అరవై వస్తే రానీ…. అలసట లేనే లేదు!

ఎస్. నారాయణస్వామి
ఎస్. నారాయణస్వామి

450px-Maes_Old_Woman_Dozingవైద్యశాస్త్రం సాధించిన వైజ్ఞానిక ప్రగతి వల్లనైతే నేమి, జనసామాన్యంలో ఆరోగ్యకరమైన జీవనవిధానం పట్ల ఆసక్తి పెరగడం వల్లనైతేనేమి, మనుషుల జీవితకాల పరిమితి బాగా పెరిగింది. ఇప్పటివరకూ మానవచరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువకాలం జీవిస్తున్నాడు సగటు మానవుడు. అందుచేత ఏవిధంగా లెక్కవేసినా జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిణామం మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఉదాహరణకి అమెరికాలో 1960లలో సగటు ఆయుష్కాలం 70 సంవత్సరాలు ఉంటుండేది. యాభయ్యేళ్ళ తరవాత ఇప్పుడు సుమారు 80 సంవత్సరాలు ఉన్నది. పోలిక కోసం భారత్ లో ఇదే వ్యవధిలో ఆయుష్కాలం 45 నించి 65 కి పెరిగింది. ఆయుర్దాయం పెరుగుదల భారత్‌లో ఎక్కువ అయినా, ఈ పెరుగుదల సమాజంలో చూపించే ప్రభావం భారత్‌లో కంటే అమెరికాలో ఎక్కువ బలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, 65 వయసులో మనిషి ఇంకా బాగానే దృఢంగా ఉంటాడు. అదే మనిషి 70 నించి 80 కి జరిపే ప్రయాణంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా మెదడు, జ్ఞాపకశక్తిని దెబ్బతీసే సమస్యలు ఎక్కువవుతాయి. ఆ వయసువారిని చూసుకోవడానికి ఎక్కువ శ్రద్ధా, వనరులూ అవసరమవుతాయి.

ఆమాటకొస్తే ఈ విషయంలో అమెరికాది ముందంజ కూడా కాదు, కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక జనాభా కలది కావడం వలన అమెరికాకి సంబంధించిన జనాభా పరిణామాలు ఏవైనా సమాజం మీద తీవ్రమైన ముద్ర వేసే అవకాశం ఎక్కువ. అమెరికా ఒక్కదేశంలోనే కాదు, ప్రపంచదేశాలన్నిటిలోనూ జరుగుతున్న ఈ పరిణామం వలన ఒక నాగరికజాతిగా మానవ సమాజానికి కొన్ని ఆసక్తికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి.

సుమారుగా గత నూరేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన పారిశ్రామిక జీవన విధానంలో నాగరిక జీవితంలో కొన్ని పద్ధతులు అలవాట్లుగానూ సాంప్రదాయాలుగానూ స్థిరపడినాయి. ఒక వ్యక్తి సుమారు 25 ఏళ్ళ వయసు వచ్చేవరకూ తలిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఏదో ఒక వృత్తికి, ఉపాధికి అవసరమైన చదువు, శిక్షణ సంపాదించుకోవడం. అటుపైన సుమారు 30-40 ఏళ్ళ పాటు ఆ వృత్తికి సంబంధించిన ఉద్యోగమో వ్యాపారమో చెయ్యడం. అటుపైన రిటర్మెంట్. చాలా మంది వృత్తిలో ఉండగానే మరణిస్తూ ఉండేవారు. అటువంటిది ఇప్పుడు సగటు ఆయుష్షు పెరగడంతో రిటైరయినాక ఇరవయ్యేళ్ళు ముప్ఫయ్యేళ్ళు జీవించి ఉండడం అసాధారణంగా లేదు. కేవలమూ జీవించి ఉండడమే కాదు వారు ఆరోగ్యంగా చురుకుగా ఉంటున్నారు. రకరకాల కార్యకలాపాలలో మునిగి తేలుతున్నారు.

