తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా…!

1swatikumari-226x300నువ్వు ఒక మాట అంటావు, అది భలే బాగుంటుంది/మాట మీద కాసేపు నడుస్తావు ప్రత్యేకించి పనేం లేక – అలవోకగా, అలవాటుగా, అనాలోచితంగా అన్న చాలా మాటల్లోంచి బాగున్న మాటలని ఒకచోట పోగుచేస్తే, ఆ బాగున్న ఒక్కోమాట మీదా కాసేపు అదే పనిగా నిలిచిపోతే, అలా నిలిచి వెనక్కూ, ముందుకూ నడుస్తూ ఆ మాట తుదీమొదలూ తేల్చుకునేందుకు మొండికేస్తే; బహుశా, ఆ మొండి ప్రయత్నమే కవిత్వమౌతుంది కాబోలు. అలా నడుస్తూ, తిరుగుతూ ఎప్పటికో “ఏది బయల్దేరిన చోటు ద్రిమ్మరికి? అన్న అనుమానమొచ్చి సమాధానపరచుకునే ప్రయత్నమేమో కూడా కవిత్వం అనిపిస్తుంది హెచ్చార్కే గారి కవితలు చదువుతూ విస్మయంతో దారితప్పినప్పుడు.

హెచ్చార్కే గారి ఇటీవలి కవితల్లో తరచుగా ఆత్మాశ్రయ శూన్యం, బహుముఖాలైన ఏకాత్మ తిరిగి ఒకటిగా మూలాన్ని చేరుకునే ప్రయత్నం  కనిపిస్తున్నాయి. “నువ్వెప్పుడూ ఒక్కడివే /నీకు నివాస యోగ్యం నువ్వే, “ఎన్ని నేనులు కలిస్తే ఒకడు ఒకడవుతాడు? వంటి పంక్తులు చూసినప్పుడు ఈ కవితలు- ఏమీ లేకపోవడం గురించి కాదు, ఏమీ లేకపోవడం కూడా లేకపోవడం గురించి అనిపిస్తుంది. ఆ రాశిలోనిదే ఒక ఊహ ఇక్కడ;

నీటి ఊహ

రచన : హెచ్చార్కె

ఒక్కడివి వంతెన మీద
ఎవరూ రాని వెన్నెల వేళ
ఆ చివర అంటూ ఏమీ లేనట్టు అనంతంగా ఇనుప స్తంభాలు
స్తంభాల మీద ఆకాశంలో ఊగుతున్నట్లున్న అర్థ వలయాలు

ఒక ఊహ
నీరై ప్రవహిస్తుంది. జ్ఞాపకాన్ని దాటి ఆవలికి దూకే ప్రయత్నంలో
తన మీంచి తాను పొర్లుతుంది. గోధుమ రంగు కుక్కపిల్లల ఆట.

నీరు కాదు ఊహ
కలల పాపాయి పడిపోకుండా పక్కల్లో అమ్మ సర్దిన పొత్తిలి మడతలు
కొన్ని విరామ చిహ్నాలు; అంతే, ఏమీ లేదు
ఏమీ లేదనడమంటే పూర్తిగా అర్థమయ్యేదేదీ లేదని. ఏం, లేకపోతేనేం,
చెయ్యి ఉంది, కాలు ఉంది, దూరం ఉంది, భయం ఉంది, కోరికలున్నాయి;
ఆగమని కాదు; అపేసేంత దిగులొద్దని, ఆదమరిచేంత సంతోషం వద్దని

ఒక్కడివే వంతెన మీద
నీ కోసం నువ్వు ఎదురు చూస్తూ
రావలసి వున్న నిన్ను ఆడపిల్లను చేసి అందమైన అమ్మాయి పేరు పెట్టి
ఆమె కాదనడానికి వీల్లేని ప్రేమకు రాయాల్సి వున్న పాటకు రాగం కట్టుకుని
పాడాలనుకుని

