దూకే జలపాతం చెప్పిన కథ – కలాపి

rm umamaheswararao

rm umamaheswararao‘కలాపి’. మన్నం సింధుమాధురి రాసిన కథ. ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో అచ్చయిన కథ. కలాపి అంటే నెమలి. సింధుమాధురి మాత్రం నెమలి లాంటి కలాపి గురించి కథ రాయలేదు, జెర్రిగొడ్డు లాంటి కలాపి గురించి కథ రాసింది. ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్న కలాపి గురించి కథ రాసింది. ‘ఒక పాము నోట్లో నించీ ఇంకో పాము కోరల్లో ఇరుక్కుంటూ కొండలెక్కే’సాహసి గురించి రాసింది. కలాపికి ఎంతో ఇష్టమైన సాహస క్రీడ ఇది. ‘ఈ క్రీడ కలాపి శరీరానికే పరిమితం.’ ఈ క్రీడా వినోద యాత్రలో కలాపి పొందినదేమిటో, పోగొట్టుకున్నదేమిటో కథాఖరులో కలాపి చేతే చెప్పిస్తుంది సింధుమాధురి.

ఇట్లాంటి కథాంశంతో రాయడం ఒక సాహసమే. రాసి ఒప్పించడమూ, మెప్పించడమూ అంత సులువేమీ కాదు. ఐదుగురిని పెళ్ళి  చేసుకున్న ద్రౌపదిని అమోదించడానికి పవిత్రతనీ, దైవత్వాన్నీ కవచాలుగా వాడుకోక తప్పడంలేదు ఇప్పటికీ. మరి, మన మధ్య ఉన్న స్త్రీ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని భరించగలమా? భరించి సహించగలమా? సహించి ఆమోదించగలమా? ఆమోదనీయమైన పరిస్థితులనూ, కారణాలనూ వివరించగలగాలి. లేకుంటే ఎంత సమర్థంగా రాసినా, ఎంత గొప్ప శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించినా కథ తిరస్కరణకు గురవుతుంది.

కలాపి కథలో ఆమోదనీయత కోసం రచయిత చేసిన ప్రయత్నం సఫలమైంది. జాగ్రత్తగా కథను చదివితే అసలు రచయిత ఉద్దేశ్యం కలాపి జీవితాన్ని పాఠకుల ముందుంచడమే అనిపిస్తుంది. బహుశా నిజజీవితంలో రచయితకు పరిచయమున్న పాత్ర కలాపి. యథాతథ చిత్రణ మాత్రమే కథ కాదు. కథను మలచుకోవాలి.  మలచుకోవడంలో మెలకువ ఉండాలి. ఈ మెలకువ తోనే  సింధుమాధురి మరణశయ్య మీద ఉన్న కలాపి చేత ఇలా చెప్పించింది..

“ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ప్రపంచమంతా తిరిగాను. సంపదతో దొరికే ప్రతి సుఖమూ అనుభవించాను. అయినా ఎప్పుడూ ఏదో అన్వేషణ. ఎక్కడా స్వాంతన లేదు. ఎప్పుడూ సంతృప్తి లభించలేదు. ఏ మగవాడి దగ్గరా నాకు కావలసింది దొరకలేదు. నాకు కావలసినది నాలోనే ఉంది. నాకు నేనే దాన్ని ఇచ్చుకోగలను. మరెవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాను. జీవితంలోకి మనుషులు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. మనకి మనమే శాశ్వతం. అయామ్ వాట్ అయాం. ఈ వెతుకులాటలో నాకు మిగిలింది అనుభవాలు మాత్రమే.”

కలాపి పాతికేళ్ళ అన్వేషణే ఈ కథ. కొండల మీద కుండపోతగా కురిసిన వానకి దూకే జలపాతం కలాపి. రాళ్ళని ఒరుసుకుంటూ, చెట్లని వేళ్ళు సహా పెకలించుకుంటూ, మట్టీ నీళ్ళూ ఒక్కటై పోయి సుడులు తిరుగుతూ … ఏ నదిలోనో, సముద్రంలోనో కలిసేక గానీ నెమ్మదించదు. ఈ వడిలో, ఈ దూకుడులో తనకు అయిన గాయాలు గానీ, తను చేస్తున్న గాయాలు గానీ  గుర్తుకు రావు. బాధ తెలియదు. ఈ పరుగులో , ఈ ప్రవాహంలో, ఈ ప్రయాణంలో తన ఉనికే ప్రధానం. ఎన్ని హొయలు పోయినా ఈ జడిలోనే, ఈ ప్రాయపు పడిలోనే. అనంత సాగరంలో కలిసిపోయాక తనకిక ఉనికి లేదు. విడి అస్తిత్వం లేదు. అప్పుడిక అన్వేషణ బయట కాదు, లోపల. లోలోపల, తనలోపల.

ఇరవై రెండేళ్ళ కలాపికీ, హంపీ దగ్గరలో ఉండే పదేళ్ళ అమ్మాయికీ స్నేహం. బహుశా ఈ పదేళ్ళ అమ్మాయి రచయిత. పాతికేళ్ళు దాటాక ఈ అమ్మాయి కలాపి కథ చెబుతుంది. ఈ అమ్మాయికి కలాపి అంటే వెర్రి వ్యామోహం. కలాపి రంగూ, రూపం, నడకా, నడతా ప్రతిదీ ఇష్టమే.  కలాపి నల్లని పిల్ల. ఆ నలుపు  భయపడేంత ఇష్టం ఈ పదేళ్ళ పిల్లకి. ‘మిగలపండిన నేరేడు కాయ ఫఠ్ మని కిందపడి నలిగినపుడు కనిపిస్తుందే..ఆ రంగు’అని కలాపి ఒంటి నలుపుని వర్ణిస్తుంది. అయితే, అదీ తృప్తినివ్వదు. ‘నెమలి నలుపు’ అంటుంది కాసేపు. కాదు కాదు, ‘మంచి నల్ల ఓండ్రు’ అంటుంది. ‘కారు మేఘపు నీలం కలిసిన రంగు’అనీ అంటుంది. అంతటితోనూ ఆగదు. ‘ అమ్మమ్మ పట్టిన కాటుక పళ్ళెం తిరగేసి, ఆ మసిలో పచ్చకర్పూరం, తెల్ల వెన్న వేసి తాటాకుతో రంగరిస్తే వచ్చే పేస్టల్ బ్లాక్’అంటుందా..దాన్నీ నిర్ధారించదు. ‘ఏ చిత్రకారుడు ఎన్ని రంగులు కలిపినా ఆమె ఒంటి రంగుని తేలేరు’అని తేల్చేస్తుంది.

కలాపి ఒంటి మెరుపుని ఎట్లా వర్ణిస్తుందో చూడండి, ‘దొంగతనానికి బయలుదేరే ముందు గాడిద రక్తం తాగి బాగా పరిగెత్తి, అది ఒంట్లో ఇంకినాక, ఆముదం రాసుకుని తిరిగే దొంగల దేహం మీద మెరిసే నూనె మెరుపు’. బాబోయ్!  కలాపి ‘అవయవాల్లో చంద్ర చెక్క పచ్చడి బండ గట్టిదనం, చూపులో చుర్రుమని కాలే చురుకు’. ఇంక కలాపి ప్రేమలో పడకుండా కథ చదివే పాఠకులని ఆపడం ఎవరితరం?

యౌవనంలో ఉండే అందరమ్మాయిల్లాగే కలాపికీ అద్దం అంటే ఎంతో ఇష్టం. ‘అద్దంలో తనని తాను ప్రేమించుకుంటూ గంటలు గడపగలదు. తనలో తనను అన్వేషించుకుంటున్నట్టు, తనకి కావలసినది ఏదో అందులోని తనలో దాచుకున్నట్టు వెతుక్కుంటది’.

కలాపి సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి, ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న వాడు. కలాపికి కొండలెక్కడం అంటే ఇష్టం. తుంగభద్ర ప్రేమికురాలు. నడుముకి తాడు కట్టుకుని ఒడుపుగా రాళ్ళను పట్టుకుంటూ బల్లిలా బండలూ గుట్టలూ ఎక్కేది. ఈ పనిలో అంతు తెలియని ఆనందం ఆమెకి. చెమటలు కారే శ్రమా, శ్రమ వల్ల కలిగే అలసటా, అలసట నుంచి లభించే ఆనందమూ కలాపిని తరచూ హంపీకి రప్పించేవి.  వచ్చిన ప్రతిసారీ కలాపి కొత్త అందాలతో కనిపించేది.

