పదేళ్లుగా వెంటాడుతున్న ప్రళయ కావేరి!

ramasundari

అమ్మంటే కన్నతల్లి మటుకే కాదు. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.

-స.వెం.రమేశ్ Quote

ప్రళయ కావేరి కథలు…

ఈ కధలు పదేళ్ళ క్రితం నా ఆదివారపు ఉదయాలను సమ్మోహపరిచేవి. ఆ కధన సుగంధాలను రోజంతా ఆస్వాదించి, సోమవారం కాలేజ్ లో హరిత, నేను మళ్ళీ నెమరేసుకొనే వాళ్ళం. ఆ నాలుగు నెలలు ఈ కధలు మమ్మల్ని నవ్వించి, ఏడిపించి, కోపించి, స్నేహించి, బోధించి, గాలించి, గాయపరచి, నయం చేసి, చిరునవ్వుతో మాయమయ్యాయి. పదేళ్ళ తరువాత ఆ కధలు ఈ మధ్య నన్ను వేటాడటం మొదలుపెట్టాయి. దానికి కారణం  నాకు పక్షుల మీద పెరిగిన ఆసక్తి  ఒక్కటే కాదు. ఆ కధల సమ్మోహనత్వాన్ని మరింత కావలించుకోగలిగిన మనః పరిణితి పెరగటం కూడా అనుకొంటాను.

ఇటీవల మళ్ళీ ప్రాచుర్యం లోకి వచ్చిన శ్రీ రమణ ‘మిధునం’ కధ కూడ ఈ పుస్తకాన్ని నాకు గుర్తు చేసింది. ఈ కధలను రాసిన  కాలమాన, భౌగోళిక, చారిత్రక నేపధ్యంలో ఉన్న భిన్నత్వం, ఆయన కధావస్తువుగా ఎన్నుకొన్నసామాజికవర్గం, అన్నిటికి మించి ఆయన కధాస్థలాన్ని, కధలలోని పాత్రలను ప్రేమించి రాసిన వైనం నాకు పలు సార్లు గుర్తుకు వచ్చి మళ్ళీ ఈ కధలను చదవాలనే కోరిక పెరిగింది. ప్రళయ కావేరి ప్రాంతానికే (ఇప్పటి పులికాట్) పరిమితమైన  ప్రత్యేక మాండలికం, పక్క జిల్లావాసిగా నేను అర్ధం చేసుకోగలటం కూడా నన్నీ కధలలో మమేకం చేయగలిగింది .

ఈ పుస్తకం కోసం నేను ప్రయత్నం చేస్తూనే పులికాట్ కు గత డిశంబర్ లో ప్రయాణం కట్టాను. పక్షులను చూడాలనే వంక పెట్టాను కాని ప్రళయ కావేరి  దీవులను చూడచ్చు అనే కోరిక కూడా ఉండింది. నేను పులికాట్ వెళుతున్నవిషయం విని మా అమ్మ “మీ తాతలు అక్కడ నుండే వలస వచ్చారట” అని చెప్పింది. అయితే పరిమితమయిన సమయం, వనరులు మమ్మల్ని శ్రీహరి కోట వరకు మాత్రమే తీసుకొని వెళ్ళ గలిగాయి. ఊరుకోలేక  రోడ్డు దిగి పులికాట్ లో అడుగు పెట్టాను. అడుగు, అర అంగుళం మేర కూరుకు పోయింది. “మే బద్రం! మీ గెట్టి నేలోళ్ళు మా అడుసు నేలలో నడవటం చెతురు కాదమ్మే!” అని వెంకన్న తాత సైగ్గా నుల్చుని చెప్పినట్లనిపించింది.

ఈ పుస్తకం నాకు దొరికి, పుస్తక పరిచయం రాయాలని అనుకొన్నప్పుడు; పరిచయం కాదు ఈ కధలు మీద ఒక పరిశోధనే జరగొచ్చని అనిపించింది.  నిజానికి ఈ పుస్తకం ఒక నడిచిన చరిత్ర. ఒక పర్యావరణ శాస్త్రం. పరిణామ క్రమాన్ని, సామాజిక శాస్త్రం తో కలబోసి మనకు అందించిన విజ్ఞానం. ముఖ్యంగా ఈ ప్రాంత మాండలికానికి చెందిన సొగసు చదువరులకు గిలిగింతలు పెడుతుంది.  ‘ఉత్తరపొద్దు’ ప్రచురణ కాగానే మొదటి స్పందన దాశరధి రంగాచార్య నుండి వచ్చిందట. “ఉత్తరపొద్దు  తెలుగు పున్నమి వెన్నెల్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకు చక్కదనం, కలుపు మొక్క లేని తెలుగు పంట” అని స్పందించారు. కలుపు మొక్కలేదు అనటం లో ఆయన అర్ధం ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడ ఈ కధల్లో వాడక పోవటం కూడా  అనుకొంటాను.

అంతరించిపోతున్న చాలా తెలుగు పదాలని ఈయన ఈ కధలలో నిక్షిప్తం చేసారు. ఇక సామెతలు, ఉపమానాలు, నుడికారాలు పుష్కలంగా; తెలుగు సాహిత్యాభిమానులకు మనసు నిండుగా ఉన్నాయి. అక్బర్ గారు, చిదంబరం గార్ల స్కెచ్ లు మనలను కధలలోకి నేరుగా లింక్ చేస్తాయి. ఆ మాండలికంలో మనకు అర్ధం కాని పదాలకు ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు.

kaveriప్రళయ కావేరి దీవుల్లో నడిచే ఈ కధలన్నీ ఒక బాలుడి భాష్యంతో నడుస్తాయి. ఈ దీవుల్లో ఒకటైన ‘జల్లల దొరువు’లో ఉంటున్న తాతా, అవ్వల దగ్గరికి సెలవల్లో గడిపి, అక్కడి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనాన్నిరచయిత  ఆకళింపు చేసుకొని పెద్దయ్యాక తన భాషాపరిజ్ఞానంతోను, సామాజిక సృహ తోనూ రాసిన కధలివి. శంకరంమంచి ‘అమరావతి కధలు’, వంశీ ‘పసలపూడి కధలు’ ఖదీర్ బాబు ‘దర్గామిట్ట కధలు’, నామిని ‘పచ్చ నీకు సాక్షిగా’.. ఇవన్నీ ఒక ప్రాంతానికీ, రచయితకి ఉన్న అనుబంధానికి చెప్పిన అందమైన భాష్యాలే. కాని ప్రళయ కావేరి కధల్లో అనుబంధంతో పాటు ఆ ప్రాంత భౌసర్గిక స్వరూపం,  ఆహారపు అలవాట్లు, వారి సాంస్కృతిక జీవనానందాలు ,వాళ్ళ పంటలు, పిల్లల ఆటపాటలు, స్రీల జానపదాలు, పొడుపు కధలు….వీటన్నిటి వర్ణన ఉంటుంది. ఇదంతా ఎంత హృద్యంగానంటే గుండె మార్పిడి జరిగినట్లు; రచయిత అనుభవం, అనుభూతి సంపూర్తిగా పాఠకుడికి బదిలీ అవుతుంది.

