భారతీయ కథలో వేంపల్లె జెండా!

shariff -1

shariff -1

(మన కథకుడు వేంపల్లె షరీఫ్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం
గౌహతి లో మార్చి 22 వ తేదీ అందుకుంటున్న సందర్భంగా)

రాయలసీమ ముస్లిం జీవితాల్ని సన్నిహితంగా చూసిన వాళ్ళకి వొక విషయం ఇట్టే తెలిసిపోతుంది –

మిగిలిన  ప్రాంతాల కంటే కూడా సీమలో ముస్లింలు ఇక్కడ స్థానిక జీవితంలో బాగా ఇమిడిపోయారు అని! సీమలో ముస్లింల ఇంటి పేర్లు మిగిలిన చోట ముస్లింల ఇంటిపేర్లలా మహమ్మద్, షేక్, సయ్యద్ అని మొదలవ్వడం చాలా అరుదు. వేంపల్లె, పెనుకొండ, కొదుమూరు, కలికిరి ఇవీ ఎక్కువ మంది ముస్లింల  ఇంటి పేర్లు. ఇంకాస్త ముందుకు వెళ్ళి, పల్లెల్లో పీర్ల పండగలూ, ఇతర సూఫీ పీర్ల స్మృతి చిహ్నంగా జరిగే ఉరుసు ఉత్సవాలు గమనిస్తే సామూహిక స్థాయిలో హిందూ-ముస్లింల మధ్య ఎలాంటి అనుబంధం వుందో తెలుస్తుంది.

తెలుగు సాహిత్యంలో ముస్లిం కథకుల పేర్లు వినిపించడం విశేషమేమీ కాదు. కానీ, వేంపల్లె షరీఫ్ కథలు చదవగానే అవి సాధారణ ముస్లిం కథలకు భిన్నంగా అనిపించడానికి కారణం షరీఫ్ సీమ నేపధ్యమే! అందుకే, షరీఫ్ కథల్లో కనిపించే మెజారిటీ-మైనారిటీ బంధం కూడా భిన్నంగా వుంటుంది. ఇందులో సంఘర్షణ తక్కువగా వుంటుంది, సామరస్యం ఎక్కువగా వుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు ఆ తేడాని గమనించలేనంతగా ఆ రెండు సమూహాల సంబంధాలూ కలగలిసిపోయి వుంటాయి. ఆ కారణంగా షరీఫ్ తన కథల్లో వర్ణించే ముస్లిం జీవన దృశ్యం కేవలం వొక మైనారిటీ కోణంగా కనిపించదు. స్థానికత అనేది సమకాలీన తెలుగు కథ ప్రధాన లక్షణం అనుకుంటున్న ఈ దశలో షరీఫ్ కథలు ఆ లక్షణానికి  పక్కా ఉదాహరణగా నిలుస్తాయి.

స్థానికతకి వొక ప్రత్యేకమయిన శిల్ప సౌందర్యం కూడా వుంటుంది. స్థానికత ఇరుసుగా వున్న కథ ఎక్కువ అలంకారాలు ధరించదు. సాదాసీదా అందంతో మన ముందుకు వస్తుంది. వొక్కో సారి ఈ అందం వొక అందమేనా అన్న సంశయం కలిగేంతగా ఈ కథలో అందం ఇంకిపోయి వుంటుంది. షరీఫ్ కథలు చాలా మామూలుగా మొదలయి, చాలా మామూలుగా నడుస్తూ చాలా మామూలుగా ముగుస్తాయి. అతని వాక్యాలు సాంద్రత కోసం వెతుక్కోవు.

