చరిత్రే అన్నిటినీ మించిన ఉత్కంఠభరితమైన కథ!

“నాకు కథ అంటే చాలా ఇష్ట”మని అన్నాననుకోండి, “కథ అంటే ఎవరికి ఇష్టం కా”దని మీరు వెంటనే అనచ్చు. నిజమే, కథ అంటే ఇష్టపడని వారు ఉండరు. కనుక, చిన్నపాటి ఆత్మకథకు ఉపక్రమణికగానే ఈ వాక్యాన్ని తీసుకోవాలి. అలాగని దీనిని ఆత్మకథగానూ  తీసుకోవద్దని మనవి.

కథ అంటే నాకు ఎంత ఇష్టమంటే, నన్నయభట్టు తనతో రాజరాజనరేంద్రుడు అన్నట్టుగా చెప్పిన ఈ పద్యం నాకు తరచు గుర్తొస్తుంటుంది.:
ఇవి యేనున్ సతతంబు కరం బిష్టంబులై యుండు బా
యవు భూదేవుకులాభితర్పణ మహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజామహో
త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్

అయిదు విషయాలు నాకు చాలా ఇష్టమైనవంటూ, రాజరాజనరేంద్రుడు అవేమిటో చెప్పాడు. వివాదాస్పదమైన మొదటి దానినీ, మరో మూడింటినీ అలా ఉంచితే ఆయన తనకు ఇష్టమైన వాటిలో భారతశ్రవణాసక్తి ఒకటన్నాడు. నాకెందుకో ఆ మాటను నన్నయ యథాలాపంగా ఉపయోగించి ఉండడనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ లో infatuation, passion, obsession;  తెలుగులో తమకం , మోహం(నిజానికి తెలుగు మాటలేవీ నాకు సంతృప్తి కలిగించలేదు)వగైరా మాటలతో  చెప్పుకునే వల్లమాలిన ఆసక్తి భారతకథపై రాజరాజనరేంద్రుడికి నిజంగానే ఉండేదేమో ననిపిస్తుంది. కథ అనగానే మనిషిలో సహజంగా ఉండే చెవికోసుకునే గుణాన్నే ఆ మాట సూచిస్తోందేమో.

