వొక నిండైన వాక్యం కోసం…

mandira5afsar

One day the Nouns were clustered in the street,

An adjective walked by, with her dark beauty

The Nouns were struck, moved, changed.

The next day a Verb drove up, and created the Sentence.

 

ప్రసిద్ధ అమెరికన్ కవి కెన్నెత్ కోక్ ఎప్పుడో యాభై మూడేళ్ళ క్రితం రాసుకున్న కవితలో కొంత భాగం  అది. ఈ కవిత ఆసాంతం మొదటి సారి చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది.

ఈ కవిత  చదివిన మర్నాడు – ఈ సెమిస్టర్ నేను చెప్తున్న ‘Modern Indian Poetry and Religions’ క్లాస్ లో వినిపించాను. ఆ క్లాస్ లో వున్న యాభై మంది విద్యార్థులూ  చాలా సేపు హాయిగా నవ్వుకున్నారు. కానీ, ఆ తరవాత ఆ కవితకి వాళ్ళలో కొద్దిమంది చెప్పుకొచ్చిన వ్యాఖ్యానాలు, అన్వయాలూ నా మెదడులో కొత్త పొద్దు పొడుపులు. వాటన్నిటినీ అల్లుకుంటూ పోతే, చివరికి ఆ కవిత నాలో అనేక భావనలతో  నిండిపోయింది.  వొక పాత పద్యమే కొత్త అర్థాల వస్త్రాలతో నా ముందుకొచ్చింది.  అప్పటి నించీ ఈ కవితలోని  ప్రతి వాక్యం నా వెంటే వుండి, నా లోపలే సుడి తిరుగుతూ, కచ్చితంగా ఈ క్షణాన అది నా కోసమే రాసినట్టు అనిపిస్తోంది, అందులోని కొన్ని ఆలోచనలు ఈపాటికే  నా సొంతమయిపోయాయి కనుక.

కవిత్వంలో అయినా, వచనంలో అయినా వొక వాక్యం ఎలా తయారవుతుందన్నది నాకెప్పుడూ ఆశ్చర్యం! వాక్యం తయారవడం అంటే ఆలోచనలు వొద్దికగా కుదురుకోవడం! లోపలి సంవేదనలన్నీ వొక లిపి కోసం జతకూడడం! అన్నిటికీ మించి – నేను ఇతరులతో , ఇతరులు నాతో మాట్లాడుకోవడం! వాక్యంలోని  నామవాచకాలూ, విశేషణాలూ, క్రియల మధ్య ఎలాంటి స్నేహం కుదరాలో నాకూ నా లోపలి నాకూ, నా బయటి లోకానికీ అలాంటి స్నేహమే కుదరాలి. అది కుదరనప్పుడు నేను వాక్యవిహీనమవుతాను. నా బయటి లోకం అర్థవిహీనమవుతుంది.  నాకొక వ్యాకరణం లేకుండా పోతుంది. ఇప్పటిదాకా అర్థమయిన జీవన పాఠం ఏమిటంటే: అసలు వెతుకులాట అంతా ఆ వ్యాకరణం కోసమే! సమాజాలకూ, సమూహాలకు కూడా అలాంటి వ్యాకరణమే కావాలనుకుంటా.

ఇంకా కొద్దిగా విస్తరిస్తే, సాహిత్య  రంగంలోకి వచ్చేసరికి ఈ వ్యాకరణం ఎలా తయారవుతుందంటే : రచయితలు రాస్తారు, ప్రచురణకర్తలు లేదా పత్రికల వాళ్ళు అచ్చు వేస్తారు, పాఠకులు చదువుతారు. మధ్యలో కొందరు ఆ రచనల మీద వ్యాఖ్యానాలు చేస్తారు. వాటి మీద ప్రతివ్యాఖ్యానాలు జరుగుతాయి. ఈలోపు కొన్ని అభిప్రాయాలూ కుప్పపడిపోతాయి. వాటిల్లో సారం కోసం – కొన్ని సార్లు గడ్డివామిలో సూది కూడా కావచ్చేమో!- అందరూ పడీ పడీ వెతుక్కుంటారు. ఈ వెతుకులాటలో కొందరు అవసరానికి మించి మరీ పారంగతులవుతారు, ఇంకా కొందరు వెతుక్కోడమే రాక నిస్సహాయులవుతారు. ఇంకా కొందరు వోటమితో రాజీ పడకుండా దరిచేర్చే వారి సాయం కోసం చూస్తూ వుండిపోతారు.

