ఏ నీటి వెనకాల ఏముందో?!

afsar dukeమొదటి సారి ఎక్కడి నించో వొక వాన చినుకు పడ్డప్పుడు ఆ అనుభూతిని నేను ఏ భాషలోకి తర్జుమా చేసుకుని వుంటానో?

అక్షరాలేమీ తెలియనప్పుడు అది వొక ఆనందపు కేరింత అయి వుంటుంది.

వొక సారి నేను మా పెదనాన్నగారి వూళ్ళో కాళ్ళు ఎటు నడిస్తే అటు వెళ్ళి ఎక్కడో వొక చెట్ల గుంపులోకి దారి తప్పాను. దాన్ని అడివి అంటారని కూడా తెలియని వయసులో –ఆ అడివి మధ్యలో ఏ మూల నించో వొక జలపాతం రహస్యంగా చప్పుడు చేసినప్పుడు  భయపడ్డానా? ఆశ్చర్యంలోంచి తేరుకోలేక అలా కూర్చుండి పోయానా?

అప్పుడు కూడా నా చేతుల్లో భాష లేదు.

ఇంకోసారి వొక నిమ్మతోట మధ్యలోంచి వెళ్తూ ఆ పరిమళాల ఉక్కిరిబిక్కిరిలో చివరికి వొక కాల్వ పక్కన నేను తేలాను. రాత్రి చీకటి పడే దాకా ఆ కాల్వలో మునకలు వేస్తూ వొళ్ళు కరిగిపోయేలా స్నానం చేశాను.

అప్పటికింకా  కవిత్వస్నానాలకు ఇంకా అలవాటు పడలేదు.

ఇంకా చాలా సార్లు పూలతో, మామిడి చెట్లతో, రాత్రి నేను నడిచే దారుల్లో అడ్డొచ్చి నన్ను ముందుకు వెళ్లనివ్వని నైట్ క్వీన్ పరిమళాల్లో నేనేమయిపోయానో తెలియదు –

వాటిని వాక్యాల్లోకి మార్చే రహస్యం వొకటి వుందని తెలియని కాలాల్లో!

ఇవన్నీ భాషలోకి తర్జుమా చేసుకుని, వాటిలో నన్ను నేను వెతుక్కునే కాలం కోసం చాలా ఎదురుచూడాల్సి వచ్చింది. నాకు కవిత్వం అంటే ఏమిటో తెలిసిన రుతువు వచ్చేంత వరకూ వాటిని దాచిపెట్టుకోవాల్సి వచ్చింది ఎక్కడో మనసు ముడతల కింద- ఇంకా చిన్నప్పటి ఆటల భాషలో చెప్పాలంటే ఎక్కడో వెన్నెల కుప్పల్లో…!

*

ఇదిగో ఈ వాక్యాల ఆసరా కూడకట్టుకొని వెళ్ళాను, నార్త్ కెరోలీన స్టేట్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ వేదిక మీదికి!

కవిత్వాన్ని గురించి యూనివర్శిటీ వేదికల మీద మాట్లాడ్డం నాకు కొత్త కాదు. అమెరికా వచ్చాక నా క్లాస్ రూముల్లో సరే, బయటి యూనివర్శిటీలలోనూ మాట్లాడుతూనే వుంటాను. కానీ, ఏప్రిల్  19, 20 తేదీల్లో నార్త్ కెరోలీన స్టేట్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీలు కలిసి నిర్వహించిన Environment Across the Disciplines:  Perspectives from India and Beyond సదస్సులో మాట్లాడడానికి ఆహ్వానం వచ్చినప్పుడు మొదట నేను సంశయించాను.