కథ నాకు ఇష్టమన్నానా… అందులోనూ అపరాధపరిశోధక కథలన్నా, కొసమెరుపు కథలన్నా, మానవస్వభావంలోని వైచిత్రిని ఆశ్చర్యస్ఫోరకంగా చిత్రించే కథలన్నా మరీ ఇష్టం. కథ అంటే అంత ఇష్టపడే నేను ఎన్ని కథలు రాశానని మీకు  సందేహం కలగచ్చు. పట్టుమని పది కూడా ఉన్నట్టు లేవు. నేను లెక్క పెట్టలేదు. అసందర్భం అనుకోకపోతే చిన్న ముచ్చట. గోదావరిగట్టునే ఉన్న మా ఊళ్ళో ఓ రోజున, రోజంతా నాకు ఎంతో ఇష్టమైన మపాసా కథలు చదువుతూ క్రమంగా ఒకవిధమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఒక ఆహ్లాదకరమైన అస్థిమితం నన్ను ఆవరించింది. సాయంత్రమయ్యేసరికి అది తార స్థాయికి వెళ్లింది. క్షణం కూడా ఇంట్లో ఉండలేననిపించింది. పుస్తకం పక్కన పెట్టి సైకిలు మీద గోదావరి గట్టు మీదికి బయలుదేరాను. ఒక గమ్యం అంటూ లేకుండా యాంత్రికంగా సైకిలు తొక్కుతూ కొంత దూరం వెళ్లిపోయాను. అప్పుడు నాకో కథ స్ఫురించింది. కొన్ని రోజులు మనసులో నానిన తర్వాత దానిని కాగితం మీద పెట్టాను. అప్పుడే ఆంధ్ర సచిత్రవార పత్రిక దీపావళి కథల పోటీ ప్రకటించింది. నా కథను పోస్ట్ చేయడానికి వెడుతుంటే ఒక మిత్రుడు నాతో వచ్చాడు. కవరు మీద స్టాంపులు అంటిస్తూ, “ఈ కథకు బహుమతి వస్తుంది” అన్నాను. వచ్చింది. ఆ కథ పేరు ‘దూరం’. ఇది జరిగింది ఎనభైదశకం ప్రారంభంలో.  చిన్న వివరణ: ఆ కథ మపాసా కథలు వేటికీ కాపీ కాదు.
ఆ తర్వాత మరో అనుభవం ఎదురై ఉండకపోతే బహుశా నేను కథారచనకు ‘దూరం’ అయేవాణ్ణి కాదేమో ననిపించినా, ఆ మాట కచ్చితంగా చెప్పలేను. ఇప్పుడాలోచిస్తే అందువల్ల నాలో ఎలాంటి విచారమూ లేదు. ఎందుకంటే, కల్పన కన్నా అద్భుతమైన కథాప్రపంచంలోకి ఆ అనుభవం నన్ను తీసుకెళ్లింది. ఓరోజు హైదరాబాద్, చిక్కడపల్లి కేంద్రగ్రంథాలయంలో పుస్తకాలు గాలిస్తుంటే డీ.డీ. కోశాంబి రాసిన Myth and Reality కనిపించింది. అందులో కొన్ని పురాణాసంబంధమైన రేఖాచిత్రాలు, చరిత్ర సంబంధమైన ఫోటోలు ఉన్నాయి. చదువుతూ ఉండిపోయాను. ‘చకచ్చకిత’ స్థితి అంటారే, అలాంటి స్థితిలోకి జారిపోయాను. ఆశ్చర్యం, ఉద్విగ్నత లాంటి అనేకానేక అనుభూతులు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. పురాణకథకూ, వాస్తవికతకూ; మరీ ముఖ్యంగా పురాణకథకూ, చరిత్రకూ మధ్య అడ్డుగీతలు చెరిగిపోతూ కళ్ళముందు ఒక అద్భుత స్వాప్నిక ప్రపంచం ఆవిష్కృతం కావడం ప్రారంభించింది. అంతవరకు కల్పనగా కనిపించిన పురాణపాత్రలు రక్తమాంసాలు నిండిన మన లాంటి వాస్తవిక వ్యక్తుల్లా కనిపించ సాగాయి. అనేక నమ్మకాలు, స్థిరాభిప్రాయాలు కూకటివేళ్ళతో కూలి పోవడం ప్రారంభించాయి.

కొన్ని రోజులపాటు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. నడుస్తున్నా గాలిలో తేలిపోతున్న అనుభవం. నిజానికి ఇప్పటికి కూడా నేను మామూలు మనిషినయ్యానని చెప్పలేను. కోశాంబిని మొదట చదివినప్పుడు కలిగిన మానసికస్థితిలోనే ఇప్పటికీ ఉన్నాను. ఇది జరిగింది కూడా ఎనభై దశకం ప్రారంభంలో.
బహుశా ఒక ప్రత్యేక కారణం వల్ల కోశాంబి నాలో ఇంత సంచలనం కలిగించాడని నేను అనుకుంటాను(నా ఊహ తప్పైనా కావచ్చు. కోశాంబిని చదివిన అందరిలోనూ ఇదే సంచలనం కలిగి ఉండచ్చు). ఆ కారణం ఏమిటంటే, పురాణం మా ఇంటి విద్య. నేను పురాణ, రామాయణ, మహాభారతకథల మధ్య పెరిగాను. మా నాన్నగారు అష్టాదశపురాణాలను తెలుగులోకి అనువాదం చేసిన కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. సంస్కృత, ఆంధ్రాలలో కవిత్వం చెప్పినవారు. దేవీ నవరాత్రులలో రామాయణ ప్రవచనం చేసేవారు. ముఖ్యంగా పురాణాలపై పరిశోధన చేసినవారు.  నేను ఒకవిధంగా మా నాన్నగారికి ఆధునికరూపాన్ని. మా పినతండ్రి వీరభద్రశాస్త్రిగారు పౌరాణికులుగా ప్రసిద్ధులు. భాగవతంలో నిష్ణాతులు.
కోశాంబిని  నా పురాణ, ఇతిహాసపరిజ్ఞానానికి అన్వయించుకోవడం, నాకుగా నేను సరికొత్త అన్వయాలను వెలికి తీయడం ఎనభై దశకంలోనే ప్రారంభించాను. నాకూ, మా నాన్నగారికీ మధ్య సంభాషణ జరుగుతూ ఉండేది. ఆయన సాంప్రదాయిక పరిజ్ఞానంతో నా ఆధునిక అవగాహనను బేరీజు వేసుకోడానికి ప్రయత్నించేవాడిని.

