్కలా అమాయకులే బలౌతున్నారు” అన్నాను.

రఘు కొద్ది సేపు ఆగి “ఒక మనిషి చనిపోతే వారి ఆత్మీయుల జీవితాలు ఎంత చిన్నాభిన్నం అయిపోతాయి?…నేను సమాధాన పడలేక పోతున్నా” అన్నాడు.

రఘు వెళ్ళి చాలా రోజులయ్యింది. ఓ రోజు హఠాత్తుగా “జూలీ” గుర్తుకు వచ్చింది. ఏం చేస్తోందో పిచ్చి పిల్ల అనుకున్నాను. ఫోన్ ట్రై చేసాను. అసలు ఆ ఫోను నంబరే లేదు. ఈమెయిల్ వెళ్ళింది. రెస్పాన్స్ లేదు. జూలీ ని  మేం కలిసి సంవత్సరం అయ్యింది. బహుశా ఆ రోజు వినోద్ పుట్టిన రోజు అనుకుంటా! ఆ రోజు నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. కొత్త భవనాలు పైకి లేస్తున్నాయి. అవి ఎంతో బాగా వున్నా నాకు అందంగా కన్పించలేదు. ఆ రెయిలింగ్ వార కొన్ని ఫోటోలు, పూలగుచ్చాలూ, వెలుగుతున్న కొవ్వొత్తులు కనిపించాయి. అన్నీ జాగ్రత్తగా చూసాను. వినోద్ ఫోటో కనిపించలేదు. ఓ రోజు మధ్యాహ్నం  ఆఫీసు ముగించుకొని, వాల్‌స్ట్రీట్ మీదుగా నడిచి వస్తుంటే జూలీ గుర్తుకు వచ్చి, పోలీస్ ఇన్ఫర్‌మేషన్ కౌంటర్ దగ్గర, 9/11 మృతుల సమాచారం కోసం ప్రయత్నం చేశా. వాళ్లు వేరే ఆఫీసుకు పేర్లు చెప్పారు. ఆ శోధనలో చివరిగా ఓ చోట ఆగాను. ఆ ఆఫీసర్ వాళ్ల పేర్లు ఇచ్చాడు.

“వాళ్ళూ మీకు ఏమౌతారు?” అని అడిగాడు.

“వాళ్ళు నాకు కొంచెం తెలుసు. వారి బంధువులకు ఈ విషయం తెలుసో లేదో అని అనుమానం. కొంచెం సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతో..” అని అన్నాను.

” ఓ పది నిమిషాలు ఆగండి” అన్నాడూ. తన పని ముగించుకొని నా కళ్ళలోనికి చూస్తూ అన్నాడు. “వాళ్ళిద్దరూ ప్రేమికులు అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఆ రోజే చనిపోయారు” అన్నాడు.

నాకు ఆశ్చర్యం, భయం.. కొద్ది రోజుల క్రితం జూలీతో జరిగిన సంభాషణలు చెప్పాను. ముందు ఆశ్చర్యపోయాడు. తరువాత చెప్పడం ప్రారంభించాదు.

“నేను స్వయంగా పోస్ట్‌మార్టంలో పాల్గొన్నాను. వారి రికార్డు నేనే చూస్తున్నాను. ఆ రోజు జూలీ రెండో భవనం కూలిపోతున్నప్పుడు అటువైపు పరుగు పెట్టింది. ఇంతలో ఆ భవనం కూలిపోయింది.

విచిత్రంగా ఇద్దరి దేహాలూ ఓ చోటే దొరికాయి. ఇది ఒక మిరకిల్. వారి డైరీలు, వాలెట్లు చూసి వాళ్లని గుర్తుపట్టాం. కానీ వీరిద్దరి బంధువులెవరూ క్లైమ్ చేయలేదు. మీరైనా ఒక ప్రయత్నం చేయండి” అన్నాడు.

ఏదో పొరపాటు జరిగి వుంటుంది. జూలీ బ్రతికే వుంది. మేం చూసాంగా అనుకొన్నాను. కానీ జూలీ తన గురించి చెప్పిన విషయాలు, ఆఫీసర్ చెప్పిన విషయాలు ఒకే రకంగా వున్నాయి. నేను పూర్తిగా అయోమయంలో పడ్డాను.

మళ్ళీ ఆఫీసర్‌ని కలిసినప్పుడు వారి ఫోటోలు తీసుకున్నాను. వాటిని ఆ రెయిలింగ్ వద్ద పెట్టి కొవ్వొత్తులు వెలిగించాను. అక్కడ ఊదారంగు తులిప్ పూలగుత్తులు ఉంచాను. వారి ఆత్మలు శాంతించాలని మనస్సులో ప్రార్ధించాను.

రఘు ఇండియా వెళ్ళినప్పుడు వినోద్ బంధువుల కోసం గాలించాడు. దూరపు బంధువులు దొరికారు. కానీ వారు పట్టించుకోలేదు. పైగా వినోద్ అమెరికాలో వుండి, తమకు ఏ సహాయం చెయ్యలేదని ఆరోపణలు చేసారు. రఘు చాలా నొచ్చుకున్నాడు.

