చివరికి కవులమ్మ ఏం చేసింది?

rajiమొగుడుపెళ్ళాలన్నంక కొట్టుకుంటరు, తిట్టుకుంటరు…”, “మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి”,  అని పెద్దమనుషులు తలా ఒక మాటా అన్నా నోరు మెదపదు కవులమ్మ. కానీ ఒకాయన  “లోకంల నువ్వొక్కదానివే ఆడిదానివి కాదు. అందరు నీ లెక్క వుంటే లోకం బాగుపడినట్టే. నన్ను వదిలిపెట్టి పోయిన్నాడే సచ్చినట్టు అని మాట్లడ్తవంట. ఆ బొట్టెందుకు పెట్టుకున్నావమ్మా..” అనేసరికీ కవులమ్మ కోపం కట్టలు తెంచుకుంటుంది. అంతదాకా కవులమ్మ మౌనాన్నే తప్ప కోపాన్ని చూడని కొడుకులు,కోడండ్లు బదులియ్యలేక ఉండిపోతారు. కవులమ్మ పెద్దమనుషులకు, కొడుకులకు ఏం సమాధానం చెప్పింది? ఏం నిర్ణయం తీసుకుంది? తెలవాలంటే తాయమ్మ కరుణగారి రాసిన “కవులమ్మ ఆడిదేనా?” కథానిక చదవాల్సినదే!

అరవై ఏండ్లకు దగ్గర వయసు ఉన్న కమలమ్మను అంతా ‘కవులమ్మా’ అంటారు. ఎముకలకి చర్మం ఉన్నట్టుగా సన్నగా ఉంటుంది కవులమ్మ. శుభ్రమైన చీర, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు ఉంటుంది. చేతికి నాలుగైదు రంగుల మట్టి గాజులు, ముక్కుకు ముక్కుపుల్ల తప్ప మరే ఆభరణాలూ ఆమె వంటిపై కనబడవు. తప్పదనుకుంటే తప్ప మాట్టాడదామె. కొత్తవారు ఆమె మూగదనే అనుకుంటారు. ముఖంలో ఏ భావము కనబడనీయక నిర్వికారంగా పనులు చేసుకుంటూ వెళ్పోయే ఆమెకు స్పందనలు కలుగవా? అనుకుంటారందరూ. “మనిషికిక ఎంత పొగరు.. ఊ… అని కూడా అనదు” అని కోడళ్ళిద్దరూ  ఆడిపోసుకున్నా పలుకదామె!ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు కవులమ్మకి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపి, ఓ ఇంటి అక్కాచెల్లెళ్ళతో కొడుకులకు కూడా పెళ్ళిళ్ళు చేసింది. ఎంతో కష్టపడి కట్టుకున్న తొమ్మిది గదుల సొంత ఇంట్లో, ఓ మూలనున్న బావి దగ్గర గది అమెకు మిగిల్చారు కొడుకులు. ఇంటెడు మంది బట్టలు, అంట్ల పని అమెదే. క్షణం తీరుబడిగా కూర్చోదు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రమజీవి ఆమె.

ఒకనాటి ఉదయాన ఎండలో బావి దగ్గర గిన్నెలు తోముతున్న ఆమెకు గేటు తెరుచుకు వస్తున్న ఆడబిడ్డ రంగమ్మ కనబడుతుంది. ఏనాడూ బంధువులను ఇంటికి పిలువని కొడుకులు రంగమ్మనెందుకు పిలిచారో అర్థం చేసుకోవటానికి ఎక్కువసేపు పట్టదామెకు. కన్నీళ్ళు ముసిరిన ఆమె కళ్ళల్లో ఎన్నో పాత సంగతులు కదలాడతాయి. హృదయం భారమయ్యే గాథ ఆమెది. తల్లిని ఉంచుకుని, ఆమె కూతుర్ని(కమలమ్మని) వయోబేధం లేకుండా పెళ్ళాడి, జీవితాంతం అనుమానంతో దారేపోయే ప్రతివాడితో..చివరికి కన్న తండ్రితో కూడా ఆమెకు సంబంధం అంటగట్టి, ఆమెను మాటలతో హింసించి, గుద్దులు గుద్దీ, చావబాది, చివరికు అరవై ఐదేళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకు వెళ్ళిపోయిన  దుర్మార్గుడు ఆమె భర్త. ముసలివయసులో కంటి చూపు పోయాకా ఇప్పుడు సేవలకోసం మళ్ళీ ఇల్లు చేరిన అతడిని క్షమించి మంచాన పడిఉన్న అతనికి కవులమ్మ సపర్యలు చేయగలదా?

పదునైదు రోజుల క్రితం వచ్చిన తండ్రిని బావి దగ్గరి గదిలోనే ఉంచుతారు కొడుకులు. ఆ గది దరిదాపులకు కూడా వెళ్లకుండా ఇంటి వసారాలోనే నిద్రపోయి రోజులు గడుపుకుంటుంటుంది కవులమ్మ. తండ్రి దుర్మార్గుడైనా అతడ్ని భరించాల్సిన బాధ్యత తల్లిదేనంటారు కొడుకులు. ఆ సంగతి తేల్చటానికి ఊళ్ళోని నలుగురు పెద్దమనుషులనూ, తండ్రి తరఫు బంధువుల్లో మిగిలిన ఒకే ఒక మేనత్తనూ పంచాయితీకి పిలుస్తారు. “సాకల్దాన్ని పెట్టుకోకపొయినర్రా..ముసిల్దానితో ఇంకా గంపెడు పని చేయిస్తున్నరు”, “గుండెకాయ కాడ గుండన్న లేదాయె. ఆనాడు మెడలో బంతిపూల మాల, చెవులకు జుంకాలు, ముక్కుని ఇంత ఇంత పెద్ద బేసర్లు, చేతులకు దండకడాలు, నడుముకి వడ్డాణం పెట్టుకుని పార్వద్దేవి లెక్కవుండేది. ఆడపిల్లల పెండిళ్లకు పెట్టగా వున్నాటిని మీరు ఒలుసుకుంటిరి. అషద అయ్యి మీ మావ చేపిచ్చినవన్నా కవాయే. ఆమె తల్లిగారు పెట్టినయి. ఆడికీ ఎవరన్నా అడిగినా ‘ముసల్దాన్ని నాకెందుకు నగలు’ అని అంటదిగని, మీ మీదకి మాట రానీయదు” అంటూ రంగమ్మ వదిన తరఫున మాటాడ్డం చూసి పళ్ళు నూరుకుంటారు కవులమ్మ కోడండ్లు.

“తాయమ్మ” అనే తన ప్రసిధ్ధ కథనే ఇంటిపేరుగా మార్చుకున్న రచయిత్రి కరుణ  కథలో వాడిన భాష సంఘటనలను, కథలోని వాస్తవికతను తాజాగా ఉంచుతుంది. యుగాలు మారినా, సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎందరో స్త్రీల దుస్థితి ఈవిధంగానే ఉందన్న సత్యాన్ని ఈ కథ తెలుపుతుంది. కవులమ్మ లాంటి స్త్రీలు చాలామంది ఉంటారు. ఆమె భర్త చేతిలో పడరాని పాట్లు పడింది. కానీ సమస్యలనేవి భర్త వల్లనే రానక్కర్లేదు.. అత్తగారు, ఆడబిడ్డ, పిల్లలు, సమాజం… ఇలా ఎవరివల్లనైనా సమస్య రావచ్చు. అయితే, పరువు-ప్రతిష్ఠ, జరుగుబాటు ఎలా?.. మొదలైన ప్రశ్నలు, భయాలు వీడి కవులమ్మలా నిలబడి ధైర్యంగా  సమస్యను ఎదుర్కునేంతటి తెగువ ఎందరు స్త్రీలు చూపెట్టగలరన్నది ప్రశ్న! కథలో కవులమ్మ చెప్పిన చివరి మాటలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఉత్తేజపరుస్తాయి. కథని మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి. ఆత్మగౌరవార్థం ఆమె చూపే తెగువకూ, ధైర్యానికీ మనసు సలాము చేస్తుంది. ఉన్నతమైన ఆమె వ్యక్తిత్వం మరెందరికో మార్గదర్శకం కాగలదనిపిస్తుంది.

ఈ కథ “మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ” ప్రచురించిన “కథావార్షిక 2004” కథా సంకలనం లోనిది.

కవులమ్మ ఆడిదేనా?

ఉదయం తొమ్మిది కావస్తుంది. మార్చి నెలే అయినా ఎండ విపరీతంగా కొడుతుంది. ఆ ఎండలోనే కూసుని బాయిమీద గిన్నెలు తోముతుంది కవులమ్మ. గిన్నెలు తోమీ తోమీ కవులమ్మ అరచేతిలోని గీతలు అరిగిపోయినయని అంటుంటరు.

కవులమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అందరి పెండ్లిళ్లు అయినవి. కొడుకులిద్దరు అక్కచెల్లెల్లనే చేసుకున్నరు. కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కో పోర్షన్‌ చొప్పున మూడు మూడు గదులు వచ్చినవి. మధ్యలో కవులమ్మ కొరకే వున్న పోర్షన్‌ను వాళ్ల వాళ్ల గదుల్లోకి తిరగడానికి వదిలిపెట్టి చివరిగది మూడోదాన్ని వంటింటిగా మార్చారు.  తిండిమాత్రం ఇద్దరు కొడుకులు పొత్తులనే తింటరు. గదులన్నింటిని కలుపుతూ బారుగా ముందర వసారా. వసారాలోంచి మధ్య పోర్షన్‌లోంచి వెళితే మూడో గదిలో వంటిల్లు. ఒకమూలకు ఇల్లు వుంటే చుట్టూ కాంపౌండ్‌ వాల్‌. ఇంకో మూలకు బాయి. బాయికి ఒక పక్కన మరోగది. ఇంటిముందరి వేపు గేటు.

ఈ ఇంటి కొరకు కవులమ్మ ఎంత కష్టపడిరదో. అప్పట్లో సిమెంటు వాడకం అప్పుడప్పుడే మొలయింది. నీళ్లు కొట్టడానికి ఇంకొక మనిషిని పెడితే డబ్బులు అయిపోతయని తొమ్మిది గదులకు తనొక్కతే నీళ్లు కొట్టేది. అలాంటిది కొడుకులు పెళ్లిళ్లయి కోడండ్లు ఇంట్లకొచ్చిన తర్వాత కవులమ్మకు ఆ బాయిపక్కన ఒక రూము కట్టించారు. తనను ఆరోజు, బాయిపక్కన రూంలోకి పొమ్మన్నరోజు కవులమ్మ ఎంత బాధపడిరదో. తన రెక్కల కష్టంతో కట్టుకున్న ఇల్లు. ఇయ్యాళ తనది కాకుంట పొయింది. అయినా నేనేడకన్నా పోతున్ననా నా ఇంట్లనే ఇంకో అర్రల వుంటున్న కద. సచ్చిన్నాడు ఏమన్న మీదేసుకుని పోయేదుందా అని తనకు తనే సముదాయించుకుంది.

గిన్నెలు తోముతున్న కవులమ్మ గేటు చప్పుడైతే తలతిప్పి చూసింది. ఆడబిడ్డ రంగమ్మ ఒక చేతిల సంచి ఇంకో చేతిల కర్ర పట్టుకుని గేటు తీసుకుని లోపలకు రావడం కనిపించింది. గిన్నెలు తోమడం ఆపి, చేతులు కడుక్కుని కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ ఆడిబిడ్డకు ఎదురుబోయి చెయ్‌సంచి అందుకుని ‘‘బాగున్నవా వదినా’’ అని మందలించింది.
‘‘ఆ… బానే వున్న వదిన’’ అని, ‘‘నీ ఒంట్ల ఎట్లుంటుంది’’ అడిగింది రంగమ్మ.

