వేళ్ళచివరి ఉదయం

vamsidhar_post

శీతాకాలాన

కుప్పగా పోసుకున్న మద్యాహ్నపు ఎండలో

చలి కాచుకుంటారు వాళ్ళు.

ఉన్నిదుస్తులకు “లెక్క”తేలక,

రెండు రొట్టెల్ని వేడిచారులో

ముంచుకుని నోటికందించుకుంటారు

పగుళ్ళు పూసిన నేలగోడల మధ్యన…

 

ఇక

సూర్యుడు సవారీ ముగించుకుంటుండగా

సీతాకోకరెక్కల్ని పట్టే లాంటి మృదుత్వంతో

ఆమె అతడి చేయిని తడుముతుంది

ఏదైనా పాడమని…

 

దానికతడు

శూన్యం నింపుకున్న కళ్ళను

కాసేపు మూసి చిర్నవ్వుతూ

“పావురాలొచ్చే వేళైంది..కిటికీ తెరువ్”

అని బీథోవెన్ మూన్ లైట్ సొనాటానో,

మరి మొజార్ట్ స్ప్రింగ్ నో వేలికొసలలోంచి

చెక్కపెట్టెలోని పియానో మెట్లమీదికి జారవేస్తాడు…

 

ఒక్కోటే

కిటికీ దగ్గరికి చేరతాయి పావురాళ్ళు

కురుస్తున్న మంచుకి

ముక్కుల్ని రెక్కల్లో పొదుముకుని వొణుకుతూ…

 

మెల్లగా

నల్లనిమబ్బులు వెంట్రుకలు రాలుస్తాయి

చీకట్లకి తోడుగా నురగలమంచు పైకప్పుని కప్పేసి

చిమ్నీలోని ఆఖరివెలుగును కమ్మేస్తుంది…

 

మంచంకిందికో

బల్ల సొరుగులోకో

దారివెతుక్కుంటాయి పావురాలు…

 

అతడు

కదులుతాడు వంటగదివేపు,

అసహనాన్ని చేతికర్రగా మార్చుకుని

అడుగుల్ని సరిచూసుకుంటూ…

 

గోడవారగా నిలుచున్న కుర్చీని

చిమ్నీలో తోసి

బాసింపట్టేసుకుని కూర్చుంటుంది ఆమె…

 

కాల్చిన వేరుశనగల్ని

పావురాలకందించి

రాత్రికి రాగాలద్దడంలో మునిగిపోతాడు అతడు,

 

మళ్ళీ

ముడతల దేహపు అలసటతో

ఆమె పడుకుని ఉంటుంది అప్పటికే,

అతడికి ఓ ఏకాంతాన్ని ప్రసాదించి…

 

ఉదయపు

తొలికిరణం మంచుని చీల్చేవరకు

ఆ గదిలో ప్రవహించిన

ఎండిపోని సంగీతపు చారికలకు

ఆకలేసిన పావురాల

కిచ కిచలు గొంతుకలుపుతాయి …

 

గడ్డకట్టిన అతడి వేళ్ళచివర

పూసిన ఇంద్రధనస్సుల్ని చూసి

తూర్పువైపుగా

కొన్నిగాలులు ఊపిరిపీల్చుకుంటాయి

వెలుగుల్ని వాళ్ళ శరీరాలమీదుగా దూకిస్తూ…

 

Front Image: Portrait – Illustration – Drawing – Two figures at night, Jean-François Millet. Painting.
Download PDF

16 Comments

  • m s naidu says:

    వంశీగారు.
    “నల్లనిమబ్బులు వెంట్రుకలు రాలుస్తాయి” అనటం బాగుంది

  • mercy margaret says:

    మంచి కవిత వంశీ .. కొన్ని రాత్రుల తరువాత ఉదయాలు ఎంత బాగుంటాయో , ఆ ఉదయాల
    కోసం ఎదురు చూపులో ఎంత హాయి ఉంటుందో , అంత అందంగా ఉంది నీ కవిత కూడా ..

