అలా మొదలయింది…

chitten rajuఅప్పుడెప్పుడో. మూడు, నాలుగేళ్ళ క్రితం పట్టక, పట్టక నిద్ర పట్టినప్పుడు నాకు ఓ కల వచ్చింది. అప్పుడప్పుడు కలలు రావడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ…ఫ్రాయడ్ అనే జర్మన్ మహానుభావుడి సిధ్ధాంతం ప్రకారం ఒకే కల పదే, పదే రావడం చాలా జాగ్రత్తగా గమనించదగ్గదే. కొండొకచో భయపడ దగ్గదే.

ఎందుకో తెలియదు కానీ, పూర్వం రోజులలో లాగా  దేవుడు కలలో కనపడి “ఫలానా చోట అమ్మాయి నీ కోసం పూజలు చేస్తోందీ, వెళ్ళి వరించూ”, లేదా “నా మీద ఒక కావ్యం రాసి నాకు అంకితం ఇయ్యి”, లేదా “ఫలానా వ్రతం చేసుకుంటే నీకు మగ పిల్లాడు పుడతాడు” మొదలైన కలల గురించిన కథలు ఈ మధ్య ఎక్కడా వినడం లేదు. ఆ దేవ దేవలతలకి కూడా ఈ నాటి తెలుగు వారి కలలలోకి వెళ్ళడానికి విసుగొచ్చిందేమో అని నా అనుమానం.

నా కేసులో ఈ ఒకే ఒక కల ఎప్పుడూ తెల్లారగట్టే రావడంతో నాకు మరీ బెంగ పట్టుకుంది. దానికి హిందూ సిధ్ధాంతం ప్రకారం రెండు కారణాలు. ఒకటేమో, తెల్లారగట్టే వచ్చే కలలు నిజమౌతాయిట. అంతకంటే అన్యాయం…ఆ కలలో కనక మన జీవితం అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే, ఇంక అంతే సంగతులు…అనగా….మనిషి చచ్చిపోయే ముందు వాడి జీవితం అంతా ఫ్లాష్ బేక్ లో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తెర మీద చూపించినట్టు కనపడితే మనం బాల్చీ తన్నేసే సమయం వచ్చేసిందన మాట. నాకు పదే, పదే వస్తున్న ఆ కలల సారాంశం అదే. నేను కాబట్టి సరిపోయింది కానీ ఈ కలల వ్యవహారానికి మరొకరు ఎవరైనా గుండె ఆగిపోయి టపా కట్టేసే వారు.

నాకు ఇలాంటి కలలూ-వ్యక్తులపై వాటి ప్రభావమూ మొదలైన వాటి మీద ఎక్కువ నమ్మకం లేదు, పైగా నేను చెయ్యవలసిన పనులు చాలానే ఉన్నాయి. కానీ నా జీవితంలో తారసపడిన వ్యక్తులూ, జరిగిన సంఘటనలూ ఆ కలలో కనపడీ కనపడనట్టు నా ఒక్కడికీ కనపడి ఠపీమని మాయమై పోవడం నచ్చ లేదు. అంచేత కోపం వచ్చి, అవన్నీ నేనే రాసి పెట్టుకుంటే, నిద్ర పట్టనప్పుడు చదువుకుని జ్ఞాపకం తెచ్చుకోవచ్చును కదా అనే ఆలోచన వచ్చింది. మన జీవితం గురించి మనమే రాసి పారేసుకుంటే దాన్ని ఆత్మ కథ అంటారుగా, ఇంతోటి నా ఆత్మ కథ నాకు తెలిసిన ఇంకెవరికైనా కావాలా అనే ప్రశ్న నాకు నేనే వేసుకున్నాను. ఇంకెవరికీ అక్కర లేక పోయినా, నాకే అది కావాలి కదా….అసలు జీవితంలో ఏం పొడిచేశాం అని బేరీజు వేసుకోవడంలో తప్పు లేదు కదా అని కూడా అనుకున్నాను.

