వింతశిశువు / వేంపల్లె షరీఫ్

vintasisuvu

vintasisuvu

టిఆర్‌పి రేటింగ్స్‌లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న టీవీ చానల్స్‌లో మురళీ పనిచేస్తున్న వార్తా చానల్ కూడా ఒకటి. ఆవేళ పొద్దుటి డ్యూటీలో ఉన్నాడు. వార్తా విభాగంలో అతని ఉద్యోగం. ఆ షిఫ్ట్‌కి మురళీ ఇన్‌చార్జ్‌. ఆ షిఫ్ట్‌లో వచ్చే వార్తల ప్రాధాన్యతను నిర్ణయించి ప్రసారం చేయాల్సిన బాధ్యత అతనిదే. సమయం తొమ్మిది గంటలవుతోంది. కంప్యూటర్ ముందు కూర్చోని ఉన్నాడు. ఎదురుగా గోడకు టీవీ దుకాణంలో తగిలించినట్టు వరుసగా పది టీవీలున్నాయి.

కుడినుంచి ఎడమకు లెక్కేసుకుంటే మొదటి టీవీలో మురళీ పనిచేసే చానల్ ‘టీవీ `ఎక్స్’ వస్తోంది. చివరి టీవీలో ‘టీవీ`7’ వస్తోంది. ఇక మధ్యలో ఉన్న టీవీల్లో కూడా రకరకాల పోటీ చానల్స్ వస్తున్నాయి. ఒకసారి వాటివైపు చూశాడు మురళీ. ఉద్యోగంలో భాగంగా అప్పుడప్పుడు పోటీ చానల్స్‌లో ఏయే వార్తలు వస్తున్నాయో గమనిస్తుండాలి. నిజానికి గోడమీద అన్ని టీవీలు ఉంచిందే అందుకు. టీవీ7లో బ్రేకింగ్ వస్తోంది. ‘‘పశ్చిమగోదావరిజిల్లాలో వింత, తోకతో ఉన్న శిశువు జననం, వింత చూడ్డానికి ఎగబడుతున్న జనం’’

ఎర్రెర్రటి గ్రాఫిక్ ప్లేట్లతో తాటికాయంత తెల్లటి అక్షరాలతో టీవీ7లో వార్త నడుస్తోంది. ఓవైపు రిపోర్టర్ ఫోన్‌లో విశ్లేషణ ఇస్తున్నాడు. మరోవైపు బాక్సులో శిశువు దృశ్యాలు వేస్తున్నారు. శిశువు ఎర్రగా, సాయంత్రపు ఎండలో మెరిసే పూమొగ్గలా ఉన్నాడు. ఎవరివో రెండు చేతులు అతన్ని ఎత్తుకుని అతని వెనుక భాగాన్ని కెమెరాకు చూపిస్తున్నారు. పిర్రల దగ్గర కొద్దిగా, గోరంత చర్మం ముందుకొచ్చినట్టు కనబడుతోంది. ‘‘దీన్నే తోకంటూ కనిపెట్టాడు కాబోలు టీవీ7 వాడు..’’ గొణుక్కున్నాడు మురళీ. వెంటనే సీట్లోంచి లేచెళ్లి టీవీ ముందు నిలబడి కొంచెం వాల్యుమ్ పెంచాడు. ‘జన్యుపరమైన సమస్య వల్ల శిశువు అలా పుట్టాడని, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని, ఆపరేషన్ చేసి తీసేయొచ్చని, ఇదేం పెద్ద విషయం కాదని’ వైద్యులు చెబుతున్నట్టు రిపోర్టర్ తన విశ్లేషణలో వివరిస్తున్నాడు.

అయినా ఆ చానల్ వాళ్లకు అదేం పెద్ద పట్టడం లేదు. వాళ్ల శ్రద్ధంతా దాన్ని ఒక ఎనిమిదో ప్రపంచ వింత లాగ చూపడంపైనే ఉంది. మనసు చివుక్కుమంది అతనికి. ‘‘ఇంకాసేపుంటే ఆ శిశువు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అవతారమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు…’’  వచ్చి మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు.

