దేవస్మిత

samanya1resize22/10/2004

ఇవాళ నా శరీరం పై పడిన దెబ్బలు ఎన్నో సారివో లెక్క తేలటం లేదు .  ఐదేళ్ళ   కాపురంలో నా వెదుకులాట దేనికో, అతని గింజులాట ఎందుకో. అనుకునే ఇవంతా జరుగుతున్నాయా?  చికాకుగా వుంది. చచ్చిపోవాలనిపిస్తోంది. దేవస్మితా చచ్చిపోతావా?మరి పిల్లల్నేం చేస్తావ్? నాకు నేనే వేసుకునే ఈ ప్రశ్నకు నాకు నేను ఏమని సమాధానం ఇచ్చుకోను?

10/12/2004

ఇవాళ అత్తమ్మ మాటల్లో మాటగా భోగం బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నది. విపరీతంగా కోపమొచ్చింది. చేతిలో ఉన్న మొబైల్ ని ఆవిడ మీదకి విసిరికొట్టాను. ఆవిడ దెబ్బని తప్పించుకున్నది. కానీ శశిధర్ చేతిలో నాకు దెబ్బలు తప్పి పోలేదు. నాలుగు గోడల మధ్యలో వున్నదాన్ని దెబ్బలెలా  తప్పించుకోగలను?

అమ్మా ఎంత గుర్తొస్తున్నావ్, నీమీద చాలా కోపమొస్తోంది. నీ నీడ నా  మీద పడనీయొద్దు అనుకున్నావ్ కదా? పాపం పిచ్చి అమ్మా ! నువ్వు నీడలా, నా వొంటి పైన పుట్టుమచ్చలా నన్ను వదలటమే లేదమ్మా…వేశ్యవి అమ్మా నాకు కథలు రాయడం రాదమ్మా, చెప్పడం కూడా రాదమ్మా లేదంటే నీకథ వింటే బండరాయి మా అత్త కూడా కరగాలేమో. కానీ అంతా ఉత్తిదే, బండరాళ్ళు ఎప్పటికీ కరగవు. అమ్మా!  నువ్వారోజు మీ పేద ఇంటి నుండి, మీ సంప్రదాయాల నుండి లేచిపోయి రాకుంటే నేనివాళ మంచి కుటుంబపు స్త్రీని అయి వుండేదాన్ని కదా, పోనీ నాకు జన్మనిచ్చిన మగాడు నిన్ను వదిలేయకుండా వుండి వుంటే, భాష తెలియని నగరంలో, దిక్కుతోచని దీనత్వంలో, ఆకలికి ఏడ్చే పసిబిడ్డ కోసమనో, మరే త్వరిత మార్గమూ లేకనో నువ్వు నీ శరీరాన్ని అమ్ముకోక పోయి వుంటే భోగంతనం నా ఇంటిపేరు కాకపోయేది కదా అమ్మా!

ఇవాళ మా మిషనరీ స్కూల్, హాస్టల్ బాగా గుర్తొస్తోంది.అది గుర్తొస్తే భయమేస్తుంది. అమ్మ ఎందుకు ఎప్పుడో ఏడాదికొకసారి మాత్రమే వస్తుంది? సెలవలలో వెళ్ళడానికి నాకో ఇల్లెందుకు లేదు? అమ్మ వున్నా నేను అనాధని ఎందుకవుతాను? ఇట్లా ఎన్ని ప్రశ్నలో. పాపం అమ్మ ఎంత బాధపడేదో. నా వత్తిడి భరించలేక తనుండే  వేశ్యా వాడకి తీసుకెళ్ళింది అమ్మ. ఆ వాడలో అమ్మ ఉంటున్న చిన్న గదిలో పరుపుపైన దగ్గరగా కూర్చోపెట్టుకుని  తన కథ చెప్పినప్పుడు అమ్మ వాడిపోయిన కళ్ళ నిండుగా ఊరిన కన్నీళ్ళు.  ప్చ్! ఆ కన్నీళ్ళు గుర్తొస్తే ఎంత బాధేస్తుందో. అమ్మ గది పరిశుభ్రంగా ఉండింది. గదిలో ఒక మూల అందమైన చెక్కడపు పూజామందిరం, ఆ మందిరంలో పతిత పావనుడు సీతా సమేత రాముడు. అక్కడున్న అందరూ అమ్మలా చీర కట్టుకుని లేరు, చాలా మంది చిన్న చడ్డీలతో, బ్ర్రాతో స్వేచ్చగా తిరుగుతున్నారు, చుట్టూ అంతటా మురికి, వచ్చిపోయే కస్టమర్లు. ఇంకా స్నానమైనా చేయని ఆ మురికి ఆడవాళ్ళతో యెట్లా రమిస్తారు? స్త్రీని కామించడానికి మగవాడికి ఏమీ అక్కర్లేదేమో, ఒక జననాంగమే చాలేమో!

అంతే ఆనాడు ఆ వాడలో కలిగిన భయం… ఆ రాత్రి అమ్మ పరుపుపైన ముడుచుకుని ముడుచుకుని, జుగుప్సతో, కలలో కలత నిద్రలో వొందల స్థనాలు పాములై సాగి సాగి, నన్ను చుట్టుముట్టి, నలిమి నుజ్జుచేసి, నా కన్నీళ్ళై…  ప్రభువా! జీసస్! నాయనా నాకొద్దీ కష్మలం, కల్మషం, వేలాంగాల వీర్యాలతో తడిసిన జననాoగాల వాడా సంచారం నాకొద్దు. జీసస్! జీసస్! రక్షించు. నేనే వారై, వారే నేనై … అంగమే అన్నమై కడుపులోకెళ్ళే స్త్రీలు నాకొద్దు జీసస్. జీసస్! కురిసే వాన చినుకులలో ఆకుల గొడుగు క్రింద అటుఇటు చంచలించే రంగు రంగు పిట్టలతో అందంగా, పరిశుభ్రంగా భద్రంగా వుండే ప్రపంచం కావాలి నాకు. పైన పరిగెడుతున్న మేఘాల్లా, ఆకాశం అంచున మిలమిలలాడే వెన్నెల్లా పరిశుభ్రత కావాలి. నన్ను పాపలా హత్తుకుని ప్రేమించే నీ లాటి భద్రమైన చేతులు కావాలి. అమ్మ వద్ద నుండి పారిపోవాలి పారిపోవాలి…. శశిధర్ నుండి అతని కుటుంబం చేసే అవమానాల నుండి పారిపోకపోవడానికి ఆరోజు నాలో కలిగిన ఆ భయమే కారణమేమో. లేదంటే మనిషిని మనిషి పశువులా కొట్టే హింసని తనేనాడైనా ఊహించిందా? పక్షినీ,పశువునీ, మనిషినీ సమంగా ప్రేమించే ధర్మం కదా తను నేర్చుకుంది.

