తన కాలానికన్నా ముందున్న కథకుడు ఆళ్వారు

sangisetti- bharath bhushan photoసంక్షుభిత సమయంలో తెలుగు సమాజం ఎదుర్కొన్న పీడన, ఘర్షణనలను చిత్రిక గట్టి గతాన్ని వర్తమానంలో సైతం ‘రిలవెంట్‌’ చేసిన ఉత్తమ సాహితీవేత్త వట్టికోట ఆళ్వారుస్వామి. 1945-1960ల మధ్య కాలంలో కథలు, నవలలు, నాటికలు, సమీక్షలు, వ్యాసాలు రాసిన వట్టికోట ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదంటూ ముద్ర వేసిండు. ఈ వ్యాసంలో కథకుడిగా తెలుగు సాహిత్యంలో వట్టికోట ఆళ్వారుస్థానం గురించి చర్చించడమైంది. మిగతా తెలుగు కథకులు/రచయితలతో పోలిస్తే ఆళ్వారుస్వామి ఎందుకు భిన్నమైన వ్యక్తి అనే అంశం కూడా ఇందులో చోటు చేసుకుంది. తెలంగాణ సాహితీ రంగంలో ఆళ్వారుస్వామి భూమిక గురించి ఈ వ్యాసంలో వివరించడమైంది.

ఆనాటి స్థల, కాలాలతో పాటుగా ఆయన రచనలూ ఇతర ప్రాంత సాహిత్యకారుల రచనల్ని తులనాత్మకంగా అంచనావేసినప్పుడుగాని కొత్త విషయాలు వెలుగులోకి రావు. ఆంధ్రప్రాంతం వారి సృజనతో ఆళ్వారు రచనల్ని పోల్చి చూసినప్పుడే వాస్తవాంశాలు తెలుస్తాయి. ఆళ్వారుని సగౌరవంగా, సమున్నతంగా నిలబెట్టుకోవాలంటే ఈ పనిజేయాల్సే ఉంటది. తెలంగాణ కథకులు ముఖ్యంగా సాయుధపోరాట కాలపునాటి వారి రచనల్ని ఆనాటి కోస్తాంధ్ర కథకులు వారి కథలతో పోలిస్తే ఎందుకు, ఎవరు భిన్నమైనవారో తెలుస్తుంది. ఆంధ్రప్రాంతానికి చెందిన శారద, ప్రయాగ, తెన్నేటి సూరి, తుమ్మల వెంకటరామయ్య, అట్లూరి పిచ్చేశ్వరరావు, రాంషా తదితర కథకులందరూ తాము తెలంగాణను చూడకుండానే పత్రికల్లో వార్తలు, కమ్యూనిస్టు నాయకులు చేసే ఉపన్యాసాలు అచ్చేసే పార్టీ కరపత్రాలు ఉపయోగించే ప్రచార సామాగ్రీ ఉద్యమ ఉధృతికి ఎత్తుగడగా వ్యాప్తిలో పెట్టే సంఘటనలు, ఆలోచనల్ని ఆసరాగా చేసుకొని రచనలు చేసిండ్రు. బొల్లిముంత శివరామకృష్ణ, మహీధర రామమోహనరావు లాంటి నవలాకారులు తెలంగాణ పోరాటాన్ని ‘పార్టీ’ప్రచార ప్రభావంతోనే అక్షరీకరించారు.

