“ఇది పాట కానే కాదు…ఏ రాగం నాకు రాదు”

Siva_3అఫ్సర్ గారు, “మీకు సినిమా సంగీతం, అదే.. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు, అరవం, కరవం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే…మీరు వాటి గురించి ఎందుకు రాయకూడదు,? ” అని అడిగినప్పుడు, “నేనెప్పుడూ రాయలేదండీ..అయినా ప్రయత్నిస్తాను,” అని చెప్పాను. నాలో నేను అనుకున్నాను, “నేను మెలకువగా ఉన్నంత సేపూ ఏదో ఒక సినిమా పాటని ఖూని రాగం చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి రాయలేకపోతానా,” అని.

వ్రాద్దామని కుర్చొంటే అప్పుడు అర్ధం అయ్యింది అసలు విషయం ఏంటో! ఇది టి.వి లో ఎన్నో ఏళ్లుగా టెన్నిస్ చూసాం కదా, దాని పైన బుక్కు రాయటం ఏం పెద్ద పనా అని అనుకొని ప్రయత్నించటం లాంటిదని.

బుర్ర బ్లాకై పోయింది. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ పాటలు వాన తుంపర్ల లాగా ఎడతెరిపి లేకుండా కురవసాగాయి. ”నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి,” అంటూ అమరగాయకుడు ఘంటసాల వారిని తలచుకొని ముందుకు సాగుదామనీ, ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని, ఏకాగ్రతతో, కలానికి పని చెబుదామనీ, కూర్చొన్నా.

“మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నల డోలలూగెనే….కొమ్మల గువ్వలు గుస గుస మనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, నీవు వచ్చేవని,” అంటూ మంద్రస్థాయిలో మృదు మధురంగా భానుమతి గళం ఎక్కడి నించో వినిపించి ఇబ్బంది పెట్టేస్తోంది. ఒక సారి తల విదిలించుకొని, “ఫోకస్..ఫోకస్”, అని నాలో నేనే అనుకొని, కలం కదిపే లోపు, మళ్ళీ అదే గొంతు, “పిలచిన బిగువటరా? అవురవుర! చెలువలు తామే వలచి వచ్చినా” అని   మందలింపు. లెంపలేసుకొని, స్ఫూర్తి కోసం, కొన్ని భానుమతి పాటలు హమ్ చేస్తుండగా, “సడి సేయకో గాలి, సడి సేయ బోకే” అని లాలిత్యం ఉట్టిపడుతూ లీల సున్నితంగా నా పాట నాపేసి, ఏదో మత్తు లోకి తోసింది. “లాలీ..లాలీ..లాలీ..లాలీ.. వట పాత్ర శాయికీ వరహాల లాలీ” అంటూ సుశీలమ్మ నన్ను మరింత నిద్ర లోకి నెట్టే లోపల, “ఘల్లు ఘల్లునా గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్లి పడ్డది,” అంటూ గుర్రపు డెక్కల తాళం లో జానకమ్మ నన్ను మొట్టి లేపింది.

మనస్సు పరిగెత్తినంత వేగంగా నా కలం పరిగెడితే ఈ పాటికి పది పేజీల కాలమ్ పూర్తయ్యేది అన్న ఆలోచన పూర్తయ్యేలోపే  మరొక ఆలోచన  నా వ్రాతకు ఆనకట్ట వేసింది.

“కొత్త పాటల తుంపరలు ఒక్కటీ నా మీద ఇంకా పడలేదేమిటబ్బా!  ఏ పార్టీ జరిగినా మా ఇంట్లో మ్రోగేవి, నేను రెండు గ్లాసుల వైన్ తాగిన తరువాత గెంతేవి ఆ పాటలకే కదా! ఇప్పుడేమిటీ పాటల గురించి వ్రాద్దామని కూర్చొంటే మాత్రం ఒక్కటీ నోట్లో ఆడట్లేదు? నేను మరీ ముసలాడినైపోతున్నానా? చాదస్తంగా ఓల్డంతా గోల్డేనని పాతవే పట్టుకు వేళ్ళాడుతున్నానా?” అంటూ కొన్ని నిమిషాల పాటు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండిపోయా. “కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అంటూ శ్రీశ్రీ నా చెవిలో దూరి అరుస్తున్నా సరే, ఆ నెగటివ్ ఆలోచనలను పక్కకు నెట్టి మళ్ళీ పన్లో పడిపోయా.