నిజానికి ఆ వార్త తన దగ్గర కూడా ఉంది. కానీ అతనే ప్రసారం చేయకుండా ఆపాడు. అలా ఆపడం పై బాసులకు తప్పుగా తోస్తుందని అతనికి తెలుసు. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కూడా తెలుసు. అయినా అతనికెందుకో ఆ వార్తలో జనాసక్తి తప్ప జనానికి ఉపయోగపడే విషయం ఏమీ లేదనిపిస్తోంది. అందుకే ఎవడొచ్చి అడిగినా ఆ వార్తను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ మొన్న మధ్యాహ్నం షిఫ్ట్‌లో జరిగిన అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి అతనికి గుర్తుకొచ్చింది.

ఆ వేళ మురళీకి ` సబ్‌ఎడిటర్ రమాదేవికి పెద్ద గొడవ. వింతలూ ` విశేషాలు, ఆసక్తికరమైన వార్తలు రాసి టిఆర్‌పి పెంచే సబ్ ఎడిటర్‌గా రమాదేవికి మంచి పేరుంది. ఆ చొరవతోనే ఆమె ` ఇన్‌చార్జ్ అయిన మురళీక్కూడా చెప్పకుండా రిపోర్టర్ దగ్గరి నుంచి వార్త రాగానే దానికి కావాల్సిన హంగులూ, పొంగులూ, మసాలాలు అన్నీ దట్టించి టిఆర్‌పి యుద్ధానికి సిద్ధం చేసి ఉంచింది. అంతేకాదు ఆవార్త చాలా ప్రముఖమైందని హెడ్‌లైన్ పెట్టి ప్రసారం చేయాల్సిందిగా మురళీకి సూచించింది.

అసలే ఆదివారం. వార్తలు కూడా పెద్దగా లేకపోవడంతో రమాదేవి చెప్పిన తీరును బట్టి ఆ వార్త మీద ఆసక్తి కలిగి కంప్యూటర్‌లోనే ఫైల్ ఓపెన్ చేసి చూశాడు మురళీ.

‘‘ఇదీ కనీవినీ ఎరుగని వింత. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే జరుగుతోంది. అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన ఓ మహిళకు వరాహం  పుట్టింది. స్థానిక లక్ష్మీదేవి అనే మహిళ గత రాత్రి ప్రసవించింది. శిశువు వరాహం అవతారంలో ఉన్నాడన్న విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు దావానలంలా వ్యాపించింది. దీంతో జనం ఆ వింతను చూడ్డానికి బారులు తీరుతున్నారు…’’ ఇలా కొనసాగుతోందావార్త. మురళీకి చిరాకేసింది. మధ్యలోనే చదవడం ఆపేశాడు. ఈ జనానికి పెద్ద పనేమి ఉండదు. వింత అనే పదం వినపడితే చాలు బారులు తీరేస్తారు. ‘బొప్పాయిలో వినాయకుడని, కొబ్బరికాయలో అల్లా..’ అని రకరకాల నమ్మకాలు. వాటికి మీడియాలో ప్రచారం. ‘ఎందుకీ వార్తను పంపార’ని రిపోర్టర్‌ని అడిగితే ‘జనాసక్తి గల విషయం కాబట్టి పంపామ’ని బుకాయింపు. ‘‘అసలు ఆ ఆసక్తిని కలిగిస్తోంది ఎవరు? లేని ఆసక్తి రగిలించి జనాన్ని రెచ్చగొడుతోంది ఎవరు?’’ అని అడగాలనిపిస్తుంది అతనికి.

కానీ అడగలేడు. టీవీ మీడియాలో చేరినప్పటినుంచి అంటే సుమారు గత ఆరేళ్లుగా అతను ఇదే క్షోభను అనుభవిస్తున్నాడు. అంతకుముందు వివిధ పత్రికల్లో పనిచేశాడు. ఆయా పత్రికలకు కూడా కొన్ని సొంత ఎజెండాలున్నాయి. కడుపాత్రం కాబట్టి ఆయా ఎజెండాలకు తగ్గట్టు వార్తలు రాశాడు. పెద్ద బాధనిపించలేదు. కానీ టీవీ మీడియాలో చేరాక సామాజిక బాధ్యత ఉన్న వార్తల పట్ల కూడా ఆత్మవంచన చేసుకోవాల్సి వస్తున్నందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు. అలా అని ఉద్యోగం వదిలేయలేడు. పెరిగిన ఖర్చులు, సంసార భారం దృష్ట్యా తిరిగి పత్రికలో చేరి తక్కువ జీతానికి పనిచేయనూ లేడు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఇలాంటి రకరకాల వార్తలు వచ్చి అతనికినరకం చూపిస్తున్నాయి.