తీరా “ఆత్మ కథ” రాసుకుందాం అనే ఆలోచన రాగానే “ఏ ఆత్మ కథా?” అనే ప్రశ్న ముందుకొచ్చింది.

ఎందుకంటే మొదటిదేమో నేనూ అందరిలాగానే నా ప్రమేయం ఏమీ లేకుండానే పుట్టాను, పెరిగాను, పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని, బుద్ధిగా సంసారం చేసుకుంటున్నాను ఎట్సెటరా. మనలో 99 శాతం ఇలాంటి బాపతే. ఎందుకు పుడతారో తెలియదు. పోయాక ఎక్కడికి పోతారో అంతకంటే తెలియదు.

ఇక రెండోదేమో అందరిలో కొందరిలా నేను కూడా కాస్తో, కూస్తో చదువుకున్నాను, ముందు ఉద్యోగమూ, తరువాత వ్యాపారమూ చేసి, కాస్తో, కూస్తో డబ్బు సంపాదించి, అందరిలో కొందరిలో కొందరిలా కాకుండా ఆ డబ్బు నిలబెట్టుకోలేక పోయాను. అలా లాభసాటి వ్యాపారం చేసినా డబ్బు నిలబెట్టుకోలేకపోవడాన్ని “బేపన వ్యాపారం” అంటారుట. దానికి నేనే ఉదాహరణ. ఇక్కడో ఒక జోకు గుర్తుకొస్తోంది. ఎవరో మరొకర్ని “బ్రామ్మడి చేత ఒక మిలియన్ డాలర్ల వ్యాపారం ఎలా చేయించాలీ?” అని అడిగాడుట. “దానికేముందీ, వాడి చేతిలో బాగా నడుస్తున్న పది మిలియన్ల వ్యాపారం పెట్టి నడిపించమంటే నెల తిరక్కుండా దాన్ని ఒక మిలియన్ చేసేస్తాడు” అని చమత్కారం.

మరి మూడో ఆత్మకథేమో…అందరిలో కొందరిలో మరి కొద్ది మందే ఉండే తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టాను, కథలు వ్రాశాను, రాయించాను. వాటిని కథలు అనకూడదనే వాదనలూ విన్నాను. నాటకాలాడాను. ఆడించాను. అయినా రిటైర్ అయిపోకుండా నా సొంత సుత్తితో చాలా మందిని చావగొడుతున్నాను.

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

ఇక, నేను బొంబాయి ఇండియన్ ఇన్సిస్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ  (IIT, Bombay) లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారి ప్రభావంతో ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త ఇ. ఎఫ్. షుమాకర్ గారి “Small is Beautiful” పుస్తకంలో ప్రతిపాదించిన సిధ్ధాంతాలకి అనుగుణంగా కొందరితో కలిసి సంస్థాపించిన “Appropriate Technology Unit” ద్వారా మహారాష్ట్ర లో గ్రామ సమాజ సేవా కార్యక్రమాలతో మొదలు పెట్టి ఈ నాటి వరకూ కాస్తో, కూస్తో సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తున్నాను. బొంబాయిలో ఆ నాటి నా శిష్యులలో ఈ నాటి ప్రముఖులు కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్, InfOsys వారి నందన్ నిలేకానీ, మరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. ఇలాంటి వ్యాపకం మీద మాత్రమే వ్రాస్తే అది నా “నాలుగో ఆత్మ కథ” కిందకి వస్తుంది కదా!