ఇప్పటి విషాదం ఏమంటే, ఇప్పుడీ వాక్యాల వంతెనలన్నీ కుప్పకూలిపోతున్నాయి.

అనేక రకాల భావ వ్యక్తీకరణ సాధనాలూ, కొత్త కమ్యూనికేషన్ దారులూ తెరుచుకుంటున్న ఈ-కాలంలోనే మన మధ్య ఇంకో విధమయిన అపరిచితత్వం కూడా ఏర్పడుతోంది. కుప్పపడిపోతున్న శబ్దాల మధ్య అర్థవంతమయిన మాటలు లేకుండా పోతున్నాయి. సాహిత్యరంగం కూడా దీనికి భిన్నంగా యేమీ లేదనే చెప్పాలి. అంతర్జాలలోకం వొక మాయాజాలంగా మారుతోంది. అంతర్జాల అక్షరాస్యతా, విజ్నానమూ సృష్టిస్తున్న సమాచారాన్ని ప్రోది చేసినంతగా ఆలోచననీ, వూహాశక్తినీ కూడదీయలేకపోతుందా అన్న సందేహం పుట్టుకువస్తోంది.

ప్రసిద్ద శాస్త్రవేత్త ఐనిస్టీన్ ఎక్కడో అన్నాడట: “Imagination is more important than knowledge. For knowledge is limited to all we now know and understand, while imagination embraces the entire world, and all there ever will be to know and understand.” ఈ-కాలం మనుషులు తమకి తెలిసిన సమాచారమే సర్వస్వం అనుకుంటున్నారు. కానీ, ఆ సమాచారం  వడపోత తరవాతే  తమ దాకా చేరుతుందని కానీ, ఆ సమాచారానికి తమదైన దృక్పథంలోంచి చూడాల్సి వుంటుందని గ్రహించలేకపోతున్నారు. ‘put it in a perspective’ అన్న భావనకి అర్థం లేకుండా పోతోంది.  ఇప్పటి సాహిత్య రూపాలు కూడా ఈ రకమయిన భావదారిద్ర్యంతో బాధపడుతున్నాయని నాకు అనిపిస్తోంది.

మనం అందమయిన ప్రతీకలూ, పదచిత్రాలూ, మాంత్రిక వాస్తవికవాదాలూ, అధివాస్తవిక విపరీత వాదనలూ సమకూర్చుకుంటున్నాం నిజమే, వాటి మధ్య అంతస్సూత్రాన్ని సాధించగలుగుతున్నామా అన్నది నా చింత. మనం కప్పుకుంటున్న వస్త్రాలు అందంగా వున్నాయి కాదనడం లేదు కానీ, ఆ వస్త్రాలలోపల వొక తెలియని డొల్లతనమేదో చప్పుడు చేస్తోంది. అంతా స్పష్టంగా కనిపిస్తున్న మాట కూడా నిజమే కానీ ఆ స్పష్టత కింద అంతుపట్టని అస్పష్టత ఏదో వుంది.

నేను పైన చెప్పిన కెన్నెత్ కోక్ పద్యం మీద జరిగిన చర్చలో నా విద్యార్థిని అయిన వొక అమెరికన్ కవయిత్రి క్లాస్ లో చర్చ మధ్యలో చాలా మంచి మాట అంది –“అసలు ఇప్పుడీ లోకంలో మిక్కీ మౌస్ కంటే  గొప్ప ఊహాశక్తి వున్న ప్రాణి ఇంకోటేదీ కనిపించడం లేదు” అని! అప్పుడు నేను వెంటనే “నిజమే కానీ, దాన్ని సృష్టించింది మనిషే కదా!” అన్నాను. “అదీ నిజమే! కానీ, వొక్కో సారి మనిషి సృష్టించినవే మనిషి కంటే ఎక్కువ వూహాశక్తిని సాధించుకుంటాయి. ఉదాహరణకు: దేవుడు!” అందామె నేను ఆశ్చర్యపోతుండగా! అంటే, ఆమె వివరణ ఏమిటంటే, విపరీతమయిన సమాచార వొత్తిడి వల్ల మన వూహాశక్తి కుంచించుకుపోతున్నదని!