ఆరుద్ర, సోమసుందర్‌, కుందుర్తి, కె.వి.ఆర్‌, గంగినేని, రెంటాలలు తెలంగాణ కవిత్వాన్ని ఈ ప్రాంతాన్ని చూడకుండానే రాసిండ్రు. నాటకాల్ని రాసిన సుంకర, వాసిరెడ్డిలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ విషయాన్ని ఆరుద్ర తన ‘త్వమేవాహమ్‌’లో రికార్డు కూడా చేసిండు. చిత్రకారుడు చిత్తప్రసాద్‌, విశ్వవిఖ్యాత ఫోటోగ్రాఫర్‌ సునీల్‌జెనా లాంటి ఒకరిద్దరు కమ్యూనిస్టు పార్టి ప్రభావంతో స్వయంగా తెలంగాణలో పర్యటించారు. తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయమైన కృషిని ప్రపంచానికి అందించారు. అయితే పైన పేర్కొన్న ‘ఆంధ్ర’ సాయుధ పోరాట సానుభూతిపరులెవ్వరూ తెలంగాణను అప్పటివరకు చూడలేదు. అయినా వారి కవిత్వం, కథలు, నవలలకు విమర్శకులు, సాహితీవేత్తలు ప్రథమ ప్రాధాన్యత నిస్తారు. వీరి దృష్టిలో కాళోజి, సుద్దాల, దాశరథి, ఆళ్వారుస్వామిల రచనలు అంత ‘గొప్ప’వి కావు. నిజానికి ఆళ్వారుస్వామి కథలే కాదు, ధాశరథి కృష్ణమాచార్య లాంటి వారెందరో రాసిన కథలు కూడా తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. అట్లాంటప్పుడు తుది తీర్పులిచ్చేముందు తమ జ్ఞానంలోని ఖాళీల్ని పూరించుకొని మాట్లాడాల్సి, రాయాల్సి ఉంటది. అయినా ప్రాంతేతర సాహిత్యకారులు తమకు తెలిసింది మాత్రమే చరిత్ర, రచన అన్నట్టుగా తుది తీర్పులిస్తారు. ఇచ్చారు కూడా.

ఆంధ్రప్రాంతం వారి రచనలు, సాయుధ పోరాటాలు విశాలాంధ్రలో భాగంగానే, విశాలాంధ్ర కోసమే జరిగిందనే తప్పుడు భావనను ప్రచారంలోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు కూడా. ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలు ఈ భావనను యథాస్థాయి పెంచి పోషించాయి. సాయుధ పోరాటం పేరుమీద తెలంగాణ చరిత్రను కమ్యూనిస్టులు తమకు అనుకూలమైన సాహిత్యాన్ని ఒక వైపూ, మరోవైపు ఇక్కడి స్థానిక ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన సాహిత్యాన్ని 1969 నుండీ ఎక్కువ రాశిలో ఎక్కువగా ప్రచురించారు. ఎలాంటి వివక్షకూ, విస్మరణకూ తావులేని విజ్ఞతగల్ల అసలు సిసలైన చరిత్ర ఆళ్వారు రచనల్లో కనిపిస్తాయి.

తెలంగాణ` రజాకార్లు

నిజాం prajalamanishi-manjeeraపాలనలోని ముస్లింలు, రజాకార్ల గురించి ఇప్పటికీ ఏకపక్షమైన, సర్వాంగీకారం లేని, వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యానాలు, అసమంజస నిర్ధారణలు అటు హిందూత్వవాదులు, ఇటు కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో ‘కుడి’ ‘ఎడమ’ భావజాల పార్టీలందరిదీ ఒకటే దారి. ఆళ్వారుస్వామి తన కథల్లో మజ్లిస్‌ భావజాలం ఉన్న ముస్లిలంపై సైతం దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వం` పోలీసులతో కుమ్మక్కై దాడులు చేయించిన సంగతులను రికార్డు చేసిండు. ముస్లింలుగా
మారిన దళితుల దౌర్భాగ్య స్థితిని ‘కాఫిర్లు’ ‘రాజకీయ బాధితులు’ కథల్లో చెప్పిండు. ముఖ్యంగా రాజకీయ బాధితులు’ కథలో కమ్యూనిస్టులు సాయుధ రైతాంగ పోరాట విరమణ అనంతరం అడవుల్లో ఉండి సాయుధులై కొట్లాడిన కార్యకర్తల్ని విస్మరించిన తీరు, పోరాట విరమణ తప్పు అన్నవాళ్ళని పార్టీ నుంచి వెలివేయడాన్ని నిలదీసే విధంగా చిత్రీకరించిండు. విరమణను పట్టించుకోకుండా కొట్లాడిన దళిత పోరాట యోధుని భార్య పెంటమ్మ, కాంగ్రెస్‌, మిలిటరీ వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పెళ్ళాం పిల్లల్ని తలుచకుంటూ తల్లడిల్లుతున్న దస్తగీర్‌గా మారిన దళితుని వ్యథను ఈ కథలో అక్షరీకరించిండు ఆళ్వారుస్వామి.

ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ‘రజాకార్ల’ గురించి సరైన అంచనా వేస్తూ ఒక్క పుస్తకం కూడా రాలేదు. మొత్తం హైదరాబాద్‌ రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశపై హిందీ, ఉర్దూ, ఇంగ్లీషుల్లో అనేక నవలలు, కథలు, విమర్శనాగ్రంథాలు, చారిత్రక పుస్తకాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు, వైట్‌పేపర్లూ వెలువడ్డాయి. ‘అక్టోబర్‌ కూ’, ‘మర్డర్‌ ఆఫ్‌ ఎ స్టేట్‌’, ‘ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ (లాయక్‌ అలీ జీవిత చరిత్ర), కెప్టెన్‌ పాండురంగారెడ్డి రాసిన ‘ది ఫస్ట్‌ టెర్రరిస్ట్‌ మూవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’ లాంటి కొన్ని పుస్తకాలు రజాకార్ల గురించి చర్చించాయి. తెలుగు సాహిత్యంలో హిందూ`ముస్లింల సాన్నిహిత్య జీవితం, సామరస్య వైఖరిని నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులు తమ రచనల్లో చిత్రించారు. నెల్లూరి కేశవస్వామి తన కథల సంపుటికి ‘చార్మినార్‌’ అని పేరు పెట్టడమే కాదు దాన్ని రజాకార్ల కాలంలో పాకిస్తాన్‌కు వలసెళ్లిన తన ముస్లిం మిత్రుడికి అంకితమిచ్చిండు. అదీ 1980 ప్రాంతంలో అంటే ఆ జ్ఞాపకాలు ఎంతగా వెంటాడాయో అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్‌పై పోలీస్‌యాక్షన్‌ తర్వాత ఉర్దూ ప్రాధాన్యత కోల్పోయింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉర్దూ స్థానాన్ని తెలుగుతో పూర్తి చేశారు. అయితే కేవలం ఉర్దూ తెలిసిన ఉద్యోగులు ‘తెలుగుతో’ ఇమడ లేక ఉద్వాసనకు గురయ్యారు. ఇట్లా ఉద్వాసనకు గురైన వారిలో దాదాపు 95వేల మంది పాకిస్తాన్‌లోని ఒక్క కరాచీ నగరానికి వలసపోయిండ్రనే విషయం 1951 నాటి పాకిస్తాన్‌ జనాభాలెక్కలు తీస్తే తెలిసింది. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

‘‘ఇత్తెహాదుల్ముసలీమన్‌ వారు కొన్నాళ్ళు పాత మసీదుల నిర్మాణానికై పూనుకొన్నారు. కొన్నాళ్ళు పాత దేవాలయాల పునర్నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన సాగించారు. పట్టణాల్లో హిందూ, మహమ్మదీయ వైషమ్యాలు పెరిగిపోయి, సంఘర్షణలు జరుగుట సామాన్య విషయమై పోయింది.