ఇలా అనేక రకాల “ఆత్మ ఘోషలు” నాకు ఉన్నప్పుడు, దేని గురించి వ్రాయాలీ? ఆ ప్రశ్నకి సరి అయిన సమాధానం లేక, గొప్పవాళ్ళలా పెద్ద, పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా నాకు తోచిన అంశాల మీదా, వ్యక్తుల మీదా, సంఘటనల మీదా తోచినది తోచినట్టు వ్రాసుకుందామని అనుకుంటున్నాను. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను ఏనాడూ, ఎప్పుడూ డైరీ రాయలేదు. రోజూ డైరీ వ్రాసుకున్న వాళ్ళే ఆత్మ కథ వ్రాసుకోవాలి అనే రూలూ లేదు. అందుచేత తారీకులూ, పేర్లూ, సంఘటనలూ కేవలం నా బుర్రలో ఉన్న మట్టి పదార్ధం లో అట్టడుగున జ్ఞాపకాల దొంతర్లలో ఎక్కడో దాక్కున్న వాటిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని వ్రాస్తున్నవే కానీ…చరిత్రలో నిక్షేపించే సత్తువ లేనివే!

ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇవి కేవలం నా జ్ఞాపకాలే! నా కోసం నేను వ్రాసుకున్నవే అని స్పష్టంగానే విన్నవిస్తున్నాను. ఆ మాట కొస్తే “అశోకుడు బాటకిరుపక్కలా వృక్షములు నాటించెను” అనేది ఎవరు చూశారు? దాన్ని ఎంత నమ్ముతున్నామో, నా జ్ఞాపక శక్తిని  కూడా అంతే నమ్ముకుంటాను.

చెప్పొద్దూ, నా జీవితంలో మొట్టమొదటి పరీక్ష నేను బాగానే పాస్ అయ్యాను. అంటే, బతికి బయట పడ్డాను అనమాట. ఇదెందుకు చెప్పవలసి వస్తోందంటే, నేను పుట్టినప్పుడు కవల పిల్లలంట. పుట్టగానే కుయ్, కయ్ అనడం కానీ, కాళ్ళూ, చేతులూ తప తపా కొట్టుకోవడం కానీ మా ఇద్ద్దరు నలుసులకీ లేక పోవడంతో మా అమ్మకి మొత్తం పదకొండు పురుళ్ళు పోసిన ఎరకల సత్తెమ్మ మమ్మల్ని బతికించడానికి తనకి తోచిన పధ్ధతులు..అనగా..లాగి లెంపకాయ కొట్టడం, నోట్లో వస పొయ్యడం లాంటి చిట్కాలు ప్రయోగించింది. దాంతో నేను కేరు, కేరు మని ఏడ్చి రాగాలు పెట్టి అందరినీ సంతోషపెట్టినా, నా తోటి వాడు చేతులెత్తేసి దేవుడి దగ్గరకి పారిపోయాడు. “వాడు కూడా బతికి ఉంటే, మా జంట ధాటీకి తట్టుకోలేక ఈ లోకం ఏమైపోవునో కదా!” అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

నేను కాకినాడలో బతికి బయట పడ్డాను అని తెలియగానే అదే రోజు అక్కడ జర్మనీలో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. మరొక ఆరు నెలలలో జపాన్ లో ఆటంబాంబు పేలింది. రెండో ప్రపంచ యుధ్దం ఆగిపోయింది. ఆ ఏడే రేడియో అన్నయ్య, అక్కయ్య, “చిన్న పిల్లల కోసం ఇద్దరు పెద్దలు” అనుకుంటూ “బాల” పత్రిక మద్రాసులో మొదలుపెట్టారు…ఆ “బాల” పత్రికలోనే ఆ యేడే ముళ్ళపూడి గారి మొదటి రచనా, బాపు గారి మొదటి బొమ్మా ప్రచురించబడ్డాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు తెలుగు జాతి అంతటికీ. అప్పుడే పుట్టిన నా మీద కూడా ఆ దేవతల ఆశీర్వచనం పువ్వులు ఒకటో, రెండో, కొన్ని అక్షింతలూ పడే ఉంటాయి. లేక పోతే ఇవాళ ఈ వ్యాసం వ్రాయగలిగే అదృష్టానికి నోచుకోగలుదునా.?