రచయిత జీవితాన్ని అన్ని ముఖాల్లోంచి దర్శిస్తాడు . ప్రళయ కావేరి కధల రచయిత స.వెం.రమేశ్ అందులో పూర్తిగా సఫలీకృతం అయినట్లు నాకు అనిపించింది. ఈయన తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం పూర్తి కాలం పని చేస్తున్న కార్యకర్త.  చదివిన చదువు మానవ సమాజ పరిణామ క్రమం, తెలుగులలో రెండు ఎమ్మేలు.

రచయితకు తన తాతే బోధకుడు, తాత్వికుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని   పదాడంబరంతో కాకుండా సహజమైన సహవాసం, సాన్నిహిత్యంతో మనకు అర్ధం చేయిస్తాడు రచయిత. “అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.” అని నేర్పిన తాత రుణం ఈ కధలు రాసి తీర్చుకొన్నాడు రచయిత.

ఈ కధల నాయకుడు వెంకయ్య తాత మన రచయితను తన భుజాలమీద ఎక్కుంచుకొని లెక్కలు నేర్పాడు. “అబ్బయా! సేరుకి రెండు అచ్చేర్లు. ఒక అచ్చేరుకి రెండు పావుసేర్లు. పావుసేరుకి రెండు చిట్లు. రెండు బళిగలయితే ఒక చిట్టి. దాని కన్న చిన్నది ముబ్బళిక. అన్నింటి కన్న చిన్న కొలత పాలాడ. మూడన్నర సేరు ఒక ముంత. నాలుగు ముంతలు ఒక కుంచాము. రెండు కుంచాలు ఒక ఇరస. రెండు యిరసలయితే ఒక తూము. ఇరవై తూములు ఒక పుట్టి. రెండు తూములయితే యిద్దుము. మూడు తూములయితే ముత్తుము….పది తూములయితే పందుము.” (పుబ్బ చినుకుల్లో)

” ముక్కు కింద సంచి మాదిరి యాలాడతుండాదే అది గూడబాతు. బార్లు దీరి నిలబడుండేటివి కాళ్ళ ఉల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతావుండేటియి గుండు పుల్లంకులు. అద్దో! ఆ జత తెడ్డుమూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరెడు ముక్కుతో, పసురువన్నె రెక్కతో సొగసుగా వుండేది  ఎర్రకాళ్ళ కొంగ…….” ఇలా పక్షిశాస్త్రాన్ని భోదిస్తాడు. (కొత్త సావాసగాడు)

ఇక చేపల రకాల గురించి చెబుతూ  “ఆ తట్టు యెండి మాదిరి మెరుస్తుండాయే, అయ్యి వంజరం చేపలు. అల్లా సప్పిటి మూతియి వాలగలు. వాలగ బలే వాతపు చేప. నాలుగునాళ్ళు వరుసగా తిన్నామంటే, కాళ్ళు, కీళ్ళు కదలవు. వుల్లంకుల వన్నెవి కానాగంతలు.   తెడ్డు అమ్మిడ మూరెడు పొడుగు ఉండాయే, అవే మాగ చేపలు. సముద్ర చేపల్లో మాగంత రుసి యింకేది వుండదు. అయి తుళ్ళు సేపలు. వొట్టి ముళ్ళ కంపలు. పాము మాదిరి సన్నంగా వుండేటివి మొలుగులు, నోట్లో యేసుకొంటే యెన్న మాదిరి కదిరి పోతాయి.” (సందమామ యింట్లో సుట్టం)

కోస్తా తీరం వెంబట  పెరిగిన నేను ఈ చేపలన్ని రుచి చూసాను.

ఈ కధలలో ప్రధాన పాత్రలను పక్కన బెడితే, కొద్ది సేపున్నా నన్ను అత్యంత ప్రభావితం చేసిన పాత్ర గేణమ్మ. (కత్తిరి గాలి) వెంకన్న తాత అక్క కాశెమ్మవ్వ కూతురు. “గేణమ్మవ్వ మంచిది” అని తనలోని బాలుడి చేత చెప్పించి, గేణమ్మ ఎంత పని చేసేదో రచయత తన ఎదిగిన మెదడుతో చెబుతాడు. “ఇల్లంతా బూజులు గొట్టి చిమ్మింది. పాలవెల్లి దించి శుద్దం చేసింది. పరంటింట్లో, సుట్టింట్లో యాడన్న గుంటలు పడుంటే బంకమట్టి పూసి సదరం చేసింది. పేడేసి యిసిరంగా అలికింది. పరంటింటికి సున్నం గొట్టి యెర్రమట్టి వోరు తీసింది. బొట్టల క్రింద కలుకుల్లో పొగపెట్టి యెలికల్ని తరిమింది. మునగ చెట్టుకు పట్టిన కమ్మిటి పురుగుల్ని యెదురు కర్రకు మసేలిక సుట్టి గబ్బుసమురుతో ముంచి మంట కాల్చి చంపింది. మల్లి గుబురుకి పాది చేసి, ఆకు దూసి నీళ్ళు పోసింది. ”