ఉద్యోగవిరమణ తరవాత విశ్రాంత జీవితం గడపడంలో మొదట ఎదురయ్యే సమస్య డబ్బు. ఉద్యోగస్తులకి రకరకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. ఇవికాక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగస్తుల కోసమని పెన్షను పథకాలను అమలు చేస్తున్నాయి. “ఓపిక ఉన్నన్నాళ్ళూ ఉద్యోగం చెయ్యండి, మీ వృద్ధాప్య బాధ్యతని పెన్షను రూపంలో నేను తీసుకుంటాను” – అనే పద్ధతిని జెర్మను ఛాన్సలరు బిస్మార్కు పంతొమ్మిదవ శతాబ్దపు చివరిభాగంలో ప్రవేశ పెట్టాడు. అప్పట్లో ఆయన నిర్దేశించిన రిటైర్మెంటు వయసు 70 ఏళ్ళు. ఆ రోజుల్లో బహు కొద్దిమంది మాత్రమే ఆ పెన్షను సదుపాయాన్ని ఉపయోగించుకుని ఉంటారని మనం ఊహించవచ్చు. అమెరికాలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో నిర్బంధ విరమణ వయసు అంటూ లేదు గానీ సాధారణంగా చాలా మంది 65-70 మధ్యలో రిటైరవడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పధకాలైన సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటివి ఇంచుమించు ఈ వయసులోనే ప్రజలకి అందుబాటులోకి వస్తున్నాయి. 1930లలో గ్రేట్ డిప్రెషను ఉక్కుపిడికిలిలో అమెరికను ప్రజ నలిగిపోతున్న సమయంలో, వృద్ధులైనవారు అత్యధిక సంఖ్యలో బీదతనపు విషకోరలకి బలవుతున్నారని గ్రహించి అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజువెల్ట్ ఈ పధకాలని ప్రవేశ పెట్టాడు.

ఐతే ఇవ్వాళ్ళ ఈ రిటైర్మెంటుకి సంబంధించిన ఆర్ధిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో చిక్కుకున్నది. ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న సోషల్ సెక్యూరిటీ, తత్సంబంధ పధకాలు ఎంతకాలం నిలుస్తాయో గేరంటీ కనబడ్డం లేదు. బేబీ బూమర్ తరం వాళ్ళు అత్యధిక సంఖ్యలో రిటైరవుతూ ఉండడంతో అనేక పెన్షను స్కీములు, ప్రైవేటు కంపెనీలకి చెందినవీ, నగరపాలికలు, రాష్ట్రప్రభుత్వాల వంటి ప్రభుత్వ రంగ సంస్థలకి చెందినవీ కూడా తీవ్రమైన సంక్షోభంలో పడుతున్నాయి. వీటిలో చాలా సంస్థలు తమ ఉద్యోగస్తుల యూనియన్లతో ఈ రిటైర్మెంటు సదుపాయాలని సరికొత్తగా చర్చించే ప్రయత్నాలు చేస్తున్నాయి, ఇదొక దారుణమైన పరిణామం. ఇప్పుడు రిటైరవుతున్నవారు, తాము చురుకుగా ఉద్యోగాలు చేస్తున్న వయసులో – ఇదీ పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం మీకు వృద్ధాప్యంలో ఆదాయం ఉంటుంది – అని చెప్పగా, వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం వాళ్ళ జీవితాలని ప్లాన్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు రిటైరయినాక, తూచ్, ఆ పద్ధతి ఇప్పుడు లేదు అని వారికి మొండి చెయ్యి చూపించడం ఏరు దాటి తెప్ప తగలేసినట్టు. వీళ్ళు ఎలాగా దానికి ఒప్పుకోరు.