ఎందుకంటే, అందులో మొదటి రోజు సదస్సులో మాట్లాడే నలుగురూ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ రంగంలో నిపుణులు. రెండో రోజు మాట్లాడే నలుగురిలో వొకరు చరిత్రకారులు, ఇంకొకరు రాజకీయ నిపుణులు, మరొకరు ఆర్థిక నిపుణులు. నాలుగో వాణ్ని చివరి వాణ్ని నేను! వాళ్ళు అంకెల్లో మాట్లాడ్తారు, గ్రాఫులతో మాట్లాడతారు. కవిత్వాన్ని గురించి మాట్లాడే నేనేం చేయాలి? అంకెల్లో నేను మహా పూర్! గ్రాఫులతో నాకు ఎప్పుడూ పని లేదు. నా కవిత్వ భాష వాళ్ళకి అర్థమయ్యే ప్రసక్తే లేదు అనుకున్నా.  వెంటనే నేను ఆ ఆహ్వానాన్ని వద్దనుకున్నా.

కానీ, అవతల నించి ఎప్పటి నించో తెలిసిన Sandria Freitag, నేను ఏ అకడమిక్ సమావేశంలో కనిపించినా నన్ను వెంటనే డిన్నర్ కి లాక్కు వెళ్ళి కబుర్లలో ముంచెత్తే David Gilmartin రంగంలోకి దిగారు, ‘వచ్చి తీరాల్సిందే!” అంటూ!

“ నేనొక పెద్ద disaster అవుతాను ఆ సైంటిస్టుల మధ్య!” అనేశాను ఎలాంటి సంకోచం లేకుండా! “అవన్నీ కాదు. నువ్వొస్తున్నావ్!” అని ఏకంగా టికెట్ పంపించేశారు.

అంతే! నాకు అలవాటు లేనే లేని  ప్రేక్షక సమూహంతో మాటలు కలపడానికి నేను సిద్ధం కాక తప్పలేదు.

2

            “I begin where numbers fail and fumble, I turn my face to what these lines of graph not dare to capture the curved lines of emotions and senses. Here I speak straight into an emotional face of humanity that we miss in the name of statistics.”

ఆ మొదటి వాక్యానికి చప్పట్లు మోగాక నా గుండె చప్పుళ్ళు కుదుట బడ్డాయి. మొదటి వాక్యం నెగ్గుకొచ్చాక తరవాతి నడక దానికదే సాఫీగా సాగిపోతుందన్నది నా కవిత్వ ఫిలాసఫీ.

నేను మాట్లాడాల్సిన విషయం: Fluid Poetics: Visions and Revisions in Contemporary Indian poetry. అయితే, అక్కడ Fluid అన్న మాట కేవలం కవిత్వ శిల్పానికి సంబంధించిందే కాదు. కవిత్వ వస్తువు కూడా…దాన్ని నేను water అనే అర్థంలోకి మార్చుకున్నా. అంటే, నేను ఈ environment గురించిన సదస్సులో ‘నీటి’ ని వస్తువుగా తీసుకున్న కవిత్వం ఎలాంటి ప్రవాహగతితో సాగిపోతుందో చెప్పడానికే పరిమితమయ్యాను. కవులు నీటి చుట్టూ ఎలాంటి అనుభవాలు చెప్తారో, ఆ అనుభవాలని నడిపించే vision ఏమిటో, కాలగతిలో ఆ vision ఎలాంటి  revision కి లోనవుతుందో చెప్పుకుంటూ వెళ్లాలన్నది నా ఉద్దేశం. ఈ సందర్భంలో అప్పుడు నీటికి సంబంధించిన నా  అనుభవాలు- వాన చినుకు, నదిలో ఈత, కాల్వతో శరీరం పరుగులు – ఇవన్నీ నాకు వస్తువులే. ఇస్మాయిల్ గారు నది మీద రాసిన పద్యాలే కాదు, కొంచెం కవితాత్మకంగా అనిపించే పెద్దిభొట్ల గారి గ్లాసులో నీళ్ళ కథ ని కూడా వదల్లేదు.

