ఒక నిశ్శబ్ద సౌందర్యం : “రంగు వెలిసిన రాజుగారి మేడ”

Uma-featured

rm umamaheswararaoమెహర్ ..! వాక్యం రహస్యం తెలిసినవాడా..ఎవరు నువ్వు? ఎక్కడున్నావ్ ఇంతకాలం? వాన ముంచెత్తిన ఒక పగలు, కుమ్మరి యువకుడు రాజుగారి మేడ చెక్క మెట్లెక్కి రాణికి నిద్రాభంగం కలుగకుండా ప్రేమను గెలుచుకున్నట్లుగా, తెలుగు కథలోకి నిశ్శబ్దంగా అడుగుపెట్టేశావ్! నీ ‘నిశ్శబ్దం వెనుక ఏవో ఘోరాలు’ ఇక్కడ ఊహించబడుతున్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా గుప్పెడు అక్షరాలు రాలుస్తూ ఉండవయ్యా అప్పుడప్పుడూ అయినా, నెర్రెలు బారిపోయి ఎదురు చూస్తున్నాం తండ్రీ , తడి గలిగిన నాలుగు అక్షరాల కోసం.

చిర చిరలాడే మంచి ఎండపూట వేపచెట్టు కిందకి చేరేవాళ్ళం పిలకాయలందరం. పిర్రల మీద చినిగిన నిక్కరూ, మోకాళ్ళ  మీద పొక్కు కట్టిన కురుపూ లేకుండా ఒక్కరూ ఉండేవాళ్ళు కారు. ‘చెంగన్నా, చెంగతాతా, చెంగమామా’అంటా చుట్టు ముట్టే వాళ్ళం. పైగుడ్డ ఒక్కటీ మొలకి చుట్టుకుని నేల మీద చతికిల కూర్చునేవాడు చెంగన్న. చెమట మెరుపుతో నిగనిగలాడే నల్లటి ఒళ్ళు. వీపంతా గుడ్లు గుడ్లుగా తేరిన చెమటకాయలు. కదుం కట్టిన నల్లటి మచ్చలు. చెక్క దువ్వెన మా చేతికిచ్చి కత మొదలు పెట్టే వాడు, ‘అనగనగా. ఒక ఊళ్ళో..’ అంటా. చిటుక్కు పటుక్కు మంటా చెక్క దువ్వెనతో కుక్కతా ఉంటే, చెమటకాయలు చిట్లి నీళ్ళు మా ముఖాల మీదకి చిందేవి. చెమటకాయ చిట్లిన ప్రతి సారీ సగించినట్టుగా అతడు మూలిగేవాడు. ఆ మూలుగు కూడా కతలో భాగం అయిపోయేది. వీపు మీది నల్లటి కదుముల్ని రెండు వేళ్ళ మధ్యా ఒత్తి .పట్టి పిండితే, ట్యూబులోంచి బయటొచ్చే టూత్ పేస్టులా మట్టి లాటి పదార్ధం పిస పిసా వచ్చేది. ‘ఈ మట్టేంది చెంగన్నా?’అని అడిగితే, ‘ లోపల మగ్గి పొయ్యి ఒక్కో కతా బయటకొస్తా ఉండాదిలే’అనేవాడు, నమ్మకంగా.

ఆ మట్టిని వేలికి తీసుకుని, నేలకో, రాయికో పూసేవాళ్ళం అపురూపంగా. పొద్దెక్కక ముందే మిట్టల మిందకి పొయ్యి, కలిగి కంప కొట్టి, పంగాల కర్రతో తొడుగు వీపుమీదకి ఎత్తుకుని, ఏటి గట్టున ఎల్లాయి పొయ్యి దగ్గర ఏసి, ఎండ నడి నెత్తి కొచ్చే వేళకి వేపచెట్టు కిందకి చేరుకునేవాడు మాకు కతలు చెప్పడానికి.