ఒక మహిళై ఉండికూడా ఈ వార్త పట్ల ఇంత ఆసక్తి చూపిన రమాదేవి మీద ఒకరకమైన అసహనం కలిగింది మురళీకి. కానీ ఆమేం చేస్తుంది? టీవీ మీడియా ఆమెను అలా మార్చేసింది. టీవీ మీడియాను మార్కెట్ శాసిస్తోంది. సొంత ప్రయోజనాలు శాసిస్తున్నాయి. రకరకాల ఎజెండాలకు లోబడి ఇక్కడ పనిచేయాలి. లేకపోతే మనుగడ ఉండదు. అందుకే మనుషులు అప్పుడప్పుడు తాము మనుషులమనే సంగతిని మర్చిపోతుంటారు. ఒకసారి రమాదేవి కూర్చునే కంప్యూటర్ వైపు చూశాడు మురళీ. ఆమె ఇంకా ఆ వార్తకు సంబంధించిన గ్రాఫిక్స్ ఏవో తయారు చేస్తోంది. రమాదేవి ఆ వార్త రాసేముందే ఒకసారి చూపించి ఉంటే అప్పుడే వద్దని చెప్పేవాడు మురళీ. కానీ ఇప్పుడు ఆ వార్తను దిద్ది అన్ని రకాల మసాలాలు దట్టించి సిద్ధం చేసిన తర్వాత వద్దంటే ఆమెకు కోపమొచ్చే అవకాశమే ఎక్కువ.

అందుకే ‘‘ఎలా ఈ ప్రమాదాన్ని నివారించాలా..?’’అని ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి దృశ్యాలు చూడ్డానికి పక్కనే ఉన్న ఎడిటింగ్ విభాగానికి వెళ్లాడు. వరాహావతారంలో శిశువు పుట్టిందని వచ్చిన వార్త తాలూకు దృశ్యాలు చూపించమని అడిగాడు. వాళ్లు కంప్యూటర్‌లో ప్లే చేశారు. కళ్లముందు దృశ్యాలు కదులుతున్నాయి. అది ఇల్లో..గుడిసో.. చెప్పడం కష్టం. ఇంటి లోపలి వాతావరణం దిగులుగా, చీకటిగా ఉంది. కేవలం కెమెరా వెలుతురులో మాత్రమే ఆ దృశ్యాలను తీసినట్టు తెలుస్తోంది. ఒక పక్కగా శిశువు తల్లి . ఆమె తల్లి వయసున్న ఆడమనిషి మీద తలపెట్టి కూలబడింది. పక్కనే చాప మీద తెల్లటి వస్త్రం పరిచి పడుకోబెట్టారు ఒక చిన్నటి, నల్లటి ఆకారాన్ని. వస్త్రంపై ఆ ఆకారం మెల్లగా పురుగులాగ కదులుతోంది. కాసేపటికి పోల్చుకున్నాడు మురళీ ఆ ఆకారమే శిశువు అని. నిజమే శిశువు అందవికారంగా ఉంది. ఏది ముక్కో ఏది నోరో పోల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ వరాహం  మాత్రం కాదు.

‘‘వరాహావతారం అనేది కేవలం మీడియా, మీడియాలాంటి మనుషుల సృష్టి మాత్రమే. కడుపులో బిడ్డ పెరిగేటప్పుడే ఏదో తేడా జరిగింది. అసలే చదువులేని మనుషులు. ఎప్పటికప్పుడు డాక్టరు దగ్గరికెళ్లి ఏ నెలకానెల కడపులో బిడ్డ ఆరోగ్యం,పెరుగుదల గురించి తెలుసుకోవాలని తెలియనివాళ్లు. తెలిసినా చూపించుకోవడానికి డబ్బు లేనివాళ్లు.’’ అతనికి బాధేసింది. ‘‘పాపం ఆ తల్లి ఎంత క్షోభ అనుభవిస్తోందో?’’ అనుకున్నాడు. అంతలో శిశువు ఆకారంపై ఉన్న కెమెరా మెల్లగా కదిలి ఆ మాతృమూర్తి ఉన్న వైపుకు తిరిగి జూమ్ అయ్యింది.