ఇలా రెండు పేరాలు రాసి చివర్లో “ఇరవై కాళ్ళు, ఇరవై చేతుల్తో వొంటి మనిషి వొకటే మాపన కత్తిరి యెండల్ని లెక్కబెట్టకుండా పన్లన్నీ చేసింది గేణత్త” అంటూ ముగిస్తాడు. ఈమెలో మనకు మానవపరిణామక్రమంలో నాగరికత అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆదిమకాలంనాటి స్త్రీ మూర్తి ఆవిష్కరిస్తుంది. ఒక్క గేణమ్మే కాదు, మండుటెండలో దాహంతో అల్లాడుతున్న బాలుడికి తన చనుబాలుతో బతికించిన వసంతక్కలో కాని, దిగులుతిప్పలో కూరుకుపోయిన బాలుడ్ని రక్షించటానికి తన ఎనిమిది గజాల కోకను ఇప్పేసి బిత్తలిగా నిలబడిన సుబ్బమ్మవ్వలో కాని; భుజానికి బిడ్డలను కట్టుకొని వేటాడి కడుపులు నింపిన మాతృసామ్య మహిళలే కనబడతారు కాని, అనుక్షణం స్త్రీత్వం ఆపాదించి రొమాంటైజ్ చేయబడిన నేటి సాహిత్యంలోని దౌర్భాగ్య స్త్రీ పాత్రలు కనబడవు.

ఇంకొక ఆసక్తికరమైన పాత్ర వసంతక్క. అడవిలో నల్లబావతో కలిసి రాత్రంతా కాపలాకాసి పట్టిన చెవుల పిల్లులను (కుందేళ్ళు) నల్లబావ భోంచేస్తాడని  “అకా! ఇంత కష్టపడి పట్టుకొనింది సంపేసేదానికా” అని బాలుడు కన్నీళ్ళు పెట్టుకోగానే వాటిని వదిలిపెట్టి నల్లబావకు “సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి.” అని ముసిముసిగా నవ్వుతూ జవాబు చెబుతుంది. (సందమామ యింట్లో సుట్టం)

ఈ కధా కాలం ఎనభైవ దశకం అనుకొంటాను. అప్పటికీ ప్రళయకావేరి దీవుల్లో భాగాతాలు, నాటకాలు, వాటిని చూడటానికి పక్క దీవుల నుండి చుట్టాలు బండ్లెక్కి రావాటాలు ఇవన్నీ ఉండేవి. పల్లెల్లో సాంస్కృతిక కాలుష్యం గురించి రచయిత తన ఆవేదనను కధలో జొప్పించాడు. “మా కడగళ్ళు దేనికి అడగతావులే సోమి! పేటలో సినిమా ఆటంట, పెద్ద కొట్టాం కట్టి , దాంట్లో దినానికి రొండాట్లు ఆడతా వుండారు. పేట చుట్టు పక్కల వూళ్ళల్లో యిప్పుడు భోగాతాలు సూసే వాళ్ళే లేరు. నెమిలాటలు లేవు. పామాటలు లేవు. కీలు గుర్రాలు లేవు. మరగాళ్ళు లేవు. యీరదాళ్ళు లేవు, పంబజోళ్ళు లేవు.యానాది చిందుల్లేవు, యీరబద్ర పూనకాలు లేవు.” (కాశెవ్వభోగోతం) ఇక్కడ ఒక సమాజంగా బ్రతికిన కులాలు పెద్దీటి గొల్లలు, యానాదులు, తూరుపు రెడ్లు, వెలమలు, బేరిశేట్లు, పట్టపు కాపులు, దేశూరి రెడ్లు.

రచయితలోని భావుకుడు కధకొక సారైనా తొంగి చూస్తాడు.

“సలికాలం సాయబోయిన అమ్మ నేతకోక, వానాకాలం చిక్కంగా అల్లిన జమ్ముగూడ, యెండాకాలం సల్లని కానగమాను నీడ; యీటిల్లోమునిగి, ముదుక్కొని, వొదిగి, వొళ్ళిరుసుకోని బతుకు దేనికి?”

“ఆకాసం నుండే సుక్కలన్నీ అడివిలోకి వొచ్చేసినుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకు మిస మిస మెరిసి పోతుండాది. అడివమ్మ ఒల్లంత తళుకులు అంటుకొనీ తళతళమంటా వుండాయి.” (మిణిగురు పురుగుల వర్ణన).

“నీలమంటే అట్టాంటిట్టాంటి నీలం కాదు, కావేరమ్మను పలకరించను మిన్ను దిగొచ్చినట్లు, మిన్నువన్నె మన్నువన్నె కలిపి మిసమిస లాడే నీలం”.

“సడీ, సందటి లేకుండా సందకాడ సల్లంగా కురిసి పోయ్యింది వాన. తల్లాకిట అవ్వేసిన సంద ముక్కర్ర, వానతో పాటు వీధి పెత్తనానికి పొయ్యింది. దడి పక్కన ముడుసుకొని కూసున్న మల్లి గుబురు, పుట పుట చినుకులు రాలతోనే వొళ్ళు ఇరుసుకొని, తెల్ల పూల కోక కట్టుకొనింది. మల్లె గుబురు పైనుంచి వొచ్చిన వానగాలి, సల్లటి వాసనతో నాకు సక్కలిగిల్లి పెట్టి, పరమటింట్లో పటాలకు మొక్కను పొయ్యింది.”

ఇలాంటి గిలిగింతలు పెట్టే పదలాలిత్యం పుస్తకమంతా తొణికిసలాడుతూ ఉంటుంది.

అక్షరాలతో నోరూరించగలిగాడు ఈ కధకుడు.

“వొంగొగురు, యిసిక మెత్తాళ్ళు. కలిపి యెగరేసుకొంటే, సట్టిడు కూడు సడీ సప్పుడు లేకుండా లోపలికి ఎల్తాది.”

“అటికి మామిడాకులో పెసల పప్పేసి యెణిపినబయా”

“ పెసర పొప్పులో పుట్ట కూడేసి యిగరేసుకొంటే, ఆ రుసి చెప్పబళ్ళే!”

