సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…

 

varma.

ఇప్పుడెందుకో ఒక్కో సమాధిని శుభ్రం చేయాలనుంది

రాలిన పండుటాకుల్ని వాడిన పూల రేకుల్ని పేరుకు పోయిన ధూళిని

మట్టిని నేలనుండి పాకిన చెద పుట్టలను చుట్టూ పట్టిన నాచును

చిగురు వాడిన మొక్కలను గడ్డి దిబ్బలను

దీపపు సెమ్మెకింద అంటిన నూనె జిడ్డును

సున్నితంగా తొలగిస్తూ సమాధిని శుభ్రం చేయాలనుంది

 

నిద్రిస్తున్న యోధుడి గాయంలోంచి చిగురిస్తున్న మోదుగు పూల

మృధు స్పర్శ లోలోకి పాకుతూ గుండెలయను పెంచుతూ

నరాలలో రక్తకణ కాసారాన్ని ఉడుకెత్తిస్తూంది

 

గాయకుడెవరో ఇక్కడ గొంతు తెగిపడినట్టుంది

ఒక పాట చెవిలో వినిపిస్తూ నాభినుండి

దిక్కులు పిక్కటిల్లే నినాదమవుతూంది

 

అక్షరాలను అస్త్రాలుగా పదునెక్కించిన వారెవరో

పుటల మద్య నిప్పులు చెరుగుతూ దాగినట్టుంది

నెత్తురంటిన అక్షరాల పూత వేలి చివర మెరుస్తూంది

 

ఆరుగాలం ఆకాశం వైపు చూస్తూ మట్టితో యుద్ధం చేస్తూ

ప్రేమిస్తూ తన నెత్తురినే ఎరువుగా మొలకెత్తిన

మట్టి మనిషెవరో విశ్రాంతి తీసుకున్నట్టుంది

చేతులకింత మట్టి తడి అంటుతూంది

 

ఎదనిండా తడి ఆరని జ్నాపకాలేవో రంగుల చిత్రంగా

నేసిన ప్రేమికుడెవరో భగ్న హృదయంతో అరమోడ్పు

కనులతో అవిరామంగా ధ్యానిస్తున్నట్టుంది

చేతులకిన్ని అద్దం పెంకులు గుచ్చుకున్నట్టుంది

 

లోలోన అలికిడి చేయకుండా పై మూత తెరవకుండా

మదినిండా గంధపు పరిమళమెదో

శ్వాస నిశ్వాసల మధ్య కమ్ముకుంటూ

సమాధి చుట్టూ చిగురించిన లేలేత పచ్చదనంతో

పూరేకుల తడితనమేదో స్పర్శిస్తూ

లోలోపల దాగిన కాంతిపుంజమేదో చేతి వేళ్ళగుండా

దేహమంతా ప్రవహిస్తూ నాలో దాగిన నైరాశ్యాన్ని

నిరామయాన్ని నిర్వేదాన్ని పారదోలుతూంది

 

సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…

 

 

 

Download PDF

32 Comments

  • రమాసుందరి says:

    నేను ఇప్పటి వరకు చదివిన మీ కవితలన్నింటి కంటే ఇది భావంలో గాఢత లోను, వాక్యంలో పరిణితి లోను మిన్నగా ఉంది.

  • వర్మ గారూ  ఎంతో హాయిగా ఉంది మీ కవిత. మదినిండా గంధపు పరిమళ మేదో శ్వాస నిశ్వాసల మధ్య కమ్ముకుంటూ, కాంతి పంజమేదో చేతి వేళ్ళ గుండా ప్రవహిస్తూ, పూరేకుల తడితనమేదో గుండెను స్పర్శిస్తూ…మీ కవిత పరిమళ స్నానమై ఎదను పరిశుభ్ర పరుస్తున్నది.చక్కని కవితనందించిన మీకు నా అభినందనలు.నాగరాజు రామస్వామి. 

  • నారాయణస్వామి says:

    మంచి పద్యం! అభినందనలు వర్మా!