ఇందాక పక్కనున్న మనిషిమీద తలపెట్టి కూలబడ్డ తల్లి ఇప్పుడు ఏడుస్తోంది. ‘‘ల్యాక ల్యాక పుట్టిండెనే సామి ఈ బిడ్డ. ఇట్ట పుట్టించినావేమిట్రా దేవుడా. నేనేం తప్పు చేసినాను సోమి. అడిగినోళ్లందరికీ పెట్టినదాన్నేనే. ఇప్పుడేం జెయ్యాల. ఇట్ట జరిగిండేదానికేనా ఇన్ని అగసాట్లు పడింది? ఇన్నినొప్పులు బరించింది? నా రాతెందుకు ఇట్టుండాది రా నాయనా.. ! ఏం చేయాల్ల ఈ పిల్లను? ఆడకూతురే. ఎట్ట పెద్ద చేయాల్రా దేవుడా..?’’ దీర్ఘాలు తీస్తోంది. కడుపు మీద దబాదబా గుద్దుకుంటోంది. ఇక ఆ దృశ్యాలను చూడలేకపోయాడు మురళీ. వాటిని తీసిన రిపోర్టర్ మీద, కెమెరా మెన్ మీద కోపమొచ్చింది. ‘‘అయినా వాళ్లదేం తప్పు? ఆ వార్తను తీసుకురాకపోతే వాళ్ల ఉద్యోగం పోతుంది. వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించారు. ఇలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రసారం చేసి వారితో ఇలాంటివాటిని తెప్పిస్తున్న మార్కెట్ మాయాజాలానిది తప్పు?’’ మౌనంగా వచ్చి అతని స్థానంలో కూర్చున్నాడు. మనసంతా దు:ఖంగా ఉంది.

ఓ నిమిషం పోయాక తేరుకుని ‘‘రమాదేవీ, తల్లి మాట్లాడింది విన్నావా?’’ అన్నాడు అటువైపు తిరిగి కూర్చోనున్న ఆమెతో.  ‘‘విన్నాను.. బ్రహ్మాండంగా మాట్లాడింది కదా..’’ అంది రమాదేవి. మురళీకి ఏం చెప్పాలో తెలీలేదు. అంతటి విషాదంలో కూడా ఓ నవ్వు మొహం పెట్టాడు. అలా నవ్వాలి. అదే నాగరికత. అవతలివాడిని దవడ పగిలేలా కొట్టాలనిపించినా కొట్టకుండా పళ్లు ఇకిలించాలి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ‘నాయకత్వ లక్షణాల’ పేరుతో ‘వ్యక్తిత్వ వికాస’ కోర్సుల్లో చేరి, నేడు యువత నేర్చుకుంటోంది ఇదే. ఆ విద్యే అతనూ నేర్చుకున్నాడు. కానీ ఎంత నేర్చుకున్నా మొహానున్న నవ్వుకి జీవం మాత్రం తీసుకురాలేక పోతున్నాడు. ఇక తప్పదనుకుని కొంచెం కఠినంగానే ‘‘ఆవార్త ప్రసారం చేస్తే బాగోదు. హెడ్‌లైన్ వద్దు. వార్త కూడా వద్దు,’’ అన్నాడు. మురళీ అనుకున్నట్టుగానే రమాదేవికి మండిరది. ‘‘వేరే ఇన్‌చార్జ్ ఉంటే చక్కగా నేను రాసిన వార్తలు పెట్టుకుంటాడు. నువ్వేంటి ఎప్పుడూ ఏది రాసినా ఇది అవసరం లేదు..అది అవసరం లేదు అని లాజిక్కులు మాట్లాడతావ్..’’ అంటూ అరిచిందా పిల్ల.