కష్టపడి చదివి ఎయిర్ హోస్టెస్ వుద్యోగం సంపాదించి, అమ్మా రామ్మా నా వద్దకు రామ్మా అంటే అమ్మ ఏమన్నదీ, ”వద్దు బంగారూ నువ్వు మంచిగా పెళ్లి చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, నేనొకదాన్ని ఉన్నానని మరిచిపో, ఎవరడిగినా అనాధనని చెప్పు.  పొరపాటుగా కూడా నా గురించి చెప్పకు,” అని. అలా చెప్పిందా తను శశిధర్ కి , లేక జీవితంలో నిజాయతీ ముఖ్యమనుకుందా?  శశిధర్ ఎంత మంచివాడు, ఎంత సున్నిత మనస్కుడు. శశిధర్ కి నిజమే చెప్పాలి తనని అంతగా ప్రేమిస్తున్నాడు కదా, వేశ్య కూతురినైనంత మాత్రాన వదులుకుంటాడా? అసలు వదులుకోడు! ప్చ్! ఎంత నమ్మకం. ఎంత నిజాయితీగా శశిధర్ కి ఆ సంధ్య వేళ ఏర్పోర్ట్ వెలుపలి కాఫీడే కేన్ కుర్చీల్లో ఒక మూలగా కూర్చుని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. అంతకంటే ఆత్మీయులు ఎవరున్నారు జీవితంలో, అందుకే పొంగి పొంగి వచ్చింది ఏడ్పు ఎంత ఆపినా ఆగిందా? కానీ దేవస్మితా నీతి, నిజాయతీ అనేవి అమాయకత్వానికి అక్కచెల్లెళ్ళు. అమ్మ అట్లాగే అమాయకంగా మోసపోయి కదా లేచొచ్చింది. అమ్మ కూతుర్ని నేను తెలివైన దాన్ని కాగలనా? ఏం చేసాడు శశిధర్. అతను చెప్పిన ప్రేమ, జీవితకాలపు బంధం అంతా వట్టి మాటలే. నా శరీర నగ్నత్వాన్ని, నా హృదయ నగ్నత్వాన్ని అనుభవించి పారిపోవాలనుకున్నాడు. మా అమ్మ నాన్నలు నాకు ఎదురు చెప్పరు అన్న నోటితోనే, వాళ్ళు వొప్పుకోవటం లేదు అనేశాడు. ఎందుకని? వేశ్య కూతురిననే కదా? అమ్మ పుడుతూనే వేశ్యగా పుట్టిందా? అనాధనంటే ఎందుకు ఇష్టపడ్డాడు. ఏ వేశ్యో కని  అనాధగా వదిలేసి ఉండకూడదా? అమ్మ బ్రతికి ఉండటమే అతని అభ్యంతరమా? వత్తిడి భరించలేక, చెప్పుకునే తోడు లేక అమ్మకి చెప్తే అమ్మ ఏం చేసింది. తన అడ్డు లేకుండా చేసింది. నిజంగా అనాధను చేసేసింది. అన్నేళ్ల కష్టాలను భరిస్తూ వచ్చి ఈ కష్టాన్ని భరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య నారక్తంలో ఉందేమో లేకుంటే ఎందుకు ఊరికే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నాకు? కుటుంబం వద్దనుకుంటే ఒక్క నిమిషంలో వదిలిపోయే హింస ఇదంతా,  కానీ ఎలా వదులుకోను?

03/03/2006

చిన్నీని, పాపని స్కూల్ నుండి తీసుకొస్తున్నాను. చిన్ని మధ్యలో పిజా తిని వెళ్దామన్నాడు. చేతిలో ఎప్పుడైనా డబ్బు ఉంటుందా! లేదు నాన్నా ఇంటికెళ్ళి నానమ్మనడిగి మనీ తీసుకుని తరువాత  వెళ్దామంటే వాడు ఊరుకున్నాడా ఒకటే ఏడుపు. చిరాకు పుట్టింది. తొడ పాశం పెట్టేసాను. వాడి ఏడుపు చూసి ఒకటే ఏడుపొచ్చింది. ఎన్నిసార్లడిగింది తను శశీని కొంత మనీ ఇవ్వు నాకు అన్నింటికీ మీ అమ్మనడగలేకున్నాను అని. అతను నా  పట్ల ఎందుకంత కఠినంగా  ఉంటాడు. ఔననో కాదనో చెప్పొచ్చు కదా. “అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన దానివి, నీకు పెద్ద వాళ్ళ విలువ ఎలా తెలుస్తుందిలే. కానీ అట్లా నీకు పర్సనల్ మనీ ఇవ్వడం కుదరదు ఏదైనా అమ్మనడిగి తీసుకోవాల్సిందే,” అన్నాడు. అతను అదే తరహాలో మాట్లాడతాడని తెలిసినా మనసు మళ్ళీ మళ్ళీ చిన్నబుచ్చుకుంటుంది ఎందుకనో, పోనీ వుద్యోగం చేయనీయోచ్చు కదా అంటే పిల్లల్నెవరు చూస్తారు? అతని తల్లినెవరు కనిపెడతారు.ఆడపిల్ల అంటే ఇంకో అర్ధం అడ్జెస్ట్ మెంట్ అనేమో. ఎంతకని సర్దుకుపోను? చాలా ఫ్రస్ట్రెటింగ్ గా అనిపిస్తుంది.

08/12/2007

అత్తమ్మ కూతురి దగ్గరకు వెళ్ళిపోయినప్పటి నుండి ఏవిటో ఒకటే దిగులు. ఎప్పుడు ఇంటినిండా మనుషులు ఉండాలనిపిస్తోంది. ఒంటరి బ్రతుకు కావడం చేతేమో ఇల్లంతా బోసిగా అనిపిస్తోంది. ఆవిడకి నేనంటే ఎంత ద్వేషమైనా ఆవిడ మీద కోపం రాదు. ప్చ్ అందరం ఆఫ్ట్రాల్ వొందేళ్ళు బ్రతికి చచ్చే మనుషులమే కదా. శశిధర్ మీద వున్న కోపం కూడా ఆవిడ మీద కలగదు నాకు. ఎందుకో బాగా ఒంటరిగా అనిపిస్తోంది.నిజమే నేను అనాథని.