యూనివర్శిటీ అధ్యాపకుడైన భర్తతో విడిపోయి, క్రికెటర్ ని పెళ్ళాడిన కలాపి‘కుబుసం విడిచిన తాచులా’కనిపించింది.  బరోడా రాజ కుటుంబీకుడి పరిచయం తర్వాత వింత ఆభరణాలు ధరించి ఆమె పర్వతారోహణకి వచ్చింది. ఇప్పుడామె ‘కళ్ళలో రేడియం కాంతి. శరీరంలో జర్రిగొడ్డు వేగం’.తుంగభద్ర ఇసుకలో తడి కాళ్ళతో ‘వర్ష రుతువు ముందు పురి విప్పి ఆడే నెమలిలా’ఉంది.  తెల్లగా, పొడవుగా, స్టయిల్ గా పాత హిందీ సినిమా హీరోలా ఉన్న బరోడా రాజకుటుంబీకుడితో కలసి తుంగభద్రకి వచ్చిన కలాపి ‘ మిన్నాగులాగా పరుషపు చలాకీతో’ ఉంది. ఆ తర్వాత జపాన్ రాజకుటుంబానికి సన్నిహితుడిని ఆమె పెళ్ళి చేసుకుంది. దాదాపు పాతికేళ్ళ ప్రయాణం ఇది. ఎందరో మనుషులు, ఎన్నో ఆభరణాలు, ఎంతో సంపద. ఆఖరికి అనారోగ్యం. కలాపి శరీర సౌందర్యం మీద కలాపికే కాదు, కలాపి కథ చెప్పిన స్నేహితురాలికీ ఎంత మోహమంటే, చర్మపు కేన్సర్ తో ఒళ్ళంతా గాయాలతో ఉన్న కలాపి, ‘ఒంటి నిండా సూర్య కాంతమణులు ధరించినట్టుగా’కనిపించింది .

కలాపి, కొండలెక్కే సాహసి. శ్రీమంతుడి కూతురు. ఆధునిక స్త్రీ. అందమైనది. అందాన్ని ప్రేమించేది. కలాపి ఆరాధించే సౌంధర్యం పురాతనమైనది. తుంగభద్రా, హంపీ నగరమూ, రాజులు, రాణులు తిరుగాడిన ప్రదేశాలూ, శిధిలాలూ, శిల్పాలూ, రాళ్ళూ, గుట్టలూ..లోలోపలి పొరల్లో దాగిన పురాతనత్వం ఏదో ఆమెను మేల్కొలిపేది. హంపి ఆమె ఊరు కాదు, అక్కడ పుట్టలేదు. అక్కడ పెరగలేదు. అయినా తెలియని బంధమేదో పెనవేసుకుపోయింది.

యూనివర్శిటీ అధ్యాపకుడు, క్రికెటర్, బరోడా రాజకుటుంబం, జపాన్ సంపన్న జీవితం, ఎక్కడున్నా, ఏ దేశాలు తిరిగినా మళ్ళీ మళ్ళీ అక్కడకి రావలసిందే. అక్కడి గుట్టల్లో, గుహల్లో పడి దేన్నో వెతుక్కుంటున్నట్టుగా తిరుగాడవలసిందే. అలసట కలిగితే, అమ్మమ్మనో, నాయనమ్మనో, తాతమ్మనో గుర్తు చేసుకుంటుంది. వాళ్ళతో గడిపిన క్షణాలు ఆమెకి కొత్త శక్తినిస్తాయి. కొండలెక్కిన ప్రతిసారీ అమెకి కలిగే అనుభవం కూడా అదే. పురాతనత్వం నుంచి పునరుత్తేజం. వెతకడమే తప్ప, దేని కోసం వెతుకుతున్నదో ఆమెకీ తెలియదు. అయినా, వెతకడంలోని ఆనందం మాత్రం ఆమెకి అందేది. ఎందరు మనుషులు, ఎన్నెన్ని జీవితాలు, ఎన్ని ప్రదేశాలు..? ఆమె వెతకని చోటు ఏది? వెలుగు వెంటా, చీకటి వెంటా పడి పరుగెత్తింది.

కలాపి అన్వేషణ దేని కోసం?. మిల మిల మెరిసే శరీరం, ఖణ ఖణ మండే వయస్సు, గలగల పారే స్వభావం. ఉరకలెత్తే ఉత్సాహం. పగడాలు, ముత్యాలు, వజ్రాలు, అంతులేని సంపద వైపు పరుగులు . కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, చేతులు సాచి పిలిచే కొత్త  ప్రపంచాలు. కలాపి పరుగులో మిడిసిపాటు లేదు, ఇంకా ఇంకా ఏదో కావాలనే తపన తప్ప. ఒక రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకి ఎగబాకినట్టే, ఒక మగవాడి మీదుగా ఇంకో మగవాడిని అందుకుంది కలాపి.

]ఈ ప్రయత్నంలో అలసటలేదు, ఆనందం తప్ప. కలాపి ప్రయాణంలో తప్పటడుగులుండవచ్చు, తప్పుల్లేవు. ఘర్షణలుండవచ్చు, పశ్చాత్తాపం లేదు. ప్రయాణం ఎక్కడికి అని అడగగలం గానీ, ప్రయాణమే ఎందుకూ అనడగలేం కదా! ప్రయాణంలో మరణం కూడా ఒక సంఘటనే. మరణంతో కలాపి ప్రయాణం ఆగలేదు. యుద్ధగాయాలతో ఉన్న దేశానికి తను చేయాల్సిందేమిటో కలాపి గుర్తించింది. చేయగలిగింది చేయడం మొదలు పెట్టింది.[/note

పడిలేచిన పరుగుల  ప్రయాణంలోనే కలాపికి తాను వెతుకుతున్నదేదో దొరికింది. అమూల్యమైన నిధి అది.   ఆ నిధి ఆమెకు రాజకుటుంబాల్లో దొరకలేదు. ఆమె కోసం తపించిన మగవాళ్ళ ప్రేమలోనూ లభించలేదు. దిగిన లోయలూ,ఎక్కిన కొండల్లోనూ కనిపిపంచ లేదు. పొందిన సుఖాలు, ధరించిన ఆభరణాలు..ఊహూ..ఎక్కడా జాడ లేదు.  అద్భుతమైన ఆ నిధి అచ్చంగా ఆమె లోనే ఉంది. అప్పటిదాకా తాను వెతుకులాడింది తనలో దాగిన తన కోసమే. తనకు తాను దొరికిపోయాక, తన ప్రయాణం కొనసాగుతుందనే నమ్మకం కుదిరాక కలాపి కన్ను మూసింది ప్రశాంతంగా, తన నేస్తం లడ్డూ గొంతు మీద పుట్టుమచ్చగా మారిపోయి.

——————-

కలాపి

sindhu2( resize)“పెళ్ళితో పనిలేని ప్రేమలున్న దగ్గర ప్రేమతో! పనిలేని పెళ్ళిళ్ళు ఉండకూడదా”
ఎందుకో ఈ వాక్యాలు నన్నెప్పుడూ ఆకర్షిస్తాయి. ఆలోచింపచేస్తాయి. దానిలో ఉన్న లోతయిన భావం, బాధ  ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భంలో కలిగాయో అడగాలనిపిస్తుంది. కానీ  ఎవరి వాక్యాలో నాకు తెలీదు.

ఈ మాటలు నా గదిలో గోడ మీద వేలాడుతూ ఉంటాయి. వీటిని చదివి కొందరు నవ్వుతారు. ముఖం చిట్లిస్తారు అదోలా.

ఓ రోజు ఉదయం కోదండరామాలయం దగ్గర పుట్టి ఎక్కి, తుంగభద్ర దాటాను. మీన మండపం మీదుగా రాళ్ళు దాటుకుంటూ ‘మొల్ల మందిరం’ దగ్గర కూర్చున్నాను. జనం పెద్దగా తిరగని చోటు అది. అంత పొద్దున్నే అసలెవరూ ఉండరు. నిశ్శబ్దంగా అందమయిన సూర్యోదయాన్ని చూడచ్చు.