“మీకిష్టమైన పాటలేంటి?” అని ఎవరైనా అడిగితే, చటుక్కున నేను పుట్టకముందు పుట్టిన సినిమా పాటలే గుర్తుకొస్తాయి. ఒకసారి ఉండబట్టలేక, మా ఫ్రెండు ఒకడు కడిగేసాడు. నువ్వింకా “కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది” అని ఇక్ష్వాకుల కాలం నాటి పాటలు పాడుకుంటూ ఉంటే, రేపు మీ మనవళ్ళ కాలం వచ్చేనాటికి అంతే తాదాత్మ్యతతో, “సార్..రొస్తా రొస్తారా రొస్తా రొస్తా రొస్తా రా..” అనో “మై లవ్ ఇస్ గాన్.. మై లవ్ ఇస్ గాన్” అనో పాడుకుంటావా అని.

వాడెంత చురకేసినా నేను మాత్రం సీరియస్ గానే చెప్పా, శంకరాభరణం శంకరశాస్త్రి నన్ను ఆవహించినట్లుగా. “బాల్య, కౌమార్య, యౌవన, వృద్ధాప్యాలు పాటలు పాడేవాళ్ళకీ, శ్రోతలకీ ఉంటాయేమో కానీ, పాటలకు కాదురా! ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం దైవాంశసంభూతులైన కొందరి వ్యక్తుల భక్త్యావేశాలు ఒక ప్రవాహమై, శబ్ద రూపేణ ప్రాణం పోసుకొంటే, ఆ ధ్వనులేరా సాంప్రదాయ సంగీతమై, కొన్ని కోట్ల గళాలలో ప్రతిధ్వనిస్తూ, మన సంస్కృతి ఉమ్మడి ఆస్థిలా తరతరాలకూ సంక్రమిస్తూ, శాస్త్రీయబద్ధమైన కర్నాటక సంగీతంలా పక్వత చెంది, లలిత సంగీతంలా సరళీకృతమై,  పాశ్చాత్య రీతులతో సంగమించి, కొంత ప్రకాశించి, మరింత కృశించిన, నేటి మన తెలుగు పాట!”

ఏనాడో రచించిన అన్నమయ్య, రామదాసు కీర్తనలు, త్యాగరాజు, శ్యామశాస్త్రి పాడిన కృతులు ఈనాటికీ  పాడుకుంటున్నాం. కనుక నా మనవళ్ళకు నేను వినిపించపోయే పాటల గురించి నువ్వు జోక్ చెయ్యకు. ఇంకొక వంద  ఏళ్ళు గడచినా “జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా” అని పాడేవాళ్ళు, అది విని ఆనందావేశాలలో తూలిపోయేవాళ్ళు, ఉంటూనే ఉంటారు”, అని నేను ఏకబిగిన ఇచ్చిన ఉపన్యాసానికి అలసిపోయి ఆగిపోయాను.

“అదే మరి, సంగీత రాజా ఇళయరాజా అత్యద్భుతంగా స్వరపరిస్తే అమృతం జాలువారే గాత్రాలతో బాలూ, శ్రేయా ఘోసాల్ పాడిన పాటేగా…నేను నా కార్లో ఎప్పుడూ అదే వింటూ ఉంటా” అంటూ తన సంగీతజ్ఞాన ప్రదర్శన చెయ్యటంతో నా బి.పి తార స్థాయిలోని నిషాదాని కంటింది.

“స్వరబధిరుడా (టోన్ డెఫ్), త్యాగరాజు, పల్లవి, అనుపల్లవి, పది చరణాలతో, వెయ్యేళ్ళు నిలిచిపోయేలా, నట రాగంలో చేసిన రామ సంకీర్తన గురించి నేను ప్రస్తావిస్తే, నువ్వు వేరే రాగం కూస్తావా,” అని విరుచుకు పడ్డాను. “ఇంతకు ముందు వీడి పాటే భరించలేమనుకున్నాం, వీడి మాట కుడా కర్ణ కఠోరం,” అని నాకు వినబడేలా  విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను? అదే నా పాత పాటల పైత్యం గురించి కదూ అసలిదంతా మొదలయ్యింది. పాత పాటలంటే ఏదో కొత్తగా అబ్బిన అభిరుచి గానీ, పెరిగిందీ, ఏళ్ల తరబడి ఆస్వాదించింది “కొత్త” పాటలనే. కొత్తవంటే ఏదో శాస్త్రీయ సంగీతం, ఉదాత్త సాహిత్యం, సింగినాదం అని ప్రాకులాడే కళాతపస్వి సినిమాల్లో పాటలే కాదు, “వినదగు నెవ్వరు కొట్టిన” అని అన్నిరకాల పాటలకూ, తలకాయ అడ్డంగా కొన్నిసార్లు, నిలువుగా మరిన్ని సార్లు ఊపుకుంటూ ఎంజాయ్ చేస్తూనే పెరిగాను. అయినా మరీ దారుణం కాకపోతే, “సంగీతాన్ని కొట్ట్టటం” ఏమిటో! లావుపాటి బెత్తాలతో విపరీతంగా బాదే వెస్టర్న్ డ్రమ్ముల ప్రయోగం మన పాటలలో ప్రారంభించిన దగ్గరనించీ పాట కట్టటం నించి కొట్టటం అయ్యిందేమోనని నా వెధవనుమానం.

