తెలంగాణ బహుజన కథకు ఆదరణ ఏది?

bahu1

తెలుగు కథగా చెలామణి  అవుతున్న కథలను పరిశీలిస్తే సింహభాగం బ్రాహ్మణుల కథలు లేదా  బ్రాహ్మణీయ  భావజాలం నుంచి వచ్చిన కథలు. పైగా ఆంధ్రా  ప్రాంతపు కథలు.  వీటిలో తెలంగాణకు చోటు లేకపోగా, ఇక తెలంగాణ బహుజనుల అజా పజా లేదు. ఈ దశలో తెలుగు సాహిత్య చరిత్రలోనే మొదటిసారిగా బహుజన కథకుల సమావేశం ఏర్పాటుచేయాలనుకున్నాం. అందులోనూ తెలంగాణ బహుజనుల కచ్చీరు. ఆ ఆలోచన రావడానికి కారణం-

బహుజనులకు, మిగతా వర్గాలకు మధ్య  చర్చ జరుగుతున్నప్పుడు స్పష్టంగా తేడా కనబడుతున్నది. వాళ్లు శిల్పం తప్పనిసరి అని మాట్లాడినప్పుడు అది ఎవరు నిర్ణయించిన శిల్పం అని మేము ప్రశ్నిస్తున్నాం. పత్రికలు, సంకలనాల్లో లెక్క కోసమే బహుజనుల కథలు ఎంపిక చేస్తున్నారే తప్ప ఆ కథల్లో వారి జీవిత సంఘర్షణ ఏమేరకున్నది, వారు కులపరంగా ఎట్లాంటి బాదలు అనుభవిస్తున్నారు అనే విషయాల్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ బహుజనులు రాసే కథలు వేసుకునే పత్రికలే లేవు. ఆంధ్రా వారికి తగ్గట్టుగా మార్చి ఇస్తే వేస్తామంటున్నారు. ఆంధ్రా వారి కథలు పత్రికల భాషలోనే ఉంటాయి కాబట్టి వారికి ఏ అడ్డంకులూ లేవు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్  20, 21 తారీఖుల్లో నేను, స్కైబాబ, సంగిశెట్టి శ్రీనివాస్ కలిసి హైదరాబాద్‌లోని  ‘లామకాన్’లో ‘తెలంగాణ బహుజన కథకుల కచ్చీరు’ ఏర్పాటు చేశాం. రెండ్రోజులూ బహుజన కథల్లోని జీవితం, సంస్కతి, లక్ష్యం , సిద్ధాంతం తదితర విషయాల మీద విలువైన చర్చ జరిగింది.
తెలంగాణ బహుజన రచయితల మీద ఆంధ్రా వారి ఆధిపత్యమే కాకుండా, హిందూత్వ, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాలు బలంగా పనిచేస్తున్నాయి. పైగా ప్రధాన స్రవంతి భావజాలం ఎలాగూ ఉండనే ఉంది. ఈ ప్రభావాల మూలంగా బహుజనులు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, తాజాగా రచనలు చేయడం కష్టమే. చేసినా ఆ రచనలు ఉన్నదున్నట్లుగా అచ్చు కావడం పెద్ద సమస్యగా మారింది. ఆ రకంగా మీడియా బహుజనుల రచనల్ని నిర్దేశిస్తోంది. అందువల్లనే బహుజన జీవన సంఘర్షణలు విస్తత స్థాయిలో రికార్డు కావడం లేదు. దాంతో కథల్లో ఒరిజినాలిటీ  కూడా కరువవుతోంది. ఈ విషయాలన్నింటి నేపథ్యంలో మేము ఏర్పాటు చేసిన ఈ కచ్చీరులో వక్తలందరూ ఈ విషయాలను తడమడం విశేషం.
అయితే సిద్ధాంతపరంగా జరిగిన చర్చలో కాలువ మల్లయ్య తానొక బీసీ అయినప్పటికీ బీసీల కంటే, మైనారిటీల కంటే ఎక్కువగా నష్టపోయింది దళితులని, ప్రస్తుతం దళితుల్లో ఉన్న చైతన్యం బీసీల్లో లేదని, కాబట్టి దళితుల నాయకత్వంలోనే మిగతా బహుజనులు ముందుకెళ్లాలని, అంబేద్కరిజాన్ని స్వీకరించడమే బహుజనులందరికి సరైన మార్గమని చెప్పడం ఈ సమావేశమంతటికీ హైలెట్. ఆ విషయంతో విభేదిస్తున్న బీసీలు చెబుతున్న  కారణాలు సహేతుకంగా లేవు. బహుజన ఐక్యతను కోరుకుంటున్నవారెవరైనా ఈ విషయంమీద విస్త్రుత చర్చ జరిపి బహుజనవాదం ముందుకు వెళ్లడానికి మార్గం సుగమం చేయాల్సిన అవసరముంది.

