నిజంగా ‘నెలబాలుడ’తడు!

hema-sivasagar2004 వ సంవత్సరం లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం లో వివిధ అంశాలపై ప్రపంచీకరణ ప్రభావం అనే సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లోని అన్నీ సెషన్స్ కి నేను హాజరయ్యాను. అప్పటి యువ కవుల నుండి పెద్ద పెద్ద కవులు, రచయితలు, రచయిత్రులు ఈ సదస్సులో తమ పత్రాలను సమర్పించారు. నేను ఎంతో కాలం గా శివసాగర్ నీ, ఉద్యమం నెలబాలుడు పుస్తకాన్నీ చదువుతూ అభిమానిస్తూ వస్తున్నాను. శివసాగర్ కూడా ఈ సదస్సు లో పాల్గొనటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఉద్యమాలు, విప్లవం, విప్లవ సాహిత్యం, విప్లవ కవుల ప్రస్తావన వస్తే మనసు చైతన్యవంతవమవుతుంది. సమాజం పట్ల, ఆర్ధిక సంబంధాల పట్ల ఒక బాధ్యత గుర్తుకు వస్తుంది. అంతర్లీనం గా ఆవేశం ముంచుకొస్తుంది.

విప్లవ కవుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాడు శివసాగర్. ఆయన రాసిన నా చేల్లీ చంద్రమ్మ, ఆమె, ఉద్యమం నెలబాలుడు, జనం ఊపిరితో, ఆకాశం లో సగం నీవు కవితలను చదువుతూ ఎంతో కొంత ఆ భావజాలాన్ని మనస్సు కు పట్టించుకున్న దాన్ని.

ఆ రోజు సభ పూర్తయ్యాక, సాయంత్రం మాతో పాటు మా ఇంటికొచ్చి రెండు రోజులు బస చేశారు శివసాగర్.

ఆయనను కలవటానికి ఎంతో మంది సాహిత్య అభిమానులు ఆ రాత్రి వరకూ వస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా ఆయనతో కూర్చొని మాట్లాడే అవకాశమే దొరకలేదు. అతిధులకు కావల్సిన సౌకర్యాలు సమకూర్చటం లో నాకు సమయం దొరకలేదు. ఆ రాత్రంతా- ఉదయాన్నీ కాఫీ త్రాగే సమయం లో చాలా సేపు తీరిక గా ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. ఆయన కవిత్వాన్ని గురించి, ఉద్యమం గురించి చాలా సేపు మాట్లాడారు.

సాధారణ స్కూల్ టీచర్ కు తనయుడి గా పుట్టినా, ఆ తండ్రి వృత్తి ని మాత్రం స్వీకరించలేదు. ఎం.ఏ. పూర్తి చేశాక, కమ్యూనిస్ట్ పార్టీ లో సభ్యుడై నక్సల్బరీ ఉద్యమానికి ప్రభావితుడయ్యారు. శ్రీకాకుళం రైతాంగ పోరాటం లో కూడా క్రియాశీలకంగా పని చేశారు. కొండపల్లి సీతారామయ్య తో అనుబంధం ఏర్పడింది.

‘నా చెల్లీ చెంద్రమ్మ’ కవితా ను ప్రస్తావించాను. ఈ కవిత రాయడం లో గురజాడ ప్రభావం ఏదైనా ఉందా? అన్న వాదాన్ని గురించి అడిగాను. మనం ఎక్కువగా చదివే సాహిత్యాన్ని, భావజాలాన్ని , పదాలను మన ప్రమేయం లేకుండానే వాడుతూ ఉంటాము అన్నారు. గురజాడ నాకు ఇష్టమైన కవి. అందువల్లే ఆ ప్రభావం పడి ఉంటుందని అన్నారు. విద్యార్థి గా ఉన్నప్పుడు నేను చదవటానికే ఎక్కువ ప్రాధాన్యత ను ఇచ్చాను. శ్రీశ్రీ, ఆరుద్ర, శిస్ట్లా, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, చలం, పఠాభి, నారాయణ బాబు వంటి వారు రాసిన సాహిత్యాన్ని విపరీతం గా చదివాను.చలం సాహిత్యం అయితే చదివే కొద్దీ విశాలమవుతూ ఉంటుంది. దిగంబర కవుల కవిత్వం కూడా నాకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉండేది.