10 /01/2008

ఇవాళ చాలా పెద్ద గొడవ జరిగింది.’జిన్నూ’ మాజీ ఎం ఎల్ ఎ  కొడుకుని కరిచింది. పసిబిడ్డ వాడిని కరవడం నిజంగా బాధే. కానీ వాడు దాన్ని ఎందుకు కొట్టాలి. వాళ్ళమ్మ  గొడవకు వచ్చింది. ఎంతచెప్పినా వినిపించుకోదే. చివరికి విసిగి ఇంట్లోకొచ్చి తలుపు వేసేయ్యగానే ఆవిడకి ఇగో దెబ్బతిన్నట్లుంది. కొడుకు చేతిలో కర్ర తీసుకుని సిటవుట్లో ఉన్న నిలువెత్తు యాక్వేరియంలు రెంటినీ పగలకొట్టేసింది. నేను తలుపు తీసుకుని వచ్చేలోపు వెళిపోయింది. నాకు గిర్రున తల తిరిగింది. ఎంత అహంకారం. తిని తిరగడం తప్పించి ఇంకోపని ఉండదు ఆవిడకి. డబ్బుందనే కదా ఆ అహంకారం. ఈవిడే కాదు ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళంతా డబ్బుండే వాళ్ళే. వాళ్ళతో కలవడం కూడా అసహ్యం నాకు. కిట్టీ పార్టీలని వీళ్ళు కలిసి మాట్లాడేదంతా బూతులే. ఎవరు ఎవరితో పడుకున్నారు, ఎవత్తె  ఎవడితో వుంది ఇదే. ఐ హేట్ దిస్ లొకాలిటీ. శశిధర్ నాకు ఆత్మనూన్యత అంటాడు. నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను వాళ్ళతో కలవనీయటం లేదంటాడు. నేనెందుకు ఇన్ఫీరియర్ గా ఫీలవుతాను వాళ్లకి తెలియనన్ని, ఎప్పుడు వినను కూడా వినని పుస్తకాలు నేను చదివాను, సంగీతం తెలిసినదాన్ని, దేశాలను చూశాను, మనుషులని కలిసాను.  మొద్దు  మొఖాలు వాళ్ళతో నాకు పోలికేంటి. ట్రూలీ ఐ హేట్ శశిధర్. చేపలన్నీ కిందపడి గిలగిలలాడుతుంటే ఏడుపు ఆగలేదు.  గబగబ పరిగెత్తి బకెట్లో నీళ్ళు తెచ్చి అన్నింటినీ తీసి బకెట్లో వేసినా చిన్ని చిన్ని చేపలు నాలుగు  చచ్చిపోయాయి.  కోపం గిర్రుమని వచ్చి తల తిరిగింది. వాళ్ళింటికి వెళ్లి ఆవిడని బయటకి పిలిచి పాప టెన్నిస్ బాట్ తో యాక్వేరియం పగలకొట్టిన చేతిమీద ఒక్కటిచ్చాను. అందరూ గొడవకొచ్చేరు. ఇంటికొచ్చి తలుపేసుకున్నాను. శశిధర్ రాగానే కంప్లైంట్ చేశారు. చెయ్యి విరగకొట్టానని నా మీద కేసు పెడతామన్నారు. శశిధర్ నా ముఖం మీద వుమ్మేసి  తన ఖర్మ కొద్దీ దొరికానన్నాడు.

03/03/2008

ఈ రోజొక తమాషా జరిగింది. కోర్టుకి వెళ్ళానా, కోర్టులో ఒకతను కనిపించాడు. చాలా అందగాడు. మగవాళ్ళ అందాన్ని నేనెప్పుడూ గమనించలేదు. అలా గమనించాల్సిన అవసరం లేకుండానే అతను అందగాడని తెలిసిపోతోంది. కోర్టులో ఎవరికో దారి ఇవ్వడానికి వెనక్కి జరిగానా,  వెనకే వున్న అతనికి గుద్దుకున్నాను. బేలన్స్ చేసుకోలేకపోతున్న నన్ను రెండు చేతులతో పట్టుకున్నాడు. సారీ చెప్పి వెనక్కు జరిగాను. అలా జరిగేప్పుడు చూసుకున్నాను నేనతనికి సరిగా భుజాల వరకు వున్నాను. చాలా పొడవుగా ఉన్నాడు. నేనే జండా కొయ్యలా ఉంటానని అంటాడు కదా శశిధర్, బహుశా అతను ఆరుంపావు అడుగులు ఉంటాడేమో. అక్కడ ఉన్నంత సేపు అప్పుడప్పుడు అతన్నే చూస్తూ ఉన్నాను.

08/05/2008

ఇవాళ లాయరాఫీసులో మళ్ళీ అతను కనిపించాడు. పలకరింపుగా నవ్వాను . చేతులు కట్టుకుని నిల్చున్నవాడు ఆ చేతులు విప్పకుండానే ‘హాయ్’అని చేతివేళ్లు కదిలించాడు. ఏదో టెన్షన్ లా వుంది. నేను వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి అతను కూడా వచ్చి కూర్చుని అక్కడున్న మేగజైన్ చదవటం మొదలు పెట్టాడు. ఎందుకనో అతన్ని చాలా సార్లు చూశానని అనిపించింది.  అతనితో అదే విషయం చెప్తే, తనో కాలమిస్టునని, ఫలానా ఇంగ్లీష్ మంత్లీ లో  తన ఫోటో చూసి ఉండొచ్చునని చెప్పాడు. అప్పుడు జ్ఞాపకమొచ్చింది.  తన రీసెంట్ రైటింగ్ పైన నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అదే చెప్పాను, అతను శ్రద్దగా విన్నాడు. చివరిగా వచ్చేస్తూ ఏదో అడ్వర్టైజ్ మెంట్ లో చూపించినట్లు నా మొబైల్ కనిపించట్లేదు ఒకసారి రింగ్ చేస్తారా అనాలేమో. కానీ నాకు అబద్ధం చేతకాదు. ఎందుకో మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలనిపిస్తూ వుంది. మీరు చాలా అందంగా వున్నారు అందుకని అన్నాను. అప్పుడతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూసాను. కొంచమన్నా మార్పులేదు, సర్ ప్రైజ్. చాలా కేజువల్ గా చేయిచాచి కమల్ అగర్వాల్ అన్నాడు. నేను చేయి కలిపి దేవస్మిత అని నవ్వాను. మీ పేరు బాగుంది లైక్ యువర్ స్మైల్ అన్నాడు, అని మీ మొబైల్ కి రింగ్ చేసేదా అన్నాడు. ఇంటికొస్తున్న దారిలో నాకు నేనే నా ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోయాను. యెందుకలా  ప్రవర్తించాను? అయినా నేను ఈ కాలపు అమ్మాయిని. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడటం తప్పేంటి? ఇదేం తప్పు కాదు నిజమే. కానీ, ఇంతకు ముందు నేనలా లేను కదా మరి.  మే బీ అయాం  ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ డెస్పరేషన్. ఫ్రాయిడ్ ని వెతకాలి.

16/08/2008

కమల్ తో బాగా స్నేహం కలిసింది. మాట్లాడేందుకు బోలెడు విషయాలు. కానీ అతను పైకి కనిపించినంత స్టేబుల్ కాదు. చాలా ఎమోషనల్. మార్వాడీ తండ్రికీ హిందూ తల్లికీ జన్మించాట్ట. అక్రమ సంతానం. మనువు ప్రకారం ఇతను ఏ చండాల కులంలోకి వస్తాడో.  విధిలేని పరిస్థితుల్లో తండ్రి అతన్ని అంగీకరించాట్ట అయినా తండ్రితో దాదాపుగా లేడు. సగం చదువు విదేశాలలో. తల్లీ, అతను. నేనో వేశ్య కూతుర్నని చెప్పాలనుకున్నాను. ఇష్టమనిపించలేదు. నా జీవితంలో ఇంకో మగాడ్ని నమ్మడమా? సమస్యే లేదు!