ఈ రెండ్రోజుల్లో 13 మంది వక్తలు మాట్లాడారు. వాటిపై చర్చ జరిగింది.

జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ –కథల మీద సైద్ధాంతిక చర్చ జరగడం లేదు. అందుకే ఇలా  కథల గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోకారణం ఇప్పటికీ సాహిత్యంలో కవిత్వానిదే పైచేయిగా అవుతోంది. ఎందుకంటే కథ, నవల సాహిత్య డిస్కోర్స్‌లో లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది.కులాన్ని నిర్మూలించే పని అగ్రవర్ణాలు చేయరు. తెలంగాణలో వ్యవస్థను మార్చివేసే రచయితలు పుట్టలేదు. ఉర్దూ రచయితలకు పరిమితి ఉంది. వారికి కుల సమస్య లేదు కాబట్టి వారు ఈ సమస్య మీద దష్టి పెట్టే అవకాశం లేదు. ముస్లిమేతరులు దాదాపు బ్రాహ్మణిజపు పర్‌స్పెక్టివ్ నుంచే రాశారు అని అన్నారు.
1960 నుంచి సిద్ధాంతం పక్కన పెట్టి కేవలం అనుభవాల ప్రాతిపదికగానే రచనలు వచ్చాయి. అనుభవం వరకే ఆగిపోవడం సిద్ధాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల బహుజనుల రచనల్లో రావలసినంత వైవిధ్యం , విస్తతి రాలేదు. కాబట్టి బహుజన రచయితలకు సిద్ధాంతం తప్పనిసరిగా ఉండాలి. బహుజనులు తమ కథల్లోనూ బ్రాహ్మణ సంస్ర్కృతి నే  చిత్రిస్తున్నారు. కల్చరల్ బ్యాగ్రౌండ్‌ను చేంజ్ చేయకుండానే క్యారెక్టర్స్‌ను మాత్రమే మారుస్తున్నారు. మొత్తంగా సంస్కతినీ, జీవన విధా నాన్నీ మార్చితే తప్ప అవి బహుజన కథలు కావు అని అభిప్రాయపడ్డారు.

బిఎస్ రాములు మాట్లాడుతూ: బహుజనులు జీవితాన్ని చిత్రిస్తే చాలు, అందులోంచే సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి. జీవితం నుంచి సిద్ధాంతం ఏర్పడాలి కాని సిద్ధాంతం నించి జీవితాలు రికార్డు చేయడం సరికాదు. జిలుకర శ్రీనివాస్ దక్పథం ఉండాలనడం గానీ, మరొకరు అనుభవం కన్నా జ్ఞానం ముఖ్యం అనడం గానీ బ్రా హ్మణిజమే అవుతుంది అని అన్నారు.

ఈ విషయం మీద కాసేపు రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. బహుజనులు పెద్ద ఎత్తున హిందువైజ్ అవుతున్నారని, అందువల్ల బహుజన జీవితం, సంస్కతి కథల్లో మాయమవుతోందనే చర్చ ముందుకొచ్చింది. దాంతో తాము హిందువుల లాగే జీవిస్తున్నాం కాబట్టి తాము హిందువులమే కదా అని బిఎస్ రాములు, జ్వలిత అన్నారు. అయితే మరి బహుజనవాదంతో మీకేం పని అని వారిని కొందరు ప్రశ్నించారు. హిందూత్వమేమిటో, బహుజనవాదమేమిటో స్పష్టత ఏర్పర్చుకోవలసిన అవసరముందని ముక్తాయించారు.