ఆ నెలలోనే అంతకు వందల సంవత్సరాల ముందు ఇంగ్లండ్ లో షేక్స్ పియర్ అనే ఆయన పుట్టాడు. నేను పుట్టిన పాతికేళ్ళకి, అదే తారీకున  జెర్రీ సైన్ ఫెల్డ్ అనే అమెరికన్ కమేడియన్ పుట్టాడు. ఇవన్నీ కాస్సేపు గూగుల్ చేసి చదువుకుంటే మంచి ఫీలింగే వచ్చింది. కానీ, సరిగ్గా నేను పుట్టిన నాడే, ఆంటే అదే ఏడూ, అదే తారీకున ఏ ఒక్క తలమాసిన గొప్పవాడూ పుట్ట లేదు….నేనొక్కడినే ఆ “దడిగాడు వానసిరా”. “Your birth may be common, but, death will be history” అనే నానుడి నాకు భలే ఇష్టం.

మా అమ్మ పుట్టిల్లు కాకినాడ-రాజమండ్రిల దగ్గర ఉన్న పాలతోడు గ్రామం అయినా పక్కనే ఉన్న జేగురు పాడు లో మేనమామల ఇంట పుట్టింది. ఇరవై, ముఫై ఏళ్ళ క్రితం అక్కడ గోదావరి బేసిన్ లో “గాస్” ఉన్నట్టు ప్రభుత్వం వారు కనుక్కుని, ఆ తరువాత ప్రెవేటు కంపెనీ వారు రసాయనం ఫేక్టరీలు పెట్టే దాకా ఆ ఊరి పేరు ఎవరికీ తెలీదు. నా చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రం ఆ ఊరు వెళ్ళిన గుర్తు.

కానీ పదేళ్ళ క్రితం పని కట్టుకుని నేనూ, మా పెద్దన్నయ్యా, మూడో అన్నయ్యా,  చెల్లెళ్ళూ కాకినాడ నుంచి ప్రత్యేకంగా నాకు వరసకి మేనల్లుడు అయ్యే అద్దంకి సుబ్బారావు కుదిర్చిన టాటా సుమో లో జేగురు పాడు వెళ్ళాను. వెళ్ళి అనేక కారణాలకి ఆశ్చర్య పోయాను, ఆనందపడ్డాను. ఊళ్ళోకి అడుగుపెట్టగానే, ఎక్కడ చూసినా “గ్రీన్ విలేజ్” “పర్యావరణాన్ని కాపాడండి”. Save Earth” లాంటి బోర్డుల తో అమెరికాని మించి పోయిన అవగాహన, ఆచరణ నాకు ఆ చిన్న పల్లెటూరులో కనిపించాయి. మొత్తం గ్రామం చుట్టుపక్కల అంతా పచ్చటి పొలాలతో సస్యశ్యామలంగా ఉంది. ఉన్న పది రోడ్లూ చాలా చిన్నవి అయినా పూర్తిగా సిమెంట్ రోడ్లతో, అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడ మా అమ్మ పుట్టింటికి వెళ్ళే రోడ్డు మీద మేము వెళ్ళిన కారు పట్టక, ఎక్కడో పార్క్ చేసుకుని నడిచి వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వరసకి చిన్నాన్న అయే చంటి నాన్న, భార్య, కూతురు ఎంతో ఆప్యాయంగా ఆ మండువా ఇంట్లోకి ఆహ్వానించారు.

ఇంటి ముందు రెండు అరుగులూ, గుమ్మం దాటగానే చెట్ల మధ్యన మండువా…అమెరికాలో దాన్ని పెద్ద ఫేషనబుల్ గా Atrium అంటారు…వెనకాల వేపు ఒక వరండా, రెండు గదులు, పక్కనే వంటిల్లు, వెనక గుమ్మంలోంచి మా అమ్మ ఇతర బంధువులైన భాస్కర మూర్తి గారి ఇల్లు….నేను ఐదారేళ్ళప్పుడు చూసిన, ఆడుకున్న ఆ దృశ్యాలన్నీ మళ్ళీ కళ్ళకి కట్టినట్టు కనపడ్డాయి. మా చంటి నాన్న వెనకాల ఒక గదిలోకి అందరినీ తీసుకెళ్ళిన నాతో “ఒరే, అమెరికాయ్. ఇదుగో ఈ గదిలోనే మీ అమ్మ పుట్టింది” అని ఒక గదీ, అందులో ఒక నులక మంచం చూపించాడు. నేను అవాక్కయిపోయాను. అసలు ఇటువంటి సంఘటన నేను ఊహించనే లేదు.