అంతేకాక, ఇప్పుడు సంఖ్యాబలం పెరగడం వల్ల సీనియర్ పౌరులు బలమైన వోటు బేంకుగా, లాబీలుగా ఏర్పడుతున్నారు. చెయ్యడానికి వేరే పని కూడా లేకపోవడం వలన ఒక బలమైన కూటమిగా ఏర్పడేందుకు, ఉద్యమించేందుకు కావలసినంత తీరిక. అందుకనే, మీరు గమనించండి, కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, ఇది మార్చాలి, అది మార్చాలి అని ఉపన్యాసాలు దంచుతారుగానీ సోషల్ సెక్యూరిటీ మార్పుకి సంబంధించిన ఒక్క బిల్లు కూడా కాంగ్రెస్ లో గెలవదు. ఎందుకంటే, ఫలాని బిల్లు ప్రవేశపెట్టారు అని వార్త తెలియగానే సదరు కమిటీ సభ్యుల ఆఫీసు ఫోనులు, ఫేక్సులు, ఈ మెయిళ్ళు సీనియర్ల సందేశాలతో నిండిపోతాయి. వాటిని నిర్లక్ష్య పెడితే, సదరు అభ్యర్ధి రాజకీయజీవితం ముగిసినట్లే. AARP వంటి సంస్థలు దేశ రాజకీయాల్లో అత్యంత బలం కలిగి ఉన్న లాబీ సంస్థలు, బహుశా NRA కంటే కూడా బలమైనవి.

ఆర్ధికపరమైన సమస్యలు, రాజకీయాలు అలా ఉండగా, సాంఘికంగా కూడ కొన్ని వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ రోజుల్లో. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టు ఈ కాలపు సీనియర్లు ఎక్కువ కాలం జీవించడమే కాదు, ఇదివరకెన్నడు లేనంత ఆరోగ్యంగా ఉంటున్నారు. వృద్ధాప్యం అంటే కడుపులో చల్ల కదలకుండా ఇంటి పట్టున కూర్చోవడం కాక రకరకాల కార్యకలాపాలు చేపడుతున్నారు. Sixty is the new forty అని ఒక నినాదం నడుస్తున్నది. కొన్నేళ్ళ కిందట ‘వీరిగాడి వలస’ అని ఒక కథ రాశాను. రిటైరయిన ఒక తండ్రి అమెరికాలో కొడుకు దగ్గరకొచ్చి ఉంటూ ఉండగా, ఆయనకి చేతికర్ర ఇచ్చి మూల కూర్చోబెట్టాలని కొడుకూ కోడలూ ప్రయత్నిస్తే వాళ్ళని కాదని ఆయన తన దారిని తాను ఏర్పాటు చేసుకోవడం అందులోని ఇతివృత్తం. కథ చదివిన చాలా మంది సీనియర్ పౌరులు రాఘవరావులో తమని చూసుకున్నామని చెప్పారు. నాకు వ్యక్తిగతంగా పరిచయమున్న చాలా మంది సీనియర్లు, భారతీయులూ అమెరికన్లూ కూడా అనేక రకాల కొత్త వ్యాపకాల్లో నిమగ్నమై ఉన్నారు. చెన్నైలో నివాసముంటున్న ఒక మావయ్యగారు రిటైరయినాక ఒక సంగీత గురువుని పట్టుకుని వయొలిను వాయించడం నేర్చుకుంటున్నారు. ఇక్కడ పరిచయమైన ఒక డాక్టరుగారు రిటైరయినాక వెళ్లి ఆయిల్ పెయింటింగ్ క్లాసులో చేరారు. ఒక పెద్ద మందుల కంపెనీలో డైరెక్టరుగా రిటైరయిన ఒక అమెరికను పెద్దాయన ఓ పదెకరాల స్థలం కొని అందులోనే ఒక మూల చిన్న ఇల్లు కట్టుకుని, మిగతా స్థలంలో ఆర్గానిక్ పద్ధతుల్లో చిన్న యెత్తు వ్యవసాయం చెయ్యడం మొదలు పెట్టారు. స్థానిక లైబ్రరీల వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సీనియర్లకి విజ్ఞానమూ వినోదమూ కలిగించే కార్యక్రమాలని చేపడుతున్నాయి. వ్యాపార సంస్థలు కూడా వీరి అవసరాలని గమనించి వారికి అనువుగా ఉండే ఉత్పాదనలను, సర్వీసులను ప్రవేశ పెడుతున్నాయి. ఇలా సీనియర్ పౌరుల జీవన విధానం చుట్టూ ఒక కొత్త తరహా మార్కెట్ వ్యవస్థ ఏర్పడుతున్నది.