ఆ వెంటనే ఆమె తన ఆలోచనని కెన్నెత్ కోక్ పద్యానికి అన్వయిస్తూ “మన సంభాషణల్లో నిండయిన వాక్యాలు లేవు. మనం మాట్లాడుకుంటున్నవనీ క్రియలూ, విశేషణాలూ, చివరికి వాటి మధ్య సంధి కుదిర్చే locatives లేని సంభాషణ. కాదంటారా?” అంది.

నిజమే. ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్నకి నా దగ్గిర సమాధానం లేదు!

కానీ, వొక్కటి మాత్రం మేం అనుకున్నాం – మన వూహల  దిగంత రేఖ ఇంకాస్త విస్తరించాలని! మనం రాసుకుంటున్న వాక్యానికి ఇంకా కొన్ని వూహల పాఠాలు నేర్పాలని!

 

Download PDF

7 Comments

  • ఈ Kenneth Koch గురించిన రెఫరెన్స్ లేని ఆంగ్ల సాహిత్య పుస్తకం లేదీ మధ్య… ముఖ్యంగా అతని Art of Poetry పుస్తకం చదివిన ఈ తరాల విద్యార్ధులు అదృష్టవంతులే అని చెప్పొచ్చు. మీరు ఉదహరించిన పద్యం కూడా దాదాపు ప్రతీ ఆంగ్ల సాహిత్య అధ్యాపకుడు తన మొదటి పాఠంలో చెప్పితీరాల్సందె…అతని గురించి నాదగ్గరున్న ఓ అమెరికన్ లిటరరీ జర్నల్ లో ఓ వాక్యం “Koch sets out to explore a new landscape that is honest to the act of writing and to the process of the imagination.” మీ నిండైన వాక్యం ఇప్పుడు పరిపూర్ణ వాక్యం అయింది..అభినందనలు.

  • BV Prasad says:

    కెన్నెత్ కోచ్ వాక్యాన్ని ఆధారం గా చేసుకుని మీరు రాసిన నాలుగు మాటలూ నిండుగా అనిపించాయి…నిజమే రోజు రోజుకూ జ్ఞానం పెరిగిందనే భ్రమ లో ఊహ తగ్గుతోంది, ఊహ విశ్వం అనే కాన్వాస్ ఫై అతి పెద్ద ఒక రంగుల ప్రపంచం సరిహద్దులు చెరిపేసే స్వేఛ్చ తో అనూహ్యమైన సంతోషాన్ని కలిగించే మానసిక ప్రతిస్పందనలకు అవకాసం టెక్నోలోజి ఇవ్వడం లేదు టైం మేచినే లో ఎక్కించుకు ఫలాయన వేగం తో మనల్ని తీసుకు పోతుంటే ఇక ఊహ కు తావెక్కడిది చెప్పండి..?

  • ns murty says:

    అఫ్సర్,

    ముందుగా ఒక చక్కని కవిత నేపథ్యంలో మంచివ్యాసం అందిచ్చినందుకు అభినందనలు.
    I wish I had been your స్టూడెంట్.

