సృజనలో అబద్ధాన్ని భస్మం చేసిన త్రినేత్రుడు త్రిపుర

 

నాటి-నేటి త్రిపుర

“మీరు డాంటెలాగ జీవితపు లోతుల్ని తవ్వుకుంటూ, వెతుక్కుంటూ అలా ఓవర్ కోటు వేసుకుని, పలచబడుతున్న జుట్టుతో ప్రపంచంలోని విషాదాల్నీ, బాధల్నీ భుజాన వేసుకుని మొగల్ సరాయ్ ప్లాట్ ఫాం మీద తిరుగుతున్నారు. మీ బియట్రిస్ మీకు ఎప్పుడో దొరుకుతుంది. నేను కుంటి కాలుతో ఇక్కడ ఈ కుర్చీలో సరిగ్గా నిద్ర పట్టక చస్తున్నాను”

పాతికేళ్ళ వయసులో పై వాక్యాలు మొదటిసారి చదివినప్పుడు డాంటే సంగతేమో తెలీదుగానీ ఈ రచయిత మాత్రం ప్రపంచంలోని విషాదాన్నీ, బాధల్నీ భుజాన వేసుకుని తిరుగుతున్నట్టూ, నేనేమో నిస్సహాయంగా ఆ కుర్చీలో కూలబడ్డట్టూ అనిపించింది. ఆ కథలు చదివాకా నాలోని అస్పష్టమైన తపనకీ, అలజడికీ ఆయన అక్షరరూపం ఇచ్చినట్టు అనిపించింది. అందుకే ఆ అక్షరాలు నన్ను తీవ్రంగా వెంటాడేయి. రాత్రులు రాత్రులు ఆ కథలతోనే గడిపాను. ఆయనలా రాద్దామని ప్రయత్నించి చేతులు కాల్చుకున్న సందర్భాలెన్నో!

“జ్ఞాపకాల ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం కాబోలు. మనం ఉందనుకున్న పేటర్న్ అసలు ఉన్నది కాదు. మానవ జీవితం మీద మనం మన అవసరాల కోసం ఇంపోజ్ చేసింది. ఆ పేటర్న్ లేకపోతే జీవితం సాగదు”

 “కానీ ఇంకా నీ రహస్య మూలల అస్తిత్వపు లోతుల్లో మొహం చెల్లని అపరాధ భావనలో నువ్వింకా ఊపిరొదుల్తునే ఉన్నావు తెలివాన దారాల పరదాల కిటికీ అద్దాల మీద ఈ ప్రపంచాన్ని మరోసారి దర్శిద్దామని ఆశిస్తూ”

 “తుడవాలి. ఇనప చీపుళ్ళు పెట్టి దేశాన్ని తుడవాలి. మిగిలిన చెత్తని కాల్చాలి. ఒకసారి అంతా కాల్చి శుభ్రం చెయ్యాలి”

 “అంచనానాలూ, పద్దతులూ, చరిత్రలూ, చరిత్ర నేర్పే పాఠాలూ మరిచి, వదిలి, క్షణ క్షణం ఎదురయ్యే జీవితాన్ని ఎదుర్కొంటూ గడిపితే?”

 “జీవితంలో ఎప్పుడోగాని సమయాలు రావు, మనిషి శక్తినంతటినీ పరీక్షించేందుకు. ఆ సమయాల్లోనే నిద్రకళ్ళతో జవాబులిచ్చానా? ఇచ్చిన జవాబులూ, చేసిన పనులూ, వాటి అర్ధాలను వెతుక్కోవడం.. ముళ్ళు బిగుస్తాయి.. విప్పబోతే ఇంకా గట్టిగా..”

ఆయన కథనంలో ఒక మహానదికున్నంత వేగం ఉంది. అందుకే ఆ ప్రవాహంలో కొట్టుకుపోనివాళ్ళు అరుదు. ముందునుంచీ ఎక్కువ చదువుకున్నదీ, ఎక్కువ ఇష్టపడ్డదీ కవిత్వమేననీ అందుకే తన వచనం కూడా కవిత్వంలాగే వుంటుందనీ అంటారాయన. ఆ అక్షరఝరి ఎవరిదో ఈ పాటికే మీకు అర్ధమై ఉండాలి. “నేను ఇలాంటి కథలు రాయగలనా” అని పాలగుమ్మి పద్మరాజు గారి చేత అనిపించిన కథకుడు త్రిపుర. రమణ జీవి మాటల్లో చెప్పాలంటే “ప్రతి క్షణమూ అనుభవిస్తున్నప్పటికీ అపరిచితంగానే మిగిలిపోయే అస్తిత్వ సముద్రాన్నీ , దాని మీద గదులు గదులుగా నివసించే అర్ధపు నురగనూ ఏక కాలంలో స్పృశించిన త్రిపుర వంటి కథకుడు భారతదేశంలో మరొకరు లేరు”

