పుకారు

Sharada1

(చెహోవ్ కథ “A Slander” కి అనువాదం – శారద)

 

అహినీవ్ గారు, అదే, స్కూల్లో మాస్టారు గారు, తన కూతురి వివాహం జరిపిస్తున్నారు. వరుడు హిస్టరీ జాగ్రఫీలు బోధించే మాస్టారు. పెళ్ళి సంబరాలతో ఇల్లంతా గగ్గోలుగా వుంది. హాల్లో పాటలు, ఆటలు, వాయిద్యాలూ అబ్బో, చెప్పలేని హాడావిడి. మధ్యలో పానీయాలూ, తినుబండారాలూ సరఫరా చేస్తూ తెల్లని టై లు కట్టుకున్న బట్లర్లు. ఎడతెగని కబుర్ల జోరు. పక్క పక్కనే కూర్చుని లెక్కల మాస్టారూ, ఫ్రెంచి మాస్టారూ, టాక్సు అధికారీ ఒకరికొకరు అడ్డం వస్తూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో సజీవ సమాధుల దగ్గర్నించీ, ఆధ్యాత్మిక విషయాలవరకూ అన్ని సంగతులూ దొర్లి పొతున్నాయి.

ఆ మాట కొస్తే, వాళ్ళెవరికీ ఆధ్యాత్మికత మీద పెద్ద నమ్మకం లేదు కానీ, మనిషి మేధస్సుకి అందని విషయాలూ వుండి వుండవచ్చని తప్పక ఒప్పుకుంటారు. పక్క గదిలో సాహిత్యాన్ని బోధించే మాస్టారు ఒక సెంట్రీ తన తుపాకీ తో చుట్టూ వున్నవాళ్ళని కాల్చి పారేయడంలో తప్పేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. వినేవాళ్ళకి కొంచెం భయం వేసినా, ఆయన్ వాగ్ధాటికి తాళలేక ఒప్పేసుకుంటున్నారు. లోపలికి రాలేక బయటే నిలబడ్డవాళ్ళు కుతూహలంగా లోపలికి చూస్తున్నారు. గంట మధ్య రాత్రి పన్నెండు కొట్టేసరికి అహినీవ్ గారికి ఇంట్లో విందుకి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయోనన్న అనుమానం వచ్చింది. వంటింట్లోకి దారి తీసారు.

వంటిల్లంతా సామాన్లతోనూ, తినుబండారాల వాసనలతోనూ నిండి పోయి వుంది. రెండూ పెద్ద బల్లలమీద రకరకాల పానీయాలూ, వంటకాలూ అందంగా పేర్చబడ్డాయి. వంటమనిషి మార్ఫా, ఎర్రబడిన మొహంతో, పీపాలాటి శరీరంతో హడావిడిగా బల్లల మధ్య తిరుగుతోంది. అహినీవ్ ఉత్సాహంగా, “మార్ఫా! మనం తెచ్చిన చేపని వండావా? ఏదీ చూపించు. వంటింటి వాసనలు భలే నోరూరిస్తున్నాయి,” అన్నాడు. మార్ఫా పక్కనే ఇంకో బల్ల దగ్గరకెళ్ళి పరచి వున్న పేపరు మూతని జరిపింది. మూత కింద ఒక పెద్ద డేగిశా నిండుకూ పెద్ద చేప వండి వుంది. రకరకాలైన మసాల దినుసులతోనూ, జెల్లీలతోనూ, ఆలివ్ పళ్ళూ, కేరట్ ముక్కల తోనూ అలంకరించి వుందా వంటకం. దాన్ని చూడగానే సంతోషంతో అహినీవ్ కళ్ళు పెద్దవైనాయి. గిన్నె మీదికి వంగి వంటకాన్నించి వచ్చే సువాసనని బలంగా ఆఘ్రాణించి, పెదాలని గట్టిగా చప్పరించాడు. “ఆ… ఎవరు లోపల ముద్దులు పెట్టుకుంటున్నారు? లోపల నువ్వేనా మార్ఫా?” తలుపు దగ్గర గొంతు వినిపించి తిరిగి చూసాడు. స్కూల్లో చిన్నా చితకా పనులు చేసే వాంకిన్ తలుపు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తున్నాడు.

