చిటారుకొమ్మన గాలిపటం…

Nishi_ForSaaranga

అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి
తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో
మహావృక్షాల ఆకుల చివర్లలో
ఒంటరిగా…

రెండు అనంతాల మధ్య
అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి!

సెలయేటి పొగమంచులో చిక్కుకుపోవాలి

మెత్తని మసకదనంలో
పావురంలా.. లేదంటే పంకజమైపోయీ
రెక్కలు విప్పార్చుకుని
రహస్యంగా తేలిపోవాలి!

వరుస వానల తడిలోంఛి
శరత్కాలపు మధ్యాహ్నంలోకి జారిపొవాలి..

చూరు నించి చిన్నగా బయటకొచ్చిన చీమలానో
ముడుచుకున్న సవ్వడిలేని పువ్వుల్లానో!

చిన్నపాటి జీవం కోసం
చిటారుకొమ్మన గాలిపటమై
తపస్సొకటి ఆరంభించాలనిపిస్తుంది!

పొందినదీ.. పోగొట్టుకున్నదీ
ఇబ్బందిపెట్టే లెక్కలెన్నో
అస్థిమితంగా ఛాతిని దువ్వుతున్నప్పుడు

నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!

Download PDF

23 Comments

 • “నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
  నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!”

  మీ స్టాంప్ కవిత ..చాలా బాగుంది నిషీ..జీ :)

 • ns murty says:

  నిషిగంధ గారూ,

  ఈ కవిత నిజంగా “పొందినదీ… పోగొట్టుకున్నదీ ” బేరీజు వేసుకుంటున్నప్పుడు ఉండే అనిశ్చిత మానసిక స్థితిని బాగా పట్టింది. నిజానికి మనిషి అలా బేరీజు వేసుకుంటున్నాడంటే అంతరాంతరాల్లో పోగొట్టుకున్నది ఎక్కువని బాధపడుతున్నాడని చెప్పొచ్చు. అప్పుడే ఎందుకొచ్సినదీ జీవితం అన్న నిరాశ కలుగుతుంది. ఆనందమే కాదు, నిరాశలో జీవితాన్ని అవలోడనం చేసుకుంటున్నప్పుడు కూడా మనసు ఎక్కడెక్కడికో పోతుంది. ఒంటరితనం కోసం అర్రులు చాస్తుంది.

  అభివాదములు

 • నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
  నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!….One is many and one wish to be many….good.

 • పద్యంలో ఉన్న తాత్త్విక చింతన బావుంది. కానీ ఆ తాత్త్విక చింతన నేపథ్యంగా చూస్తే చివరిదానికి మూందటి చరణం (పొందినదీ ..) మిగతా భావంలో ఇమడటంలేదని నాకనిపించింది.

 • Saikiran says:

  నిశిగంధ గారు – కవిత చాలా బాగుంది. నారాయణస్వామి గారితో ఏకీభవిస్తాను.
  W/R-Saikiran

 • Prasuna says:

  కవిత చాలా అందంగా ఉంది నిషి. కవిత మొదలే వర్షం లో స్నానించి నిలబడ్డ మాహావృక్షాల దగ్గరికి తీసుకుపోయింది. ఏమో చెప్పాలనిపిస్తుంది కానీ మాటలు వెతుక్కుంటున్నాను. బహుశా ఈ కవిత తీసుకుపోయిన ఒక స్థితి నుంచి బయటకు రావడానికి సమయం పడుతుంది.

 • పదచిత్రాలు బాగున్నాయి….అభినందనలు

  కొన్ని విషయాలు /సందేహాలు ఇలా అనిపించాయి
  1. పరిష్కారమేదో చూపుతూ చూపుతూ …… పరిష్కారానికి నిర్ణయం తీసుకునే వైపుకి మళ్ళారనిపించింది.
  2. చిన్నపాటి జీవం కోసం…. ఈ పాదం నుంచి మీరు వినిపిస్తున్న గొంతు ధ్వని మార్చుకుంది గమనించారో లేదో !
  3. మీరు మొదటి కొన్ని పాదాలలో చెప్పినవి చేస్తే “నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!” అనే తలపు విరుద్ధమౌతుంది.

 • తృష్ణ గారూ, ధన్యవాదాలు :-)

  అవునండీ, మూర్తిగారు.. పోగొట్టుకున్నది ఎక్కువనిపించినప్పుడే ఆ బేరీజులో అస్థిమితం చోటు చేసుకుంటుంది.. అలా అనిపించడంవల్లనే కాసేపు వేరే జివితాల్లోకి పరకాయ ప్రవేశం చేశేయాలనిపిస్తుంది.. మీ విశ్లేషణకి ధన్యవాదాలు.