చుట్టూ చీకటి

అలల కల్లోలం

దూరంగా చూడు

నిరంతరం నీ కోసం

కొండ మీద ఒక దీపం

తిరుగుతునే ఉంటుంది

దీపపు కాంతిని చూసి దీపాన్ని వెతుక్కున్నట్టు , పాట విని చెట్టు గుబురుల్లో పక్షిని వెతుక్కున్నట్టు నేను నా లైట్ హౌస్ త్రిపుర గారిని వెతుక్కున్నాను.

 * * *tripura1

                                                                                                                                                                                                                                                                        సుమారు ఆరేళ్ళ క్రితం అప్పటి అవగాహనతో ఒక కళాకారుడి అన్వేషణ గురించి అమరావ్రతం అనే కథ రాసాను. ఆ కథలో ఏదో లోపం ఉందని తెలిసేది గానీ అదేమిటో అంతుచిక్కేది కాదు. అలా దాదాపు ఏడాదిన్నర పాటు ఆ కథని ఎవరికీ చూపించకుండా అలా ఉంచేసాను. తర్వాత ఒకసారి పప్పు నాగరాజు గారికి పంపిస్తే ఆయన చదివి, “కథలో సాధన పరిపూర్ణత చెందని కళాకారుడు జీవితంలో దెబ్బలు తట్టుకోలేక గుడి మెట్లపై పడుకుంటే, ఊరి ప్రజలు బౌద్ధ గురువు దగ్గరకి వెళ్ళి అతని విషయం మొరపెట్టుకున్నట్టు ఉంటుంది. అది అతకదండీ. గురు శిష్యుల కలయిక ఎప్పుడూ ఒక ఏక్సిడెంట్. కానీ మరో ప్లేన్లో చూస్తే అది ఏక్సిడెంట్ కాదు. అలా ఉండాలి” అన్నారు. అప్పుడు దీపాలు వెలిగాయి. తర్వాత ఆ కథని మార్చి పూర్తి చేయడమూ, అది పొద్దులో ప్రచురితమవడమూ వేరే సంగతి.

త్రిపురగారితో నా మొదటి పరిచయం కూడా ఏక్సిడెంటల్ గానే జరిగింది. 2004 లో బెంగుళూరులో బాపు బొమ్మల కొలువు, ఇంకా కొన్ని పుస్తకాల ప్రదర్శన ఉందంటే వెళ్ళాం. అక్కడ పుస్తకాల్లో “త్రిపుర కథలు” పుస్తకం చూసాను. రచయిత పేరు వినలేదు. వాంగో “స్కేరీ నైట్స్” పెయింటింగ్ ఆ పుస్తకానికి కవర్ పేజీ.  లోపలి పేజీలు తిరగేసాను..

Who calls my poems poems?

My poems are not poems.

Knowing my poems are not poems

Together we can begin to speak of poetry.

— Ryokan

నాకు బాగా ఇష్టమైన జపనీ కవిత. ఈయనకి కూడా నచ్చిందే అని ఒక అబ్బురం. ఇంకేమీ ఆలోచించకుండా పుస్తకం కొనుక్కున్నాను. ఇంటికి వచ్చి మొదటి కథ”పాము” చదివాను. కొత్తగా ఉందే అనిపించింది. మిగతా కథలు కూడా చదివాను. మొదట్లో అర్ధం కాకపోయినా ఆ కథలు నన్ను చదివించాయి. మళ్ళీ మళ్ళీ చదివించాయి. ఆ కథల్లో కల్పించిన వాతావరణం అంతా నాకు కొత్త. బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిసరాలు, మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్, బర్మా ఇవన్నీ. వ్యక్తుల మనస్తత్వం కూడా నాకు కొత్త. ఉన్నత తరగతిలోంచి వచ్చిన మనుషులు. అయినా చిత్రంగా కథలన్నీ నాకు విపరీతంగా నచ్చాయి.