ఎప్పటికీ రాని నీ చేతికి పులి నోట్లో విసరాల్సిన ఖడ్గమొకటి సంధించి
నీ నుంచి నీకు తగిన సమాచారం అందాక చివరి యద్ధానికి వ్యూహ రచన
చేద్దామని; ఇది కాకుంటే ఇంకొకటి, లేదా మరొకటి చేద్దామని
స్తంభాలలో, అర్థవలయాలలో, నీళ్లలో నువ్వొక స్తంభమై, వలయమై, నీరై


——————————————————————————————————————-

  నీటి అద్దంలో వెన్నెల ఊహ, వెన్నెల నదిలో నీటినీడల నిరీహగా ఈ కవిత మొదలెట్టగానే ఒక స్పష్టమైన దృశ్యం సాక్షాత్కరించింది. ఆద్యంతాలు తోచని నిలువెత్తు ఏకాకితనం, ఎదురుచూడ్దం మర్చిపోయిన ఇనుపస్తంభాల వంతెనపై నిల్చుని కనపడుతుంది. నది తలెత్తి చూసినప్పుడు తనలో కదిలే నీడలకు ఆకాశంలో కదలని జాడలు బింబాలవుతాయి. అందుకే అర్ధవలయాలు ఊగుతున్నట్టుగా ఉంటాయి.

ఊహలకి నిలకడ తెలీదు. నీటిలాగా నిరంతర ప్రవాహమే వాటి స్వభావం. ప్రవహిస్తూ, తన దారిలో దాటుతున్న ప్రతీదాన్నీ కలుపుకుంటూ, కలుపుకున్న ప్రతిసారీ గమనానికి లొంగని కొన్ని జ్ఞాపకాల్ని దాటే ప్రయత్నంలో,  తన చుట్టూ తాను సుడులుగా, తనపైనుంచి  తాను ఆవలికి దూకటానికి మరింతబలాన్ని తనలోంచే బయటికి తెచ్చుకునే నీటిలాంటి ఊహలు, ఆటల్లాంటి ఊహలు, కలల వేటలాంటి ఊహలు. ఈ స్వభావాన్నే కవితలో ఇలా చెబుతారు- ఒక ఊహ నీరై ప్రవహిస్తుంది. జ్ఞాపకాన్ని దాటి ఆవలికి దూకే ప్రయత్నంలోతన మీంచి తాను పొర్లుతుంది. గోధుమ రంగు కుక్కపిల్లల ఆట.” గోధుమరంగు కుక్కపిల్లలు పొర్లుతున్న దృశ్యం అంతకుముందున్న పదాల్ని ఉన్నఫళాన చిత్రాలుగా రూపుకడుతుంది. జ్ఞాపకాలు పొర్లే అమూర్త భావనని కళ్ల ద్వారా అర్థం చేసుకోవడాన్ని అలవాటు చేస్తుంది.

కేవలం ఊహించడంలో ఏముంది? ఆశలు దొర్లి కిందపడకుండా ఒక అడ్డు, గుట్టలుగా పోగుపడే నిరంతర నిజజీవిత వాక్యాల మధ్య కాస్త తెరిపి. ఈ భావాన్నే ఇలా అంటారు “కలల పాపాయి పడిపోకుండా పక్కల్లో అమ్మ సర్దిన పొత్తిలి మడతలు/కొన్ని విరామ చిహ్నాలు; అంతే, ఏమీ లేదు.” చుట్టుతా వస్తుసంచయం, కోలాహలం; తన నిలువెల్లా తన శరీరమే ఆక్రమించి శూన్యం కేవలం ఒక భావనగా మిగుల్తుంది. ఏమీ లేకపోవడమనే బరువుని దింపుకోడానికి మరేచోటూ దొరకదు. అసలు లేకపోవడమంటే ఏమీ లేదని కాదు- ఉండక తప్పనివి, ఉండాలని అనుకోనివీ, ఉన్నా నిజమవ్వనివి కొన్ని భయాలు, సందేహాలూ, కోరికలూ ఉన్నాయనే, అవి ఉండటం వల్లే మరేమీ లేకుండా చేస్తున్నాయనే! అందుకే హెచ్చరించవలసి వస్తుంది- “ఆగమని కాదు; అపేసేంత దిగులొద్దని, ఆదమరిచేంత సంతోషం వద్దని” అంటూ…