“ఆదివారము నాడు గోదారి నాడు
పొద్దు గుంకిన వేల, సద్దు మణిగిన వేళ
పొలమో, స్థలమో చూచి తిరిగి వచ్చే దొరకు”

లయబద్ధంగా ఆ రోజు శివసాగర్ పాడిన జానపద గీతం మరో సారి నాలో  ఆవేశం పెల్లుబుకేలా చేసింది.

చెల్లీ! చెంద్రమ్మా! అనే పద్యాన్ని మననం చేసుకుంటూ ఇలా చెప్పారు.

“భూస్వాములకు శిక్ష విధించటం ఎంతవరకు సబబు అనే విషయం పై మాకు జరిగిన ఒక చర్చకు జవాబే” చెల్లీ! చెంద్రమ్మా!” నేను ఒకరి ఇంట్లో రహస్య జీవనం చేస్తున్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి కూతురు ఎక్కువగా పల్లెపదాలు పాడుతుండేది. ఆ పాటలు వింటున్నప్పుడల్లా నాకు ఈ పాటల పై బాణీలపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. నాకు కూడా పాటలు రాయాలని ఆమె పాడే బాణీలోనే దాన్ని కూర్చాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడు పుట్టిందే ఈ పాట.

“నేను అడవుల్లో, పల్లెల్లో కాలినడకన వెళ్ళేటప్పుడు “చెల్లేలా చెల్లేలా ఓహో! చెల్లేలా” అని పాడుకుంటూ వెళ్ళేవాడ్ని. ఎదురుగా కనిపిస్తున్న ప్రతి దృశ్యాన్ని పదాలుగా మార్చుకుంటూ తరువాత రాసుకునేవాడ్ని.  వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఇప్ప చెట్టు కింద కూర్చొని ఆ తండా వారికి వినిపిస్తూ పాడుతూ ఉండేవాడ్ని. ఆ పాటను వింటూ వాళ్ళు ప్రకటించే హావభావాలే ఆ పాటకు విమర్శకులు. ఆ రకంగా దాన్ని సరిదిద్దుకుంటూ ఈ రూపానికి తెచ్చాను,” అని చెప్పారు.

1976 లో సికింద్రాబాద్ జైల్లో ఉన్నప్పుడు “ఆమె” కవిత రాశారు. అందులో ఉన్న విప్లవ యోధుల్ని గుర్తు చేసుకుంటూ రక్తసిక్తమైన భూమిని అరుణారుణ చరిత గా అభివర్ణించాడు.

“ఆకాశం లో సగం నీవు
అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు సగం నేను” అంటూ మనిద్దరం కలిసి ఉద్యమిస్తే
చిటపట చిటపట చినుకులు చిల్లంగ
కాసిరెడ్డి ఒళ్ళు చిటపట లాడే
పులపుల పుల పుల చినుకులు చిందంగ
కాసిరెడ్డి వొళ్ళు పులకరించంగ
జెల్లు జెల్లుమని వర్షమ్మూ కురియంగ
కాసి రెడ్డి వొళ్ళు జెలదరించంగ

అంతవింతరెడ్డి వగలు పోయాడ!
కందిరీగ నడుమ వంటి నడుము దానా!
వాన జోరు హెచ్చే! గాలి హోరు హెచ్చే!
పసుల కొట్టము వద్ద మసలు కొందము రావే !
నీ మొగుడు పోతేపోయే ! నీవు దక్కవాయే!

జారు కొప్పుదానా! జాగీలీ నడుముదానా!
వానజోరు హెచ్చే! గాలిహోరు హెచ్చే!
నా ఆశ కాపు కాసి నా దాపు వస్తివి గాదె!
రవ్వరవ్వ గాలిసీరే రవ్వలేల మనకు?