ఆయన పదాలతో బొమ్మ కట్టే తీరు, సముద్రపు హోరులో కెరటానికీ, కెరటానికీ మధ్య ఉన్న అమోఘమైన నిశ్శబ్దాన్ని తన కథల్లోకి ప్రవేశపెట్టగల ప్రజ్ఞ నన్ను అబ్బుర పరిచింది. రెండు మూడు బ్రష్ స్ట్రోక్స్ తోనే ఒక బొమ్మ గీయగల నేర్పు కూడా ఆయన కథల్లో చూడొచ్చు. సాఫీగా తాపీగా సాగే “అనగనగా…” కథలకి అలవాటు పడిన నన్ను ఒక్కసారిగా ఒక మహాప్రవాహంలోకి తోసేసినట్లైంది. మనిషి సాటి మనిషి కోసం చెయ్యగలిగిన త్యాగం ఒక వైపు, ద్రోహం మరోవైపు ఈ రెండిటి మధ్యా ఈయన కథలు ఊగిసలాడతాయి.

అక్షరాల్లోకి ఆత్మని పొదిగే మంత్ర విద్య ఏదో ఈయనకి పట్టుబడినా కేవలం పదిహేను కథలు మాత్రమే రాసి పెన్ను మూతపెట్టీసిన కథకుడాయన. త్రిపుర గారు గత పాతికేళ్ళ నుంచీ వైజాగులోనే ఉంటున్నా , చాలా సార్లు బీచ్ కి వెళ్ళినప్పుడు పాండురంగాపురం డౌన్లోంచే వెళ్ళినా, ఆ సముద్రపొడ్డున చిన్న అపార్టుమెంటులో మరో సముద్రం నివాసం ఉందని నాకు తెలీలేదు. 2011 లో కనక ప్రసాద్ గారు, మరొక త్రిపుర గారి వీరాభిమాని రామయ్య గారు వీళ్ళిద్దరి ద్వారా త్రిపుర గారి ఫోన్ నంబరు సంపాదించాను.

* * *tripura 3

2011 జూన్ 27  ఉదయం 11 గంటలు. వాళ్ళ అపార్టుమెంటు తలుపు తట్టాను. ఆయనే తలుపు తీసారు. నా ఎదురుగా నేనిన్నాళ్ళనుంచీ వెతుక్కున్న త్రిపుర గారు. “శేషాచలపతి, భాస్కర్ , కల్యాణి, సుశీల, వీరాస్వామి” పాత్రల సృష్టికర్త. మాటల్లో చెప్పలేని అనుభూతి అది. ఆయన అక్షరాలకంటే కాంతివంతంగా కనిపించాయి ఆయన కళ్ళు. మూర్తీభవించిన కరుణలా ఉన్న ఆయన్ని చూసి “ఈయన ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదు” అని నమ్మకంగా అనుకున్నాను.

కూచున్నాకా బెంగుళూరులో ఏం చేస్తుంటావు, వైజాగులో ఇల్లెక్కడ ఇలా అన్ని వివరాలూ అడిగారు. You look very young అంతా విని అన్నారు నవ్వుతూ. ఆయన కాఫ్కా కవితల పుస్తకం ఇచ్చారు. నా “ఏటి ఒడ్డున” ఇస్తే తీసుకున్నారు. ఏవేవో ప్రశ్నలడిగాను. అన్నిటికీ చాలా క్లుప్తంగా స్పష్టంగా సమాధానాలిచ్చారు. త్రిపుర మౌనం గొప్పది. తర్వాత ఈ రెండేళ్ళలో ఆయన్ని ఒక పది సార్లు కలిసుంటాను.  ఎన్నోసార్లు ఫోనులో మాట్లాడాను.  త్రిపుర గారి మాటల్లో ఎవరినీ కటువుగా విమర్శించడంగానీ, మంచి చెడ్డలు బేరీజు వెయ్యడం గానీ చూడం. “Your stories didn’t suit my taste. I like your poetry, write more poems” అన్నారు నా రచనలు చదివి.