ఫ్లాస్క్‌లో తెచ్చుకున్న తులసి టీని కప్పులో పోసుకుని, ప్రకృతితో కలిపి చప్పరిస్తున్నా. ఇంతలో నదిలోంచి పడవవాడి కేకలు వినిపించాయి. కొద్దిగా ఇవతలకి వచ్చి ఏంటని అడిగా.

“అక్కా మీ తమ్ముడూ ఇంకొకాయన నీ కోసం చూస్తన్నారు. నువ్వు కనపడితే రమ్మన్నారు. నువ్వు మొల్ల మందిరం దగ్గిర ఉంటావని అరస్తన్నా” అంటూ నేనున్న గట్టుకి వచ్చాడు.
“సరే పద ”అని అతని పుట్టి ఎక్కా.

వడ్డుకి వచ్చాక చూస్తే, తమ్ముడూ అతని పక్కన ఇంకొక వ్యక్తి. అతనిని ఎప్పుడూ చూడలా. భారతీయుడిలా కూడా లేదు. సింహళీయుడి పోలికలు ఉన్నాయి. గుట్ట మీద ఉన్న నా కళాగృహ ( కవితల, కథల, చిత్రాల పూరిల్లు) కి నా వెంట వాళ్ళిద్దరూ వచ్చారు.  కూర్చున్నాక ఎవరూ అని తమ్ముడి వంక చూసి నొసలు ముడిచాను.

“శ్రీలంక నించీ వచ్చాడంట. కలాపి అక్క పంపిందంట. ఏమీ చెప్పటల్లేదు. నువ్వు కావాలి, మాట్లాడాలి అన్నాడు. తీసుకుని వచ్చా” అని బయటకి వెళ్ళిపోయాడు.

కలాపి పంపిందనగానే సంతోషం వేసింది. అతిథులకి ఇచ్చే పాక చూపించి, “స్నానం కానిచ్చి రండి కాఫీ, టిఫిను అయినాక మాట్లాడదాం” అని వంటమనిషికి పని పురమాయించాను.
కానీ అతను మాత్రం “ముందు ఈ ఉత్తరం  చదవండి ” అంటూ ఉత్తరంతో పాటూ ఒక ప్యాకెట్‌ నా చేతిలో పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు.

ఉత్తరం చేతిలోకి తీసుకున్నా.  అంత అందంగా లేని చేతి రాత. గజిబిజి అక్షరాలు.  ఎర్ర రంగు కాగితం మీద వణికి ఒలికినట్టున్నయ్యి.

కొలంబో,
చిన్ననాటి చిరునేస్తం లడ్డూకి,

కలాపి రాసే ఆఖరి ఉత్తరం. ఏంటి మధ్యలో పదేళ్ళు మాయమయ్యి అఖరి ఉత్తరం అంటంది అనుకుంటున్నావా. జీవితంలో, జీవనంలో పోరాడి పోరాడి అలసిపోయాను. దేని కోసమయితే అన్వేషించానో అది ఎవరిలోనూ దొరకలేదు. నేను నమ్మిన మనషుల్లోనే కాదు, నాకు ఇష్టమైన అద్దంలోనూ  కనిపించ లేదు.  చర్మపు క్యాన్సర్‌ అన్నారు. ఇంక బహుశా జీవితం నెలలే అనుకుంటాను. ఎందుకో నిన్ను చూడాలని పిస్తంది. నీ అల్లరి, తుంగభద్ర, మీ అమ్మమ్మ, నాగమ్మ కథలు, బంగ్లా శరణార్థులు, పది రూపాయలకి తెల్లవార్లు నడిపే పుట్టిలు, నీ బ్రహ్మజెముడు బూరల సంగీతం, తోట, దబ్బనం, పురికొసతో ‘గయాన్‌’గాడు రెండు సంవత్సరాలు కష్టపడి  కుట్టిన నీ బొమ్మ, గడ్డి పీచులతో నువ్వు స్కర్టులు చేసి ఏమీ తెలియని తెల్లవాళ్ళకి అమ్మి వాళ్ళతో అవి కట్టిచ్చి డాన్సులు చేయించటం, యోగా నేర్పుతానని పది డాలర్లు తీసుకుని నెల రోజుల్లో నాలుగే ఆసనాలు తిరగా బోర్లా నేర్పటం.. ఇవన్నీ నీ సమక్షంలో గుర్తు చేసుకోవాలనిపిస్తంది. నా ఆఖరి కోరిక ఏమిటంటే నేను పంపిన ఇతనితో నీవు కొలంబో రావాలని. చిగుళ్ళు కనిపించేలా పళ్లు బయటపెట్టి నవ్వే నీ నవ్వుని చూడాలని. నువ్వు వచ్చి నన్ను ప్రశాంతంగా సాగనంపుతావని ఆశగా చూస్తున్నాను.
వచ్చేటప్పుడు మంచి అద్దం తీసుకుని రా.

ఇట్లు నీ త్రాచు పాము నేస్తం
కలాపి

ఉత్తరం చదవటం అయ్యేటప్పటికి నీటి చుక్క బరువుకి కనురెప్పలు వణికాయి. నన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మ , నాయనమ్మ గుర్తొచ్చారు. ఇక ఇప్పుడు ఏదో చెయ్యాలి. దూకక ముందే ఈ దుఃఖానికి కట్ట కట్టాలి, మూటకట్టి మూలకి విసరాలి. గంటలో వస్తానని పనమ్మాయితో  చెప్పి గుట్ట దిగి  రోడ్డు మీద పడ్డాను. నడక పరుగుగా మారింది. పరుగు.. పరుగు.. పరుగు.. కన్నీరు మొత్తం చెమటలా కారి బట్టలన్నీ తడిచిపోయాయి. ఓ గంటన్నర పరిగెత్తి, బట్టల మీద ఉప్పు చారికలు తేలాక, నా నాలుక నాకే జిగురుగా తగిలినాక ఇక ఏమ్రాతం పరుగెత్త లేను అనుకున్నాక.. దబ్‌ మని తుంగభద్రలో దూకి, ఓ గంట సేపు నా ప్రియ నేస్తంతో దుఖాన్ని పంచుకున్నాను. నా కన్నీటిని కడిగి  తనలో కలిపేసుకుని నన్ను తేలికపరిచింది దుంగభద్ర. తడి గుడ్డలతోనే ఇంటికొచ్చి మంచం పైన అలసటగా అడ్డంగా పడ్డాను.

కలాపిని తలుచుకుంటే కళ్ళూ మెదడూ ఉత్తేజితం అవుతాయి. అమె రంగూ, రూపూ, కళ్ళూ అన్నీ నలుపే. ఆమె క్రిష్ణ. బరువయినది. మిగలపండిన నేరేడు కాయ ఫఠ్‌ మని కిందపడి నలిగినపుడు కనిపిస్తుందే.. రంగు, ఊహూ..సరీగ్గా అదీ కాదనుకుంటా, నలుపు పేరులా నెమలి నలుపు, కాదు..అదీ కాదు, మంచి నల్ల ఒండ్రు, కారు మేఘపు నీలం కలిసిన రంగా..!? అమ్మమ్మ పట్టిన కాటుక పళ్ళెం తిరగేసి ఆ మసిలో పచ్చకర్పూం, తెల్లవెన్న వేసి తాటాకుతో రంగరిస్తే వచ్చే పేస్టల్‌ బ్లాక్‌ రంగా..?  ఏ చిత్రకారుడు ఎన్ని రంగులు కలిపినా ఆమె ఒంటి రంగుని తేలేరు. రంగ రంగా… అది రంగా.. కాదు నేనిక వర్ణించలేను.

కలాపి నాకు బంధువు కాదు, నా వయసుకు తగ్గ స్నేహితురాలూ కాదు. కానీ నాకు బాగా దగ్గర మనిషి.