2006లో అనుకుంటా సీనియర్ పాత్రికేయులు కల్లూరి భాస్కరం గారు ఒక మంచి కథ రాశారు. దాని పేరే “మానాన్న, నేను, మా అబ్బాయి”. ఈనాటి అర్బన్ మధ్యతరగతి జీవితాలలో బయట జరుగుతున్న ఆర్ధిక సాంఘిక మార్పులు, ఇంట్లో తరాల అంతరాల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో చాలా వాస్తవిక దృష్టితో చిత్రించారు ఈ కథలో. అయితే ఈ కథ చదివినప్పుడల్లా నాకు ఈ దృశ్యం ముల్లులాగా గుచ్చుకుంటూనే ఉన్నది. ఇప్పటి తరానికి ముందటి తరం ఎప్పుడూ భారమేనా? ముందటి తరాన్ని తీసి పక్కన పెట్టెయ్య వలసిందేనా? అరవయ్యేళ్ళకే వారిక వారివారి కుటుంబాలకీ సమాజానికీ పనికిరాకుండా పోయారా? ఉద్యోగాన్నించి రిటైరయినారు అంటే ఇంక ఏమూలనో ముక్కుమూసుకుని కూర్చుని కృష్ణారామా అనుకుంటూ ఉండవలసిందేనా? ఈ ప్రశ్నలన్నీ సుడులు తిరుగుతూ ఉన్నాయి. అప్పటినించీ ఇప్పటిదాకా పత్రికల్లోనూ, సంకలనాల్లోనూ ఇటువంటి ఇతివృత్తాలతో కథలు కనిపిస్తున్నాయి. మంథా భానుమతిగారు, వారణాసి నాగలక్ష్మి గారు రిటైరైన స్త్రీ దృక్కోణం నించి ఆశావహ దృక్పథంతో మంచి కథలు రాశారు.

ఇది కేవలమూ మధ్యతరగతి వారి సమస్యే కాదు. 2004 ప్రాంతాల్లో ఒక బ్రిటీషు సామాజిక పరిశోధకురాలు వృద్ధాప్యాన్ని గురించి ఫీల్డు వర్కు చెయ్యడానికి హైదరాబాదు వస్తే వారితో దుబాసీగా తోడు వెళ్ళాను రెండు వారాలపాటు. వివిధ ఆర్ధిక సామాజిక వర్గాలకి చెందిన వృద్ధులని ఇంటర్వ్యూ చేశాము. తమ పిల్లల కుటుంబంతో కలిసి అదే ఇంట్లో ఉన్నా, లేక తాము విడిగా ఉన్నా, మేము ఇంటర్వ్యూ చేసిన నలభై మంది చెప్పిన మాటల్లోనూ అంతస్సూత్రంగా ఉన్నది ఒకటే కోరిక – పిల్లలు తమ మాటకి విలువ ఇవ్వాలని, తమతో కలిసి కూర్చుని కష్టమూ సుఖమూ చెప్పుకోవాలని. “మేము చెప్పిన సలహా పాటించి తీరాలని మేము అనడం లేదు. మేమూ చాలా జీవితాన్ని చూశాము, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము. కొన్ని విజయాలని సాధించాము – ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నదీ అంటే కనీసం మమ్మల్ని సంప్రదించవచ్చు కదా. ఎక్కడైనా మా అనుభవం వారికి ఉపయోగపడితే అంతకంటే మాకు కావలసినదేముంది” అంటున్నారు.