ఈ మధ్య  ఒక కథా వర్క్‌షాప్‌లో- రచయిత డ్యూయల్ రోల్ ప్లే చేయడం వల్లే వారి పిల్లలు అమెరికా వెళ్లడమో, మరోటి కావడమో జరుగుతుందన్న అల్లం రాజయ్య మాటలు ప్రస్తావనకొచ్చాయి. పిల్లల ఇష్టాలని తల్లిదండ్రులెలా నిర్దేశిస్తారని కొందరు, తల్లిదండ్రులు కల్పించే వాతావరణమే వారి వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తుందని మరికొందరు వాదించారు.

పగడాల నాగేందర్ మాట్లాడుతూ: ఎప్పుడైతే విప్లవోద్యమం మీద తిరుగుబాటు మొదలైందో, ప్రశ్నే ప్రగతికి మూలం అనుకున్నారో, అప్పటి నుంచే ఎస్సీ, బీసీల  నుంచి బహుజన దృ ష్టితో  కథలు రావడం మొదలైంది.. ఇంకా నిర్దిష్టంగా బీసీల నుంచి కథలు రావలసి ఉంది. బీసీ కథా సంకలనాలు ప్రత్యేకంగా రాలేదు. రావలసిన అవసరముందని అన్నారు.

డా.పిల్లలమర్రి రాములు  మాట్లాడుతూ: బహుజనుల రచనల వల్ల కొత్త చర్చ ప్రారంభమైంది. పూర్వ సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే కథను చెప్పాల్సిన పనిలేదు అనే కొత్త చైతన్యం వచ్చింది. బహుజనుల  జీవితం చెప్పే పద్ధతిలో గాని, ఆలోచింపజేసే పద్ధతిలోగాని చాలా మార్పొచ్చింది. బహుజన జీవితాల రచనలు పాఠ్యాంశాలుగా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇంకా గుర్తించడం లేదు. కథంటే గురజాడ, చలం, కాళీపట్నం లాంటి వాళ్ల కథలే అనుకునే దశలోనే ఉండడం వల్ల బహుజనుల కథల్ని లెక్కలోకి తీసుకోవడంలేదు. ఈ  పరిస్థితి మారాలి. కొత్త ప్రమాణాల్ని కొత్త విమర్శా పద్ధతుల్ని అనుసరించేలా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు .

గోగు శ్యామల మాట్లాడుతూ ఇలా అన్నారు: బ్రాహ్మణ సంస్కతి బహుజనుల మీద గుర్తించలేనంతగా ప్రభావం చూపుతున్నది. బహుజనులు రాసే విషయం మీద, సంస్కతీ మీద, పండగల మీద, చివరికి తిండి మీద కూడా  నియంత్రణ ఉంటున్నది.  ఇవాళ హిందూత్వవాదుల వల్ల ముస్లింలు టార్గెట్ చేయబడుతున్నట్లు కనిపిస్తున్నారు కాని, ఆ దాడి దళితుల మీద, బీసీల మీద జరుగుతున్నది. ఈ దేశ మూలవాసులుగా బహుజనులకొక చరిత్ర ఉంది. మాతస్వామ్య వ్యవస్థ కలిగిన చరిత్ర. ఆ చరిత్ర మీద ఆధా రపడి బహుజనుల రచనలుండాలి. బ్రాహ్మణుల, అగ్రవర్ణాల సాహిత్యం చదివి బహుజనులు తమ ఉనికిని మర్చిపోయారు. తమ  సొంత జీవితాన్ని, శైలిని మర్చిపోయారు. తిరిగి దాన్ని అందిపుచ్చుకోవాలి.

