వీలునామా-2వ భాగం

veelunama11

Sharada1    (గత వారం తరువాయి)

వున్నట్టుండి సోఫాలో లేచి కూర్చుంది ఎల్సీ.

“జేన్! ఫ్రాన్సిస్ మనిద్దరిలో ఎవరినీ పెళ్ళాడకూడదు, అనే షరతు ఎందుకు పెట్టాడంటావు మావయ్య? మనం మరీ ముక్కూ మొహం తెలియని అతన్ని పెళ్ళాడతామని ఎలా అనుకున్నాడు? ఫ్రాన్సిస్ చూడటానికి కూడా మామూలుగానే వున్నాడు. అతని తల్లిని గురించి కూడా మావయ్య ఏమీ చెప్పలేదు. ఇంతకీ అతని మొహం లో నీకేవైనా మావయ్య పోలికలు కనబడ్డాయా?”

“ఏమోలే, నేనంతగా గమనించలేదు.”

“ఇక్కడ వూళ్ళో వాళ్ళు అతన్ని వుండనిస్తారంటావా? మావయ్యదీ వాళ్ళమ్మదీ పెళ్ళీ అసలు చెల్లుతుందంటావా?”

“చెల్లినా చెల్లకపోయినా అది చట్ట బధ్ధమే? ఊళ్ళో వారికి అతన్ని ఆదరించకా తప్పదు. అతను కూడా చూడటానికి సౌమ్యుడిలానే వున్నాడు.”

“అతన్ని మనం పెళ్ళాడకూడనదన్న షరతు వుండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే నీకే అతను తెగ నచ్చినట్టున్నాడే,” నవ్వింది ఎల్సీ.

“చాల్లే! అతన్ని చూస్తే జాలేసింది నాకు. అంతే! పైగా, సలహా ఇవ్వడానికి మనకింకెవరున్నారు చెప్పు?”

“ఫ్రాన్సిస్ సంగతలా వుంచు! విలియం మాటేమిటి?”

“అవును! సరిగ్గా నేనూ విలియం డల్జెల్ గురించే ఆలోచిస్తున్నాను.

డబ్బుంటే మనలని ఎవరైనా మోసం చేస్తారన్న విషయం నాకెందుకో మావయ్య విలియం ని దృష్టిలో పెట్టుకునే రాసినట్టనిపించింది. మావయ్యకెందుకో విలియం అంటే ఇష్టం వుండేది కాదు. అందులో విలియం నాతో చనువుగా వుండటం అసలే నచ్చేది కాదు. బహుశా మా స్నేహాన్ని తుంచెయ్యడానికే మావయ్య ఇలా చేసాడేమో!”

“నువ్వు దాని గురించేమీ బాధ పడొద్దు జేన్! విలియం చాలా మంచి వాడు. అతను ఆస్తి పాస్తులకి అతీతంగా నిన్ను ప్రేమించాడు.”

“పిచ్చిదానా! విలియం పేదవాడు. డబ్బున్న అమ్మాయిని పెళ్ళాడితే తన దరిద్రం పోతుందని ఆశపడ్డాడే తప్ప, పేదరాలిని చేసుకోవాలని కాదు. కాబట్టి ఆ ఆలోచన వదిలేయ్.”

“మరీ అంత దుర్మార్గుడా విలియం?”

“ఇందులో దుర్మార్గమేముంది? నన్ను చూసి చెప్పు. నాలాటి సామాన్యమైన అమ్మాయిని, ఏమీ లేనప్పుడెందుకు పెళ్ళాడాలి ఎవరైనా? అలాటి త్యాగలని ఇతరుల నుంచి ఎప్పుడూ ఆశించవద్దు. ఇక ఆ విషయం వదిలేయ్!”

“ఆగు జేన్! ఇప్పుడు విలియం వచ్చి, నిన్ను  ప్రేమిస్తున్నాననీ, పెళ్ళాడదామనీ అంటే, అతను డబ్బు కోసం అమ్మాయిల వెంట పడే రకం కాదని తెలిసిపోతుందిగా? అప్పుడు నువ్వు పెళ్ళాడతావా అతన్ని?”

“అతనలా అనడు.”అటు తిరిగి నోట్ బుక్కులో ఏదో రాసుకోసాగింది జేన్.