మిమ్మల్ని influence చేసినవి  ఏమైనా ఉన్నాయా? అని అడిగితే, “Passing influences అన్నీ.. కొంతమంది ఊసరవెల్లి అని కూడా అంటారనుకో” అని నవ్వేరు. బెనారస్, JK(జిడ్డు కృష్ణమూర్తి) , Zen, Kafka, Naxalism, Existentialism వీటన్నిటి గురించీ చెప్పారు. “I was actively involved in radical student movements in West Bengal” అన్నారు. JK బెనారస్ వచ్చినప్పుడు ఆయనకి రోజూ ఉదయాన్నే మిల్క్ కూడా తీసుకెళ్ళి ఇచ్చేవాణ్ణనీ ,  తర్వాత క్రమంగా ఆయన ప్రభావం తగ్గిపోయిందనీ, You should think freely  అన్న JK నే మరణశయ్య మీద ఉన్నప్పుడు How to preserve Krishnamurthy’s thought for the future generations అని మథనపడ్డాడని చెప్పి నవ్వేరు. నాక్కూడా జెన్ బౌద్ధంలో ఆసక్తి ఉండడంతో మళ్ళీ మళ్ళీ అడిగేవాణ్ణి. మీకు జెన్ బుద్ధిజం మీద ఇష్టం ఎలా కలిగింది? అని, ఆయన బర్మాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు practicing Buddhists కోసం ఒక జెన్ యోగి సూచన మేరకు బుద్ధిస్ట్ టెక్స్ట్స్ చదివి వినిపించేవారుట. “Zen నాకు నచ్చుతుంది. It suits my nature. It doesn’t ask you to practice anything. నాకు ఇలా కూచోడం ఇష్టం. ఇలా కూచుంటాను అంతే” అంటారు.

“షేక్స్పియర్ వర్కే కానక్కరలేదు నా పేరు త్రిపురాంతకేశ్వర రావు అని రాసినా I consider that as work of literature because you are giving a concrete form to something that is abstract”అన్నారు ఒక సందర్భంలో. మీకు ఇంగ్లీషులో అంత ప్రావీణ్యం ఎలా వచ్చింది? అంత ప్రావీణ్యం ఉన్నా మీరు ఇంగ్లీషులో కథలెందుకు రాయలేదు? అని అడిగితే,  బాల్యం అంతా ఒరిస్సాలోనే అవడం వల్ల ఫౌండేషన్ అంతా ఇంగ్లీషులోనేననీ, తొమ్మిదేళ్ళ దాకా ఫాదర్ రాండ్ అని ఒక న్యూజీలాండ్ స్కాలర్ దగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నాననీ, తర్వాత వైజాగు AVN college లో టేకుమళ్ళ రామారావు అని మంచి లెక్చరర్ వల్ల కూడా ఇంగ్లీషు బాగా అబ్బిందనీ చెప్తారు. “ఇంగ్లీషులో నాకు తెలీని పదం లేదు (ఈ మాట చెప్తున్నప్పుడు కూడా ఆయనలో ఎక్కడా కొంచెం కూడా గర్వం లేకపోవడం చూసి నేను చకితుణ్ణయ్యాను). తెలుగు మాత్రం చాలా కష్టపడి నేర్చుకున్నాను. తొమ్మిదో ఏట బాపట్లలో అక్షరాభ్యాసం జరిగింది. 1960 లో మా నాన్న గారు పోవడం రకరకాలుగా నన్ను మార్చింది. మా నాన్న గారు పోవడానికీ, తెలుగులో రాయడానికీ కనెక్షన్ ఉంది. అదేమిటి అంటే చెప్పలేను. But there is a deep connection. అందుకని తెలుగులోనే రాసాను” అంటారు. భారతి పత్రికలు చదివి తెలుగు నేర్చుకున్నాననీ, ఒక్కొక్క పదానికే అర్ధం రాసుకుంటూ స్వయంగా డిక్షనరీ తయారు చేసుకున్నాననీ చెప్తారు.