కలాపి  మా అన్నయ్య నేస్తం. నన్ను పెంచుకున్న అమ్మకి అక్క కొడుకు అతను.  ఇద్దరూ బడిలో, కాలేజీలో కలిసి చదివారు.మొదట్లో కలాపిని చూసి భయం వేసేది. కొట్టేదా, తిట్టేదా అంటే అదేం కాదు. ఆమె అందానికి భయపడ్డాను. నిజం.. నలుపులో ఇంత అందం ఉంటందా అని భయపడ్డాను. నల్లని కళ్ళు, గోధుమ రంగు కనుపాపలు, దాని చుట్టూ నల్లటి చారలాంటి వలయం, ముక్కు కొన మీద పాయలాంటి గీత, అల్లుకుపోయి కలిసిపోయిన కనుబొమలు, పిరుదుల మీదుగా మోకాళ్ళు దాటిన జుట్టు, నల్లటి, మెత్తటి, పట్టు తప్పని ఆ జుట్టుని ఎప్పుడూ  పట్టి ఉంచే చేతి వేళ్ళ కళాత్మక కదలిక. తొలి పకలరింపులోనే తియ్యగా నవ్వుతుంది కలాపి. దొంగతనానికి బయలుదేరే ముందు గాడిద రక్తం తాగి బాగా పరిగెత్తి అది ఒంట్లో ఇంకినాక, ఆముదం రాసుకుని తిరిగే దొంగల దేహం మీద మెరిసే నూనె మెరుపు, కలాపి ఒంటి మెరుపు. చెంద్రచెక్క పచ్చడి బండ గట్టితనం ఆమె శరీర అవయవాల్లో. ఆకారంలో ఠీవి, చూపులో చుర్రుమని కాలే చురుకు.

ఒక్క చూపు చూసిందంటే నిమషంలో ఎదుటి వాళ్ళని చదివేసుద్ది. నీ ఆలోచనలు నేను పసిగట్టాను అన్నట్టుంటాయి ఆ చూపులు. కలాపికి  అద్దం అంటే ఎంతో ఇష్టం. నిద్దర లెగవటం అద్దంలో తనని తాను చూసుకోవటంతోనే రోజు మొదలు పెడతది. ముందు నన్ను చూసుకుని నేను తృప్తి పడితే, ఇతరులకి మనని చూసి తృప్తి కలుగుతుంది అనేది. ఆమె నా కిష్టమయిన  నేస్తం.

కలాపి అందం, మనుషులకే కాదు ప్రకృతికి కూడా నచ్చుతుంది.

****

ఓ రోజు పొద్దున్నే అమ్మమ్మ లేపితే లెగిసి పాల దాలి దగ్గిర కూచ్చుని చలికాసుకుంటున్నా. మొఖం కడక్కుండానే కుంపటి దగ్గిర చేరానని అమ్మమ్మ సణుగుతోంది. పుల్లతో పిడక కచ్చికిలని కెలుకుతున్నా. కుంపట్లో నించి వచ్చే సన్నటి పొగ మొహానికి తగలకుండా అటూ, ఇటూ వంగుతున్నా.
“ఏయ్‌ లడ్డూ” అన్న పిలుపు.
అన్న అట్టాగే పిలుత్తాడు.
“ఎప్పుడొచ్చా”
“ఇప్పుడే”, పక్కనే పెద్ద బ్యాగు,పక్కనే ఇంకొక పెట్టెతో కలాపి. చూడగానే ఎక్కడ లేని సంతోషం.
“నువ్వు కూడా వచ్చావా? ఎన్ని రోజులుంటావు? రోజూ మనం రాళ్ళెక్కొచ్చు, గుట్టలెక్కొచ్చు. అన్నా.
ఇంతలో  మా పనిమనిషి నాగమ్మ “ఆ కళ్ళాపి అమ్మా యొచ్చిందమ్మా”అని ఇంట్లో అందరూ వినేలా అరిచి చెప్పింది.।
“ఏయ్‌ కళ్ళాపి కాదు, ముగ్గూ కాదు.. కలాపి అంటే నెమలి అని అర్థం” అన్నా.
“ఏదో లెమ్మా మొకాలు కడిగితే పాలు కలుపుతా, వంకర పేర్లు.. వంకర పేర్లు.. నోర్లు తిరుగుతయ్యా పాడా. ఓ అందవా, సందవా, ఏ సుబ్భలచ్చిమో, పోలేరో, నాంచారో, నాగమ్మో అని పెట్టుకోక” అనుకుంటా పోయింది.
“నాకివ్వాళ పాలొద్దు” అన్నా.
చక్కా నేనూ కలాపి కాఫీ తాగుతాం. నాకు అప్పుడప్పుడూ కాఫీ ఇష్టం. ఇంటో ఇవ్వరు. కలాపి వస్తే  కాఫీ తాగిచ్చుద్ది.
“కలాపిీ.. స్నానం చెయ్యి. ఆవిరి కుడుములు, గురెళ్ళ పొడితో తిని మనం కొండెక్కటానికి ఎల్దాం” అన్నా.
స్నానం చేసి వచ్చి అద్దానికి అతుక్కు పోయింది. అద్దంలో తనని తాను ప్రేమించుకుంటూ గంటలు గడపగలదు. తనలో తనను అన్వేషించుకుంటున్నట్టు, తనకి కావలసినదేదో అందులోని తనలో దాచుకున్నట్టు వెతుక్కుంటది.

అన్నయ్యా, కలాపిీ, నేనూ కొండ దగ్గరకి వెళ్లాము. కలాపి వాళ్ళ నాన్న ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉండేవాడు. పుట్టటమే శ్రీమంతురాలిగా పుట్టింది.  ఎప్పుడూ హంపీ వచ్చే కలాపి, మాతో మామూలు  జీవితం గడపటానికే ఇష్టపడేది. అన్నయ్య వచ్చినప్పుడు కలాపి రావటమో, కలాపి వచ్చిన రోజుల్లోనే అన్నయ్య రావటమో జరిగేది. వీళ్ళిద్దరి రాక నాకు మాత్రం చాలా హాయి. నన్ను ఇద్దరూ చాలా ప్రేమించేవాళ్ళు.

కలాపికి కొండలెక్కడం అంటే  ఇష్టం.  నడుంకి తాడు కట్టుకుని దానికో చిన్న సంచి తగిలించుకుని, జారకుండా చేతుల్లో కొంచెం పౌడరు పోసుకుని , ఒడుపుగా రాళ్ళను పట్టుకుంటూ, బల్లిలా కలాపి  కొండలెక్కుతుంటే జనం నోళ్లు తెరుచుకుని చూసేవాళ్ళు. కొండలెక్కడం ఎలాగో నాకూ నేర్పింది. నేనూ, అన్నయ్యా చిన్న చిన్న రాళ్ళు నాలుగెక్కితే కలాపి రాతి కొండ సగం ఎక్కి ఎనక్కి తిరిగి చూస్తా, రా…. రా…. అని పిలిచేది. తనకి 22 ఏళ్ళ వయస్సుప్పుడు బహుశా నాకు పదేళ్ళు ఉంటయ్యేమో. అయినా గాఢ స్నేహితుల్లా తిరిగేవాళ్ళం.

కలాపి ప్రతి కదలికా నాకు అబ్బురంగానే ఉండేది. నా యవ్వనారంభంలో ఎన్నో విషయాల్లో కలాపి నాకు గురువు. హుందాగా సందర్భానికి తగ్గ బట్టలు ధరించటం ఎలాగో, శరీర కదలికలు అవతలి వాళ్ళకు ఎలాంటి సంకేతాలు ఇస్తయ్యో, కూర్చోటం, నడవటం, సాదాసీదాగా ఉండటం, మన గౌరవాన్ని కాపాడుకుంటూ అవతలి వాళ్ళని గౌరవించటం లాంటివెన్నో ఆమె నుంచి నేర్చుకున్నాను.

కలాపిది  వైకుంఠపాళి జీవితం. నిచ్చెనల పక్కనే పాములు,  కొండ చిలువలు. ఒక పాము నోట్టో నించీ ఇంకో పాము కోరల్లో ఇరుక్కుంటా కొండలెక్కేది. దేనినీ తనకి అన్వయించుకునేది కాదు. అన్నీ శరీరానివే. శరీరం కోసం క్రీడ అనేది.
ఓసారి నన్నో ప్రశ్న అడిగింది.
“ఈ శరీరాన్ని ఇంత అందంగా అలంకరించి, మేపి, బట్టలు కట్టి, నగలు పెట్టి ఎవరి కోసం పెంచుతామో తెలుసా?”
“స్మశానం కోసం, మట్టిలో కలపటం కోసం” అని తనే సమాధానం చెప్పింది.