“ఎవరంటూంటే? అహినీవ్, మీరా? ఈ వయసులో ఇదేం బుధ్ధి తాతగారూ? ఆ?” “ముద్దా? నేను ఎవరినీ ముద్దు పెట్టుకోలేదు,” అహినీవ్ కంగారు పడ్డాడు. “నేను ముద్దు పెట్టుకోవటం ఏంట్రా బుధ్ధిలేని గాడిదా? చేప కూర వాసనకి నోరూరి పెదాలు చప్పరించానంతే.” “చాల్చాల్లే, ఇంకెక్కడైనా చెప్పు ఇలాటి కథలు, నాక్కాదు.” నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వాంకిన్. అహినీవ్ మొహం ఎర్ర బడింది.. “ఇదెక్కడి గొడవరా బాబూ! ఈ సన్నాసి ఇప్పుడు ఊళ్ళో అందరికీ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్తాడేమో ఖర్మ! ఎంత పని జరిగిందిరా దేవుడా!” మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ అహినీవ్ ముందు హాల్లో కొచ్చాడు. వాంకిన్ కోసం చుట్టూ పరికించి చూసాడు. హాల్లోనే పియానో పక్కన నిలబడి వున్నాడు వాంకిన్. పియానో పైనించి వంగి, అక్కడకూర్చున్న ఇన్స్పెక్టరు గారి మరదలితో కొంటెగా నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. “నాకు తెలుసు, నాగురించే చెప్తున్నాడు. దరిద్రుడు!ఆ పిల్ల నమ్మేస్తోంది.బాబోయ్, నవ్వుతున్నారిద్దరూ! ఇప్పుడేం చేయాలి? ఏదై నా చేసి ఆ వెధవని ఆపాలి. ఇంకా పుకార్లు పుట్టిస్తాడు లేకపోతే.! వీల్లేదు. నేనూ అందరితో వాడి మాటలు అబధ్ధాలని చెప్పేస్తాను.” అహినీవ్ తల గోక్కున్నాడు.

సిగ్గుతో మొహం ఎర్రబడుతూండగా ఫ్రెంచి మాస్టారు దగ్గరకెళ్ళాడు. “ఇప్పుడే వంటింట్లో కెళ్ళి వస్తున్నా. వంటెలా సాగుతూందో చూద్దామని. లోపల చేపల కూర అయిపోయింది. ఎంత పెద్ద చేపనుకున్నావు? సుమారు గజం న్నర పొడుగుంటుంది. హ! హ! హ! అన్నట్టు ఒక విచిత్రం చెప్పాలి. ఇందాక వంటింట్లో, అదే, పెద్ద చేపని చూడటానికి వెళ్ళినప్పుడోయ్! ఆ చేప కూరను చూసి నోట్లో నీరూరిందనుకో! ఆహా, అని పెదవి చప్పరించాను. ఆ క్షణమే ఈ వాంకిన్ లోపలికొచ్చాడు. వొచ్చి నన్నంటాడూ, హ, హ, హ, ఏం చెప్పేది! నన్నంటాడూ, “మార్ఫాని ముద్దు పెట్టుకున్నావా?” అని! నేను! మార్ఫాని! ముద్దు! బుధ్ధి లేని పక్షి కాకపోతే, ఏమిటా మాటలు? అదీ మార్ఫాని! వంట మనిషిని! దాన్ని ముద్దు పెట్టుకుంటే జంతువుని ముద్దు పెట్టుకున్నట్టే కాదూ? ముద్దట ముద్దు! తెలివి తక్కువ వెధవ!”