అంటే, వాన గురించీ, నదుల గురించీ కవి వొక దశలో అమాయకంగా మాట్లాడినా, ఇంకో దశలో ఆ అమాయకత్వాన్ని వదులుకొని, వాస్తవికత వేపు వెళ్ళక  తప్పదని నా మౌలిక వాదన. అందుకే, ఇస్మాయిల్ గారికి బావి సొట్టపడ్డ బుగ్గలా కనిపిస్తుంది. అదే బావి సతీశ్ చందర్ కి రెండు కలవని కనుపాపలుగా కనిపించి అతని దళిత అస్తిత్వాన్ని చెప్తాయి. మామూలు కవికి సముద్రాన్ని చూడగానే మనసు కేరింతలు కొడితే, తెరేష్ బాబు లాంటి అస్తిత్వ ముద్ర వున్న కవికి హిందూ మహా సముద్రంలో ‘హిందూ’త్వం కనిపిస్తుంది.

గ్లాసెడు నీళ్ళ కోసం తపించే చోటే ఆ నీళ్ళు వ్యాపార వస్తువు అయిపోవడం గోపి లాంటి కవిని గాయపరుస్తుంది. చిన్నప్పుడు కలిసి ఈతలు కొట్టిన చెరువులే వున్నట్టుండి ‘మతం’ ముద్రలు పడే ఎడబాటు వొక ముస్లిం కవిని దిగులు పెడ్తుంది. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే గుండె ఉప్పొంగే నేల ఇంకో చోట ఆ గుక్కెడు నీళ్లూ అందక నోరెండిపోతుంది. అంటే, నీరు అనుకున్నంత సరళమూ కాదు, అమాయకమూ కాదు. ఆ నీటి వెనక గతముంది,  బాధలున్నాయి, కథలున్నాయి. మన భవిష్యత్తూ వుంది.

3

          వొక నలభై అయిదు నిమిషాల నా ప్రవాహం తరవాత సదస్సుని చైర్ చేసిన దక్షిణాఫ్రికా ఆర్థిక నిపుణుడు క్లిఫర్డ్ గ్రిఫిన్ చర్చ మొదలు పెట్టారు. నా ప్రసంగం అంతా వొక ఎత్తు, ఆ తరవాత అరగంట పైగా జరిగిన చర్చలో  నేను ఉక్కిరిబిక్కిరయిన సన్నివేశం ఇంకో ఎత్తు. అది మరో సందర్భంలో…!

కొసమెరుపు:

సదస్సు అయిపోయిన తరవాత రాత్రి డిన్నర్ లో ఈ సదస్సు నిర్వహించిన అయిదుగురూ చేతులూ జోడించి “మీరు వచ్చు వుండకపోతే, మేము disaster అయి వుండే వాళ్ళం! You really struck the real chord!” అందరి ముందూ అనడంతో నా మనసు తేలిక పడింది.

Download PDF

23 Comments

 • mythili says:

  కాకపోతే ఏమిటి ..శాస్త్రవేత్తలందరూ సూత్రాలు సరిచేసుకోవలసిందీ, సేదదీరవలసిందీ కవిత్వంలోనూ సంగీతంలోనూ..
  అభినందనలు సర్

  • ఎవరయినా సేద తీరాల్సింది చివరికి సాహిత్యంలోనే…అని నాకు అనిపిస్తుంది. అయితే, రచయితలు ఒక దశలో ఆ ‘సేదతీరే’ లక్షణాన్ని కోల్పోడం వల్ల రచనలు రొటీన్ అయిపోతున్నాయని ఇటీవలి నా బాధ.

 • Ravi says:

  “మొదటి వాక్యం నెగ్గుకొచ్చాక తరవాతి నడక దానికదే సాఫీగా సాగిపోతుందన్నది నా కవిత్వ ఫిలాసఫీ.”
  Inspiring line అఫ్సర్ గారు.

 • సుజాత says:

  మీ వచనం కూడా ఉత్తమ స్థాయి కవిత్వం లా రసాలూరుతూ ఉంటుందన్న దానికి ఈ వ్యాసమే సాక్ష్యం! మీ క్లాసులో కూచుని కమ్మని పాఠం విన్నట్లుంది అఫ్సర్ జీ

  • సుజాత గారు, కవిత్వమూ వచనమూ రెండూ వొక్కవేరు నించే వచ్చి, విడిపోయే కొమ్మలు కదా! తల్లివేరు కనిపిస్తూనే వుంటుంది. కాదంటారా?