ఇంతకీ ‘జూలీ’ బ్రతికి వుందా చనిపోయిందా? నేను నిర్ధారణ చేసుకోలేకపోయాను. ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ప్రతీ సంవత్సరం అదే రోజు జూలీ కోసం నా కళ్ళు అన్నివైపులా వెతుకుతుండేవి. వినోద్ జూలీకి ఇచ్చిన ఆ రింగ్ నా పర్స్‌లో భద్రంగా వుంది.

ఈ ప్రేమ కానుక ఎక్కడికి చేర్చాలి??

 ***

Front Image: Mohan
Download PDF

8 Comments

  • ఒక వాస్తవం. ఒక బాధ. ఒక చిన్న మిస్టరీ. భలే వుంది కథ.
    మీ “న్యూయార్క్ కథలు” కు శుభాభినందనలు.

  • Anil reddy says:

    కథ చాల బాగుంది కుమార్ గారు…..!

  • Anil reddy says:

    కథ, కథ వెనక కథనం మరియు మోహన్ గారి బొమ్మలు అధ్బుతం గ వున్నై….మీ పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాం…

  • రాజేషు దేవభక్తుని says:

    మొదటగా, కధ బాగుంది, కాని కధలోని విషయం బాధాకరమైనది.

    అతివాద భావాలు కలిగి ఉండటం అంటే, ఒక దేశంపైనో లేక ఆ దేశంలోని మనుషుల మీదో ద్వేషం పెంచుకోవడం కాదు. ఆ దేశ విధానాలు / వ్యవస్థ / ఇతర దేశాలతో అనుసరించే విధానం పై నిరసన లాంటివి పరిగణలోకి తీసుకోవచ్చు.

    మీరు ఉగ్రవాది దాడి వలన అమెరికాలో జరిగిన నష్టం గురించి రాయడం ఒక పార్శ్వం అయితే, అమెరికా, ఆఫ్గనిస్తాన్ లో సైనికులు,ఇతర దాడుల ద్వారా చేయిస్తున్న అరాచకం ఇంకో పార్శ్వం. అక్కడ హీనపక్షం 3000 కు మూడింతల మంది అమాయకులు అన్యాయం అయ్యుంటారు.

    అంతెందుకు సంవత్సరాల తరబడి భార్యా పిల్లలను, వారి కుటుంబాలను కలవలేని ధీన స్థితిలో అక్కడే పనిచేస్తున్న అమెరికా సైనికులపై ఉన్న మానసిక వత్తిడి, దానివలన సైన్యంలో జరుగుతున్న ప్రతిక్రియలు ( తరచుగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం లాంటివి ) చుస్తే తెలుస్తుంది మహా గొప్ప అమెరికా విధానాలు.

    ప్రపంచంలో ఏ ములకెళ్లినా ఒక మనిషిగా మానవత్వం ముందు తరవాతే అన్ని అని అనుకుంటే ఏ బాధ ఉండదు.

    మీరన్నట్లు ప్రాణం లేని వస్తువైనా కొన్ని సంవత్సరాలు మనతో ఉంటె, వాటితో అనుభంధం / ఆ జ్ఞాపకాలు వీడలేము, అంత సున్నితమైన మనసులు మనుషులవి. కాని స్వలాభం కోసం ” పాట్రీస్ లుమాంబా ” ని సి.ఐ.ఏ ద్వారా హింసకు గురి చేసి, తన జుట్టు తనతోనే తినిపించి కర్కశంగా చంపించిన పాషాణ తత్వం వ్యవస్తది.

    ఏ ఒక్కరికి ఒకే విధమైన ఆలోచనలు, భావాలు ఉండవు, భావాల ప్రేరణతో నేను ఈ దేశంలోనే ఉంటాను అనుకుని, పరిస్థితుల ప్రభావం వలన / బ్రతుకు తెరువు కోసం మనం కలలో కుడా ఊహించనట్ట్లుగా అదే ప్రాంతానికి వెళ్ళవలసిరావచ్చు. ఏదైనా, ఏమైనా తోటి వారిని మనవలె చూడగలిగినంతవరకు ఎక్కడైనా ఒక్కటే.

  • మనసుకు హత్తుకునేలా రాసారు..చాల బాగుంది.

  • కదిలించే కథ. చాలా బాగా వ్రాశారు కుమార్ గారు.

  • బ్రిలియంట్!. అప్పటిదాకా జరిగిన కథ వేరు, జూలీని తొలిసారి కలిసి సంవత్సరమైన తరవాత తిరిగిన మలుపు ఈ కథని ఓ పది మెట్లు పైకెత్తింది. absolutely brilliant.

  • ns murty says:

    మీ కథలో Twist జూలీ పాత్రని మలచిన తీరులో ఉంది. ఈ రకమైన కథా వస్తువుకి అటువంటి mystic element బాగా దోహదం చేస్తుంది. చరిత్ర చదవడం వేరు. దాన్ని ప్రత్యక్షంగా చూడడం వేరు. దాన్ని రికార్డు చెయ్యడం వేరు. మీరు ఒక చారిత్రక సంఘటనని చక్కగ రికార్డు చేశారు. మీ కథ లో weak element రఘు పాత్ర. మీ కథ వెనక కథ కూడా బాగుంది కూనపరాజు గారూ. మీకు హృదయపూర్వక అభినందనలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)