ఇటువంటి సమస్యలే పాశ్చాత్య సాహిత్యంలోనూ సినిమాల్లోనూ కూడా కనిపిస్తున్నాయి. 2012లో విడుదలై అమెరికాలో కూడా గొప్ప ప్రశంసలు అందుకున్న ఫ్రెంచి చిత్రం “అమోర్” లో 80ల వయసులో ఉన్న వృద్ధ జంటలో భార్యకి అకస్మాత్తుగా జబ్బు చేస్తే ఆ భర్త పడే మనోవేదన, వారి కూతురు బయటి ఊరినించి వచ్చి వీరి బాగోగులు చూడడం ఎంతో హృద్యంగా చిత్రించారు. ఇంచుమించు ఇదే వృత్తాంతంతో కెనేడియన్ సినిమా “అవే ఫ్రం హర్” ప్రముఖ రచయిత ఏలిస్ మన్రో కథానిక ఆధారంగా తీశారు. 2005లో పులిట్జర్ పురస్కారం పొందిన నవల “గిలియడ్” (రచయిత్రి మెరిలిన్ రాబిన్సన్ రచన)లో అనారోగ్యం పాలైన 76 ఏళ్ళ జాన్ ఏమెస్ జీవిత కథని స్వీయకథనం లాగా అక్షరబద్ధం చేశారు. 2004లో విడుదలైన “ది నోట్ బుక్” సినిమా అటు విమర్శకులనుండీ, ఇటు సాధారణ ప్రేక్షకులనుండీ సమానంగా ప్రశంసలు అందుకున్నది.

సాహిత్యమూ సినిమా కొంతవరకైనా నిజజీవితాన్ని ప్రతిబింబిస్తాయని మనం ఒప్పుకుంటే, ఇప్పుడు మన సమాజం – ఇక్కడ అమెరికాలోనైనా, అక్కడ భారత్‌లోనైనా – వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యలపై మరింత దృష్టి పెట్టాలనీ, వృద్ధులవుతున్న మన తలిదండ్రుల మనోభావాలనూ, ఇష్టాయిష్టాలనూ పట్టించుకోవాలనీ ఈ రచనలూ సినిమాలూ బలంగా సూచిస్తున్నాయి అని నా భావన.

జంతువులలో సమూహంగా నివాసం ఉండే జంతు సమాజాలలో ఒక ఆసక్తికరమైన పరిణామాన్ని గమనించారుట జంతు శాస్త్రజ్ఞులు. గుంపుకి నాయకుడిగా ఉండేది సాధారణంగా బలిష్టుడైన యుక్తవయస్కుడైనా, గుంపులో గనక వయోవృద్ధులైన సభ్యులు, ఆడకానీ మగకానీ, ఉన్నట్లయితే ఆ గుంపు మనుగడ బాగా జరుగుతున్నట్లు గమనించారు. ఇంకా పునరుత్పత్తి స్థితిలో ఉన్న జంతువులు సర్వ సాధారణంగా తన వంశం మాత్రమే అభివృద్ధి చెందాలని చూసుకుంటూ ఉంటాయి. ఆ స్థితిని దాటిపోయిన వయసు జంతువులు, గుంపులోని సీనియర్ సభ్యులు, మొత్తం గుంపు యొక్క బాగు కోసం పాటుబడుతుంటాయిట. తమ జీవిత కాలంలో గడించిన జ్ఞానాన్ని గుంపు మనుగడకోసమూ, అభివృద్ధికోసమూ వినియోగిస్తుంటాయిట. ట్రైబల్ సమాజాలలో కూడా ఈ పద్ధతులు మనకి ఈ నాటికీ కనిపిస్తుంటాయి. ఆయా తెగల సభ్యులు కూడా తమ వృద్ధుల పట్ల అపారమైన గౌరవం చూపిస్తుంటారు. ఈనాటి నాగరిక సమాజంలో ఈ పాతకాలపు పద్ధతుల్ని మళ్ళీనేర్చుకుని అలవాటు చేసుకోవలసిన అవసరం కనిపిస్తున్నది. ఈకాలపు తాతయ్యలూ అమ్మమ్మలూ కృష్ణారామా అనుకుంటూ కూర్చోవడానికి ఇష్టపడ్డం లేదు. అత్యాధునిక టెక్నాలజీతో ఆటలాడుకునేందుకు ముందుకొస్తున్నారు. ఒక సార్వజనీనమైన పితృవాత్సల్యంతో ఏదైనా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. మనం ఏమి పుచ్చుకోగలమో, తద్వారా ఏమన్నా బాగుపడగలమో మనమూ మన నాగరిక సమాజాలూ నిర్ణయించుకోవాలి.