మళ్ళీ కాసేపాగి చెల్లెలి వైపు తిరిగి,

“మన దగ్గర ఏవైనా నగలున్నా బాగుండేది. అవమ్మి ఒక చిన్న దుకాణం తెరిచే వాళ్ళం,” అంది.

“దుకాణమా! ఛీ! ఇంత బ్రతుకూ బ్రతికి దుకాణం తెరుస్తామా?”

“పోనీ గవర్నెస్ ఉద్యోగం చేద్దామా?”

“ఏమో జేన్! అసలు మనిద్దరికీ ఒక ఇంట్లో ఉద్యోగం దొరకకపోతే. నువ్వు లేకుండా నన్ను నేను ఎలా రక్షించుకోగలను? ఇద్దరం ఒక్క దగ్గరుండేలా చూడు.”

“సరే, పోనీ! బట్టలు కుట్టే పనిలో చేరదామా? నీకు కుట్టడం బాగా వొచ్చుగా?”

“కానీ ఆ ఇరుకు గదులూ, ఎడతెగని పనీ!”

విసిగిపోయింది జేన్.

“అయితే నువ్వే చెప్పు, ఏ పనైతే నీకిష్టమో!”

“ఏమో జేన్. నేనెప్పుడూ ఆలోచించలేదు. బ్రతుకంతా ఇలాగే మనిద్దరం కలిసే వుంటాం, నాకేం కావాలన్నా నువ్వు చూసుకుంటవ్, అనుకున్నాను!”

“అలాగే జరిగితే సంతోషం. కానీ, కొద్ది రోజులైనా ఏదో ఒక పని చూసుకోకపోతే ఎలాగ?”

“కొద్ది రోజులు మనలని ఇంట్లో వుంచుకొని ఆదరించే స్నేహితులో, బంధువులో లేనే లేరా?”

“లేరు ఎల్సీ! మావయ్య కూడా ఎవరినీ రానిచ్చే వారు కాదు. అందుకే ఇప్పుడు మనకెవరూ లేరు, ఆదుకోవడానికి, మన చదువులు తప్ప.”

ఇంతలో నౌకరు వచ్చి విలియం గారు వచ్చి కింద హాల్లో కూర్చున్నారని చెప్పాడు.

“అతన్ని పైకి రమ్మను!” జేన్ చెప్పింది కుర్చీలోంచి లేస్తూ.

“జేన్! జాగ్రత్తగా మాట్లాడు, తొందరపడకు. నే వెళ్తున్నా,” గబగబా వెళ్ళిపోయింది ఎల్సీ.

విలియం లోపలికొచ్చాడు. కాసేపు నిరాసక్తంగా మాట్లాడుకొన్నారిద్దరూ.

“అవునూ, పొద్దున్న చర్చి దగ్గర, అంత్యక్రియల్లో ఎవరో ఒక కొత్త యువకుడు కనిపించాడు. ఎవరతను?”

“ఎవరు?”

“ఎవరో, పొడుగ్గా, సన్నగా వున్నాడు. ఎడిన్ బరో నుంచి వచ్చాడట, మీ మావయ్యకి చాలా ముఖ్యుడట!”

“అయితే నువ్వేమీ వినలేదా?”

“దేనిగురించి?” అయోమయంగా అడిగాడు.

“మావయ్య వీలునామా గురించి.”

“నేనేమి వినలేదు. అది నాకనవసరం కూడా. అది మీ కుటుంబ విషయం. నీ పట్ల నా భావాలు..”

“ఆగు విలియం!  ముందీ విషయం విను. మా మవయ్య తన ఆస్తంతా ఆ యువకుడి పేర రాసి, నన్నూ ఎల్సీని కట్టు బట్టల్తో బయటికి పంపేసాడు. అన్నట్టు, ఆ యువకుడు మావయ్య కొడుకు. పేరు ఫ్రాన్సిస్.”

“జేన్! హాస్యాలాడుతున్నావా? మావయ్య అలా యెందుకు చేస్తారు? ఈ జోకేమీ బాగాలేదు.”

“కాదు విలియం. ఆరు వారాల కిందటే మా మావయ్య తన విల్లు రిజిస్టరు కూడా చేయించారు.”