‘‘ఇగో… ఇట్ల వున్న’’ అంటూ బాయిదగ్గరికి తీసుకుపొయ్యి బకెట్ల నీళ్లు చెంబుతో ముంచి ఆడిబిడ్డకు ఇచ్చింది.

రంగమ్మ కాళ్లు, చేతులు, మొఖం కడుక్కుంది. అప్పటికే కవులమ్మకొడుకులు, కోడండ్లు ఇంట్ల నుంచి బయటికి వచ్చారు. పలకరించుకుంటూ రంగమ్మను ఇంట్లోకి తీసుకుపోయారు. కవులమ్మ మళ్లా గిన్నెల దగ్గరికి పొయింది.

ఏనాడో మేనత్తలను పిలవడం బందు పెట్టుకున్నరు. కవులమ్మ ఆడబిడ్డలు అందరూ చనిపోంగ ఈమె ఒక్కతీ వుంది. కాటికి కాళ్లు జూపుకుంది. యేడికీ పోదు. తనకంటే చిన్న అయినా కవులమ్మ తన అన్న భార్య కాబట్టి వదినా అని పిలుస్తది రంగమ్మ. తనకంటే వయసులో పెద్దది కాబట్టి కవులమ్మ రంగమ్మను వదినా అని పిలుస్తుంది.

‘‘కూర్చో అక్కా’’ అంటూ  కుర్చీ జరిపాడు కవులమ్మ పెద్దకొడుకు ఆనంద్‌.
(తెలంగాణలో మేనత్తను ‘అక్క’ అని పిలుస్తారు)

‘‘అక్కకు చల్లటి నీళ్లు తెచ్చియ్యి’’ అని భార్య సుశీలకు చెప్పాడు చిన్నకొడుకు నరహరి.
‘‘టైం తొమ్మిది కాట్లేదుగనిఎండలు జమాయించి కొడ్తున్నయేవిరా అప్పుడే’’ అంది రంగమ్మ మొఖం తుడుచుకుంట.
‘‘అవును పెద్దమ్మ ఈ ఎండలకు నువ్వు వస్తవో, రావో అనుకుంటున్నం’’ పెద్ద కోడలు భాగ్య.
‘‘రావద్దనే అనుకున్న. కండ్లు కూడా ఇన్నాటిలెక్క సరిగ కనిపిస్తలెవ్వు. ఇంతకు ముందులెక్క నడక చాతగాట్లే. కని, అన్నను కూడా చూసినట్టు వుంటదని బయలుదేరిన’’
‘‘ఇదిగో పెద్దమ్మ’’ అంటూ గ్లాసుతో నీళ్లు ఇచ్చింది సుశీల.

గ్లాసు పట్టుకుని ‘‘అమ్మో! ఇంత సల్లటియి నేను తాగలేనమ్మ. ప్రిజ్‌ల నీళ్లు అలవాటు లెవ్వు’’ అంది రంగమ్మ.

‘‘ముసలి ముండ మనిషిని ఆడించుకుంటది’’ తిట్టుకుంటూ లోపలికి వెళ్లి బిందెలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. తన పని తనే చేసుకోదు. అలాంటిది ఈ ముసలిదానికి ఒకటికి రెండుసార్లు తిరగాలంటే సుశీలకు కడుపుమండిపొయింది.

రంగమ్మకు రెండుపక్కల, ముందర కుర్చీలు జరుపుకుని కూచున్నరు కవులమ్మకొడుకులు, కోడండ్లు. ముచ్చట ఎప్పుడెప్పుడు మొదలు పెడ్దామా అన్నట్టుగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నరు.

‘‘అవున్‌రా, నాయిన ఏడిరా’’ అడిగింది రంగమ్మ.
‘‘బాయి పక్కన వున్న రూంలో వున్నడు’’
‘‘మీ అమ్మకు కట్టిన అర్రలనారా’’
‘‘ఆ అండ్లనే’’
‘‘మరి మీయమ్మ యాడుంటుందిరా?’’
‘‘ఈ వసారాలోనే పడుకుంటుంది.’’
‘ముసల్దానికి వివరాలన్ని కావాలి’ అనుకుంటూ మాట మార్చడానికి ‘‘ఏమన్న తిన్నవా అక్కా’’ అనడిగిండు కవులమ్మ పెద్దకొడుకు.
‘‘యాడరా? పొద్దున బస్సు ఎక్కిచ్చిండు మీ బావ. ఇగో… బస్సుదిగి, రిక్షా పక్కి ఈడికొచ్చిన’’
‘‘అమ్మా ! అక్కకు టిఫిన్‌ పెడ్దువుగానీ రా ’’ కేకేసాడు చిన్నకొడుకు.
‘‘మీరు తిన్నారురా ?’’ రంగమ్మ.
‘‘ఆ… అయింది పెద్దమ్మ’’ కోడలు.

ఇంకొక రెండు గిన్నెలుంటే అవి కూడా కడిగి తీసుకుని పోదామని గబగబా కడుగుతుంది కవులమ్మ.

కవులమ్మ అసలు పేరు కమలమ్మ. వాడుకలో కవులమ్మ అయింది.  మనిషి అరవై ఏండ్లకు దగ్గర పడింది. ఎముకల మీద చర్మం వున్నట్టుగా వుంటది. ముతక చీరైనా శుభ్రంగా వుంటది. మొఖానికి పెద్ద కుంకుమ బొట్టు. పగిలిపోగా మిగిలిన ఓ… నాలుగైదు రకరకాల రంగుల గాజులు చేతులకు వుంటాయి. కాళ్లకు మెట్టెలుండవు. మెడలో వెలిసిపోయిన నూలు తాడు ఒకటి వుంటది. ముక్కుకు ముక్కుపుల్లతప్ప వీసమెత్తు బంగారం వుండదు  ఒంటిమీద.

కవులమ్మ చిన్నతనంలో బాగా అల్లరి చేసేదట. తండ్రికి చిన్నబిడ్డ కవులమ్మ అంటే ఎక్కడలేని ప్రేమ. చిన్నబిడ్డ ఎదురొస్తే శుభం కలుగుతదని నమ్మకం. ఊరికి జమీందారైనా బిడ్డ ఎంత చెప్తే ఆ తండ్రికి అంత. తను ఎక్కడికి వెళ్లినా తనతోపాటు చిన్నబిడ్డ కవులమ్మ వెంట వుండాల్సిందే. అలాంటి కవులమ్మ పెళ్లయిన తర్వాత మాట్లాడ్డం తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చి, ఇప్పుడు ఎప్పుడో ఓసారి తప్పదు అనుకుంటేనే మాట్లాడ్తది ఎవరితోనైనా.

కొత్తగా చూసినవాళ్ళు మూగదేమో అనుకుంటరు. చాలామంది కవులమ్మను చూసి ఈమెకు ఏమైనా స్పందనలు కలుగుతాయా? అనుకుంటారు. ఆమె నవ్వగా చూసినవాళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. మనిషి అలా నిర్వికారంగా పనులు చేసుకుంటూ పోతది.

‘‘చూడు పెద్దమ్మ. మనిషికి ఎంత పొగరు. ఊఁ… అని కూడా అనదు’’ పెద్దకోడలు. మరిది కేకవేసినా పలకలేదని.
‘‘ఇందాక నువ్వు బాగున్నవా వొదినా అని పలకరిస్తే. ‘ఇగో గిట్ల వున్న’ అని ఎంత పెడసరంగా అంటుంది చూడు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘మీయత్త ఇయ్యాల్నే కాదే, ఎన్నడైన అట్లనే వుంది’’ రంగమ్మ.
కవులమ్మ గిన్నెలన్నీ టబ్‌లో పెట్టుకుని వసారాలోంచి వంటింట్లోకి పొయింది.

టిఫిన్‌ కొరకు ఉప్మా వేయిస్తుండగా పంత వద్దనుకున్నా ఏవేవో రకరకాల ఆలోచనలు. రవ్వ వేయించి పక్కన పెట్టింది. ఉల్లిగడ్డలు కోస్తుండగా రంగమ్మ ఎందుకొచ్చిందో అర్ధమైంది. కన్నీళ్లు టపటపా రాలాయి. ఉల్లిగడ్డ ఘాటుకో లేక మనసులోని బాధకో. ఈనాటికి నా బతుకు ఇట్లా అయింది అనుకుంది.

ఉల్లిగడ్డలు పొయ్యిమీద వేసి, ఉడికినాక నీళ్లు పోసి మూతపెట్టి అక్కడే నిలబడిరది. ఏనాటివో కండ్లల్ల మెదిలనయి.

రోజులెక్కనే కోడి కూయంగనే మెలుకువ వచ్చి చూసింది. పక్కన మనిషి లేడు. బుడ్డోడు నిద్రపోతుండు. లేచి కూచుని వెంట్రుకలను వేళ్లతో వెనక్కు దువ్వుకుని పుచ్చడ వేసుకుని పక్కబట్టలు మడతపెట్టి ముందరి తలుపు తియ్యబోయింది. ఎంతకీ రాలేదు. దొడ్డికి ఆగేటట్టు లేదు. రెండు, మూడుసార్లు కొట్టింది. అయినా అవతలి నుంచి సప్పుడు లేదు. తలుపు దగ్గరే కూలబడిరది కడుపును బిగపట్టుకుని.

ఈ ముదునష్టపు ముండాకొడుకు నా గండాన పడ్డడు. ఏనాడు చేసుకున్న పాపమో. నాకీ జన్మల ఈడు దొరికిండు. కళ్లమ్మట పటపట నీళ్లు కారినయి. నోట్ల నుంచి సప్పుడు వచ్చిందంటే వాడు విన్నడంటే ఇంకేమన్న వుందా ? ‘పొద్దున్నేఎవడు సావాలని ఏడుస్తున్నవే లంజె’ అని తన్నులు గుద్దులు తప్పవు. ఆ తన్నులు తలుసుకుని గబగబా కండ్లు పైటకొంగుతో తుడుచుకుంది.

బయటి నుండి తాళం తీసిన చప్పుడు కొద్దిగా వినిపించడంతో లేచి పక్కకు జరగబోయింది. ఈ లోపలే  రెండు తలుపులు ఒక్కసారిగా బార్లా తెరిచిండు. మోకాళ్ల వరకు లేచిన కవులమ్మను కొట్టుకుని తలుపురెక్క ఆగిపోయింది.

‘‘రంకులంజె, మొగుడు అటుపోంగనే మిండని కొరకు చూస్తున్నానే తలుపు సందుల నుంచి’’ అని కవులమ్మకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడపడితే అక్కడ అందిన చోటల్లా గుద్దుతుండు. కవులమ్మకు దొడ్డికి ఆగుతలేదు. తన్నులూ ఆగుతలేవు. తన్నులు తింటూనే ఏడుస్తూ ‘‘దొడ్డికి పోదామని వచ్చిన’’ చెప్పింది.

‘‘లంజెముండవి దొంగేడుపులు చూడు’’ అని కూచున్న కవులమ్మ డొక్కలో మళ్లో రెండు తన్నులు తన్ని పక్కకు జరిగిండు.

కవులమ్మ చెంబుల నీళ్లు తీసుకుని ఆదరా బాదరాగా దొడ్డి దగ్గరికి పొయింది. వెనకాలే వచ్చి దొడ్డి తాళం తీసిండు. కవులమ్మ దొడ్లోకి వెళ్లగానే మళ్లా బయటి నుంచి తాళం వేసిండు ఎప్పటిలెక్కనే.

