ఆవలి తీరం గుసగుసలు

bvv

1

ఒక సాయంత్రానికి ముందు

ఇద్దరు వృద్దులతో గడిపాను కాసిని నిముషాలు

 

మా చుట్టూ జీవనవైభవం ప్రదర్శిస్తున్న దృశ్యమాన ప్రపంచం

కరుగుతున్న క్షణాలతో పాటు

వాళ్ళ వెనుకగా నేనూ వృద్దుడినవుతున్న లీలామాత్రపు స్పృహ

 

వాళ్ళ మాటలు వింటున్నాను

 

కనులకి సరిగా కనిపించటం లేదు, చెవులకి వినిపించటం లేదు

ఆకలి లేదు, నిద్ర రావటం లేదు

జీవితాన్ని అనుభవించటం తెలియకుండానే జీవితోత్సాహం అస్తమిస్తోంది

అవతలి తీరం నుండి పిలుపు లీలగా వినవస్తోంది

 

2

వారితో ఇన్నాళ్ళూ సన్నిహితంగా గడిపి

వారి జీవితం నుండి నేనేమి నేర్చుకొన్నానో తెలియదు కాని

వారి అస్తమయ కిరణాలు ఇప్పుడు ఏవో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి

 

ఏదో ఒకరోజు వృద్దాప్యం నన్నూ ఆహ్వానిస్తుంది

నా అస్తమయ కిరణాలు కూడా ఏదో ఒకరోజు చీకటిలో కరిగిపోతాయి

 

ఇంకా శక్తి ఉండగానే

ఇంకా ఉత్సవ సౌరభమేదో నాపై నాట్యం చేస్తుండగానే

విప్పవలసిన ముడులేవో త్వరగా విప్పుకోవాలి

 

‘నీకు మరణం లేద ‘ని జ్ఞానులు చెప్పిన రహస్యాన్ని

నా పడవ మునిగిపోయేలోగానే కనుగొని తీరాలి

3

మా చుట్టూ కాంతిలో తేలుతున్న చెట్లూ

నిశ్శబ్దంలో తేలుతున్న పక్షుల పాటలూ

శూన్యంలో తేలుతున్న జీవితానుభవమూ

వాటిని విడిచి వెళ్ళే క్షణాల స్పృహలోంచి కొత్తగా కనిపిస్తున్నాయి

 

ఆ సాయంత్రం వృద్దులతో గడిపిన నిముషాల్లో

వారెందుకు మాట్లాడుకొన్నారో తెలియదు కాని

వారిలోంచి, ఇంతకు ముందు ఎన్నడూ వినని

నా అవతలి తీరం గుసగుసలు వినిపించి నా యాత్రను వేగిరపరిచాయి

Download PDF

22 Comments

  • kranthisrinivasarao says:

    సోదరా బీవీవీ ..నమస్కారం
    మొన్ననే పేపర్ లో చదివా ( యాభై ఏళ్ళ వృద్దుడు మృతి అని )…అందుకని ..ఇప్పుడు ఆవలి తీరం లొనే ఉన్నాం …మనమేమి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంచక్కా అదే మనదగ్గరకు వచ్చేస్తుంది , చాలా బాగా రాసావు ,సోదరా ….అందుకే నేను పిల్లల మధ్య గడుపుతుంటాను , ఆశల చివురులు తొడుక్కొనేందుకు ….ఆఖరి క్షణాల వరకూ….హాయిగా ఉందామని …మొత్తానికి ..50 దాటిన వాళ్ళందరికీ కళ్ళ ముందు సినిమా చూపెట్టావు

  • RammohanRao thummuri says:

    చాలా బాగుంది ప్రసాద్ గారు.
    ఆవలి తీరం గుసగుసలు వినాల్సిన వాళ్లందరికీ వినిపించగలిగారు.వైయక్తికం సార్వజనీనమయ్యింది.
    నీకు మరణం లేదని జ్ఞానులు చెప్పిన రహస్యం/నా పడవ మునిగి పోయే లోగా కనుగొని తీరాలి – బాగా చెప్పారు .అభినందనలు