అందరిముందు అలా అరవడం మురళీకి కొంచెం అవమానంగా అనిపించినా నిబాయించుకున్నాడు.

‘‘ఒకసారి నువ్వే ఆలోచించు. అసలే ఇలాంటి బిడ్డ పుట్టిందేంటా.. అని ఆ తల్లి బాధలో ఉంటే మనం ఆ వార్త వేసి ప్రచారం చేస్తామా? టీవీలో వార్త చూసి ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్లంతా ఆమె ఇంటి ముందు క్యూ కడతారు. అది అవమానంగా భావించి ఆమె ఏమైనా చేసుకుంటే? అసలు ఆ వార్త ఇవ్వడం వల్ల ఎవరికిప్రయోజనం? అందులో ఆ పుట్టిన పాప వికారంగా ఉందేమో కానీ వరాహంలా లేదు. ఉత్తినే ఆమె కడుపున ‘పంది’ పుట్టిందని ఎలా వేస్తాం. అలా వేస్తే ఆ తల్లికి ఎంత నరకం?’’ ఇంకా ఏదో చెప్పబోయాడు మురళీ. ‘‘మరి టిఆర్‌పిలు.. టిఆర్‌పిలు అని మా ప్రాణాలు తీస్తారెందుకు?’’ అంది రమాదేవి అడ్డుకుని కఠినంగా. ‘‘నిజమే. పై వాళ్లు అలాగే ప్రాణాలు తీస్తారు. మనమే కొంచెం విచక్షణ ఉపయోగించాలి. మన పరిధిలో ఉన్నంతవరకైనా ఇలాంటి వార్తలు ఆపుదాం,’’ అన్నాడతను నచ్చచెబుతున్నట్టుగా.

ఏమనుకుందో ఏమో తర్వాత ఏం మాట్లాడలేదు రమాదేవి. కానీ ఎక్కడో అతనిలో ఓ చిన్న అనుమానం.

‘‘ఒకవేళ రమాదేవి ఈ విషయాన్ని పై వాళ్లతో(బాసులతో) చర్చించి పెద్దది చేస్తే ఏం చేయాలి?’’ అని. అందుకే మంచో చెడో..దానికి తగ్గ సమాధానం కూడా ఒకటి సిద్ధం చేసి ఉంచుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఈ వార్త మీద తర్వాత ఎలాంటి చర్చ జరలేదు. ఆరోజు గండం అలా గడిచిందనుకుంటే మళ్లీ ఇవ్వాళ టీవీ7 వాడి రూపంలో మరో గండం వచ్చి పడింది. అది అసలే నెంబర్ వన్ చానల్‌. అది ఆ వింత వార్తను పట్టుకుని అలా గింజుతుంటే మిగతా వాళ్లుకూడా అదే బాట పడతారు. అసలే టీవీ మీడియా ‘గొర్రెల మంద’ లాంటిదంటారు. ఒకరు ఒక వార్తను పట్టుకుని హడావిడి చేస్తే మిగతావాళ్లు కూడా దాన్నే పట్టుకుని లాగుతారు. అందులోని మంచి చెడుల గురించి ఆలోచించరు. అందరూ హడావిడి చేస్తే ఇక తనక్కూడ ఆ వార్తను ప్రసారం చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే అతనికి గుండెల్లో గుబులు గుబులుగా ఉంది. మనసంతా కీడు శంకిస్తోంది. అన్నట్టే కాసేపటికి డెస్కులో అగ్గి రాజుకుంది.

‘‘వార్త మనకొచ్చి అరగంటైనా మనవాళ్లు బ్రేకింగ్ వేయలేదు. టీవీ 7 వాడు ఆడుకుంటున్నాడు’’ అని లేసింది ఓ గొంతు.