వెంటనే సప్పుడు గాకుండ తాళాన్ని తీసి, తలుపులు తెరుచుకుని దొడ్లోకి వచ్చిండు. దొడ్డికి కడుక్కుంటున్నదల్లా మనిషిని చూసి గబుక్కున లేచి నిలబడింది కవులమ్మ. పాణం చివుక్కుమంది. ‘ఈడు మనిషా, పసురమా ? ఈని బుద్ధి పాడుగాను. తల్లికడుపున ఎట్లబుట్టిండో ఈ బాడుకావ్‌’ అనుకుని గబాగబా బయటికి వచ్చింది. ఒకసారి దొడ్డంతా కలెదిరిగి వచ్చి మళ్లా తాళం వేసిండు.

‘‘అమ్మా, ఇంకా కాలేదా?ఎంతసేపూ’’ చిన్నకొడుకు కోపం, అసహనంతో కేకవేసాడు.
కొడుకు కేకతో ఈ లోకంలోకి వచ్చిన కవులమ్మ గబగబా మరుగుతున్న నీళ్లలో రవ్వపోసి కలిపింది. కొడుకు కేకకు బదులుగా కవులమ్మ నుండి ఎపటువంటి సమాధానం లేదు.
‘‘చూడు పెద్దమ్మ, ఏ ఒక్కదానికి బదులియ్యదు. ఏం జూసుకుని మీ వదినకు ఇంత పొగరో అర్ధంకాదు’’ అక్కసునంతా వెళ్లగక్కుతూ పెద్దకోడలు.
‘‘ఏవే, ఇప్పుడే కదనే వంటింట్లకు పొయ్యింది. అప్పుడే అయ్యిందా అని అడిగితే ఎట్లనే’’ అంది రంగమ్మ.
‘వదినను ఇంత మాట అననిస్తలేదు ముసలిముండ’ తిట్టుకున్నరు మనసులో.
‘‘నాయిన ఒంట్ల బాగుంటున్నాదిరా’’ అని మళ్లీ రంగమ్మే అడిగింది.
‘‘కండ్లు పూర్తిగా పొయినయి పెద్దమ్మా’’ అంది చిన్నకోడలు సుశీల ` మనసులో రంగమ్మ మీదఎంత కోపం వస్తున్నా పైకి మామూలుగా మాట్లాడుతూ.
‘‘చేసిన పాపం వూకనే పోతాదే? ఆపైనున్న పరమాత్ముడు అన్నీ చూస్తనే వుంటడు’’ అని రెండు చేతులు ఎత్తి కనిపించని దేవుడికీ దండం పెట్టుకుంది రంగమ్మ.

అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నరు. ఆనంద్‌, నరహరి బయటికి నడిచారు.
‘‘ఏందనా! ఈ ముసల్ది ఇట్ల మాట్లాడ్తుంది. ఇంతకు ముందు ఈ ముసల్దానికి, అమ్మకు అస్సలు పడకపోయేది’’
‘‘ఏమోరా, పిలిపించనయితే పిలిపించినం’’
‘’చూస్తుంటే మనకే అడ్డం తిరిగేటట్టు కనిపిస్తుంది’’
‘‘నువ్వన్నట్టే అడ్డం తిరుగతదేమో. చూద్దాం. పిలిపించినంగదా. వాపస్‌ పంపించలేం’’
‘‘ఏంది పెద్దమ్మా. నువ్వు కూడా అట్లనే మాట్లాడ్తవు’’ పెద్దకోడలు.
‘‘నేనేందే అనేది. మీ మావ గురించి అందరూ అనుకుంటున్నదే’’ రంగమ్మ
‘‘మీ అన్న అని కూడా చూడకుండా, పరమాత్ముడు చూస్తుండు అంటవు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘అన్న అయితేందీ, ఎవరైతేందీ. సీతమ్మ కష్టాలు పెట్టిండు. ఉన్నమాట అన్న. ముసల్దాని మీద అనుమానంతోటి మమ్ముల గూడ గడపదొక్కనిచ్చినాడే. ఇగో, పిల్లలు కొంచెం పెద్దగయినంక మమ్ముల రానిచ్చిండు. అరిగోస పెట్టిండు ముసల్దాన్ని’’ అంది రంగమ్మ.

వాళ్లు అట్లా మాట్లాడుకుంటుండగానే కవులమ్మ వచ్చి, ‘‘ఇగో వదినా’’ అంటూ ఉప్మా ప్లేటు చేతికి అందించి, నీళ్ల గ్లాసు కింద పెట్టింది.
‘‘నువ్వు తిన్నవా వొదినా’’ ప్లేటు తీసుకుంటూ అంది రంగమ్మ.
‘‘తిన్లే వదిన. ఇంక బట్టలు గిన వున్నయ్‌’’ కవులమ్మ.
‘‘బట్టలు తర్వాత వుతుకొచ్చు. ఇంత ముద్ద కడుపులబడితే చాతనయితదిగా’’ ముద్ద కళ్లకు అద్దుకుని నోట్లో పెట్టుకుంటూ అంది రంగమ్మ.
‘‘తిని వుతికితే కడుపుల ముద్ద నోట్ల కొస్తది వదిన’’ అని, ‘‘ఛాయ్‌ పెట్టుకొస్త తింటుండు’’ అని లోపలికి పొయింది కవులమ్మ. ఆనంద్‌, నరహరి వచ్చి కూచున్నరు.

‘‘ఏవిరా, సాకల్దాన్ని పెట్టుకోకపొయిన్రురా. ముసల్దానితో ఇంకా గంపెడు పని చేయిస్తున్నరు’’ టిఫిన్‌ తింటూ రంగమ్మ. కోడండ్లు ఇద్దరు పండ్లు కొరుక్కున్నరు లోపల.
‘‘సాకలోళ్లు యాడున్నరక్కా. పని మనిషిని పెట్టుకుంటే అయిదు వందలన్నా అడుగుతరు’’
‘‘అంత సంపాయిస్తున్నరు. మీకు అయిదు వందలో లెక్కనారా? మీయమ్మ వుసురు తాకుద్దిరా’’ అది ప్లేటు కిందపెడుతూ రంగమ్మ. పెళ్లాలవేపు చూసారు. ‘ముసల్లంజె’ నెమ్మదిగా తిట్టింది సుశీల.
‘‘ఏందే సుశీలా, ఏమో అంటున్నవు. సరిగా యిన్పిస్తలేదు’’
‘‘ఆ… ఏంలే పెద్దమ్మా’’ అని ‘‘గొంతు బాగానే గుర్తు పట్టినవ్‌ పెద్దమ్మా’’ సుశీల.
‘‘గొంతుల కేందే బానే గుర్తుపడ్తగని. మాటలే సరిగ యిన్పించవు’’ అని, అల్లుండ్లను వుద్దేశించి ‘‘మీ నాయినకు పెట్టినార్రా టిపినూ’’ అంది రంగమ్మ.
‘‘ఆ… తిన్నడు’’ పెద్దకొడుకు ఆనంద్‌.
ఇందాకట్నుంచి ఎలా మొదలుపెట్టాలా అని ఎదురుచూస్తున్న సందర్భం రావడంతో ‘‘వచ్చి పదైదు రోజులాయె. మొఖంగూడ జూస్తలేదు పెద్దమ్మ’’ పెద్దకోడలు.
‘‘ఇట్లాంటి ఆడిదాన్ని యాడజూల్లేదు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘అందరు ఈమె లెక్కనే వుంటే లోకం బాగుపడినట్టే’’ చిన్న కొడుకు.
‘‘ఇంత కఠినాత్మురాలిని నేనేడ జూడలేదక్కా’’ పెద్దకొడుకు.
ఛాయ్‌ కొరకు పొయ్యిమీద పాలు పెట్టి, పొంగుతయేమో అని పాలలోకి చూస్తూ నిలబడిరది కవులమ్మ. ఎన్నడు మనసులోకి రావద్దని అణచుకున్న ఆలోచనలు ఈ రోజు ముసురుకుంటున్నయి.

చిన్నోడు తల్లిని చూని నవ్వుతూ కాళ్లూ చేతులు ఆడిస్తుండు. ఏవో ఆలోచనల్లో వున్న కవులమ్మ కొడుకు నవ్వును చూడగానే వాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తను కూడా నవ్వుతూ వాన్ని ఆడిస్తుంది.
మామూలుగానైతే చీకటిపడే టైముకు ఇంటికి వస్తడు. ఆరోజు ముందే వచ్చిండు. చప్పుడు రావద్దని ఎప్పుడూ తలుపు సందుల్లో నూనె పోస్తుంటడు. తాళం తీసిన చప్పుడుగానీ, తలుపుతీసిన చప్పుడుగానీ కాలేదు. తలుపు తీయడంతోనే ఎపదురుగ్గా మూడో అర్రల నవ్వుకుంట కొడుకును ఆడిస్తున్న కవులమ్మ కనిపించింది. చెప్పులు గబగబా విడిచి, మందుల సంచి కిందపడేసి వచ్చి కవులమ్మను గుద్దుతున్నడు, తంతున్నడు. పసిబిడ్డకు దెబ్బలు తగలకుంట వళ్లో పట్టుకుని వంగికూసుంది. ‘‘లంజె, నేను పోంగనే మిండడు వచ్చినట్టున్నడు. లంజెదాని మిడిసిపాటు సూడు నవ్వుతుంది’’ అని తిట్టుడు, కొట్టుడు.

కవులమ్మ ఒక్కటనలే రెండనలే. అక్కడి నుండి లేవలేదు. తను లేస్తే చంటోడి మీద దెబ్బలు పడ్తయేమో అని భయం.
‘‘లంజెది ఏ మిండనికి గన్నదో వీన్ని’’ గుద్దుకుంటనే. కవులమ్మ ఏమీ మాట్లాడకపోయినా కోపం పెరుగుతది ` ఒక్కమాటను లెక్కచేయదని. మాట్లాడితే ఇంకో రెండు గుద్దులు గుద్దడానికి అవకాశం వుండేది.

కోపంగా తలతిప్పి అసహ్యంతో భర్తవేపు చూసింది. వీడొక పసరం (పశువు) అనుకుంది. ఆ చూపును భరించలేకపోయిండు. ‘‘ఏందే లంజదానా, అట్ల సూస్తవు’’ అంటూ వంటింట్లోకి ఉరకి కత్తిపీట పట్టుకుని ‘‘ఎవనికి పుట్టిండో వీడు. నా కండ్ల ముందల వుండొద్దు’’ అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంట వస్తుండు.

కవులమ్మ ఒక్క వుదుటున కొడుకుని పత్తుకుని అవతలి అర్రలకు ఉరికిపొయ్యి తలుపేసుకుంది.

పాలు బుస్సున పొంగడంతో ఆలోచనల్లో నుంచి బయటపడింది. కొడుకులు, కోడండ్లు మాట్లాడే మాటలు వంటింట్లోకి వినిపిస్తున్నయి. వాళ్ల తిట్లు, పత్తిపొడుపులు, యేటిపోటీల మాటలు ఈ పదైదు రోజులుగా వింటూనే వుంది. వాళ్ల గొంతులు వినడానికి కూడా ఇష్టపడట్లేదు కవులమ్మ. ‘‘టిఫిన్‌ తిన్నవా వదినా?’’ వంటింట్లో నుండే కేకవేసింది కవులమ్మ.