బెనారస్ అనుభవాలు ఉత్సాహంగా చెప్తారు. వైజాగునుంచి బెనారస్ వెళ్ళగానే ఒక్కసారి పంజరంలోంచి బయటికెళ్ళినట్టైందిట. టెన్నిస్ ఆడేవాణ్ణనీ, అక్కడే బలంగా తయారయ్యాననీ. ఒక పక్క థియోసఫికల్ సొసైటీతో, మరో పక్క సిపిఐ తో సంబంధాలు, గంగా నది, ఘాట్లు ఇరవై యేళ్ళ వయసులోని ఉత్సాహం, విద్యార్ధులతో ఇంగ్లీషు డ్రామాలు వేయించడం, అగ్రికల్చరల్ బిఎస్సీ అయిపోయాక MSc మధ్యలో ఆపేసి వెనక్కి వచ్చెయ్యడం, తర్వాత ఒక మిత్రుడి సలహామేరకు తిరిగి BHU లోనే ఇంగ్లీషు సారస్వతంలో MA చెయ్యడం, ఫైనల్ పరిక్షలో  పాఠ్యాంశాలకి పరిమితం కాకుండా ఒక ఫిలాసఫర్లా రాసి తీరా బయటికొచ్చాక పాసవుతానా లేదా అన్న భయంతో షిమోగాలో లింగప్ప అనే మిత్రుడి దగ్గరకి వెళ్ళిపోవడం, జోగ్ ఫాల్స్ దగ్గర పోకతోటల్లో బండేసుకుని తిరుగడం, ఆ కాలంలోనే నాయుడుపేట నుంచి నాన్న గారు పంపించిన ఉత్తరాల కట్టలో తను యూనివర్సిటీ ఫస్టు వచ్చినట్టూ, అదే కాలేజిలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా నియమిస్తూ Appointment letter అందుకోవడం , బెనారసులో ఆయన పరిచయాలు, తర్వాత మదనపల్లె, వైజాగు, మాండలే, జాజ్ పూర్, త్రిపురలో ఉద్యోగ అనుభవాలు. ఇలా ఎప్పటెప్పటి అనుభవాలో చెప్తుంటే ఆయన జ్ఞాపకశక్తికి అబ్బురపడుతూ మనం అన్నీ మరిచిపోయి వింటూ కూచుంటాం.

Qమీ కథల్లో ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్ ఉంటాయంటారు కదా అంటే

“సాహిత్యం మనల్ని ప్రతిబింబించాలి. మనకి తెలిసిన జీవితాన్ని రాయాలి. ఏదో స్లమ్స్ లో రెండు చక్కర్లు కొట్టొచ్చి రాస్తే దాన్లో ఆత్మ ఉండదు. All my stories are in some way related to my life”  అంటారు.

Qమీ కథలు అర్ధం కావు అంటారు కదా అంటే

“అవును. Incomplete వాక్యం అంటే నాకు ఇష్టం. జీవితంలోనూ, కవిత్వంలోనే కొంత అర్థం కాని తత్వం ఉంది” అంటారు నవ్వుతూ.

తర్వాత ఆయన కథల నేపథ్యాల గురించి, బెనారస్ లో చదువుతున్న రోజుల్లో మన్మోహన్ దాస్ అని ఒరియా స్టూడెంట్ ఇన్స్పిరేషన్ తో సృష్టించిన బలమైన పాత్ర  శేషాచలపతి, బర్మాలో కార్గో సామ్రాజ్యపు అధిపతి తర్వాత ఫకీరుగా మారిన కృష్ణారెడ్డి “జర్కన్” కథలో వీరాస్వామిగా మారిన వైనం, వైజాగు కలెక్టరాఫీసు జంక్షన్లో షణ్ముకానంద విలాస్ అనే హోటల్లో కూచుని వచ్చీపోయే వాళ్ళని గమనించినప్పటి అనుభవాలు “హోటల్లో” , శామ్యూల్ బెకెట్ “వెయిటింగ్ ఫర్ గోడో” టైటిల్ మాత్రమే చదివి ఆ ఇన్స్పిరేషన్ తో రాసిన “భగవంతం కోసం”, హౌరా టు ఢిల్లీ రూట్లో ఉన్న పెద్ద జంక్షన్ అన్ని రైళ్ళు అర్ధరాత్రే వచ్చే మొగల్ సరాయ్ అంటే ఆయనకి ప్రత్యేకమైన ఇష్టం. స్టేషనుకి ఎవరిని రిసీవ్ చేసుకోవాలన్నా  రాత్రి పదింటికి బయలుదేరి వెళ్లాలి, అర్ధరాత్రి ప్లాట్ ఫాం మీద చలిలో, ట్రాలీ మీద కూచుని.. సిగరెట్ కాల్చుకుంటూ బ్రిడ్జి మీద చీమల్లా కదుల్తున్న మనుషుల్ని పరిశీలించడం..  రైటర్ కి గొప్ప వాతావరణం అంటారు. ఆ వాతావరణాన్ని అద్భుతంగా చిత్రించిన “చీకటి గదులు”, త్రిపురలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ముగ్గురు నక్సలైట్లకి నెలరోజులు ఆశ్రయిమిచ్చిన తర్వాత, సహాయం చేసినవాడే ద్రోహం చెయ్యడంతో, నెర్వస్ బ్రేక్ డౌన్ అయి పిచ్చాసుపత్రిలో కొంత కాలం ఉండి బయటికొచ్చిన తర్వాత రాసిన “అభినిష్క్రమణ”, చుట్టూ హౌరానది , వందలాది సరస్సులు, వెదురు కాటేజీ, రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలు, ఆ సరస్సుల్లోకి వలస వచ్చే పక్షులు ఈ నేపథ్యంలో అగర్తలా మొదలుపెట్టి వైజాగులో పూర్తి చేసిన అద్భుతమైన ఆఖరి కథ “వలస పక్షులగానం” ఇలా కథా నేపథ్యాలు చెప్తుంటే వినే అరుదైన భాగ్యం నాకు దక్కినందుకు ఎంత సంబరపడ్డానో.

ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నారు.

“Confessional element  లేని సాహిత్యం సాహిత్యం కాదు. ఇది ఇంకేమైనా కావచ్చు. ఎంత మంది సమాజం గురించి రాయడం లేదు. అది వేరే సాహిత్యం. టెలిఫోన్డైరెక్టరీ కూడా ఒక సాహిత్యమే. దాన్ని చూస్తూ కూడా ఇమాజినేషన్లోకి పోవచ్చు. కన్ఫెషనల్ ఎలిమెంట్ లేనిది సాహిత్యం కాదు అనేది నాకు సంబంధించిన అభిప్రాయం.  నా కథల్లో కన్ఫెషనల్ ఎలిమెంట్ ఉంటుంది. అటువంటి సాహిత్యానికే నేను రెస్సాండ్అవుతాను. రాజకీయ పోయిట్రీ కూడా కన్ఫెషనల్ఎలిమెంట్తో లేకపోతే మియర్ప్రాపగాండాగా అవుతుంది. నాది సాహిత్యం కాదనే వాళ్లని నేను వ్యతిరేకించను. ప్రతిదీ ఒకే రకంగా వుండాలని అనుకోకూడదు. వాటిని Condemn చేయడం నాకిష్టం వుండదు. నాకిష్టం అయినది ఎలా వుండాలో చెప్తున్నాను.”

త్రిపుర కథల్ని అర్ధం చేసుకోడానికి ఈ వాక్యాలు చాలా అవసరమని నేనకుంటాను. అసలు త్రిపుర ప్రతిపాదిస్తున్న ఈ Confession ఏమిటి అని నేను చాలా కాలం ఆలోచించీ, త్రిపుర గారినీ, కనకప్రసాదు గారినీ రకరకాలుగా అడిగి నేను తెలుసుకున్నదీ , నాకు అర్ధమైనది ఇదీ. రచయితలకి చాలామందికి అనుభవమే , మనం రాయాలనుకున్నది వేరు , తీరా రాసాక చూస్తే రాసింది వేరు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే మన మౌలికమైన మ్యూజ్ ఏదైతే ఉందో దానికి భయం వల్లనో, భ్రమల వల్లనో కొన్ని అబద్దపు తొడుగులు, ముసుగులు వేసి ప్రదర్శించడం వల్ల. అవేవీ లేని సృజనలు ఎలా ఉంటాయి అంటే ఇదిగో త్రిపుర కథల్లా ఉంటాయి అని చెప్పొచ్చు. నామిని కథలు, కనకప్రసాద్ గారి కథలు కూడా అలా ఉంటాయి. అందుకే వాటిలో కరిగించగల శక్తి ఉంటుంది.

Qచివరగా మీ కథల గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే

అసలు నేను రైటర్ని అవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ఏక్సిడెంటల్ గా మొదలుపెట్టాను. ఏదో ఆవహించి రాయించినట్టు, తప్పక పదేళ్ళపాటు కథలు రాసాను. Existential story రాద్దామనీ, Absurd Story రాద్దామనీ, Philosophical Story రాద్దామనీ, Predetermined state of mind తో ఎప్పుడూ రాయలేదు. కథ మొదలుపెట్టిన దగ్గరనుంచీ, అంతమయ్యేదాకా చచ్చాను. ఆ కథని చంపాను. ఆ చచ్చిన కథతో నేను చాలా కాలం జీవించాను. అవి అలాగే ఉన్నాయి. నేను ఇలాగే ఉన్నాను.

