రఫీ – ఘంటసాల: ఇద్దరూ ఇద్దరేనా?

“రఫీ, ఘంటసాల – వీళ్లిద్దరిలో నీకెవరెక్కువిష్టం?” ఇదొక క్లిష్ఠమైన ప్రశ్న. దీనికి సమాధానం గత ముప్ఫై ఏళ్లలో కనీసం మూడు నాలుగు సార్లన్నా మారింది, వాళ్ళ పాటలు పది కాలాలు అలాగే నిలబడి ఉన్నా. “నాకిద్దరూ ఇష్టమే” అని చెప్పి చల్లగా తప్పించుకోవటం ఈ మధ్య అబ్బిన డిప్లోమసీ గానీ, “అన్నీ తెలిసిన” రోజుల్లో బీభత్సం గా  వాదోపవాదాలు జరిపిన ఉదంతాలున్నాయి.

“అసలీ పోలికలెందుకు” అంటారా? ఎప్పుడో పుట్టిన బ్రాడ్ మ్యాన్ ని, సదాబాలుడైనటువంటి టెండూల్కర్ ని, పోల్చి, పోల్చి, మన సచిన్ కే ప్రధమస్థానాన్ని అంటకట్టేసి తృప్తి పడిపోయాం కదా. అలాంటప్పుడు, సమకాలీకులు అయిన ఈ ఇద్దరు మహాగాయకులను పోల్చటాన్ని ప్రశ్నించటం, కొంత వింతగానే ఉన్నా, సమాధానం మాత్రం,  వారిద్దరి పాటలను మరల గుర్తు చేసుకొని తూగిపోవటానికేనని! పన్లో పని, ఎవరు కాస్త ఎక్కువ గొప్పో తేల్చేసుకుంటే, ఓ పక్కన పడి ఉంటుంది, మళ్ళీ మనసు మారే దాకా.

తెలుగుదేశంలో పుట్టి, ఘంటసాల పాటలతో పరిచయం గురించి ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈయన పాటలు వింటూ పెరిగాం. ఆ రోజుల్లో, రేడియోలో “భూలే బిశ్రే గీత్”, ఢిల్లీ దూరదర్శన్ వారు ప్రసారం చేసే చిత్రహార్ పుణ్యమా అని అనేక హిందీ పాటలు కుడా వినే అవకాశం ఉండేది. కానీ “యోడేలే..యోడేలే యోహూ…” అంటూ పాడే కిషోర్ కుమార్ పాటలు క్యాచ్ చేసినంత త్వరగా, రఫీ పాటలు తలకెక్కేవి కావు. కటీ పతంగ్, ఆరాధనా, ఇలా రాజేష్ ఖన్నా, కిషోర్ కలయికలో వచ్చిన పాటలంటే పిచ్చ క్రేజ్ ఉండేది.

ఆ నేపధ్యంలో, ఇంజనీరింగ్ చదువుతున్న నా మావయ్య ఓ వేసవి శలవల కోసం ఇంటికి వచ్చాడు. “క్యా హువా? తేరా వాదా!” అంటూ రఫీ పాటను తను హమ్ చేస్తుంటే, నా ప్రతిభ చూపించుకోటానికి, కిషోర్ పాటలు హై వాల్యూం లో పాడేస్తూ, అతడెంత గొప్పవాడో అని, తెగ పొగిడేశాను. “ఆరాధనా పాటల్లో నీకు అన్నిటి కంటే బాగా నచ్చిన పాట ఎంటో చెప్పు” అని మావయ్య అడగటంతో, ఆలోచనలో పడిపోయా. నాకసలు “మేరె సప్నోంకి రాణీ కబ్ ఆయేగీ తు” తప్ప ఏ పాటా తెలియదు, ఆ సినిమా నుంచి. మావయ్యే ఒక క్యాసెట్ ఇచ్చి, విని, మర్నాడు చెప్పు అన్నాడు.

మరుసటి రోజు నేను గర్వంగా మా మావయ్య ముందుకొచ్చి “గున్ గునా రహే హై భవర్…ఖిల్ రహి హై కలి కలీ” అంటూ పడేశా. నీకెందుకా పాట నచ్చిందని ప్రశ్నిస్తే, “ఆ పాట వింటూ ఉంటే, నిజంగానే ఎదో తుమ్మెద మెలమెల్లగా తోటలో పువ్వుల మీద ఎగురుతున్నట్లుగా కళ్ళ ముందు కనిపించింది” అని చెప్పినట్లు గుర్తు. ఆ తరువాత అది పాడింది రఫీ అని తెలియటం, ఇంకా అనేకమైన రఫీ పాటలు విని, కేవలం కిషోర్ పాటల్నే వినాలనే యావ, తగ్గటం జరిగిపోయాయి.