ఎందుకంటే, ఆ గది, బహుశా ఆ మంచమూ మా అమ్మ పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండి ఉంటాయి. మా అమ్మ అక్టోబర్ 8, 1916 రోజున ఆ గదిలో పుట్టింది. అంటే నేను ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ మార్చ్  27, 2013 రోజుకి 97 సంవత్సరాలు అయింది. మా అమ్మ ఏప్రిల్, 1999 లో పోయింది. …అవును…నేను పుట్టిన రోజు నాడే..ఏప్రిల్ నెలలోనే…ఎనభై మూడేళ్ళ వయసులో. అప్పుడు నేను  అమెరికాలో “మహద్భాగ్యం” అనుభవిస్తున్న కారణాన్న పదో రోజుకి కానీ వెళ్ళ లేక పోయాను. కనీసం అటువంటి సమయాలలో దానిని “అమెరికాలో దౌర్భాగ్యం” అనుభవిస్తున్నాను అని అనుకోవాలి.

1916 లో మా అమ్మ పుట్టిన ఆ చిన్న గదిని చూసి నేను అదోలా అయిపోతుంటే….మా చంటి నాన్న…”ఒరేయ్ రాజా…మొన్న దేనికోసమో అటకలో వెతుకుతూ ఉంటే ., ఇదిగో ఈ కాగితాలు కనపడ్దాయి. ఇవి మీ తాత గారి చేతి వ్రాతలో ఉన్న “శ్రీ రామలింగేశ్వర శతకం” వ్రాత ప్రతి. మొత్తం 15 పేజీలు, 108 పద్యాలూ. ఇక్కడే ఇండియాలో ఉంటే చెదలు పట్టేస్తాయి. అమెరికా తీసుకుపో” అని ఆ కాగితాలు నా చేతిలో పెట్టాడు. అవి ముట్టుకుంటే నుసి, నుసిగా అయిపోతున్నాయి. ఎందుకంటే మా తాత గారు అవి వ్రాసిన సంవత్సరం సుమారు 1904 .అంటే ఇప్పటికి నూట తొమ్మిది సంవత్సరాల క్రితం. ఆ శతకంలో మొదటి పేజీ ఇందుతో జతపరుస్తున్నాను. తమ పూర్వీకుల సాహిత్య కృషిని పదిల పరుచుకునే అవకాశమూ, అభిలాషా, దేవుడి అనుగ్రహమూ ఎంత మందికి కలుగుతుందో కదా! ఆ అదృష్టం ఉన్నవారిని ఆ అపురూప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నా విన్నపం. మన సంస్కృతిని కాపాడుకోవడం అంటే అదే!

vanguri3 (2)

ఈ పై సంఘటన నిజంగానే….Deja Vu All over agian.”. ఎందుకంటే మా అమ్మ చనిపోవడానికి ఐదారేళ్ళ ముందు నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఇంచుమించు సరిగ్గా అవే మాటలు..అంటే “ఒరేయ్ ఇవి ఇండియాలో ఉంటే చెదలు పట్టిపోతాయి. నువ్వు అమెరికా పట్టికెళ్ళి దాచుకో. మన వంశంలో నా పుట్టింటివారైన నండూరి వారి వేపూ, వంగూరి వారైన అత్తారింటి వేపూ ఎన్ని తరాలు చూసినా మొదట మా నాన్న గారు..అంటే మీ తాత గారికీ, ఆ తరువాత నీకూ మాత్రమే రచనా వ్యాసంగం అబ్బింది.” అంటూ కొన్ని అచ్చు పుస్తకాలూ, కొన్ని వ్రాత ప్రతులూ నా చేతిలో పెట్టింది. మా అమ్మమ్మ పేరు బాపనమ్మ. వారికి మా అమ్మ ఒక్కర్తే సంతానం. అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఎవరూ లేరు. మా అమ్మ పేరు సర్వలక్ష్మి. కానీ పుట్టింట్లో అందరూ ’సరప్ప” అనే పిలిచేవారు. ఇప్పుడు మాకు మా అమ్మ వేపు మరీ దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. చంటి నాన్న లాంటి ఉన్న అతికొద్ది మందికీ ఇప్పటికీ నేను సరప్ప కొడుకునే!