 • Ismail says:

  After reading the poetic-prose of Afsar I was transplanted to May of 2010, when I made sacred pilgrimage to ‘Walden Pond’, the land of ‘Henry David Thoreau’ and re-absorbed the exhilarating feeling I had after plunging into it’s waters…Thank you sir.

 • కాజ సురేశ్ says:

  చాలా బాగుంది అఫ్సర్ గారు. పైన సుజాత గారు చెప్పినట్టు, మీ ప్రోజులో కూడా చక్కటి కవిత్వము సమ్మిళితమైయుంటుంది.

 • Saikiran says:

  చాలా బాగుందండి. నీటి మీద మరో పది సంగతులు చెప్పమన్నా దేనికదే సాటిగా చెప్పగలరు. ఆమాటకొస్తే కవిత్వానికి సంబంధించిన ఏ విషయమైనా సరే, వచనం వ్రాయటంలో మీకు మీరే సాటి! ఒక్కోసారి ఆ వాక్యాలు చదువుతుంటే, అయ్యో కవిత్వంలా మనగలిగిన వాక్యాలు వచనంలో పెట్టేసారే అనిపిస్తు ఉంటుంది. ఉదాహరణకి, ఈ వ్యాసంలో మొదటి పది లైనులు అద్భుతమైన కవిత్వం! హ్యాట్సాఫ్ అఫ్సర్ గారు.

  • సాయికిరణ్ గారూ, మీ మాటలు కాసింత ధైర్యం! వచనం రాయడం కష్టమే…కష్టమే..కష్టమే!

 • “I begin where numbers fail and fumble, I turn my face to what these lines of graph not dare to capture the curved lines of emotions and senses. Here I speak straight into an emotional face of humanity that we miss in the name of statistics.

  Splendid!

 • అభినందనలు అఫ్సర్ గారు,.మాటల్ని కవితా ప్రవాహన్ని చేసి ,.వేదికపై స్ఫూర్తివంతమైన విజయాన్ని అందుకున్నందుకు,..

  • భాస్కర్ గారూ, కొన్ని సందర్భాలు ప్రవాహం, కొన్ని నత్త నడక…ఈ సారి ఆ ప్రవాహం సందర్భ ప్రభావమే!

 • Prasuna says:

  అభినందనలు అఫ్సర్ జీ. కవితాత్మకంగా ఉన్న వ్యాసాన్ని చదవడం ఎంత బావుంటుందో. అన్నిటికీ మించి మీరు ప్రసంగాన్ని మొదలెట్టిన తీరు, చెప్పాల్సిన విషయానికి ఎంచుకున్న దారి చదువుతూంటే స్వయంగా వినాలని ఉంది.

  • సారీ, ప్రసూన గారు, ‘స్వయంగా వినే’ అవకాశం లేదు. వీడియో దొరికే అవకాశం లేదు.

 • వచనమందు కవుల వకానమ్ము వేరయా !! :)
  అభినందనలు అఫ్సర్.

 • కిరణ్ గారు అన్నట్టు మొదటి పది లైన్లు అద్భుతమైన కవిత్వం. చాలా బావుంది అఫ్సర్ జీ!

 • raghava charya says:

  గ్రేట్. కవిత్వం కాదు. కాంప్ర హేన్షన్. అదే ఆ ప్రవాహాన్ని ఇస్తుంది. కానీ అది సందర్భ ప్రభావమే అంటే… అది పూర్తిగా ఫిలసాఫికల్. (కాలం గొప్పదనం ఒప్పుకున్నారు కాబట్టి). పొయెటిక్ గా చెప్పమంటే ‘ ఆ ప్రవాహ ప్రభావం’ దేనిదని చెబుతారు. ఇది సరదాగా అప్రస్తుత ప్రసంగం. మీరు ఒక విషయంలో గమ్మత్తుగా కనిపిస్తారు. అదేంటంటే కవిత్వం ముసుగులో.. మనసుకు ఇవతల ఉన్నది మొత్తం చూసేస్తారు. (మళ్లీ) గ్రేట్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)