[box  title=”‘పురా’గమనం – కల్లూరి భాస్కరం కొత్త కాలమ్” color=”#333333″] Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5) మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉందంటుంటాం;  కానీ అదేమిటో, ఇప్పుడే స్వయంభువులుగా పుట్టినట్టు వర్తమానంలో గిరి గీసుకుని బతికేస్తూ ఉంటామంటారు భాస్కరం కల్లూరి. ఆయన అభిప్రాయంలో మన కథలు, కావ్యాలు, అవి చిత్రించే వస్తువు లేదా సమస్యలు చాలావరకు వర్తమానం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. మన రాజకీయాలూ అంతే. అయిదొందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్న అమెరికన్లు తమ చరిత్రను అత్యద్భుతంగా చూపించుకుంటుంటే, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నా చరిత్రశూన్యుల్లా కాలం దొర్లించే ప్రత్యేకత మనదేనేమో నంటారాయన.

“ఒక్కసారి గతమనే గవాక్షం తెరవండి, మీ ముందు మీకు తెలియని అద్భుతప్రపంచం పరచుకుంటుంది. కాలం వెంబడి నడచివచ్చిన మన అడుగుజాడలు అందులో కనిపిస్తాయి. మన నమ్మకాలను, నిశ్చితాభిప్రాయాలను తలకిందులు చేసి షాకిచ్చే గుప్తసత్యాలు ఎన్నో బహిర్గతమవుతాయి. పురాణకథలు కొత్త రూపం తీసుకుంటాయి. గణం నుంచి జనంగా మారిన మన వైనాన్ని పూసగుచ్చినట్టు చెబుతా” యని ఆయన అంటారు.

చరిత్ర సంపద ఉన్నా లేమిని అనుభవించే మన విలక్షణతను గుర్తు చేస్తూ, చరిత్ర అట్టడుగున పడి కాన్పించని కథలను, విశేషాలను తడుముతూ వ్యక్తిగతస్పర్శతో భాస్కరం కల్లూరి ప్రారంభిస్తున్న కాలమ్ ఇది!  [/box] ఓ రోజు నేనో సందేహాన్ని వ్యక్తం చేశాను.
“తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం అంటారు కదా, చిన్న కొడుక్కి రాజ్యం అప్పగించిన ఉదాహరణలూ కనిపిస్తున్నాయి కదా?”
నాన్నగారు సాలోచనగా నా వైపు చూశారు.
“మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి రాజ్యం ఇచ్చాడు. ప్రతీపుడు పెద్దకొడుకు దేవాపిని కాకుండా చిన్నకొడుకు శంతనుని రాజును చేశాడు. కారణం ఏదైనా శంతనుని పెద్ద కొడుకు భీష్మునికి బదులు చిన్నకొడుకు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కురుపాండవులలో పెద్ద అయిన ధర్మరాజుకు, చిన్న అయిన దుర్యోధనుడికి మధ్య రాజ్యాధికారవివాదం ఏకంగా కురుక్షేత్రయుద్ధానికే దారితీసింది. పెద్దకొడుకైన రామునికి బదులు తన కొడుకు భరతుని రాజును చేయమని కైక దశరథుని అడగడం, రాముడి కథను మహాకావ్యంగా మలుపుతిప్పింది.” అన్నాను.
“ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం. చిన్న కొడుకు రాజైతే దానిని మినహాయింపుగానే చూడాలి తప్ప సార్వత్రిక నియమంగా చూడకూడదు” అని నాన్నగారు అన్నారు.
“చిన్నకొడుకు రాజైన ఘటనలు ఉన్నప్పుడూ, కొడుకుల మధ్య అధికారవివాదం ఘర్షణ సృష్టించినప్పుడూ వాటిని మినహాయింపులుగా ఎందుకు చూడాలి? సార్వత్రిక నియమంగా ఎందుకు చూడకూడదు?” అన్నాను.
నాన్నగారికి ఆ ప్రశ్న అర్థవంతంగానే కనిపించినట్టుంది. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి, తర్వాత అన్నారు:
“వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘మహాభారతతత్త్వకథనం’ ఒకసారి చూడు. అందులో నీ సందేహానికి సమాధానం దొరకచ్చు”.
అందులో కచ్చితంగా సమాధానం దొరకదని నాకు అనిపించింది. సంప్రదాయపండితులకు అలాంటి సందేహం కలిగే అవకాశం లేదని నా నమ్మకం.  నాన్నగారితో ఆ మాట అనకుండా అప్పటికి మౌనం వహించాను.