రెండో వైపు హిందువుల రక్షణ పేర, మహమ్మదీయ వ్యతిరేకోద్యమం కూడా బలపడసాగింది. ఒకే ఊరిలో, ఒకే పాఠశాలలో చదువుకున్న హిందూ, మహమ్మదీయ బాలురల్లో కూడా వైషమ్యాలు జీర్ణించుకు పోయినవి. పట్టణాల్లో చదివిన గ్రామీణ హిందూ, మహమ్మదీయ విద్యార్థులు సెలవుల్లో ఇండ్లకు చేరి తమ మతాల ప్రచారం, ఇతరుల మతాలను ద్వేషించడం జరుగుతుండేది’’ అంటూ ఇరు మతాల వారి చాంధస ప్రవృత్తిని ‘కాఫిర్లు’ కథలో రికార్డు చేసిండు. ‘పైస దగ్గర ఎవరూ మనవాడు కాదోయ్‌’ అని ఈ కథలో చాంద్‌సాహెబు ద్వారా చెప్పించాడు. అలాగే ఊరికి వచ్చిన పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు దేశముఖు జగన్మోహనరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేయడంతోటే ఎవరి కనుసన్నల్లో అధికారులు నడుస్తున్నారో అర్ధమయ్యేలా చెప్పిండు. బాధితులు ముస్లింలైనప్పటికీ ఇక్కడ మతంతో సంబంధం లేకుండా ఆధిపత్యం దొరలు, దేశ్‌ముఖ్‌లదే నడుస్తది అని తేల్చేసిండు.

హిందూ నుంచి ముస్లిం మతంలోకి, ముస్లిం మతం నుంచి తిరిగి హిందూ మతంలోకి మార్పిడులకు (‘శుద్ధి’, ‘తబ్లీగ్‌’) గురవుతన్న‘హరిజనుల’ (దళితుల) జీవితాల గురించి ‘కాఫిర్లు’ కథలో చిత్రీకరించిండు. ఎన్ని మార్పిడులు జరిగినా ఆర్థికంగా ఏ మాత్రం ఎదుగు బొదుగూ లేని జీవితాన్ని, మారని సామాజిక స్థితిని, సాంఘిక కట్టుబాట్లను గురించి కూడా చెప్పిండు. లంచగొండి అధికారులు హిందువైనా, మహమ్మదీయుడైనా ప్రజలను పీడిరచే విధానంలో ఏమాత్రం తేడా ఉండబోదని తేల్చిండు. అలాగే పెట్టుబడిదారుడు ఏ మతస్థుడైనా స్వీయ లాభం కోసమే తపిస్తాడు తప్పితే కార్మికుల మేలుని కాంక్షించబోడు అని కూడా చెప్పాడు. కార్మికుల మతాలు వేరైనా వాళ్ళు ఐక్యంగా ఉండాలని కూడా కోరుకున్నాడు.

ప్రభుత్వాధినేతలు ముస్లింలే అయినప్పటికీ వారు గ్రామాల్లోని దేశ్‌ముఖ్‌ల తాబేదార్లుగా వ్యవహరిస్తారని ‘కాఫిర్లు’ కథలో చెప్పిండు. చివరికి ఇత్తెహాదుల్‌ సభ్యుడైనా దేశ్‌ముఖ్‌ల ఆగ్రహానికి బలికాక తప్పదని తేల్చి చెప్పిండు.

ఇది ఇత్తెహాదుల్‌ పార్టీ ‘ముస్లింలంతా పాలకులే’ (అనల్‌ మాలిక్‌) అనే సిద్ధాంతానికి విరుద్ధమనే విషయాన్ని గమనించాలి. మతంతో సంబంధం లేకుండా ప్రజలందరూ లంచగొండి అధికారుల చేతుల్లో, దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసే దేశ్‌ముఖ్‌ల వెట్టికి బలైతున్న విషయాన్ని వివరంగా చెప్పిండు. దేశ్‌ముఖ్‌ల వెట్టి నుంచి విముక్తి పొందేందుకు, కొన్నిసార్లు సామాజిక హోదా కోసం, మరి కొన్ని సార్లు తాత్కాలికంగా దొరికే ఆర్థిక సహాయం ఆశించీ, బూటకపు వాగ్దానాలను నమ్మి మతం మార్చుకున్న హిందువులు, చివరికి గ్రామ పెత్తందార్లు, భూస్వాములు విధించే కట్టుబాట్లు, వత్తిళ్ళు, బెదిరింపులు వాళ్ళని తిరిగి ‘శుద్ధి’ చేసి ‘హిందూ’ మతంలోకి మారేలా చేస్తున్న పరిస్థితికి కూడా అక్షర రూపమిచ్చిండు. రైతులు హిందువులైనా, ముస్లింలైనా వాళ్ళని ప్రభుత్వానికి పన్నులు చెల్లించే వారిగానే చూశారు. మతం మార్చుకున్న వారికి కొంతమేరకు వెట్టినుంచి విముక్తి దొరికతే దొరికిందేమోగానీ ఎక్కువ మందికి మతమార్పిడి వల్ల దక్కుతుందనుకున్న సామాజిక హోదా భ్రమగానే మిగిలింది.