ఇక అవ్వ చేతి చిరుతిళ్ళు చూడండి. “తంపటేసిన గెణుసు గడ్డలు, యేంచిన చెనక్కాయలు, సద్దనిప్పట్లు, ఉడకేసిన బెండలం గెడ్డలు. నిప్పట్లు, మణుగుబూలు, పులుసన్నం, రవ్వుంటలు, చెనగుంటలు, బొరుగుంటలు, మూసుంటలు, చిమ్మిరుంటలు, తైదుంటలు, పెసలుంటలు, నువ్వుంటలు, సాపట్లు, దూపట్లు, దిబ్బట్లు, చీపిరొట్లు, తెదురొట్లు, పాకం పోరలు, కమ్మరట్లు, అలసందొడలు, పులిబంగరాలు, సియ్యాళ్ళు, కారామణి గుగ్గిళ్ళు”

ప్రళయ కావేరి వాసుల ప్రధాన పంట తమదలు (రాగులు). (ఏడాదికి రెండు వానలు పడితే పండే తమదలను వదిలేసి దండిగా నీరు కావాల్సిన వరిపంటను పండించటం గురించి రచయత బాధ పడ్డాడు.) చిక్కని మజ్జిగ కలిపిన అంబలి చిన్నతపీలుడు తాగటం, నెల్లి చెట్టు కింద కూసోని దోసిట్లో వేసిన సద్ది కూడు కిచ్చరగాయ(నారింజ కాయ) ఊరగాయతో తినటం,,,నా ఊహ తెలిసాక మా అమ్మమ్మ చెబుతుంటే యిలాంటివి విన్నాను.

ఇక అవ్వ “యాడ్నించి తెస్తాదోగానీ, అటిక మావుడాకు, నాసరజంగాకు, పొప్పాకు, యెన్నముద్దాకు, చెంచులాకు, బచ్చలాకు, కోడి జుట్టాకు, ముళ్ళ తోటాకు, చామాకు, బొక్కినాకు, దొగ్గిలాకు, కాశాకు, తుమ్మాకు, మునగాకు, అవిశాకు,….యిట్టా ఎన్నో రకాల ఆకులు తెచ్చి కూరలు చేస్తుంటాదవ్వ. ఆ పొద్దు కూడ చెంచలాకు కూర చేసుండాది.” ప్రళయ కావేరి దీవుల్లో  ఫల సంపద పాలపండ్లు, కలిగి పండ్లు, బీర పండ్లు, బిక్కిపండ్లు, నిమ్మటాయలు, ఊటి పండ్లు, గొంజి పండ్లు, బలిజ పండ్లు, ఎలిక చెవులు, పిల్లొట్టాలు, చిట్టీతకాయలు, అత్తిపొండ్లు, నుంజలు (ముంజలు). ఈ ఆహారాలతో పెరిగిన మన రచయత అంత ఆరోగ్యమైన రచనలను మనకందించాడు.

ఈ పిట్టల పేర్లు మీరెప్పుడైనా విన్నారా! “చిలుకలు, గోరింకలు, బెళవాయిలు, జీని వాయలు, గోరింకలు, చిలవలు, చింతొక్కులు, టకు టకు పిట్టలు, జిట్టి వాయిలు, పాల పిట్టలు, వూరికాకులు, జెముడుకాకులు, పందిట్లో పిచుకలు, యింట్లో కోళ్ళు, గిన్నె కోళ్ళు. యింటి ఆవరణంతా ఒక తూరి తిరిగితే, యెన్ని వన్నెల యీకలు దొరకతాయో చెప్పలేము.”

ప్రళయ కావేరి పిల్లల బాల్యాన్ని పండిచిన ఆటలు: మగపిల్లల ఆటలు కోతికొమ్మచ్చి, కోడుంబిళ్ళ, వుప్పరపిండి, పిళ్ళారాట, వొంటి బద్దాట, రెండు బద్దీలాట. ఆడపిల్లల ఆటలు వామన గుంటలు, అచ్చంగాయలు, గెసిక పుల్లలు, గుడుగుడు గుంజెం, చికు చికు పుల్ల, బుజ్జిల గూడు, బుడిగీలాట, కుందాట, కుర్రాట, మిట్టాపల్లం, వొత్తిత్తి సురొత్తి. (ప్చ్. మన పిల్లలు ఎంత దురదృష్టవంతులో!)

రచయితకి ప్రాచుర్యం అవార్డుల ద్వారా రాదు. ఆయన సృష్టించిన పాత్రలలో పాఠకులు ఎంత మమేకం అయ్యారో అనే దాని మీదే వస్తుంది . ఆ రకంగా ఈ రచయత ధన్యత చెందినట్లే. ఒక పాఠకుడు కధలోని పాత్రలు నిష్క్రమించటం మీద కోపం  ప్రకటిస్తూ ఉత్తరం రాసారు. ఎప్పుడైనా ‘జల్లల దొరువు ‘ వెళితే ఆ పాత్రలు తమను ఆహ్వనించాలట. ఒక పాఠకుడు “నేను తప్పిపోయిన లోలాకులగాడ్ని” అంటూ ఉత్తరం రాసారు. ఒక పాఠకురాలు “నేను గుండుపద్నను రా” అంటూ.  అంతగా పాఠకులు ఈ కధలలో ఇన్వాల్వు అయ్యారు. పాఠకులందరూ కోరుకొన్నట్లుగా స.వెం.రమేశ్ గారి  నుంచి ఇంకా ఎంతో మంచి సాహిత్యాన్ని నేనూ కోరుకొంటున్నాను.

ప్రతులకు:

http://kinige.com/kbook.php?id=478&name=Pralayakaveri+Kathalu

 

Download PDF

43 Comments

  • చక్కటి పరిచయం. చదివి ఆనందించాను.

    • రమాసుందరి says:

      థాంక్యూ ఇస్మాయిల్ గారు.

    • chittipati venkateswarlu says:

      చన్దిఘర్హ్ వెళ్లి దురంయ్యవని అనుకున్న కానీ ఇటీవల ని నిర్జనవరాది పుస్తక పరిచయం , కవిత , నేడు సారంగ కతలు పరిచయం చదివాకా చాల ఆనందంగా ఉంది. చాల పరిణితి అబివృద్ది కనిపిస్తుంది. రివ్యు రాయడం, రాసే పద్దతి బాగుంది. మీ చిట్టిపాటి అన్న

  • ఆ కథలు చదివిన రోజులని గుర్తు చేసారు. మీ ఈ పరిచయం చదవడం ఎలా ఉందంటే ” తల్లి చనుబాలు ని మరపింప జేయడానికి బిడ్డని దూరం చేస్తారు. మళ్ళీ బిడ్డ అమ్మకి దగ్గరైనప్పుడు కుతి తో వెతుక్కునట్లు ఉంది.”