వెనక్కి తిరిగి చూస్తే శ్రవణ్‌. అతను న్యూస్ కో ఆర్డినేటర్‌. ఏదైనా వార్త చానల్‌కి రాకపోతే అతనే దగ్గరుండి తెప్పిస్తాడు. ఒకవేళ వచ్చి కూడా ప్రసారం కాకపోతే ఇలాగే అరుస్తాడు. అతన్ని చూడగానే మురళీకి గుండె గుభేలుమంది. మొన్న వైజాగ్ బీచ్‌లో ముగ్గురు పిల్లలు కొట్టుకుపోయారు. వాళ్ల శరీరాలు దొరికాయి. ఆ దృశ్యాలు అందరికన్నా ముందుగా తెప్పించాడు శ్రవణ్‌. కానీ కాస్త అటు ఇటుగా ఇతర చానల్స్‌కి కూడా ఆ దృశ్యాలు వస్తాయి. దొరకని, దొరకడానికి వీల్లేని దృశ్యాలైతే కాదు. కానీ శ్రవణ్ ఒకటే హడావిడి. దేశంలోనే ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టినట్టు.. గోల. ఆ శవాల దృశ్యాల మీద ‘ఎక్స్‌క్లూజివ్‌..మార్కు’ వేయమని ఒత్తిడి.

‘‘బిడ్డలు నీటిలో మునిగి చచ్చిపోయి ఆ తల్లులు పుట్టెడు దు:ఖంతో ఉంటే మనకోసమే చచ్చిపోయినట్టు ఆ దృశ్యాల మీద ఎక్స్ క్లూజివ్ వేయడం నైతికం కాదు,’’ అన్నాడు మురళీ కటువుగా. అనడమే కాదు ‘ఎక్స్ క్లూజివ్ మార్కు’ వేయకుండానే ఆ దృశ్యాలను ప్రసారం చేశాడు. అది మనసులో ఉంచుకున్నాడు శ్రవణ్. దానికి తోడు ఇప్పుడు మళ్లీ ఆజ్యం పోస్తే భగ్గుమంటాడు.

అందుకే `‘‘శ్రవణ్ అది అస్సలు వార్తేనంటావా?’’ వీలైనంత ప్రశాంతంగా అడిగే ప్రయత్నం చేశాడు మురళీ . ‘‘వార్తో…కాదో ముందు టిఆర్‌పి. టీవీ7 వాడు అంతలా ఆడుకుంటుంటే నేనేదో గాడిదలు కాస్తున్నాను ఆఫీసులో అనుకుంటారు అందరూ. వెంటనే వార్తను ఎక్కించు. ‘ఎక్స్‌క్లూజివ్’ అని వేయ్., ‘ఫస్ట్ అన్ `టీవీఎక్స్’ అని వేయ్. ‘వాటర్ మార్కు’ వాడు. ‘ఫుల్ ప్లేట్‌్ బ్రేకింగ్’ కొట్టు.’’ `తనకు తెలిసిన విద్యలన్నీ చెప్పి గగ్గోలు పెట్టాడతను. మురళీకి చిరాకేసింది. కానీ అంతలోనే అతని మీద జాలి కూడా కలిగింది. ఆ వార్తను ప్రసారం చేయకపోతే తెప్పించలేదనుకుని శ్రవణ్‌ని మేనేజ్‌మెంట్ తప్పుగా అనుకునే అవకాశం ఉంది. అది అతని ఉద్యోగానికే ప్రమాదం. శ్రవణ్ హడావిడిలోనూ అర్థముంది. ఆలోచించాడు మురళీ. మెల్లగా శ్రవణ్‌కు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

‘‘సరే శ్రవణ్.., ఆ వార్తను నేనే ప్రసారం చేయకుండా ఆపాను. ఎవరైనా నిన్ను అడిగితే నా పేరు చెప్పు? నీ మీద వేసుకోవద్దు,’’ అన్నాడు.

శ్రవణ్ అప్పటికి ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించినా పక్కకెళ్లి ఫిర్యాదు చేశాడని మురళీకి ఈజీగానే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు అతని ల్యాండ్ లైన్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. మురళీకి తెలుసు ఆఫోన్ తన బాసుల దగ్గర్నుంచే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ శ్రవణ్ ఫిర్యాదు ప్రభావమే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ ఎత్తితే ఆ వార్త ప్రసారం చేయక తప్పదని. ఒకసారి టీవీ7 వైపు చూశాడు. వింత శిశువు..వార్త ఇంతింత అక్షరాలతో ఇంకా ఇంకా వస్తూనే ఉంది. మురళీకి పిచ్చెక్కింది. గట్టిగా అరిచాడు. ‘‘తోకతో పుట్టిన వింతశిశువు ఆ పిల్లాడు కాదురా.. మీర్రా..మీరు..’’