రఫీ-ఘంటసాల పోలిక మాత్రం ఇంజనీరింగ్ చదువుకై పిలానీ లో ప్రవేశించిన తరువాతే మొదలయ్యింది. మా వింగ్ లో ఉన్న నార్త్ ఇండియన్లకి ఘంటసాల అంటే ఎవరో, అస్సలు తెలియకపోవటం చూసి బాధేసింది. ఘంటసాల అనే మహా గాయకుడు ఒకాయన సౌత్ లో అనేక పాటలు రఫీ కి దీటుగా, కొన్ని పాటలు రఫీ కంటే అద్భుతంగా పాడేశారని చెప్తే, అనుమాదాస్పద లుక్స్ ఇస్తూ పెదవి విరిచెయ్యటం చూసిన నాకు, ఘంటసాలని వాళ్ళ ముందు ప్రూవ్ చేసేద్దాం అని పట్టుదల పెరిగిపోయింది. ఫలితంగా ఎన్నో వాదాలు, వివాదాలు, దెప్పిపోడుపులతో, చాలా  సెమిస్టర్ల రాత్రులు గడచిపోయాయి. ఆ గిల్లికజ్జాలని ఇప్పుడు గుర్తుకు చేసుకొని నవ్వుకున్నా, ఆ పాటలు మాత్రం అలాగే గుర్తుండిపోయాయి.

సంగీత దర్శకుడు నౌషద్ తన పాటలకి హిందుస్తానీ సంగీతం లోని రాగాలను ఆధారం చేసుకొని బాణీలు కట్టేవారు. అవి పాడాలంటే రఫీ వల్లే సాధ్యం అనుకొనేవాళ్ళుట ఆ రోజుల్లో. ”బిజు బావరా” లోని ప్రతి పాటా బాగుంటుంది. అన్నిటిలోకి ప్రాచుర్యం పొందిన పాట “ఓ..దునియా కే రఖ్ వాలే”. దర్బారీ (కర్నాటక సంగీతం లో దర్బారీ కానడ) రాగంలో కట్టిన ఈ పాటని, రఫీ పదిహేను రోజుల పాటు ప్రాక్టీసు చేసిన తరువాత  కానీ రికార్డు చెయ్యలేదట. ఇది చాలా క్లిష్ఠమైన రాగం, దానికి తోడు నౌషద్ గారు దీనికి ఎనుకున్న శ్రుతి కూడా హెచ్చు గానే ఉంటుంది. ఈ పాట చివర్లో “రఖ్ వాలే” అంటూ తారాస్థాయిలో రఫీ గళం వింటుంటే, శ్రోతలుగా మనకే భయం వేస్తుంది, ఆయన గొంతు పగిలిపోతుందేమోనని.
http://www.youtube.com/watch?v=FIZ3EHG15co

మన ఉత్తర భారత మిత్రులు రఫీ గాన సౌరభాన్ని కొనియాడాలంటే విరివిగా ఉదహరించేది ఈ పాటనే. అదే రాగంలో ఘంటసాల వారు పాడిన పాట “శివశంకరి, శివానంద లహరి”, “జగదేకవీరుని కధ” నించి. కానీ ఈ అమరగాయకుని గొప్పతనం ఈ పాటలో ఏమిటంటే, ఆ రాగం లోని క్లిష్ఠతని, ఆ పాటలో ఆయన ఇటు మందర స్థాయి నించీ అటు తార స్థాయి లో స్వరాలను తాకిన రేంజ్ ని కానీ ఎక్కడా కష్టపడినట్లుగా కాకుండా అవలీలగా పాడినట్లుగా శ్రోతల అనుకొనేలా చెయ్యటమే. సినిమాలో, ఆ పాటకి పరవశించి, రాయి కరగటం అతిశయోక్తే అయినా, ఆ పాట విని ద్రవించని హృదయం ఉంటుందా?
http://www.youtube.com/watch?v=Atr2iOXvzaQ

ఈ రెండు పాటల ఆధారంగా నచ్చిన గాయకుడికి ఓటు వెయ్యమంటే మాత్రం, నా ఓటు నిస్సందేహంగా ఘంటసాల వారికే!