నాకు  పరిచయం అయ్యేటప్పటికే ఆమెకన్నా ఐదేళ్ళు పెద్దవాడైన ఒక యూనివర్శిటీ క్రీడా అధ్యాపకుడితో కలాపికి పెళ్ళయింది.  అతడు మా అన్నకి పరిచయస్తుడు.  ఒకసారి అతడిని తీసుకుని మా యింటి కొచ్చింది. చాలా అందంగా ఉన్నారు ఇద్దరూ. కొన్నాళ్ళున్నారు. ఆంధ్రలో ఓ పట్టణంలో కాపురం పెట్టారంట. కలాపి అందానికి చుట్టు పక్కల వాళ్ళకీ, యూనివర్శిటీ విద్యార్థులకి మతి పోయేదంట. ఆమెకి ఎన్నో పేర్లు స్మితా పాటిల్‌, నీనా గుప్త లాంటివి.

వాళ్ళ  ఊరికి ఒకసారి పేరున్న  క్రికెట్‌ క్రీడాకారుడు వస్తే వీళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారంట. అంతే ఈమె అందానికీ, హుందాతనానికీ దాసోహం అయిపోయాడు. కలాపికి ఆ క్రికెటర్‌తో పెళ్ళయిపోయింది. అతన్ని మా ఇంటికి తీసుకొచ్చింది. అతను చాలా బాగున్నాడు. కలాపి కూడా బాగుంది, కుబుసం విడిచిన త్రాచులా. అద్దంలో చూసుకోవటం మాత్రం మానేది కాదు. రెండు రోజులుండి ఆమె భర్త వెళ్ళిపోయాడు. కలాపి ఓ నెల రోజులు ఉంది. అన్నయ్య కూడా వచ్చాడు. అందరం కలిసి కొండలు గుట్టలు ఎక్కుతా గుహల్లో తిరుగుతా, వెన్నెలలో ఆడుతా  గడిపేవాళ్ళం. అన్నయ్య దగ్గర ఉంటే ఎందుకో కలాపి వెలిగిపోతూ ఉండేది. ఎప్పుడూ ఇద్దరూ మాట్లాడుకుంటానో, మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటానో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడూ పోట్టాడుకునే వాళ్ళు కూడా.

తరవాత ఆమె మకాం హైదరాబాద్‌ మారింది. తన భర్తకి చాలా పరిచయాలని చెప్పేది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉన్నా తుంగభద్రకి వస్తూ ఉండేది. కొండలు ఎక్కటం మానేది కాదు వచ్చినప్పుడల్లా. ఇవే ఈ రాళ్ళే నా నిజమయిన చెలికాళ్ళు. జారకుండా పడకుండా క్లిష్టమయిన లోయల్లో ఒక్కొక్క బండరాయినీ ఎక్కుతుంటే పునరుత్తేజం అవుతాను. ఇది నాకు శక్తి , ఇదంటే మోజు అనేది. అర్ధం అయ్యీ కాని ఆ మాటలు  నాకు చాలా నచ్చేవి.

ఈసారి వచ్చినప్పుడు కలాపి కళ్ళలో రేడియం కాంతి. శరీరంలో జర్రిగొడ్డు వేగం చూశాను.  సన్నటి దారాలకి రకరకాల రంగురాళ్ళు గుచ్చిన పట్టీలు కాళ్ళకి ధరించింది. పదిహేను రోజులుంది. ఉదయం, సాయంత్రం కూడా కొండలెక్కేది.చెమటలు కారిపోతూ, అలిసిపోతూ, ఆనందించేది. ఎందుకో నాకేదో అనుమానం వేసింది.
అన్నయ్య వడిలో తలా, కలాపి ఒడిలో కాళ్లూ పెట్టి పడుకుని “కలాపిీ” అని పిలిచా. పలికింది.

“ఈసారి ఏదయినా కొత్త పని మొదలు పెడుతున్నావా? ఈ రాళ్ళని తెగ దాటేస్తున్నావు?”
నొసలు కొంచెం పైకెత్తి దించి పెదవి కొంచెం పక్కకి సాగదీసి నవ్వింది. “ఎంతో మంది పరిచయాలు ఉన్నా ,పన్నెండేళ్ళు చిన్నదానివయినా నువ్వే నాకు ఎందుకు స్నేహితురాలి వయ్యావో తెలుసా? నేను మనుషుల్ని చదివితే, నువ్వు నన్ను చదువుతావు. నువ్వో అమ్మవి” అని దగ్గరకి తీసుకుంది. అప్పుడనిపించింది కలాపి స్పర్శ ఇక ఎవ్వరి దగ్గరా పొందలేనని. దేహపు రసాయినిక చర్య  అమ్మ తరువాత కలాపి దగ్గరే అనుభవించాను నేను.

“విషయం ఏంటి?”
“ఏముంది బరోడా రాజకుటుంబీకుడు ఒకడు నా భర్త కి మిత్రుడున్నాడు. అతను చాలా సంపన్నుడు.”
“అయితే ”
“ఎన్నో రాజాభరణాలు నా అందానికి కానుకగా ఇచ్చాడు”
“అందులో పగడాల నగలున్నయ్యా.”?
“ఉన్నయ్యి ఎందుకు?”
“తెలియదు, పగడాలంటే ఇష్టం.”
“అతను నన్ను పెళ్ళాడి బరోడా తీసుకెళతాడంట”.
“మరి ఇప్పుడున్నాయన?”
“విడాకులు ఇస్తన్నాడు” అంది. ఏమీ అర్థం కాక వెర్రి దానిలా చూశాను.  అన్నయ్యా కలాపీ చాలా మౌనంగా,  తుంగభద్ర ఇసుకని కాళ్ళతో వెనక్కి నెట్టుతా నడుస్తా ఎక్కువసేపు గడిపారు. శక్తినింపుకున్న కళ్ళతో పొడవాటి తన జడ చివర్లు చూస్తా ఉంది కలాపి.  వర్ష ఋతువు ముందు పురివిప్పి ఆడే నెమలిలా ఉంది కలాపి నాకప్పుడు. ఆ విన్యాసపు నాట్య హొయలు ప్రకృతి కోసమే అన్నట్టు నడుస్తోంది. అన్నయ్యా కలాపీ ఇద్దరూ ఏం మాట్లాడుకోవట్లా . మౌనంగా ఉన్నారు. పిచ్చెక్కినట్టయ్యి నేనే అడిగా.