The stories and films mentioned in this column:

1) వీరిగాడి వలస, కథ, ఎస్. నారాయణస్వామి http://www.eemaata.com/em/issues/200209/581.html

2) మా నాన్న, నేను, మా అబ్బాయి, కథ, కల్లూరి భాస్కరం, కథ 2006 సంకలనం

3) పరిష్కారం, కథ, డా. మంథా భానుమతి, అనంతవాహిని కథల సంపుటి

4) వారధి, కథ, వారణసి నాగలక్ష్మి, స్వాతి మాసపత్రిక్ డిసెంబరు 2012, తెలుగునాడి అమెరికా పత్రిక, ఫిబ్రవరి-మార్చి 2013

5) Amour (French film 2012) http://www.imdb.com/title/tt1602620/?ref_=sr_1

6) Away From Her (Film 2006) http://www.imdb.com/title/tt0491747/?ref_=sr_1

7) Gilead (Novel, 2004)  Marylynne Robinson http://www.amazon.com/Gilead-A-Novel-Marilynne-Robinson/dp/031242440X/ref=sr_1_1?ie=UTF8&qid=1367772172&sr=8-1&keywords=gilead

8) The Notebook (Film 2004)http://www.imdb.com/title/tt0332280/?ref_=sr_1

 

వ్యాసం లో వాడిన ఫోటో వికీపీడియా సౌజన్యం తో ( http://en.wikipedia.org/wiki/File:Maes_Old_Woman_Dozing.jpg)

 

Download PDF

11 Comments

 • Ismail says:

  చాలా చక్కని పరిశీలన. ఒక్క విషయంలో మాత్రం మీరు పొరబడ్డారు… ‘Sixty is new Forty’ కాదు’ అరవై కొత్త ఇరవై’ . నేను ఇప్పటి నుంచే నా మరో ఇరవైకి ప్రణాళికలు వేసుకొంటున్నా:-) Jokes అపర్త్, మన మొదటి ఇరవై చదువులతో సరిపోతుంది. మరో ఇరవై ఉద్యోగ ప్రయత్నాలు, career stabilizationతో సరిపోతుంది, అటు పై ఇరవై మన పిల్లల ఇరవై ప్లానింగ్ లో గడచిపోతాయి. So మన రియల్ లైఫ్ మొదలయ్యేది అరవైలోనే:-) అది జీవిత చరమాంకం కాదు మరో కొత్త మజిలీ అంతే! మనుమలు, మనుమరాండ్ర ఆటలతో, తీరిక సమయంలో మన అభిరుచులకు బాగా సమయం కేటాయించి లైఫ్ enjoy చేసే సమయం ఇది. నాకు తెలిసి మన కంటే చిన్నవారితో స్నేహం చేస్తూ పోతే మన మనస్సూ వారి వయస్సు లాగా నిత్యనూతనంగా ఉంటుంది;-)

 • బాగుందండి. పైన ఇస్మయిల్ గారు చెప్పినట్లుగానే చక్కని పరిశీలన.

 • Yaji says:

  నేను ఒక డెభ్భై అయిదేళ్ళ వ్యక్తి తో రాకెట్ బాల్ డబుల్స్ ఆడతాను. ఇప్పటికీ తను వేగంగా కోర్టు మీద కదలకపోయినా మా చేత కోర్టంతా పరిగెత్తిస్తారు. చాలా సరదాగా మాతో కలిసిపోతూ, తన ఏజ్ మీద తనే జోకులేసుకుంటూ ఉంటారు.

  మీ వ్యాసం చదువుతుంటే నాకు అతడే గుర్తుకు వచ్చాడు.