విలియం మొహం పాలిపోయింది. అతనికి ఏమనటానికీ ధైర్యం సరిపోలేదు.

“విలియం! నీ పరిస్థితి నాకర్థమవుతుంది. ఇన్ని రోజులూ మనం అనుకున్న మాటలూ, చెప్పుకున్న అభిప్రాయాలూ వొదిలేద్దాం. నాకు నీమీదేం కోపం లేదు. ఒక్క కానీ కూడా లేని నన్ను నువ్వు పెళ్ళాడలేవని నాకు తెలుసు. నీకు భారమవటం నాకిష్టం లేదు కూడా, ” అంది జేన్ దయగా.

విలియం తలొంచుకున్నాడు. నిజానికి అతను ఎల్సీని ఇష్టపడ్డాడు. అయితే మావయ్యకి ఇద్దరిలో జేన్ అంటే ఎక్కువ ఇష్టమనిపించి అతనూ తన ఇష్టాన్ని మార్చుకున్నాడు. జేన్ తెలివితేటలూ, నిబ్బరమూ, హుందాతనమూ కంటే ఎల్సీ అందమూ, చిలిపితనమూ, తెలివి తక్కువతనమూ అతనికెక్కువ నచ్చాయి. జేన్ ఎప్పుడూ తన సలహా, సహాయమూ అడగదు.  శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతురాలు. అయితే మేన మామకు అత్యంత ప్రీతిపాత్రురాలు కనక ఆస్తికంతటికీ ఆమే వారసురాలౌతుందని ఆశాపడ్డాడు.

తమకున్న కొద్దిపాటీ ఆస్తీ కోర్టు వ్యాజ్యాలలో చిక్కుకొని వుండడం మూలాన అతని ఎన్నికకి అతని తల్లీ యేమీ అభ్యంతరాలు చెప్పలేదు. ఆవిడా పాపం జేన్ ని ప్రేమాభిమానాలతో ముంచెత్తింది.

కొద్దిసేపటికి విలియం తేరుకున్నాడు. అప్పటికి జేన్ తనని తిట్టినట్టుగా అనిపించి కొంచెం కోపం కూడా వచ్చిందతనికి. అసలు తనే గంభీరంగా మాట్లాడి వుండాల్సింది. తనని వదిలి వుండలేనని జేన్ యేడిస్తే, తనే యెలాగో నచ్చ చెప్పి వుండాల్సింది.

అలాటిది జేన్, తమ ఇద్దరి మధ్యా అసలేమీ లేనట్టూ తనకి ఏ మాత్రమూ ఆమె మనస్సులో చోటు లేనట్టూ, “ఇహ నువ్వు వెళ్ళొచ్చు,” అన్నట్టు మాట్లాడేసరికి అతనికి ఉక్రోషంగా అనిపించింది. ఎప్పుడు తనకంటే ఆమెదే పై చేయి, అనుకున్నాడు అసహనంగా,

“అవును జేన్! నువ్వన్నది నిజమే. నాలాటి పేద వాణ్ణి కట్టుకుని నువ్వు సుఖపడేదీ ఏం వుండదు. నన్ను క్షమించు.”

విలియం లేచి మెట్లు దిగి వెళ్ళిపోయాడు.

“నాకతని మీద కోపమేమీ లేదు!”

తనకి తనే పదే పదే నచ్చ చెప్పుకుంటూ కుర్చీలో కూలబడింది జేన్.

***

జేన్ “మావయ్య ఆలోచించే ఈ పని చేసి ఉంటాడు”, అన్నప్పుడు కేవలం తన సొంత అభిప్రాయాన్నే వెలిబుచ్చింది. మేనమామని ఆమె ఎంతగానో అభిమానించి, గౌరవించింది. తన మీదా చెల్లెలి మీదా ఆయన విధించిన ఆంక్షలేవీ ఆమెనెక్కువగా బాధించలేదు. అయితే ఆమె అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు ఎవరూ లేరు.

తన మేన కోడళ్ళిద్దరికీ తన ఆస్తిలో దమ్మిడీ కూడా ఇవ్వలేదాయన అన్న విషయం బయటికి పొక్కగానే, ఊరి వారందరూ నానా రకరకాలుగా వ్యాఖ్యానించారు.