క్లుప్తంగా చెప్పాలంటే, మా తాత గారైన నండూరి మూర్తి రాజు గారు కాకినాడ పి.ఆర్. కాలేజీలోనూ, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుంచి 1904 లో బి.యే. పట్టాతీసుకున్నారు. అప్పటి చెన్న పట్నం రాజధానిగా ఉన్న మొత్తం దక్షిణాది రాష్టానికి తెలుగులో ఆయనకి స్వర్ణపతకం లభించింది. తరువాత న్యాయవాదిగా చదువుకుందామనుకున్నా, అయన తండ్రిగారైన సోమరాజు గారు అది “అన్యాయ వ్యాపార వృత్తి” అని అభ్యంతర పెట్టగా నెలకి రెండు రూకల స్వల్ప జీతానికి కాకినాడ  రెవెన్యూ శాఖలో ఉద్యోగానికి కుదురుకున్నారు. తెలుగు భాషాభిమాని, గ్రాంధిక వాది కావడంతో తీరిక సమయంలో శుక్తి మతి, జపాను దేశ చరిత్ర మొదలైన గ్రంధాలు తొలి దశలో రచించారు. వివేకానందుడి ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి గవర్నర్ గరి చేత ఐదు కాసుల బంగారం బహుమానం పొందారు. ఆర్య మత బోధిని, వివేకోదయము మొదలైన పత్రికలలో వ్యాస పరంపర, అనీబిసెంటమ్మ ఇంగ్లీషులో వ్రాసిన రామాయణం ఆంధ్రీకరణ , షేక్స్ పియర్ హేమ్లెట్ నాటకం తెలుగు అనువాదం, 28 పాత్రలతో సావిత్రీ సత్యవంతం నాటకం, 16 పాత్రలతో విమలాప్రభాకరం అనే సాంఘిక నాటకం, వనజాక్షి అనే శృంగార ప్రబంధం, అమల వర్మ ఆనే నవల మొదలైన గ్రంధాలు ఆయన సుమారు పదేళ్ళలో రచించారు. వాటిల్ల్లో కొన్ని ఆయన మరణించిన తరువాత ముద్రించబడ్డాయి. ఆయన పుస్తకాలు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని గ్రంధాలయాల్లో ఇప్పటికీ కనపడతాయి. ఆయన చేతివ్రాతలో ఉన్న రెండు వందల పేజీలూ, ఐదు ముద్రించబడిన పుస్తకాలూ ఇప్పుడు నా దగ్గర హ్యూస్టన్ లో ఉన్నాయి. అందులో నా దగ్గర శిధిలావస్థలో ఉన్న “విమలాప్రభాకరం” నాటకం ముఖపత్రం ఇందుతో జతపరుస్తున్నాను. ఆయన రచనలన్నీ గ్రాంధికాలే!

