రెండు నక్షత్రాలు

teyaku5అనగనగా చాలా కాలం క్రితం కథ ఇది. ఒకానొక రాజ్యంలో , ఒకానొక ఊర్లో పెద్ద చెరువోకటి వుండేది. ఆ చెరువెంబడి  పచ్చటి పొలాలు, ఆ పొలాలకి ఎడమ చేతి వైపున కొన్ని ఇళ్లు ఉండేవి. ఆ ఇళ్లలోనే ఒక చిన్న పూరింట్లో ఒక విధవరాలుండేది.

ఆవిడ యెట్లా విధవరాలయ్యిందో మనకు తెలీదు. ఎట్లాగైనా అయ్యుండొచ్చు… ఏమంటే కూలిపనికి వెళ్ళిన ఆమె భర్తని  విషం పాము కరిసివుండొచ్చు, లేదంటే పెద్ద రోగమో రొష్టో వచ్చి ఉండొచ్చు …

ఏదైనా అయ్యుండొచ్చు కదా?

అయితే అదృష్టమేమిటంటే ఆ విధవరాలికి ఒక మంచి కొడుకు వున్నాడు. వాడు చాలా చాలా మంచి వాడు. మంచి వాడంటే ఏమిటీ? ఏవిటంటే దుష్టుడు కాడనమాట. ఎవరికైనా బాధ కలిగితే వాడికీ బాధ  వేస్తుంది, ఎవరైనా సంతోషంగా వుంటే వాడికీ మనసు నిండా ఆనందం కలుగుతుంది, అదిగో వాడు అందరూ సంతోషంగా వుండాలని కోరుకునే మంచివాడన్న మాట.

సరే అప్పుడేమయిందంటే, ఆ మంచి అబ్బాయి పెరిగి పెరిగీ పెళ్ళీడుకి వచ్చాడు. వాళ్ళమ్మ వాడికి పెళ్లి చెయ్యాలీ అనుకుంది. ఫలానా ఊరిలో పిల్ల అని చెప్పి నిశ్చయం చేసుకొచ్చారు. ఇహ పెళ్లి రోజు వచ్చేసింది. ఆ రోజు బంధువులందర్నీ పిలిచి తనకి ఉన్నంత మటుకులో పాయసమూ, రొట్టెలూ వండి విందు చేసింది ముసలావిడ. బంధువులు అవన్నీ తిని ఇక పెళ్ళింటికి బయల్దేరారు .

వెళుతూ వుండగా పెళ్లి కొడుకుకి తను ధనుస్సు, కత్తి తీసుకు రావడం మరిచిపోయానని జ్ఞాపకం వచ్చింది. వారి ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు ధనస్సు, కత్తీ, బాణం ధరించి పెళ్లింటికి వెళ్ళాలన్నమాట. అప్పుడిక సరే అని చెప్పి వెనక్కి తిరిగి ఇంటికి బయల్దేరాడు.

ఇక్కడ అబ్బాయి అమ్మ ఏం చేసిందీ. నా కొడుక్కి పెళ్లై పోతుంది కదా కోడలొస్తే నాకు సరిగా తిండి పెడుతుందో లేదోనని చెప్పి ఏవేవో వండుకుని కడుపునిండా తిన్నదట. చివర్న కాస్త అన్నం మిగిలిపోతేనూ దాంట్లో కూడా ఉప్పేసుకుని తింటూ ఉందట. అప్పుడు కొడుకు ఇంటికి వచ్చాడు అమ్మని చూసి ఏమ్మా ఇప్పుడే కదా పాయసమూ,రొట్టె తిన్నావూ అప్పుడే ఆకలేసిందా? అని నవ్వుతూ అన్నాడట. అది విని ఆ ముసలమ్మ కాదు నాయనా! ఇదిగో నీకు పెళ్ళవుతుంది కదా! కోడలు ఇంటికొస్తే నాకు కడుపునిండా తిండి వుంటుందో లేదోనని ఇష్టమైనవి కాసింత కాసింత వండుకు  తిన్నాను అన్నదట.

కొడుకు అమ్మ మాటలకి చాలా నొచ్చుకున్నాడు. కత్తి , ధనుస్సు తీసుకుని తిరిగి  బయల్దేరాడన్న మాటే కానీ ఆ అబ్బాయికి , మనసులో మనసు లేదు. చెంపలపై  కన్నీరు ధార కడుతుంది. నాకు పెళ్ళైతే మా అమ్మకి , కడుపుకి బువ్వ కూడా ఉండదా? నాకొచ్చే భార్య మా అమ్మకి తిండి పెట్టదా? అలా అయితే నేనేందుకు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి.