ఏం కతలనీ అవి! రాజుగారి కతలు, రాణిగారి కతలు, కుక్కలు నక్కలు తోడేళ్ళ కతలు. ఎండకో కత, ఎన్నెల్లో ఒక కత. ఎన్ని కతలనీ. చెంగన్న చెప్పే కతల్లో పాత్రలన్నీ మేమే. మా అమ్మలే రాణులు, మా నాయనలే యువరాజులు. చెంగన్న కత చెబుతా ఉంటే మైమరచిపోయి వినాల్సిందే, పిలకాయలయినా, పెద్దోళ్ళయినా.

ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి చాకలి చెంగన్న వంటి మొనగాడొకడు తగిలాడు.

పేరు మెహర్.

ఏం కథ చెప్పాడనీ! రంగు వెలిసిన రాజుగారి మేడ కథ. ఒళ్ళూ పయ్యీ మైమరపించిన కథ. ఒకే ఒక్క కథ, మెహర్ భక్తుడిగా మార్చేసిన మాయ కథ. పాల పిట్టలో అచ్చయిన ఈ కథ, ఎట్లా ఎగిరిపోయిందో గానీ, తుర్రున ఎగిరిపోయింది నాకు దొరక్కుండా. కుప్పిలి పద్మ దొరకపుచ్చుకుని పంపింది, తెల్ల పావురం కాలికి చుట్టి కట్టి. ఇన్ బాక్స్ విప్పి చూద్దును కదా తెల్ల పావురం రెక్కలమీద ఎండిన నెత్తుటి మరకలు. రంగు వెలిసిన రాజుగారి మేడ నుంచి వచ్చే పాత వాసన.

కథ మొదలు పెట్టిన కాసేపటికే, సితార సినిమాలో, ఇంతేసి కళ్ళేసుకుని మేడ మీది కిటికీలోంచి చూసే భానుప్రియ గుర్తొచ్చింది. ‘హబ్బ ..దించేసినట్టున్నాడు కదా మనోడు’,అనుకున్నాను. నిదానంగా, నిశ్శబ్దంగా. అమాయకంగా చిటికెన వేలు పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు ‘సితార’కి దూరంగా శ్రీపాదపట్నంలోకి. మెహర్ మాంత్రికుడు. మాయావి. మహా ప్రమాదకారి. నాగస్వరం ఊదే పాములోడిలా లాక్కుపోతాడు మనల్ని కథలోకి. ‘శ్రీపాదపట్నాన్ని పావురాళ్ళ పట్నమని కూడా అంటారు’అని మొదలు పెడతాడు. కథ పావురాళ్ళ గురించా, శ్రీపాదపట్నం గురించా అని తర్జన పడుతుండగానే ‘నిండా గోపీచందనపు పూతతో మెరుగుపోయిన బంగారపు దిమ్మెల్లా మెరిసిపోయే’రాజవంశీకుల రెండంతస్తుల మేడ ముందు నిలబెడతాడు మనల్ని.

ఆ మేడలో ఇప్పుడు సుబ్బరాజుగారు లేరు, ఆయన ప్రేతాత్మ మాత్రం తిరుగుతోంది, పై అంతస్తులో ఉండే మనుమరాలు రేణుకాదేవిని కాపు కాసుకుంటూ. ఆ భవంతి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టుకుని ఆమె ఎన్నడూ బయటకు రాలేదు. ఉత్సుకతతో ప్రవేశానికి ప్రయత్నించి భంగపడ్డ ఊరు, భయంతో మేడకి దూరంగా జరిగిపోయింది. కువ కువమని మూగే పావురాలతోనే రేణుకాదేవి స్నేహం. కబుర్లూ, కష్టాలూ, గొప్పలూ, చాడీలూ అన్నీ వాటితోనే. ‘మార్దవమైన, స్నేహితం తెలిసిన రాణి’కి ఒక తెలుపు రంగు పావురం అంటే బాగా మచ్చిక. వళ్ళో పెట్టుకుని ఆడుకునేది. అది బయటకు వెళ్తే బొమ్మలేసుకుంటూ గడిపేది.

