‘జుమ్మా’ నాకొక పునర్జన్మ: వేంపల్లె షరీఫ్

shariff award
  కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహిత వేంపల్లె షరీఫ్‌ నేపథ్యం
‘జుమ్మా’ అంటే శుక్రవారం. శుక్రవారం అని పేరున్న నా పుస్తకానికి వచ్చిన అవార్డు శుక్రవారం రోజే అందుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నిజానికి నాకు శుక్రవారమంటే భయం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ‘ఫ్రైడే సెంటిమెంట్‌’ బలంగా ఉంది.

ఆ రోజు అల్లా దినం. అల్లా పని తప్ప ఏ పనిచేసినా కలసి రాదని భయం. పైగా కీడు జరుగుతుందని ఆందోళన. ‘జుమ్మా’ రోజు ఏడిస్తే మళ్లీ ‘జుమ్మా’ వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటామని ఒక పిచ్చి నమ్మకం. అందుకే అప్పుడప్పుడు మా అమ్మ, నాన్న మీద చిరాకు పడేది. ‘‘జుమ్మా రోజు ఏడిపిస్తావా.. బండరాయీ..’’ అని తిట్టేది.

అందరూ శుభకార్యాలు జుమ్మా రోజు చేస్తే మా ఇంట్లో మాత్రం చేసేవాళ్లు కాదు. ఒకవేళ అత్యవసరమై చేయాల్సి వొచ్చినా ‘జుమ్మా సమయం’ దాటి అంటే మధ్యాహ్న నమాజు సమయం దాటాక చేసేవాళ్లం. మధ్యాహ్నం నమాజు పూర్తయ్యేదాక జుమ్మా రోజు అక్షరాలా ఏ పనీ చేసేవాళ్లం కాదు. అంతేకాదు జుమ్మా రోజు ఇంట్లో ఏవైనా వస్తువులు కింద పడ్డా అపశకునమని బాధపడేవాళ్లం. పొరపాటున గాజులు పగిలిపోతే అమ్మ తన గుండె పగిలినంతగా బాధపడేది.

‘‘శుక్రవారం పూట గాజులు పగిలిపోయాయి… ఇంకా ఏమేం పగిలిపోతాయో..’’అని ఆందోళన చెందేది.

చిన్నపాటి నిమ్మకాయల వ్యాపారి అయిన మా నాయన మధ్యాహ్నం నమాజు పూర్తవనిదే ఎంత పనున్నా తోట దగ్గరికెళ్లేవాడు కాదు. ఇలాంటి నమ్మకాల మధ్య పెరిగిన నాకు కొన్నాళ్లు ఓ పీడకల వెంటాడేది.

భయంకరమైన నీళ్లు …భూమి ఆకాశాలను తలకిందులు చేస్తూ వచ్చి నన్ను ముంచేసేవి. దాంతో నాలో ఒక భయం గూడుకట్టుకుని ఉండిపోయింది. నాకు చావు వస్తే అది శుక్రవారమే వస్తుందని, అది కూడా నీళ్ల ద్వారే వస్తుందని నాలో ఎక్కడో ఏదో మూల ఒక చిన్న అనుమానం.

ఆ అనుమానం, ఆ భయానికి తోడు ఒక జుమ్మా రోజున హైదరాబాద్‌లో ఉండగా మక్కామసీదులో బాంబు బ్లాస్ట్‌ జరిగింది. ప్రశాంతమైన నమాజులో తెల్లటి జుబ్బాలు నెత్తురోడాయి. చిన్న పిల్లలు చనిపోయారు. నోరు లేని పావురాలు చాలావరకు చనిపోయాయి. ఆ బాధ.. భయం.. అమ్మ.. అన్నీ గుర్తుకొచ్చి రాసిన కథ జుమ్మా. మతానికి మించిన ఆప్యాయతలు ఇంకా ఈ భూమ్మీద చాలా ఉన్నాయని బలంగా చెప్పాలనిపించింది. జుమ్మా కథ రాశాను. ఈ కథ ఈ మధ్యే హిందీలోకి అనువాదమై కేంద్ర సాహిత్య అకాడెమి వాళ్ల ప్రతిష్టాత్మక ద్విమాస పత్రిక ‘సమకాలీన భారతీయ సాహిత్య’లో ప్రచురితమైంది. ఆ సంతోషం అలా ఉండగానే నాకు జుమ్మా కథల సంకలనానికి యువ పురస్కారం ప్రకటించారు.