‘‘ఆ… తీస్కరా వదినా’’ అని గ్లాసులోని నీళ్లు తాగి, మూతి తడుచుకుంటూ నెమ్మదిగా గ్లాసు కింద పెట్టింది రంగమ్మ.
ఛాయ్‌ గ్లాసు ఇచ్చి వెళుతుంటే ‘‘ఇంత ముద్ద తినుపో ఒదినా’’ మళ్లీ అంది రంగమ్మ.
‘‘తర్వాత తింటలే వదినా’’ అని బకెట్‌ నిండా నానబెట్టిన బట్టలు ఉతకడానికి బాయి దగ్గరికి పొయింది కవులమ్మ.

‘‘వంటిల్లంతా ఆమె చేతులనే పెడ్తున్నం. మేమేమన్నా తినొద్దంటున్నమా పెద్దమ్మా’’ అని పెద్దకోడలు అంటుండంగానే,
‘‘ఎవరన్న చూస్తే కొడుకులు అన్నం కూడా సరిగా పెడ్తలేరమ్మ ముసల్దానికి అనుకునేటట్టు మాట్లాడుతుంది చూడక్కా’’ చిన్న కొడుకు అన్నాడు.
‘వంటిల్లంతా చేతుల పెడ్తున్నరంట. మీ అసుమంటి కొడుకులు, కోడండ్లు అందరికి వుంటే లోకం బాగుపడినట్టే. తల్లులు ఉరిబెట్టుకుని సావాల్సిందే. మీ పెండ్లాలను కూసోబెట్టి ముసల్దానితోటి కన్నకష్టం చేయించుకుంటున్నరు బుక్కెడు బువ్వకోసం’ మనసులో అనుకుని, ‘‘మీయమ్మ అట్లని ఎవరితో చెప్పలేదురా. అయినా మీ అమ్మను యేడకన్న పోనిస్తిరారా’’ అని ‘‘చెప్తనేవుండె గదరా తిని వుతికితే నోట్లకొస్తదని’’ అంది రంగమ్మ.
‘దీన్ని ఎందుకన్నా పిలిస్తిమా’ అనుకున్నరు కసిగా మనసులో.
‘‘మేమేమన్నా కాళ్లూ చేతులు కట్టేసినమా పెద్దమ్మా అట్ల మాట్లాడ్తవు. ఆమెనే ఎక్కడికీ పోదుగానీ…’’దీర్ఘాలు తీసింది సుశీల.
‘‘ఎట్ల పోతదే? గుండెకాయకాడ గుండన్న లేదాయె. ఆనాడు మెడల బంతిపూల హారం, చెవులకు జుంకాలు, ముక్కుకు ఇంతింత పెద్ద బేసర్లు, చేతులకు దండకడాలు, నడుముకు వడ్డాణం పెట్టుకుని పార్వద్దేవిలెక్క వుండేది. ఆడపిల్లల పెండ్లిళ్లకు పెట్టగా వున్నాటిని మీరు ఒలుసుకుంటిరి. అషడ, అయ్యి మీ మావ చేపిచ్చినవన్నా కావాయే. ఆమె తల్లిగారు పెట్టినయి. ఏ సుట్టమింటికి పోయినా, పక్కమింటికి పోయినా అడుగుతరని మీ అత్త భయం. ఆడికీ, ఎవరన్నా అడిగినా ‘ముసల్దాన్ని నాకెందుకు నగలు’ అని అంటదిగని మీ మీదికి మాటరానీయదు’’ అంది రంగమ్మ.

‘‘ఏవండీ, టైం పది దాటింది. ఇంకా పెద్ద మనుషులు రావట్లేరు’’ ముసల్దానితో ఏం మాట్లాడినా లాభం లేదనుకుని, మాట మార్చడానికి సుశీల మొగుడితో అంది.
‘‘ఏమో. నేనదే చూస్తున్న తొమ్మిది గంటల వరకు రావాలె’’ చిన్నకొడుకు.
‘‘పెద్దమనుషుల పిలిచి పంచాతి పెడుతున్నార్రా’’ అడిగింది రంగమ్మ. అప్పటివరకు తననొక్కదాన్నె పిలిచి మాట్లాడిపిస్తరేమో అనుకుంటుంది.
‘‘లేకపోతే, మేం చెప్తే వినే మనిషా? ఆమె’’ పెద్దకొడుకు.
ఆ ముసల్ది ప్రతీదీ అడగడం, ఈయన చెప్పడం బాగానే వుంది అని విసుగ్గా ‘‘ఏవండీ, కిరణ్‌గాన్ని పంపించండి’’ అంది పెద్దకోడలు.
‘‘అరేయ్‌, కిరణ్‌’’ ఇంట్లో నుండే కేకేసాడు.
‘‘ఆ… వస్తున్నా డాడీ’’ అని మళ్లీ ఆటలో మునిగిపోయిండు వాడు. ఆదివారం కావడంతో పిల్లలందరూ ఇంటి దగ్గరే వున్నరు. ఈరోజే ఆడుకోవడానికి బయటకు వదిలారు. హాలిడే అయినా గేటు లోపలే ఆడుకోవాలి ఆడుకుంటే. లేదంటే టీవీ ముందర కూచోవాలి. క్రికెట్‌ ఆడుదామంటే మనుషులూ సరిపోరు. పిల్లలు నలుగురే. అందులో చిన్నదానికి సరిగా పరిగెత్తడమే రాదు. గేటు లోపల ప్లేసూ సరిపోదు. ఈ రోజు బయటకు విడవడంతో స్వేచ్ఛ లభించినట్టుగా వుంది పిల్లలకు.

వాడు రాకపోవడంతో ‘‘అరేయ్‌, కిశోర్‌గా’’ గేటు దగ్గరికి వచ్చి గట్టిగా పిలిచాడు కవులమ్మ చిన్నకొడుకు.
‘‘ఏం… డాడీ…’’ అంటూ దగ్గరికి వచ్చాడు.
‘‘కిరణన్న, నువ్వూ వెళ్లి రాఘవులు తాతని, లింగయ్య తాతని, నర్సయ్య తాతనూ పిలుచుకురండి’’
‘‘సరే డాడీ’’
‘‘ఏయ్‌ పింకీ చెల్లెను తీసుకుని ఇంట్లోకి రావే’’ అని లోపలకి వెళ్లిపోయాడు.
బాయి దగ్గర బట్టలుతుకుతున్న కవులమ్మ వింది. ‘అయితె పెద్దమనుషుల్లో పెడుతుండ్రన్నమాట. పెట్టుకోనియ్యి’ అనుకుంది. అట్లా అనుకుందిగానీ ఎందుకో అంతులేని దుఃఖం పొంగుకొచ్చింది. బట్టలను బలంకొద్దీ నేలకేసి బాదటం మొదలుపెట్టింది. కళ్లమ్మట నీళ్లు కారిపోతున్నయి. ఇంత బతుకు బతికింది. ఏనాడూ నలుగురి ఎదుటపడలే. ఈ ముసలితనాన నల్గుర్ల నిలబెడ్తున్నరు నా కడుపున బుట్టిన కొడుకులు. ఏ జన్మల ఏ పాపం చేసుకున్ననో ఈ మొగుడు, ఇటువంటి కొడుకులు నాపాలపడ్డరు. ఈ ఆడిజన్మ ఎందుకిచ్చినవ్‌ భగవంతుడా. ఎన్నో భరించింది తను. ఈనాడు ఈ అవమానాన్ని భరించలేకపోతుంది. అయ్యో భగవంతుడా! నేనీ దుఃఖాన్ని భరించలేను స్వామీ…

అంత దుఃఖంలో ఉన్నపళాన తను మళ్లీ చిన్నపిల్లయితే ఎంత బాగుండు. ఏ కష్టమూ తెలియని, ఏ బాధలూ తెలియని ఆ చిన్నతనం మళ్లా వస్తే అనిపించింది. తన తండ్రితోపాటు గుర్రం మీద పోతూ, తండ్రి ముచ్చట చెప్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టాలనిపించింది. తనకు చిన్నతనంలో బాగా గుర్తున్న సంఘటన అది. తండ్రి తనను ముందర కూచోబెట్టుకుని, ఒక చేత్తో తనని పట్టుకుని జనాలు కలిసి దండం పెడ్తుంటే వాళ్లను పలకరించడం కోసం గుర్రం ఆపడం, గుర్రం అడుగులేస్తుంటే దాని శరీరంతోపాటు తనూ వూగడం. అలా వూగుతూ వుంటే తనకు ప్రపంచాన్ని జయించినట్టుగా ఎంత సంతోషంగా వుండేదో ఆనాడు. ఏనాడైతే వీనితో పెళ్లయిందో ఆనాటితో తన నవ్వు మాయమైపోయింది. తను నవ్వి ఎన్నాళ్లయిందో. తను నవ్వు మర్చిపోయిందేమో. తన తండ్రి సచ్చి ఏ లోకాన వుండో. ఇప్పుడు నన్ను చూసి ఏమనుకుంటుండో. తన దగ్గరికన్నా పిలిపించుకుంటలేడు నన్ను  అనుకుంది.

దుఃఖం పొర్లిపొర్లి వచ్చింది. కొంగు నోట్లో కుక్కుకుంది. కడుపుల దుఃఖాన్ని తమాయించుకోడానికి బట్టలను దమీ దిమీ బాదుతా వుంది. కవులమ్మకు ఎందుకోగానీ ఇతర్ల ముందు తను ఏడవడం ఇష్టం వుండదు.