అలాగే తెలుగులో “కులదైవం”, హిందీలో “భాభీ” సినిమాలలో, ఇంచిమించు ఒకటే సమయంలో పాడిన, “పయనించే ఓ చిలుకా…”, “చల్..ఉడ్ జా రే పంఛీ” పాటలని తీసుకుందాం. ఈ రెండూ, హిందుస్తానీ పహాడీ రాగం ఆధారంగా కట్టిన బాణీలైనా, ఆ శాస్త్రీయ పోకడలు పెద్దగా కనపడవు. పాటలోని ఉదాస భావ వ్యక్తీకరణకే పెద్ద పీట. ఈ రెంటినీ ఒకటే లింకులో క్రింద చూడచ్చు.
http://www.youtube.com/watch?v=TvO3MYzdOqA

ఈ పాటలో ఇద్దరూ దానిలోని  మాధుర్యాన్ని చక్కగా అందిస్తూ, తమ గాత్ర మాడ్యులేషన్ ద్వారా భావాన్ని అంతే అద్భుతంగా వ్యక్త పరిచారనిపిస్తుంది. కానీ కణత మీద గన్ను పెట్టి, ఏదన్నా ఒక్క గాయకుడినే ఎంచుకోవాలంటే మటుకు, తప్పని సరి పరిస్థితుల్లో రఫీ కి నా ఓటు వేసేస్తా. పాట చివరిలోని ఆలాపనలో, ఓ పిసరంత  న్యాయం రఫీ ఎక్కువ చేశారేమోనన్న చిన్న సందేహం వల్ల.

ఒక సినిమాని, రీమేక్ చేసినప్పుడు, చాలా సార్లు సిట్యుయేషన్ ఒకటే అయినప్పటికీ, పాటలకి వేర్వేరు బాణీలు ఉంటాయి, ముఖ్యంగా సంగీత దర్శకులు వేరైనప్పుడు. “గుడిగంటలు” సినిమా లోని “జన్మమెత్తితిరా అనుభవించితిరా…”, “ఆద్మీ” సినిమా లోని “ఆజ్ పురానీ రాహోం సే..” పాటలు ఈ కోవలోకే వస్తాయి. రెంటిలోని సారూప్యం, ఆ పాటల చలనంలో కనిపిస్తుంది. కానీ, ఈ పాటల్లో కుడా భావ ప్రకటనకే ఎక్కువ ప్రాముఖ్యత కనపడుతుంది. ఎవ్వరి పాట మనల్ని ఎక్కువగా కదిలిస్తుంది అని నిజాయితీగా పరిశీలిస్తే మాత్రం మనం ఏ ఒక్క దాన్నీ ఎంచుకోలేకపోవచ్చు.

రఫీ పాట లింకు: https://www.youtube.com/watch?v=ekqWt98qaWc
ఘంటసాల పాట లింకు: https://www.youtube.com/watch?v=Lz7-toTMMQw

జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయి, తన గతంలోని  అంధకారాన్ని గుర్తు చేసుకుంటూ, చివరికి వెలుగుని చూసిన ఒక వ్యక్తి వ్యధే, ఈ పాటలో మనకు వినిపించేది. ఇద్దరి గళాలలోను ఆ పాత్ర యొక్క ఆవేదననూ, పశ్చాత్తాపాన్నీ, వెలుగు చూసిన ఆనందాన్నీ, ఒలకటాన్ని మనం గమనించవచ్చు. ఈ సారి గన్ను పెట్టినా, కాల్చుకో అని కళ్ళు మూసుకుంటానే తప్ప ఏ ఒక్కరినీ ఎంచుకోలేనేమో అనిపిస్తుంది.

వీరిద్దరి మధ్యా నా ఉహాలోకంలో చిత్రీకరించుకున్నటువంటి సంగీత సమరంలోని ఆఖరి అస్త్రం సువర్ణసుందరి సినిమా నుంచి. ఆ సినిమా పేరు వినంగానే మనకు గబుక్కున గుర్తుకు వచ్చే పాట “హాయి హాయి గా ఆమని సాగే..ఊగిపోవు మది ఉయ్యాలగా~~~~~~ జంపాలగా~~~~~~”. ఈ సినిమాని అదే పేరుతో అదే తారాగణంతో తెలుగులోనూ హిందీలోను నిర్మించటం తో పాటు, ఒకే సంగీత దర్శకుడు ఒకే బాణీని తెలుగులో ఘంటసాల, జిక్కీ, హిందీలో రఫీ, లతా లతో పాడించటంతో, ఆ ఇద్దరూ మహాగాయకుల్నీ తూచటానికి, ఇంతకన్నా మంచి అవకాశం మనకి దొరకదేమో!