‘ఒకనాడు ఆమె వళ్ళో ఒదిగి అర్ధనిమీలిత నేత్రాల్తో ఉన్న తెల్ల పావురం మీద రేణుకాదేవి భళ్ళున గుక్కెడు రక్తం కక్కింది’. తర్వాత రోజులు భారంగా నడిచాయి. రోజుకో బొమ్మ గీసి ఆ కాయితాన్ని చుట్టి, ఎండిన రక్తపు మరకలున్న తెల్లపావురం కాలికి కట్టి, కిటికీ ఊచల సందుల్లోంచి బయటకు ఎగరేసేది. ఏటినీ, ఎన్నో ఊళ్ళనీ, పొలాలనీ దాటుకుంటూ పోయి, ఒక చోట ఊరి చివర పొలాల మధ్య ఉన్న ఒక కుమ్మరి గుడెసె వాకిట్లో పాతిన కర్ర పైని చెక్క గూటి ముందు వాలేది తెల్లపావురం. రేణుకాదేవి పంపిన బొమ్మలు కుమ్మరి మొహాన పడేసి, గూటిలోని పెంటిపావురంతో సరాగాలాడేది.

ఆ కుమ్మరి ఎట్టాంటి వాడంటే, ‘ఎన్నేళ్ళ మట్టో సారె తిప్పుతున్న భుజాలతో, అడుసు తొక్కుతున్న కాళ్ళతో శరీరమైతే బిరుసెక్కింది గానీ, సారెపై మట్టి ముద్దని వేలి అంచుల నిపుణమైన కదలికలత్తో కుండగా మలిచేటప్పుడు కలిగే సీతాకోక రెక్కంత పల్చనైన పులకలురేపే ఆనందానికి స్పందించడంలో, మనసు మాత్రం స్నిగ్ధత్వాన్ని కోల్పోని’వాడు. అతనికి పనంటే ప్రాణం. రాత్రి,, ‘ఖాళీతనమేదో గుండెను బంకలా అంటుకుని ఆవరించినపుడు’, నులక మంచం మీద పడుకుని పావురం తెచ్చిన బొమ్మల గురించి ఆలోచించేవాడు. ‘బూడిదరంగు పావురాల్ని పూసిన రావిచెట్టూ, తెరచాపలు విడిచి వీధుల్లో తేల్తూ ప్రయాణిస్తూన్న మేడలూ, గిట్టలకు అంటిన పుప్పొడితో దేవగన్నేరు పూల చుట్టూ తుమ్మెద రెక్కల్తో చక్కర్లు కొడుతున్న బుల్లి గేదెలూ’..ఇవీ ఆ బొమ్మలు.