‘‘నాయినమ్మా కాళ్లు కడగవా’’ చెల్లెను పట్టుకుని ఐదేండ్ల పింకి నిలబడ్డది.
కళ్లు తుడుచుకుని, ముక్కుల నీళ్లు చీది మనమరాళ్ల కాళ్లు కడిగింది. అయినా కండ్ల నుంచి నీళ్లు కారుతనే వున్నయి.
‘‘నాయినమ్మ, ఏత్తున్నావెందుకు’’ అడిగింది చిన్నది.
మనమరాలినిఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. ‘‘లేదమ్మా సబ్బునీళ్లు కంట్లపడ్డయి’’ అని కింద విడిచి పెడితే పిల్లలు ఇంట్లోకి వెళ్లారు.
‘‘మమ్మీ’’ అంటూ పిల్లలిద్దరూ ఎవరి తల్లి దగ్గరికి   వాళ్లు పోయారు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వళ్లో కూచోపెట్టుకుంది చిన్నదాన్ని సుశీల.
తెల్లగా ముగ్గుబుట్టోదిగా వున్న జుట్టుతో పొట్టిగ, తెల్లగ, ముడతలుపడ్డ శరీరంతో రెప్పలు టపటప కొట్టుకుంటూ కుర్చీలో కూచున్న ముసలమ్మవేపు కొద్దిసేపు చూసి ‘‘ఎవరు మమ్మీ, ఈమే’’ అంది పింకి.
‘‘అమ్మమ్మ నాన్నా. నువ్వు చిన్నగా వున్నప్పుడు వచ్చింది’’ అని భాగ్య కూతురుకు చెప్పింది.
‘‘ఎవరే భాగ్యమ్మ? నీ బిడ్డనా’’ అడిగింది రంగమ్మ.
‘‘అవును పెద్దమ్మ’’
‘‘ఎన్నో ఏడో దానికి’’
‘‘ఆరో ఏడు’’
‘‘ఏం పేరే? బుజ్జిపేరు’’
‘‘పింకీ’’ అంది పింకీ రంగమ్మనే చూస్తూ.
‘‘అదేం పేరురా, కుక్కపిల్లకు లెక్క’’
‘‘లేదక్క, ముద్దుగా అట్లా పిలుస్తాం. అసలు పేరు ఉష’’ పెద్దకొడుకు.
‘‘ఉసనా… ఏం పేర్లో ఏమో నాయినా’’
అబ్బ! ఈ ముసల్దాన్ని ఎందుకు పిలిచామా తలపట్టుకున్నారు. ‘‘తొందరగా పంచాయితీ అయితే వెంటనే బస్సు ఎక్కించి రావచ్చు’’
‘‘అమ్మో! ఈ ముసల్దా అక్కా పొయ్యేది. నేనియ్యాళ పోలేనమ్మా అంటది. ఏదన్న చీరకొని, బస్సు ఛార్జీలు ఇస్తేగానీ రేపైనా కదలదు’’. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటున్నరు.
‘‘ఎవరెవరిని పిలుస్తున్నర్రా’’ అడిగింది రంగమ్మ. చెప్పాడు నరహరి.
‘‘అన్నను మందలించి వస్త. తీస్కపోతావురా నరహరీ’’ అంది రంగమ్మ.
ఈ ముసల్దానికి కడుపుల ఇంత పడితేగానీ అన్న గుర్తుకు రాలేదు. తిట్టుకున్నరు కోడండ్లు.
‘‘పా… అక్కా’’ అని లేచిండు నరహరి. వాళ్లు బయటికి రావడమూ, రూమువేపు పోవడమూ చూసిన కవులమ్మ బట్టలు గబగబా ఆరేసి ఇంట్లోకి వెళ్లింది.
‘‘ఎవరూ’’ కట్టె పట్టుకుని మంచంలో కూచున్న మనిషి దర్వాజ వేపు చూస్తూ కండ్లు మిటకరిస్తూ అడిగిండు.
‘‘బాగున్నవా అన్నా’’ అంటూ లోపలికి పొయింది రంగమ్మ. నరహరి రంగమ్మను వదిలి ఇంట్లోకి పొయ్యిండు.
‘‘నువ్వా రంగమ్మా. బాగున్నవా? ఎప్పుడొచ్చినవు’’
‘‘ఆ బానే వున్నన్న. ఇందాకనే వచ్చిన’’ తడుముకుంటు అన్న పక్కనే మంచం మీద కూచుంది.
‘‘పిల్లలు, మనుమలు, మనుమరాండ్లు బాగున్నరా’’
‘‘ఆళ్లకేందన్న, బానే వున్నరు. ఎవరి సంసారాలు ఆళ్లయి’’
‘‘కవులి బాయి దగ్గరనే వుందా’’ గుసగుసగా అడిగిండు ముసలోడు.
‘‘ఏమో అన్న. నాకు కండ్లు మసకలు. సరిగా కనిపించవు’’ అని ‘‘భాగ్యమ్మ… ఓ భాగ్యమ్మా’’ అని కేకేసింది రంగమ్మ.
‘‘ఏమైంది రంగమ్మా’’ ముసలాయన.
‘‘చీకటితోటి బస్సెక్కినన్న. వచ్చిన కాన్నుంచి మాటలయినవి. కడుపుల నొప్పి లేస్తుంది’’ రంగమ్మ.
‘‘ఈ ముసల్దాన్ని పనిలేక పిలిపించిండ్రు’’ అని విసుక్కుంటూ వెళ్లి ‘‘ఏంది పెద్దమ్మ? పిలిచినవు’’ అంది దర్వాజ బయటే నిలబడి.
‘‘దొడ్డికొస్తుందే’’ రంగమ్మ.
‘‘రా’’ అని బయటే నిలబడి పిలిచింది.
కవులమ్మ వంటింట్లోకి వెళ్లి, బియ్యం కడుగుదామని డబ్బా దగ్గరికి పొయ్యింది. ఎన్ని కడగాల్నో ఎవరెవరెవరు వస్తరో తెలియదు. కోడండ్లు ఇంకా చెప్పలేదు. అందుకని బీరకాయలు ముందేసుకుని కూచుంది. తనని ఆలోచనలు వదిలేటట్టులేవు.

తెల్లారే లోపల్నే ముగ్గువెయ్యాలి. అందుకే కవులమ్మ వాకిలి వూడ్చి, ముగ్గు వేస్తుంది. కవులమ్మ ముగ్గు వేస్తున్నంతసేపు పండ్లపుల్లతో పండ్లు తోముకుంటూ అక్కడే నిలబడ్డడు. కవులమ్మకు రోజూ ఇదో నరకం. తను ముగ్గు వేసేటప్పుడు పొరపాటున ఎవరన్న మొగమనిషి అటునుండి పొయిండూ అంటే ‘‘లంజె మిండడు పొద్దున్నె సూడడానికి వచ్చిండా’’ అని గుద్దులు. వీని బుద్ధి తెలుసు గనక ఆ బజారున ఉదయంపూట ఎవరూ పోరు.

కవులమ్మ ముగ్గువేసి లోపలికి రాంగనే పాటకికి (గేటుకు) తాళం వేసి, కవులమ్మ వెనకాలే వచ్చిండు. పిలగాడు లేచి ఏడుస్తా వున్నడు. పాపం. పెద్దోడు వాని పక్కనే వున్నడు వాన్ని వూకిస్తూ. తమ్ముడు ఏడుస్తుండడంతో వానికి ఏంతోచక వాడూ ఏడుస్తుండు. వానికి రెండో ఏడు పడేనాటికి వీడు పుట్టిండు. కవులమ్మకు గబుక్కున వురికి కొడుకుని అందుకోవాలనిపించింది. అట్లా ఉరకిందంటే ఏమన్న వుందా? గబగబా నడిస్తేనే తన్నులు తప్పవు. మనసులో పంత ఆతృతగా వున్నా ముగ్గుబుట్టని గూట్లె పెట్టి పొయ్యి, కొడుకుని వొళ్లోకి తీసుకుని పాలిచ్చింది.

‘‘ఇందాకట్నుంచి పిలుస్తున్నమ్మ’’ అన్నడు వాడు వచ్చీరాని మాటలతో.
‘‘మా నాయినే’’ అని ముద్దు పెట్టుకుని ‘‘నాకు ఇన్పించలేదు నాన్నా’’ అంది. ఆలస్యం అయితే తిడతడని కొడుకుని పండుకోబెట్టి ‘‘తమ్మున్ని చూస్తుండు నాయిన’’ అని చెప్పి వెళ్లి గిన్నెలు కడిగి, పొయ్యి అంటించింది. అన్నం కొంచెం పలుకయినా, కొంచెం మెత్తగయినా, కూరలో కొంచెం ఉప్పు పక్కువయినా, తక్కువయినా తన్నులు గుద్దులు తప్పవు. వళ్లు దగ్గర పెట్టుకుని తొందర తొందరగా వంట చేసింది. అన్నం తింటున్నంతసేపు ఎదురుగా నిలబడి ఏది కావలిస్తే అది అడగకుండానే చూసి వేసింది. సద్దిల అన్నం గట్టి సంచిలో పెట్టి బల్లెపీట మీద పెట్టింది.

కొన్ని వేర్లు, నూరిన మందు పొడులు, చూర్ణాలు, కొన్ని గుళికలున్న సీసాలు అంతకు ముందే వున్న మందుల సంచీలో వేసుకుని, సద్ది సంచి తీసుకుని బయటికి పొయ్యిండు. కవులమ్మ కొడుకు దగ్గరికి పొయ్యింది. బయటి నుంచి తలుపుకు తాళం వేసి, పాటకికి కూడా తాళం వేసుకుని వైద్యం చేయడానికి పక్కవూరికి పొయ్యిండు.

సంటిపిల్లతల్లి కావడంతో బాగ ఆకలి అయితుంటే కొడుకును అడ్డాలమీద పండుకోబెట్టుకుని పాలిస్తూ అన్నం తింటుంది. పెద్దోనికి తట్లె అన్నం పెట్టింది. వాడు కూడా తింటుండు.
పొయినట్టు పొయ్యి తలుపు సప్పుడు కాకుంట తాళం తీసుకుని లోపలికి వచ్చిండు. వచ్చేసరికి గబగబా అన్నం తింటూ కవులమ్మ కనిపించింది.  అంతే ‘‘లంజె, మొగడు ఎప్పుడెప్పుడు బయటపడతడా అని ఎదురుచూస్తది. దొంగ కుక్కలెక్కఎట్ల తింటుందో చూడు’’ అని అన్నం తింటున్నదాన్ని అట్లనే వంగబెట్టి గుద్దడం మొదలుపెట్టిండు.
కవులమ్మ తన్నులు తినడంతప్ప ఎదురు చెప్పడం ఏనాడో మానేసింది. చిన్నోడు బిక్కమొఖం వేసుకుని ఏడుస్తుండు. వాడు అచ్చం అతని పోలికే. నోట్ల నుంచి ఊడిపడ్డట్టు వుంటడు. ఏడుస్తున్న వాన్ని ఒక్కటి వేసిండు.
కవులమ్మ ఇదే సందని లేద్దామని కొడుకుని గట్టిగ పట్టుకుని లేస్తుంది. ‘‘లంజె, నేను ఈడ మాట్లాడుతుంటె ఏడికి పోతున్నవ్‌’’ అంటూ చేతిల వున్న పిలగాన్ని గుంజుకోబోయిండు. కవులమ్మ కొడుకుని గట్టిగ పట్టుకుని గుంజుకోవడానికి ఆయితి కానియ్యకుండ గోడకు మొఖం చేసి బిగదీసుకుని నిలబడింది.

‘‘ఏందొదినా గోడకు ఆనుకుని నిలబడ్డవు’’ అంటూ కర్ర పొడుసుకుంట రంగమ్మ వంటింట్లకు వచ్చింది. రంగమ్మ పలకరింపుతో తిరిగి చూసింది. చేతిల బీరకాయ వుంది. మళ్లీ వచ్చి కూచుని కూరగాయలు కోస్తూ, ‘నాయినా నన్నెందుకు గన్నవే’ అనుకుంది మనసులో. ఇంకా అందులో నుండి తేరుకోలేదు.

‘‘ఏందొదిన బీరకాయ పట్టుకుని గోడకు మొఖం పెట్టి నిలబడ్డవు’’ అంది రంగమ్మ. అయినా కవులమ్మ సమాధానం చెప్పలేదు. అసలు వినలేదు కవులమ్మ.
కవులమ్మ ఏమీ మాట్లాడకపోయేసరికి ‘పాపం, ఈ వయసులో నల్గుర్ల నిలబెడుతున్నరు కొడుకులు. పంత బాధపడుతుందో మనసులో’ అనుకుని ‘‘అన్నం తిన్నవా వదినా’’ అని కొంచెం గట్టిగా మళ్లీ పలకరించింది రంగమ్మ.

‘‘ఆ… ఆ… తినలే వదిన. వంట అయితే తింట’’ అంటూ లేచి వంటింట్లో అటక మీది సామాన్లు తీయడానికి వున్న స్టూలును రంగమ్మవేపు తెచ్చి పెట్టింది కూచొమ్మని.
స్టూలు మీద కూసుంట ‘‘రెండు పూటలే తిండి తిని కొడుకులకు మిగులుస్తున్నవా వొదినా’’ అంది రంగమ్మ.

‘‘చాన్నాళ్ల నుండి అలవాటయిందొదిన’’ అంది కూరగాయలు కోసుకుంట.
‘‘పెద్దమ్మా, ఈడున్నవా? రాఘవులు పెదనాయినోళ్లు వచ్చిండ్రు’’ అంటూ పెద్దకోడలు వచ్చింది.
‘‘వస్తున్న పావే’’ అని ‘‘మళ్ల జల్మల పుడ్తె ఆడపుట్టుక పుట్టొద్దొదినా’’ అని లేచింది రంగమ్మ.
కవులమ్మ మారుమాట్లాడలే.