rajasthani_phad_painting_pb40

కొన్ని రోజుల తర్వాత చిక్కడపల్లి గ్రంథాలయంలోనే రొమీలా థాపర్ రచించిన పుస్తకం ఒకటి కనిపించింది. అందులో మహాభారత వంశానుక్రమణిక(Genealogy of Mahabharata) గురించి ఆమె చర్చించింది. ఒక చోట నా కళ్ళు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. మాతృస్వామ్యంలో చిన్న కొడుకుదే పెత్తనం అని ఆమె రాసింది.
మరోసారి అసందర్భం అనుకోకపోతే, మా నాన్నగారి గురించి మరికొంత చెప్పాలి. ఆయనలో ఒక కవీ, పౌరాణికుడు, పండితుడే కాక; కవి పండిత పౌరాణికులలో చాలా అరుదుగా కనిపించే పరిశోధకుడు, జిజ్ఞాసి ఉన్నారు. అంతకన్నా ఆశ్చర్యంగా సాంప్రదాయిక పాఠానికి సరికొత్త అన్వయాలను గుడ్డిగా నిషేధించని ఆలోచనావైశాల్యం ఆయనలో ఉండేది. కొత్త విషయం, కొత్త అన్వయం తన దృష్టికి వచ్చినప్పుడు ఆశ్చర్యాద్భుతాలను ప్రకటించే ఒక పసితనం ఉండేది. నా దగ్గర ఉన్న తెలుగు పుస్తకాలను చదివి “ఇది పూర్తిగా చదివాను. అద్భుతం, ఆశ్చర్యకరం” అని లోపలి పుట మీద రాసి సంతకం పెట్టేవారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక అట్లాస్ ఉండేది. పురాణాలలో చెప్పిన ద్వీపాలను అందులో గుర్తించడానికి  ప్రయత్నించేవారు. సరిగ్గా మన నేలకిందే అమెరికా ఉందనే వారు.

