ఇవ్వాల మానవ ప్రతిస్పందన ప్రతీది సరుకు… అమ్మకపు సరుకు…!

rajayya

22.03.2013

డియర్ వంశీ,

పట్నంల ఎట్లున్నవ్? చదువుల పరుగుపందెంలో లెవ్వుగనక ఎట్లున్నా బాగుంటవ్ లే.. ప్రపంచీకరణ తర్వాత గత్తర బిత్తర చదువు.. పరుగో పరుగు.. ఆ మధ్య యునెస్కో ప్రచురించిన (1996) ప్రపంచీకరణకు అవసరమున్న విద్యకు సంబంధించి ఒక ప్రణాళిక పత్రంలాంటిదది. మొన్న ఎందుకో చదివిన, అందులో ముఖ్య విషయం “నైపుణ్యం నుండి యోగ్యత” వరకు.  ఈ యోగ్యత ఎవరు నిర్ణయిస్తారు? ఇందులో అంతర్లీనంగా ఉండే “పోటీ” మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.. పాఠశాలలూ, కాలేజీలూ, యూనివర్సిటీలూ ఒక కాన్సంట్రేషన్ క్యాంపులయ్యాయీ..  విచ్చలవిడి హింసా, ఆత్మహత్యలు పెరిగాయి.. ఇక్కడ అన్ని రకాలుగా హింసించబడి, నిలదొక్కుకొని.. ఒక నైపుణ్యంగల కూలీ-సరుకులు ఉత్పత్తిచేసే…

సరేలే… ఈ గోలనుండి బయటపడి.. ఫార్మసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదివి- నువ్వు మనుషులను చదువుకోడానికి కొద్ది కాలమైనా ఎంచుకోవడం సాహసమే… ఈ దారి అందరూ నడిచే దారి కాదు.. మా కాలంలో ఐతే విద్యార్థులు ఉద్యమాల్లోకి వెళ్ళారు….. ఇదంతా రాయాలనుకోలేదు.. ఒక తుఫాను గాలిలో హోరెత్తే ఫోనుల దడదడలోంచి ఎప్పుడో వదిలిపెట్టిన “ఉత్తరం” రాద్దామనుకుంటూనే- తిరుగుతున్నా…

నీకిష్టమైన “గాన్ విత్ ద విండ్”  తెలుగు చేసిన ఎం.వీ రమణారెడ్డి గారికి ఉత్తరం రాయడంతో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాలనుకున్న. ఆయన ప్రేమతో (ఆ మధ్య కలిసినప్పుడు) చాలా పుస్తకాలు ఇచ్చారు. పైగా 1978 నుండి వారినెరుగుదును. ఒకసారి మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి పరిణామక్రమాలన్నీ మనకు ఎట్లనో గట్ల చేరుతుంటాయి. ఉద్విగ్న రాయలసీమలో ఒరుసుకుని- వొత్తుకుని కొనసాగే- కార్మిక నాయకుడిగా- ముఠా తగాదాల అతలాకుతలంలో గాన్ విత్ ద విండ్ లోని రెడ్ బట్లర్ ను, స్కార్లెట్ లను మనకందించడం ఏ చిక్కురు బొక్కురు దారుల గుండా నడుస్తారు  లోపలి మనుషులు..!! ఓహ్..!! ఇదంతా కూడా కాదు నేన్ రాయాలనుకున్నది… ఉత్తరం అఫ్సర్ గుర్తుచేసేదాకా తెలియనే తెలియదు.. కూడ దీసుకుని మాట్లాడేసరికి సర్రున దిగే కత్తిలాంటి ఫోనులో ఆ మధ్య ఫోన్ చేసిన కల్పన గారేమనుకున్నారో? కల్పనగారు అఫ్సర్ సహచరి. వాళ్ళిద్దరిప్పుడు అమెరికాలో ఉన్నారు.

మనిషి కంఠస్వరం.. ఎంతగొప్పదీ.. మన గతవర్తమాన, భవిష్యత్తు నిండిన కల్పనల కలబోతకదా!! సమస్థ శరీర ధ్వని ప్రతిధ్వని కాదా కంఠస్వరం!! మౌన స్వరాల మార్పరి కాదా కంఠస్వరం.. ప్రపంచీకరణలో మహాద్భుత మానవ సమూహాల వ్యక్తీకరణను గుండె గొంతుకులోన కొట్లాడే భాషను.. కంఠస్వరాన్ని “సరుకు” చేశారుకదా!

“దప్పిక” ఎంత గొప్ప అనుభవం.. అలాంటి అనుభవాన్ని శీతలపానీయాలుగా ఎన్ని లక్షల కోట్ల సరుకు చేశారు! ఇవ్వాల మానవ ప్రతిస్పందన ప్రతీది సరుకు.. అమ్మకపు సరుకు..

అట్లాగే ఫోన్ కూడానేమో! నాకెందుకో ఫోన్ ఒక యాంత్రిక భూతంలాగా కనిపిస్తుంది. గోడదూకే సాంప్రదాయంలోకి వెళ్తున్నానా??  ఆధునికంగా ఆలోచించడమంటావా?? అప్పుడప్పుడూ ఇంతగొప్ప మానవ సాంకేతిక ఆవిష్కరణలో మనుషులకు నిజంగా ఉపయోగపడేవెన్ని?? …బహుషా నీకు రాయాలనుకున్నది ఇదికూడా కాదు..