కుహూ కుహూ: https://www.youtube.com/watch?v=WCRaxeEe2IU
హాయి హాయి గా: https://www.youtube.com/watch?v=O5ajXn9j1bM

సంగీత దర్శకుడు ఆదినారాయణరావుగారు, రాగమాలిక కట్టి, హంసానందీ, కానడ, జువన్ పురి, యమన్ కళ్యాణ్ లాంటి కర్నాటక, హిందుస్తానీ రాగాల సమ్మేళనంలో ఈ పాటను అజరామరంగా స్వరపరిచారు. కానీ హిందీ, తెలుగూ వర్షన్ లలో ఒక తేడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. హిందీలో, తెలుగులో కంటే కొంచెం హెచ్చు శృతిని ఎంచుకున్నారు దర్శకులు. దీనికి  కారణం, రఫీ బేస్ శృతి హెచ్చుగా ఉండటం కావచ్చు. రఫీ పాటలను మనం కనక పాడే ప్రయత్నం చేస్తే మనకే తెలిసిపోతుంది, రఫీ తారా స్థాయిని మనం అందుకోవటం కష్టమని.

ఈ పాట శాస్త్రీయసంగీతం ఆధారంగా చేసిన పాటలు పాడటంలో గల రఫీ యొక్క “లిమిటేషన్సు” ని తేటతెల్లం చేస్తుంది. ఘంటసాల వారు, ఎంతో అవలీలగా, హాయిగా, తమ స్వరలహరిలో మనను డోలలూగిస్తే, రఫీ మాత్రం చాలా కష్టపడ్డట్టుగా కనిపిస్తారు. ఇది గమనించటానికి పెద్ద సంగీతజ్ఞానం అవసరంలేదు. ఒక్క సారి కళ్ళు మూసుకొని ఆ రెండు పాటలనూ వింటే చాలు!

కానీ, వింత ఏమిటంటే, జాతీయస్థాయిలో తెలుగు పాటకు అంత గుర్తింపు రాకపోగా, రఫీకి నేషనల్ అవార్డు రావటం! ఈ ఒక్క పాట విని ఘంటసాల, రఫీలలో ఎవరు కొంచెం ఎక్కువ గొప్పో ఎంచుకోమంటే, ఒక్క క్షణం ఆలోచించకుండా ఘంటసాలకి బ్రహ్మరధం పట్టేయ్యచ్చు.

ఇప్పుడు చర్చించుకున్న నాలుగు పాటల ప్రకారం ఘంటసాలకి రఫీ కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి, ఘంటసాల వారే కొంచెం ఎక్కువ గొప్పని డిసైడ్ అయిపోదామా? మరి అక్కడే వచ్చింది అసలు చిక్కంతా!

వీటిలో చాలా పాటలు శాస్త్రీయ సంగీతానికి దగ్గరగా ఉండే పాటలు. కేవలం వీటిని బట్టి ఎవరు ఎక్కువ గొప్పో నిర్ణయించటం సబబేనా? సినిమా సంగీతంలో అత్యధిక శాతం వినపడేది లలిత సంగీతం. ఎక్కువ సంగతులూ, గమకాలూ లేకుండా, అనేక రసాలనూ, భావాలనూ తమ గాత్ర వైవిధ్యం ద్వారా పలికించటమే, ఈ సంగీతానికి కావాల్సిన ముఖ్య క్వాలిఫికేషన్. మరి ఈ కోణం నించి ఒక సారి రఫీని, ఘంటసాలని పరిశీలించినట్లైతే, పరిణామం వేరుగా ఉండచ్చేమో?