ఎదురుచూస్తుంటాడు మనిషి తానే మరొకరైన ఒక ఆకారం కోసం, తనని సంపూర్ణం చేసే ఏదో అస్తిత్వం బయటినుంచి వచ్చి కలవడం కోసం. ఆశనిరాశల మధ్య వంతెనపైన, అనంతంగా కనపడే వాస్తవపు ఇనపస్తంభాల ఆవల, ఏముందో తెలీని చోటుని దాటుకుని మరో ప్రకృతిగా తనని చేరే ఆహ్లాదం కోసం. ఎప్పుడుందో తెలీని, బహుశా ఎప్పటికీ ఉండబోని ఒక జీవన సాఫల్య సమాగమం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సమయాన్ని కోల్పోయే ఏ ఒక్క అవకాశమూ తలెత్తకుండా జాగ్రత్త పడుతూ ఆమె కాదనడానికి వీల్లేని ప్రేమకు రాయాల్సి వున్న పాటకు రాగం కట్టుకుని పాడాలనుకుని”  లెక్ఖించకూడనన్ని అలాపనలు సాధన చేస్తుంటాడు.

ఎదురుచూడ్దమే కాదు, సర్వసన్నద్ధంగా ఉంటాడు తనతో తనకి రాబోయే యుద్ధాలకోసం. ఏవో ఊహించలేని సంఘర్షణల్లో గెలవడానికి ఎత్తుగడలో భాగంగా ఆలోచనల్ని, ముందస్తు జాగ్రత్తనీ ఆయుధాలుగా చేత పట్టుకుని తయారుగా ఉంటాడు ఎప్పటికీ రాని నీ చేతికి పులి నోట్లో విసరాల్సిన ఖడ్గమొకటి సంధించి”. తానే నీరుగా తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా, తుదీ మొదలూ లేని వృత్తంలా, చివరికి తనకి తానొక ఊహగా, తన అస్తిత్వానికి శూన్యానువాదంగా, లోపలి ఖాళీని వంతెనలు, స్తంభాలు, వలయాలుగా దర్శించుకుంటూ ఉంటాడు.

—-*—-

 

Download PDF

7 Comments

  • ramarao peddi says:

    స్వాతి కుమారి గారూ! ఎవరు మీరు! పుట్టిన దగ్గర్నుంచి హెచ్చేర్కె కవిత్వం చదువుతున్నా. (కవిత్వం పుట్టినప్పట్నుంచి కాదు… నేను పుట్టిన దగ్గర్నుంచి.) భలే రాశారు. అరే నేను చెప్పాలనుకుంది ఈవిడ చెబుతుందేంటి అనిపించింది కొన్ని చోట్ల. కంగ్రాట్స్.

  • ns murty says:

    స్వాతి కుమారి గారూ,

    కవిత్వం చదవడం , చదువుతూ ఆనందించడం వేరు, చదివడం పూర్తయినతర్వాత దాన్నివిశ్లేషించడం వేరు. ఒక కవిత చదువుతున్నప్పుడు దాన్ని మనసులోనే విశ్లేషించుకుంటూ వెళ్లిపోతూ బాగుందనో, బాగులేదనో ఒక నిర్ణయానికి వస్తాం. సద్యోనుభూతిగా ఆ ప్రక్రియ సాగిపోతుంటుంది. కాని, ఆ రసానుభూతినుండి బయటకు వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషించడం కష్టం. ముఖ్యంగా ప్రతీకాత్మకంగా రాసే ఇలాంటి కవితలు . మీలో కవయిత్రితో పాటు విమర్శకురాలు కూడా తగుపాళ్ళలో ఉన్నట్టు అర్థం అవుతోంది నాకు. మీరు పద్యాన్ని చదివే తీరు నిజంగా బాగుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • విన్నకోట రవిశంకర్ says:

    స్వాతి కుమారి గారు – ఇటీవల హెచ్చార్కె రాసిన పద్యాల్లో నీటి ఊహ నాకు కూడా బాగా నచ్చిన కవిత. మీ విశ్లేషణ చాలా లోతుగా ఉంది. “ఏమీ లేకపోవడం కూడా లేకపోవడం గురించి” అని మీరన్నది నిజమే. – రవిశంకర్