ఈ మధ్య రిటైర్ అయిన తర్వాత తెలిసింది నేను చాలా కాలం ఉద్యోగిగా, ఖైదిగా ఉన్నానన్న సంగతి..

బయటికి వచ్చి చూస్తే… అబ్బో… రెండో ప్రపంచ యుద్ధం మీద తీసిన రష్యన్ సినిమాల్లోని యుద్ధ రంగంలోకి వెళ్ళే సైనికులకు వీడుకోలు పలికే రైల్వే స్టేషన్లలో లాగా చదువులకూ, కుటుంబాలకూ, ఉద్యోగాలకూ ఆవలగల మానవ ప్రపంచాన్ని చూస్తున్నాను.. కానీ నాకు అర్థమైతేనా? విచిత్రంగా ఒకపక్క “నియమిత”పరిధిలోకి మనుషులు ఇమడకుండా బయట జనాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారూ.. కనిపిస్తున్నారూ.. వీళ్ళంతా బయట వొదగకుండా ఉన్నవాళ్ళు..

ఒక మంచిర్యాల చుట్టుపక్కల అనియత రంగంలో లక్షమంది పనిచేస్తున్నారు.. 60% రైతులు అట్లాగే ఉన్నారు. పల్లెలు అల్లల్లాడుతున్నాయి… అంటే రూల్సూ, రెగ్యులేషన్స్ వగైరా వగైరా లేనివాళ్ళు….

సరే ఎప్పుడూ విషాదానికే అలవాటుపడిన నాబోటివాడు కొత్తగా నిర్మాణమౌతున్నదేమిటో? వెతకాలనుకున్నాను..

అస్తుబిస్తు రోడ్ల మీద చిత్ర విచిత్రమైన మనుషులను చూసుకుంటూ దేశదిమ్మరిలా తిరగటం ఎంత బాగుంటుంది? మనుషులు కొంతమంది ఎంత బాగుంటారంటే…

మొన్న పదకొండో తారీఖు నాడు మిర్యాల గూడేం నుంచి బోనగిరికి బస్సులో మిత్రుడు భాసిత్, నేనూ వస్తున్నాం.. బస్సులో ఫుల్లు జనం. వెనకవైపు నుంచి కండక్టర్ “బాపూ.. ఏ ఊరు పోవాల్నే”..  “బోనగిరి బిడ్డా!”… “సరే పిలడా జర పక్కకు జరిగ్గూసో, బాపును పక్కకు కూకుండబెట్టుకో”.. “అమ్మా, ఎన్ని టికిట్లూ??”.. “ఓటి ఫుల్లూ, ఓటి హాఫూ”….   “అట్లనా? మరి చిన్న పిల్లగానికో?”… “అయ్యో ఇంక ఆనికి పండ్లన్న ఊశిపోలేకదా”…. “పండ్లేందీ, ఏడేండ్లదాంక ఊడయి.. టికిట్లు తియ్యకపోతే నాకు కిరికిరి అయితది”…

ఆ భాష.. కంఠస్వరం.. అబ్బో..

కండక్టరును చూసాను..  అంత ఒత్తిడిలో ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉన్నాడూ.. “భలే మంచిగ మాట్లాడ్తానవన్నా” అన్నా.. నా దిక్కు చూసి చిరునవ్వు నవ్వి ముందుకు పోయిండు..

ఒకరినొకరు ద్వేషించుకునే సరుకు అయిపోయిన పోటీ చదువులూ, ఉద్యోగాల మధ్య… రణగొణ ధ్వనుల మధ్య.. ఆ కండక్టరు తనను తాను ఒక మనిషిగా మనుషుల పట్ల అపారమైన ప్రేమస్పదునిగా ఎట్లుంచుకోగలుగుతున్నాడో!

బహుషా మన కాలంలో, మన ప్రాంతంలో మనుషులను నిలబెట్టడానికి, కలిపి ఉంచడానికీ, ప్రేమించడానికీ జరిగిన అనేక ఉద్యమాలు కారణం కావచ్చును.. ఇలాంటి కొత్త మనుషుల కోసం మనందరం ఏం చెయ్యాలి?

ఎక్కడో తేలిన కదా!!

పెదనాన్న

Download PDF

11 Comments

  • Anita says:

    మర్చిపోయిన మనిషితనాన్ని మళ్ళి వెతుకున్నట్లుంది..