ఆ అవార్డు తీసుకున్నాక నాకు జుమ్మా అంటే భయం పోయింది. జుమ్మా అంటే చావు కాదు పునర్జన్మ అని నమ్మకం కలుగుతోంది.

జుమ్మాలో పన్నెండు కథలున్నాయి. వాటిని రాయడానికి పదేళ్లు కష్టపడ్డాను. నేను చాలా స్లో రైటర్‌ని. దీనికేదో అవార్డు వస్తుందని నేను రాయలేదు. నాకు బాధ కలిగినప్పుడు ఊరట రచన. దు:ఖం కలిగినప్పుడు ఓదార్పు రచన. నా అశాంతికి ప్రశాంతత రచన. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా కథా ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. జీవిత శకలాన్ని పరిపూర్ణంగా కథలో చెప్పగలమనేది నానమ్మకం.

ఆంధ్రప్రదేశ్‌లో వెనుక బడ్డ ప్రాంతమైన కడపజిల్లాలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను నేను. మా నాన్నకు చదువు లేదు. అమ్మక్కూడా చదువుకోలేదు. అమ్మతరపు బంధువులకు కానీ, నాన్న తరపు బంధువులకు కానీ చదువు లేదు. చదువు నా నుంచి మా తరంలో మొదలైంది.

సైకిల్‌ షాపుల్లో పంచర్లు వేసుకోవడం దగ్గరి నుంచి, టీకొట్టుల్లో పనిచేయడం దగ్గర్నుంచి, కుట్టు మిషన్‌ నడుపుకోవడం దగ్గర్నుంచి, గల్ఫ్‌ కంట్రీస్‌కి వలస పోవడం దగ్గర్నుంచి, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవడం దగ్గర్నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే నా కుటుంబం అక్షరం వైపుకు పయనిస్తోంది.

సాహిత్యమంటే ఏంటో మా వాళ్లకు తెలీదు. ఎలాంటి అక్షర నేపథ్యం నాకు లేదు. నేను కథ రాస్తే ‘తిక్కోడు’ అన్నారు మా వాళ్లు. నేను ఏ అమ్మ గురించి కథ రాశానో ఆ అమ్మకే తెలియదు నేనేం రాశానో. వాళ్లూ వీళ్లూ చెప్పగా విని.. ‘‘మా అమ్మ ..నాక్కూడా చదువు చెప్పించి ఉంటే నా బిడ్డ రాసిన కథ నేనూ చదువుకుని ఉందును కదా..’’అని బాధపడేది.
అలాంటి కుటుంబం నుంచి అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నాకు ఈ అవార్డు నిజంగానే ఒక అద్భుతం. భారతదేశంలో సెక్యులరిజం అనే మాటకు రూపమనేది ఏదైనా ఉంటే అది మా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ముస్లిమని నేను గర్వంగా చెబుతాను. వాళ్ల జీవితాలనే నేను కథలుగా రాశాను కాబట్టి, వాళ్ల జీవితాలకే ఈ అవార్డు ఇచ్చారని నమ్ముతున్నాను కాబట్టి దీన్ని వాళ్లకే అంకితం చేస్తున్నాను.

