ముసలామె – ముసలోడు

అనగనగా ఒకూర్లో ఒక ముసలి భార్యా భర్త ఉండేవారు.

వారి మంచీ చెడ్డా చూడటానికి వాళ్ళకి ఒక బిడ్డైనా పుట్టలేదు. అందుకని, ఎంత వయసు వచ్చినా వాళ్ళ పనివాళ్ళే చేసుకోవలసి వచ్చేది. ముసలాయన పొద్దున్నే ఇంత సద్దెన్నం తినేసి పొలానికి పోయి పని చేసేవాడు. ముసలామె, ముసలాయన వచ్చేసరికి వండి వార్చేది. ఇట్లా వాళ్ళ కాలం వెళ్తూ వుండేది.

ఒకరోజు పొద్దున్నే ముసలాయన యధావిధిగా పొలానికి వెళ్ళాడు. చుట్టుపక్కల పొలాల వాళ్ళు అప్పటికే తమచేలని దున్ని చల్లకాలకి సిద్ధం చేసేసుకున్నారు. పాపం ముసలాయన కదా ! పని అందర్లాగా వేగంగా

చేయలేడు కదా ! అందుకని నెమ్మదిగా దున్నడం మొదలు పెట్టాడు. ఆవేళ సూర్యుడు ఎందుకనో కోపం తెచ్చుకొని చిటపటలాడుతూ మరీ మండిపోతున్నాడు. ముసలాయన దున్ని దున్ని, కాస్త అలసట తీర్చుకుందామనిచెప్పి తలమీద తుండుగుడ్డ తీసి చెమట తుడుచుకుంటూ,చెట్టు నీడకి వచ్చాడు. అతనట్లా వచ్చాడో లేదో ఒక కుందేలు చెట్టు పక్కనున్న పొదల్లో నుండి బయటకి వచ్చింది. ముసలాయన పక్కనే ఉన్న రాయినందుకుని గురి చూసి కుందేలును ఒక్క దెబ్బ కొట్టాడు. పాపం అది కూడా ముసలి కుందేలేమో ఆ ఒక్క దెబ్బకే చచ్చి ఊరుకుంది. ముసలాయనకు ఆ చచ్చిన కుందేలుని చూసేసరికి గొప్ప ఆనందం వేసింది. ఆహా ఈవాళ కుందేలు కూర తినొచ్చు అని చెప్పి తొర్ర పళ్ళతోనే ఈలేస్తూ ఇంటికొచ్చి కుందేలుని భార్యకిచ్చి కూర వండమని చెప్పాడు.

చెప్పడం వట్టిగా చెప్పాడా ఏమిటి….. మసాలా ఎంత వెయ్యాలో, బండ మీద ఎల్లా నూరాలో, నూనెలో ఎలా వేయించాలో, ఎంత సేపు ఉడకబెట్టాలో వివరంగా లొట్టలేసుకుంటూ చెప్పాడు. అదంతా విని ముసలామె నవ్వుతూ “చాల్లేవయ్యా భలే చెప్ప వచ్చావు, కూడూ కూరా వండటం ఈరోజే నేర్చుకుంటూ వున్నట్లుందే నేను ” అన్నది. ఆ మాట విని తలూపి ముసలాయన మళ్ళీ పొలానికి వెళ్ళిపోయాడు.