‘‘ఏమయ్యా రాఘవులు, సీసాలెత్తి తాగుతున్నరు. మీ అల్లుళ్లు రాంగనే బానే మర్యాద చేస్తున్నట్టుంది’’ గోడ పట్టుకుని నెమ్మదిగా వస్తూ అంది రంగమ్మ.
‘‘కూల్‌డ్రిరక్స్‌ అక్క మందు గాదు’’  రంగమ్మకు ఎదురువెళ్లి చెయ్యి అందిస్తూ అన్నడు పెద్దకొడుకు.
‘‘ఊకనే అన్నలేరా. మందైతే వాసనరాదూ’’ అంది రంగమ్మ.

బాగున్నవా అక్కా, బాగున్నవా వదినా అలి పలకరించారు వచ్చిన పెద్దమనుషులు.
కుర్చీలో కూలబడుతూ ‘‘ఆ.. బానే వున్ననయ్య ఇప్పటికీ. ముందు ముందు ఎట్లుంటదో. ఆ పరమాత్ముని దయ’’ రంగమ్మ.

కవులమ్మ కూరగాయలు కోసి, పొయ్యిమీద వేసింది. కూర కలియబెడుతూ నిలబడింది. ఎన్నడూ గతాన్ని గుర్తు చేసుకోదు కవులమ్మ. గతం అంటే అతనే కాబట్టి అతను తన వూహలో కూడా రాకుండా చూసుకునేది. అలాంటిది ఇయ్యాళ ఎడతెగని జ్ఞాపకాలు.

పెద్దోడు ఆనందు పదో తరగతిల చేరిండు. చేరిన రెండో రోజే ఒకటే జరం, వాంతులు. జిస్టి గిన తగిలిందేమో అని జిస్టి తీసింది. అయినా తగ్గలేదు. పదిరోజులాయె మంచంపట్టి, ఏ మందులు వాడినా జరం తగ్గుతలేదు. ఏం తింటలేడు. తాగుతలేడు. ఒకటే వాంతులు. మంచం మీద పడుకున్న కొడుకును లేపి, తలను తనకు ఆనించుకుని సల్లపోసి అన్నం పిసికి పడేసి, గుజ్జును తాపుతుంది. చిన్నోడు, ఇద్దరు ఆడపిల్లలు బడికి పొయిండ్రు. మధ్యాహ్నం అన్నానికి ఇంక రాలేదు.

పిల్లలు పెద్దగయిన కాన్నుంచి తలుపులకు తాళాలేసుడు బందు పెట్టిండు. కొట్టుడు కూడా తగ్గింది. పిల్లలు కూడా ఎదురు తిరుగుతుండ్రు. కానీ ఊర్లనే వైద్యం చేస్తుండు. ఏ వూరుకీ పోతలేడు.
ఒచ్చుడు ఒచ్చుడే చెప్పులు యిడిసి సుట్టు చూస్తుండు ` ఏమన్న దొరుకుతదా అని. కవులమ్మ గుండెల రాయిపడింది. కని, ఆనందు సల్ల తాగుతుండని మంచంమీద కూసుని అట్లనే తాపుతుంది.

ఆ అర్రల చేతికి ఏం దొరకలే. కవులమ్మ రెక్కపట్టి గుంజిండు పండ్లు కొరుక్కుంట. ఆనందు అట్లనే పల్లెల్కల దబీమని పడ్డడు. కవులమ్మ చేతిల పల్లెం కింద పడింది.
‘‘రంకు లంజె. ఎన్నాండ్ల సంది మరిగినవే’’ అని సిగెంటికలు పట్టి వంగబెట్టి గుద్దుతుండు. ఇడిపించుకో ఆయితి గాట్లేదు.
తండ్రి తల్లిని కొడ్తుంటే అప్పుడప్పుడు చూస్తనే వుండు. ఒకటి రెండుసార్లు తండ్రితో గొడవ కూడా అయింది. కని, ఇప్పుడు ఎందుకు కొడుతున్నడో ఏం అర్ధం కాలే. ఆనికి మొన్ననే పద్నాలుగు వెళ్లి పదిహేను పడ్డయి.

‘‘నీతీ, జాతీలేని ముండాకొడుకువి నువ్వు. నీ లెక్క అందరనుకోకు’’ తన్నులు తింటూనే విపరీతమైన కోపంతో అంది కవులమ్మ.
‘‘హమ్మా లంజె.. ఎదురు తిరగనేర్చినవా. ఆన్ని చూసుకునేనా నీకింత పొగరుబట్టిందీ’’
తుపుక్కున మొఖంమీద ఊసింది కవులమ్మ. బండబూతులు తిడుతూ తన కసి తీరిందాంక కొట్టి బయటపడ్డడు.
పిల్లలు బడి నుండి ఇంక రాలేదు. ఆయన బయటపడంగనే ‘‘కొడుకా, నేను అమ్మమ్మోళ్లింటికి పోతున్నరా. తమ్మున్ని, చెల్లెల్లను జర కనిపెట్టుకునుండు నాయిన’’ అని చెప్పి తల్లిగారింటికి పోయింది.

చీకటి పడుతుండగా ఇంటికొచ్చిండు. పిల్లలు ఏడ్చుకుంట కూసున్నరు. విషయం అర్ధమైంది. అమ్మో ఎదురుతిరగ నేర్చింది. ఊకున్నమంటే ఏకు మేకైతది. బిడ్డ పోనియ్యి, ఎన్ని రోజులు పోతదో. చూస్త అనుకున్నడు.
ఇరవై ఏండ్లకు మళ్లా ఈ వూరు మొఖం చూస్తుంది తను. తల్లి సచ్చిపొయ్యి రెండు మూడేండ్లాయె. తల్లి సచ్చినప్పుడూ పంపియ్యలేదు. తనూ పోతానని అడగలేదు. ఏమో, తల్లి శవాన్ని కూడా చూడాలనిపించలేదు తనకి. పెద్దమనిషి అయ్యి ఇంట్లకు రాంగనే కవులమ్మను తన ఇంటికి తీసుకొచ్చుకుండు. తను ఏనాడైతే ఆనింట్లకి పొయ్యిందో, మళ్లా ఈనాడే తల్లిగారింట్ల కాలు పెడ్తుంది.

వైద్యం చేయడానికి ఆ వూరికి వచ్చేటోడు. కవులమ్మోళ్లకు దూరం సుట్టం కూడా. కవులమ్మోళ్ల ఇంట్లనే వుండి వైద్యం చేసేటోడు. పొద్దున వచ్చేటోడు. సాయంత్రానికి వెళ్లిపోయేటోడు. ఆయన చెయ్యి పడితె రోగం మాయమైతదని జనం నమ్మకం. మంచి వైద్యుడు. అట్లా కవులమ్మకు ఐదేండ్లునన్నప్పుడు పెండ్లి అయింది. ఆయనకి ముప్పై యేండ్లు దాటే వుంటయి అప్పటికి.

కవులమ్మను పెళ్లి చేసుకునేనాటికి ఆయనకి పెళ్లి అయ్యి భార్య సచ్చిపోయింది. నీళ్లు చేదడానికి పొయ్యి కాలుజారి బాయిలపడ్డదని ఈన చెప్పిండు. ఆడు పెట్టే బాధలకే బాయిల దుంకిందని జనం అనుకున్నరు. ఓ పిలగాడు కూడా వుండె. తల్లి సచ్చినంక పాలిచ్చేటోళ్లు, సాకేటోళ్లు లేక పిలగాడుకూడా సచ్చిపోయిండు.
రెండు నెల్లాయె. మూడు నెల్లాయె. తీసుకపోను రాట్లేడు. కవులమ్మ తండ్రి తోలొస్తనన్నడు. కవులమ్మ పోనంది. పిల్లలున్నరని సముదాయించి కవులమ్మను యెంటబెట్టుకుని అల్లుని గడప తొక్కిండు పొద్దున పదిగంటలకల్లా. అంతకుముందు బిడ్డను పండగకు తోలియ్యమని ఒకసారి, తొలిసారి ‘నీళ్లు’ పోసుకుందని తోలుకపోవడానికోసారి వచ్చిండు. కని, తోలలే. అత్తనే పిలిపించుకుండు. కవులమ్మ తండ్రి మళ్లా ఈ ఇంట్ల అడుగు పెట్టడం ఇదే.

అల్లుడు ఇంట్లనే వుండు. తండ్రి వెనకాలే కవులమ్మ వచ్చింది. ముందల అర్రల బల్లెపీట మీద కూసుని చూర్ణాలు పొట్లం కడుతుండు. వీళ్లు వచ్చింది గమనించి కూడా వీళ్లవేపు సూల్లె. అల్లుడు పలకరిస్తడేమోనని కొద్దిసేపు చూసిండు. పలకరించకపోయేసరి ‘ఆడపిల్ల తండ్రిని తనకు తప్పదుగా’ అనుకుండు. బల్లెపీట మీద తనూ ఓ పక్కకు కూసుండు. ఇంట్లకు పొమ్మని బిడ్డకు సైగ చేసిండు. కవులమ్మ సంచి పట్టుకుని ఇంట్లకు పోతుంటె, నా ఇంట్ల వుండొద్దని గొడవ పెట్టుకుండు. ఎంత బతిమిలాడినా, సముదాయించినా వినకపోయేసరికి కవులమ్మ తండ్రి కూడా కోపానికి వచ్చిండు. మాటా మాటా పెరిగింది.

‘‘నీకు, దానికి ఏ సంబంధం లేకపోతే నీ ఇంటికి వచ్చిన్నాడే తీసుకొచ్చి తోలిపోయేటోడివి. తీసుకపోయ్యి నువ్వే వుంచుకో’’ అన్నడు కవులమ్మ మొగుడు కవులమ్మతండ్రిని.
నలుగురికి చెప్పినోడు తప్పితే, ఇంకొకరితో ఎన్నడూ మాట పడలేదు. అట్లాండిది అల్లుడు గడ్డితిన్నలెక్క మాట్లాడుతుంటే తట్టుకోలేకపొయిండు.

‘‘తూ. నీ బతుకు పాడుగాను. మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు. ఇంత బుద్ధిజ్ఞానం వుండాలి. పా. ఏ పెద్దమనిషి దగ్గరికి పోదామంటవో పా. నీ గురించి తెల్వనిది ఎవనికో.’’ విపరీతమైన కోపంతో వూగిపోతూ ఇక మాటలు రాక ఆగిపొయిండు కవులమ్మతండ్రి.

కవులమ్మతండ్రి ఎన్నడు కూడా బిడ్డను ఎన్ని కష్టాలు పెట్టినా,ఎందుకు ఇట్ల చేస్తున్నవు అని అడిగి ఎరగడు. అట్లాంటిది అల్లుడు ఇయ్యాళ అంతమాట అనేసరికి మనిషి కోపంతో వణికిపోయిండు. పెద్దమనుషుల్ల పెడితె తనమీద ఊస్తరని తెలుసు కవులమ్మమొగనికి. అందుకె సప్పుడు చెయ్యలె.

ఎట్ల తిట్టాలి వీన్ని. గొడ్డుకైతె ఒక దెబ్బేసి చెప్పొచ్చు. మనిషికి అయితె ఓ మాట చెప్పొచ్చు. వీడు ఆ రెండు కాదాయెనె. కవులమ్మ తను ఈ లోకంలో వుందో లేదో కూడ తెల్వదు. చేతిల సంచి పట్టుకుని, గోడకు ఆనుకుని ఎటో చూస్తూ అట్లనే నిలబడ్డది. కవులమ్మతండ్రికి ఒక్క క్షణం అక్కడ వుండబుద్ధికాలేదు. లేచిండు. గోడకు ఆనుకుని నిలబడ్డ కవులమ్మ దగ్గరికి పొయ్యి రెండుకాళ్లు పట్టుకుండు.
‘‘నాయినా’’ అని పక్కకు జరిగింది కవులమ్మ గోడుగోడున ఏడుసుకుంట.