విమలా ప్రభాకరము

విమలా ప్రభాకరము

మా అమ్మ పుట్టిన తరువాత ఆయనకి ఒక మగపిల్లవాడు ఎంతో ఆరోగ్యంగానే పుట్టాడు. ఆ సమయంలో మా తాత గారికి మన్యం ప్రాంతాలకి బదిలీ అయింది. అక్కడ ఉన్నది నాలుగు నెలలే అయినా ఆయనకీ అక్కడ విషజ్వరం సోకి మళ్ళీ కాకినాడ వచ్చెయ్యగానే ఆరోగ్యవంతుడూ, దృఢకాయుడూ అయిన మూడేళ్ళ కొడుకు హఠాత్తుగా చనిపోయాడు. అది జరిగిన ఇరవై రోజులకి మా తాత గారు జేగురు పాడులో, 1920 లో అకాల మరణం పొందారు. అప్పుడు మా అమ్మ వయసు నాలుగేళ్ళు మాత్రమే. అందు చేత ఆయన ఎలా ఉంటారో మా అమ్మకి గుర్తు లేదు.

మా తాత గారు పోయినప్పటినుంచి మా అమ్మమ్మ మాతోనే ఉండి 1970 దశకంలో నేను బొంబాయిలో ఉండేటప్పుడు మరణించింది. మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు, ఇంకా మా ఇంట్లోనే పెరిగిన యాభైకు  పైగా పిల్లలందరికీ ఆవిడే అమ్మమ్మ. మా మూర్తి రాజు తాత గారిది ఒకే ఒక్క ఫొటో మాత్రం మా ఇంట్లో ఉండేది. అది కూడా నిజానికి ఫొటో కాదు. తాశీల్దారు గా ఆయన పెయింటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టిన porttrait కి తీయించిన ఫొటో. దానిని ఇందుతో జతపరుస్తున్నాను. మా వంశంలో ఇంకెవరికీ లేని, రాని రచనావ్యాసంగం అబ్బిన ఆయనకీ  నాకూ భౌతికంగా పోలికలు నిజంగా ఆశ్చర్యకరమే!

మరొక యాదృచ్చికమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…..మా నాన్న గారి పేరు రామలింగేశ్వర శర్మ గారు. మా తాత గారు “శ్రీ రామలింగేశ్వర శతకం” రచింఛేటప్పటికి మా నాన్న గారు పుట్ట లేదు. కానీ కాకినాడలో మా అమ్మగారి నండూరి వారికుటుంబం, మా వంగూరి కుటుంబమూ దేవాలయం వీధిలో ఉండేవారు. ఆ విధంగా ఆ రెండు కుటుంబాలకీ స్వల్ప పరిచయం.

మా అమ్మ నాలుగో తరగతి వరకూ చదువుకుంది. తెలుగు పుస్తకాలు చదవడం, ఉత్తరాలు వ్రాయడం వచ్చును. మా అమ్మమ్మకి సంతకం పెట్టడం వచ్చును. ఇదీ మా తాత గారి దగ్గరనుంచి నాకు కాస్తో, కూస్తో వచ్చిన ఆస్తి “సాహిత్య జెన్యు సంక్రమణం”.

Download PDF

11 Comments

  • RammohanRao thummuri says:

    చదువరికి ఆసక్తిని కలిగించే మీ రచనా సరళికి జోహార్లు.రాసేప్పుడు మీరు చూసే దృశ్యాలు మాకూ కన్పిస్తున్నాయి లీలగా.

  • చిట్టెన్ రాజు గారూ,

    మీ కలలేమో గానీ మీ జ్ఞాపకాలు చాలా అందంగా ఉన్నాయి! మీరు పుట్టిన ఇల్లు, మీ అమ్మగారు పుట్టినగదీ కూడా మీరు చూడగల్గడం అద్భుతంగా తోస్తోంది. మీ తాతగారి చేతి రాత ప్రతులు మీకు దక్కడం, మీ ద్వారా వాటిని మేము చూడ్డం కూడా!

    ఇలాంటి విశేషాలు మీ దగ్గర ఎన్ని దాగున్నాయో అన్నీ వార వారం చెప్పేద్దురూ!