    మళ్ళీ వెంటనే చదవాలనిపిస్తుంది. ఈ రోజే మా బెజవాడ ఏలూరు రోడ్డు లో తిరిగి తిరిగి అయినా సరే “ప్రళయ కావేరి ” ని చేజిక్కుంచు కోవాలని ఉంది.

    అనుభూతి వర్షంలో తడిచి పోయాను . ధన్యవాదములు మీకు సారంగ సారధ్యం వారికి కూడా.

    • రమాసుందరి says:

      థాంక్యూ వనజగారు. ఆ కధలు నిజంగానే అమ్మ పాల లాగ తియ్యగా, ఆరోగ్యంగా ఉంటాయి. విజయవాడ విశాలాంధ్రలో నేను గత డిశంబర్ లో అడిగితే లేవన్నారు. నేను కినిగే లో చదివాను మళ్ళీ.

  • Kranthisrinivasarao says:

    రామా సుందరి గారికి
    చాలా అద్భుతంగ ప్రజెంట్ చేసారు ధన్యవాదాలు

    • రమాసుందరి says:

      థాంక్యూ శ్రీనివాస్ గారు. కాని నా పేరు రమాసుందరి. రామ సుందరి అంటే భలే కోపం వస్తుంది చిన్నప్పటి నుండి. :)

  • ns murty says:

    రమా సుందరి గారూ,
    మనసును ద్రవింపజేసే పరిచయాన్ని అందించారు ధన్యవాదాలు.
    “అనుక్షణం స్త్రీత్వం ఆపాదించి రొమాంటైజ్ చేయబడిన నేటి సాహిత్యంలోని దౌర్భాగ్య స్త్రీ పాత్రలు కనబడవు.”… ఎంత బాగా చెప్పారండి.
    “సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి.” ఎంత సౌందర్యవంతమైన ముగింపు కథకి!

    “మిన్నువన్నె మన్నువన్నె కలిపి మిసమిస లాడే నీలం”. ఆ ఆకులపేర్లూ, ఆ పళ్లపేర్లూ, ఆటలపేర్లూ వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఇప్పుడు వాటిగురించి ఎలా ఆడతారో రికార్డు చెయ్యమని రమేశ్ గారినే మళ్ళీ అడగాలేమో. అదొక పరిశోధనపత్ర మంత అవొచ్చు.
    మీ ఈ పరిచయం చదివిన తర్వాత మంచి సాహిత్యాన్ని ఇంతకాలం మిస్స్ అయేనన్న గిల్టీ ఫీలింగు నన్ను ఆవరించింది. మన నుడికారాలూ, సాహిత్య సౌందర్యం అంతా జానపద సాహిత్యం లోనే ఇంకా మిగిలి ఉందని నా భావన. చరిత్రపట్ల, జానపదసాహిత్యం పట్ల మనకు హిమాలయమంత నిర్లక్ష్యం, చిన్నచూపూ ఉన్నాయని కూడా అనిపిస్తుంది. జంతువులూ, పిట్టలూ, చెట్లూ చేమలగురించి,వనమూలికల గురించి బాగా లోతుగా తెలిసిన తరాలనీ,వాళ్ళతో పాటే వాళ్ళ పాటలనీ, పరిజ్ఞానాన్నీ పోగొట్టుకున్నామని అనిపిస్తుంది.
    స.వెం.రమేశ్ గారు మళ్ళీ కలం చేపట్టలని నేనుకూడా ఆశిస్తున్నా. మీకు మరొక్కసారి ధన్యవాదాలు.

    • రమాసుందరి says:

      మూర్తి గారు, నా పరిచయం మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కధలు మీరు నూరు శాతం ఇష్టపడతారు. నేను కధల్లోకి వెళ్ళ లేదు. అవి ఎవరికి వారు అనుభూతి చెందాల్సిన కావ్యాలు.

  • rahamthulla says:

    ఈ పుస్తకం నేను రెండు సార్లు చదివాను.రమేశ్ గారితో కూడా మాట్లాడాను.ఆయా ఘట్టాలలో మీ స్పందన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా గేణమ్మత్త ,లోలాకులుగాడు… ఇత్యాది పాత్రలు నన్ను మల్లి నా బాల్యంలోకి తీసుకెళ్ళాయి.తిరనాళ్ళలో తప్పిపోయిన లోలాకులుని తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది.మీరు చెప్పినట్లు ఈ పుస్తకంలో “భుజానికి బిడ్డలను కట్టుకొని వేటాడి కడుపులు నింపిన మాతృసామ్య మహిళలే కనబడతారు కాని, అనుక్షణం స్త్రీత్వం ఆపాదించి రొమాంటైజ్ చేయబడిన నేటి సాహిత్యంలోని దౌర్భాగ్య స్త్రీ పాత్రలు కనబడవు” .భాష పరంగా కూడా మన పెద్దోళ్ళ పలుకులన్నో మూటగట్టి భద్రం చేసిన పుస్తకం ఇది.మరచిపోలేని పుస్తకం.నామిని రాసిన “పచ్చ నాకు సాక్షిగా “.మిట్టోరోడి కధలు”,”కన్నగాడి సేద్యం” లలో కూడా మరపురాని కధలున్నాయి .

    • రమాసుందరి says:

      రహంతుల్లా గారు. థాంక్స్ అండి. ఆయన ఫోన్ నంబర్ కాని మైల్ ఐడీ కాని ఇవ్వగలరా?

      • rahamthulla says:

        రమా, స.వెం.రమేశ్ ప్రస్తుత నంబరు సామల రమేశ్ బాబు గారు (9848016136) ఇస్తానన్నారు.అందగానే తెలియజేస్తాను.

