మరొక ప్రయాణం మొదలు

1vadrevu

ఏప్రిల్ సాయంకాలం. కురిసి వెలిసిన వాన .

కనుచూపు మేరంతా ఒక ప్రాచీన నిశ్శబ్దం,

కరెంటుపోయింది. ఇంకా ఎలక్ట్రిక్ తీగలు పడని

నీ చిన్నప్పటి గ్రామాల వెలుతురు నీ చుట్టూ.

 

ఆకాశానికి అడ్డంగా పిండి విదిలించి చెట్ల

కొమ్మలమీద ఆరేసిన ఎండ.ఆకులకొసలు

కురుస్తున్న కాంతితునకలు, రోడ్లమీద

మళ్ళా మనుష్యసంచారపు తొలిక్షణాలు

పల్చనిగాలిలాగా చీకటి. అపార్టుమెంట్ల టవర్లు

ఎక్కుతూ పున్నమిచంద్రుడు. ఎవరో సైగ

చేసినట్టు మేడపైకి వెళ్తావు,పిట్టగోడదగ్గర

కుర్చీలాక్కుని కూచుంటావు, మళ్ళీ కిందకి.

 

నీకు చాలా ఇష్టమైన మనిషి ఇంటికివచ్చినట్టు

నీలో ఒక కలవరం. సంభాషణ మొదలుపెట్టలేని

అశక్తత. వినాలో మాట్లాడాలో అర్థంకానితనం

ఏదో పుస్తకం తెరిచి పుటలు ఊరికే తిరగేస్తావు

 

నీలో ఏదో జరుగుతోందని నీకు తెలుస్తుంది

మళ్ళీ పైకి వెళ్తావు, మేడమెట్లమ్మట విరిగి

పడుతున్న అలలు. తళతళలాడే నీడలమధ్య

నావలాగా డాబా. మరొక ప్రయాణం మొదలు.

Download PDF

5 Comments

 • Rammohan rao Thummuri says:

  ప్రాచిన నిశ్శబ్దం ,కరెంటు తీగలుపడని వెలుతురు,నావ లాగా డాబా అనుభూతిని కలిగించే చిక్కని పదాలు .మరొక ప్రయాణం మొదలయ్యే ముందు ఏదో జరగబోతూందనే అవస్థను చాలా బాగా చూపించారు.

 • బయట వర్షం కురుస్తున్నపుడు, ‘ఆ క్షణం’ లో ఆ సుందర దృశ్యాన్ని పదిలపరచుకోవాలని ఆశపడితే, కెమెరా చేతిలో వుంటే ఫోటో తీసుకుంటాము….ఇంకా వీలయితే, వీడియో !….కానీ, ‘ఆ క్షణం’ లో, అంతరంగ లోకంలో కురిసే ఆనందాన్ని కడు సుందరంగా పదిపరచుకోవడం ఎవరికి సాధ్యం?…గొప్ప భావుకుడైన ఒక్క కవికి తప్ప!

 • m s naidu says:

  bhadrudugaaru namaste. you have disappointed as a poet with this poem.

 • Prasuna says:

  చాలా బావుందండి. వాన కురిసిన తరువాత కలిగే అలజడిని కళ్ళకు కట్టినట్టు వివరించారు.

 • akella raviprakash says:

  “ఆకాశానికి అడ్డంగా పిండి విదిలించి చెట్ల

  కొమ్మలమీద ఆరేసిన ఎండ.ఆకులకొసలు

  కురుస్తున్న కాంతితునకలు, రోడ్లమీద

  మళ్ళా మనుష్యసంచారపు తొలిక్షణాలు”

  బ్యూటిఫుల్ lines

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)