  • K.Geeta says:

    వంశీ గారూ,
    కవిత చెప్పిన విధానం చాలా బావుంది-
    అయితే చదువుతుంటే అనువాద కవిత చదువుతున్న అనుభూతి కలుగుతోంది-
    కవితలో వాడిన పదాలు రొట్టె, వేడిచారు లో ముంచుకోవడం,
    …బీథోవెన్ మూన్ లైట్ సొనాటానో,
    మరి మొజార్ట్ స్ప్రింగ్ నో వేలికొసలలోంచి
    చెక్కపెట్టెలోని పియానో మెట్లమీదికి జారవేస్తాడు…
    అనడం లాంటివి అలా భ్రాంతి కలగజేస్తున్నాయి.
    కవిత చాలా బావుంది- కీపిటప్-

  • Prasuna says:

    chaalaa manchi kavita vamsi garu.

  • ns murty says:

    వంశీ,

    చాలా అద్భుతంగా ఉంది కవిత. గీతగారిలాగే నాకూ ఎందుకో ఇది అనువాదకవితేమో నని సందేహం వచ్చింది. దానికి బహుశా మీరే కారణం. This is so unlike of your other poems. But it is pleasantly surprising and beautiful.

    తెనాలి రామకృష్ణ సినిమాలో … నీ కత్తికి రెండుపక్కలా పదునే రామకృష్ణయ్యా… అన్న కృష్ణదేవరాయల మాట గుర్తొస్తోంది.

    Congrats.

  • Sai Padma says:

    వంశీ గారూ ,
    చాలా మంచి కవిత. ఒక పెయింటింగ్ కి ద్రుశ్యాను వాదం. ఉదయపు

    తొలికిరణం మంచుని చీల్చేవరకు

    ఆ గదిలో ప్రవహించిన

    ఎండిపోని సంగీతపు చారికలకు

    ఆకలేసిన పావురాల

    కిచ కిచలు గొంతుకలుపుతాయి …

    ఉదయాన్ని మొజార్ట్ భూపాల రాగం చేసేసారు. ఈ సారి చాల ఉదయ రవి చంద్రికలు కూడా వినిపిస్తారని ఆశిస్తూ , సాయి పద్మ

  • కవిత బాగుంది వంశీ …!….సో, మా వంశీ లో మరొక కొత్త వంశీ వున్నాడన్నమాట!

  • చైతన్య స్రవంతి కథా శిల్పం అంటారు
    కవిత్వానికి ఈ శిల్పాన్ని అన్వయించవచ్చా?

    అలాంటి పని ఈ కవితలో వుంది కదా!

  • వంశీ మీ కవితలని మొదట్నుంచీ చదువుతున్నవాడిగా నాకు ఆశ్చర్యమనిపించలేదు కాని మీ కవిత్వం చదవటం ఓ వ్యసం కాబట్టి ఎప్పటిలా ఆనందించాను.నాకు తెల్సి మీ ఒక్క కవితా ఒక్కసారే చదివేసి మొక్కుబడిగా స్పందన రాయలేదు….కొన్ని సార్లు ఆ ఆంగ్ల రెఫరెన్స్ లు ఓ కొత్త మెరుపునిస్తాయి పేలవపు ప్రస్తుత సాహిత్య నేపథ్యంలో…

  • the tree says:

    సరళంగా, సున్నితంగా దృశ్యాన్ని వర్ణించిన తీరు గొప్పగా వుంది,.బాగా రాశారు,…

  • వంశీ says:

    ఇలా చెప్పొచ్చో లేదో తెలీదు.. ఈ కవిత ( దీన్ని కవిత్వం అంటారనే అనుకుని రాసుకున్నాను) నాకంతగా నచ్చలేదు..( బహుశా ఇంతకుమునుపు నేనిలా లేకపోడం వల్లకావొచ్చేమో).. మాములుగా నేన్రాసే రాతలకన్నా కాస్త భిన్నంగా ఉండాలని, చాలా రోజుల్నుండి కప్పుకుని ఉన్న ఓ విదమైన మొనాటనీ ని బద్దలుకొట్టుకోడానికి ఈ ప్రయత్నం చేసాను… నేనెంతో ఇష్టంగా చదూకున్న కవులు, ఎమ్మెస్ నాయుడు గారు, నౌడూరి మూర్తి గారు, కోడూరి విజయకుమార్ గారు, సాయి పద్మ గారు,వాసుదేవ్ గారి మాటలు చదివాకా… “పర్లేదు.. నేననుకున్నది చేయగలిగా”ననే అనిపించింది…:) సమయం వెచ్చించి చదివి నా రాతని మెచ్చుకున్న జాన్ హైడ్ కనుమూరి గారికి, గీత గారికి, ప్రసూన గారికి, మెర్సీ గారికి, భాస్కర్ గారికి నా ధన్యవాదాలు.. :)

  • the tree says:

    వంశీ గారు, మీ వాక్యం శక్తి వంతమైనది, మీరు ఎలా రాసిన అది దూసుకుపోయే గుణాన్ని వదులుకోదు,..అన్ని రకాలు ప్రయత్నించండి,.. కవిత్వానికి అది మేలు చేస్తుందేమో,….