    అన్నట్లు మిలియన్ డాలర్ల వ్యాపారం ముచ్చట నిజమే! అలా వ్యాపారాలు పెట్టి లక్షాధికారులైన కోటీశ్వరులని చూశాను నేను :-)

    • మీ స్పందనకి నా ధన్యవాదాలు. తమాషా ఏమిటంటే….నేనూ, మరొక నలభై, యాభై మంది మా అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ, బంధువుల పిల్లలూ కాకినాడలో పుట్టిన గది…ఇప్పుడు లేదు. మేము పుట్టి పెరిగిన ఆ ఇల్లు పాతబడిపోయింది అని పదేళ్ళ క్రితం పడగొట్టేశాం. కానీ, మా అమ్మ పుట్టిన గది ఆలాగే ఉంది మరి!

  • చిట్టెన్ రాజు గారూ

    నేను చరిత్ర అన్నా, ఆత్మకథలన్నా చెవి కొసుకొంటాను..ఇక్కడ కన్నులు పొడుచుకొంటాను అనాలేమో?:-) టైం మిషీన్లో కూచోబెట్టి తిప్పినట్లు ఉంది. మిగతా భాగాలకై ఎదురుచూపులతో…

  • మీ తాతగారి చేవ్రాత నన్నూ పాతజ్ఞాపకాల్లోకి నెట్టేసిందండి. రాజమండ్రిలో అమ్మావాళ్ల పాత ఇంట్లో మా తాతగారి స్వస్తూరీలో ఉన్న పద్యాలూ, ఉత్తరాలూ చూడటం గుర్తుకు వచ్చింది. అచ్చం ఇలాంటి దస్తూరీనే తాతగారిది కూడా. మా తాతగారు రాజమండ్రిలో లాయరు చేసారు. ఆయన మద్రాసులో “లా” చదువుకునేప్పుడు అడివి బాపిరాజుగారూ, ఆయన రూంమేట్స్ ట. మీ జ్ఞాపకాల ద్వారా మా తాతగారి కబుర్లు కూడా మరోసారి గుర్తుచేసుకున్నాను.. ధన్యవాదాలు.

  • మీ తాత గారు జ్ఞాపకం వచ్చారంటే….ధన్యుణ్ణి….

  • మీరు నిజంగా ధన్యులు. ఎంతమందికి పూర్వీకుల జ్ఞాపకాలు భద్రపరచుకునే అవకాశం ఉంటుంది చెప్పండి? నాకైతే మా తాత ఎలా ఉంటాడో కూడా తెలీదు. అసలేం చేసేవాడో ఎప్పుడూ ఎవర్నీ అడగలేదు. ఇది చదివాక బతికే ఉన్న మా అమ్మమ్మని ఒకసారి అడగాలనిపిస్తుంది.

  • ఔరా..మీరు పుట్టగానే హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడా! రెండవ ప్రంపచ యుద్దం ఆగిపోయిందా!! రెండూ సంతోషించాల్సిన విషయాలే కదా! శ్రీ రామలింగేశ్వర శతకము, శ్రీ విమలాప్రభాకరము రెండింటిని సంస్కరించి ప్రచురించండి..మీ జ్ఞాపకాలతో పాటు.

    “అమెరికాలో “మహద్భాగ్యం” అనుభవిస్తున్న కారణాన్న పదో రోజుకి కానీ వెళ్ళ లేక పోయాను. కనీసం అటువంటి సమయాలలో దానిని “అమెరికాలో దౌర్భాగ్యం” అనుభవిస్తున్నాను అని అనుకోవాలి”.

    మీ హస్యం లలితం. మీ ఈ “అత్మకథ” పరంపర ఆగిపోకుండా ..ఇలా నవ్వులు విరజిమ్ముతూ సాగిపోతుండాలని కోరుకుంటున్నాను.

  • ramana baalantrapu says:

    అన్నయ్యా…నమస్తే
    మీ “ఆత్మకథ” తప్పకుండా పుస్తకరూపంలో రావలసిందే!
    మీరు వ్రాసినది చదువుతూ ఉంటే….ఎన్నో…ఎన్నెన్నో జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి.
    మీ
    రమణ బాలాంత్రపు
    యెమెన్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)