ఒక సాఫ్ట్ రొమాంటిక్ జానర్ ని గనక మనం తీసుకొంటే, రఫీని మించిన వారు లేరనిపిస్తుంది. “పుకార్ తా చాలా హు మెయిన్…”  అంటూ పట్టు లాగా జారి పోయే గళం తో పాడినా,  “దీవాన హువా బాదల్…సావన్ కి ఘటా ఛాయీ” అంటూ ఒక విరుపు విరిచినా, “చాహే ముఝె కోయి జంగ్లీ కహే…యాహూ” అంటూ ఆనందావేశంతో అరిచేసినా, “బహారోం ఫూల్ బర్సావో…మేరె మెహబూబ్ ఆయా హై” అంటూ తేనెలోలికే స్వరంతో ప్రియురాలికి స్వాగతం పలికినా, రఫీ ని మించిన సింగర్ లేడేమో అన్న అనుమారం రాక తప్పదు. ఘంటసాల వారికి రొమాంటిక్ గీతాలు లేవని కాదు, ఆ భావాలు పలకాలంటే రఫీ గారి గళానికే కొంచెం ఎక్కువ నప్పుతుందని నా నమ్మిక.

భక్తిరసాన్ని తీసుకుంటే ఘంటసాల వారిదే నిర్ద్వందంగా పై చేయి. “హే కృష్ణా ముకుందా…” అంటూ గళమెత్తి ఆ గోవిందుదిని సంబోధించినా, “నీలకంధరా దేవా..దీన బాంధవా రావా” అంటూ ఆ పరమశివుడిని బ్రతిమాలినా, “దినకరా…శుభకరా” అంటూ సూర్యభగవానుడికి స్వాగతం పలికినా, “శేషశైలావాస..శ్రీ వేంకటేశా” అంటూ శ్రీపతికి మేలుకొలుపు పాడినా, గీతాగానం చేసినా, ఆయన కలిగించే భాక్తిభావావేశం బహుశా ఇంకెవ్వరూ కలిగించలేరేమోననుకోవటం, అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.

మొదట్లో చెప్పాను, ఇద్దరిలో ఎవరెక్కువ ఇష్టం అనే దానికి సమాధానం మూడు నాలుగు సార్లైనా మారిందని. దానికి కారణాన్ని కనుక పరిశీలించుకొని చూస్తే, అది మన మానసిక పరిస్థితి, జీవితం లో మనం ఉన్న మైలురాయి, ఇటువంటి వాటి మీద ఆధారపడి ఉండవచ్చనిపిస్తుంది.

రొమాంటిక్ పాటలు మాత్రమే వినాలనిపించేటటువంటి మూడ్ లో కానీ వయస్సులో కానీ, రఫీ వైపు కొంచెం ఎక్కువ మనసు లాగినా, శాస్త్రీయ సంగీతాన్ని సినిమా సంగీతంలో వెతుక్కుందామనో, లేక భక్తి సంగీతాన్ని ఆస్వాదిద్దమానో అనిపించినప్పుడు మాత్రం ఘంటసాల వారి వైపు, మన ధ్యాస మళ్ళటం అనివార్యమనిపిస్తుంది.

ఇలా వివిధ కోణాల నించి ఈ ఇద్దరు మహాగాయకుల్నీ చూసిన తరువాత మాత్రం, నాకు లభించిన సమాధానం: “ఘంటసాల, రఫీ, ఇద్దరూ సమానమే, ఘంటసాల మన తెలుగు వాళ్లకు కొంచెం ఎక్కువ సమానం!” మరి, మీకో?

Download PDF

29 Comments

  • సుజాత says:

    అసలు పోలికే వద్దు.
    రఫీ లేకపోతే షమ్మీ లేడు. ఘంటసాల లేకపోతే మన అగ్రనటులూ లేరు..పాటల పరంగా!

    నాకు రఫీ పాటలంటే ప్రాణం. రఫీ పాటలో ఒక లైఫ్ ఉంటుంది. కిషోర్ పాటలో అదేదో మాజిక్ ఉన్నా, రఫీ చూపించిన లైఫ్ తను చూపించలేడని “నా” అభిప్రాయం.

    ఇంత రాసి మీరు రఫీ తెలుగులో పాడిన అక్బర్ సలీం అనార్కలి లో పాటల్ని ప్రస్తావించక పోవడం ఏమిటసలు?

    తారలెంతగ మెరిసేనో
    తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను
    రేయి ఆగి పోనీ రేపు ఆగి పోనీ

    ఈ ఆణిముత్యాలన్నీ లెక్కేయలేదా మీరు? తెలుగైతేనేం?

    • Yaji says:

      సుజాత గారూ, “పోలిక” ఎందుకో, ముందే చెప్పేశాను కదా. రఫీ తెలుగుని బాగా ఖూనీ చెయ్యటం వల్ల ఆయనను ఘంటసాల గారితో పోల్చి పొగుడుతున్నప్పుడు, ఆ పాటల ప్రస్తావన తీసుకురాకపోతేనే బాగుంటుందేమోనని అనుకున్నాను.