స్కైబాబ మాట్లాడుతూ: ఈ దేశంలోని ముస్లింలు 90 శాతం పైగా దళిత, బీసీల నుంచే ఇస్లాం స్వీకరించినవారు. వారిని ఇక్కడి వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటుదారులుగా గుర్తించాలి. అందుకే వారిపై హిందూత్వ దాడులు అధికంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో దళితులు, బీసీలు ముస్లింల కన్నా భద్రంగానే ఉన్నారు, పైగా తమ బహుజన సంస్కతికి వారు దూరమవుతూ హిందువైజ్ అవుతున్నారు, ఆ విషయంపై మాత్రం బహుజన రచయితలు స్పందించడం లేదు. ముస్లింవాద రచయితలుగా మేము ముస్లింలలోని లోపాలని ఎత్తిచూపుతూ రచనలు చేశాం. ఆ విషయంలో దళితులు, బీసీలు ఆ పని చేయకపోగా అసలా విషయాన్ని గుర్తించనట్లే నటిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాసుకోవడానికి బహుజన సబ్జెక్టేమీ మిగలదు అని అన్నారు.

bahujanakatha

దానిపై కొంతసేపు చర్చ జరిగింది. మొత్తంగా ఆ విషయాన్ని అందరూ అంగీకరించారు. ఎస్టీలను అధికమొత్తంలో ఇప్పటికే హిందువైజ్ చేసేశారని జయధీర్ తిరుమలరావు అన్నారు.

అంబటి సురేంద్రరాజు మాట్లాడుతూ: తెలంగాణ నుంచి గొప్ప కథలుగాని, నవలలు గాని అంతగా రాకపోవడానికి కారణం -వృత్తులను పట్టుకు వేలాడడమే. ఇక్కడ జీవితమే బహుజనులకు ముడిసరుకు. బహుజనులకు కావలసినంత జీవితం ఉంది. నీషే అన్నట్లు వృత్తులు అంతరించిపోతే గాని ఆయా కులాల నుంచి గొప్ప రచయితలు పుట్టుకురారు. వృత్తులకు ఏనాడో దూరమైన స్కైబాబ, షాజహానా లాంటి వారి నుంచి మంచి కథలు వస్తున్నాయి. వృత్తులు ఉన్న కులాలవారు  వారసత్వ ంగా వాటిని నేర్చుకుంటారు కాబట్టి క్రియేటివ్‌గా ఆలోచించడానికి అవకాశముండదు, వృత్తులు కోల్పోయి ఒక శూన్య దశకు చేరుకున్నవారి నుంచి, అడ్డామీది కూలీలుగా మారిన జీవితాల్లోంచే గొప్ప రచయితలు పుట్టుకొస్తారని అన్నారు.

సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ: బీసీలు చాలావరకు తమ కుల బాధల్ని తక్కువగా రికార్డు చేశారు. చేయాల్సిన అవసరముంది. నో స్టాల్జియా అయినప్పటికీ కుల వత్తులు, బీసీల జీవితాల్ని కథల్లో రికార్డు కావాల్సి ఉంది.  తెలంగాణ బహుజన కథ ఎట్లా ఉంది, ఏ దారిలో పోవాలె ఏ దక్పథం నుంచి సమాజాన్ని చూడాలనే దానికి బహుజనుల కథలు, సంకలనాలు ఉపయోగపడాలి అన్నారు.బహుజనుల జీవితాన్ని, సంఘర్షణను, బాధ లను ఎట్లా రికార్డు చేసుకోవాలి? ఎంతో సంఘర్షణ ఉన్నా కూడా శైలి శిల్పం లేదని కథలను పక్కన పెడుతున్నారు.   శైలి శిల్పం అవసరమే కాని జీవితాన్ని చూడాలని కూడా చెప్పారు.

జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ: కథ అధ్యయనం నుంచి వస్తుంది తప్ప సమాచారం నుంచి రాదు. దానికి శిబిరాలు అవసరం. కొత్త మెథడాలజి, కొత్త స్టైల్‌లో కథ ఎందుకు రావడం లేదు? కొత్త ఎక్స్‌ప్రెషన్ ఎందుకు రావడం లేదు. అది సాధించాల్సిన అవసరముంది. అది తెలంగాణ బహుజనులకు పెద్ద కష్టం కాదు అన్నారు.