అందుకే ‘కాఫిర్లు’ కథలో ఈవిషయంపై పెద్ద చర్చ చేసిండు. చాంద్‌సాహెబ్‌ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో మిలిటరీలో పనిచేసిండు. అందుకు గాను ప్రభుత్వమిచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే మజ్లిస్‌ ప్రభావం పెరుగుతున్న దశలో చాలా సార్లు మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించేవాడు. తన కొడుకు నిజాం ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం చేస్తున్న బందగీ ఫలానా గ్రామంలో హిందువులు పందిని కోసి మసీదులో వేసిండ్రనీ, మరో చోట మసీదు ముందట వాయిద్యాలు వాయించారనీ, ఇంకోచోట ఆవుని కొయ్యనియ్యలేదనీ చెబుతూ ఉండేవాడు.

దీనికి చాంద్‌ సాహెబ్‌ నచ్చచెప్పే విధంగా ఇలా జవాబు చెప్పాడు. ‘‘బందగీ! చూడు!! ఒక సంగతి చెప్తాను. నేను సిపాయిగా పనిచేస్తున్నప్పుడు మిలిటరీలో హిందూ, మహమ్మదీయ అధికారులు ఒకే బల్లపై కూర్చొని డబ్బాల్లో ఎక్కడినుంచో వచ్చిన మాంసాన్ని తినడం నేను కళ్ళారా చూశాను. దాంట్లో అన్ని రకాల మాంసాలుంటాయట. వాండ్లెట్లా తింటారో? వారెప్పుడూ జగడమాడలేదు.’’ అని తన అనుభవాన్ని చెప్పిండు. అలాగే మరో కథ ‘మెదడుకు మేత’ కథలో కూడా ఈ విధమైన చర్చ చేసిండు ఆళ్వారుస్వామి.

కథాంశంగా ఎద్దుమాంసం

తెలుగు సాహిత్యంలో ఎద్దు మాంసం గురించి చర్చ చేసిన మొట్టమొదటి సృజనకారుడు ఆళ్వారుస్వామి. ఎవరెవరి ఇష్టాయిష్టాల మేరకు ఏదైనా తినొచ్చని తీర్పిస్తూ, దీనికి మతం రంగు పూయడానికి చేసే కుట్రలో పావులు కావొద్దని బోధ చేసిండు. ఇప్పటికీ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, మత సంఘాలు, మఠాధిపతులు, ముల్లాలు, మతోన్మాదులు, చాంధసులు ఎద్దు మాంసం, పంది మాంసం విషయంలో తగాదా పడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘పెద్దకూర’ పండుగ చేసుకుంటే ఏబీవీపీ, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు వండుకున్న కూరలో మన్ను కలిపి నానా బీభత్సం సృష్టించిండ్రు. ఇదే రగడను అంతకుముందు ఎఫ్లూలోనూ కొనసాగించారు. ఇంత సున్నితమైన విషయాన్ని కూడా ఆళ్వారుస్వామి తన కథల ద్వారా విశ్లేషించి తన అభిప్రాయం చెప్పిండు.