  “వయసుకి” గౌరవం ఇవ్వటం మన సంస్కృతి. అమెరికా లాంటి చోట వయస్సు గురించి ఎక్కువగా ఆలోచించటానికి లేదు, ఏజ్-డిస్క్రిమినేషన్ ఇక్కడ చాల సీరియస్ గా తీసుకుంటారు కాబట్టి.

  “అరవై”, ఆరోగ్యంగా ఉండి, ఆర్ధిక స్వాత్రంత్ర్యం ఉన్నప్పుడు ఒక సమస్యే కాదు. అలాగే ఈ దశలో ఉన్నవాళ్ళు సమాజ శ్రేయస్సు కొరకు ఆలోచిస్తారు, అందువల్ల వారిని గౌరవించి మనం బాగుపడాలి లాంటి ధియరీ తో నేను ఏకీభవించను. సమాజం గురించి ఆలోచించటం గానీ, లేక మరొక ఉదాత్తమైన ఆలోచనకి కానీ, ఏజ్ తో పెద్ద సంబంధం లేదు. మన దేశ రాజకీయనాయకులని చూడండి ఒక్క సారి. మన దేశమే కాదు, చాలా దేశాలలో అదే కనపడుతుంది.

  కానీ, నిజంగా బలహీనులు, వృద్ధులైన వారిని మనం ఎలా ట్రీట్ చేస్తునమన్నది, మన సమాజపురోగమనానికి, తప్పకుండా ఒక కొలబద్ద.

 • mythili says:

  చాలా మంచి విషయాన్ని ఎంచుకున్నారండీ

 • వ్యాఖ్యాతలందరికీ నెనర్లు.
  ఇస్మాయిల్ – జీవితాన్ని ఆస్వాదించడానికి అదే సరైన సమయం – నిజమే.
  యాజి – గౌరవించడం అంటే, పడి పడీ దణ్ణాలు పెట్టాలని నా ఉద్దేశం కాదు, అలాగే బాగు పడ్డం అంటే, ఒక కుటుంబపు ఉన్నతి కాదు. వ్యాసంలో నేను ఉదహరించిన మేరికను పెద్దాయనతో నాకొ కొన్నేళ్ళ పాటు ఆంతరంగిక స్నేహం నడిచింది. జీవితంలో అనేక పరస్పర వ్యతిరేక శక్తుల మధ్య సమతుల్యత సాధించడం పట్ల నాకుంటూ ఉన్న చాలా సందేహాలు ఆయనతో జరిపిన చర్చల్లో, వారి జీవన విధానాన్ని చూశాక తీరినాయి. ఇదే బెనిఫిట్ ఆయనతో స్నేహం చేసిన ఇతరులు కూడా నేర్చుకుని ఉండొచ్చు. మళ్ళి నా ద్వారా, నా పిల్లలూ, మరికొందరూ నేర్చుకోవచ్చు. అదీ, నా ఉద్దేశం.

 • సాయి పద్మ says:

  మంచి వ్యాసం స్వామి గారూ, మంచి రెఫెరెన్సులు ఇచ్చారు. అరవై వచ్చినా, లైఫ్ స్టైల్ బాగుంటే, ఎప్పుడూ ఏ సమస్యలూ రావు అన్న విషయం . తరాల అంతరం బాగా చెప్పేరు . ఇండియా is యంగ్ అన్నప్పుడల్లా.. నాకు పెన్షన్ మీద బ్రతుకు ‘ఈడుస్తున్న’ (ఇక్కడ డబ్బు కాదు సమస్య, సరైన, వైద్యం, ఆదరణ ) ఎంతో మంది పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళని చూడకుండా ఇండియా షైనింగ్ అంటే ఒకోసారి వింతగా ఉంది . ఇది మంచి ప్రారంభ వ్యాసం , ఇలాంటి చర్చలకి. థేంక్ యు

 • ఇస్మాయిల్ ద్వారా ఈ లంకె అందింది. నా మిత్రుడు ఒకడు మారధాన్ లో పాల్గొంటున్నాడు. నాకనిపిస్తూ ఉంటుంది భారతదేశంలో ఎందుకని రిటైర్ అవ్వగానే ఇంటికి పంపేస్తారు? వారి అనుభవాన్ని గ్రహించ వచ్చు కదా అని? వ్యాసం బాగుంది. వీరిగాడి వలస ఇదివరకే చదివాను. మిగతావి వెతుక్కుని చదువుకోవాలి!