(మార్చి 22న గౌహతిలో శుక్రవారం రోజు జరిగిన అవార్డ్ ప్రదానోత్సవ సభ లో చదివిన ప్రసంగం)

Download PDF

22 Comments

  • “నేను ఏ అమ్మ గురించి కథ రాశానో ఆ అమ్మకే తెలియదు నేనేం రాశానో.” – ఆ అమ్మకి జేజేలు.

    “భారతదేశంలో సెక్యులరిజం అనే మాటకు రూపమనేది ఏదైనా ఉంటే అది మా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ముస్లిమని నేను గర్వంగా చెబుతాను.” – ఇలా చెప్పగలిగిన గొంతుకు జేజేలు

  • rajani says:

    షరీఫ్ ,అమ్మ కూడా
    చదువుకుంటే అనే మాట చదివితే బాధగా అనిపించింది. నిజమే కదా ఈ మద్య నేను అమ్మకోసం రాసినప్పుడు కూడా నాకు అదే ఆలోచన వచ్చింది. మీ జుమ్మా కథ నేపద్యం బాగుంది.

  • రమాసుందరి says:

    ” భారతదేశంలో సెక్యులరిజం అనే మాటకు రూపమనేది ఏదైనా ఉంటే అది మా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ముస్లిమని నేను గర్వంగా చెబుతాను. వాళ్ల జీవితాలనే నేను కథలుగా రాశాను కాబట్టి, వాళ్ల జీవితాలకే ఈ అవార్డు ఇచ్చారని నమ్ముతున్నాను కాబట్టి దీన్ని వాళ్లకే అంకితం చేస్తున్నాను.” గొప్ప వాక్యాలు.

  • shariffvempalli says:

    ధన్యవాదాలు

  • karthikram says:

    పరదాల వెనుక ఉన్న ముస్లిం జీవితాలను కళ్ళ ముందు అక్షరాల రూపం లో చూపెట్టారు మీ జుమ్మా లో , మీ కథ లు సీమ సాహేబు ల జీవిత చిత్రాలే కాదు , భారత దేశం లో ఉన్న ప్రతి సాహేబు ఇంటి కథ లే అవి . షరీఫ్ ఇంకా మీ కలం నుండి మంచి మంచి కథ లు రావాలని కోరుకుంటున్నాను .

  • షరీఫ్ భాయ్, మీ ప్రసంగం అద్బుతంగా ఉంది… చాల పదాలు మనస్సును హత్తుకున్నాయి… మీరు అనుభవించిన జుమ ను నేను అనుభవించాను…నిజానికి జుమాను “ఈదుల్ జుమా” గా, అంటే ప్రతి జుమా ను ఒక పండుగల జరుపుకొమన్నారు కాని వాస్తవంలో అది మన జీవితాలలో వివిధ రకాలుగా ముద్రలు వేస్తుంది… మీ కథల పుస్తకం చదవాలని నిర్నయిచుకొన్నాను… త్వరలో మళ్లి ప్రతిస్పందిస్తా… ఇన్షా అల్లాహ్.

  • నూర్ బాషా రహంతుల్లా says:

    ప్రసంగం బాగుంది.సగటు ముస్లిం జీవితాన్ని వివిధ కోణాల నుంచి మీ కధలలో వివరించారు.శుభాకాంక్షలు.

    • shariffvempalli says:

      నూర్ బాషా రహంతుల్లా ….ధన్యవాదాలు సర్…

  • “వాళ్ల జీవితాలనే నేను కథలుగా రాశాను కాబట్టి, వాళ్ల జీవితాలకే ఈ అవార్డు ఇచ్చారని నమ్ముతున్నాను కాబట్టి దీన్ని వాళ్లకే అంకితం చేస్తున్నాను.” ఈ హ్యుమిలిటీ, ఈ స్పృహే నిన్ను గొప్ప రచనల వైపుకి తీసుకెళ్తుంది.

  • షరీఫ్ గారు చాలా స్పూర్తికరమైన, సహృదయ విజయపథం మీది. మరిన్ని మంచి కథలు హృదయాన్ని ఆవిష్కరించే కథలు వ్రాయాలి
    అభినందనలు.

