డార్జిలింగ్ తేయాకు దాచుకున్న కథలు…

teyaku6

రెండు నెలల క్రితం వరకూ మేము వుండి  వచ్చిన డార్జిలింగ్ జిల్లా తేయాకు తోటలకు చాలా ప్రసిద్ధి  . కొండ వాల్లుల్లో పచ్చగా పరుచుకుని ,మేఘాలతో నిరంతర సంభాషణ జరుపుతూ తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న బౌద్ధ  సన్యాసుల్లా చిదానందం గా ఉంటాయి . కొండపైన వుండే హేపీ వేలీ ,మామకాయ్ బారి,పుట్టబోంగ్  వంటివే కాక ,సిలిగురి మైదాన ప్రాంతంలో కూడా చాలా  టీ  ఎస్టేట్స్ ఉంటాయి .

వ్యాహ్యాళి గా వెళ్లి టీ  ఎస్టేట్స్  గెస్ట్ హౌస్ లో వుండి  ఆ పచ్చటి సౌందర్యాన్ని అనుభవించడం వరకే మొదట నాకు టీ గార్డెన్స్ తో పరిచయం వుండేది . ఒక సారి ఒక టీ ఎస్టేట్ మేనేజర్ తుపాకి లైసెన్స్ కోసం నా భర్త వద్దకు రావడం తో , టీ  గార్డెన్స్ నా ఆలోచనలలోకి చొచ్చుకొచ్చాయి.

 తేయాకు సాగు భారత దేశం లో మొదలు పెట్టింది ఈస్టిండియా కంపెనీ వారు .తేయాకు ఉత్పతి లో చైనా ఏక స్వామ్యాన్ని దెబ్బతీయడం అప్పుడు వాళ్ళ లక్ష్యం . వారి లక్ష్యాన్ని భారత దేశం అందుకోగలిగింది. మొన్న  మొన్నటి వరకూ ప్రపంచ టి ఉత్పతి లో భారత దేశమే ప్రథమ స్థానం లో ఉంటూ వచ్చింది కాకపోతే మనం ఉత్పతి చేసే తేయాకులో 70-80% మన వినియోగానికే సరిపోతుందట . ఈ విషయాలు,తదితర గణాంకాలు అక్కడా ఇక్కడా దొరికేవే కనుక ఎక్కువగా ఆ చర్చలోకి వెళ్ళను .

టీ ఎస్టేట్ మేనేజర్ తుపాకీ లైసెన్స్ కోసం వచ్చిన తరువాత నాకు కలిగిన ప్రథమ ఆలోచన అతనికి ఆ తుపాకీ ఎందుకు అనే . భారత దేశం లో టీ  ఎస్టేట్స్ అతి పెద్ద ఎంప్లాయర్స్  గా ఉంటూ వస్తున్నాయనే విషయాన్ని అప్పుడే నేను తెలుసుకున్నాను . ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నక్సల్బరీ  గ్రామం మాకు నలభై నిముషాల దూరం మాత్రమే  . చాలా రోజుల నుండీ నక్సల్బరీ గమనాన్ని గమ్యాన్ని ,అక్కడి  ప్రజల ప్రస్తుత స్థితీ నేపధ్యం తో కథ వ్రాయాలని అనుకుంటూ వస్తున్నాను అప్పుడు . కొత్తగా టీ ఎస్టేట్ కూడా ఆ ఆలోచనలలోకి వచ్చి చేరింది .అక్కడ ఆ కూలీలతో కలిసి  నేనేం తెలుసుకున్నానో ,ఈ అంతటి అనుభవం లో నేనెంతటి [నా లాంటి వాళ్ళు ]ఆశక్తురాలిగా తేలానో  ఇక్కడ అప్రస్తుతం కనుక ఆ విషయాన్నీ అంతటితో వదిలేస్తున్నాను .