ఇతర రచయితల్లో కనిపించే కీర్తి కాంక్ష, రచనల మీద విపరీతమైన మమకారం ఇలాంటి బలహీనతలు ఆయనలో మచ్చుకైనా కనిపించవు. నిజంగా ఒక దీపస్తంభంలా గత యాభై యేళ్ళుగా ఒంటరిగా స్థిరంగా నిలబడ్డారు. త్రిపుర గారి భార్య లక్ష్మీదేవమ్మ గారి గురించి చెప్పకుండా త్రిపుర గురించి ఎంతచెప్పినా అసంపూర్ణమే అవుతుంది. ఒకవైపు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ (1982లో ఉత్తమ ఉపాధ్యాయినిగా నేషనల్ అవార్డు తీసుకున్నారు), మరోవైపు చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న త్రిపురని అన్నివైపులనుంచీ అరవైయేళ్ళుగా కాపాడుకుంటూ వీటన్నిటితోపాటు బెంగాలీ నుండి సునీల్ గంగోపాధ్యాయ, మహాశ్వేతాదేవి, త్ ప్రేమేంద్ర మిత్రా వంటి ఎందరో రచయితలని తెలుగులోకి అనువదించారు. త్రిపుర గారు రిటైరైపోయి అగర్తలా నుండి వైజాగు వచ్చేసిన చాలా యేళ్ళకి పతంజలి శాస్త్రి గారి అబ్బాయి ఒకసారి ఏదో పని మీద త్రిపుర వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి, మానిక్ సర్కార్ గారిని కలిసారుట. మాటల సందర్భంలో త్రిపుర గురించి వస్తే , “He was our professor. we had a great respect for him. But his wife Smt Lakshmidevamma was worshipped here” అన్నారుట.

ఇప్పుడు త్రిపురకి ఎనభై అయిదేళ్ళు. “I lost interest in everything. బుక్స్ అన్నీ అందరికీ ఇచ్చేసాను. నాకింక లిటరేచరు, ఆర్టు ఏవీ అక్కరలేదు” అంటారు. హారతి కర్పూరంలోని పరమార్ధం నాకు ఆయన్ని చూసాకే అర్ధం అయ్యింది. అందుకే “ఉజ్వలంగా వెలిగిన కర్పూరపు గుర్తులేవీ లోపలే తప్ప బయట మరి కనిపించవు” అని రాయగలిగాను. ఆయన కథలు చదివాను. ఆయన్ని కలిసాను. ఆయన వాత్సల్యాన్నీ, ప్రేమనీ, కరుణనీ పొందగలిగాను. “Subrato (ఆయన సరదాగా నాకు పెట్టిన పేరు) was certainly one of the very few most lovable persons i had come across in my long life of 84 years” అని ఆయన చేత అనిపించుకోవడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తాను.

“త్రిపుర కథలు ఆయన ప్రజ్ఞ లోతులకి చిన్నపాటి మచ్చుతునకల్లా ఉండి త్రిపుర గారే ఉండగా ఇవెందుకులే అనిపిస్తాయి” అన్న కనకప్రసాద్ గారి మాటలు అనుభవించగలిగాను. త్రిపుర గారినే దృష్టిలో పెట్టుకుని రాసిన మరో కవితతో వ్యాసాన్ని ముగిస్తాను.

ఏదీ దాచుకోదు

ఆత్మకథ రాసుకోదు

ఎంత అందమైన పూలనైనా

సాయంత్రానికి రాల్చేసుకుంటుంది

ఈ చెట్టుని చూస్తే

నాకసూయ

Download PDF

14 Comments

  • varudhini says:

    త్రిపుర గారి కథలు ఈ మథ్యే చదివాను…చదువుతూ ఉన్నాను…చదువుతూనే ఉంటాను, ఎందుకంటే ఆయన కథలు ఒకసారి చదివితే అర్థం అయ్యేవి కావు కాబట్టి..అర్థం అయ్యాక మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు రెండోసారి ఆయన కథలు చదువుతున్నప్పుడు వెంటనే వారణాశి వెళ్ళాలని..ఆయన ప్రస్థావించిన ప్రదేశాల్ని తిరుగుతూ వాటిని మళ్ళీ చదవాలని ఓ పిచ్చి కోరిక మొలకెత్తింది..ఇప్పుడు మీ ఈ పరిచయం చదివాక… మీరు ఆయన కథల నేపథ్యం చెప్పాక అది ఇంకా బలీయమైంది.:)

    మీ ఇంటర్వూ కూడా ప్రశ్న/జవాబు లా కాకుండా బాగుంది. Thank you.

  • Saikiran says:

    చాలా బాగుంది సుబ్బు. త్రిపుర గారు మీరు ప్రత్యక్షంగా ఇక్కడ మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది.