వీటితో ఆ కుమ్మరి ఖాళీతనం కొంత భర్తీ అయ్యేది. ఆ బొమ్మల్లో దిగులు, ఆహ్లాదం, తరుముకొస్తున్న తొందర. గీతల్లో ‘ మనసు శ్రద్ధ పెట్టి గీసినట్టు తెలిపే అపరిపక్వత’. కిటికీ ఊచల్లోంచి కన్పిస్తున్న జగన్నాథస్వామి రథం ఊరేగింపు బొమ్మను చూశాక, అవి ఎక్కడి నుంచీ వస్తున్నాయో అతనికి తెలిసపోయింది. ‘పావురం కామ ప్రకోపం వల్ల దారితప్పిన’ బొమ్మల్ని తిరిగి ఇద్దామని బయలు దేరాడు శ్రీపాదపట్నానికి. ఏనుగు తొండాల్తో కుమ్మరిస్తోంది వాన. మేడ ముందు ఎత్తు అరుగుల మెట్లెక్కి లోపలికి తొంగి చూసి పిలిచాడు. ఎవరూ పలకలేదు. చెక్క మెట్లు ఎక్కి వెళ్ళాడు. పై అంతస్తులో పందిరి మంచం మీద నిద్రిస్తున్న రేణుకాదేవి, నిద్ర మధ్యలో ఓ సారి కళ్ళు తెరిచి, ‘అతడు తన కలలో భాగమన్నట్లు, పలకరింపుగా నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకుంది.’నిద్ర లేచింతర్వాత కూడా ఏదీ కొత్తగా అనిపించలేదు. పరిచయపు మాటల్లో ఆ రాజకుమారికి ఆసక్తి కలిగిస్తున్నవేమిటో అతనికి తెలిసిపోయింది. అవి ఎట్లాంటి అల్పవిషయాలంటే, ‘బంతిపూల మొక్కల్ని కొరికేస్తున్న కుందేలుని అదిలించి వచ్చి చూస్తే, కుమ్మరి సారె మీద మట్టి ముద్దగా కూలిపోయిన కుండ అచ్చం కుందేటి తలకాయలా ఉన్న’సంగతీ, రాత్రిళ్లు గుడిసె దగ్గరకి వచ్చే తోడేలు కుండల్లో తల పెట్టి, ఊళ వేసి తన పాట సోకుకి తనే మురిసిపోయే’ వైనమూ వంటివన్నమాట. మాటలతో ఒకరికొకరు తెలిసిపోయారు.

‘క్షణాలు ఉద్విగ్నమై మనోహరమై బిగుస్తూ వదులవుతూ ప్రజ్వలించి సంచలిస్తున్నాయి. మనసు స్థలకాలాలకు అతీతమై చీకటి శూన్యంలో ఒకే వొక్కటై వెలుగుతోంది. నేల మీద చమురుదీపపు వెలుగువలయంలో ఇద్దరూ కూర్చున్నపుడు ఆమె తన బొమ్మల్ని చూపిస్తుంటే భజం మీంచి తొంగి చూస్తున్నపుడల్లా ఆమె చెంపలకి చెంప ఆనించకుండా వుండలేకపోయాడు’అతను. ‘అతని వేడి చెంపని ఆమె అనునయంగా స్వీకరించింది’.  ‘అతని ప్రహరణాల్ని ఉరుములూ ఆమె మణికూజితాల్ని పావురాళ్ళ కువకువలూ మింగేస్తూ’ కొన్ని రోజులు గడిచాయి.

అతనిలో దిగులు మొదలయింది. పురుషుడికుండే సహజమైన దిగులు అది. భవిష్యత్తుని పటంగట్టి పెట్టేసుకుందామనే అభద్రత. ఆమెకి ఈ క్షణాలు చాలు. అతను కదిలాడు. ఆమె ఆపలేదు. ‘అనుకున్నపుడల్లా మౌనంతో తన అంతరంగ ద్వారాల్ని మూసేసుకుని తనని వెలుపలే నిలబెట్టే ఆమె మంకుతనాన్ని’ అతను సహించలేకపోయాడు. దూషించాడు, ఆరోపించాడు, బెదిరించాడు.

అన్నీ కక్కేసి ఖాళీ అయిపోయాక వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ పురుషుడు. ఆమె స్త్రీ, కదిలి వచ్చి అతణ్ణి కౌగిలిలోకి తీసుకుంది. మృత్యువు తన ప్రాణాన్ని తీసుకుపోవడానికి రేపు రాత్రే వస్తుందనే నిజం అప్పుడు చెప్పిందామె, అతని పట్ల జాలితో. ‘మృత్యువు వచ్చినపుడు తన గుండెల్లో పొడవమంటూ ఒక దబ్బనం ఇచ్చింది అతనికి. అప్పుడు రూపం మారిపోయిన తనను మృత్యువు గుర్తు పట్టలేక వెను తిరిగి వెళ్ళిపోతుంది. మారిన రూపాన్ని మళ్ళీ పొడిస్తే పూర్వ రూపం వచ్చేస్తుంది.’ఆమె ఎప్పడూ, కిటికీ లోంచి ఏటికవతల క్షితిజరేఖనూ చూస్తూ గడిపేది. ఎండిన రక్తం మరకలున్న తెల్ల పావురం కాలికి బొమ్మలు కట్టి ఎగరేసిందీ, ఆ క్షితిజరేఖ దిక్కుకే. సరిగ్గా క్షితిజరేఖకు పైనగా ఏటి ఆవతల్నించి ఏదో నల్లగా ఎగురుకుంటూ రావడం అతను రెప్ప వాలని ఆ రాత్రి చూశాడు. కళ్లు మూసుకుని దబ్బనాన్ని పిడికిలి మధ్య బిగించి ఆమె గుండెల్లో గట్టిగా పొడిచాడు.