మత వైషమ్యాలను పెంచిపోషిస్తున్న వారి గురించి, అందుకు కారణాలను, వాటిని అరికట్టాలని కూడా ఆళ్వారుస్వామి గట్టిగానే చెప్పిండు. ‘‘మహమ్మదీయులంతా ఒకటి కావాలి. కత్తితో సాధించిన మహమ్మదీయ రాజ్యాన్ని కాపాడు కోవాలె. మహమ్మదీయులంతా అన్నదమ్ముల వలె మెలగాలి’’ అని ఇత్తెహాదుల్ముసల్మీన్‌ చేసే ప్రచారాన్ని గురించీ చెప్పిండు. మత కలహాలాల్లో అమాయక, అజ్ఞాన ప్రజలే వీధుల్లో తలలు బద్దలు కొట్టుకుంటారన్నాడు. ఇప్పటి వరకూ ఏ మత కలహంలోగానీ మసీదు ఇమాంగానీ, మందిర పూజారి గాని పాల్గొనలేదు. ముల్లాలు పండితులు ముష్టియుద్ధాలకు దిగలేదు అని బోధ చేసిండు. మత స్వాతంత్య్రం అంటే ‘నీ శక్తి సామర్ధ్యాలను బట్టి, నీ శారీరక స్థితినిబట్టి, నీ దుస్తులు, నీ ఆహారము, నీవు ఉపయోగించుకున్నట్లే నీ విశ్వాసం, నీ విజ్ఞానాన్ని బట్టి నీవు నమ్మే మతవిధులను నీవు ఆచరించుకోవచ్చు. కానీ నీ మత స్వాతంత్య్రం ఇతరుల మత స్వాతంత్య్రాన్ని హరించుటకు మార్గం మాత్రం కాకూడదు’’ అని మెదడుకు మేత కథలో మోహన్‌బాబు పాత్ర ద్వారా చెప్పిస్తాడు. మతస్వేచ్ఛకు సంబంధించిన విషయంలో ఆళ్వారు తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం జేసిండు. అందుకే ఆయన దార్శనికుడు, వైతాళికుడు.

ఆవును తినడం మోక్షానికి మార్గమని చేసిన తప్పుడు ప్రచారాన్ని చైతన్యంతో ఎదుర్కోవాలని చెప్పిండు. ‘ప్రజలలో చైతన్యం, విజ్ఞానం, వికాసం కలుగుటతో వారి భావనా శక్తి ప్రధాన సమస్యలపై ప్రసరించి, విశాల హృదయముతో ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తారు. అప్పుడు ప్రజల నైతిక, రాజకీయ ఆర్థిక సమస్యలే ప్రధాన విషయాలుగా పరిగణించబడతాయి’’ అంటూ దృష్టిని కేంద్రీకరించాల్సిన అంశాలను తేటతెల్లం జేసిండు. వర్తమాన కాలంలో ఈ ‘ఫుడ్‌ రాజకీయాల’పై బుద్ధిజీవులు సవ్యంగానే స్పందిస్తున్నారు. దానికి నిదర్శనమే ‘అన్వేషి’ సంస్థ ప్రచురించిన ప్రత్యేక సంచిక.