15/10 /2008

కమల్ ఇవాళ ఇంటికొచ్చాడు. నా పుస్తకాలు చూసి ఆశ్చర్యపడ్డాడు. అతని పుస్తక పరిజ్ఞానం నన్ను ఆశ్చర్య పరిచింది. ఆకర్షణా కలిగింది. ఇతన్ని చూపించి శశీతో చెప్పాలి. చూశావా అతనెంత చదువుతాడో అని. నువ్వేం చదవవు. ఎదుగూ బొదుగూ లేకుండా అక్కడే వున్నావు. నాకు ఏ ఆకర్షణ లేదు నీ పై అని. అప్పుడేం అంటాడు శశిధర. నవ్వొస్తుంది. ఏముంది బూతుల  మేళం మొదలెడతాడు.  కమల్ వచ్చేసరికి నా సంగీత సాధన జరుగుతోంది. అందుకని పాడమంటున్నాడేమో  అనుకున్నాను. కానీ కాదు.  అతనికి సంగీతమంటే పిచ్చి. హిందుస్తానీ, వెస్ట్రన్ బాగా తెలుసు. అందుకని త్యాగరాజ  కీర్తన ”రామ నీ సమానమెవరు రఘు వంశోద్ధారక/ భామ మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక /పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు…”పాడాను. పాడి ముగించగానే కళ్ళు విప్పార్చుకుని నన్ను చూస్తూ ఆ పాట అర్ధమేమిటో చెప్తావా అన్నాడు. యేమని చెప్పను, అన్యమెరుగని ప్రేమని భక్తి అంటారని చెప్పాను, ఇంకా యేవో చెప్పాను. అర్ధం చెప్పగానే లేచి నా రెండు భుజాలు పట్టుకుని గొంతుపైన ముద్దుపెట్టాడు. విదిలించి కొట్టి గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. అతనిపై నా భావమేంటి? నా పై అతని భావమేంటి? అతను అందంగా కనిపించడమంటే కామించానని అర్ధమా, విషయాన్ని ప్రేమించడమంటే ఆ సంబంధిత వ్యక్తిని ప్రేమించినట్లా, ఎందుకనో ఏడుపొచ్చింది. కాసేపాగి వచ్చి చూసేసరికి అతను లేడు.

22/10 /2008

కమల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసాను. మనసుకేం కావాలో ఏం వద్దో క్లారిటీ లేదు. తను మెసేజ్ పెట్టాడు ”దేవీ నేను చేసింది తప్పని నీకు తోచి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చెప్పమంటావా ఐ నీడ్ యు వెరీ బాడ్లీ . అమ్మాయిలేం నాకు కొత్త కాదు. కానీ నువ్వు మాత్రం చాలా కొత్త. మనం ఇప్పుడు కావాలంటే విడిపోదాం, ఒక పదేళ్ళకి కలుద్దాం. అప్పుడు కూడా నా అభిప్రాయంలో మార్పు రాదు. నాకు నువ్వు కావాలి. ఇద్దరు పిల్లల తల్లిని ఇలా అడగడం న్యాయం కాదు కానీ అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా, పిల్లల్తో సహా నాతో వచ్చేయగలవా,” అని. మెసేజ్ చదవగానే తలతిరిగింది. ఓటిదో మోటుదో ఒక కుటుంబం వుంది కదా నాకు. దాన్ని వదిలేయమని ఎలా అంటాడు ఇతను. చిరాకేసింది.

28/10/2008

కమల్ నుండి చిన్న పలకరింపు కూడా లేదు. ఏమిటో ఒక చెడ్డ నిశ్శబ్దం. హృదయంలోనూ, భౌతికంగానూ. నేనెందుకీ వత్తిడి భరించాలి. అతనితో మాట్లాడి మందలించేయాలి. అమ్మాయిలు మగవాళ్ళతో  స్వేచ్చగానో, కొంచెం చనువుగానో  ఉండకూడదా.  ఛీ! అయినా నేనేంటి మరీ టిపికల్ విమెన్ లాగా ఇలాంటి డైలాగ్స్ చెప్పుకుంటున్నాను. తనకీ నాకూ మధ్య ఒక కెమిస్ట్రీ డెవలప్ అవుతుందని తెలియనంత చిన్న పిల్లనా? యేరు దాటాక, తుంగ బుర్రలా నాకటువంటి ఉద్దేశం లేదు  అని చెప్పాలా? అది ఆత్మ వంచన కాదా? ఛీ! చిరాగ్గా వుంది ఏవిటో. శశి రేపు వెళిపోతాడు కదా, అప్పుడు పిలవనా. అయినా నేనెందుకు పిలవాలి.

10/11/2008

పిల్లల్ని స్కూల్ లో  వదిలి వస్తుంటే ఎదురుగా వున్నషాపింగ్ మాల్ నుండి వస్తున్నాడు కమల్ . ఒక క్షణం నన్ను చూసి వెళ్ళిపోయాడు. ప్రేమ అన్నాడు కదా ఇదేనన్నమాట ప్రేమ. కోపమొచ్చింది. అతనికి ఫోన్ చేసాను. కానీ ఏం మాట్లాడాలో తోచలేదు, కట్ చేసి ఇంటికెళ్ళేసరికి ఇంటిముందు తన కారు.

17/02/2009

దేవస్మిత చెడిపోయింది. మామూలుగా చెడిపోతే పర్లేదు కానీ మనసా వాచా కర్మణా చెడిపోయింది. యెట్లా? రోజు రోజుకీ పెరిగిపోతున్న కాంక్ష.  ఎప్పుడూ తనతోనే వుండాలని, అతనితోనే చచ్చిపోవాలని, ప్రతిసారీ అతనంటాడు నాతో వచ్చేయవా అని. ముందూ వెనుకా ఎవరూ లేని దాన్ని వెళ్ళిపోతేనేం. కానీబాధేస్తుంది. పిల్లల్ని నాలానే చేయాలా? జీవితాంతం వాళ్ళమ్మని తల్చుకుని బాధపడాలా?

22/12/2009

ఇవాళ కమల్ ని శశిధర్ చూశాడు. ఊరికే చూడటం కాదు. నన్ను కమల్ ముందే దారుణంగా కొట్టడం మొదలు పెట్టాడు. కమల్ అడ్డమొచ్చాడు, కమల్ నీ కొట్టడం మొదలెట్టాడు. నాకు ఏడుపొచ్చింది కమల్ ని బయటకి నెట్టి  తలుపేసాను. శశిధర్ ముఖం పాలిపోయింది. నాకు  కొంచమన్నా సిగ్గుగానో వెరపుగానో అనిపించలేదు. పైపెచ్చు ఏదో సాధించినట్టు మనసుకి హాయిగా అనిపించింది. గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. పిల్లలొచ్చారని తలుపు తీశాను. అతను లేడు.

01/01/2010

శశిధర్ ఒక వారంగా ఇంటికి రాలేదు. ఇవాళే  వచ్చాడు అతను రాలేదని నాకు దిగులు కూడా అనిపించలేదు. కమల్ ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాడు వచ్చేయమని. ఈ ఘర్షణ  క్రుంగదీస్తోంది వెళ్ళాలా వద్దా అని. పాప మెడ చుట్టూ చేతులేసి ఎంత మంచి అమ్మ మా అమ్మ అన్నపుడు ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. మరి ఎలా వెళ్ళను?