ఇలా కొత్త పాటల మేఘాలు కమ్ముకున్నాయో లేదో, తుంపర్లు కాదు, ఏకంగా వడగళ్ళే పడటం మొదలెట్టాయి, గానగాంధర్వ గళంలో. గత నలభై ఏళ్ళలో, నలభైవేల పై చిలుకు పాటలు పాడిన బాలు స్వర తరంగాలు చేరని చెవులు తెలుగు దేశం లో అస్సలు ఉండే ఛాన్సే లేదు. అన్ని పాటలున్నందుకేనెమో, ఓ పట్టాన గబుక్కున ఏదీ మనసుకు తట్టక పోయినా, ఒక సారి మొదలయ్యిందంటే మాత్రం తుఫానే.

“ఏ దివిలో విరిసిన పారిజాతమో…” అని అబ్బురపడ్డా, “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..” అంటూ పాఠాలు చెప్పినా,  “ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా?” అంటూ అన్నగారి గొంతుతో వదినెమ్మను కవ్వించినా, తన గాత్ర వైవిధ్యంతో, అన్ని వర్గాల శ్రోతలని ఆకట్టుకోవటం, బాలూ కే చెల్లింది. అద్గదీ, దొరికింది నేను వ్రాయటానికి టాపిక్. “ఈ ఒక్కాయన కోటు తోకలు పట్టేసుకొని మన సినిమా పాటల సంద్రాన్ని అవలీలగా ఈదెయ్యచ్చు,” అనుకున్నానో లేదో, ఫుల్ వాల్యూం లో “సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది” అంటూ “చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం” అకంపెనీమెంట్ తో, వినిపించే సరికి మళ్ళీ తెలివిలోకొచ్చా.

సినిమా పాటంటే, ఓన్లీ గాయకులేనా గుర్తుకొచ్చేది? “పాటల గురించి వ్రాద్దామని కూర్చోన్నావు, పాటలు వ్రాసేవాళ్ళ నేల మరచితివీవు?” అంటూ మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నుండి, వేటూరి, సీతారామశాస్త్రి గార్ల వరకూ కళ్ళ ముందుకొచ్చి కళ్ళెర్ర చేసినట్లుగా అనిపించింది.

స్వరకర్తల సంగతేమీటంటూ సాలూరి, పెండ్యాల నుండి కోటి, తమన్ వరకూ నిలదీసి ఇరుకున పడేశారు. వారందరికీ స్ఫూర్తినిచ్చి వాళ్ళ నించి అంత గొప్ప వర్క్ ని రాబట్టుకున్న యల్.వి.ప్రసాద్, ఆదుర్తి, విశ్వనాథ్ లాంటి దిగద్దర్శకులు మాత్రం మందహాసాలతో మాటల్లేకుండా నన్ను అయోమయంలోకి నెడుతుంటే, “ఏ తావున రా? నిలకడ నీకు?” అంటూ భానుమతి పాటే మళ్ళీ రియాలిటీ లోకి లాక్కొచ్చి పడేసింది.

“అసలు వీళ్ళందరి గురించి వ్రాయడానికి నీ కున్న అర్హతేంటి? పెద్ద పెద్ద పరిశోధనా గ్రంధాలే వచ్చాయి. మరిక నువ్వు కొత్తగా చెప్పొచ్చేదేంటి?” అంటూ సీరియల్ సెల్ఫ్ డౌట్ చుట్టేసింది.

“ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు” అన్న పాట కూడా  ఇప్పుడే గుర్తుకురావాలా! అసలు ఇంత ఆలోచన అవసరమా? నేను వ్రాయబోయేది చదివేది కూడా నాలాంటి సగటు పాట ప్రేమికులే కదా. నా కోసం, నా మూడ్ బట్టీ, నాకు నచ్చిన ఏ పాట(ల) నైనా, నాది చేసుకొని, నా భావాలను, అనుభవాలను, అనుభూతులను శ్రుతి మించకుండా వ్యక్తపరిస్తే, నచ్చి ఆదరిస్తారేమో! ఒక కొత్త ఆశ చిగురించినా, అఫ్సర్ గారికి ఏమీ వ్రాయలేదనీ, ఆలోచనలతోనే సమయం అంతా గడిపేశాననీ, ఎలా చెప్పాలా అన్న చిన్న విచారంతో నా కలానికి మూత బిగించా.

Download PDF

13 Comments

  • రమాసుందరి says:

    పాత పాటల గురించి మధురమైన కధనం రాసారు.

  • సుపరంటే సూపరు…మొదటి పదం నుంచి చివరి పదం వరకు ఓ చక్కటి చిరునవ్వుతో చదివించారు. wonderful

    narration. పాత కొత్త అన్ని పాటలు కొట్టించేసారు…Expecting many more episodes from యు.

  • Rammohan Rao says:

    మీ హ్యుమరసానికి జోహార్లు .అఫ్సర్ గారి ఎంపిక సరైనదే.

  • లలిత says:

    ప్రారంభం బావుందండీ :)
    త్వరగా కలం మూత తీసి తదుపరి టపాలు ట పాట పా ….రాసేయండి

  • కాజ సురేశ్ says:

    మీ రచనా శైలీ, ఎంచుకున్న పాటలూ రెండూ బాగున్నాయి. అభినందనలు

  • పాటల పల్లకీలో వూరేగే శివరామా
    సలలిత రాగసుధారసంలా
    లలిత లలిత సారంగిలా నవరస భరితంగా
    జోరుగా హుషారుగా పాత పాటల వెన్నెల్లో
    షికారు చేస్తూ చేయిస్తూ
    దేవులపల్లి వారి పాటలు స్వరాజేశ్వర వారి బాణీలో వినిపిస్తుంటే,
    పాత పాటల పూలదండ వాడినా
    వాటి సువాసనల సౌరభం పులకింపచేసింది
    లలిత కలారాధనలో వెలిగే చిరుదీవ్వె లా
    నీ వంతు సాహిత్యారాధన ప్రశంసనీయం.

  • ఈ మధ్యెక్కడో సినీ పాటలు సాహిత్యమేనా అని చర్చని ఆహ్వానిస్తూ రాసిన వ్యాసం చదివి ఆలొచనలొ పడ్డాను..కానీ ఇది చదివాక ఇక ఆ ఆలొచన మానుకుని ఎంచక్కా ఈ పాటలన్నీ నెట్లో వింటూన్నా….ఇలా పాటలపైకూడా రాయగల్గడం ఏ కొద్దిమందికో కానీ చాతకాదు. పాటలగురించి తెల్సిందే అయినా ఇలా అక్షరాల అందాని చూడ్డం ఇదె మొదటిసారి..క్యుడోస్

  • Yaji says:

    Thank you all! Will try and do my best to keep it entertaining in future as well.

  • ఏదో యధాలాపంగా క్లిక్ చేస్తే ,ఆపకుండా చదివించారు,చిరునవ్వించారు !చక్కని శైలి.

  • Yaji says:

    ధన్యవాదాలు నాగలక్ష్మి గారు!

  • Suryam Ganti says:

    మీలాంటి సగటు పాట ప్రేమికుడినే, నేను కుడా . చాలా బాగుంది మీ వ్యాసం . పూలదండ లో దారం దాగుందని తెలుసున అన్న పాట కు మామ ఏ రాగం ఉపయోగించాడు ? . పాట ను ఆనందించ డానికి రాగ జ్ఞానం అక్కరలేదు నాలాంటి పామరులకు .

    • యాజి says:

      సూర్యం గారూ, ఆ పాట సింధుభైరవి రాగంలో కట్టింది. దీని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఇక్కడ చదవగలరు.
      http://www.eemaata.com/em/issues/200011/816.html

      • Suryam Ganti says:

        ఓరిని పడవ వాడు పాడిన పాట వెనక ఇంత కధ ఉందా ! లింకు ఇచ్చి జ్ఞానోదయం కలిగించినందుకు ధన్యవాదాలు యాజి గారు

Leave a Reply to రమాసుందరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)