ఆడెపు లక్ష్మీపతి మాట్లాడుతూ:  పాఠకుణ్ని ఆకట్టుకోకపోతే మనం విజయం సాధించలేము. టెక్నిక్ అనేదాన్ని ఆంధ్రా విమర్శకులు, పడకకుర్చీ మేధా వులు బ్రహ్మపదార్థం చేశారు. శిల్పం అనేది రచయిత చేతిలో అతని ఆలోచనా క్రమంలో ఉంటుంది. కథకు మనం రూపం ఇచ్చే క్రమంలోనే, మన నేర్పరితనంలోనే ఉంటుంది అన్నారు.
ఆడెపు లక్ష్మీపతిని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒక్కో టెక్నిక్‌లోంచి ఒక్కో మంచి కథను ఎంచుకొని తెలుగులోకి అనువదించి పుస్తకంగా వేయాలనే ప్రతిపాదన జయ‘దీర్ చేశారు. మరికొందరిని కలుపుకొని ఆ ప్రయత్నం చేస్తానని లక్ష్మీపతి ఒప్పుకున్నారు.

పెద్దింటి అశోక్‌కుమార్  బహుజనుల వలస బతుకుల్ని ఆర్ద్రంగా వివరించారు. ఆ విషయాలన్నింటినీ కథలుగా చిత్రించాల్సిన అవసరముందన్నారు. అశోక్ చెప్పిన విషయాలు కథకులందరి మనసుల్ని కలచివేశాయి.

తెలంగాణ కథల్లో ఫెయిల్యూర్స్ చిత్రీకరణే ఎక్కువగా ఉంటోంది. మీ జీవితాల్లో విజయాలు లేవా? అని ఆంధ్రా  మిత్రులు అడుగుతున్నారు. భాష విషయంలో వ్యతిరేకత చాలా వస్తోందని వెల్దండి శ్రీధర్ అన్నారు.
జూపాక సుభద్ర బహుజన స్త్రీల పట్ల వివక్ష  గురించి మాట్లాడుతూ ఎన్నో  విషయాలు చర్చించారు.  షాజహానా, జ్వలిత, చెన్నూరి సుదర్శన్, వలి హుసేన్, నిసార్, గాదె వెంకటేష్, ఏశాల శ్రీనివాస్, ఓదెల వెంకటేశ్వర్లు, కనీజ్ ఫాతిమా, సుదర్శన్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. స్కైబాబ ఈ కచ్చీరును ముగిస్తూ – ఇన్నేసి అభిప్రాయాలు విన్నప్పటికీ రచయితలుగా తమకు అబ్బిన రీతిగా రచనలు చేసుకుంటూ పోవాలని, అందులోంచి కొత్త శైలి, టెక్నిక్ నిర్మాణమయ్యే అవకాశముంటుందని అన్నారు.

అనుభవమా? సిద్ధాంతమా?
బహుజన కథకులకు అనుభవం ముఖ్యమా? సిద్ధాంతం ముఖ్యమా? అన్న విషయం మీద రెండురోజులూ చర్చ జరుగుతూనే ఉండడం విశేషం. మొదటి రోజు జిలుకర శ్రీనివాస్ అనుభవానికి పెద్దపీట వేస్తూ సిద్ధాంతం సరికాదనే ప్రచారం వల్లనే నష్టం జరుగుతూ వస్తుందన్నారు. సిద్ధాంతం పూర్తిగా తెలిసే రాయాలనడం సరికాదు. ఐడియాలజీకల్ దక్పథం ఉంటే చాలు, అన్నీ చదువుకుని రాయాలంటే కుదరదని పగడాల నాగేందర్ అన్నారు. కథ జీవితానికి సంబంధించింది . ఏ ఏంగిల్ చిత్రించాడు అనేది ముఖ్యం. ఇది బహుజన సిద్ధాంతానికి అనుగుణంగా ఉందా లేదా అని మళ్లీ చర్చించుకోవచ్చు. కథ నిర్మాణాన్ని వదిలేసి సిద్ధాంత చర్చ అనవసరం అని బిఎస్ రాములు అన్నారు.  రెండో రోజు అంబటి సురేంద్రరాజు- సిద్ధాంతాలు, ఉద్యమాల పేరుతో రచయిత నష్టపోవద్దని, రచయిత ఏకాంతాన్ని ఆశ్రయించడం ద్వారా రచనలు బలంగా వస్తాయని, బహుజనులకు జీవితం చాలా ఉందని, జీవితమే వారికి ముడిసరుకు – అన్నారు.