“ఓ దొరా! ఓ దొరా! వగలమారీ దొరా!
నా ఆశ కాపు కాసే నీ దాపు నేను వస్తీ ” అంటూ

ఎత్తిన కత్తి కుత్తుకతో దిగగుచ్చే చెంద్రి కత్తి  ఎత్తివొత్తి పొత్తికడుపు లో గుచ్చే ఈ పంక్తులను నేను చదువుతూ ఆగినప్పుడు చిన్నగా నవ్వి “మావో మాటల నుంచే స్పూర్తి ని తీసుకున్నాను. స్త్రీ ప్రమేయం లేకుండా ప్రకృతే లేదు.  మనం ప్రకృతి లో మమేకం అయిపోయిన జీవులం. ప్రకృతి, స్త్రీ, పురుషుడు కలిస్తే విప్లవిస్తే విజయమే కదా! ” అని నవ్వారు. “నాకు జీవితం, ఉద్యమము వేరు వేరు కాదు. నేనే ఉద్యమాన్ని. ఉద్యమమే నేను. అజ్నాతమ్ లో ఉన్నప్పుడూ జన జీవన స్రవంతి లో ఉన్నప్పుడు కూడా నేను పరిసరాలకు ప్రభావితుడ్ని. ప్రకృతి లో మమేకం అయినవాడ్ని,” అన్నారు.

ఆ రోజు తిరిగి వెళ్ళటానికి సన్నాహమవుతూ ఎక్కడెక్కడికో ఫోన్లు చేశారు. ఇప్పుడు ఏ వూరు వెళ్తున్నారని అడిగాను. కాసేపు ఆలోచించి “ఎక్కడికి వెళ్తాను, ఏమో? ఆలోచించాలి,” అన్నారు. కాసేపు అయ్యాక, విశాఖపట్నం వెళ్దామని అనుకుంటున్నా అమ్మా అని కాసేపు పెద్దగా నవ్వారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదంటే నా మిత్రులు కూడా ఇలాగే కంగారుపడుతుంటారు. నేను పక్కనే నుంచోని దువ్వెన అందించాను. దువ్వుకొని తిరిగి ఇచ్చాక పౌడర్ కావాలని అడిగారు. నేను పాండ్స్ పౌడర్ డబ్బా ఇచ్చి పక్క గది లోకి వెళ్ళాను. ఓ రెండు నిముషాలయ్యాక ఆ గది లోకి వెళితే అద్దం లో అలాగే చూసుకుంటూ పౌడర్ డబ్బాని చేతిలో పట్టుకొని అలాగే నుంచోని ఉన్నారు. నేను దగ్గరకు వెళ్ళి ప్రశ్నార్ధకంగా చూశాను.

“దీన్ని ఎలా తీయాలి?” అని అడిగారు.

నాకు ఆశ్చర్యం తో నోట మాట రాలేదు. ఆయన నవ్వుతూ నా మొఖం లోకి చూస్తూ ఉన్నారు. సరదాగా అడుగుతున్నారా? అని కూడా అనిపించింది. మళ్ళీ చప్పున ఆయన మరిచిపోయి ఉండొచ్చేమో అనిపించింది.

ఇలా తీయాలని త్రిప్పి ఆయనకు అందించాను సందేహం గానే. శివసాగర్ నవ్వి అవును కదా, నేను మర్చిపోయాను అని పౌడర్ రాసుకున్నారు.

నేను పౌడర్ రాసుకుంటున్న శివసాగర్ చేతుల్ని తదేకంగా చూశాను.