“మళ్లీ మా ఇంటికి ఎప్పుడొస్తావు?” అన్నా
“నిన్నూ, తుంగభద్రనీ చూడకుండా ఉండలేను”
“మరి అన్నయ్యని?”
అప్పుడు కలాపి ఏం మాట్లాడకుండా పరవశంగా కళ్ళు మూసుకుంది. మూసిన రెప్పల కింద గోధుమ రంగు కనుపాపలు గుండ్రంగా తిరిగాయి. నెత్తి మీద ఒక్కటిచ్చి మనోహరంగా నవ్వింది.
” కలాపీ.. కొండలెక్కతా ఉంటావు కదా అలుపొచ్చినపుడు ఏం చేస్తావు”? అనడిగాను.
“నిండు తుంగభద్ర అలసిపోతుందా” అని నన్నే ప్రశ్నించింది.
“ఒక వేళ అలసి పోతే”
“మా తాతమ్మనో, అమ్మమ్మనో, నాయనమ్మనో గుర్తు చేసుకుంటాను. వాళ్ళతో గడిపిన క్షణాలని, ఆనందమయిన, అందమయిన అనుభవాలని తలుచుకుంటాను, అంతే చిరునవ్వు మొలకెత్తుతుంది. నాకే కాదు, ఎవరికయినా. ”
కలాపి వెళ్ళిపోయింది, బరోడాకి.
నాకు ఉత్తరాలు రాసేది.
అప్పుడప్పుడూ ఫోన్‌ కూడా చేసేది.
కొంత కాలం తరువాత మళ్ళీ మా ఊరు వచ్చింది కలాపి.
ఇంకా అందంగా ఉంది. మిన్నాగులాగా పరుషపు చలాకీతో ఉంది.  మునుపటి కన్నా తియ్యగా ఉంది.  హిందీ బాగా నేర్చుకుంది. పాత హిందీ పాటలు ।పాడుతోంది. అతను కూడా పాత హిందీ సినిమా హీరోలా తెల్లగా, పొడవుగా, చాలా చాలా స్టైలుగా ఉన్నాడు.
కలాపి నాతో అంది “మేము విదేశీ యాత్రలకి వెళ్దామని అనుకుంటన్నాం. ఆయన మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈయన చదువంతా కూడా బ్రిటన్‌లో జరిగింది”
నేను పకపకా నవ్వాను.
“ఏయ్‌ లడ్డూ..ఎందుకు నవ్వుతున్నావ్‌ అంది”.
“మన దేశంలో జనాన్నే పిచ్చెక్కిచ్చావు. ఇంక ఆ పిచ్చి విదేశీయులు. నిన్ను బతకనిస్తారా? ఎమ్మట పడి పీక్కు తింటారు. జాగ్రత్త.”
“పెద్ద దానివయ్యావు. మాటల్లో ఆరితేరావు.” అంది.
“లడ్డూ ,ఆ సీతారాం బాబా గుహలో డేవిడ్‌తో బ్రహ్మజెముడు బూరల సంగీతం తరగతులు ఎంత వరకూ వచ్చాయి? ఏమన్నా నేర్చుకున్నావా” అనడిగింది.
“రోజుకో బ్రహ్మజెముడు చెట్టు చస్తంది. సంగీతానికి గుహ సహకరించటం లేదు” అన్నా.  పడి పడి నవ్వింది.
“ఈ సంవత్సరం డేవిడ్‌ రాలేదు కదా”.
“లేదు. కాలేజీలో చేరుతున్నాడంట. వచ్చే సంవత్సరం వస్తానన్నాడు.”
“నువ్వెన్ని రోజులు ఉంటావు విదేశాల్లో” అనడిగా.
“వచ్చేదాకా తెలియదు”. అంది.
ఒక వారం తరవాత బయలుదేరి వెళ్ళింది. ముందుగా శ్రీలంక, అక్కడ నించీ సింగపూర్‌, మలేషియా, జపాన్‌, జర్మనీ చూసిందంట, ఉత్తరాలు రాసేది.
ఒక  సంవత్సరం దాకా ఉత్తరాలు రాలేదు. కలాపి ఏమయ్యిందో అర్థం కాలేదు. లోపలేదో దిగులుగా ఉండేది నాకు. తను  బాగుండాలి. తనిష్టమొచ్చినట్టుండాలి అనుకున్నాను. ఎందుకంటే కలాపిది ఓ శిఖరం లాంటి వ్యక్తిత్వం, నిటారుగా ఉంటేనే అందం. అది ఒంగినా, లొంగినా అందంగా కనిపించదు. తనేమయిందో తెలుసుకోవాలని బరోడాకి తనిచ్చిన నెంబర్‌కి ఫోన్‌ చేశాను. ఎవరూ లేరని  హిందీలో ఒక మగాయన చెప్పాడు.
తరువాత నాలుగేళ్ళకి కలాపి దగ్గర నించి ఒక ఉత్తరం వచ్చింది.  అచ్చమయిన తెలుగులో రాసింది.
బరోడా వ్యక్తితో విడిపోయినట్టూ, జపాన్‌ రాజకుటుంబపు బంధువుని వివాహం చేసుకున్నట్టు, అది చాలా వైభవంగా జరిగిందని రాసింది.
“పెళ్ళి కానుకగా చాలా నగలూ, సంపదా లభించాయి”అని రాసింది.
అంతే ఆ తర్వాత తన జాడ లేదు. ఏళ్ళు గడిచాయి. కలాపి కరగిపోని ఒక జ్ఙాపకంలానే ఉంది.
ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక ఉత్తరంతో పలకరించింది. ఉత్తరం తెచ్చిన  వ్యక్తిని కూచోమని మాట్లాడతన్నాను. కలాపి హోటల్స్‌ కట్టిచ్చిందంట. పిల్లలు లేరని చెప్పాడు. తనిచ్చిన ప్యాకెట్‌ విప్పి చూశాను. అందులో మూడు రకాల మేలిమి పగడాల సెట్‌లు, గాజులు, పగడపు రంగు కంచి పట్టు చీర ఉన్నాయి. చిన్న చీటీ కూడా ఉంది. “ఇవి ధరించి నాకు కనిపించు” అని ఉంది.

***

నాలుగో రోజుకి కొలంబో చేరుకున్నాం. చాలా విశాలమయిన భవంతి. సెక్యూరిటీ గార్డ్స్‌ కాపలాగా ఉన్నారు. స్నానం , టిఫిన్‌ అయ్యాక  కలాపిని చూడచ్చన్నారు. నాకు మాత్రం ఆత్రుతగా ఉంది. అక్కడున్న ప్రతి గదీ వెతికాను. ఆ ఇంటిలో ఎక్కడా కలాపి కనిపించలా. నాతో వచ్చిన సింహాళీయుణ్ణి అడిగితే, “ఇది ఆమె అతిథిగృహం. మీరు తొందరగా తయారయితే ఆమెని చూడవచ్చు” అన్నాడు.

గబగబా స్నానం చేసి తయారయ్యాను. రెండు మైళ్ళ దూరంలోని  ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పగడపు రంగుచీర, పగడాల సెట్‌, నా విటాన్‌ పగడపు రంగు క్లచ్‌తో బయలుదేరాను. ఒక నర్స్‌ కలాపి గదిలోకి తీసుకెళ్ళింది. చల్లని ఏసి గది. బెడ్‌ మీద దోమతెరలాంటి వస్త్రం కింద ఒక శరీరం. చిరునవ్వుతో విడిపోవాల్సిన పెదాలు చిగురుటాకులా ఒణికిపోయాయి. ఎలా చెప్పను. ఏం రాయను తనసలు కలాపినేనా. కాదు.. ఛ.. అని అనుకునే లోపల తిరిగి చూసింది. కళ్ళలో మాత్రం అదే మెరుపు. ఆ.. అవును, ఈ కళ్ళు కలాపివే.  ఇంకెవరీకి ఉండవు. “లడ్డూ దగ్గరకి రాకు, దూరంగా ఉండు. నేను, నా చర్మం అసహ్యంగా మారిపోయాయి” అంది.

నేను ఏం చెయ్యాలి? నన్ను నేను సిద్ధం చేసుకున్నా. నేను కలాపి స్థానంలో ఉంటే కలాపి ఏం చేసేది? లేకపోతే అమ్మ కలాపి స్థానంలో ఉంటే దగ్గరకి వెళ్లనా, ముట్టుకోనా? ఏదో చెయ్యాలి!.  చేతిలోంచి పర్స్‌ కింద పడిపోయింది. నా తటపటాయింపుకి ఆ శబ్దం ముగింపు పలికింది.  ఒక్క ఉదుటున మంచం దగ్గరకి వెళ్లాను. తనని రెండు చేతులతో లేపాను. హృదయానికి హత్తుకున్నాను. ఎందుకో “అమ్మా, అమ్మా, అమ్మా… ”అని మూడు సార్లు అన్నాను.  చీము, రక్తం కారే శరీరాన్ని  అలా పట్టుకుని ఓ గంటపాటు ఉండిపోయాను. కలాపి వారించలేదు. తను కోరుకున్నదే జరుగుతున్నట్టుగా ఉండిపోయింది. నా కనుపాపల్లో ఉబికే నీటి పొరల్ని గుండెల్లోకి అదిమేసుకున్నాను. నన్ను నేను జోకొట్టుకున్నాను.
కలాపి ఆఖరి కోరిక నేను నెరవేర్చాలి. చివరి శ్వాస దాకా ఆమె చెంతన ఉండాలి అని నిర్ణయించుకున్నా.

కింద వేసిన రబ్బరు షీట్లు తీసేయించి, లేత అరిటాకులు పరిపించాను.  చల్లని నీళ్లు తాగించాను. కలాపి మొహంలో బాధ లేదు. ఒక రకమైన నిశ్చింత. ఆమె గాయాలు తుడుస్తూ ఉండే దాన్ని.  ఈ పుళ్ళూ, గాయాలతో  కూడా కలాపి చాలా అందంగా కనిపించడం మొదలు పెట్టింది.  వంటి నిండా  సూర్యకాంతమణులు ధరించినట్టు గా కనిపించేది కలాపి.
ఒక రోజు కలాపి మంచం ముందు పెద్ద స్కీన్‌ ఏర్పాటు చేశారు.  తన ముదు రిమోట్‌. “ఏంటి” అన్నా. “చూడు” అంది.