“ఎవరినీ తెలివి తక్కువ వెధవ అంటున్నారూ?” లెక్కల మాస్టారు దగ్గరకొచ్చాడు. “ఇంకెవడండీ? అదిగో అక్కడే నిలబడి వున్నాడు  చూడండీ, ఇకిలిస్తూ, వాంకిన్! ఇందాక వంటింట్లో…” మళ్ళీ కథంతా చెప్పాడు. “నేను మార్ఫాని ముద్దు పెట్టుకోవటమేమిటండీ? వాడి తెలివి తక్కువ మాటలకి నాకైతే నవ్వాగటం లేదు. అసలు నన్నడిగితే..” ఆయన వెనుదిరిగేసరికి టాక్స్ ఇన్స్పెక్టరు నిలబడి వున్నాడు. “అబ్బే ఏం లేదు! వాంకిన్ గురించే మాట్లాడుకుంటూన్నాం. భలే విచిత్రమైన వాడు లెండి! ఇందాకేమయిందనుకున్నారు వంటింట్లో? నేను మార్ఫా పక్కన నిలబడి వున్నా. బాగా తాగినట్టున్నాడు, లోపలికొచ్చి, “మార్ఫాని ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావ్?” అని అడిగాడు. నేను! మార్ఫాని! ముద్దు! ఒరి దరిద్రుడా! మార్ఫాని నేనెందుకు ముద్దు పెట్టుకుంటానురా? నాకు ఇంట్లో పెళ్ళాం లేదా?” అని కడిగేసాను కాని నాకు భలే నవ్వొచ్చింది…”

“ఎవరబ్బా అంత నవ్వించింది?” అక్కడికి అప్పుడే వచ్చిన ఇంకొక మాస్టారు అడిగారు. “ఇంకెవరు? మన వాంకిన్! ఇందాక వంటింట్లో….” ఒక్క అర గంటసేపట్లో ఆ వార్త దాదాపు వచ్చిన బంధువులందరికీ తెలిసిపోయింది. అహినీవ్ సంబరపడ్డాడు. “ఇప్పుడు చెప్పుకోరా, ఎవరితో చెప్పుకుంటావో! అసలు నిన్ను ఎవరైనా నమ్ముతారేమో చూస్కో! నువ్వు కథ మొదలు పెట్టగానే, అందరూ, “నోర్ముయ్యవోయ్! అసలేం జరిగిందో మాకంతా తెలుసు” అని నీ నోరు మూయించకపోతే నన్నడుగు!” అనుకున్నాడు గర్వంగా. అతని సంతోషానికి మేర లేకపోయింది. ఆ సంతోషంలో అనుకున్నదానికంటే నాలుగు గ్లాసులు ఎక్కువే తాగేడు. పెళ్ళి విందు ముగిసింతర్వాత ఎక్కడి వాళ్ళనక్కడికి పంపించి అలిసి పోయి నిద్ర పోయాడు అహినీవ్. మర్నాటినించీ ఆ సంగతే మర్చిపోయాడు.