 Front Image: Anwar
Download PDF

17 Comments

 • బాగుంది.

 • రమాసుందరి says:

  చావుల మీద, మూఢ నమ్మకాల మీద,అనైతిక మీద టి.ఆర్.పి పెంచుకొంటున్న టి.వి చానల్స్ మీద మా బోటి వాళ్ళ కసి మీరు తీర్చుకొన్నారు షరీఫ్ గారు.

 • ns murty says:

  షరీఫ్ గారూ,

  ఒకపక్క మూఢనమ్మకాలని బాబాలు సొమ్ముచేసుకుంటుంటే, మరొకపక్క టీవీ చానెల్లవాళ్ళు కూడా ఈ విషయం లో తక్కువతినటంలేదని బాగా చూపించేరు. ప్రజల్లో ఇవి ఎంత లోతుగా పాతుకుపోతే అంతగా లాభం వాళ్ళతో పాటు రాజకీయనాయకులకి కూడా. అందుకే ఈ మూడు వ్యవస్థలూ కూడబలుక్కుని Hand in glove గ ప్రవర్తిస్తుంటాయి.
  వివేకమూ, ఆత్మప్రబోధమూ తో ప్రవర్తించే వ్యక్తికి పూర్వం కంటే ఇప్పుడు సవాళ్ళు ఎక్కువ. అందుకే ఒక్కడిగా నిలబడడం కంటే మందిలో చేరిపోడానికి సుముఖంగా ఉంటారు చాలామంది.
  అభివాదములు.

 • టివీ కార్యక్రమాల వెనుక జరిగే “భాగోతాన్ని” అద్బుతంగా చిత్రీకరింఛారు…..

 • అచ్చు మాధ్యమం మాత్రమే ఉన్నరోజుల్లో అక్షరాస్యులాట్టే లేని మనదేశంలాంటి దేశాలమీద ఈ వ్యాపార సంస్కృతి విషప్రభావం పరిమితంగా మాత్రమే ఉండేది కదా అని ఒక మాదిరి ఊరట ఉండేది. ఇప్పుడదీ లేదు.దిక్కలేని శవాన్ని ఎవరు ముందు పీక్కుతింటే వాడే విజేత. దుఃఖం కలుగుతుంది. ఈ కథళొ చెప్పిందంతా వట్టి కథే ఐతే బాగుణ్ణే అనిపిస్తుంది. కాదు వాస్తవమే అని తెలిసి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. ఎక్కడికని పోతాం..గూగుల్ కంటిచూపులా ప్రపంచమంతా ఇ దుర్గంధమే ఆవరించున్నప్పుడు.ఇట్లాంటి నిజాలను కథలుగా రాసినందువల్ల రచయితలకు గొప్ప పురస్కారాలొస్తాయి..నిజమే కాని..పరిష్కారాల సంగతి మరేంటీ? చుక్కానిలో అఫ్సర్ చెప్పినట్లు వేంపల్లి షరీఫ్ అతి సహజ సరళ భాషలో అత్యంత హృదయవిదారకమైన దృశ్యాన్ని ఆవిష్కరించడంలో మాత్రం సెంట్ పెర్సెంట్ సక్సెస్ అయ్యారు.

 • shariffvempalli says:

  కర్లపాలెం హనుమంతరావు గారు నమస్కారాలు.
  కథని, ఇప్పటి సమాజాన్ని బాగా అర్థం చేసుకున్నారు. దయచేసి గమనించ గలరు. నా బోటి వాళ్ళ కథలు అవార్డుల కోసం. ప్రజా చైతన్యం కోసం.. ఈ విషయం.. మీకు తెలియనిది కాదు.