“పెద్దోరింటి గొడవ మనకేం తెలుసు,” అని పనివాళ్ళనుకుంటే, “ఈయనంత వింతగా ఎవరైనా ప్రవర్తించగలరా?” అనుకున్నారు మిగతా ఎస్టేటు దారులు.

ఏదెలావున్నా, మేనమామ పుణ్యమా అని, జేన్ కి కానీ, ఎల్సీ కి కానీ స్నేహితులే లేరు. ఆడవాళ్ళు స్నేహం పేరిట  పోచికోలు కబుర్లతో కాలయాపన చేయటం ఆయనకి నచ్చేది కాదు.

ఆడా మగా కలిసి సరదాగా విందులూ వినోదాలూ చేసుకోవడం ఇంకా నచ్చేది కాదు. అయితే, అప్పుడప్పుడూ ఆయన చుట్టు పక్కల వారిని విందు భోజనాలకి ఆహ్వానించిన మాటా నిజం. కానీ, సాయంత్రం ఆరింటికి వచ్చి రాత్రి పన్నెండింటికి తప్పకుండా వెళ్ళిపోవాలన్న నియమం వుండడం చేత ఎవరికీ ఆ విందు భోజనాలంటే పెద్ద ఆసక్తి వుండేది కాదు.

వాళ్ళిద్దరి చదువూ, ఇతర వ్యాపకాల విషయంలో మాత్రం ఆయన ఏదీ తక్కువ చేయలేదు. అమ్మాయిలిద్దరూ గుర్రపు స్వారీ, ఈతా, తుపాకి పేల్చడం లాటి విద్యలన్నీ నేర్చారు. అయితే అంత ఖర్చు పెట్టి వాళ్ళీద్దరికీ చెప్పించిన విద్యతో ఆయనే సంతోషపడలేదు! హొగార్త్ గారు విద్యతో వ్యక్తిత్వాలను తీర్చిదిద్దవచ్చని అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలకీ ఒకే రకం విద్య చెప్పించినా, ఇద్దరి వ్యక్తిత్వాల్లో అంత తేడా వుండడం ఆయనకి అర్థం కాలేదు.

పెద్దది జేన్ ఇద్దర్లోకీ చురుకైనదీ, ధైర్యం గలదీ. ఆస్తిపాస్తుల ఆజమాయిషీ, చెల్లెలి సంరక్షణా తన బాధ్యతలే ఆవుతాయి కాబట్టే మామయ్య అందరు ఆడపిల్లల్లా కాకుండా తనకు విభిన్నమైన శిక్షణ ఇప్పిస్తున్నాడనుకొందామె. అందుకే, సంతోషంగా లెక్కలూ, అక్కవుంటుంగూ, వ్యవసాయ శాస్త్రమూ, వగైరా విషయాలు ఆసక్తిగా నేర్చుకుంది. ఆడవాళ్ళకి అప్పట్లో నేర్పించే విద్య చాలా వరకు ప్రదర్శనలకొరకు పనికొచ్చేదే అయివుండేది. అలాంటి అల్లిక పనీ, కుట్టు పనీ, బొమ్మలేయడం, సంగీతం వంటి కళలు నేర్చుకునే పని తనకు తప్పినందుకు జేన్ ఎంతైనా సంతోషించింది.

ఎల్సీకి పాపం ఇవన్నీ కాకుండా మిగతా అమ్మాయిల్లా వుండాలని వుండేది. కానీ, అక్క లాగానే చదువుకోవాలని మామయ్య ఆదేశం. అందుకే ఎల్సీ చదువు ఏదో అంతంతమాత్రంగా సాగింది. భాషలు నేర్చుకోవడం హొగార్త్ గారి దృష్టిలో ఎందుకూ పనికి రాని విషయం. అయినా అమ్మాయిల ట్యూషన్ మాస్టారు, విల్సన్ గారు పట్టు బట్టి ఇద్దరికీ గ్రీకు, లాటిన్ భాషలు నేర్పించాడు. వాళ్ళిద్దరూ తమ ఇష్టంతో ఫ్రెంచీ, ఇటాలియన్ భాషా నేర్చుకుంటామంటే ఎడిన్ బరో లో కొన్నాళ్ళుంచి ఆ రెండు భాషలనీ చెప్పించారు హొగార్త్. భాషల్లో చాలావరకు ఎల్సీ అక్కకంటే ముందుండేది. వీటన్నిటికంటే ఎల్సీకి సంగీతం మీద చాలా ఇష్టంగా వుండేది. కమ్మటి కంఠంతో బాగా పాడగలదు కూడా.