కానీ ఇంతకీ తేయాకు తోటలు వుద్యోగం కల్పిస్తున్న ఆ ఉద్యోగులు ఎవరూ అన్నది చెప్తాను . తేయాకు తోటల సాగు ని తలకెత్తుకున్నపుడు ఈస్టిండియా కంపెనీ వారికి ఎదురైన తొలి సమస్య శ్రామికులు . వారి అభిప్రాయం ప్రకారం వారికి కావలసిన శ్రామికులు ఎలా వుండాలి అంటే ,ఒళ్ళు దాచుకోకుండా గొడ్ల లా పని చేయాలి ,అప్పుడు విస్తారంగా వున్న  , చిక్కటి అడవులని కొట్టి తేయాకు తోటలకి అనువుగా భూమిని సిద్ధపరచాలి . అడవులలోని క్రూర మృగాలతో తలపడాలి . ఒక వేళ అ సందర్భం లో కనుక ప్రాణాలు పోతే అంతా  మా కర్మ అనుకోవాలి . ఎప్పుడూ నోరు తెరిచి ఎదురు మాట్లాడటం అనే ఊహ కూడా తెలియని వారై వుండాలి . ఇంతా చేస్తూ అతి తక్కువ కూలీకి లభించాలి . …. వారి  ఇటువంటి  అవసరాలకు అతికినట్టుగా సరిపోయేది ఆదివాసీలే అని ఈస్టిండియా కంపెనీ వారు గ్రహించారు. వారిని అనేక ప్రాంతాల నుండి తోలుకుని తెచ్చారు .

నేను వెళ్ళిన టీ ఎస్టేట్, సిలిగురి మైదానం లో వుండే ”కమల టీ  ఎస్టేట్ ” ఏడాదికి పది కోట్లు దాని టర్నోవర్ . వీరిదే కర్శియాంగ్ లో కూడా మరో టీ  ఎస్టేట్ వుంది . అక్కడ నేపాలీ సంబంధిత ఆదివాసీలు ఎక్కువగా వుంటారు . సిలిగురీ టీ ఎస్టేట్ లో వున్న వారు బీహార్, రాంచీ తదితర ప్రాంతాల నుండి తరలించుకుని రాబడ్డారు . నడిచీ ,పడవల పైనా,రైళ్ళలో ఒకరి పైన ఒకరిని తోసి పశువుల లాగా తోలబడ్డారు .మరో టీ  ఎస్టేట్  ” మైనక్ ” మేనేజర్ చెప్పిన దాని ప్రకారం ఈ ఆదివాసీలను రైళ్ళలో ఎక్కించిన తరువాత కిటికీ తలుపులు బంధించి బైటి ప్రపంచాన్ని కనపడకుండా చేసి తీసుకు వచ్చారు. . తిరిగి వెళ్ళే దారి వారికెప్పుడూ అపరిచితంగా వుండి పోవాలన్నదే దీని వెనుకనున్న కుట్ర . నాతో మాట్లాడిన వృద్ద ఆదివాసీలు కొందరు అదేమీ  లేదు మేముంటున్న ప్రాంతంలో తినడానికి తిండి లేక పని కోసం మా పెద్దలే ఇష్ట పూర్వకంగా ఇక్కడికి వచ్చారని  చెప్పారు . రెండు అభిప్రాయాలూ సత్యమే కావచ్చును .

ఇట్లా రక రకాల ప్రాంతాల నుండి ఆదివాసీలను తీసుకొచ్చి వొందల ఎకరాల విస్తీర్ణం లో వుండే టీ  ఎస్టేట్స్ లో పనికి కుదిర్చే వారు . నివాస నిమిత్తం కొంత నెల ,దిన భత్యము ఇచ్చేవారు. నేను ఈ కథలను సేకరించిన ”కమల టీ  ఎస్టేట్” లో ముండా , వురావ్,సంతాల్,కడియా,బడాయిక్ ,లోహార్,ఘాసి,గోవాల,తురి,అసుర్ వంటి పలు ఆదివాసీ తెగలు వున్నాయి. మళ్ళీ వీరిలో అనేక ఉప తెగలు వున్నాయి అంటే ఉదాహరణకు రెడ్ల కులంలో పంట రెడ్లు ,పాకనాటి రెడ్లు అనివున్నట్టు వురావ్ లలో టొప్ప,యెక్క,తిర్కి,కిర్కెట్ట,కుజవార్,కేస్,బకల,బార్ల,ఖాఖా ,కల్కో ,కవ్వ ,బార్ల,బర్వ ,లక్టా ,మీంజ్ ,బేక్ ,కించో,కిస్పొట్టా,పన్న,బేంగ్ ..లు ,అట్లాగే బడాయిక్ లలో తీసుకుంటే చీక్ బడాయిక్,సోనా,బగ్వార్,సింగ్.ఖడియాలలొ ,కెర్ కెట్ట ,సోరెంగ్,బిలుంగ్,డుంగ్ డుంగ్,ఇందువర్,కుట్ల,కిరొ… ఇట్లా  చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే వుంది.