‘‘భూదేవికున్నంత ఓపిక ఎట్లొచ్చింది బిడ్డ నీకు. ఎట్ల భరిస్తున్నవమ్మ ఈ నరకాన్ని’’ అని భుజం మీద కండువాతోటి కండ్లు తుడుసుకుని ‘‘పిల్లలు జాగ్రత్తమ్మ’’ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుంట చెప్పులేసుకుని వెళ్లిపోయిండు కవులమ్మతండ్రి.

పిల్లలు బడినుంచి వచ్చేవరకు కవులమ్మకు సోయేలేదు. మొగడు ఎప్పుడు బయటపడ్డడో తెల్వదు.
పెద్దమనుషులు కూల్‌డ్రిరక్స్‌ తాగుడు, సరదా కబుర్లు అయిపోయినయి. ‘‘మరి మీ అమ్మను కూడా పిలవండిరా’’ అన్నడు పెద్దమనిషి.
‘‘అమ్మా’’ కేకేసిండు చిన్నకొడుకు.
యాంత్రికంగా కూర కలియబెడుతున్నదల్లా ఆలోచనల్లోంచి బయటపడి ఒకసారి కేక వినవచ్చినవేపు చూసింది. తల్లి పలకదని ఆ కొడుకులకు తెలుసు.
‘‘మీ నాయన్ని కూడా పిలిస్తరా’’ పెద్దమనుషులు.
‘‘ఆయన్ని పిలిస్తె ఈమె అస్సలు రాదు’’ పెద్దకొడుకు.
స్టౌ సిమ్‌లో పెట్టి వచ్చి దర్వాజకు ఆనుకుని నిలబడింది కవులమ్మ ‘‘కూసో అక్కా’’ అన్నడు ఒక పెద్దమనిషి.
‘‘పర్వాలేదు’’ అని అట్లనే నిలబడింది.
వ్హూ… వ్హూ… అని కొంచెం దగ్గి గొంతు సవరించుకుండు పెద్దమనిషి.
‘‘నాయిన వచ్చిఎన్ని రోజులైతుందిరా’’ తెలిసినా తెలియనట్టే అడిగిండు రాఘవులు అనే పెద్దమనిషి.
‘‘పదైదు రోజులయితుంది మావా’’ పెద్దకొడుకు.
‘‘ఒదినా, నువ్వు మాకంటె పెద్దదానివి. నీకు తెల్వందేముంది. ముసలోని ఆంకల్ల పోతలేవట’’ పెద్దమనిషి.
కవులమ్మ తల నేలకేసి అట్లనే నిలబడిరది. ఒక్కటనలే. రె,డనలే. తల్లి అలా మౌనంగా వుండడంతో కొడుకులకు ఇంకా కోపం పెరుగుతుంది. ఎంత మొత్తుకున్నా అట్లనే సడీ సప్పుడు చెయ్యదు. అసలు చెప్తున్నది వింటుందో లేదో తెలియదు. తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తది.

‘‘మొకమన్న జూస్తలే పెదనాయిన’’ చిన్నకొడుకు పెదనాయిన వరుసైన పెద్దమనిషితో.
‘‘మొఖం జూడకపోతే పాయె. ఎడం చేత్తో పచ్చి మంచినీళ్లన్న ఇస్తలేదే మావ’’ పెద్దకోడలు.
‘‘ఈమె మొగని సంగతి ఈమెకె పట్టిలేకపోతే మాకేం గర్జు పట్టిందా?’’ చిన్నకోడలు.
‘‘ఎంత మొత్తుకున్న ఇట్లనే సప్పుడు చెయ్యదు పెదనాయిన’’ పెద్దకొడుకు.
‘‘ఇగో ఆకరికి పోరగాండ్లు పొయ్యి టిఫిన్‌ ఇచ్చొస్తున్నరు’’ పెద్దకోడలు.
‘‘మీకేమయ్యిందే? మీరు ఇచ్చి రావచ్చు గదనె’’ అంది రంగమ్మ.
‘‘మాకేం కర్మ. ఏదో ఇక మాకు తప్పదు కాబట్టి ఇంట్ల వుంచుకుంటున్నం’’ చిన్నకోడలు.
‘‘ఆమెకు పట్టి లేకున్నా రేపు కొడుకులననరా? సూడమ్మ తండ్రికి ఇంత కూడన్న యేస్తలేరని’’ చిన్నకొడుకు.
‘‘మేం వుద్యోగాలకి పోతే ఇంట్ల వుండేది కోడండ్లే గద. ముసలోన్ని ఉచ్చకు గూడ తీస్కపోవాల్నాయె. ఆయన పిలిస్తె ఎవరు పోతరు. చేసుకున్న తనే దగ్గరికి పోదాయె. మొన్నోసారి ముసలోడు పిలిచి పిలిచి రూముల మూత్రం పోసుకునె’’ పెద్దకొడుకు.
‘‘ఇంత మొండిముండని యాడ సూడలే’’ కసినంతా వెళ్లగక్కింది చిన్నకోడలు.
‘‘ఆ…. ఆ… భాగ్యమ్మ. అట్లనకు. నీకంటె పెద్దది’’ పెద్దమనిషి.
‘‘ఏం పెద్దది మావ. ఆడు వుచ్చపోస్తె, ఇగో ఈ కొడుకులు వుద్యోగాల నుంచి వచ్చినాక బట్టలు మార్చిరి. రూమంతా కంపు కంపు. రూము కడగదాయె. ఆఖరికి నేను, సుశీల పొయ్యి కడిగితిమి’’ పెద్దకోడలు.
‘‘ముసలోని అంటు సొంటు పడదాయె’’ చిన్నకొడుకు.
‘‘ఇగో పెదనాయిన ఇట్ల ఎన్ని అన్నా మూగి దయ్యం లెక్క నిలబడ్తది’’ అంది చిన్నకోడలు.
అందరూ అంటున్నవి వింటూ కవులమ్మ అట్లనే నిలబడిరది.
‘‘కాదొదినా మొగుడు పెళ్లాలన్నాంక కొట్టుకుంటరు తిట్టుకుంటరు. మళ్లా కలిసుంటరు’’ పెద్దమనిషి మాట పూర్తికాకముందే, తలయెత్తి ఒకసారి అంటున్న పెద్దమనిషివేపు చూసింది కవులమ్మ ` వాడు మొగుడా అన్నట్టుగా.
‘‘అదేమో మంచిగున్నన్ని రోజులు వాడుకునే. ఈ పదైదు ఏండ్లసంది వైద్యం చేస్తే వచ్చిన డబ్బులన్ని తీసుకునె. కండ్లు కనిపియ్యకపొయేసరికి ఒదిలేసిపాయె. మరి ఏం చేస్తం?’’
‘‘పెద్దదానివి పిల్లలు గలదానివి. ఫలానాయన పెండ్లంఎవరంటె నీ పేరు చెప్తరుగని, దాని పేరు చెప్తరా’’
‘‘మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి’’ అని పెద్దమనుషులు తలా ఓ మాట అన్నరు. అయినా కవులమ్మ సడీసప్పుడు చేయలేదు.
‘‘పెదనాయిన ఈమెనే తన్నులూ గుద్దులూ తిన్నట్టు చెప్తది. లోకంల ఎవరు తన్నులు తిననట్టు’’ పెద్దకోడలు.
‘‘వర్లి వర్లి వాడే పాయె, వండక తిని నేనే పోతిని’ అన్నట్టు వుంటది మావ. మనం ఎన్ని అన్నా బేఫికరుగ తింటది, వుంటది’’ చిన్నకోడలు. ఆగుమన్నట్టు కోడండ్లవేపు కండ్లతోనే సైగచేసి ‘‘ఇక జరిగినయన్ని జరిగిపోయినయి. పాతవి తవ్వుకుంట కూసుంటె ఎట్లక్క’’ పెద్దమనిషి.
‘‘ఆళ్లా కోడండ్లేనాయె. ఉచ్చకు, దొడ్డికి తీస్కపోలేరు. నీ కొడుకులా వుద్యోగస్తులు. నీ కడుపుల ఎన్నన్నా వుండనియ్యి నువ్వే చూసుకోవాలి’’ తేల్చి చెప్పాడు పెద్దమనిషి.
కవులమ్మ చప్పుడు చెయ్యలేదు.
‘‘మరి ఇక మేం పోతమురా’’ అన్నరు పెద్దమనుషులు కొద్దిసేపు చూసి.
‘‘అయ్యో అప్పుడే పోతున్నరు. పంచాతి తెగకముందే’’ అన్నరు కొడుకులు, కోడండ్లు కంగారుగా.
‘‘సప్పుడు చేస్తలేదు. ఒప్పుకున్నట్టేగా’’ పెద్దమనుషులు.
‘‘అట్లగాదు ఈమె సప్పుడు చేస్తలేదంటె చెయ్యదని అర్ధం’’ కోడండ్లు.
‘‘పంచాయితీ తెగ్గొట్టి పోండి’’ కొడుకులు.
‘‘ఏం వదినా సప్పుడు చెయ్యవు’’ లేచినవాళ్లు కూచుంటూ.
అయినా కవులమ్మ నుండి సమాధానం లేదు.
‘‘ఏం రంగమ్మ, నువ్వేమంటవు?’’ పెద్దమనుషులు.
‘‘నేను అనేదేముంది అన్నా, ఒదిన ఏమన్న చిన్నపిల్లా’’ రంగమ్మ.
పెద్దమనుషులకు కోపం వచ్చింది కవులమ్మ మీద. బుజ్జగించినట్టు మాట్లాడితే నెత్తిమీద ఎక్కి కూసుంటుంది. ఉలకదు పలకదు.
‘‘లోకంల నువ్వొక్కదానివె ఆడిదానివి కాదు. అందరు నీ లెక్క వుంటే లోకం బాగుపడినట్టే. నన్ను వదిలిపెట్టి పోయిన్నాడే సచ్చినట్టు అని మాట్లాడ్తవంట. ఆ బొట్టెందుకు పెట్టుకున్నవమ్మ?’’ అని కాళ్లవేపు చూసాడు. మెట్టెలు లేవు. ముక్కుపుల్ల తప్ప పుస్తెతో సహా వీసమెత్తు బంగారం కవులమ్మ ఒంటిమీద లేదని తెలుసు.
కడుపుల కోపం ఎగదన్నుకొచ్చింది. అయినా ఆ మాటలన్న పెద్దమనిషి వేపోసారి చూసి సప్పుడు చెయ్యకుండ నిలబడ్డది కవులమ్మ.
‘‘నువ్వు ఇట్ల నీ మొండితనంతో వుంటే మా ఇంట్ల వుండాల్సిన అవసరం లేదు. మేం మాత్రం నీకెందుకు పెట్టాలి’’ కొడుకు.
అంతే నన్నట్టు కోడండ్లు చూసిండ్రు.
తలతిప్పి రివ్వున కొడుకు మొఖంలోకి సూటిగా చూసింది కవులమ్మ. కోపం కట్టలు తెంచుకుంది.