ముసలామె కుందేలు కూర వండటం మొదలు పెట్టింది. ముసలాయన చెప్పినట్టే మసాల గిసాలా నూరి కూరలో వేసింది. కూర బాగా ఉడికిన పిదప ఒక ముక్క తీసుకుని, ఊదుకుని నోట్లో వేసుకుంది. అబ్బో……! ఎంత రుచిగా ఉందనుకున్నారూ !!! అందుకని ఊ…. సరే అన్చెప్పి ఇంకో ముక్క నోట్లో వేసుకుంది. ” అబ్బ! వెన్న పూసలా మెత్తగా ఉంది. పంటితో కొరకాల్సిన పనేలేదు” అంటూ చప్పరించి పడేసింది. ఆ తరువాత ఉప్పు సరిగానే ఉందంటావా?……అని ఆమెనామె అడుక్కుని మరో ముక్క నోట్లో వేసుకుంది. అట్లా ఉప్పు అని చెప్పి, కారమని చెప్పి, మసాలా అని చెప్పి ఉడికిందా లేదా అని బోల్డు ముక్కలు తిన్నది. చివర్న ఇంకేదో అని చెప్పి ఇంకో ముక్క కోసం గరిట పెట్టి కూరలో దేవితేనూ…… ఒక్క ముక్కన్నా రాలేదు. ముసలామె ఎలవర పోయింది. అప్పుడు గుర్తొచ్చాడు

ముసలాయన , “వార్నాయనో ఇంకేమయినా ఉందా? ముసలాడు చంపేయగలడు. బతికే ఉపాయమెట్టా ? ” అని ఆలోచించి తన పిర్రని కోసి కూర వండేసింది. ముసలాయన తనని గనుక అట్లా చూస్తే జరిగిన విషయం కనుక్కోగలడని చెప్పి అన్నీ వైనంగా అమర్చి, వెళ్లి కోసిన పిర్రని ముసలాయన కనుక్కోలేనట్లు రోట్లో కూర్చుంది.

ముసలాయన ఇంటికొచ్చాడు. “అన్నం పెడుదు దాయే” అని ముసలామెని పిల్చాడు. అందుకు ముసలామె “నువ్వే పెట్టుకు తిను కొంచం నీరసంగా ఉంది” అంటే సరేలెమ్మని చెప్పి అన్నం , కూరా వడ్డించుకుని తింటూ ఉన్నాడు. అతను తింటూ ఉంటేనూ వాళ్ళ పెంపుడు పిల్లి వైనంగా పక్కన కూర్చుని ముసలాయన్ని చూసి నోరంతా తెరిచి ఒకసారి గట్టిగా ఆవిలించుకుని తీరిగ్గా “బుడియా ఖాయ్ లంబక్ మాస్ బుడా ఖాయ్ చెటువక్ మాస్ ఛీ ……. తూ ఛీ ……. తూ ” (ముసల్ది తిన్నది కుందేలు మాంసం ముసలోడు తింటున్నాడు పిర్ర మాంసం ఛీ ……. తూ ఛీ ……. తూ) అని పాడటం మొదలుపెట్టింది. ముసలాయన మొదట పట్టించుకోలేదు , పిల్లి ఆపకుండా ముద్ద ముద్ద కీ ఛీ ……. తూ ఛీ ……. తూలు చెప్తుంటే అనుమానమేసి రోటిలోంచి ముసల్దాన్ని లేపి చూసి నిజం తెలుసుకుని పక్కనున్న కర్ర తీసుకుని ఒక్కటేసాడు…..

అప్పుడేమయిందీ ….. పాపం ముసల్ది కదా, ఆ కుందేలు లాగే ఒక్క వేటుకే చచ్చిపోయింది. ముసలాడికి భయం వేసింది. అసలికైతే అయ్యో నా పెళ్ళాన్ని వృధాగా వెధవ కుందేలు మాంసం కోసం చంపుకున్నానే అన్చెప్పి బాధ వెయ్యాలి కదా ? కానీ ముసలాయనికి భయం వేసింది… ఏమనీ ? చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఏం చెప్పేది? రాజుగారికి చెప్పేస్తే యెట్లా అని! ఆ ఆలోచన వచ్చిన పిదప ముసలాయన ఏం చేశాడూ, వంటింట్లో పొయ్యి పైనున్న అటక మీద ముసలి దాని శవాన్ని దాచేశాడు. బాగా వానలొచ్చి నదినిండా నీళ్ళు వస్తే శవాన్ని నదిలో విసిరి పడేద్దాం అనుకున్నాడు. వాళ్ళు వీళ్ళు అడిగితేనూ “ఊరికెళ్ళింది. నేనంటే భయమా భక్తా ఎన్ని రోజులైనా రావటమే లేదు….” అన్చెప్పి ఏవో చెప్తూ వచ్చాడు.