  ధన్యవాదాలు మహేష్ గారు.. “One is many and one wish to be many…” — కరెక్ట్‌గా పట్టుకున్నారు! :-)

  థాంక్యూ ప్రసూనా, ఆ మాటలు రానితనమే నీ నించి ఇంకో కవితని పుట్టిస్తుందేమో చూడు! :) )

 • నారాయణ స్వామిగారు, సాయికిరణ్ గారు, జాన్ గారూ – Thank you so much for your valuable feedback. Really appreciate it!

  జాన్ గారు అన్నట్టు చివరి రెండు పాదాల్లో గొంతు మార్చుకోవడం జరిగింది కానీ విషయం నించి వేరేగా మాత్రం కాదు..
  ఎప్పటిలా సమస్య – పరిష్కారం దిశలో కాకుండా పరిష్కారాలు చూపిస్తూ… అసలు సమస్య చెప్పడం జరిగింది.
  ‘ఇలా చేస్తే బావుంటుంది, అలా జరిగినప్పుడు’ అన్న పద్దతిలో అన్నమాట. :))

  ఇలా చదివితే అర్ధవంతంగా అనిపిస్తుందో లేదో చెప్పగలరు —

  —-
  పొందినదీ.. పోగొట్టుకున్నదీ
  ఇబ్బందిపెట్టే లెక్కలెన్నో
  అస్థిమితంగా ఛాతిని దువ్వుతున్నప్పుడు

  నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
  నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!

  అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి
  తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో
  మహావృక్షాల ఆకుల చివర్లలో
  ఒంటరిగా…

  రెండు అనంతాల మధ్య
  అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి!

  సెలయేటి పొగమంచులో చిక్కుకుపోవాలి

  మెత్తని మసకదనంలో
  పావురంలా.. లేదంటే పంకజమైపోయీ
  రెక్కలు విప్పార్చుకుని
  రహస్యంగా తేలిపోవాలి!

  వరుస వానల తడిలోంఛి
  శరత్కాలపు మధ్యాహ్నంలోకి జారిపొవాలి..

  చూరు నించి చిన్నగా బయటకొచ్చిన చీమలానో
  ముడుచుకున్న సవ్వడిలేని పువ్వుల్లానో!

  చిన్నపాటి జీవం కోసం
  చిటారుకొమ్మన గాలిపటమై
  తపస్సొకటి ఆరంభించాలనిపిస్తుంది!

 • సాయిపద్మ says:

  రెండు అనంతాల మధ్య
  అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి!

  చూరు నించి చిన్నగా బయటకొచ్చిన చీమలానో
  ముడుచుకున్న సవ్వడిలేని పువ్వుల్లానో!

  నాకు నచ్చిన లైన్స్ .. ఎంత ఆహ్లాదంగా అద్వైతంలా చెప్పారండీ .. రోజువారీ జీవితపు బరువుతో భారమైన మనసు .. దూది పింజ లా తేలికైనట్టు ఉంది .

 • రెండు అనంతాల మధ్య
  అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి!

  చూరు నించి చిన్నగా బయటకొచ్చిన చీమలానో
  ముడుచుకున్న సవ్వడిలేని పువ్వుల్లానో!

  ** మీరు రెండొసారి మార్చి రాసిన పదాల వరుస మరింత అర్థవంత దృశ్యమయ్యింది నిషిగంధ గారు..

  మీ పదాలంతా రజనీగంధాలే

 • ధన్యవాదాలు సాయి పద్మ గారు, జయశ్రీ నాయుడు గారు.
  నాక్కూడా నచ్చిన కొన్ని లైన్స్ అవి. :)

 • V Ch Veerabhadrudu says:

  చాలా చక్కగా ఉందీ కవిత. ఈ కవయిత్రి కవిత నేనిదే మొదటిసారి చదవడం.

 • BVV Prasad says:

  ‘నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
  నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!’ అపురూపమైన భావన!
  ‘సెలయేటి పొగమంచు’ లాంటి కవిత నిషిగంధ గారూ..

 • ‘ఆకాశమంత ‘ ప్రసాద్ గారికి ధన్యవాదాలు :)

 • “చిన్నపాటి జీవం కోసం
  చిటారుకొమ్మన గాలిపటమై
  తపస్సొకటి ఆరంభించాలనిపిస్తుంది!”

  Adbhutam gaa vundi. Congrats, Keep it up
  Regards

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)