  • సాయి పద్మ says:

    చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారూ.. ఉరఫ్ సుబ్రతో.. చాలా రోజుల క్రితం దామూ చేసిన త్రిపుర గారి ఇంటర్వ్యూ చదివాను . ఆ తరువాత అంత మంచి ఇంటర్వ్యూ మీది వేరే కోణం నుంచి భలేగా ఉంది . చాలా థాంక్స్ .

  • m s naidu says:

    Subrato ! అసూయానందంలో మునకలేస్తున్న… మునకలేస్తున్న……………………

  • సుబ్రహ్మణ్యంగారూ థ్యాంక్సండీ

  • రవి says:

    సుబ్రహ్మణ్యం గారు,

    చాలా బాగుంది. చక్కని పరిచయం.

    “రెండు మూడు బ్రష్ స్ట్రోక్స్ తోనే ఒక బొమ్మ గీయగల నేర్పు కూడా ఆయన కథల్లో చూడొచ్చు.”

    వాక్యాలను చాలా శ్రద్దగా రాస్తారు మీరు. అందుకే మీరు రాసిన వ్యాసాలు కూడా చక్కని కవితల్లా ఉంటాయి.

    అభినందనలు.

    -రవి

  • చాలా బావుంది సుబ్రహ్మణ్యంగారు. మీరు నిజ్జంగా అదృష్టవంతులు. నా త్రిపురానుభవం ఇక్కడ, కొంచెం మసకబారిన జ్ఞాపకంలో.

  • K.Geeta says:

    కొన్ని వాక్యాలు చదివేక మాటలుండవు. మౌనానికి అంతమూ ఉండదు. అయినా మీ ఇంటర్వ్యూ చదివేక ఇలా రాయకుండా ఉండలేక పోతున్నా. ఎంత బాగా రాసేరు!! గొప్ప కథలా-మాటల నదిలా- Congrats Subrato!

  • GEO LAXMAN says:

    మంచి జ్ఞాపకాలు వున్నాయి త్రిపుర గారితో నాకు.
    కొద్ది మంది స్నేహితులతో కలిసి విశాఖపట్నంలో.
    కాఫ్కా, డాలి ల గుర్రాల మీద వెళ్తుంటాడు 84 ఏళ్ల
    కుర్రాడు.

  • sivasankar ayyalasoamayjula says:

    సుబ్బూ- ఎవరి గురుంచీ ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు, అర్ధం చేసుకోలేరు. ప్రతీ జీవితం ఒక సప్త సాగర సంగమం ఒక అనంత మైన అగాధం..త్రిపుర, కాశీభట్ల వేణు లాంటి వ్యక్తులు జీవితాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించీ ప్రయత్నిస్తూ వాళ్ళ ఆలోచనలకి అక్షర రూపం ఇచ్చి విఫలం అయి సఫలం అవ్వలేదనే నిరాశతో ఉంటారేమో అని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను.
    I sometimes feels that Tripura likes “Absurdism” and he avows that in most of his works.
    Thanks for bringing many interesting topics through Tripura gaaru.

    ఇట్లు
    శివ

  • pillalamarri ramulu says:

    మన కాలం నాటి aristotle తో మాట్లాడినట్లుగా ఉంది. మంచి ఇంటర్వ్యూ …..

  • అదృష్టవంతులు. ఒక ప్రత్యేకమైన రచయితతో ఇంత చక్కని పరిచయం కలగటం నిజంగా అదృష్టం. అరుదైన ఇంటర్వ్యూ అందించినందుకు ధన్యవాదాలు.

  • త్రిపుర గారి గురించి విన్నానుకాని ఆయన రాసిన కథలు చదవలేదు.మీ ఇంటెర్వ్యూ బాగుంది.ఆయన కథలు దొరికితే చదువుతాను.

  • Nisapathi says:

    “ఎందుకంటే మన మౌలికమైన మ్యూజ్ ఏదైతే ఉందో దానికి భయం వల్లనో, భ్రమల వల్లనో కొన్ని అబద్దపు తొడుగులు, ముసుగులు వేసి ప్రదర్శించడం ” వల్ల. అవేవీ లేని సృజనలు ఎలా ఉంటాయి అంటే ఇదిగో త్రిపుర కథల్లా ఉంటాయి అని చెప్పొచ్చు.

    , qoutes వాక్యాలు చదివి ఏ రచయితైనా బుజాలు తడుముకోక పోతే అతడు పెద్ధ‌ hy
    pocrat అన్నమాట

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)