      రఫీని ఇంతగా పొగిడిన మీరు, ఘంటసాల గురించి ఒక్క లైను మినహాయించి ఏమీ అనలేదు. వీరిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరో చెప్పేయండి.

  • Subhadra says:

    ఆవకాయ, గోంగూర రెండు మహా ఇష్టం. ఏదో ఒకటి ఎన్నుకోమంటే కష్టం. మూడ్ ని బట్టి ఒకో సారి ఒకరు ఎక్కువ గ్రేట్ గా అనిపిస్తారు మీరు చెప్పినట్టే :)

    • Yaji says:

      తెలుగువారి సిసలైన వంటకం గోంగూరే! గొంగురే కొంచెం ఎక్కువ ఇష్టమా మీకు?

      • Subhadra says:

        తెలుగు వారిగా ఆంధ్ర మాత గోంగూర మీద కొంత అభిమానం ఎక్కువే అయినా ఆవకాయ లేకుండా ఉండగలమా చెప్పండి? గోంగూర చేసిన వెంటనే ఇష్టం, ఆవకాయ ఊరిన తరువాత ఇష్టం.అలాగే భక్తీ రసం లో ఘంటసాల గారివే ఇష్టం , రొమాంటిక్ మేలోడీస్ లో రఫీ గారివి.

  • Venkat says:

    నా వోటు ఘంటసాల గారికే. శివ, నీవన్నట్లు, ఘంటసాల గారు నాకు కొంచం “ఎక్కువ సమానం” :)

  • ramya yaji says:

    Siva garu
    Mee kanna taravata puttinaa,nenu ghantasala gari paatalu radio lo chaala vinnanu.Bhakti rasaanni aa mahaanubhavudu pandinchinattu inkevaru pandinchaleremo anipistundi.

    Meerannattu Ghantasala,Rafi iddaru samaaname kani mana telugu vaariki Ghantasala gaare ekkuva samaanam.

    • Yaji says:

      వెంకట్ గారూ, రమ్య గారూ, చాలా వీజీగా నాతో అంగీకరించేస్తున్నారన్నమాట.

  • మీ రచన చాలా ఎంజాయ్ చేసాను నేను. పాత జ్ఞాపకాలను ఎన్నో గుర్తుకు తెచ్చింది. నాకు ఘంటసాలా, లేక రఫీ నా అన్న జీవన్మరణ సమయ ఎదురవ్వలేదు కానీ, రఫీనా లేక కిషోరా అని కాలేజీ రోజుల్లో కొళాయి దగ్గర సిగపట్ల లెవెల్లో యుద్ధాలు జరిగిపోయేవి.
    ఆంధ్రా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఆదివారం ఉదయం బీచ్కి దగ్గరగా రోడ్డు మీదకి ఉన్న బిల్డింగ్ మీదా కూర్చుని, రెండు జట్లుగా విడిపోయి, ఒక జట్టు “హాయి హాయిగా” అనీ, ఇంకో జట్టు “కుహూ కుహూ కోయల్ బోలె” అని జుగల్బందీ చేసేవాళ్ళం.
    అలానే ఎక్కువగా పోటీ పడి పాడుకున్న పాట అనార్కలి నుండి “యే జిందగీ ఉసీ కి హై”, “జీవితమే మధురమూ”. థాంక్స్ మళ్ళీ ఆ ఆరుత ఖనల్లోకి ఒకసారి ప్రయాణం చేయించినందుకు.

    • థాంక్స్ మళ్ళీ ఆ అమృత క్షణాల్లోకి ఒకసారి ప్రయాణం చేయించినందుకు. (పైన టైపోలకు గానూ మన్నించండి)

  • Yaji says:

    ధన్యవాదాలు పద్మావతి గారూ! మీ కాలేజీ కుళాయి సిగపట్ల ఘట్టం కుడా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇంతకూ మీ ఓటు ఎవరికో చెప్పలేదు!

    • నా ఓటు ఆ ఇద్దరిలో ఎవరికీ కాదు. “క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్” అన్న నానుడి మీద నాకు గౌరవమెక్కువ. :-)

      • Yaji says:

        నా అభిప్రాయం గత ముఫ్ఫై ఏళ్లలో మూడు నాలుగు సార్లు మారిందనుకుంటే మీది క్షణక్షణానికీ మారుతూ ఉంటుందన్నమాట. బాగుంది :)

  • సుజాత says:

    పద్మా, నీతోనే నేనూ! క్షణ క్షణముల్…విషయంలో

    యాజి గారూ, మా పద్మ వల్లిని పద్మావతిని చేశారే!!