  • K.Geeta says:

    తల వెంట్రుకలు వేగంగా పండినప్పటి బాధ నిన్ననే కవితగా రాసాను-
    మీ కవిత చదివేక బాధలో సారూప్యతకి ఇలా రాయాలనిపించిన్ది-
    చాలా బాగా రాసారండీ-

  • రమాసుందరి says:

    బాగుంది. చాలా చాలా

  • శ్రీరామ్ says:

    చాలా బాగుంది ప్రసాద్ గారు… ఎంతో సరళంగా, దిగులు కలిగించేలా ఉంది. కవిత జీవన వేదనని_ స్వచ్చమైన, నాణ్యమైన వైరాగ్యాన్ని వ్యక్తీకరించింది. సాధారణంగా టాగోర్ కవితల్లో అనుభూతమయ్యే అత్యంత నమ్రమైన మృదుత్వాన్ని స్ఫురణకు తీసుకువచ్చింది. నాకు బాగా నచ్చిన మీ కవితలో ఇదీ ఒకటి. ఇటువంటి కవితల్ని రాయలేము, వాటికవే సృజించ బడతాయి. అదే వాటి సౌందర్యం.

  • కవిత చాలా బాగుంది.
    చిన్నచిన్న పదాలలో ఉన్నతమైన భావాలను పలికించిన కవిత.
    ఇతరుల నుంచి నేర్చుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకోడంలో ఆలస్యమైతే… అదో జీవితకాలం లేటు.
    ముదిమి ముసురుకుంటుంది, కాలం కమ్ముకొస్తుందనే వాస్తవాన్ని నేర్పుగా ప్రస్తావిస్తూ, ప్రతీ ఒక్కరు తమను తాము సకాలంలో తెలుసుకోవాలని, ఆవిష్కరించుకోవాలని చెప్పిన ఈ కవిత హృద్యంగా ఉంది.
    అభినందనలు.

  • the tree says:

    ఆవలితీరం గుసగుసలు,.చక్కగా వినిపించారు,..ప్రసాద్ గారు,..

  • mercy margaret says:

    పడవ మునిగిపోక ముందే , చుట్టూ వ్యాపించిన కిరణాలు అస్తమయంలో కరిగిపోక ముందే జాగ్రత్త పడమని హెచ్చరించినట్టు ఉంది .. మీ కవితలు చదివాక కొద్దిసేపు మౌనం మాట్లాడ్డం నిజం .. బాగుంది సర్

  • విప్పవలసిన ముడులేవో త్వరగా విప్పుకోవాలి

    చాలా బావుంది ప్రసాద్ గారు.

  • బివివి గారు,

    మంచి కవిత.

    “విప్పవలసిన ముడులేవో త్వరగా విప్పుకోవాలి

    ‘నీకు మరణం లేద ‘ని జ్ఞానులు చెప్పిన రహస్యాన్ని
    నా పడవ మునిగిపోయేలోగానే కనుగొని తీరాలి”

    లైన్లు బాగా నచ్చాయి.

  • ఈ కవితకు వచ్చిన అనూహ్యమైన ప్రతిస్పందన సంతోషాన్నిచ్చింది.
    మిత్రులందరి స్పందనా నేను అనుసరించవలసిన అబివ్యక్తీ, తాత్వికత ల పట్ల మరింత స్పష్టతని కలిగిస్తోంది.
    అన్నగారు శ్రీనివాసరావుగారు, రామ్మోహన్ రావుగారు, గీతగారు, రమాసుందరిగారు, శ్రీరాం గారు, సోమశంకర్ గారు, భాస్కర్ గారు, మెర్సీ గారు, వనజ గారు, రవిగారు అందరికీ ధన్యవాదాలు..

  • చాలా బావుందండి !