కళ్ళు తెరిచేసరికి పక్క మీంచి ఓ కప్ప క్రిందికి దూకి వెళ్ళి పోయింది. ‘కిటికీ ఊచల్లోంచి తొంగి చూస్తున్న తాటాకంత రెక్కలున్న గ్రద్ద , వీపు వెనుక దబ్బనాన్ని దాచుకున్న అతడిని అసహనంగా చూసి వికృతమైన అరుపు అరిచి వెనక్కి ఎగిరెళ్ళిపోయింది. ఇక కప్ప కోసం అతను గదంతా వెతికాడు. కనిపించలేదు. మెట్ల మీద కప్ప తడికాళ్ళ ముద్రలు కనిపించాయి. కప్పగా మారిన ఆమెకి తాను ప్రియుణ్ణన్న స్పృహ ఉండకపోతే! అనే ఆలోచనతో అతను వణికిపోయాడు. ఏటి ఒడ్డున బురదలోంచి  బెకబెకలు వినిపించాయి. ఒక్కటి కాదు, వందల కప్పల బెకబెకలు. బురదగుంటలో దబ్బనం పట్టుకుని కప్పలను వేటాడే అతను, ఆ ఊరి వారికి అలవాటైపోయాడు.  తెల్లపావురం, ‘తన రెక్కలపై రేణుకాదేవి రక్తపు మరకలు చెరిగిపోకుండా వుంటానికి వానలో తడవకుండా జాగ్రత్త పడేది’బతికినంత కాలం.

-ఈ కథ మెహర్ రాసిన తొలి కథ అనుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. స్త్రీ, పురుష కలయికలోని వైల్డ్ నెస్ ని వర్ణించిన తీరుకి దిగ్భ్రమ కలుగుతుంది. కథ చెప్పిన పద్ధతికి ముచ్చటేస్తుంది. మురిపం కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఎలుగెత్తి ఎందరికో చెప్పాలనిపిస్తుంది. శ్రీపాద మళ్ళీ పుట్టాడని నమ్మాలనిపిస్తుంది. మెహర్..మెహర్..మెహర్ అని వెయ్యిసార్లు పలవరించాలనిపిస్తుంది. ‘ఒరే..మెహర్’ అని ఆప్యాయంగా గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది.

మెహర్ ..! వాక్యం రహస్యం తెలిసినవాడా..ఎవరు నువ్వు? ఎక్కడున్నావ్ ఇంతకాలం? వాన ముంచెత్తిన ఒక పగలు, కుమ్మరి యువకుడు రాజుగారి మేడ చెక్క మెట్లెక్కి రాణికి నిద్రాభంగం కలుగకుండా ప్రేమను గెలుచుకున్నట్లుగా, తెలుగు కథలోకి నిశ్శబ్దంగా అడుగుపెట్టేశావ్! నీ ‘నిశ్శబ్దం వెనుక ఏవో ఘోరాలు’ ఇక్కడ ఊహించబడుతున్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా గుప్పెడు అక్షరాలు రాలుస్తూ ఉండవయ్యా అప్పుడప్పుడూ అయినా, నెర్రెలు బారిపోయి ఎదురు చూస్తున్నాం తండ్రీ , తడి గలిగిన నాలుగు అక్షరాల కోసం.