ఫ్యూడలిజం`ఆళ్వారు కథలు

అప్పటి ఫ్యూడల్‌, దోపిడీ సమాజానికి లాభాలే తప్ప కార్మికుల శ్రేయస్సు అప్రధానమని కూడా ఆళ్వారుస్వామి తన కథల్లో బలంగా చెప్పిండు. పెట్టుబడిదారునికి దోపిడీ తప్ప మతం ఉండదని కూడా రాసిండు. మిల్లు యజామానులు ఏ మతస్థుడైనా దోపిడీ అతని ప్రధాన ఉద్దేశ్యమంటూ, ఇది ‘‘నవాబుగా, బంజరుదారుగా, మఖ్తదారుగా, లంచగొండి అధికారిగా ఉండే హిందూ మహమ్మదీయులకు`పన్నుభారంతో, లంచాలతో, దండుగలతో, నజరానాలతో కృంగి కృశించిపోతున్న హిందూ మహమ్మదీయ కూలీ రైతుల మధ్య ఐక్యత అంటే పిల్లికి ఎలుకకు ఐక్యత అనే విషయం ఇంకా అవగాహన కాలేదు జనసామాన్యానికి’’ అంటూ రావాల్సిన మార్పుల గురించి చెప్పిండు. రంజాన్‌ మాసంలో జైల్లో ఉన్న ఖైదీలకు బిర్యానీ, అరటిపండు, ఒక ఖర్జూరపండు ఇచ్చినతన్ని ఒక ఖైదీ దీవిస్తాడు. దీనికి అదే జైల్లో ఉన్న రాజకీయఖైదీ అభ్యంతరం చెబుతూ ‘‘పొట్టకు పెడ్తే దీవించావు? పొట్ట మాడినవాండ్లు దూషిస్తారు? అయితే అతనికి నీ దీవెన ఫలితమా? వాండ్ల దూషణ ఫలితమా కలిగేది? నీకు తెలియదు లతీఫ్‌. అతడు తన ఫ్యాక్టరీలో కూలీలకు, ఇంట్లో పనివాండ్లకు సరిగా జీతాలివ్వడు. అక్కడ వాండ్ల నెత్తికొట్టి యిక్కడ యీ విధంగా మీ పొట్ట నింపుతున్నాడు’’ అని కూడా తన కథల్లో చెప్పిండు.

‘‘ఈ విధంగా ఖర్చు పెట్టేవాడు తన నౌకరులకు సరిగా జీతాలెందుకివ్వడు నీ మాటలు కాని’’ అన్న లతీఫ్‌ మాటలకు జవాబు చెబుతూ ‘‘అక్కడే కిటుకంత. దానము, ధర్మము, కారుణ్యము పేర వేలు ఖర్చుపెట్టి వాండ్ల వల్ల వచ్చే కీర్తి ప్రతిష్టల ముసుగులో కష్టజీవుల నెత్తికొట్టి కోట్ల రూపాయలు గడిస్తారు. అంటే వాండ్లీవిధంగా ఖర్చుపెట్టే డబ్బు వాండ్ల విపరీత లాభాల కింద చేతిమైలతో సమానము’’ అని మోహన్‌బాబు ద్వారా భూస్వాముల దోపిడీని ఎండగట్టిండు. గ్లోబలైజేషన్‌ వచ్చిన తర్వాత ఇట్లాంటి కథలు మనం చూస్తున్నాము. కానీ 1950వ దశకంలోనే గుత్తాధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ గురించీ అందులో శ్రమజీవుల దోపిడీ గురించి కూడా చర్చించిండు. ఫ్యూడల్‌ వ్యవస్థనీ వ్యతిరేకించిండు. పై అధికారులు, వారి భార్యలు కిందిస్థాయి నౌకర్లని పీడిరచడాన్ని ‘బదనిక’ కథలో నిక్షిప్తం చేసిండు.

సంఘం పేరిట కమ్యూనిస్టుల సాయుధ`రైతాంగ పోరాటాలను, ప్రజాభ్యున్నతికి చేపడుతున్న చర్యలను, కార్యక్రమాలను ‘రాజకీయ బాధితులు’ ‘అంతా ఏకమైతే’, ‘ఆలుకూలి’, ‘చిన్నప్పుడే’, ‘ఆక్షేపణలేదు’ ‘గిర్దావర్‌’ లాంటి కథల్లో రికార్డు చేసిండు.

గిర్దావర్‌ కథలో ఆళ్వారుస్వామి గ్రామాల నుంచి దొరలను తరిమేసిన తీరు, ‘పోలీస్‌యాక్షన్‌’ తర్వాత మిలిటరీ అండతో గ్రామాలకు తిరిగొచ్చి తమ భూముల్ని స్వాధీనం చేసుకున్న భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల గురించి, వారి ఆధిపత్య పోకడల గురించీ మానవీయంగా రికార్డు చేసిండు. అలాగే పోలీస్‌ యాక్షన్‌ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉర్దూ భాష పట్ల చూపుతున్న నిరాదరణను, ప్రాంతీయ భాష`తెలుగు నేర్చుకోవాలనే నిబంధన తీసుకొచ్చి ఉర్దూమాత్రమే తెలిసిన వారి ముఖ్యంగా ముస్లింల ఉద్యోగాలను కొల్లగొట్టిన తీరు ‘పరిసరాలు’ కథలో రాసిండు. ఇదంతా చరిత్రకెక్కని మార్జినలైజ్‌డ్‌ సంఘర్షణ.