బాలికా పునరావాస కేంద్ర్రం ప్రారంభోత్సవం. నన్నే స్విచ్‌ నొక్కమంది.  నువ్వు మాత్రమే చెయ్యగలిగింది ఇది అని తన చేతే ప్రారంభం చేయించాను.
అప్పుడు కలాపి ఇలా చెప్పింది.

“లడ్డూ, ఎన్ని ఆభరణాలు..ఎన్ని ఆస్థులు.. ఏం చేసుకోను? సంపదనంతా డబ్బుగా మార్చాను. ఈ దేశం యుద్ధ గాయాలతో ఉంది.  అనాథలయిన స్త్రీలు, బాలికలు, లైంగిక హింసకి గురి అయిన వాళ్ళ పునరావాసం కోసం  ఈ డబ్బంతా ఖర్చు చేస్తున్నాను.  ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ప్రపంచమంతా తిరిగాను. సంపదతో దొరికే ప్రతి సుఖమూ అనుభవించాను. అయినా ఎప్పుడూ ఏదో అన్వేషణ. ఎక్కడా స్వాంతన లేదు. ఎప్పుడూ సంతృప్తి లభించలేదు.  ఏ మగవాడి దగ్గరా నాకు కావలసింది దొరకలేదు. మగవాడెప్పుడూ శాశ్వతం కాదు. ప్రవాహంలాంటి వాడు. ఎక్కువ అడ్డుకట్టలు వేసినా, వదిలేసినా మనకి దక్కడు. నాకు కావలసిన శాంతి నాలోనే ఉంది. నాకు నేనే దాన్ని యిచ్చుకోగలను. మరెవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాను. జీవితంలోకి మనుషులు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. మనకి మనమే శాశ్వతం. అయామ్‌ వాట్‌ అయాం. ఈ వెతుకులాటలో నాకు మిగిలింది  అనుభవాలు మాత్రమే.” నిదానంగా, శాంతిగా కలాపి గొంతులోంచి మాటలొస్తున్నాయి.।

“నేనప్ప చెప్పిన అన్ని పనులూ బాధ్యతగా పూర్తి చేసి నన్ను  సాగనంపటానికి ఓ వ్యక్తి వస్తాడు చూడు. అతను నాకు  జీవితంలో, అన్ని నిర్ణయాలలో తోడుగా నిలిచాడు. మొదటి నించీ కడ వరకూ మిగిలిన మనిషి”. అని చెప్పింది. ఈ మాటలు అంటున్నపుడు కలాపి ముఖంలో పాత కాంతిని కొత్తగా చూశాను. నాకు పరిచితమైన కాంతి అది.
మెల్లగా నీరసంగా అలసిపోయి ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తన్నాడు. అతను… అతను..అతను నా అన్న.

అమ్మ కలాపి దొంగ అనుకున్నా.
నా ఆఖరి కోరిక తీరుస్తారా అనడిగింది ఇద్దరినీ.
“ఏంటి” అంటే
“అద్దం కావాలి, అద్దం. ”
“కళ్ళు మూసుకుని నేను చెప్పినప్పుడు తెరిస్తే నీకు  అద్దం చూపిస్తా ”అన్నాడు మా అన్న.
సరే అంది.
కళ్ళు మూసుకో అని పక్క గదిలోకి వెళ్లి అద్దం తెచ్చాడు. దాని పైన కలాపి యవ్వనంలో ఉండగా గీసిన బొమ్మ  ఉంది.
అది తన మొహం దగ్గరగా తెచ్చి,” కళ్ళు తెరువు కలాపీ” అన్నాడు.
తెరిచి చూసి, అందంగా చీమలు చుట్టి కుట్టిన సర్పంలా నవ్వింది.
విశాలమయిన ఆ గోధుమరంగు నల్ల వలయాల కళ్ళ దృష్టి అద్దంలోకి ఇంకి పోయింది.
కలాపి నా గొంతు మీద పుట్టు మచ్చగా మారిపోయింది.
————–
అంకితం: కలాపి చిరకాల నేస్తం సురేన్‌కి

Download PDF

8 Comments

 • నాకు అసలు “కలాపి “పాత్రే నచ్చలేదు కలాపి వర్ణణ మాత్రమే ఆ కథ ని చదివింపజేసింది

  పెళ్ళిలో ఏమి తెలుసుకోవడానికి ఒక వివాహం చాలు 8 వివాహాలు అవసరం లేదు చరిత్రలో ఇలాంటి స్త్రీ మూర్తులు ఉన్నారు రాజ్యం కోసం,ధనం కోసం అనేక వివాహాలు చేసుకున్నారు
  చలం రాజేశ్వరి ని మనం ఆమోదించలేదు (దీనిపై నేను వాదన చేయదల్చుకోలేదు కూడా ) అలాంటిది కలాపిని మెచ్చుకోగలమా!? ఒక మనిషి లో ఉన్న ఉదాత్త గుణం కి విలువ కల్గేది, కల్గించేది కూడా నైతిక ప్రవర్తనే! (అది సాహిత్యం అయినా నిజ జీవితం లో నయినా.) వేశ్యా వృత్తి లో జీవించే స్త్రీ కూడా మానవత్వంతో ఇతరులకి సాయం చేయగలదు అందమైన కలాపి మాత్రమే కాదు అనిపించింది

  ఈ లోకంలో అందం,డబ్బు ఏవి శాశ్వతం కాదు ఏమి ఆశించని స్నేహం మాత్రమే గొప్పదని “నరేన్ ” గురించి చెప్పడం మాత్రం బాగా నచ్చింది

  ఉమా మహేశ్వర రావు గారు రచయిత్రి చెప్పలేని, చెప్పటానికి కూడా ప్రయత్నించని “కలాపి ” అంత రంగాన్ని మీరు బాగా ఒడిసి పట్టుకుని ఆ పాత్ర పై ఉన్న నెగిటివ్ దోరణి ని తగ్గించే ప్రయత్నం చేసారు. చాలా బావుంది . ధన్యవాదములు

  • సోకాల్డ్ నైతికత కారణంగా కళాపి పాత్ర నచ్చకపోవడం పర్సనల్ ఛాయ్స్. అందులో పేచీ ఏదీ లేదు.

   కళాపి పాత్ర మూస నైతికతను కాదనుకున్న పాత్ర. తనజీవితాన్ని తనకులాగా మలుచుకున్న పాత్ర, ఒక ఆల్టర్నేటివ్ నైతికతను నిర్మించుకున్న పాత్ర. తన జీవన విధానం ఒక అన్వేషణ, శోధన. ఎనిమిది పెళ్ళిళ్ళూ ప్రయోగాలు. తనమీద తను చేసుకున్న, అనుభవించిన ప్రయోగాలు. అందుకే ప్రతి పెళ్ళికీ ఒక కొత్త శోభని సంతరించుకుంది. జీవితానికి అన్ని రంగులు పులుముకుంది. ఇలాంటి వ్యక్తులూ సాహిత్యంలో పాత్రలు కాగలరు. మరీ ముఖ్యంగా ప్రధానపాత్రలు కాగలరు, అనే ధైర్యం మన్నం సింధు మాధురిది. రాజేశ్వరి అయినా కళాపి అయినా మన అంగీకారం కోసం ఎదురుచూడరు. వాళ్ల జీవితాల్ని వాళ్ళు జీవిస్తారు. కొత్తగా జీవిస్తారు. మరింత విశాలంగా జీవిస్తారు.

   • k.sreedevy says:

    మహేష్ కలాపి 8పెళ్ళిళ్ళు ప్రయోగం కోసం చేసుకుందని మిరంTuన్నారు. ఆమెను మోహించిన magamaharajula కోరిక కోసమే పెళ్ళాడింది. చలం రాజేశ్వరి లాగా ఆమె కూడా ఎవరికోసం జివిన్చలేదనడం సబబు.

 • ns murty says:

  ఉమామహేశ్వరరావుగారూ, మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది. హృదయపూర్వక అభినందనలు.