Meher (Bezwada Phanindra Kumar)(‘మెహర్ ఒక వర్తమాన సాహిత్యం’ అని నరేష్ నున్నా ఎగరేసిన జెండాకు చేయందిస్తూ.)

***

Download PDF

11 Comments

 • మెహర్ ఒక వర్తమాన సాహిత్యం….అస్తు…

 • http://www.scribd.com/doc/99052011/Rangu-Velisina-Raju-Gari-Meda-కథ
  డౌన్లోడ్ చేస్తే అక్షరాలు బాగా కనిపిస్తాయి. కథను చదివితే ఈ విశ్లేషణ మరింత అర్థవంతంగా అనిపిస్తుంది.

 • Radha Manduva says:

  ఉమా మహేశ్వర రావు గారు చాలా మంచి కథని ఇక్కడ గుర్తు చేశారు. తప్పకుండా చదవవలసిన కథ. మహేష్ కుమార్ గారు అన్నట్లు కథ చదివితేనే ఈ విశ్లేషణ అర్థవంతంగా ఉంటుంది. అసలు కథ మనల్ని వేరే లోకంలోకి తీసుకెళుతుంది. మెహర్ గారి బ్లాగ్ loveforletters.blgspot.in లో ఈ కథని చదవొచ్చు.
  ఇక ఉమాగారు అంటున్నారు చూడండి. ” ఈ కథ మెహర్ రాసిన తొలి కథ అనుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. స్త్రీ, పురుష కలయికలోని వైల్డ్ నెస్ ని వర్ణించిన తీరుకి దిగ్భ్రమ కలుగుతుంది. కథ చెప్పిన పద్ధతికి ముచ్చటేస్తుంది. మురిపం కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఎలుగెత్తి ఎందరికో చెప్పాలనిపిస్తుంది. శ్రీపాద మళ్ళీ పుట్టాడని నమ్మాలనిపిస్తుంది.”
  ఆ కథ చదివితే ప్రతి ఒకరికీ ఈ అభిప్రాయమే కలుగుతుంది. గుండెల్ని పిండేసే కథ. గిరీశం అన్నట్లు a story with guilt letters.

 • ramanajeevi says:

  తెలుగు సాహిత్యం లో మహా అద్భుతం ఈ కథ. ఉమా మహేశ్వర రావు గారు దీన్ని గురించి ఎలా రాసారో అని చాల ఆసక్తి గా చదివాను. చెంగన్న అనే మరో అద్భుతాన్ని పరిచయం చేసారు. చలం, ఆర్ యస్ సుదర్శనం ఈ కథని చదివితే ఏం రాసే వారో!

 • అనగనగా ఓ అక్షరాల రాజ్యం.. ఆ రాజ్యంలో పదాల కోట కట్టుకోని మెహర్ అనే రాజుగారుంటారు. ఎంత పెద్దవాళ్ళైనా పసిపిల్లుగా మారిపోయి “ఊ కొట్టే కథ” అనే మంత్రదండం ఆయన దగ్గర వుంది. అయితే ఇప్పటికి ఆ మంత్రదండాన్ని ఒక్కసారే వాడటం వల్ల ఆ వూరి ప్రజలంతా పసి పిల్లలుగా మారిపోయి ఇంకో కథ చెప్పే వెన్నెల రాత్రి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు…!!

 • Srinivas says:

  బాగుంది.

  ఈ కథ ఈ లింకులో కూడా ఉంది, ఇంకా మంచి ఫాంటుతో…. (93 వ పేజీ నుండి)

  http://www.scribd.com/doc/86436872/Mitrabhedam-amp-Raju-gari-Meda-Katha

  ఈ పీడిఎఫ్ లో దీని ముందున్న కధ “మిత్ర బేధం” దీనికి కంపానియన్ పీస్ లాంటిది కాబోలు. & seems it is not the first story by this writer. there are many more stories and skeches by him in this link….. his blog…

  http://loveforletters.blogspot.in/search/label/Stories%20-%20Sketches

 • Ismail says:

  ‘గుండె’ను దబ్బనంతో పొడిచే కథ…
  ఇంతకంటే ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.