ఇట్లా అనేక ప్రాంతాల నుండి వలస తీసుకు రాబడిన ఈ ఆదివాసీలలో ప్రతి తెగ కి ,వారికే ప్రత్యేకమైన ఒక భాష వుంది . సంతాల్ ల భాష ,సంస్కృతి ఆచార వ్యవహారాలకి ,ఖడియా వారి భాష,పండుగలు ,మరణాలకి తప్పకుండా వైరుధ్యం ఉండనే వుంటుంది . అంతటి వైరుధ్యం కలవారందరూ ,చుట్టూ అపరిచిత బెంగాలీ జన సమూహాలు ఉన్నప్పటికీ వారితో ఏ మాత్రం సంబంధం లేనట్లుగా  వుండే  దీవుల లాటి తేయాకు తోటలకి వచ్చిపడ్డారు . ఒకరితో ఒకరు  కలిసి పని చేయడం మొదలు పెట్టారు .

మరి పని పాటల సందర్భాలలో వారు ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకున్నారు ?ఆశ్చర్యంగా ఏ హిందీనో లేక స్థానిక బెంగాలీనో ,వారు నేర్చుకోలేదు.తమ అందరి భాషల నుండీ తలా ఒక పిడికెడు పదాలు,సమాసాలు  కలిపి కలగా పులగం చేసి ”సాద్రి” అనే తమదే అయిన భాషను పుట్టించుకున్నారు . ఇప్పుడు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు సాద్రి అనే పని భాష వుంది .ఇంటి  భాష మళ్ళీ అందరికీ వేర్వేరు .నాకు బెంగాలీ భాష వచ్చు . ఆ తేయాకు తోటలకు వెళ్ళే వరకూ సాద్రి అనే అటువంటి భాష గురించి నేనెపుడూ ఊహించి కూడా ఉండలేదు .

వారి పుట్టు పూర్వోత్తరాల చరిత్ర  విన్న తరువాత నాకు కలిగిన మొదటి ఆలోచన ,ఈ ఆదివాసీలు  ఇన్ని భిన్న  తెగలు  , భిన్న సంస్కృతుల వారు కదా ,ఇక్కడ స్థిరపడి బహుశా   ఒక నూరూ ,నూటా యాభై ఏళ్లై  ఉంటుందేమో, అంటే వారి సంస్కృతులు అందుకు సంబంధించిన సుఖ దుక్కాలు వారి హృదయాలలో ఇంకా పచ్చగా వుండే ఉంటాయేమోనని  .చాలా సార్లు మన ప్రాచీనతని మనం చెప్పుకునే  కథలు,జానపద పాటలు మన తరం తర్వాత తరానికి మనకు ఎటువంటి శ్రమనూ ప్రత్యేకించీ కలిగించకుండానే భట్వాడా చేసేస్తాయి.  అందుకనే ఈ తెగల  మధ్య  వుండే కథలు ఎట్లాంటివై  వుండొచ్చనే ఆసక్తి నాకు కలిగింది .

పేదరికాన్ని క్రైస్తవం చాలా ప్రేమిస్తుంది . ఆర్తులు ఎక్కడుంటే క్రైస్తవం అక్కడుంటుంది . మత మార్పిడి చేయడమే కాక ఆయా వ్యక్తుల సహజ సంస్కృతిని కూడా కొద్దో గొప్పో మరుగుపరుస్తుంది . నిజానికి ఇది కొన్ని సార్లు మంచే చేస్తుంది కూడా . ఉదాహరణకి మన మాలలు మాదిగల ని తీసుకుంటే క్రైస్తవం లోకి మారిన ఈ కులాల వారు వారు ,మారని వారి కన్నా కొంత ఆధునికంగా,ఆంగ్ల భాషకి దగ్గరగా , ఆంటరానితనానికి కొద్దోగొప్పో బాహ్యంగా  వుండటం చూడొచ్చు .