అప్పుడిక కొన్ని రోజులకి శ్రావణ భాద్ర పదాలు వచ్చేసాయి. నదులు పొంగి పొరులుతున్నాయి. అటువంటి దినాలలో ఒకరోజు బోరుమని వాన పట్టుకుని విడవకుండా కురుస్తోంది. ఇళ్ళలో నుండి ఎవరూ అడుగు కూడా బయట పెట్టడం లేదు. అప్పుడు ఇదే సమయం అనుకుని ముసలాయన పెళ్ళాం శవాన్ని భుజాన వేసుకుని నదికి బయల్దేరాడు. ముసల్దాని శవం ఇన్ని రోజులు పొయ్యి సెగ తగిలి తగిలి బిగుసుకు పోయి వుంది. ఆ బిగుసుకున్న చేతులు రెండూ ముసలాయన మెడ చుట్టూ కావిలించుకున్నట్లు వున్నాయి.

సరే ముసలాయన నది ఒడ్డుకి వెళ్లి నిలుచున్నాడు, మళ్ళీ ఎందుకైనా మంచిది శవాన్ని కొంచం లోతులో వేద్దాం అని చెప్పి మెడ లోతు నీళ్ళలోకి వెళ్లి విసిరేయబోయాడు ముసల్దాని చేతులు అతని మెడ చుట్టూ బిగుసుకుని వున్నాయి కదా, అవి ఊడి రాక అదాటుగా వున్న ముసలాయన కూడా దమేల్లుమని నీళ్ళలో పడిపోయాడు. అసలే శ్రావణపు నది కదా పోటెత్తి ప్రవహిస్తోంది, ఆగే ఓపిక దానికి ఉంటుందా, అందుకని చెప్పి ఒక్క క్షణం కూడా ఆగకుండా ముసల్దానితో పాటు ముసలాయన్ను కూడా తీసుకెళ్ళిపోయింది. ఊళ్ళో వాళ్ళేమో ముసలాయన కనిపించకపోయేసరికి ముసలామెను తీసుకురావడానికి ఊరికెళ్ళాడు కామోసు అని అనేసుకున్నారు.

Download PDF

4 Comments

  • pudota.showreelu says:

    సామాన్యగారు జానపదకత ముసలామె ముసలోడు చాల బాగుంది .నా 6వ తరగతి పిల్లలకు ఈకథ చెప్పాను.పిల్లలు కథ విని చాల సంతోషపడ్డారు .కథలోని మూడు పాత్రలను గురించి చప్పమని అడిగితే పిల్లి చాల చెడ్డ ది.కూర వండేసమయంలో ఎవరయినా రెండుముక్కలు రుచి చూస్తారు కాకపోతే ముసల్డే నాలుగుముక్కలు ఎక్కువ తిన్నది ఐనతన పిర్ర కోసి వండిన్దే గథా.ముసలోడు చాల చెడ్డ వాడు .అన్నారు .మీరు రాస్తున్న కథలన్నీ చదేవాను .చాలా బాగున్నాయి. శ్రీ మతి .పూదోట .శౌరీలు.టీచర్

  • ఒకరి వెనుక ఒకరు .

    చంపేది, చంపబడేది … అంతా కర్త , కర్మ, క్రియ :)

    సామాన్య గారు .. ఇప్పుడే ఈ సీరిస్ లో కథలన్నీ చదివాను . ఆసక్తిగా,చాలా బావున్నాయి .

  • deva says:

    కధ చాల బాగుంది ,భాబి

  • dr ch gnanneshwar prasad says:

    చాలా నవ్వించారు భాభి
    ముఖ్యంగా ముసల్ది పిర్ర కోసి వండే సంగతి కళ్ళల్లోంచి నీళ్ళు ఒచ్చెలాగ నవ్వించింది

Leave a Reply to pudota.showreelu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)