      • రమాసుందరి says:

        థాంక్యూ నూర్ భాషాగారు. :)

  • బాగుందండి. ఇటువంటి కథల్ని తలుచుకున్నప్పుడల్లా ముందు అమరావతి కథలూ, తరవాత నామిని కథలూ గుర్తు రాక మానవు. ఐతే, కథ స్వరూపం, శిల్పం వైపునుంచి చూస్తే, ప్రళయ కావేరి కథలకి ఒక విశిష్టత ఉంది. ఇవి ఏ కథకి ఆ కథ స్వంతంగా నిలబడగలవి. ఆ ప్రాంతమూ, ఆ నేలా, ఆ భాష ఇవన్నీ కూడా కథల్లో పాత్రలుగా వొదిగినా, ఇవి కూడా ఒకానొక స్థలకాలాలకి రికార్డుగా ఉన్న మంచి సోషల్ డాక్యుమెంట్లు అయినా, ఈ కథలు సజీవ జీవిత చిత్రణని కథల రూపంలోకి మలచడంలో బాగా ఉన్నత ప్రమాణాలని అందుకున్నాయని నాకనిపిస్తుంది.

    • రమాసుందరి says:

      నిజమే. మిగతా కధలకు, ఈ కధలకు చాలా తేడా ఉంది నారాయణస్వామి గారు.

  • Sai Padma says:

    రమా సుందరి గారూ, హమ్మయ్య పేరు కరక్ట్ గా టైపు చేసాను. భలే పరిచయం అండీ. అఫ్సర్ గారు తన పేజీ లో పెట్టిన పది నిమిషాల్లో నేను మీ ఈ కథల పరిచయం లోకి పులికాట్ లో కి వెళ్ళిపోయాను. కామెంట్ రాసే ధైర్యం చేయటానికి మాత్రం ఒక రోజు పట్టింది. ఎంత ప్రేమగా, పదిలంగా, రాసేరండీ. రివ్యూ నే ఇలా ఉంటె కథలు ఇంకెలా ఉంటాయో , తలచుకుంటే. మనం వదిలేసుకున్న పద సంపదలా, దాని మీద మనకున్న ప్రేమలా, వాత్సల్యం గా అనిపించింది. అర్జంట్ గా కథలు చదవాలనిపించింది. చాలా థాంక్స్, మీకు, ముఖ్స్యంగా రచయిత రమేష్ గారికి. ప్రేమతో, సాయి పద్మ

    • రమాసుందరి says:

      థాంక్యూ పద్మ. నిజంగానే ఈ కధలను, రచయత ను నేను చాలా ఇష్టపడ్డాను.

  • రమా సుందరి గారూ నమస్తె. నేను ఈ మధ్యనే మిమ్మల్ని ఎఫ్బీలో కలుసుకోవడం వల్ల మీ గురించి నాకు ఓ స్పష్టమైన ఐడియాలేదు..అసలు మీరేంటీ మీ జాన్రా ఏంటీ, మీరు కవయిత్రా, రచయిత్రా, సంఘసంస్కర్తా లేక ఆదర్శవాదిగా ఇక్కడ పరిచయమా అన్నది స్పష్టత లేకుండింది. కాన్ ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. ఇంతవరకూ సమీక్షలు ఎలా రాయాలొ ఓ ఫ్రేములో ఉండేవాణ్ణి. ఇప్పుడు అందులోంచి ఐస్ బ్రేక్ చేసుకుని బయటపడ్డాను.,దానికి మీకు ధన్యవాదాలు. ఇక ఈ పరిచయం గురించి అందరు ఏం చెప్పారో అదే నెను చెప్పగలను.

    • రమాసుందరి says:

      వాసుదేవ్ గారు. నేను ఒక పాఠకురాల్ని మాత్రమే.

  • Radha Manduva says:

    రమా సుందరి గారూ,
    నేను కూడా ప్రళయకావేరి కథల అభిమానినే. వాక్యాలు పేర్చుకుంటూ పొతూ కథలు రాయొచ్చు. కాని మాటలను ఒడుపుగా పట్టుకుని వాటిని వాక్యాలుగా కూర్చినపుడు ఆ కథకు వాస్తవికత ముఖ్యం గా దేశీయత కలుగుతుంది. అందువల్లే ఇలాంటి కథలు నిజంగా జరిగాయేమో అని అనిపిస్తాయి. కలకాలం నిలుస్తాయి.
    ఈ కధలు మిమ్మల్ని నవ్వించి, ఏడిపించి, కోపించి, స్నేహించి, బోధించి, గాలించి, గాయపరచి, నయం చేసి, చిరునవ్వుతో మాయమయ్యాయా? నాకైతే మాయమైనందుకు కళ్ళనీళ్ళు వచ్చేంతగా దిగులు కలిగింది. లోలాకుడు తప్పిపోయినప్పుడు, తాత ప్రళయకావేరిలో శాశ్వతంగా నిద్ర పోయినపుడు ఏడ్చేశాను. ఈ కథల పుస్తకం నాకు ఉమా గారు ఇచ్చారు. కథలన్నీ చదివాక ఒకటే ఆరాటం – ‘ నిజంగానే లోలాకుడు తప్పిపోయాడా? తాత ప్రళయకావేరీలోనే నిజంగా చనిపోయాడా? ‘ అని ఉమాగారికి message పెట్టాను. (ఇప్పుడు ఇది రాస్తుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు). మళ్ళీ నా పుస్తకాల ర్యాక్ లోంచి ఆ పుస్తకం తీసేట్లు చేసింది మీ సమీక్ష. కృతజ్ఞతలు – ఉమా గారికి, రమేశ్ గారికి కూడా. అమ్మో మర్చిపోయా మా నామినికి కూడా పచ్చనాకు సాక్షిగా.

    • రమాసుందరి says:

      రాధ గారు. నేను రచయిత తో మాట్లాడాను. తన కధలలోని అన్ని విషయాలు దాదాపు వాస్తవాలేనని చెప్పారు.

  • పి.సత్యవతి says:

    పుస్తకాన్ని ఆస్వాదించి చేసిన పరిచయం …దాశరథిగారు చెప్పినట్టు రమాసుందరిగారుకూడా ఒక్క కలుపుమొక్క లేకుండా చక్కని తెలుగులో వ్రాసారు(చివరికి ఇన్వాల్వ్ అని ఒకే ఒక్క మాట వుంది) ఈ పరిచయం చదివిన వాళ్ళంతా మళ్ళి ఒకసారి చదివాలని ఆ పుస్తకంకోసం వెతుక్కుంటారు నాలాగా అనుకుంటున్నాను ప్రలయ కావేరి పరిమళం పరిచయ వ్యాసంనిండా అలుముకుని వున్నది ..యువరచయిత్రులనుంచీ మంచి వ్యాసాలొస్తయని ఆస కలుగుతోంది

    • రమాసుందరి says:

      సత్యవతి గారు. మీ ఆత్మీయ ప్రశంస నాకు చాలా సంతోషాన్ని కలగచేసింది.