(మిగతా వచ్చే వారం)

Download PDF

3 Comments

  • dasaraju ramarao says:

    ఆళ్వారుస్వామిని తలచుకోకుండాతెలంగాణా సాహితీరంగంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. బహుముకప్రజ్ఞాశాలియే కాకుండా అందివచ్చిన ఏ సమస్యనయినా కార్యకర్తగా మోసుకు తిరిగేవారు. సంఘాలను నిర్మించి తెలంగాణా చైతన్యం పెంచేవారు.కథకుడిగా అతని తెలంగాణ ఆత్మని, తేటతెల్లం చేసిండ్రు. తన వున్న కాలాన్ని రికార్డు చేయడమే కాకుండా ,పాత్రలకు తిరుగుబాటుతనాన్ని అద్ది అన్తిమలక్ష్యాన్ని తీర్పుగా చెప్పే తీరు వట్టికోట సాహిత్యనైజంగా అర్థం చేసుకొవచ్చు.ఆ స్పురద్రూపి చుట్టు తెలంగాణ సహజ పంటల అల్లికదండ తో ముఖచిత్రంగా వెలువడిన మరసం విశిష్ట ప్రయత్నానికి విశేష విశ్లేషణ చేసిండ్రు. ధన్యవాదాలు సర్ ..ఇంకో భాగం ఉందిగా, అందుకు ఎదురు చూస్తూ..

  • Chennuri Sudarshan says:

    ఆళ్వారు స్వామి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. వారి రచనలను అంత విశ్లేషణ పూర్వకంగా మనముందుంచిన శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ గార్కి ధన్యవాదములు. వారి సాహితీ కృషి అభినందనీయము. అయితే ఆళ్వారు స్వామి పూర్తి జీవిత విశేషాలను రెండవ భాగంలో వివరిస్తారని ఆశిస్తున్నాను.

    శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ ప్రాంత రచయితల గూర్చి చేస్తున్న పరిశోధనల కృషి సామాన్యమైనది గాదు.

    నేనింతవరకు చదివిన వ్యాసాలలో యిది మర్చిపోలేనిది. ఒక్క సారి చదివితే సరిపోలేదు…మల్లి , మల్లి చదివితే గాని నా దాహం తీరలేదు.

    రెండవ భాగం కోసం ఎదిరి చూస్తూ ఉంటాను.

  • veldandi Sridhar says:

    ఏ రచయిత ఐనా సమకాలీన జీవితాన్ని దాటి సాహిత్య సృజన చేయలేడు అందుకు వట్టికోట కూడా అతీతుడు కాదు. ఐతే తన చుట్టూ సమాజంలోని సంఘర్షణలను, సమస్యలను, ఖాళీలను కథలుగా, నవలలుగా రాయడంలోనే రచయత సమకాలీనత బయటపడుతుంది. వట్టికోట కృషిని గుర్తించలేని కొందరు తెలంగాణతో సంబంధం లేని వారి రచనలకు ఇచ్చినంత గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడు తెలంగాణా తన మూలాల్ని వెదుక్కుంటుంది. దానిలో సంగిశెట్టి శ్రీనివాస్ గారి కృషి మరువలేనిది. ఇది ఎందరికో స్పూర్తిని ఇస్తోంది. మొదటి భాగం చాల బాగుంది. మరో బాగం కోసం ఎదురు చూస్తూ …

    వెల్దండి శ్రీధర్

Leave a Reply to dasaraju ramarao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)