అయితే అంతా మనం అనుకున్నట్టే జరగదు కదా! సరిగ్గా వారం గడిచేసరికి, అహినీవ్ స్కూల్లో టీచర్ల రూములో వుండగా హెడ్ మాస్టారు పక్కకి పిలిచారు. “చూడు అహినీవ్! ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించు. ఇది నాకవసరం లేని విషయం నిజం చెప్పాలంటే. కానీ, ఒక స్నేహితునిగా నిన్ను హెచ్చరించడం నా బాధ్యత. నువ్వు వంట మనిషి వలలో పడిపోయావని ఊరంతా చెప్పుకుంటున్నారు. నువ్వు ఆమెను ప్రేమిస్తావో, ముద్దులే పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ, కనీసం అందరూ చూస్తూండగా వద్దు. నువ్వు స్కూల్ మాస్టారువన్న విషయం మరిచిపోకూడదు!” అహినీవ్ కి స్పృహ తప్పినంత పనైంది. మరుగుతున్న నీళ్ళు మొహం మీద పడ్డ మనిషిలా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అసలు నడుస్తూంటే వీధుల్లో అందరూ తననే గుచ్చి గుచ్చి చూస్తున్నట్టనిపించింది అతనికి. “ఇవాళెందుకో తిండే తినడంలేదు. మీ ధ్యాసంతా ఎక్కడుందో మరి?” భార్య మాటలతో ఈ లోకంలోకొచ్చి పడ్డాడు అహినీవ్. “అంత ఆలోచన దేని గురించో? మీ ప్రియురాలు మార్ఫా గురించే గా? సిగ్గుండాలి! ఇంకా నయం, పాపం నా స్నేహితులు నా కళ్ళు తెరిపించేరు. లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు సాగేదో ఈ వ్యవహారం!” భోజనం మీది నించి లేచి అహినీవ్ కలలోని మనిషిలా నడుస్తూ వాంకిన్ ఇల్లు చేరుకున్నాడు.

వాంకిన్ ఇంట్లోనే వున్నాడు. “నీచుడా! నీకు నేనేం ద్రోహం చేసానురా? ఊరందరి ముందరా నన్ను అవమానాల పాలు చేస్తావా? ఎందుకిలా నా గురించి పుకారు లేపావు?”వాంకిన్ ని పట్టుకుని దులిపాడు అహినీవ్. వాంకిన్ తెల్లబోయాడు. “పుకారా? ఏం పుకారు? అసలునువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు.” “నా గురించీ మార్ఫా గురించీ పుకార్లు లేపుతున్నదెవరు? నువ్వు కాదా?” కోపంగా అరిచాడు అహినీవ్. వాంకిన్ గుడ్లు మిటకరించి నోరు తెరిచాడు ఆశ్చర్యంగా! మెళ్ళో శిలువని చేతితో పట్టుకుని, గంభీరంగా, “భగవంతుని తోడు! నేనారోజు గురించి ఒక్క మాట కూడా ఎవరితోనూ అనలేదు. ఈ మాట అబధ్ధమైతే నేను కలరా సోకి చస్తాను,” అన్నాడు. అహినీవ్ కి అతను నిజమే చెప్తున్నాడనిపించింది. “నువ్వు కాకపోతే ఇంకెవరు?” అహినీవ్ ఆ రోజు జరిగిందంతా ఙ్ఞాపకం తెచ్చుకున్నాడు. “ఎవరై వుంటారబ్బా!” ఎంత ఆలోచించినా అర్థం కాలేదతనికి. —————————————–

Download PDF

6 Comments

  • రమాసుందరి says:

    హ హ హ. భలే నవ్వించారండి. మీ అనువాదం ఎక్కడా పగ్గం పట్టకుండా చదివించేసింది.

  • Sowmya says:

    కథ, అనువాదం రెండూ చాలా బాగున్నాయండీ.

  • Suresh says:

    అనువాదం బాగుంది కానీ అహినీవ్, మార్ఫా, వాంకిన్, వంటి రష్యన్ పేర్ల కంటే చలమయ్య, కాంతమ్మ, వెంకట్ వంటి తెలుగు పేర్లు వాడితే చదవడం ఇంకా తేలికయ్యేదేమో.

  • లలిత says:

    ఈ కథ ఇదివరకే తెలిసినా మీ అనువాదంలో మరోసారి చదువుకున్నాను . బావుంది
    ఇలాంటి కతే అమరావతి కథల్లో వుంది ‘ ఎవరికీ చెప్పమాక ‘

  • ns murty says:

    శారద గారూ,

    మీ అనువాదం ఎంతో సాఫీగా సాగిపోయింది.

    హృదయపూర్వక అభినందనలు.

  • అద్భుతమైన కథ. మంచి అనువాదం.

Leave a Reply to రమాసుందరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)