ఈరోజు శశిని చూడగానే చిరాకేసింది. పిల్లలు నిద్రపోయాక నా పక్కన చేరాడు. ఏం నేను చాలలేదా? అమ్మ బుద్ధులు తలెత్తాయా? అంటూ ఏమిటేమిటో అన్నాడు. మీద పడ్డాడు. అది కామమా? ఇంకో మగాడిని ఇష్టపడుతున్నానని తెలిసీ అతనికి నా మీద కామమెలా సాధ్యమయింది? నెట్టినా గిల్లినా కొట్టినా వదలలేదు. ఆశ్చర్యమేసింది. వళ్ళు శుభ్రంగా కడుక్కుని వచ్చి,”నీకో విషయం చెప్పాలి శసి ఐ స్లెప్ట్ విత్ హిమ్ సో మెనీ టైమ్స్. మన మధ్య ఇక కాపురం అసాధ్యం,” అన్నాను. నిజానికి నాట్ మెనీ  టైమ్స్, కానీ అట్లా చెప్పాలనిపించింది. కమల్ తాకిన శరీరాన్ని ఇతను తాకకూడదనా? ఏమో!  ఏమైనా నేను డ్యుయల్ సిం కార్డ్ మొబైల్ ని కాదు. కర్మ చాలక వేశ్య అయిన అమ్మ కూతురినే కానీ వేశ్యని కాదు. అయినా ఈ లోకంలో వేశ్యలు లేరు. విటులు మాత్రమే వున్నారు. వాళ్ళు కొంతమంది ఆడాళ్ళని ఉపయోగించుకుని వేశ్యలని పేరు పెడతారు. అంతే. ఐ హేట్ మెన్. అతను తలకింద చేతులుంచుకుని అలాగే నగ్నంగా పడుకున్నాడు. అతని నగ్నత్వం జుగుప్స కలిగించింది. అతనేం సమాధానం ఇవ్వలేదు. వెళ్లి హాల్లో పడుకున్నాను. తెల్లారేసరికి అతనులేడు.

26/01/2010

రెండో తేదీ కమల్ ని పిలిచాను. విషయం వినగానే అతని ముఖంలో రంగులు మారాయి. రంగులు మారిన అతని ముఖాన్ని చూడగానే నాకు మనసులో నవ్వొచ్చింది. నేను ఇంకా కూడా శశీ భార్యనే. నన్ను తాకడానికి సర్వ హక్కులూ వున్నవాడు అతను. అట్లా కాదు నన్ను తాకనివ్వను అని నేనితనికి చెప్పానా? ఏవిటో చిరాగ్గా వుంది. ”మనం ఫారిన్ కి వెళ్దాం. నాకు జాబ్ ఈజీగా వస్తుంది, నేను లింగ్విస్ట్ ఎక్సపర్ట్ ని. గ్రీన్ కార్డ్ హోల్డర్ని,” అన్నాడు. నేను మాట్లాడలేదు. అతన్ని కౌగిలించుకుని కూర్చున్నాను అప్పుడొచ్చాడు శశిధర్. మళ్ళీ గొడవ. నాకు విపరీతంగా దెబ్బలు తగిలాయి. కమల్ నన్ను బయటకి తీసుకొచ్చాడు. నేను కమల్ తో వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ ఊరెళ్ళే బస్సెక్కించమని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. నేను కమల్ తో వెళ్లలేదని ఎలా తెలుసుకున్నాడో శశి జయంతికి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. జయంతికి అన్నీ తెలుసు పదిరోజులకు నన్ను తీసుకుని ఇంటికి బయల్దేరింది. నాకసులు క్లారిటీ రావటంలేదు. పిల్లలు ఒకటే గుర్తుకొస్తున్నారు. కమల్ గుర్తుకొస్తున్నాడు. ఊర్లో దిగగానే హోటల్ రూం తీసుకుని కమల్ ని పిలిచాను.జయంతి తో  కలిసి డిన్నర్ కి వెళ్లాం అర్దరాత్రి దాటింది. వస్తూ వున్న దారిలో చీకటి  పూసినట్ట్లున్న చెట్టుకింద కమల్ హట్టాత్తుగా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. జయంతి పక్కనే వుంది.  అయినా అన్ని రోజుల ఎడబాటు నన్నతనికి అల్లుకునేట్లు చేసింది. కార్లో జయంతి ముభావంగా కూర్చుంది. మరుసటి రోజు ఇంటికెళ్లాం. శశి, జయంతిని చూడగానే ముఖం దుఃఖంగా పెట్టాడు. పెట్టడమే కాదు అతని కళ్ళలో నీళ్ళొచ్చాయి. జయంతి అతనితో, ”జరిగిందేదో జరిగి పోయింది రెండు  చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. స్మిత నాకు ఎప్పటి నుండో  తెలుసు. తను అలాటిది కాదు. మీరు  కూడా అది అనాధ అని అలుసు తీసుకుని , ఏం చేసినా అడిగే వాళ్ళెవరూ లేరని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. తను జీవితం లో చాలా సఫరయింది ఇంకా ఎంతకని బాధ పడగలదు.  ఇకనైనా బాగుంటే  మంచిది. మీరు ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు,” అంది. నేను  అక్కడినుండి లేచి వచ్చేసాను. ఏడుపొచ్చింది. చక్కటి కుటుంబాన్ని గురించి ఎన్ని కలలు  కన్నది తను. జయంతి చెప్పినా ఎవరు చెప్పినా గతం పునరావృతం కాగలదా? శనివారం జయంతి వెళిపోయింది.

8/4/2010

ఇప్పుడు శశి ఇంతకు ముందటిలా కాదు. ఎక్కడికెళ్ళినా పదే పదే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఎన్ని సార్లడిగేదో తన, ఫోన్ చెయ్యవా రోజుకోసారన్నా అని. నీకులాగా నాకు పని లేదనుకున్నావా అనేవాడు. ఒక ఎయిర్ హోస్టెస్ గా ఒక పైలెట్ కి ఎంత పని ఉంటుందో తనకి తెలియదా? ఇప్పుడెట్లా సమయం దొరికింది? వెళ్తూ వెళ్తూ వేలకి వేలు టేబుల్ మీద పెట్టి వెళ్తాడు. కమల్ ప్రస్తావన అసలు రానీయడు. ఇది ప్రేమా? ఏమో నాలో ప్రేమ చచ్చిన తరువాత ఇతనిలో ప్రేమ మొదలయినట్లుంది పాపం. కానీ శశీ నీకోసం ఈ మనసు ఎంత తపన పడేదో. కలలొ నువ్వు తాకినా శరీరం పులకరించేది. నువ్వు విమానమెక్కిన ప్రతి సారీ నీకేమయినా అయితేనో అని వణుకొచ్చేది. అట్లా అయితే   గుండాగి చచ్చిపోతానేమో అనుకునేదాన్ని. ఒక వేళ  అట్లా కాకుంటే నీతో పాటూ ఆత్మ హత్య చేసుకుంటాను కానీ నిన్ను వదిలి బ్రతక గలనా అనిపించేది. నిన్ను  పిచ్చిగా ప్రేమించిన దేవస్మితని ఎంత పతనం చేసావు కదా? నా ప్రేమని పిచ్చి పురుగులా కాలికింద వేసి నలిపేసావ్. మళ్ళీ నువ్వు చెప్పినట్లు విని ఇంతకు మునుపులా నీ జీవితంలో ఉండడానికి నేను నువ్వు నడిపే విమానాన్నా శశీ?