    • సుజీ :-)

      మర్చిపోయాను చెప్పడం, రఫీ తెలుగు పాట నాకు ఒక వాక్యంలో ఇమడని పదాలు. నా మది పిలించింది “వేణూ” గానమై అని వింటే చెవుల్లో నిజంగానే సీసం పోసుకోవాలనిపిస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆ క్షణ క్షణముల్ పనిచెయ్యదు నాకు. ఇపుడ బాలూ, హిందీ, మైనే ప్యార్ కియా అంటూ మొదలెట్టకండి. ఆ నహీ ప్యార్ కియాలో నాకు లతా గొంతు కూడా నచ్చదు.

    • Yaji says:

      అయ్యో చూసుకోలేదు. క్షమించెయ్యండి పద్మవల్లి గారు (చక్కటి పేరు!).

  • పద్మా
    నా మది నిన్ను పిలిచింది పాటలో “వేణూ “గానమై అని అనకపోతే తాళానికి రాదోయ్.. అందుకని అలా పాడతాడు రఫీ!(రఫీనేమీ అనకు)

    బాలూ పాటల్లో అభిమానులు క్షమించలేనివి ఏమైనా ఉంటే హిందీ పాట్లే.. :-)

    • Yaji says:

      మీరు రఫీ కి మరీ ఇంత అభిమానులని తెలియదు, సుజాత గారూ, అంటే ఆయన తెలుగు పాటలను కుడా అభిమానించేటంతగా!

  • Ismail says:

    ‘ఘంటసాల’ ప్రత్యూషపు తూరుపు సింధూరం.
    ‘మహమ్మద్ రఫీ’ సాయంసంజె గాఢ కెంజాయ రంగు.
    రెండు వర్ణాల్లో ఏది ఇష్టం అంటే చెప్పడం కష్టం:-)

    • yaji says:

      ఘంటసాల, రఫీ అనంగానే మీ నించి మంచి కవిత్వం జాలువారుతోంది! క్యారీ ఆన్!

  • Ismail says:

    @పద్మవల్లి

    సోమయాజులగారూ…ఈవిడ్ని బ్లాక్ చేసేయండి సార్! ‘మైనే ప్యార్ కియా’ మీద పితూరీలు చెప్తున్నారు:P

    @యాజి
    ఈ సారి “కిశోర్, రఫీ, ముకేశ్” వీరి అభిమానులు ముగ్గురి మధ్యన తగవు పెట్టండి:-)

    • :-)
      @@ఈ సారి “కిశోర్, రఫీ, ముకేశ్” వీరి అభిమానులు ముగ్గురి మధ్యన తగవు పెట్టండి:-)
      ఇక్కడ నాకేదో కుట్ర కనిపిస్తోంది.

  • Yaji says:

    సారీ ఇస్మాయిల్ గారూ. రఫీ, కిషోర్, ముకేష్ మధ్య పోటీ నే లేదు, నా బుక్స్ లో. 1. రఫీ 2. కిషోర్ 3. ముకేష్ :)

  • Ismail says:

    తెలుగులో ఈ పాటకు సాటి ఏది?
    http://youtu.be/5Ud2rsMT5ng

  • ఘంటసాల రఫీ అంత versatile కాదనిపిస్తుంది. ముఖ్యంగా హుషారు పాటలు పాడేటప్పుడు సైతం ఆయన స్వరంలో ఓ విధమైన గాంభీర్యం వినిపిస్తుంది. నా వోటు రఫీకే. తెలుగు వరకూ చెప్పాలంటే ముందు బాలు, తర్వాత ఘంటసాల.

  • Ismail says:

    “…ఈ పాట శాస్త్రీయసంగీతం ఆధారంగా చేసిన పాటలు పాడటంలో గల రఫీ యొక్క “లిమిటేషన్సు” ని తేటతెల్లం చేస్తుంది. ఘంటసాల వారు, ఎంతో అవలీలగా, హాయిగా, తమ స్వరలహరిలో మనను డోలలూగిస్తే, రఫీ మాత్రం చాలా కష్టపడ్డట్టుగా కనిపిస్తారు. ఇది గమనించటానికి పెద్ద సంగీతజ్ఞానం అవసరంలేదు. ఒక్క సారి కళ్ళు మూసుకొని ఆ రెండు పాటలనూ వింటే చాలు!