సగరచక్రవర్తి కొడుకులు అరవై వేలమంది తండ్రి యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ భూమిని తవ్వి కపిలారణ్యానికి వెళ్ళిన కథ పురాణాలలో ఉంది. ఆ కపిలారణ్యమే కాలిఫోర్నియా అని నాన్నగారు అనేవారు. పితృదేవతలు చంద్రమండలంలో ఉంటారని చెప్పేవారు. తద్దినం రోజున పిండ ప్రదానరూపంలో పితృదేవతలకు పెట్టే ఆహారాన్ని సారంగా మార్చి కొన్ని కిరణాలు వారికి అందిస్తాయనేవారు. ఇవన్నీ నిరూపణకు అందేవి కాకపోవచ్చు. కానీ తన విశ్వాసాల పరిధిలో వాటికి అర్థం చెప్పడానికి ప్రయత్నించేవారు. ఆయన సంస్కృత కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన కొవ్వూరు(పశ్చిమ గోదావరి జిల్లా)లో గంధం రామారావు అనే అడ్వకేట్ ఉండేవారు. నాన్నగారి ప్రవచనాలకు, ప్రసంగాలకు ఆయన తప్పనిసరిగా హాజరయ్యేవారు. చివరిలో ఆయనను కలసి, “ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం చెప్పకుండా ఉండరు కదా!” అని అభినందించి వెళ్ళేవారు.
నా ‘జన్యులక్షణా’న్ని ఈపాటికి మీరు పోల్చుకుని ఉంటారు.
మళ్ళీ కథ దగ్గరికి వద్దాం. అపరాధపరిశోధక కథ నాకు ఇష్టమని చెప్పాను. కాలగమనంలో మన పురాణకథలు, ఇతిహాసాలు, పురాచరిత్ర, చరిత్రా అపరాధపరిశోధక కథలుగా మారిపోయాయి. కాలమనే హంతకుడు అసలు అర్థాన్ని, లేదా వాస్తవికతకు దగ్గరగా ఉండే అర్థాన్ని హత్య చేశాడు. అయితే కొన్ని క్లూలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ క్లూలలోనే ఉంది అసలు కథ అంతా. వాటి వెంబడే వెడితే అద్భుతావహమైన నూతన కథా ప్రపంచంలోకి అడుగుపెడతాం. నేటి కథలను తిరగరాసే కొత్త కథలు అనేకం అక్కడ దొరుకుతాయి. నా ఉద్దేశంలో చరిత్ర, కథను మించిన ఉత్కంఠభరితమైన కథ!
అయితే, ఒక గమనిక: చరిత్ర అనే కథలో అద్భుతత్వాన్ని దర్శించాలంటే, భారతశ్రవణంపై రాజరాజనరేంద్రుడికి ఉన్నంత infatuation చరిత్రపై ఉండాలి. అలాగే ఒక హెచ్చరిక: ఈ infatuation కు తగిన మూల్యం చెల్లించుకోవాలి. అంటే, మీరు మ్యూజియంలోని పురావస్తువుగా మారిపోవాలి!

-భాస్కరం కల్లూరి

Download PDF

6 Comments

 • సర్,
  మిమ్మల్ని ఇలా కలుసుకోవడం బాగుంది.

  • కల్లూరి భాస్కరం says:

   అవును రాజిరెడ్డి గారూ, నాకు కూడా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు?

  • Mangu Siva Ram Prasad says:

   భాస్కరంగారు నమస్కారం. చక్కని విషయాలు ఆత్యద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు. మీ ఈమెయిల్, ఫోన్ నంబర్ తెలిస్తే మీతో మాట్లాడాలని ఉంది. “తెలుగులో చారిత్రిక నవల అవిర్భావ వికాసాలు” అనే సహిత్యోపన్యాసానికి నేను రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో మీరు చెప్పిన ఆసక్తికరమైన అంశాలు ఉపోద్ఘాతానికి ఇంధనముగా అమరినవి.
   శుభాభివన్దనములతో,
   మంగు శివరామ ప్రసాద్, విశాఖపట్నం.
   సెల్: (0) 9866664964, .

   • కల్లూరి భాస్కరం says:

    కృతజ్ఞతలు శివరామప్రసాద్ గారు, నా ఫోన్ నంబర్, ఈ-మెయిల్ మీకు sms చేస్తాను.

 • K.Geeta says:

  చరిత్రే అన్నిటినీ మించిన ఉత్కంఠభరితమైన కథ!- ఈ మాటలు నేను డిగ్రీ చదువుతున్నపుడు హిస్టరీ టెక్స్ట్ పుస్తకాన్ని గుండెలకానించుకుని నిద్రించిన రోజుల్ని గుర్తు చేసాయి. పాత విషయాలు కొత్తగా తెలుస్తున్నకొలదీ కలిగిన ఆశ్చర్యం నించి చరిత్ర లో జీవించే సహ సంతోషాన్ని మళ్లీ కలిగించారు. డీ.డీ. కోశాంబి రాసిన Myth and రియాలిటీ ని మీరు తెలుగు లో రాస్తే చదవాలని ఉంది-
  -కె.గీత

  • కల్లూరి భాస్కరం says:

   Myth and Reality ని తెలుగు చేయాలన్న మీ సూచనకు ధన్యవాదాలు గీతగారూ, అది ఇప్పట్లో సాధ్యమవుతుందని చెప్పలేను కానీ, అందులోని అంశాలు నా వ్యాసాలలో ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. అలాంటిచోట్ల కోశాంబిని కోట్ చేస్తూనే ఉంటాను.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)