  • పి.సత్యవతి says:

    ఇద్దరు ముద్రా రాక్షసులను క్షమించాలి

  • వేణు says:

    ఇంతకుముందు కవర్ పేజీని యథాలాపంగా చూసి కూడా పట్టించుకోని పుస్తకమిది.

    మీ పరిచయం చదివాక, ఒక మంచి పుస్తకాన్ని మిస్పయ్యాననే భావన గట్టిగా కలుగుతోంది నాకు.

    మీ మాటల్లోనే చెప్పాలంటే – ‘ రచయిత అనుభవం, అనుభూతి సంపూర్తిగా పాఠకుడికి బదిలీ’ అయితే ఎలా రాస్తారో అలా రాసినట్టు ఉంది. ఇష్టమైన ఈ పుస్తకం కోసం దొరికేదాకా అన్వేషిస్తూనే ఆ కథా ప్రాంతాన్ని సందర్శించటం… ఇలా ఆసక్తికలిగేలా వివరించటం బాగుంది. అభినందనలు!

    మొదటిపేరా హృద్యంగా రాశారు. ముఖ్యంగా ఈ వాక్యం..
    >> ఆ నాలుగు నెలలు ఈ కధలు మమ్మల్ని నవ్వించి, ఏడిపించి, కోపించి, స్నేహించి, బోధించి, గాలించి, గాయపరచి, నయం చేసి, చిరునవ్వుతో మాయమయ్యాయి >>

    ఓ చోట మీరు ‘భౌసర్గిక స్వరూపం’ అనే పదం వాడారు. ఇది పొరపాటుగా రాసివుండొచ్చు గానీ – భౌగోళిక + నైసర్గిక కలిపితే వచ్చిన పదబంధంగా గమ్మత్తుగా అనిపిస్తోంది. :)

    లోలాకుల గాడు ఎవరు? ఎలా తప్పిపోయాడు? ఆ గుండు పద్న కథ ఏమిటి? ఇవన్నీ పుస్తకం చదివేదాకా జవాబు దొరకని ప్రశ్నలే!

    • రమాసుందరి says:

      వేణు గారు. నెట్ అందుబాటులో లేక పోవటం వలన వెంటనే రిప్లెయ్ ఇవ్వలేక పోయాను. నిజమే ఆ పదం ఇప్పుడు చదువుతుంటే నాకే నవ్వు వస్తుంది.

  • ఎన్నో ఆనందాలను మనకు మనమే విధ్వంస పరచుకున్నామన్నది అందరం ఒప్పుకోవాల్సిన నికారసైన నిజం. ఇంకా విధ్వంసాలను కొనసాగిస్తున్నామన్నది తలపులోకి వస్తే మాత్రం ఆరాత్రి నిద్రపట్టని స్థితిలో కూరుకుపోతాం.రచయిత అనుభవాలన్నింటిని , ఆనందాలను ఒకే త్రాసులో సమాంతరంగా తూచి సున్నితమైన తన ఆత్మను అక్షరాల్లో పొందికగా అమర్చినాడు.అన్వేషణల మూలాలు ఎక్కడొ దాకున్నాయని మనం చాలాసార్లు పొరబడినప్పటికి అసలు మనలొ వున్నది దాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాలన్న అంతరార్ధం మాత్రం పూలదండలోని దారమన్న ఎరికను బలంగా గుర్తుకు తెస్తుంది. పాఠకుడు తనను తాను మరచి కథల్లోని పరిసరాల్లో మమేకమై ప్రదక్షణాలు (పొర్లుడు దండాలు) చేస్తునే ఉంటాడు అన్నది పదహరు అణాల తెలుగు అన్నంత సత్యమే.రచయితను కలవాళ్ళన్న బలమైన ఆకాంక్ష మనలను బలంగా వెంటాడుతుంది. ఎన్నిసార్లు చదివిన తన్మయత్వం మాత్రం ప్రతిసారి పెరుగుతుందన్న భరోసా వాస్తవం. రచయితతో పరిచయం మాత్రం మరువజాలని, వీడని పరిమళమే.

  • పర రాష్ట్రంలో ఉన్నప్పటికి రమాసుందరి గారు సుధీర్ఘమైన తమవిశ్లేషణద్వారా ” ప్రళయ కావేరి కథలు ‘ కు ఈజగతిలో విస్తృత ప్రాచుర్యం కలిపించారు. కథలను గురించి లోతుగా చర్చించిన వారికి ధన్యవాదాలు.

    • రమాసుందరి says:

      రామాచారి గారు. మీ పక్క జిల్లానే మాది. కధల గురించి మీ అభిప్రాయం నాకు నచ్చింది.

  • >>ఇదంతా ఎంత హృద్యంగానంటే గుండె మార్పిడి జరిగినట్లు; రచయిత అనుభవం, అనుభూతి సంపూర్తిగా పాఠకుడికి బదిలీ అవుతుంది.>>

    బహుశా రచయితకు ఇంతకంటె మించిన సర్టిఫికెట్ మరొకటి ఉండదేమో! పాఠకులు ఇచ్చే అవార్డులు గొప్పవి అని రచయితలు తరచుగా చెబుతుంటారు. రమేష్ గారు పొందిన పాఠక అవార్డుల్లో ఇదే గొప్పది కావచ్చు. మరిచాను. ఇది సమీక్షకుల అవార్డు కూడాను.

    >>ఊరుకోలేక రోడ్డు దిగి పులికాట్ లో అడుగు పెట్టాను. అడుగు, అర అంగుళం మేర కూరుకు పోయింది. “మే బద్రం! మీ గెట్టి నేలోళ్ళు మా అడుసు నేలలో నడవటం చెతురు కాదమ్మే!” అని వెంకన్న తాత సైగ్గా నుల్చుని చెప్పినట్లనిపించింది.>>

    సమీక్షలో చెప్పినట్లు “రచయిత అనుభూతి, అనుభవం సంపూర్తిగా పాఠకుడికి బదిలీ అవడం” అంటే ఇదే కదా!