  కలాపి నిజజీవితంలోని ఒక వ్యక్తి కథ అని రచయిత్రి చెప్పిన విషయం పక్కనబెట్టి చూస్తే, కలాపి ఒక మెటఫర్ గా నాకు కనిపించింది. బహుశా ఈ కథ నాకు చదవగానే ఆ పాత్రమీద నాకు ఎనలేని అభిమానమూ, గౌరవమూ కలగడానికి అదే కారణం అయి ఉండొచ్చు. కలాపిని ఒక ప్రతీకగా చూడగలిగినపుడు, మనం నిత్య జీవితంలో పదే పదే ఊరించే ఒక వస్తువుని అందుకోవడానికి ప్రయత్నించడం గుర్తుకురావాలి. ఇక్కడ ఒక పురుషుడినుండి మరొక పురుషుడిదగ్గరకి వెళ్ళడం అనైతికం అని అనిపించినపుడు, ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగం, ఒక వాంఛనుండి మరొక వాంఛలోకి వెళ్ళడం మనకు అనైతికంగా కనిపించదెందుకు? వ్యక్తిత్వంలో ఒక పార్శ్వాన్ని అంగీకరించగలిగినపుడు, ఆ వ్యక్తికి రెండో పార్శ్వం మీదా అంత వైయక్తిక స్వేచ్ఛ ఉందని మనం అంగీకరించాలి. ఆమెలాగ మనం మాత్రం అలా ఎండమావుల్ని వెంటాడమా? సిద్ధార్థ నవలలో హెర్మన్ హెస్ చెప్పిన సత్యం కూడా అదే.

  దూరం నుండి చూస్తుంటే, కొండలే కావు, వ్యక్తిత్వాలు కూడా నున్నగా, సుందరంగా కనిపిస్తాయి. దగ్గరగా వచ్చినప్పుడే వాటిలోని మిట్టపల్లాలు బోధపడేది.ఒక అన్వేషిగా (అది శారీరక ప్రేమ కానక్కరలేదు)కలాపి జీవితాన్ని వెదికినపుడు ఆమెకి అదే అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు. ఏమీ సంబంధంలేనట్టు కనిపించినా, ఆమెకి కొండలు ఎక్కడం ఇష్టం అన్న విషయాన్ని రచయిత్రి చాలా తెలివిగా కథలోకి జొప్పించింది. ఈ విషయాన్ని నేను అభినందించకుండా ఉండలేను. అంతసాహసంతో జీవితాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన ఆమె చివరకు జీవితంలో తనువెదికినది ఎక్కడా దొరకలేదని చెప్పినపుడు నాకు ఆమె మీద జాలీ, ఆమె చేసిన సాహసానికి ఆశ్చర్యమూ కలిగేయి. దీనికి నా సమర్థనా లేదు.వ్యతిరేకతా లేదు. ఇది ఒక ప్రేక్షకుడిగా నా స్పందన. అంతే!

  ఎవరి జీవితాన్ని వారు వారికి నచ్చినరీతిలో నడుపుకునే హక్కు ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎవరి జీవిత సత్యాన్ని వాళ్లు కనుక్కోవలసిందే. వాటిమీద మనం ఏ రకమైన ముద్రలూ వెయ్యలేం. వాళ్లు చెప్పిన తమ అనుభవాన్ని ఆమోదించడం తప్ప. ఇక్కడ తప్పొప్పులని నిర్ణయించగల అవకాశంగాని, అధికారం గాని మనకి లేదు. అలా చేస్తే, నామట్టుకు నాకు మనం వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించనట్లనిపిస్తుంది. అసలు మహత్తరమైన జీవనయానం ప్రారంభం అయేదీ, కొనసాగేదీ కూడా ఇలాగే. ఎంతమంది మేధావులు ఎన్ని రకాలుగా జీవితాన్నీ, దాని నిరర్థకతనీ నిర్వచించడానికి ప్రయత్నించినా, యవ్వనంలో ఉన్నప్పుడు మనకు రుచించకపోడానికీ, మనజీవితానికి అర్థం ఉందేమో నన్న ఆశతో కృషిచెయ్యడానికీ, బహుశా జీవితచరమాంకంలో వాళ్లలాగే జీవితానికి మన వ్యక్తిగత సంస్కారాలబట్టి ఒక నిర్ణయానికి ప్రకటించడానికీ మనకున్న ఈ జీవితకాంక్షే కారణం అని నా అభిప్రాయం.

  నా దృష్టిలో కలాపి తెలుగుసాహిత్యంలో ఒక అపురూపమైన స్త్రీ పాత్ర.

 • thrinad says:

  ఉమా మహేస్వర రావు గార్కి నమస్కారములు

  మీరు పరిచయం చేసిన కలపి కధ చాలా బాగుంది మాధురి గారు చాలా ధైర్యంగా వ్రాసిన కలపి ని మీరు అంటే గట్స్ తో విశ్లేషణ చేశారు నిజంగా రచయిత ఎంతో గట్స్ తో ఈ కళాపి ని వ్రాశారు ఈ రోజుల్లో 8 పెళ్ళిళ్ళు చేసుకున్న ఆమె గురుంచి అంత బాగా మనసు లోతుల్లోకి వెళ్ళి మరీ వ్రాశారు బహుశా కళాపి ని మాధురి గారు చాలా దగ్గరనుండి చూసి ఉంటారు
  కధ ఎంత బాగుందో మీ విశ్లేషణ అంతకన్నా ఎక్కువుగా బాగుంది ఈ కధాని పరిచయం చేసిన మీకు న్నా అభినందనలు రచయిత మాధురి గార్కి కూడా నా శుభాకాంక్ష్లులు నమస్తే

 • gsrammohan says:

  ఉమా కథ ఆత్మ పట్టుకున్నాడు. రచయిత అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ఇటీవలి కాలంలో కథలకు కొత్త జీవితాన్ని కొ త్త అనుభవాలను అద్దుతున్న రచయిత సింధుమాధురి. విస్తృతమైన జీవితానుభవం, గాఢమైన పరిశీలన ఉన్న రచయిత అని అర్థమవుతుంది. పాఠకులు పాత్రను ఇష్టపడి నా పడకపోయినా కథవెంట నడిపించుకుంటూ తీసుకెళ్లగలిగిన కథన చాతుర్యం పుష్కలంగా కనిపిస్తుంది. అసలు కలాపి వర్ణనే మనల్ని మాయలో పడేస్తుంది. పాలు పసుపు కలగలిసిన రంగు అంటూ మనది కాని తెల్లతోలును ఆబగా వర్ణించే ధోరణులతో విసిగిపోయిన మనబోంట్లకు ఎంత ఊరట! స్మితాపాటిల్‌, నీనాగుప్త రచయిత గుర్తు చేయకపో యినా గుర్తుకొస్తారు. దళిత సాహిత్యం ఈ విషయంలో చేసిన ప్రయోగాలకు ఇంకాస్త చిక్కదనం వేరే రూపంలో జోడించారు.
  నల్ల ఒండ్రు, గాడి ద రక్తం తాగి పరిగెత్తే దొంగలు(అలనాటి స్టువర్ట్‌ పురం!), కళ్ల లో రేడియం కాంతి-జెర్రిపోతు వేగం, చెంద్ర చెక్క పచ్చ టిబండ గట్టితనం…ఎంతో వైవిధ్యమై న జీవితానుభవముంటే తప్ప సాధ్యం కాని వ్యక్తీకరణలవి. చీమలు చుట్టి కుట్టిన సర్పం లాగా నవ్వడం లాంటి సర్రియలిస్టిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ రచయితకు వివిధ సాహిత్యాలతో ఉన్న పరిచయాన్ని పట్టిస్తాయి. ఓషో, రమణమహర్షి, జెకె ల నుంచి తనకు కావాల్సిన రంగుల్ని తీసుకుని చేసిన పేస్ట్‌ వాసన కథ టోన్‌లోం చి మార్మికంగా మనలోకి వ్యాపిస్తూ ఉంటుంది.

 • లలిత says:

  తుంగభద్రానది అంచుల్లో ఎత్తయినకొండల్లో దూకేజలపాతంలా పరిచయమయిన ఈ ‘కలాపి ‘ ని ఒకసారి పరికించి చూస్తే ఇక జన్మలో మర్చిపోలేం . మంచి కథ

  కథను గురించి మూర్తి గారి అభిప్రాయం కూడా చాలా నచ్చింది.

 • k.sreedevy says:

  ప్రేమ పిపాసి కలాపి ప్రేమ తత్వాన్ని ఆవిష్కరించిన అనడంకంటే, దర్శించిన సిన్దుమాదురికి అభినందనలు.

Leave a Reply to ns murty Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)