‘‘ఏంరా లబ్డి కొడ్కా. లెస్స మాట్లాడుతున్నవేందిరా? ఏమోలే అంటె అన్నరు. నా కడుపున పుట్టిన పిల్లలేగా అనుకున్న. వూకుంటావుంటె అలుసైనాదిరా? నాకేమన్న కూసబెట్టి తిండి పెత్తున్నార్రా? ఈ ఇంట్ల వుండొద్దు అంటున్నవు బోషిడీకె. తండ్రిమీద అంత ప్రేమున్నోళ్లు చెయ్యుండ్రి. మీ పెళ్లాలతోటి చేయించుండ్రి.
‘‘పెండ్లామన్నాక మొగుడు ఎన్నన్నా జెయ్యాల్నా? మీరేపాటి జేస్తున్నరే? పొద్దున లేస్తె గుద్ద కదలకుంట కూసుంటరు. మీకు, మీ పిల్లల కాన్నుంచి అందరికి కూసున్నకాడికి టిఫిన్‌లు, ఛాయ్‌లు తెచ్చియ్యాలి. మీరు మీ మొగుండ్లకు ఏపాటి జేస్తున్నరే ? గురివింద గింజ గుద్దకింది నలుపురెగదంట. సూర్యుని మొఖాన మన్ను బోస్తే తిరిగొచ్చి ఆళ్ల మొఖానే పడ్తదితియ్‌ అనుకున్న. ఊకుంటావుంటె నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నరు బద్మాష్‌ ముండలారా. నాకేమన్న పుణ్యానికి తిండి పెడుతున్నారే మీరు?

‘‘ఇంట్ల నుంచి పల్లగొడతరంట, ఇంట్లనుంచి. ఎవనిదిరా ఈ ఇల్లు? నీ     మామోళ్లు కట్నం కింద ఇచ్చినారురా? ఏమె లంజలాలా మీ తల్లిగారింటి నుంచి మూడగట్టుకొచ్చి నాకు పెడ్తున్నారే. నా ఇంట్ల వుండుకుంట, నా రెక్కల కష్టంతోటి వండి పెడ్తుంటె బుక్కెడు బువ్వ యేస్తున్నరు. కట్టుకోటానికి ఇంత బట్ట ఇస్తున్నరు. లెస్స మాట్లాడుతున్నరేమే’’ తననే ఇంట్ల నుంచి వెళ్లమనేసరికి తట్టుకోలేకపోయింది కవులమ్మ. తను ఎంత కష్టపడిరది ఈ ఇంటికొరకు.

కవులమ్మ మౌనమేతప్ప కోపాన్ని చూడని కొడుకులు, కోడండ్లు బదులియ్యలేకపోయిండ్రు.
‘‘ఈ ఇల్లూ… నీ తల్లిగారు కట్టించింది గాదు. ముసలాయన కట్టినది. ఈ ఇంట్ల నువ్వున్నప్పుడు ముసలోనికి చెయ్యాల్సిందే’’ పెద్దమనిషి ఖచ్చితంగా తేల్చి చెప్పిండు.
‘‘బహు జెప్పొచ్చినవ్‌ లేవయ్యా. మీరెవరసలు? నా ఇంటికొచ్చి నన్నడానికి. ఎవరయా మీరు? ఆడు కన్న కష్టాలు పెట్టిన్నాడు కానరారైతిరి? అరవైఐదేండ్లు గుద్దకిందికి ఒచ్చినంక ఎదిగిన బిడ్డల పెండ్లి చెయ్యకుంట మళ్ల పెండ్లి చేసుకుండు. ‘ఇది తప్పన్నా’ అని చెప్పడానికి ఆనాడు ఎవరు రాకపోతిరి? అయినోనివి కానోనివి కాళ్లు పట్టుకుని ఆడపిల్లల పెండ్లిళ్లు చేసిన్నాడు కానరారైతిరి? ఇయ్యాల ఊపుకుంట పెద్దమనుషులమని బయలుదేరిండ్రు.
‘‘ఈ ముదునష్టపు ముండాకొడుకు గురించి తెల్వనిది ఎవరికీ? ఒక్కనాడన్న మాట్లాడకపోతిరి? మా అమ్మనుంచుకుని ఈ లంజకొడుకు, మూడేండ్ల పోరిని ముప్పైయేండ్ల ఈ బాడుకావ్‌ నన్ను జేసుకుండు. ఓ ఇరుగమ్మ తెల్వదు ఓ పొరుగమ్మ తెల్వదు. ఓ సుట్టం తెల్వదు, ఓ పక్కం తెల్వదు. కన్నతండ్రి ఇంటికొస్తె అనరాని మాటలన్నడు ఈ కుక్కల్నాకొడుకు. నెత్తిత్తు నేలరాలినకాన్నుంచి ఏనాడన్న కడుపునిండ నవ్వి పరిగితినా? తిని పరిగితినా? కనిపించినోనితోనల్లా రంకు గట్టె. ఆఖరికి కొడుకులతో కూడానాయె. ఏ మొగోడు రాకపాయె ఆనాడు తప్పని జెప్పడానికి.

‘‘ఈ పెద్దమనిషి బొట్టు దియ్యమని లెస్స మాట్లాడ్తుండు. ఆ లంగనాకొడుకు పెట్టిందా ఈ బొట్టు? ఆడు పెట్టిన మట్టెలు, కట్టిన పుస్తెలు ఆడు మళ్ల పెండ్లి జేసుకున్ననాడే తీసిన. నన్ను ఎన్ని తిప్పలు పెట్టినా నలుగురు పోరగాండ్లు వున్నరని మానానికి, మర్యాదకి భయపడి పడివున్న. బొట్టుదియ్యమని మాలావు జెప్పవొచ్చిండు. బొట్టు తియ్యాలంట, బొట్టు.
‘‘అసలు మీరు నా గడప పందుకు తొక్కిండ్రు? ముందు బయటికి నడువుండ్రి’’ ఆవేశం పట్టలేకపోతుంది కవులమ్మ.
‘‘వాళ్లెందుకు పోతరు? మేం పిలిస్తె వచ్చిండ్రు. ఇది మా ఇల్లు. మా నాయిన గట్టింది. నాయినకు చేసేదానివైతె వుండు లేకపోతే పో’’ కొడుకులు.
‘‘అంతకంటె మా బాగ్యం ఏముందిరా? ఆని కడుపున పుట్టిన మీకు ఇంక వేరే బుద్ధులెట్ల ఒస్తయిరా? నా పాణం పోయినా ఆని మొఖం చూసేది లేదు. మీ ఇంట్ల జేసే కష్టం యాడ జేసుకున్నా బతుకుత. రెక్కలాడినంత కాలం జేసుకు బతుకుత. కాల్జెయ్యి ఆడన్నాడు ఏమన్న ఇంత మందు యేసుక సస్త’’ అంటూ వసారలోనే ఓ మూలకున్న తన బట్టలు మూటగట్టుకుని గేటు తీసుకుని బయటకు నడిచింది కవులమ్మ.

(‘అరుణతార’ ఆగస్టు 2004, ‘కథావార్షిక’ 2004)

Download PDF

16 Comments

  • శ్రీనివాస్ పప్పు says:

    మొత్తానికి కధ పూర్తి చేసానండీ,చివర్లో మాత్రం కవులమ్మ నిర్ణయం బాగా నచ్చింది.

    • పప్పు గారూ, హమ్మయ్య చదివేసారా! నాక్కూడా ఆ నిర్ణయమే బాగా నచ్చిందండి.
      ధన్యవాదాలు.

  • శారద says:

    కథా, కథని గురించి మీ పరిచయం బాగున్నాయి. అన్నిటికంటే మీ ఫుటో చాలా నచ్చింది.
    శారద

  • :-) (బ్లషింగ్… :))
    కథా పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు శారద గారూ..

  • indira says:

    ఇప్పుడే ఈకధ చదివాను.మనసు చాలా భారమైంది తృష్ణా!రెక్కల్ని నమ్ముకున్నవాళ్ళు పిల్లకాకులకి భయపడనవసరంలేదు.మీ పరిచయం ఆసక్తికరంగా చాలాబాగుంది.తరచూ రాస్తూ వుండండి.

    • ఎస్, ఎంతో ఉత్తేజకరమైన సందేశం ఉదండి ఈ కథలో! ధన్యవాదాలు ఇందిరగారూ.

  • ఇంత ఇంటెన్సిటీ ఉన్న కధను ఈ మధ్య కాలంలో చదవలేదు. చాల మంచి కధను పరిచయం చేసారు. ధన్యవాదాలు. ఎన్నో మంచి కధలు పరిచయం చేస్తారని ఆశిస్తున్నా

  • ns murty says:

    సందేహం లెదు. అద్భుతమైన కథ. కవులమ్మ అన్న అగ్నిపర్వతాన్ని పేల్చడానికి అందులో గురగురలు సృష్టించిన తీరు, ఆమె మౌనం రచనకి, అది నిర్దేశించుకున్న కెథార్సిస్ కి చాలా ఉపకరించింది. రచయిత్రి కరుణ గారికీ. పరిచయం చేసిన మీకూ అభినందనలూ, ధన్యవాదాలూ.

  • కవులమ్మ ఒక ‘ఇన్స్పిరేషన్’ అని చెప్పచ్చండి..!
    ధన్యవాదాలు మూర్తిగారూ.

  • కవులమ్మ హీరో. మిగతావాళ్ళ గురించి చెప్పుకొనేందుకు ఏమీ లేదు.
    ఆమె డైమెన్షన్స్ ఇంకా విస్తృతంగా, లోతుగా చర్చిస్తే బాగుండేదనిపించింది.
    ముగింపులో ఆమె ఇంటినీ, కథనీ దాటి సజీవంగా నిలబడింది.
    కంట నీరు పెట్టించడంలో, రక్తం మరిగించడంలో కథ పూర్తిగా సఫలమయింది. మళ్ళీ, మళ్ళీ చదివి ఆలోచించాల్సిన కథ.

    • చదివిన ప్రతిసారీ కొత్త ఉత్సాహాన్ని అందించే ప్రేరణాత్మక పాత్ర కవులమ్మది !
      కథా విశ్లేషణ అనుకోలేదండి.. అలా అయితే బావుండేదేమో! నేను కథా పరిచయం వరకే చేయాలనుకున్నాను.
      ధన్యవాదాలు ప్రసాద్ గారూ.

  • ఆత్మాభిమానం కాపాడుకున్న స్త్రీ మూర్తి కథ ముగింపు చాలా నచ్చింది మాండలికంలో కథ నడవడం ఇంకా వన్నె తెచ్చింది. తృష్ణ గారు మీ కథా పరిచయం బావుంది. మంచి కథని పరిచయం చేసినందుకు ధన్యవాదములు . రచయిత్రి కరుణ గారికి అభినందనలు

    • మాండలికం వల్లనే ఈ కథలో అంత ఆర్ద్రత..originality.. అనిపించిందండీ నాకు!
      ధన్యవాదాలు వనజ గారూ.

  • కరుణ గారి కథలూ,కథనమూ కూడా అత్యంత సహజంగా, నిరాడంబరంగా ఉంటాయి,ఆమెలాగే.అవి చదివాక చదువరి దృక్కోణంలో చిన్నపాటి మార్పైనా తప్పక వస్తుందనుకుంటాను.తృష్ణ గారు,మరోసారి చదివించారు ఈ కథని.’చదివిన ప్రతిసారీ కొత్త ఉత్సాహాన్ని అందించే ప్రేరణాత్మక పాత్ర కవులమ్మది’అని సరిగ్గా చెప్పారు !

  • నాగలక్ష్మి గారూ, వ్యాఖ్యకు ధన్యవాదాలు.
    కరుణగారి ఇతర కథలు ఎక్కడ చదవవచ్చో చెప్పగలరా? కరుణ గారి కథాసంకలనం ఏదైనా ఉందాండి?

Leave a Reply to తృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)