ఎన్నెన్ని ఉద్యమాల్లో పాల్గొని అరుణారుణ కవిత్వాన్ని రచించిన చేతులే కదా ఇవి! మరెన్ని పోరాటాల్లో తుపాకుల ట్రిగ్గర్లు  నొక్కిన వేళ్లే కదా ఇవి! ఇప్పుడు నిజంగానే నెలబాలుడు అవుతున్నాడు….అనుకున్నాను మనసులో.
మల్లెప్పుడైనా ఆ సందర్భాన్ని శివసాగర్ కి గుర్తు చేద్దామనుకున్నాను. మరెప్పటికీ ఆ అవకాశం రాలేదు…రాదు…

డా. పుట్ల హేమలత, సంపాదకురాలు, www.vihanga.com

Download PDF

6 Comments

  • రమాసుందరి says:

    ఉద్యమం, జీవితం వేరు కాని ఎందరెందరో మహానుభావులు. మీ వారసులం కాలేకున్నా, మీ పాదముద్రలు బద్రం చేసుకోనివ్వండి. బాలా బాగా ఉంది హేమలత గారు.

  • కవిత్వాన్ని చదవడం ఆలస్యంగా ఆరంభించాను
    శివసాగర్ కవిత్వం చదువుతున్నప్పుడు
    నేను కవిత్వాన్ని ఆలస్యంగా ఎందుకు ఆరంభించానా అనిపిస్తుంది !

    నేనూ ఒక్కసారి ఆయనతో కొంత సమయాన్ని గడపటం జ్ఞాపకం మాత్రమే

    ఎక్కడో ఆయన రాసిన ఒకపదం
    చేతులున్నందుకు హల్లెలూయ … పెదవులున్నందుకు హల్లెలూయ

    మరో వాక్యాన్ని జోడిస్తాను
    జ్ఞా పకమైనందుకు హల్లెలూయ ….

  • mercy margaret says:

    శివ సాగర్ గారి గురించి మీరు రాసింది చదివాక , ఇంకా ఇంకా ఆయనను గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది ..
    ధన్యవాదాలు ..

  • హేమలత గారికి అడగ్గానే ఈ చిన్న పరిచయం రాసినందుకు ధన్యవాదాలు , ఇక పోతే “మల్లెప్పుడైనా ఆ సందర్భాన్ని శివసాగర్ కి గుర్తు చేద్దామనుకున్నాను. మరెప్పటికీ ఆ అవకాశం రాలేదు…రాదు.”ఇది చదవుతుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి.. ఓ రోజు శివసాగర్ సమగ్ర కవితా సంకలనం బయటికి వచ్చాక పుస్తకాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకుంటూ ” బాబూ శివసాగర్ సాహిత్యం మళ్ళీ ప్రాణం పోసుకుంది దానికి కారణం నువ్వే అని బుజం తట్టాడు. అంత చిన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు నాతో అంటూ ఉండేవాడు . చానా చిన్న పిల్ల వాడి మనస్తత్వం అతనిది .శివసాగర్ తో సాన్నిహిత్యం ఉన్న ఎవరియినా ఆయన అన్నం తినే విదానమే చెబుతారు . అమ్మా ఇంకొంచం తీసుకో రాగలవా అమ్మా ఇది చాలా బాగుందిరా ఇంకొంచం వడ్డించు అంటూ అడిగి మరీ పళ్ళెం లో అన్నం శ్రద్దగా తినడం నాకు బాగా జ్ఞాపకం . శివుడూ ..నా మల్లియ రాలేను..నా మొగలి కూడా రాలేను నీ మల్లియా న మొగలి ఆకాశం చేరెను ఆకాశం చేరెను శివుడూ ఆకాశం చేరెను …

  • buchi reddy says:

    అప్పుడు– ఇప్పుడు– ఎప్పుడు–శివ సాగర్ గారు—
    నిజంగానే నెల బాలుడు—లత గారు
    భాగా చెప్పారు
    —————బుచ్చి రెడ్డి గంగుల

  • వి. శాంతి ప్రబోధ says:

    హేమలతగారు మీరు చెప్పిన విషయాలు చదువుతుంటే ఇంకా శివసాగర్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం , ఆసక్తి పెరిగిపోయింది.

Leave a Reply to GURRAM SEETARAMULU Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)