    To Put things in one’s own perspective అన్నది విద్యార్థులకి చదువుతోపాటు అలవరచవలసిన లక్షణం. UH లో మా ప్రొఫెసరు Natalie Houston మొదటిరోజు క్లాసులో పాఠం ప్రారంభించకమునుపు చెప్పిన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. “మీరింతవరకు ఉపాధ్యాయులు చెప్పినదీ, పుస్తకాలలో చదివినదీ ఏ రకమైన అనుమానం లేకుండా విశ్వసించటానికి అలవాటుపడిపోయారు. అదేకొనసాగించడానికి మీరు ఇక్కడకి రానక్కరలేదు. పరిశోధన విద్యార్థులుగా మీరు ముందు అలవరచుకోవలసిన లక్షణం ప్రతి విషయాన్నీ ప్రశ్నించడం, తర్కించడం, మీ హేతువుకి నిలబడితే అంగీకరించడం లేకపోతే నిర్ద్వంద్వంగా తిరస్కరించడం.”

    విధేయతకే పెద్దపీటవేసి చదువునేర్చుకున్న నేపథ్యంలో, వ్యక్తులనీ,వారి నమ్మకాల్నీ గౌరవిస్తూ, ఎకడెమిక్ విషయాల్లో వారితో విభేదిస్తున్నప్పుడు మనం ఒక ఆరోగ్యకరమైన చర్చ చెయ్యవచ్చు అన్నది ఇంకా చాలామందికి అవగాహనలోకి ఇంకలేదు. మనకి విద్య అంటే ఎలాగోలా మార్కులు తెచ్చుకోవడం తప్ప, Scientic Temperతో విషయాలని చర్చించుకుంటూ, అభిప్రాయాలని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ సాగిపోయే ప్రక్రియ అన్నవిషయం బోధచెయ్యడం లేదు. అభిప్రాయభేదాలు వ్యక్తులతో వైరంగా చూడడం అలవాటైపోయి, కుటుంబాలలోనే ఎన్నో కలతలు తీసుకువస్తున్నాది. సాహిత్యం అనగా ఎంత? దీనిమీద ఇంకా విపులమైన చర్చ జరపాలేమో.

    చాలా ప్రయోజనకరమైన విషయాన్ని లేవనెత్తినందుకు మరొక్కసారి అభినందనలు.

  • దాట్ల దేవదానం రాజు says:

    ఆలోచనలన్నీ ఒకచోట సర్దుకుని లోపల ఊపిరిసలపకుండా తన్నుకుంటున్న భావాలకు ఒక రూపం ఇచ్చి శిల్పంలా వాక్యం తయారవుతుందేమో.అలా అర్థవంతమైన స్నేహం కుదిరితేనే వాక్యంగా మిగులుతుందేమో.ఏమో బాబూ అఫ్సర్-ఒక వ్యాకరణాంశం కూడా సమాజానికి కావాల్సిన తాత్విక భావనగా మార్చేసారు.అంతా ప్రోదిచేసుకునే మీ శక్తివంతమైన విశ్లేషాత్మకమైన ఆలోచనల మహిమ.అభినందనలు

  • RammohanRao thummuri says:

    చాలా రోజుల నుండి తెలుగు పత్రికలు చదువుతుంటే ఏదో అసంతృప్తి .కొత్త విషయాల గురించిన రచనలు అరుదు.ఊహల దిగంత రేఖను విస్తరించాలనే మీ అభిప్రాయానికి అభినందిస్తున్నాను .

  • mercy margaret says:

    మీ వ్యాసం చదవడం , బాగుంది సర్ . మీ తరగతి గదిలో మీ పాఠం వింటున్నట్టు ఉంది . . అదేంటో మీరు రాసే ప్రతి దానిలో నేర్చుకునే విషయాలు లేకుండా ఏవి ఉండవు . ఆలోచనలు ఉదయిస్తుంటాయి .
    — ” కానీ, వొక్కటి మాత్రం మేం అనుకున్నాం – మన వూహల దిగంత రేఖ ఇంకాస్త విస్తరించాలని! మనం రాసుకుంటున్న వాక్యానికి ఇంకా కొన్ని వూహల పాఠాలు నేర్పాలని! ” మీతో పాటు నేను ఏకీభవిస్తూ .. మెర్సీ

  • వ్యాసం చాలా బాగుంది .. నీ క్లాసు నిర్వహణ ఆకర్షనీయం …. అభినందనలు..

Leave a Reply to దాట్ల దేవదానం రాజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)