 • రమాసుందరి says:

  కధ శైలి, కధ నడక అసాధారణం.అదీ ఈయనకిది మొదటి కధ. అయితే అందరూ ఆస్వాదించినట్లు నేనా ప్రేమను తాక పోయాను. బహుశ ప్రపంచంతో సంబంధం లేని ఆ అబ్ స్ట్రాక్ట్ ప్రేమ ను విడిగా ఆనందించలేక పోయాను. ఇక శృంగారంలో ఉమామహేశ్వరావు గారు చెప్పిన వైల్డ్ నెస్ కూడ నాకు అందలేదు.

 • naresh nunna says:

  ఉమా అన్నట్టు మెహర్ నేనెత్తిన జెండా ఎంతమాత్రం కాదు. అతని రచనలకి నేనొక అభిమానిని. సాక్షి- మందలపర్తి కిషోర్ గారు ఇప్పుడు రాస్తున్న వారిలో మీకు నచ్చిన వాళ్ళ గురించి రెండు ముక్కలు రాయమని అడిగినప్పుడు, మెహర్, మన్నం సింధు మాధురి గురించి రాసి ఇచ్చాను. వాళ్ళు నా discoveries ఎంతమాత్రం కాదు. మెహర్ గురించి నేను రాసిన నాలుగు ముక్కలు:
  —————————–
  అతను …. వర్తమాన సాహిత్యం!
  ——————————–

  సాహిత్యాన్ని ప్రవృత్తిగా, అదే జీవన విధానంగా చేసుకోవడం ఒక ‘ఆదర్శం’ ఆధునికయుగంలో అది దాదాపు అసాధ్యం గనుక – ఒక ‘పగటికల’ అనొచ్చు. నాకు తెలిసిన ప్రపంచంలో అటువంటి నేల విడిచి సాము చేసే వ్యక్తి- మెహర్‌! మెహర్‌ అనే రచయితతో ఉన్న సంబంధాన్ని వ్యక్తిగత స్థాయికి దిగజార్చి, ‘సాహిత్యం అతని వ్యావృతి’ అన్న మెహర్బాని వ్యాఖ్య చేస్తున్నానని అపార్థం చేసుకోవద్దు (నిజానికి వ్యక్తిగా మెహర్‌తో పరిచయం లేదు).

  మెహర్‌ అసలు పేరు బెజవాడ ఫణీంద్ర కుమార్‌. మెహర్‌ పేరిట రాయడానికి ఆసక్తికరమైన (పోనీ అనాసక్తిదాయకమైన) కారణాలేవీ లేవు. మెహర్‌గా పేరు మోసినవాడేంకాదు కాబట్టి, ఫణిగా గుర్తించినంత మాత్రాన కొత్తగా అనామకుడయ్యేదేమీ లేదు. ‘రంగు వెలిసిన రాజుగారి మేడ కథ’ అన్న ఓ కథా రచయితగా ‘పాలపిట్ట’ సాహిత్య పత్రిక ద్వారా సాహితీ లోకానికి పరిచయమయ్యాడు. ఒక మెతుకు పట్టుకుని కుండెడు అన్నం బాగోగుల గురించి చెప్పే నేర్పరితనంతో కూడా కాదు, ‘సాహిత్యం అతని ప్రకృతి’ అన్న భారీ ప్రకటన చేసింది.