24/05/2010

ఇక తనతో వచ్చేయాల్సిందే అన్నాడు కమల్. వెళ్లాలని నాకూ వుంది. శశిధర్ ని ఏం చెయ్యను? అన్నేళ్ళూ అతను నన్ను పెట్టిన హింసంతా ఏమయింది? ఇప్పుడింత సాత్వికంగా ఎలా వుండగలుగుతున్నాడు. అతని నిజ స్వభావం ఏది. ప్చ్! విసుగ్గా వుంది.

12/06/2010

ఈ రోజు కమల్ తో వుండగా అనుకోకుండా శశి వచ్చాడు. మళ్ళీ ఘర్షణ జరుగుతుందేమోనని చిరాకేసింది.  మీ ఇద్దరితో మాట్లాడాలి కూర్చోండి అన్నాను. ఆ క్షణం ఆలోచించేందుకు అవకాశముండి, ఆలోచించి  మాట్లాడి వుంటే ఏం మాట్లాడి ఉండేదాన్నో తెలీదు కానీ అప్పుడు మాత్రం చాలా మామూలుగామ, ”శశీ నాకు మీ ఇద్దరు కావాలి. పిల్లల కోసం, కుటుంబంగా నువ్వు కావాలి. ఎందుకంటె నా పిల్లలు నాలా బాధపడకూడదు. అట్లాగే  నా హృదయంలో హృదయం గా కమల్ కావాలి. నువ్వు లేకున్నా నేను బ్రతకగలను.కమల్ లేకుండా బ్రతకలేను. నేను కావాలని నీకు గాఢం గా  ఉంది కాబట్టి ఒకపని చేద్దాం, నేను ఇద్దరితోనూ ఉంటాను. మీ పెదనాన్నకి వున్న ఇద్దరు భార్యలు సర్దుకుపోయినట్లు మీ ఇద్దరు సర్దుకుపొండి, లేదా నేను కమల్ తో వున్నట్లు నీకు తెలియకపోతే ఎలా వుండేవాడివో అలా తెలియనట్లు వుండిపో. కానీ ఇకపై నన్ను కొట్టడం, తిట్టడం కుదరదు. అలాగే కమల్, నేను శశిధర్ తో వున్నా కూడా నువ్వు నాతో వుంటున్నావ్ కదా, అలానే ఇక మీదట కూడా ఉండు. ఒక ఇల్లు తీసుకో, నేను వస్తూ పోతూ ఉంటాను. ఇకపై నువ్వీ ఇంటికి రాకు. కానీ నువ్వు ఇంకొకర్ని పెళ్లి చేసుకోకూడదు. నాకోసమే ఉండిపోవాలి,” అన్నాను. నా మాట వినగానే కమల్ లేచి నా వైపు కూడా చూడకుండా వెళిపోయాడు. శశిధర్ సరేననో,  కాదనో చెప్పకుండా గదిలోకి వెళ్లిపోయాడు. నేనొక్కదాన్నే గదిలో మిగిలిపోయాను.

2/8/2012

నాలుగు దిక్కులూ
నేనే అయిన ఏకాంతంలో
నీ జ్ఞాపకాల బురదలో
దిగులు కమలం పూస్తుంది.
ఒక నాలో ఇంకో నేను
నా రహస్య దుఃఖాన్ని ఓదార్చుకుంటాను
దుఃఖాన్నీ నేనే
ఓదార్పునీ నేనే అయిన
దిగులు దారుల ప్రయాణంలో
జీవితం
తిరిగి తిరిగీ చిగురించే
వసంతం కానందుకు ఆనందం వేస్తుంది.
ఎంత దూరం నడిచినా
దారీ తెన్నూ దొరకనీయని
నిశ్చయ నిష్ఫల స్వప్నం
నీవు .
అయినా ఎదురుచూపును
వదులుకోదు మనసు, ఎందుకనో!
నువ్వు నాకోసం
దుఃఖాన్ని మాత్రమే కేటాయించావని
తెలిసి పోయాక
సందేహం కలుగుతుంది.
ప్రియ పురుషుడా!
నేను దేన్ని ప్రేమిస్తున్నాను
నిన్నా??? దుఃఖాన్నా????

Download PDF

22 Comments

  • Yaji says:

    బోల్డ్! చివ్వరి వరకూ ఏకబిగిన చదివించిన కధ. నచ్చని విషయం “తన్నులు తినటం”. శశీని అంత దుర్మార్గుడిని చెయ్యకపోతే బాగుండేది అని అనిపించింది.

  • kumar kunaparaju says:

    కధ చాలా బాగుంది . సామాన్య గారికి కృతజ్ఞతలు !!. చలంను చదువుతున్నట్టు వుంది . స్త్రీ సమస్యలను స్త్రీలు చెబితేనే బాగుంటుంది . ఇప్పటి సాహిత్యంలో మంచి కధలు వస్తున్నాయా అని నాకు అనుమానం గా వుండేది. ఎన్నో చెత్త కధలు చదివి అందుల్లో మంచివాటిని ఎన్నుకోవడం కష్టంగా ఉండేది . ఇప్పుడు సామాన్య గారి కధలు తప్పనిసరిగా చదవొచ్చు అన్న భరోసా వచ్చేసింది . “కొత్తగూడెం పోరగానికి ఓ ప్రేమలేఖ ” పుస్తకం కొని చదువుతున్నా. చదివిన కధలు బాగున్నాయి. చాలా అభివృద్ధి చెందాం అనుకుంటున్న ఈ రోజుల్లో ” స్త్రీ , పురుషులు సమానం ” అనే భావం ఇంకా ఎంత వెనుకబడివుందో ఆలోచిస్తే చాలా భాధ కలుగుతుంది . కొన్ని వందల సంఘటనలు నాకు తెలుసు .చదువుకున్న కుటుంబాలలో , నగరాలలో , పట్టణాలలో ఆఖరికి అమెరికాలో కూడా ఈ హింస చూసాను. పురుషుల దయ దాక్షిణ్యాల వల్ల ఈపరిస్థితి మారదు. స్త్రీలే దారి వెతకాలి .

    సామాన్య గారు ! కీప్ ఇట్ అప్ …

    సారంగ టీం కు కూడా కృతజ్ఞతలు !! ఫర్ గుడ్ క్వాలిటీ ….

    కుమార్ కునపరాజు

  • యాజిగారు అన్నట్లు బోల్డ్ కథ. కధాంశం బాగుంది. చాలా చోట్ల వాక్యాలు చొక్కా కాలర్ పట్టుకోని కొడుతున్నట్లు వున్నాయి. కథ మొదట్లో వున్న బిగి చివరిదాకా లేదేమో అనిపించింది. అయితే దేవస్మిత మానసిక స్థితి చెప్పడంలో అద్భుతమైన ప్రతిభ కనపర్చారు. కమల్ రావడం పోవడం జరుగుతున్నా ఇంట్లో అత్తగారు ఏం చేస్తున్నట్లు? ఇలాంటి కొన్ని విషయాలు మిగిలిపోయాయి. ఇంకొంత సమయం వెచ్చించి జాగ్రత్తగా క్రాఫ్ట్ చేసుంటే ఇంకా గొప్ప కథ అయ్యేదేమో..