    కానీ, వింత ఏమిటంటే, జాతీయస్థాయిలో తెలుగు పాటకు అంత గుర్తింపు రాకపోగా, రఫీకి నేషనల్ అవార్డు రావటం! ఈ ఒక్క పాట విని ఘంటసాల, రఫీలలో ఎవరు కొంచెం ఎక్కువ గొప్పో ఎంచుకోమంటే, ఒక్క క్షణం ఆలోచించకుండా ఘంటసాలకి బ్రహ్మరధం పట్టేయ్యచ్చు….”

    ****

    An intersting anecdote by Dr.Shyamala Ghantasala in “నేనెరిగిన నాన్నగారు” (ఘంటసాల జీవిత చరిత్ర) > http://kinige.com/kbook.php?id=1656&name=nEnerigina+naannagaaru

    సువర్ణసుందరి సినిమాని హిందీలోకి రీమేక్,పునర్నిర్మాణం చెయ్యడం కోసం “కుహు కుహు బోలే కోయలియా” పాట రికార్డీంగుకని రఫీని, లతామంగేష్కర్ ని మద్రాసు పిలిపించారు నిర్మాతలు. తెలుగు పాట “హాయి హాయిగా ఆమని సాగే” పాటని వారికి వినిపించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఘంటసాల గొంతులో వున్న సౌఖ్యం, ఈ పాటకి, రఫీ గొంతులో రావడం లేదు అనిపించింది లతా మంగేష్కర్ కి, ఆ పాట రిహార్సల్స్ జరుగుతున్న సమయానికి మరో రికార్డింగుకు అదే స్టూడియోకి వెళ్ళిన ఘంటసాల వీరిని పలకరించడానికి అక్కడికి వచ్చాడు. “మీతో ఒక్కసారి ఈ పాటని పాడాలని వుంది. నా తృప్తి కోసం దయచేసి ఒక్క టేక్ పాడండి. దీనికయ్యే ఖర్చు నేనే పెట్టుకొంటాను. నిర్మాతకి నష్టం కలుగనివ్వను. నాకోసం ఒకే ఒక్కసారి పాడండి” అని చాలా బలవంతం చేసారు లత. నొప్పించకుండా తప్పించుకోవాలని చాలా ప్రయత్నించాడు ఘంటసాల. దీని వల్ల అక్కడ పనికి అంతరాయం ఏర్పడింది. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. గత్యంతరం లేక “క్షమించండి. మిమ్మల్ని నొప్పించాలని కాదు, మీరు యింకేదైనా చెప్పండి, చేస్తాను. కానీ రఫీ గారు పాడడానికి వచ్చినప్పుడు అదే పాటని నేను పాడడం సభ్యత కాదు. కారణం ఏదైనా కావచ్చు. అది నా అహంకారాన్ని చూపించడమే కాదు వారిని అవమానించడమౌతుంది . సాటి గాయకుడిని కించపరచలేను” అని మనసులో మాటని చెప్పి నమస్కరించి వచ్చేసాడు.

    ***

  • yaji says:

    Double Thank you Ismail!!!!!!!!
    1. What a beautiful anecdote.
    2. I wanted to read that book and even posted on Telugu Pustakam asking for the same some time back and no one responded.
    Buying the book right now!
    Thanks again!

  • csrambabu says:

    మీరు కరెక్ట్ గానే చెప్పారు.రొమాన్స్ కి రఫీ ,భక్తికి ఘంటసాల కాని పథొస్ లో ఇద్దరు పోటి పడతారు ..పాడుతా తియ్యగా ,ఆజు పురానిరహోమే రెండు పోటి పడతాయి.మీ రాసి స్టైల్ బావుంది ఇలాంటి హాట్ టాపిక్స్ రాస్తూ వుండండి..

  • జి.ఎల్.విజయ్ says:

    అది రొమాంటిక్ సాంగ్ కావచ్చు ,భక్తి పాట కావచ్చు లేదా ప్రభోధాత్మక గీతం కావచ్చు .
    అన్ని కాలాలలో అన్ని భావాలలో ఈ విధంగానైనా నా ఓటు నిస్సందేహంగా నిస్సంశయంగా మహా మహుడు మహామహితాత్ముడు అమరగాయకుడు అఖిలాండకోటి బ్రహ్మాండ గాయకుడు ఘంటసాల కె.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)