    • Krishna says:

      చాలా బాగుందండి.
      “జీవితాన్ని అనుభవించటం తెలియకుండానే జీవితోత్సాహం అస్తమిస్తోంది”
      చాలా మంది విషయం లో ఇది నిజం. అనుభవించటం అంటే అర్ధం చాలా ఆలస్యముగా తెలుస్తుంది

  • తృష్ణ గారూ ధన్యవాదాలు. అవును, కృష్ణ గారూ. ధన్యవాదాలు.

  • akella raviprakash says:

    మా చుట్టూ కాంతిలో తేలుతున్న చెట్లూ

    నిశ్శబ్దంలో తేలుతున్న పక్షుల పాటలూ

    శూన్యంలో తేలుతున్న జీవితానుభవమూ

    వాటిని విడిచి వెళ్ళే క్షణాల స్పృహలోంచి కొత్తగా కనిపిస్తున్నాయి
    బీ వీ వీ
    గ్రేట్ లైన్స్

    మీ కవితలకు హాట్స్ ఆఫ్

  • వంశీ says:

    చాలా బాగుంది సర్… :)

  • m s naidu says:

    నమస్తే ప్రసాద్ గారు.
    వాళ్ళ మాటలు వింటున్నాను. వారెందుకు మాట్లాడుకొన్నారో తెలియదు కాని, ఈ పద్యంకి కాస్త జీవనవైభవం తగ్గింది. అన్యదా భావిస్తే, ఏదో ఒకరోజు వృద్దాప్యం నన్నూ ఆహ్వానిస్తుంది. నా అస్తమయ కిరణాలు కూడా ఏదో ఒకరోజు చీకటిలో

  • gadiraju rangaraju says:

    ప్రసాద గారు మీ కవిత బాగున్నది .శీర్షిక ఎంతొ బాగుంది. ముఖ్యం గా కొన్ని లైనులు ఆకట్టుకున్నాయి .

  • buchi reddy says:

    విప్పుకోవాలి ——వాస్తవాలను చక్కగా చెప్పారు —-ప్రసాద్ గారు

    బుచ్చి రెడ్డి

  • దాట్ల దేవదానం రాజు says:

    ప్రసాద్ గారూ
    కవితలోని సారాంశాన్ని ఒక తరం వాళ్ళు మెలితిరిగిపోతూ అన్వయించుకుంకుంటూ సార్వజనీనంగా స్వీకరిస్తూ ఉండేలా ఒకానొక తాత్వికతను అతి సరళంగా కవిత్వీకరించారు. అభినందనలు.

  • రవిప్రకాష్ గారూ అవును, ఆ లైన్లు నాకూ బాగా నచ్చాయి., వంశీ :)., నాయుడుగారూ ఈ మాటలు మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియలేదు కాని., రంగరాజు గారూ, బుచ్చిరెడ్డి గారూ, దేవదానంరాజు గారూ.. అందరికీ ధన్యవాదాలు..

  • GopalaKrishna S Tangirala says:

    “జీవితాన్ని అనుభవించటం తెలియకుండానే జీవితోత్సాహం అస్తమిస్తోంది”

    మిత్రులు ప్రసాద్ గారికి
    నమస్సులు.
    జీవితం అంటే ఇంతేనా అనే ఆలోచన కాస్త ఆలోచించే ఎవరికైనా ఎదురయ్యే ఒక జవాబు లేని ప్రశ్న.
    ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది?
    ఏం చేస్తే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్టు?
    బహుశా వీటికి సమాధానాలు దొరకవేమో..
    మీ కవితతో… ప్రత్యేకించి పై వాక్యాలతో..ఓ ఆలోచనల తుట్టెను కదిలించారు.
    ఏదేమైనా మీ ప్రగాఢ భావ ప్రకటనా శక్తి అమోఘం.
    మీతో సాంగత్యం నా అదృష్టం.
    మీ మిత్రుడు
    గోపి

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)