  • కొన్ని కొన్ని వ్యాక్యాలు మనసును మేలితిప్పేసాయి. నిజం ఇంతే అని తెలిసినా, ఆ నిజాన్ని ఇంత నిక్కచ్చిగా చెపితే బరించలేం అన్నది కుడా నిజం.
    దేవస్మిత అంతరంగాన్ని, వేదనను అధ్బుతంగా చిత్రీకరించారు.

  • రమాసుందరి says:

    దేవస్మిత పరిష్కారాన్ని నేను అంగీకరించలేను. కమల్ పిల్లల్ని కూడ అంగీకరిస్తున్నప్పుడు, ఏ భద్రత కోసం భర్త కూడ కావాలని ఆమె కోరుకొంటుంది? ఆమె కున్న వేశ్యకూతురు ముద్ర తొలగించుకోవటానికి వేశ్య కన్న ధౌర్భగమైన బ్రతుకును ఆమె ఎంచుకోవటం ,అర్ధం చేసుకోవటానికి కూడ అందటం లేదు. కధ మొత్తం పదునైన వాక్యాలతో, స్మిత పరిస్తితి ని మా హ్రుదయాలను తాకించారు.

  • భాను says:

    చివరికంటా ఏక బిగిన చదివించిన కథ…కాని చివరికి పోయేసరికి ముందు ఉన్నంత పట్టు అనిపించలే, ఇకపోతే అతను పిల్లలతో సహా స్వీకరించేతందుకు రెడీ గా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు ? కొడుకు ఏదో కొనివ్వమన్తె చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఆమె అస్సలు కోర్టు కి ఎందుకు వెళ్ళింది? చివరికి ఆమె చూపిన పరిష్కారం అది సాధ్యమా?ఆమెకి అది కన్వీనియంట్ గా ఎల్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందా…ఏమో అన్నీ ప్రశ్నలే!

  • శ్రీ says:

    బాగుందండీ! అందరూ అన్నట్టు కథ చివరి వరకు బాగా చదివించింది.
    నాకు కూడా చలం గుర్తుకు వచ్చాడు, ఇంకొక అనుసూయని చూసినట్లు అనిపించింది.

    ఈ రెండు వాక్యాలు బాగా అనిపించింది.

    “నీతి, నిజాయతీ అనేవి అమాయకత్వానికి అక్కచెల్లెళ్ళు.”
    “నీ జ్ఞాపకాల బురదలో
    దిగులు కమలం పూస్తుంది.”

    మొత్తానికి మంచి కథ!

  • gopala krishna says:

    బావుంది….. శశి లాంటి వాళ్ళు చాలా మంది….. చాలా మంది కమల్ లాంటి వాళ్ళు కూడా , పాత్రలన్నీ బావున్నాయ్ , ముఖ్యం గా దేవస్మిత పరస్థితి…… దేవస్మిత సమస్య కి పరిష్కారం అదేనా….. దేవస్మిత కి రేపింకేధైనా కావాలనిపిస్తే………. ఎమో…….

  • లలిత says:

    గొంతు దిగని చేదుమందులా వుంది కథ.

  • బోల్డ్‌ కాగలిగిన కథ. కానీ కాలేదు. ముగింపులో ఉన్న తెగువ కథ ఆరంభంలో లేదు. వ్యూహం బోల్డ్‌నెస్‌ని దెబ్బతీసింది. దేవస్మితకు విషాదకరమైన గతాన్ని పెట్టి, కొట్టే తిట్టే మొగుడ్ని పెట్టి మొదటి సగంలో బ్యాక్‌గ్రౌండ్ ప్రిపేర్‌ చేశారు. రెండో సగానికి లాజిక్‌ బిల్డప్‌ చేశారు. అపుడు తాపీగా కమల్‌ను తెరమీదకు తెచ్చారు. ఇన్ని కష్టాలు లేకుండా మామూలుగా కూడా కమల్‌-దేవస్మితల మధ్య సంబంధం ఏర్పడి ఉంటే సీరియస్‌ చర్చకు ఆస్కారం ఉండేది. ఇపుడు లేదు. “మామూలు” పరిస్థితుల్లో కూడా ఎదుటివ్యక్తిలో తమకు నచ్చే గుణం ఏదో చూసి మనుషులు పరస్పరం ప్రేమలోనో ఆకర్షణలోనే కామంలోనో అటువంటి మరెందులోనో పడే అవకాశముంటుందా-ఉండదా! అక్కడ కార్యకారణ సంబంధాన్ని ఎలా చూస్తాం..?…అలా ఏమైనా మాట్లాడుకోవడానికి అవకాశముండేది. కథ ఇంకొంచెం అమర్యాదకరంగా ఉంటే బాగుండేది.

  • ముగింపుని ముందే ఎంచుకుని రాసిన కథలాగా ఉంది. అయినా కథలో ఉన్న పాయింటే ముగింపు కాబట్టి దానితో సమస్య లేదు. ఇలా అనుకొని సర్థుకుపోవడానికి గలకారణం, ఎంచుకున్న నెరేటివ్ స్టైల్. సాదాసీదా కథలా చెప్పుంటే అత్యంత పేలవంగా ఉండే కథని తన క్రాఫ్ట్ తో చదివించి, ముగింపు పదును తగ్గకుండా చెప్పగలగటం ఈ కథ ప్రత్యేకత. సామాన్య ప్రత్యేకత.

    “బోల్డ్ కథ” అని చాలా మంది అనేశారు. కానీ ఇంకా బోల్డ్/బోలెడు కథలు ఆశిస్తున్నాను కాబట్టి,ఒక అంచుదాకా వచ్చిన కథ అంటాను.

  • Maanasa says:

    This story reminds me of Kuppili Padmagaru’s “Ahalya”.

  • నెరేటివ్ స్టైల్ ఒక్కటి నచ్చిందంతే!
    విషాదభరితమైన గతం.. తిట్టికొట్టే భర్త.. ఇవేమీ లేకుండా భర్త మామూలుగా ఇంకో అమ్మాయి ప్రేమలో పడితే!? అప్పుడూ ఇదే పరిష్కారాన్ని సూచిస్తుందా?
    దేవస్మితలో మొదటినించీ కనిపించింది, సెల్ఫ్ పిటీనే! అలా అని ఆమెకున్న కష్టాల్ని తక్కువ చేయడంలేదు.. కానీ ఆమె ఆలోచనల్లో ఉన్న తెగువ నిర్ణయాలు తీసుకోవడంలో లేదు..
    ఎక్వేరియం పగలగొట్టిందని పక్కింటామెని టెన్నిస్ రాకెట్‌తో కొట్టొచ్చిన ధైర్యం కధలో ఇంకెక్కడా కనబడలేదు!
    ఏదో ఒక ముగింపు ఇవ్వాలని ఆ పరిష్కారం సూచించారే కానీ దానివల్ల పిల్లల దృష్టిలో తన స్థానం ఎలా ఉండొచ్చు అనేది ఆలోచించిందో లేదో తెలీదు! అసలు శశితో ఉండలనుకున్నదే పిల్లల కోసం! వాళ్ళ దృష్టిలో తను ‘మామూలు మంచి అమ్మగా’ మిగలడం కోసం! అతను పిల్లల్ని వదులుకోడానికి సిద్ధంగా లేడని అనుకోవాలిక్కడ.. లేదంటే పిల్లల్తో సహా తనని స్వీకరిస్తానన్న కమల్ దగ్గరకి ఎందుకు వెళ్ళలేదు..
    ఆమె దుఃఖం అర్ధమౌతూనే ఉన్నాతన మీద సానుభూతి బదులు అసహనం కలుగుతోంది.