  అలాగే ఇక్కడ స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
  -షరీఫ్ వేంపల్లె

  • .పురస్కారాల కోసం రాసే కథలు ఇలా వుండవు లేండి.అవి ఇలాంటి వాటికి రావడం వాటి విలువను పెంచుకోవడానికే.. సగటు జీవి గుండె చప్పుడు ఇంత బలంగా వినిపించే మిమ్మల్ని గురించి అంత తప్పు మాట అనగలనా..నెవర్..! నా పై వ్యాఖ్యలో అలాంటి అర్థమొస్తే..అది నా వ్యక్తీకరణ లోపమే.ప్లీజ్ కీప్ ఇట్ అప్ అని మాత్రామే అనగలను

 • ఒక వార్తే జీతం..మరో మార్గం లేక ఆ జీతమే జీవితం అయినప్పుడు, మార్కెట్ పోటీని తట్టుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతీది బ్రేకింగ్ న్యూసే.
  ప్రస్తుత మీడియా పరిస్తితిని, టి.ఆర్.పి రేటింగ్ లను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
  నిజమే వింత శిశువులే ఇప్పుడు సమాజాని నిర్దేశిస్తున్నాయి..

 • లలిత says:

  నిత్యం ఇటువంటి వార్తలు చదువుతూ, చూస్తూ వింత అనేమాటకి అసలు అర్ధం మర్చిపోయినట్టున్నాం.
  ఒక్కోసారి పిచ్చి కోపం వస్తుంది. పేపర్ అయితే చించేగలం టి.వి బద్దలు కొట్టుకోలేం కదా !
  ఒక్క అరుపుతో మురళి కసి, కోపం తీరాయేమో కానీ ……నాకు ఇంకా అసంతృప్తిగానే వుందండీ షరీఫ్ గారు

  • shariffvempalli says:

   ఒక్క అరుపుతో మురళి కసి, కోపం తీరాయేమో కానీ ……నాకు ఇంకా అసంతృప్తిగానే వుందండీ షరీఫ్ గారు…

   నాక్కూడా అసంతృప్తి గానే ఉంది.. ధన్యవాదాలు..

 • kranthi says:

  నాకు కథ నచ్చింది … ప్రస్తుతం మీడియా వున్న పరిస్థితులని చాలా చక్కగా చెప్పారు .. మురళి లాంటి ఉద్యోగులు చాలామంది ఉంటారు . కాని ఫై అధికారుల వలన , వార్తలు కానివి కుడా .. వింత వార్తలు గా చూపించాల్సిన పరిస్థితి .
  ”వింత శిశువు ” మంచిగా ఉంది …

  — క్రాంతి

 • Chennuri Sudarshan says:

  ఐశ్వరాయ్ కడుపుతో ఉంది. బిడ్డ పుట్టింది. ఆబిడ్డ యిప్పుడు నవ్వుతుంది …ఏడుస్తుంది…మూత్రం పోస్తుంది…యివి మన వార్తలు….ఇలాంటి వార్తలు నేడు కోకొల్లలు…
  అసలైన వార్తలకు విలువలు లేకుండా చేస్తున్నారు నేటి విలేకర్లు.
  ఆ నేపథ్యంలో వచ్చిన యీ కథ నాకు చాలా నచ్చింది. అయితే దీంట్లో మరికొన్ని ఉదాహరణలు మేళవిస్తే మరికొంత రక్తి కట్టేదని నా అభి ప్రాయము.

  వేంపల్లి షరీఫ్ గారూ …అందుకొండి నాధన్యవాదములు….

 • Subhadra says:

  బాగా రాసేరు shariff గారు! ఇలాంటి వార్తలు చూడలేక టీవీ ను కట్టేసిన సందర్భాలు చాలా. పైన సుదర్శన్ గారు చెప్పినట్టు మరి కొన్ని ఉదాహరణలు ఉంటె కదా ఇంకా బల పడేది.
  మరి ఒక వైపు టీవీ లో దొంగ బాబాలు, స్వామీజీల గురించి విడమరచి చెప్పినా కూడా వారినే ఫాలో అయ్యే మూర్ఖ జనం! సో తప్పు జనం లో కూడా ఉందని నా అభిప్రాయం.

 • nagamani says:

  నమస్తే shariff గారు,
  మీ కధ వింత శిశువు – తరంగ రేడియో లో చదివానండి. లింక్ ఇది
  http://telugu.tharangamedia.com/vintha-sisivu/
  ధన్యవాదములు,
  నాగమణి పగడాల.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)