    దాశరధిగారు చెప్పిన ‘కలుపు మొక్కలు’ సమీక్షలో లేకుండా ఉంటే బాగుండేది. ఈ మధ్య గమనిస్తున్నాను. తెలుగు రచయితలు, సమీక్షకులు, కవులు, ముఖ్యంగా భావుకత్వంలో ఉండి తమను వ్యక్తం చేసుకుంటున్నపుడు ఆంగ్ల పదాలను యధేచ్ఛగా వాడుతున్నారు. అంతర్జాలంతో పాటు పత్రికల్లో కూడా ఇది కనిపిస్తోంది. ఎందుకని? తెలుగు అంత పేదదయిందా? లేక….!

    తెలుగు ఎంతమాత్రం పేదది కాదని, ప్రజల్లో, ముఖ్యంగా శ్రామిక ప్రజల్లో తెలుగు చక్కగా, పద సంపదలతో తులతూగుతోందని ఈ సమీక్ష ద్వారా రమేష్ గారి ‘ప్రళయ కావేరి’ రుజువు చేస్తోంది. అందువలన ‘అంతరించిపోతున్న తెలుగు పదాలు’ అనడం కరెక్ట్ కాదేమో! సమీక్షలోనే ఇన్ని పక్షులు, చేపలు, శ్రమలు (గేణమ్మ) ఉంటే, కధల్లో ఇంకెన్ని ఉండాలి! అక్కడి మనుషుల జీవితాల్లో ఇంకెన్నెన్ని ఉండాలి!!

    గేణమ్మ శ్రమలని ఉదహరించడం చాలా బాగుంది.

    నువ్వు ‘ప్రళయ కావేరి’ కోసం వెతుకుతూ పుస్తకాల షాపుల్లో అడుగుతుంటే అదేదో కావేరీ నది వరదల కధలు అయి ఉంటాయి అనుకున్నాను. కావేరి ప్రళయ రూపం దాల్చితే దాన్ని కధలుగా రచయిత చెప్పి ఉంటాడని అనుకున్నాను. ప్రళయ కావేరి అంటే పులికాట్ సరస్సు అనుకోలేదు. పక్షులను చూడడానికి మీరిద్దరు వెళ్లేటపుడు, వెళ్లి వచ్చాక కూడా వెళుతోంది, వెళ్లింది పులికాట్ అని నాకు చెప్పలేదు మరి! నేరం నాది కాదు.

  • ఈ పత్రిక సమయంలో ఏదో లోపం ఉన్నట్లుంది. నేనిక్కడ సాయంత్రం పూట రాస్తే am అని చూపిస్తోందేమిటి?

    లేక ఇది ఇండియా నుండి నడుస్తున్న పత్రిక కాదా?

  • pudota.showreelu says:

    రామా

  • pudota.showreelu says:

    రమా గార్కి ప్రళయకావేరి పుస్తకసమీక్ష చదేవాను .నేను మొదట ఈ పుస్తకము చదవగానే ఒకరకమైన translo వెళ్ళిపోయాను .ఒక వారమంత ఆ కథలు నన్ను వెంటాడినై.ప్రళయకావేరిలో తిరుగుతున్నట్ల ని పించిందే .;’ఆడపోడుసుసాంగెం”లో అమ్మమ్మ శవాన్ని ఎంత నెట్టినా మూదుసార్లు వాళ్ళ చుట్టూ తిరగటం తలుసుకుంటే ఇప్పటకి మనసంత బాధగా ఉంటుంది . నా తమ్ముని కథలకు చక్కని సమీక్ష రాసినందుకు మీకు మప్పిదాలు.

  • Subhash Koti says:

    ‘ప్రళయ కావేరి కథలు ‘ పుస్తక సమీక్ష ఆనవాయితీగా చేస్తున్న కథల సమీక్షలకు మల్లెగాక భిన్న రీతిలో సాగింది.పైన మీరు ఉటంకించిన కోట్ చాలా బాగుంది.సమీక్షారంభం లొనే ఈ కథలు ఒక పర్యావరణ శాస్త్రం అంటే నమ్మబుద్ధి గాలేదు .కాని సమీక్షను చదువుతూ పోయినప్పుడు గాని మీరు చెప్పిన విషయము ఎంత సత్యమో బోధ పడింది .ఎందుకంటే ఆ ప్రాంతంలో వసించె అనేకానేక పక్షుల పేర్లు,లభించే కూరల పెర్లూ మరియు చేపల పేర్లూ చూసినప్పుడు కొంత ఆశ్చర్యం వేసింది.ఇక ఆహార పదార్తాలగురించి కూడా క్షుణ్ణంగా వివరించడం చూస్తె రచయిత ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ,ఆ ప్రాంత వాసులతో ఎంత మమేకమై వాటిని సేకరించి ఉంటాడో అర్థమయ్యింది.మొత్తంపై మీ సమీక్ష ఆ పుస్తకంలో నిక్షిప్తమై వున్నఅడుగు వర్గ ప్రజల సాంస్కృతిక జీవన పరిణామక్రమాన్ని ఎత్తి చూపింది.ఇక భాష కూడా శుద్ధ మాండలికమే కాక ఆంగ్లాన్ని మచ్చుకైనా వాడకపోవడం చెప్పుకోదగ్గ విశేషమే. సమీక్ష చదవడంచాదివిన తర్వాత కథలు తప్పక చదువాలనే బలమైన ఆకాంక్ష నాలో కలిగింది.మంచి కథలు అందించిన రచయితకు ,దానికి తగ్గ సమీక్షను రాసిన మీకు అభినందనలు రామ గారూ ……

  • venkat says:

    Thank’s for providing interesting Stories…………….

  • Sridhar Nalla says:

    అవును పదేళ్ళ క్రితం చదివిన ప్రళయకావేరి కథలు ఇప్పుడు మళ్లీ గుర్తుకువచ్చి వెంటాడుతున్నాయి. ఆ భాష నాకు కొత్త అయినా అప్పట్లో మళ్లీ మళ్లీ చదివి ఆనందించాను. రచయిత స. వెం . రమేష్ గారికి నా అభినందనలు. రమా సుందరి గారికి ఎన్నో థాంక్స్ ..

Leave a Reply to Ismail Penukonda Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)