    బైదవే, దేవస్మిత — పేరు చాలా బావుందండీ! :)

    • నిషిగంధ తో నూటికి నూరుపాళ్ళూ సమ్మతిస్తాను. వ్యక్తిత్వచిత్రణలో స్పష్టతలేదనిపించిందండీ. అవకాశం ఉంటే కనుక తిరగరాయాల్సిన కథ.

  • saamaanya says:

    స్పందించిన అందరికీ ధన్యవాదాలు .

    దేవస్మిత కథ కాదు జీవితం .అందరి జీవితాలూ స్పష్టంగా x1= x – vt y1 = y z1= z t1= t అని వుండవు .

    డైరీ రాసేప్పుడు మన మనసుకీ బుద్ధికి మధ్య ని ఘర్షణని రాసుకుంటాం .అందులో స్పష్టత ఉండొచ్చు ,ఉండక పోవచ్చు . అందుకనే డైరీ కథన్నాన్ని ఇక్కడ ఎంచుకున్నది .

    మన జీవితం మనం ఊహించుకున్నట్లు ఉండని సందర్భంలో, దుక్ఖమయమైపోయిన సందర్భం లో మనలో ఎంత మందిమి వత్తిడికి లోను కాకుండా స్పష్టం గా ఆలోచిస్తాం ?సెల్ఫ్ పిటీ కి లోను కాకుండా వుంటాం ?

    ఏదేమైనా దేవస్మిత కథని నేను రాయలేదు .స్మితే రాసుకుంది . నేను రాసి వుంటే చాలా స్పష్టంగా మొదట మొగుడ్ని 498 a కింద జైల్లో వేయించి వుండేదాన్ని .రెండు: విద్యావంతురాలయిన ఆ పిల్లని ఉద్యోగానికి పంపి వుండే దాన్ని లేదా ,కనీసం సంగీతం క్లాసులన్నా మొదలేయించి వుండేదాన్ని .

    నా స్మిత నన్ను కూడా చిరాకు పరచింది .కానీ స్మిత అట్లాగే వుంది . అలాంటి స్మితలే అనేకం వున్నారని నాకు చెప్పింది .
    అందుకే ఈ కథ .

    మిమ్మల్ని చిరాకు పెట్టడానికే అలా ”జాగ్రత్తగా క్రాఫ్ట్” చేసాను :))

    • kalyanivutukuri says:

      ఎంచుక్కున్న డైరీ పద్ధతి బావుంది , కొట్టే తిట్టే మొగుడు లేకపోతె .. ఈ కధ కి ఇంకొంచెం మెరుగైన విశ్లేషణ జరిగేది ఏమో !!కానీ కొట్టే తిట్టే భర్త గనుక లేక పొతే …. స్మిత ఇంకో వ్యక్తీ వైపు చూసేది కాదు , చూడకూడదు అనే ఆలోచనని తట్టి నట్టు వుంది . స్త్రీ ఇద్దరి మధ్య ఉండటము ..అనేది నిరంతర ఘర్షణ కి గురి అవ్వటమే .!! నైతికత ప్రశ్న లేకపోయినా …నిరంతర ప్రస్నోత్తరాల కార్యక్రమం .. మనసు పెడుతూనే వుంటుంది !!!

    • Anonymous says:

      దేవస్మిత ప్రవర్తన మొదట్నుంచి విచిత్రం గానే ఉంది. Normal family life miss avatam valla, wanting that life at any cost, స్వార్థం, కచ్చిపోతుతనం కనిపిస్తున్నాయి. ఆమె డైరీ entries చూస్తే, she married Sasi after her mother committed suicide. Why??? How could she marry the man whose refusal to marry her initially because of her mom’s profession, cost her mom’s life? I just cannot imagine how she went ahead and married him after her mother died. Bad choices usually lead to bad life.

      And the solution she proposed at the end?… Why does she want to keep Kamal as her “mistress”? denying him of normal family life if she really loves him? Would any self respecting person agree to this? The mind boggles… ఇది కేవలం కచ్చిపోతుతనం తో అన్న మాటలేతప్ప, మరేమీ కాదు. I don’t think it was a solution that has any seriousness to it.

      h

  • నేను దేవస్మిత డైరీని చదివాను . రచయిత్రి సామాన్య గారి ముగింపు చదివాను

    తర్వాత దేవస్మిత కథ ఎలా ఉంటుందో సమాజం లో చూస్తూనే ఉంటాం జీవితం అందరికి స్పష్టంగా ముందే వ్రాసుకున్నట్లు ఉండదు ఎలా నడిపితే అలా నడుస్తుంది అనిపించింది

    చిరపరిచితమైన పేరు దేవసేన మీ సృష్టిలో దేవస్మిత అయింది పేరు .బావుంది .

  • వనజా, దేవసేన నా కథలో ఒక పాత్ర పేరు. కథ త్వరలో…

    దేవస్మిత పేరు బెంగాల్ లో చాలా ఎక్కువ వినిపిస్తుంది. దేవసేన మన దగ్గర వినిపించే పేరు. రెండూ మంచి పేర్లు. దేవస్మిత పేరు చూడగానే నేను కూడా అరె,,,సామాన్య కూడా ఇలాంటి పేరు పెట్టేసిందే అనుకున్నాను.:-)

  • రాసిన విధానం నచ్చింది. కథ చదువుతున్నంతసేపు ఎన్నో ప్రశ్నలు…కోర్టుకెందుకెళ్ళింది? అత్తగారేమయిపోయారు? చివరినిర్ణయం లో పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదు? కమల్ ఎలాంటివాడు? స్మిత లేని మిగతా జీవితంలో అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతని జీవితం ఏమిటి? శశి గురించి తెలుసు కానీ కమల్ ఎలాంటివాడు? అతను భవిష్యత్తులో శశిలా అవ్వడని గ్యారంటీ ఏమిటి? ….ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సామాన్య గారి సమాధానం విన్నాక ఇంకేమీ అడగడానికి ఆస్కారం లేదు, అడగాలని అనిపించడం లేదు కూడా.

    “కానీ స్మిత అట్లాగే ఉంది…అలాంటి స్మిత లే అనేకం ఉన్నారని”….ఇలాంటి స్మితలు నాకు ఒకరిద్దరు ఎదురుపడ్డారని స్ఫురణకు వచ్చి……ఒక నిట్టూర్పు తప్ప ఇంక సందేహాలు లేవు, ప్రశ్నలు లేవు.

    • mythili says:

      చిన్న సమాచారం..దేవస్మిత కథాసరిత్సాగరం లో ఒక తెలివయిన అమ్మాయి పేరు.

  • mythili says:

    చిన్న సమాచారం..దేవస్మిత కథాసరిత్సాగరం లో ఒక తెలివయిన అమ్మాయి పేరు.

Leave a Reply to Yaji Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)