 • చాలా చక్కని వ్యాసం అందించారు నారాయణ స్వామి గారు ! జంతు సమాజాల లో వృద్ధుల గురించి మీరు ప్రస్తావించిన విషయం ,శ్రద్ధగా గమనిస్తే మానవ సమూహాల్లో కూడా వాస్తవమని తెలుస్తుంది. అరవై దాటినా ఉత్సాహంగా తనకి నచ్చినట్టుగా జీవించే వాళ్లకి వయసుకి తగ్గట్టు ప్రవర్తించమని సలహాలు చెప్పేవాళ్ళు,విమర్శలతో బాధించేవాళ్ళూ మన దేశంలో ఎక్కువే.వాళ్ళ దృష్టిలో కోరికలూ సరదాలూ యువతరానికే అన్న ధోరణి కనిపిస్తుంది.పక్క వాళ్ళ జీవితంలో అతిగా జోక్యం చేసుకునే తత్త్వం ఒకవైపయితే, ఒక అడుగు ముందుకేసి సాయపడాలన్నతాపత్రయమూ ఎక్కువే. మంచిని అందుకుని చెడుని విసర్జించగలిగితె ఏ సమాజంలోనైనా నేర్చుకుందుకు తగినంత దొరుకుతుందనిపిస్తుంది.
  నా కథని ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.పాఠకుల సౌకర్యార్ధం ఈ కథకి లింక్ ఇస్తున్నాను.
  http://vanalakshmi.blogspot.in/2012_11_01_archive.html

 • అనిల్ గారు, నాగలక్ష్మి గారూ, నెనర్లు.

 • బాగుందండి .చక్కని వ్యాసం

 • భాస్కరం కల్లూరి says:

  నారాయణస్వామి గారూ… నా కథను ప్రస్తావించిన మీ వ్యాసాన్ని యాదృచ్ఛికంగా ఇప్పుడే చూశాను. ఎలా మిస్ అయ్యానో ఆశ్చర్యం కలిగింది. ఈ చూడడం వెనక కథ ఏమిటంటే, అమెరికాలో ఉన్న నా తమ్ముడి కొడుకు తండ్రి కాబోతున్నాడు. వాడు పొద్దునే నాకు మెసేజ్ ఇచ్చాడు.” పెదనాన్నా, నువ్వు రాసిన కథ గురించి విన్నాను. నేను తండ్రిని కాబోతున్నాను కనుక ఆ కథ చదవాలని ఉంది. దాని సాఫ్ట్ కాపీ ఉంటే పంపుతావా?” అని. నా దగ్గర సాఫ్ట్ కాపీ లేదు. నెట్ లోకి వేడితే ఎక్కడైనా దొరుకుతుందేమో నని చూస్తుంటే మీ సారంగ వ్యాసం లింకు కనబడింది. ఆలస్యంగా మీకు ధన్యవాదాలు.
  అయితే ఒక చిన్న వివరణ. వృద్ధాప్యంలో కృష్ణా రామా అంటూ కూర్చోవాలన్న ఫిలాసఫీకి నేను మీలానే పూర్తిగా వ్యతిరేకిని. నాకు గుర్తున్నంతవరకు ఆ భావన నా కథలో ఎక్కడా ధ్వనించినట్టులేదు. నేను వేరే ఊళ్ళో ఉండడం వల్ల కథ నా ఎదురుగా లేదు చెక్ చేసుకోడానికి. . ఆ కథ వెనుక వేరే నిర్దిష్టమైన ఫిలాసఫీ ఉంది. మరోసారి థాంక్స్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)