మరి ఆడపెళ్ళి వారింటి సంగతేమిటీ అంటే … మగ పెళ్లి వారోచ్చేసినా పెళ్లి కూతురు ఇంకా స్నానమన్నా పోసుకోలేదట . అమ్మాయి స్నానం కానిదే, మగ  పెళ్లి వారిని ఇంట్లోకి రానివ్వకూడదని వాళ్ళ సాంప్రదాయం. అందుకని పెళ్లి కూతురి అన్న, భార్యని పిలిచి ఏమోయ్ …ఏమోయ్ త్వరగా చెల్లికి స్నానం కానిచ్చి తయారు చేయి , పెళ్లి వాళ్ళు బయట వున్నారు, వాళ్ళని ఇంట్లోకి పిలవాలి కదా అన్నాట్ట. అప్పుడు భార్య సరే అయితే నువ్వు మీ చెల్లిని కొంచెం కోసి , రక్తం పట్టి తెల్ల చీరకి ఎర్రంచు వెయ్యి అన్నదట. ఆ మాట విని చెల్లెలంటే చాలా ఇష్టం వున్న ఆ  అన్నకు చెల్లిని గాయ పరచడానికి మనసు రాలేదట . ఇట్లా అతలాకుతలమవుతుంటేను …లగ్నాల వేళ  మించే పోయిందట .

ఇదంతా చూసి అసలే అమ్మ గురించి బాధ పడుతున్న ఆ అబ్బాయి మనసు మరింత నొచ్చుకుంది. ఆ బాధతో నడుచుకుంటూ వచ్చి ఒక మైదానం లో నిలబడి పెద్ద మర్రి చెట్టుగా మారి పోయాడట . ఆ తర్వాత మరి కొన్నాళ్ళకి మిలమిల మెరిసే నక్షత్రమై ఆకాశానికి ఎక్కాట్ట. అదిగో ఆ పెద్ద చుక్కే  అబ్బాయి … దాని పక్కనే మసక మసకగా మెరుస్తుందే చిన్న చుక్క …అదెవరో తెలుసా? అది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి .

 *

ఇహ  అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఆకాశంలో మెరిసే ఆ రెండు నక్షత్రాలకీ నమస్కరించుకున్నాకనే బడాయిక్ జాతి వారు పెళ్లి లగ్నాలు పెట్టుకుంటారు.

సామాన్య

Download PDF

12 Comments

  • ఎన్నో జీవన సత్యాలు చెప్పినట్టు ఉంది…ఒక బలమైన, బరువైన ఫీలింగ్. దర్శకుడు శేఖర్ కపూర్ భారతీయ సినిమాలు ఎదగాలంటే “గో బ్యాక్ టు (లోకల్) మిథాలజీ” అంటూ ఉంటాడు. బహుశా ఇదేనేమో…

  • Ismail says:

    చుక్క లాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి:-) నైస్.

  • కథ నాకర్థం కాలేదు. అబ్బాయి వరకు బానే ఉంది. కానీ అమ్మాయి ఇంట్లో జరిగిన విషయమేమిటో బోధపడలేదు !!!

    • saamaanya says:

      సౌమ్య
      అమ్మాయి ఇంట్లో వారి ఆచారాలేవో వున్నాయి . అవి తెమిలే లోపు ముహూర్తం మించిపోయింది అంతే మరేం లేదు . జాన పద కథలు చాలా కాలదూరాలు ప్రయాణించి వుంటాయి కదా …వాటిని పూర్తిగా విడతీయటం సాధ్యం కాదు . అప్పటికీ కొంత ఆ ప్రయత్నం చేస్తున్నాను .

  • ఇది కథా లేక బడాయిక్ జాతి వారి జీవన సత్యమా

  • ఎంతో ఇష్టంగా విని వుంటారు. అందుకే, ఇంత ఇష్టంగా చదివించేలా చెప్పగలిగారు కథ.

    • saamaanya says:

      అవును సర్ . కథలు వినడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండీ . మీ స్పందనకు థాంక్ యు సర్ .

  • సింపుల్ ఫోక్ fraagraans

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)