అయితే తన చెల్లెలు మేరీ జీవితం నాశనమవడానికి కారణం ఆమెకి సంగీతం మీద వున్న ఆసక్తే అన్న దృఢాభిప్రాయంతో హొగార్త్ గారు పిల్లలని సంగీతం ఛాయలకెళ్ళనివ్వలేదు. అందువల్ల ఎల్సీ ఆసక్తులూ ఇష్టాలూ నెరవేరనే లెదు. దాంతో చదువు పూర్తయినా ఎల్సీ అనాసక్తంగా, చిన్న పిల్లలా ప్రవర్తిస్తే జెన్నీ పెద్దదానిలా బాధ్యతలు తిసుకునేది.
హొగార్త్ గారు మరణించే నాటికి జేన్ కి ఇరవై మూడేళ్ళు నిండాయి. ఎల్సీ అక్కకంటే రెండేళ్ళు చిన్నది. అప్పుడప్పుడే విద్యాభ్యాసం ముగిసి, వాళ్ళకి నాలుగు ఊళ్ళూ తిప్పి చూపించాలని అనుకుంటున్నంతలో ఆయన ఆరోగ్యం పాడయి పరిస్థితి చూస్తూండగానే విషమించింది.

ఆయన విచిత్రమైన వీలునామా సంగతి తెలియగానే ఊళ్ళో వాళ్ళంతా జాలిపడ్డారు. అయితే వాళ్ళిద్దరినీ వొచ్చి పలకరించటానికెవరికీ ధైర్యం చాలలేదు. అందరికంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో పడింది విలియం తల్లి, శ్రీమతి డాల్జెల్ గారు! అమ్మాయిలద్దరూ తన దగ్గరికి వచ్చి ఏదైనా సాయమడిగితే ఏం చేయాలో నన్న భయం పట్టుకుందామెని. అందుకే వారి ఇంటికెళ్ళి పరామర్శించే పనిని వీలైనంత వాయిదా వేయదల్చుకుంది.

అంత్యక్రియలు ముగిసిన మర్నాడే చర్చి ఫాదర్ వొచ్చి పరామర్శించాడు. చాలా సేపటి వరకూ ఆయన మాట్లాడింది వాళ్ళకు అర్థం కాలేదు. అర్థమయింతర్వాత నచ్చలేదు. ఎక్కువగా ఆయన “ధనికులంతా దుర్మార్గులూ, డబ్బుతో వచ్చే సుఖాలకంటే, నష్టాలే ఎక్కువా, డబ్బు లేక తిండి కోసం మలమల మాడే పేదలే భగవంతునికి ప్రీతి పాత్రులు” వగైరా మాటలతో వాళ్ళని ఓదార్చారు. జేన్ కి తాము డబ్బు లేని పేద వాళ్ళుగా వుండటాన్ని ఇష్టపడటం లేదనీ, ఏదో కష్టం చేసి బ్రతకగలమనీ చెప్పటానికి ఆయన వాగ్ధాటి ముందు ధైర్యం చాలలేదు.
ఎందుకూ పనికిరాని సానుభూతి వాక్యాలతో విసిగిపోయిన జేన్, ఈసారి వచ్చే వారిని ఉద్యోగం కోసం ఏదైనా సలహా అడగాలని నిశ్చయించుకుంది. ఆ వ్యక్తి శ్రీమతి డాల్జల్ కావడం యాదృఛ్ఛికం! డాల్జల్ గారు వచ్చి ఏవో మామూలు మాటలు మాట్లాడి, అంటీ ముట్టనటుగానే వున్నారు. వున్నట్టుండి ఆవిడని జేన్ అడిగింది

“ఇప్పుడు మేమేం చేస్తే బాగుంటందంటారు ఆంటీ?”

గతుక్కుమంది శ్రీమతి డాల్జల్.