  • గమనానికి లొంగని కొన్ని జ్ఞాపకాల్ని దాటుకునే ప్రయత్నం… అస్తిత్వానికి శూన్యానువాదంగా… స్వాతికుమారి గారూ హెచ్చార్కె కవిత్వం మీద మీ ఆత్మికమైన పరామర్శ కూడా కవితాత్మకంగా కదిలించింది. అక్షరాలకు ఆయువును ధారపోసి స్వచ్ఛమైన ప్రవాహంలా సాగిపోయే అరుదైన కవుల్లో హెచ్చార్కె ఒకరు. ఆ ప్రవాహంలో మీరు ప్రతి బిందువునూ హృదయంతో స్పృశించారు. అనేకవచనాలతో ఘర్షణ పడుతున్న పునః పునః పునరేకీకృతవచనం హెచ్చార్కె. He can’t go on.. but he will go on..

  • సాహిత్యంలోకి కొత్త తరం రావడం లేదన్న బెంగ వలదని ఆశ్వాసం ఇస్తున్నారు స్వాతి లాంటివాళ్లు. కాకపోతే రకరకాల వాదాల ప్రభావం పలుచనబడి ఇపుడు కొత్తగా లోచూపుతో ముందుకొస్తున్నారు. కొంతకాలంగా రాస్తున్నవారిలో ప్రధానంగా కనిపించే ధోరణి ఇది. అది సాహిత్యమైనా. సాహిత్య పరామర్శ అయినా. అబద్ధం తర్వాత హెచ్చార్కె కవిత్వం మారుతూ వచ్చింది. ఆ మార్పుకు సంబంధించిన కొన్ని శకలాలను చూపించారు స్వాతిగారు. ఒక పద్యమే తీసుకుని ఉండొచ్చు. అది మార్పుకు సంకేతమనదగిన పద్యం. వాస్తవానికి హెచ్చార్కె లాంటి వాళ్ల కవిత్వంపై ‘సమగ్ర’మైన విమర్శ రావాల్సి ఉంది. తెలుగులో సాహిత్య విమర్శ చిక్కి శల్యమైపోవడం వల్ల ఇలాంటివి ఆశించే పరిస్థితి లేకుండాపోయింది. నవల అంటే బద్దకమేసి రచయితలు కథలకే ఎలా పరిమితమవుతున్నారో విమర్శకులు కూడా సీరియస్‌ విమర్శకు బద్ధకమేసి పరామర్శలకు, సమీక్షలకు పరిమితమవుతున్నారు. మనమున్న చోటునే నిలబడి యథాలాపంగా వ్యాఖ్యానం విసిరేయకుండా రచయితను చేరడానికి ప్రయత్నించడం ఇవాళ కనిపించే సానుకూల అంశం. అక్షరాల వెనుక దాగిన భావాల్ని రచయిత కోణంలోంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచి అంశం. మనం ఎటువంటి వ్యాఖ్యానం చేసినా ముందు రచయిత దృష్టి కోణాన్ని పట్టుకోవడం అవసరం. అది సరిగా ప్రెజెంట్‌ చేశాక దానిమీద మన దృష్టి కోణాన్ని బట్టి ఏ వ్యాఖ్యానమైనా చేయొచ్చు. ఆ విషయంలో స్వాతిగారు అభినందనీయమైన కృషి చేసినట్టు అనిపిస్తోంది.

  • SRIDHAR says:

    hrk, nii kavithvam baavundi
    swathi kumari raasindi kuudaa baavundi. evaraame?
    bye hrk see you

  • రవి says:

    స్వాతి గారు,

    నీటి ఊహ ను అద్బుతంగా ఆవిష్కరించారు. అందమైన లోతైన విశ్లేషణ. పద్యం లోని ప్రతీ అక్షరాన్ని ఆత్మీయంగా పలకరిస్తూ ఎంతో కవితాత్మకంగా సాగింది.

    హెచ్చార్కె గారికి మీకూ అభినందనలు.

    -రవి

Leave a Reply to SRIDHAR Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)