అంబేద్కరిజమా? ఫూలేయిజమా?

జిలుకర శ్రీనివాస్ అంబేద్కరిజం దక్పథంతో రచనలు చేయాలని అన్నప్పుడు పగడాల నాగేందర్- బీసీలు అందుకు ఒప్పుకుంటారా? వారు ఫూలేను అనుసరిస్తున్నారు కదా.. అంటూ చర్చను లేవనెత్తారు. దాంతో అంబేద్కరిజం అనడం సరైనదేనా అనే దానిమీద కొంత చర్చ జరిగింది. బహుజన యిజం అనడం ‘ావుంటుందేమో అన్నదాకా ఆ చర్చ కొనసాగింది. సురేంద్రరాజు కూడా అంబేద్కరిజం కాదు, పూలేయిజం అనాలనడంతో ఆ చర్చ వివాదమై కూర్చున్నది. దీనిమీద విస్తతమైన చర్చ జరిపి బహుజనవాదం ముందుకు  వెళ్లేలా చేయాల్సిన బాధ్యత బహుజన రచయితల మీదే ఉంది.

Download PDF

8 Comments

  • jwalitha says:

    బహుజన కచ్చీరు లో జరిగిన విషయాలు పూర్తిగా రికార్ద్ కాలేదు జూపాక సుభద్ర దాదాపు గంతసేపు మాట్లాడింది ఆమె అభిప్రాయాలు రాయలెదు, అంబెద్కరిజం ఎందుకు పూలే ఇజం యెందుకు వద్దు అన్నపుడు సమాధానం చెప్పకుండా అది నాన్సెన్స్ అని జిలకర శ్రీనివస్ అసహనాన్ని ప్రదర్సించాడు, చైతన్య వంతులయిన ఎస్.సి ల నాయకత్వం లో బీ.సీలు నడవాలన్నరు , బీ.సీలను అవమానించారు అనుమానించారు అందరు బీసీలను బ్రాహ్మణులకు ప్రతీకలుగా హిందూ ఇజమ్ను కప్పుకుంటున్నరు అన్నారు , గోగు ష్యామల కమ్మరొల్లకు దమ్ముందా అని చాలెంజ్విసిరింది, బీ.సీల నాయ్కత్వంల వాళ్ళెందుకు నడుస్తారని కొత్తసమస్య లెవనెత్తాడు బీసీ మహిళా గళం లెవనెత్తిన యే ప్రశ్న రికార్డ్ కాలెదు, స్కైబాబా బుద్దిపూర్వకంగా మరుగున పెట్టిన అంశాలు 13వ తేది సొమవారం ఆంధ్రజ్యోతి వివిధ లొ ప్రచురించ బడింది.

  • పసునూరి రవీందర్‌ says:

    జ్వలితగారు మీ అభిప్రాయం స్కైబాబ వివిధలో పేర్కొననందుకే మీరిలా ప్రవర్తిస్తున్నారని, మిత్రులు అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నిజమే అనిపిస్తుంది! వివిధలో మీ పేరు చూసుకున్న తర్వాత కూడా మీరు శాంతించలేదంటే, మీ విశాలత్వానికో నమస్కారం! ఇంకో విషయం మా దగ్గర రెండ్రోజుల వీడియో సీడీలు ఉన్నాయి. మీరు వాటిని తీసుకోని మీరే ఒక రిపోర్ట్‌ను సమగ్రంగా, సమన్యాయంగా, సశేషంగా, రాసుకోండి! అనవసరంగా ఇలా పదేపదే నోరు పారేసుకోకండి. లేకుంటే మీకిదే పని అనుకుంటుంది సాహిత్యప్రపంచం…ఇల్లుపీకి పందిరేసింది చాలు!!