ఇంత మామూలు వాక్యాలు కథలో ఎలా ఇమిడాయా అని ఆశ్చర్యపోతుండగా చదువరిని చివరి దాకా తీసుకు వెళ్ళే అత్యంత పరిచిత వ్యక్తిలా కనిపిస్తాడు షరీఫ్. కథలో వొక ఆత్మీయ స్వరం వినిపిస్తూ వుంటుంది. బయటి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ఇలాంటి ఆత్మీయ స్వరాన్ని వినిపించడం అంత తేలిక కాదు. ఇది ఖదీర్ బాబు కథల్లో వినిపించే లాంటి ఆత్మీయ స్వరం కాదు. (కథా శిల్పానికి సంబంధించి ఇంకో విషయం: చాలా మంది ఖదీర్ బాబు రచనని నామిని కథాశిల్పంతో ముడిపెట్టి మాట్లాడుతూ వుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. నామిని కథనంలో rationalization అసలు వుండదు. ఖదీర్ కథన శిల్పంలోని వొకానొక జీవధాతువు నామిని నించి వచ్చిందే కానీ, ఖదీర్ కథనశిల్పం నామిని కంటే ఆధునికం, సమకాలీనం. అది అతని rationalization వల్ల సాధ్యమయింది. అందుకే ఖదీర్ కథన సంప్రదాయం అనే మాటని విడిగా వాడుతున్నా)

ఈ ఇద్దరి సంప్రదాయాన్ని   సహజ అందంగా కలిపి ముందుకు తీసుకెళ్తున్న కథకుడు షరీఫ్. ఈ కథల్లోని ఆత్మీయ శిల్పం ఆత్మీయంగా వుంటూనే ముక్కు సూటిగా కొన్ని హేతుబద్ధమయిన ప్రశ్నలు అడుగుతుంది. అసలు అలాంటి ప్రశ్న అడక్కుండా షరీఫ్ కథ ముగింపు దాకా రాదు. కథ ముగిశాక ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంతో ఈ కథల పఠితకి ఇంకో ప్రయాణం మొదలవుతుంది. ‘జుమ్మా’ సంపుటి నించి ఈ సారి “కథాసారంగ”లో ప్రచురిస్తున్న షరీఫ్ సరికొత్త కథ ‘వింత శిశువు’ దాకా ఈ ప్రశ్న వినిపిస్తూనే వుంటుంది. అయితే, ఈ ప్రశ్న స్వరం చెంప మీద చెళ్లుమని కొట్టినట్టుగా కాకుండా, ఆత్మీయ స్వరంతో ధ్వనించడం షరీఫ్ కథనమార్గం!

Download PDF

6 Comments

 • మితృడు షరీఫ్ గారికి అభినందనలు. మన తెలుగు సాహిత్యంలో ప్రత్యేక వాద ఉద్యమాలు, సాహిత్యం కానీ రావడానికి మూల కారణం సాహిత్యంఅంతా సమాజంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలని విస్మరించి ఒకే పోకడలో పోవడం. లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు కూడా అధికసంఖ్యాక వర్గాలను, నిరక్షరాస్యత కారణంగా కావచ్చు లేదా వారి పరిధిలోకి రాని కారణంగా కావచ్చు సాహిత్యంలో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. వారి బాధలు, సంతోషాలు, భయాలు, ఆవేదనలు సాహితీ గవాక్షంలో నుంచి చూడబడలేదు. అందుకే తమదైన గొంతుని ఆవిష్కరిస్తూ చాలా మంది ముందుకు వచ్చారు. అందులో షరీఫ్ గారు ఒక్కరు. కానీ అది ప్రత్యేకంగా ఓ వర్గానికే పరిమితం కాకుండా సార్వజనీనత ఉన్న అంశాలు ఎన్నుకొన్నందుకు అభినందనీయార్హుడు.

 • షరీఫ్ గారికి హృదయ పూర్వక అభినందనలు,
  “జుమ్మా” కథల కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నాను.

  మీ సమీక్ష బాగుంది ధన్యవాదములు

  • shariffvempalli says:

   వనజ గారు ..
   ధన్యవాదాలు..
   జుమ్మా బుక్ కినిగే.కాం లో దొరుకుతుంది.

 • m s naidu says:

  hi shareef. hearty congrats on getting awarded. don’t listen/read any criticism in enriching your writings. all criticism especially on stories will be a false truth in future. to say more, do our telugu short story critics have enough instruments to postmortem a story?

  • shariffvempalli says:

   don’t listen/read any criticism in enriching your writings.

   గ్రేట్ వర్డ్..
   ధన్యవాదాలు అన్నా….

Leave a Reply to vanajavanamali Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)