  • వంశీజీ! మీ కవితలకో ముద్రుంటుంది.నిద్రలో కూడా మాకు తట్టని దృశ్యాలని అలవోకగా రాసేసే మణిప్రవాళ భాషని నేటి తరంలో మాష్టర్ చేసింది మీరేనని నాకనిపించేది.ఇంకెప్పుడు థీసిస్ మొదలెడతారోనని ఆశగా చూసే నాకు ..నిజం చెప్పద్దూ..నిరాశనే మిగిల్చిందీ కవిత.. మూర్తిగారి అనుమానం నాకూ వుంది..ఈ పానీయం మన దేశీయంది కానే కాదేమో నని.మొనాటనీ నుంచి బైటకు వచ్చే ప్రయత్నం అన్నారు. ఆర్థమైంది. అదే ప్రక్రియలో ప్రయోగాలు చేయడం వికటించే ప్రమాదముందనిపిస్తుంది. వైవిధ్యం కోసం వస్తువులో మార్పును స్వీకరించవచ్చు. ఏకమొత్తంగా కొత్తప్రక్రియలోనే ప్రయోగాలు చేసుకోవచ్చు. (శ్రీశ్రీ కథలు రాసినట్లు).ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా!. మీ కవిత్వాన్ని కించపరచడం ఎంత మాత్రం కాదు.నేను మీ అభిమానుల్లో ముందు వరస వాడిని. నిజం చెపుతున్నా..మీ కవితలు కంటబడినప్పుడల్లా నేను గబగబా చదివే వాడిని కాను..అవి అప్పటి నా మూడ్ ని డిస్టర్బ్ చేస్తాయేమోనని భయం. రొటీన్ తో విసిగి పోయి మొనాటనీని బ్రేక్ చేసుకోవాలనుకున్నప్పుడు వెతికి వెతికి మీ కవితలు ఒకటికి రెండు సార్లు చదువుకోవడం నా హాబీ.మీ చైతన్యస్రవంతి ధోరణి, ఆంగ్లేయాంధ్రహిందీఉర్దూపదాల మధ్య గోడల్ని మీరతి సునాయాసంగా బద్దలు చేసే పద్ధతి..వర్తమాన సామాజ బలహీనతల ముసుగుల్ని మీరు అత్యంత సహజంగా ఎత్తి చూపించే స్ట్రింగ్ ఆపరేషన్ విధానం నాకు తెగ నచ్చుతాయి.అవే మాకు కావాలి.ఆ మోడల్ మోడ్రన్ పొయిట్రీకి తరువాత తరం మిమ్మల్నేఆదర్శంగా తీసుకోవాలి అని నా అభిలాష.కాకపోతే గతంలోని మీ కవితల్లో గాఢంగా కనిపించని ఒకానొక సున్నితమైన స్నేహపూర్వక స్పర్శ ఈ కవితలో నన్ను బాగా ఆకర్షించింది.మీ మార్కు కవితల్లో కూడా ఆ ఆత్మీయతా ఉందెర్చుర్రెంత్ గా ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటే ఇంకా అద్భుతంగా వుంటుంది. Keep it up ..వంశీజీ..You are our Beacon of Poetry shown to the coming generation

  • వంశీ, పోయెమ్ చాలా బాగుంది. చాలా సార్లు చదివాను.

  • సి.వి.సురేష్ says:

    వ౦శీ గారు మీ కవిత కెప్పుడు ఒక ప్రత్యేకత ఉ౦టు౦ది. నన్నె౦దుకో ఈ కవిత ఒకటికి నాలుగైదు సార్లు చదివి౦చి౦ది. ఒక సన్నివేశాన్ని వాఖ్యానిస్తున్నట్లు నడిచి౦ది. కవిత ఆధ్య౦త౦ ఒకే శైలిని , మృధుత్వాన్ని ఊతకర్రలుగా చేసుకొని నడిచి౦ది. గ్రేట్. వ౦శి ధర్ రెడ్డి, కీప్ ఇట్ అప్…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)