Son: Do we eat humans, when we starve?
Father: We are already starving?
Son: We shouldn’t eat humans, even though we die with starvation.
Father: No, we don’t, my son.
మృత్యు శీతలత.
అగాధమైన ఒంటరితనం.
ఎడతెగని భయం.
……………………
వర్ణాలు, ధ్వనులు, నామాలు, సూర్యరశ్మి, వెచ్చదనం, సంతోషం, ఆశ…అన్నీ తుడిచిపెట్టుకుపోయిన భూమిపై ఒక తండ్రి(45), ఒక కొడుకు (9) మెల్లగా, విచారభరితంగా పయనిస్తున్నారు. తీరప్రాంతానికి వెళ్లాలని వారి ప్రయత్నం. అక్కడ పరిస్థితులు కాస్తంత మెరుగుగా ఉంటాయని ఆశ. కాని అక్కడ ఏముందో ఎవరికి తెలుసు? నిజంగా వారక్కడికి చేరగలరా?
“ప్రతి దినం మునుపటి రోజుకంటే నల్లనిది. ప్రపంచం మెల్లగా మరణిస్తోంది. ప్రాణులన్నీనశించాయి. పంటలు పండే అవకాశం ఇక లేదు. నేలంతా బూడిదమయం అయింది. వృక్షాలన్నీ కూలిపోయాయి. రోడ్లు సాయుధులైన మూకలతో నిండిపోయాయి. ఇంధనం, ఆహారం కోసం వేట. శిఖరాల మీద మంటలు ఎగసాయి. కానిబాలిజం (cannibalism) విస్తరించింది. కానిబాలిజం… అది వెన్నులో వణుకుపుట్టిస్తుంది. నేను ఆహారం కోసం ఆందోళన పడుతున్నాను. అవును, ఎక్కువగా ఆహారం కోసమే, ఇంకా ఈ చలి గురించి, మా బూట్ల గురించి…” తండ్రి తనలో తాను మధనపడ్డాడు.
అంతులేకుండా బూడిద ఆకాశంలో ఎగసిపడుతోంది. నగరాలు శిథిలమై నిర్మానుష్యంగా మిగిలాయి. ఎక్కడా ఆహారం లేదు. మొక్కలు పెరుగుతాయనే ఆశాలేదు. కొద్దిమంది మనుషులు మాత్రమే భూమిపై మిగిలిఉన్న చివరి జీవులు. కాని వారిప్పుడు ఎంతమాత్రం మనుషులు కారు. ఎందుకంటే వారి primitive instincts పూర్తిగా బయటపడే సమయమిది. మనుషుల యదార్థ స్వభావాలు వెల్లడి అయ్యే సమయమిది. మనుషుల ముసుగులు తొలగే అత్యంత సంక్లిష్ట సమయమిది. మనుషులు తోడేళ్ళుగా మారే వేళ ఇది.
ఆ తండ్రి దగ్గర ఒక రివాల్వర్, రెండు బుల్లెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కొడుకుని రక్షించేందుకు వినియోగించేసాడు. మిగిలిన ఒక బులెట్ ని అత్యంత ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు, కొడుకుకి తనని తాను అంతం చేసుకోమని ఇచ్చాడు. కొడుకుని బాధాకరమైన మరణం నుండి ఆ బులెట్ రక్షిస్తుందని అతని ఆశ. వారి ప్రయాణంలో సంభవించిన సంఘటనలు, ఆ ఘటనలకు వారు స్పందించిన తీరు మన హృదయాలలో లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తుంది. భయం ఒక్కొక్కసారి మానవత్వాన్ని అణచివేస్తుంది. మరొకసారి మానవత్వం భయాన్ని జయిస్తుంది.
“ది రోడ్” చిత్రాన్నిచూసినప్పుడు భయం యొక్క విస్తృతి, లోతు మనకి అనుభూతమవుతాయి. మానవ స్వభావంలోని వైరుధ్యాలు మనలో వణుకు పుట్టిస్తాయి. భయకరమైన నైరాశ్యం. గూడు కట్టిన భయం. అరుదైన, విలక్షణమైన తాత్వికత జీవితం యొక్క నిష్ఫలతను, అదే సమయంలో జీవన సౌందర్యాన్ని ఏకకాలంలో హృదయంలో ఆవిష్కరిస్తుంది. మానవ స్వభావంలోని ఔన్నత్యం, మృగత్వం రెండూ వ్యక్తమవుతాయి. ఒక గంభీరమైన అనుభవం మన చేతనను ఆసాంతం ఆక్రమించుకుంటుంది. రోజుల తరబడి గాఢమైన విషాదం, అనూహ్యమైన వేదన మన హృదయాలను వెంటాడుతాయి.
మహా కళాకారుడైన ఆస్ట్రేలియన్ దర్శకుడు జాన్ హిల్కోట్ తన చిత్రాలలో అత్యంత లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తాడు. ఆయన ప్రతి చిత్రం ఒక అలౌకిక అనుభవం. మహా నటుడు విగ్గో మార్టెన్ సెన్ తండ్రి పాత్రలో పలికించిన భావాలు మన హృదయాన్ని దిగులుతో నింపేస్తాయి. అతని దిగులు, స్వార్థం, త్యాగం, కొడుకు యొక్క మానవీయమైన ఆధిక్యతకి అతని అతడు చిన్నబోవడం_ ఇలా ప్రతి భావం ఆయన వదనంలో పలికించిన తీరు అసాధారణం. నిక్ కేవ్, వారెన్ ఎల్లెస్ ల అత్యంత సున్నితమైన సంగీతం హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోతుంది. వివరించలేని తాత్వికతని హృదయంలో ఆవిష్కరిస్తుంది.
ఈ చిత్రం జీవితాంతం వెంటాడే ఒక నాణ్యమైన కవితాత్మక అనుభవాన్ని ఇస్తుంది. మానవ జీవితం పై ఒక కాంతిని ప్రసరిస్తుంది.
_______________________
Film: The Road (2009)
Country : USA
Language: English
Run time : 111 min
Director: John Hillcoat
Actors : Viggo Mortensen , Kodi Smit-McPhee, charlize theron, Robert Duvall Robert Duvall
Music : nick cave and warren ellis
ఇది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి …..కాని దానిని మనం అంగికరించ తప్పదు. మానవ జాతి విద్వేషాలతో తన మూలాల్ని తనే పెకలించుకునే స్థితికి సుమారుగా వచ్చేసింది. కొంతమంది అత్యాస పరులు, స్వార్ధ పరుల ఆలోచనలతో ప్రపంచం పూర్తిగా వినాశనం వైపుగా దారి తీస్తుంది ….మనం మన ఉదారస్వభావ ఆలోచనలను పూర్తిగా విస్మరించి నా జాతి, నా దేశం నా కుటుంభం అనే సంకుచిత పరిధి లో జీవనం సాగిస్తుంటే బహుసా మానవ జాతి అంతిమ దినం ఇంకెంతో కాలం లో లేదేమో …….చాల మంచి వ్యాసం…చాలా మంచి చిత్రం గురించి తెలిపారు.
మనుషుల అంతరంగంలోని భావాలను ముసుగు లేకుండా చూపిన సినిమా గురించి మీ వ్యాస పరిచయం చాలా బాగుంది శ్రీరాం గారూ. ధన్యవాదాలు.