  • veldandi sridhar says:

    బహుజనుల కచ్చీరు బాగుంది. ఐతే బహుజనుల కథల ప్రచురణకు ఒక కార్యాచరణ కావలె. ఆంధ్ర పెట్టుబడిదారులను కాదని ఎదిగి చూపించాలి. దానికి బహుజనులంతా ఏకం కావేల్సిన అవసరముంది.

    వెల్దండి శ్రీధర్

  • ఎశాల శ్రీనివాస్ says:

    కచ్చిర్లో విరుద్ద అభిప్రాయాలు వ్యక్తం కావడం (అది వరమా శాపమా) అవి వ్యక్తుల మద్య కులాల మద్య అడ్డు గోడలు ఏర్పరుకొన్న మన జ్ఞానానికి సంపూర్నాత్వాని ఇవ్వాలని – భగవతుణ్ణి, ఏసును, అల్లాను, మార్క్స్ దేవుడిని కోరుతున్నాను

  • jwalitha says:

    పసునూరిగారు వాస్తవాలు రాయలేదు అంటే సాహిత్య ప్రపంచం నన్ను అపార్ధం చేసుకుంటుందా నేను రాసిన అబద్దం ఏమిటో నిరూపించండి నోరు పారెసుకొడమ్ ఏమిటి , ఏ బాష ఉపయోగిస్తున్నారు , విద్యార్ధులకు మీరు ఏమినేర్పిస్తారు ఇంత అసహనంగా ఇది ఇంకో బెదిరిమ్పా పేపర్లో పేరు చూసుకొవడమ్ కోసమే మీరు కచీరు నిర్వహించారా .. సీడీలు ఉంటె మరో సారి వినండి మీరు , ఎదుటి వారి గొంతులు నొక్కేసి మీరు సాదించేది ఏమిటి ..

  • jwalitha says:

    మీకు మీ మిత్రులకు నా జోహార్లు ఇల్లు కట్టడం నిలబెట్టడం నా పని పీకే ప్రయత్నం మీరు చేసారు ఇప్పటి మీ సమాధానం నిదర్శనం
    నేను చెప్పిన దానిని ఇంట గొప్పగా ప్రచారం చేసుకున్నందుకు జోహార్లు

  • buchireddy gangula says:

    ఎవరి ఒపీనియన్ వారు చెప్పడం లో తప్పు ఏమిటి?? జ్వ లీ త గారి కి
    ఇచ్చిన సమాధానం కొంచం ధూ కు డు గా ???స్కై బాబా గారి కి
    ప్రచారం ఎక్కువ– వారి రచన ని ప్రతి జిల్లా ల లో అవి ష్క రించడం???
    ఆది మహా ప్రస్థానం—ఆ మృ త ౦ కు రీ సి న రాత్రి—చివరకు మిగిలె ధీ-
    అణు క్ష ని క ౦— అల్ప జీవీ—కాల తిత వ్యక్తు లు— కాధూ– లే ధు??
    నిజం రాయడా ని కి ధాగుడు మూతలు ధెనీకి– భయం ఎంధుకు??
    రాజాకియాలు ఎంధుకు ??
    ************************************************
    బుచ్చి రెడ్డి గంగుల

  • skybaaba says:

    ముస్లింల దుర్భర జీవితాలను, ముస్లిం స్త్రీల బతుకు వెతలను ముస్లిమేతరులకు తెలియజెప్పటం లో ‘అధూరె’ కథలు సక్సెస్ అయ్యాయని ఆ కథలు చదివిన వారి స్పందన .. సభ జరిగిన చోటల్లా ముస్లిమ్స్ పట్ల ముస్లిమేతరులను సెన్సిటైజ్ చేయగలుగుతున్నాం .. ఇప్పటికి 22 చోట్ల సభలు జరిగాయి.. ఇంకో రెండు జిల్లాలలో జరిగాక 25వ సభ హైదరాబాద్ లో పెట్టబోతున్నాం .. అవాళ ‘అధూరె’ పై మరో నలుగురు ప్రముఖుల (వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు, మరో ముగ్గురు) వ్యాసాలతో మరో బుక్లెట్ వెలువడనుంది .. మీకేమైనా అభ్యంతరమా .. బుచ్చి రెడ్డి గారూ ..!!!!!!!!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)