“హయ్యో! నాకేం తెలుసమ్మా? పెద్దాయన ఇలా చేస్తాడని ఎవ్వరమైనా అనుకున్నామా? నా బుర్రకైతే ఒక్క ఆలోచనా తట్టడం లేదు. విలియం ఈ సంగతి చెప్పగానే గుండె నీరైపోయిందంటే నమ్ము! హవ్వ! సొంత తోబుట్టువు పిల్లలని వీధులకప్పజెప్పి ఎవరో ఊరూ పేరూ తెలియని వాడికి తన సొత్తంతా ఇస్తాడా? పోనీ ఆయన రాసిన విల్లు చెల్లదని కోర్టులో దావా వేస్తే? అసలా అబ్బాయి ఈయన కొడుకే అని ఋజువేదీ? కొంచెం డబ్బు కోసం ఆ పిల్లాడి మిద వొత్తిడి తెచ్చినా తప్పు కాదంటాను!”

“అదయ్యే పని కాదులే! ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో చెప్పగలరా? మీకు తెలిసిన వాళ్ళెవరైనా…”

శ్రీమతి డాల్జల్ ఆలోచించింది.

“చామర్స్ గారి శ్రీమతి వాళ్ల పిల్లలకి ఒక గవర్నెస్ కోసం వెతుకుతున్నారు. మరయితే మీకా ఉద్యోగం నచ్చుతుందో లేదో! మాక్స్వెల్ కుటుంబం కూడా వాళ్ళ అబ్బాయిలకి మొన్నీమధ్యనే ట్యూషను మాస్టారును కుదుర్చుకున్నారు.”

“అక్కా! మనకి వేరే దూరంగా వుండే వూళ్ళల్లో ఉద్యోగాలు దొరికితే బాగుండు. నాకీ ఊరంటే అసహ్యం పట్టుకుంది,” ఎల్సీ అంది.

“అవునమ్మాయ్! హాయిగా ఎడిన్ బరో లోనో, గ్లాస్గో కొ వెళ్ళండి. అక్కడేమైనా స్కూల్ మాస్టారు ఉద్యోగాలు దొరకొచ్చు.”

“చదువు చెప్పటం కాకుండా ఇంకేమైనా ఉద్యోగాలు దొరకవంటారా?”

“అయ్యో! పెద్దింటి పిల్లలు! నీడ పట్టున వుండే పనులు కాక ఇంకేం చేయగలరు?”

“అన్నట్టు మీకు మిస్ థాంసన్ గారు తెలుసా? మావయ్య ఆవిడ గురించి చాలా చెప్పారు. చాలా తెలివైనదనీ, ధైర్యం గలదనీ, ఏ పనైనా చక్క బెట్ట గలదనీ అన్నారు. ఆవిడ దగ్గరికెళ్తే ఏదైనా ఉద్యోగం దొరకొచ్చు.” సాలోచనగా అంది జేన్.

“ఆవిడ తెలియకపోవటమేంటి? అంటే పనీ పాటలూ చేసుకునేవాళ్ళతో మాలాటి కుటుంబీకులు ఎలా కలిసి మెలిసి తిరుగుతారు కానీ, చాలా పనిమంతురాలనే విన్నాను. వాళ్ళ పొలం పనులన్నీ తనే ఒంటి చేత్తో చూసుకుంటుందిట. పెళ్ళీ పెటాకులూ కూడా లేవాయె! ఇప్పుడు కొంచెం వయసు మీద పడుతున్నట్టుంది ఆమెక్కూడా!”
“ఆవిడ దయ తలచి నాకూ ఏదో ఉద్యోగం ఇవ్వకపోదు! వెళ్ళి నన్ను తనకి సాయంగ పెట్టుకోమని అడుగుతాను. నేనూ చాలా వ్యవసాయ శాస్త్రం చదువుకున్నా కాబట్టి ఆమెకీ లాభమే. ఆంటీ, ఆవిడకి నన్ను పరిచయం చేస్తూ ఒక చిన్న ఉత్తరం ఇస్తారా? ”

తనకే నష్టం కలగకపోతే అమ్మాయిలద్దరికీ సాయం చెయ్యడానికి ఆవిడకేమీ అభ్యంతరం లేదు. అందుకే నిరభ్యంతరంగా ఒక చిన్న ఉత్తరం రాసిచ్చింది.

***

 (సశేషం)

ముఖచిత్రం : మహీ పల్లవ్

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)