తేయాకు తోటలలో కూడా క్రైస్తవం ఆదివాసీల జీవితాలలోకి చొచ్చుకుని వచ్చి వుంది .దాదాపు  వారందరూ ఇప్పుడు క్రైస్తవులే . ఈ క్రైస్తవం వారి జీవితాల్లో తీసుకొచ్చిన భౌతిక మార్పు ఎంతో కొంత వుండే ఉండొచ్చు కానీ ,దానిని నా కన్ను గుర్తించ లేనంత వెనకబాటు తనం ఇంకా అక్కడ వుంది .   మార్పు కి బదులుగా ఒక కలగాపులగపు సంస్కృతి ఇప్పుడు తేయాకు తోటల్లో వుందనేది నాకు కలిగిన అవగాహన. అయితే ఇది నేను తిరిగిన కొద్ది టీ  గార్డెన్స్ విషయం మాత్రమె . మిగిలిన చోట్ల పరిస్థితి నాకు తెలీదు. ఎవరైనా ఈ విషయాన్ని గురించి పరిశోధన చేసారో లేదో కూడా తెలీదు. చేస్తే మటుకు చాల నూత్న విషయాలు తెలియవచ్చని నా అభిప్రాయం.

ఈ కథలన్నీ నేను దాదాపు ఆరేడు నెలల ముందు విన్నాను. కథలు చెప్పిన ఆదివాసీలు కథల్ని సాద్రీ భాషలో చెప్పారు . చుట్టూ బెంగాలీ ప్రపంచం వున్నా వీరిది దీవి లాటి ప్రత్యేక ప్రపంచం అని చెప్పా కదా ,అయితే వీరి దైనిక అవసరాల నిమిత్తం వారానికో సారి ఆ తోటల చుట్టు  పక్కల సంతలు జరుగుతాయి . వీటిని ”బగానేర్ హాట్ ”[తోట సంతలు ] అంటారు . ఆ సంతల్లో అంగడి పెట్టే  వ్యాపారస్తుడు తప్పకుండా సాద్రీ  వచ్చిన వాడై  ఉంటాడు . అంచేత  బెంగాలీ భాషతో సంపర్కం చెందాల్సిన పని లేకుండా ఆదివాసీలు తమ అవసరాలను తీర్చుకుని మళ్ళీ తోటల్లోకి వెళ్లి పోతారు . అందువల్ల ఇన్ని ఏళ్ళు గడిచిపోయినా వీరికి నామ మాత్రపు బెంగాలీ కూడా రాదు. అందుకని ఈ కథల్ని వారు సాద్రి భాషలో చెప్తుంటే రికార్డ్ చేసుకునీ,అప్పటికప్పుడు నా బెంగాలీ దుబాసీ చేత అర్థం చెప్పించుకునీ విన్నాను ,మళ్ళీ తెలుగులో నా తరహాలో రాసాను .

ఇంత శ్రమ చేశా కదా అని చెప్పి ఇవి అద్భుతమైన  జానపద కథలు అని నేను చెప్పను. మనుషులం ఎన్నో అంతరాలను ఏర్పరచుకున్నాం .నేనెక్కువ,నువ్వు తక్కువ,వాడు మరీ తక్కువ అని .కానీ అదేమిటో ఏ దేశపు  జానపద కథను తీసినా అన్నీ ఒక్కలానే వుంటాయి . అన్నింటిలో  కన్పించే మానవ హృదయ వేదనలూ ,ఆనంద హేలలు ఇంచుమించు ఒక్కటే . ఈ కథలన్నీ విన్న తరువాత నాకు అనిపించింది ఏమిటంటే మనది మానవ జాతి అంతే .ఈ అంతరాలన్నీ వృధా అని . అక్కడెక్కడో పల్లెటూర్లో వుండే మా అమ్మమ్మ చెప్పిన కథకీ , ఇక్కడి క్లెమెంట్ కెర్ కెట్ట  చెప్పిన కథకీ సాపత్యం ఉండటానికి కారణం అదే . అందుకే ఈ కథలు మీరు ఇంతకు ముందు విన్నవి లాగా అనిపిస్తే ఆ తప్పు నాది కాదని నిశ్చయంగా చెప్పగలను.samanya_300x250_scaled_cropp

-సామాన్య

Download PDF

3 Comments

  • mythili says:

    అదృష్టవశాత్తూ చేరగలిగిన విలక్షణ వాతావరణాలని ప్రేమించి కౌగలించుకుని సొంతం చేసుకుంటారు ..మీ గొప్ప అది!

  • Saamaanya says:

    ఇట్లా మెచ్చుకోగలగడం మీ హృదయ సరలతకు ,ఆత్మవిశ్వాసానికి చిహ్నం మైథిలి గారు.థాంక్ యు వెరీ మచ్ .

  • suresh says:

    simply superb!!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)