  • షరీఫ్ భాయ్ , మీ నేపధ్యం మీ సున్నితమైన మనసు గొప్ప కథకుణ్ణి చేశాయి. సమాజపు కింది పొరల రత్నాలను గుర్తించినందుకు అకాడమి కి ధన్యవాదాలు. ఈ దేశంలో లౌకిక జీవనం ఎక్కడుందో కరెక్ట్ గా గుర్తించారు. మీ నుంచి మరిన్ని మంచి కథల కోసం చూస్తూ

    • shariffvempalli says:

      మీకు మరియు ..సమాజపు కింది పొరల రత్నాలను గుర్తించిన అకాడమి కి ధన్యవాదాలు.

  • ns murty says:

    షరీఫ్ గారూ,

    “భారతదేశంలో సెక్యులరిజం అనే మాటకు రూపమనేది ఏదైనా ఉంటే అది మా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ముస్లిమని నేను గర్వంగా చెబుతాను.” ఇది నిజంగా అక్షర లక్షలు విలువచేసే మాట. దౌర్భాగ్య రాజకీయనాయకుల బారి నుండి మనం కాపాడుకో వలసింది కూడా ఇదే.
    “వాళ్ల జీవితాలనే నేను కథలుగా రాశాను కాబట్టి, వాళ్ల జీవితాలకే ఈ అవార్డు ఇచ్చారని నమ్ముతున్నాను కాబట్టి దీన్ని వాళ్లకే అంకితం చేస్తున్నాను”. మీ వినయం శ్లాఘనీయం, మీ మాటల్లో కూడా నేను చాలా సార్లు గమనించాను. మిమ్మల్ని గొప్ప రచయితగా మలిచి నిలబెట్టేవి కూడా ఈ గుణాలే.
    మీకు నాహృదయపూర్వక అభినందనలు.

  • BHUVANACHANDRA says:

    షరీఫ్ గారూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళూ ఆనందంగా మీరు ఇలా కధలు రాస్తూనే వుండాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను మీ వినయమే మీకు శ్రీరామ రక్ష…ఎందఱో ముస్లిం సోదరులు నాకు స్నేహితులు …నా శ్రేయోభిలాషులు ….మా నాన్నగారు నా చిన్నతనంలో ”ఖురాన్ -ఎ -షెరీఫ్ ”తెచ్చారు ..చింతలపూడి మదార్ సాయిబు గారు నాకు ఆ పవిత్రగ్రంధపు ”విలువ” బోధించే వారు .సెక్యులరిజం గురించి మీరన్నమాట అక్షర సత్యం ….. మరిన్ని రచనలు చేసి మరెన్నో అవార్డు లు మీరు అందుకోవాలని కోరుకుంటూ ……ఆశీస్సులతో భువనచంద్ర

  • “భారతదేశంలో సెక్యులరిజం అనే మాటకు రూపమనేది ఏదైనా ఉంటే అది మా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ముస్లిమని నేను గర్వంగా చెబుతాను.” ఎంత బాగా చెప్పారు! ప్రతికూలతకు దొరికే పాపులారిటీ సానుకూలతకు దొరకదు . మీరు ఇంకా ఎన్నో మంచి కథలు రాయాలని , మరిన్ని పురస్కారాలు పొందాలని , మన దేశంలో సమతా మమతా మరింతగా వ్యాపించేందుకు మీ కథలు దోహదం చెయ్యాలని కోరుతున్నాను !

  • sk.zakir says:

    రియల్లీ మీరు గ్రేట్ …ఏది నేను చెబుతున్న మాట కాదు మీ రచనలే చెబుతున్నాయి . ఇది వాస్తవం .. మీ రచన వ్యాసంగం ఇలాగె కొనసాగాలని కోరుకుంటున్న .ధన్యవాదాలు..

Leave a Reply to shariffvempalli Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)