  మెహర్‌తో నాకు పరిచయం ఏర్పడింది బ్లాగులోకంలో. పరిమాణంలో కుడిఎడమల తేడాలున్నా, 90శాతం తెలుగు బ్లాగులు నీళ్లు లేని బావులైతే, వాటి పాఠకుల్లో 95శాతం మంది బహు మర్యాదస్తులైన మండూకాలు. అటువంటి బ్లాగు ప్రపంచంలో మెహర్‌ బ్లాగు (గతంలో ‘అక్షరాపేక్ష’, ఇప్పుడు ‘కలంకలలు’) బట్టి, ‘I am literature’ అని కాఫ్కా చేసుకున్న ప్రకటనకి తీసిపోనంత పెద్దదైన (అతి వినయపూర్వకమైన) ప్రకటన చేస్తున్నాను మెహర్‌ గురించి: ‘He is literature!’ మెహర్‌ బ్లాగులో అక్కడక్కడా ఉల్కల్లా మెరిసే, క్రియేటివ్‌ వర్క్స్‌ చదివే ముందు, ప్రపంచ సాహిత్యాన్ని అతను own చేసుకున్న తీరు గమనించండి.

  నబకోవ్‌, బైరాగి, మార్క్వెజ్‌, మల్లాది, చెస్టర్‌ టన్‌, చండీదాస్‌, చలం, హెచ్‌. జి.వేల్స్‌, కామూ, కాశీభట్ల, కాఫ్కా, శ్రీపాద, పానుగంటి, ప్లాబర్‌, శాలింగర్‌, బోర్హాస్‌…ఇదొక గజిబిజిగా అనిపించే రచయితల చిట్టా. వీరందరి మీదా మెహర్‌ రాతలు చూడండి. ఫలానా సాహిత్యాన్ని ఔపోసన పట్టాలన్న ‘శాస్ర్తీయ’ విధేయత గానీ, రచయితల కీర్తి ప్రతిష్ఠల డాంబికాలకు దాసోహమయ్యే ఎకడమిక్‌ నంగిరితనం గానీ ఏ కోశానా కనబడవు. ఆహార, నిద్ర, మైథునాల్లా సాహిత్యం పట్ల కూడా శారీరక, మానసికమైన ఆబ, రంధి కనబడతాయి. అలాగని శ్రీశ్రీలా ‘తన కావ్యస్వప్నం సఫలీకృతంకావడానికి ప్రపంచం నలుమూలలా స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా వెదుకులాడిన’ వెంపర్లాట కూడా కనిపించదు. అసలు తనకంటూ అటువంటిదేదైనా కావ్యస్వప్నం ఉందా? అనే ప్రశ్నకు తావిచ్చే బండతనం కనబరుస్తాడు. aberrations
  లా అడపాదడపా ఓ కవితో, కథో రాసి అదే బ్లాగుబావిలో పడేస్తాడు. ‘అదిరింది’, ‘భేష్‌’, ‘కేక’….వంటి అత్యాధునిక ఏకవాక్య భుజంచరుపులతో కొన్ని పాఠక ప్రతిస్పందనలు మాత్రం ఉంటాయి. తన రచనతో తెలుగు సాహిత్యానికొక గొప్ప స్థాయినందిస్తున్నానని డొల్ల రచయితలెందరో రహస్యంగా, నార్సిస్టిక్‌గా డాబులు పోయే వర్తమానంలో, అంతటి స్థాయి రచనలు చేసి కూడా గుంభనంగా ఉండిపోయే మెహర్‌ని దొంగచాటుగా గమనించి, అతి బాధ్యతతో చేస్తున్నాను ఆ ప్రకటన- అతను వర్తమాన సాహిత్యం!

 • తెలుగుబ్లాగులు అనే సముద్రం అందించిన ఒక ఆణిముత్యం మెహర్. అయన బ్లాగు రాసినా రాయకపోయినా రచయిత అయుండొచ్చు, కానీ ఇవ్వాళ్ళ ఈ కథ నలుగురి కంట పడిందంటే దానిక్కారణం మాత్రం అయన దాన్ని బ్లాగులో ప్రచురించి ఉండడమే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)