  • RammohanRao thummuri says:

    రాజయ్యగారు ఎక్కడొ మునిగి ఎక్కడొ తేలినా మంచి ముచట్లే చెప్పిన్రు మంచిగ్గుడజెప్పిన్రు.ఉత్తరాలు జదువక ఎన్నేండ్లయిందో.నన్ను గుర్తువట్టిన్రా కాగాజునగర్.నిర్మల్ తెరవే మీటింగు నుంచి పొయ్యేప్పుడు జన్నారం లో గలుసుకున్నం .మీ తోటి మీ బ్రదరు గుడా ఉండె.ఇట్లనన్న మల్లి ఒకళ్ళ కొకల్లం ఉత్తరాలు రాసుకుంటె మంచిగుంటది.
    వాధూలస

  • రమాసుందరి says:

    “బహుషా మన కాలంలో, మన ప్రాంతంలో మనుషులను నిలబెట్టడానికి, కలిపి ఉంచడానికీ, ప్రేమించడానికీ జరిగిన అనేక ఉద్యమాలు కారణం కావచ్చును.” నిజమే . ఉద్యమాలు, ఘర్షణలు లేని ప్రాంతలో వస్తున్న సాహిత్యం, సంబంధాలు నిస్సారంగ ఉంటాయి. ఇక ప్రతి వారం మానవ సంబంధాల కోసం మీ కాలం లో వెతుక్కోవాలి.

  • పోగొట్టుకున్న ఆత్మీయతను అందరికి పంచిన రాజయ్య గారు సరికొత్తగా మనదృక్ఫధాన్ని మార్పు దిశగా మరలచే ప్రయత్నం చేశారు.ఆత్మీయ పలకరింపులు ఆరంభమయ్యాయి.మల్హ్ల్హీ వచ్చే వారందాక ఎదురుచూడాల్సిందే.

  • the tree says:

    మంచి వాక్యాలు, గొప్పగా రాశారు సార్,.

  • mercy margaret says:

    నిజమేనండి కొన్ని సార్లు మనం పోగొట్టుకున్నవి అలా ఎదురై ఇంకా మనలోని మనిషితనాన్ని బ్రతికుందా లేదా అని పరీక్షిస్తుంటాయి .. మీరు రాసిన కొన్ని మాటలు హృదయాన్ని హత్తుకున్నాయి ఆలోచింప చేసేలా ఉన్నాయి .. అభినందనలు సర్ ..
    సంపాదకులకు ధన్యవాదాలు ఇలాంటి మంచి ఆర్టికల్స్ , విబ్భిన్నంగా మమ్మల్ని రీచ్ అవ్తున్నందుకు

  • rajani says:

    రాజయ్య గారు మీ కథా ఉత్తరం బాగుంది. నిజంగానే తరిగిపోతున్న మానవ సంబంధాలు, కనిపించకుండా పోయిన ఉత్తరాలు అన్ని విషయాలను ఒకే దగ్గర చెప్పా గలిగారు .

  • Micheli says:

    That’s an apt answer to an ineretsting question

  • PURUSHOTHAM SATHEESH. says:

    చాల బాగుందండి మీకు ఎలా ద్యన్యవాదము చెప్పాలో అర్ధం కావడం లేదు YENDUకంటే నాకు తిలియని సాహిత్యాన్ని అందించారు చాల కృతజ్ఞతలు.

  • PURUSHOTHAM SATHEESH. says:

    మా కవితలను మే పత్రికలో వేసుకుంటార సర్ . పంపించమంటే పంపిస్తా.

    • purushotham satheesh. says:

      కాలం కరిగిపూతు చెప్పింది
      నువ్వు నన్ను తడమతం లేదని
      కాంతి వెలుగులీనుతూ నవ్వింది
      నువ్వు నన్ను చేరడంలేదని
      జీవితం గుస గుసలాడింది
      గమ్యం లేని ప్రయాణం నీదని
      ఒంటరి హక్కున చేర్చుకుంది
      నిన్ను కలవరపెడతానని
      ప్రపంచం నేను చీదరించింది
      నువ్వు శ్రమ ఎరుగని మనిషివని
      నువ్వు గమనించలేదేమో నేటి
      సమాజం కుళ్ళు కుతంత్రాలతో
      అల్లుకుందని ఆకట్టుకుంతదని
      నువ్వు గుర్తించలేదు నీకు త్యలియకుండానే
      నే రక్త మంసాలను హరిస్తున్నారని
      నువ్వు నేలదీస్తానంటే ;
      నే మూతికి సంకెళ్ళు
      ని చేతికి సంకెళ్ళు ;
      ని పెన్నుకు సంకెళ్ళు ,
      ఆధునిక దోపిడీ ఆరంభం
      నిన్ను భానిసగా మార్చాలని ఆరాటం
      కళల సౌధాలు తప్ప ఇలలో
      నీడ లేఎని నిరస్రయుడవు
      ధనరికం నిన్ను ధరి చేరనివ్వలేదు
      నువ్వు నిజాల నిప్పుల కొలిమివని
      పీదరికం నిను పెనవేసుకుంది
      నివు దోపిడికి గురయ్యే మనిషివని
      ఆదునిక యుగంలో ఆద మరిస్తే
      ఇనుప కచడాలను తెన్చాలేము
      ఇ దోపిడిని అంతమొందిన్చాలేము
      రచన.
      …………….. పురుషోత్తం .సతీష్
      నవతెలంగన పబ్లిషింగ్ హౌస్
      కరీంనగర్ బ్రాంచ్ ఇంచర్జే
      సెల్ no 8897430904.

Leave a Reply to ramachary bangaru Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)