  • Dr.Ismail says:

    నెత్తుటి తడి అంటింది. నేనూ ఓ సమాధి శుభ్రం చేయాలిప్పుడు…

  • టిపికల్ వర్మ కవిత. సందేహంలేదు. మీరు రాసే ప్రతీ కవితలొ ప్రతీ వాక్యాన్నీ,ప్రతీ పదాన్నీ చాలా జాగ్రత్తగా చెక్కుకుంటూ వస్తారు. అదె పాఠకులని మీ కవిత్వాన్ని చదివించేది. ఐతే మొదటి స్టాంజాలొ
    “రాలిన పండుటాకుల్ని వాడిన పూల రేకుల్ని పేరుకు పోయిన ధూళిని/మట్టిని నేలనుండి పాకిన చెద పుట్టలను చుట్టూ పట్టిన నాచును/చిగురు వాడిన మొక్కలను గడ్డి దిబ్బలను/దీపపు సెమ్మెకింద అంటిన నూనె జిడ్డును”
    లో మీ మార్క్ కనపడలేదు. ఆ లిస్ట్ లొ ప్రత్యేకతలేకపోవటం కొంచెం నిరాశ కలిగించినా మిగతా కవిత అ లోటుని భర్తీ చేసింది. ముఖ్యంగా చివరి ఖండిక హత్తుకునేలా రాసారు. అభినందనలు

  • శుభ్రం చెయ్యాల్సిన సమాధులు అందరికీ గుర్తొచ్చేలా చేశారు.

  • Padma Sreeram says:

    “ఆరుగాలం ఆకాశం వైపు చూస్తూ మట్టితో యుద్ధం చేస్తూ
    ప్రేమిస్తూ తన నెత్తురినే ఎరువుగా మొలకెత్తిన
    మట్టి మనిషెవరో విశ్రాంతి తీసుకున్నట్టుంది
    చేతులకింత మట్టి తడి అంటుతూంది”

    అక్షరాలకు అద్భుతాలను అద్దే సజీవసరళి మీ భావాలది కుమార్ వర్మాజీ! ప్రతీ కవితా జీవమొచ్చి ..జవాబు దొరకని తోట ముంగిట నిలిచిన ఏకైక ప్రశ్నగా ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటుంది.అందుకేనేమో….

    చదువుతుంటే గుండెకేదో
    ఆరని తడి అంటుతోంది…
    ఎద చెలమలు జీవనదులౌతూ…
    చిరునవ్వులు జీవంలేనివౌతూ..
    ఎక్కడినుంచో వినవస్తున్న నిశీధిరాగాలు
    మనసుకర్ణకఠోరాలను బ్రద్దలుకొడుతూ..

    అందుకే సమాధులను శుభ్రం చేయొద్దనేది…
    మనలో మనం దాగిపోతూ..
    పైకి పెల్లుబుకుతున్న అంతరాత్మను
    ఎదలోతుల్లో కొత్తగా సమాధి చేస్తూ…
    ఇలాగే ఉందాం….ఇలాగే అపరిశుభ్ర మనోవనంతో…

  • కోడూరి విజయకుమార్ says:

    వర్మ గారూ…ఈ మధ్య చదివిన మీ కవితల్లో ఈ కవిత నాకు బాగా నచ్చింది
    ముఖ్యంగా –
    “లోలోపల దాగిన కాంతిపుంజమేదో చేతి వేళ్ళగుండా/దేహమంతా ప్రవహిస్తూ నాలో దాగిన నైరాశ్యాన్ని/
    నిరామయాన్ని నిర్వేదాన్ని పారదోలుతూంది”…..చాలా బాగుంది

  • అనూరాధ says:

    ఎంతో అర్థవంతంగా, చైతన్యపరిచేలా రాసారు.
    నిద్రిస్తున్న యోధుడి గాయంలోంచి చిగురిస్తున్న మోదుగు పూల
    మృధు స్పర్శ లోలోకి పాకుతూ గుండెలయను పెంచుతూ
    నరాలలో రక్తకణ కాసారాన్ని ఉడుకెత్తిస్తూంది

    గాయకుడెవరో ఇక్కడ గొంతు తెగిపడినట్టుంది
    ఒక పాట చెవిలో వినిపిస్తూ నాభినుండి
    దిక్కులు పిక్కటిల్లే నినాదమవుతూంది

    అద్భుతం మీ శైలి.

  • sasi kala says:

    లోలోపల దాగిన కాంతిపుంజమేదో చేతి వేళ్ళగుండా

    దేహమంతా ప్రవహిస్తూ నాలో దాగిన నైరాశ్యాన్ని

    నిరామయాన్ని నిర్వేదాన్ని పారదోలుతూంది
    నిజంగా మీ కవిత చదివితే ఏదో శక్తి ప్రవహిస్తున్నట్లే ఉంటుంది అన్నయ్య

  • వాసుదేవ్ గారు అన్నట్టుగా మొదటి స్టాంజాలో మీ మార్క్ మిస్సయ్యినా..
    తరువాతి పదాల్లో మీ మార్క్ గాఢత కనిపించింది.
    మీ కవితలెప్పుడూ.. ఒక చిక్కటి మేఘం అతి నెమ్మదిగా మనసు సూర్యుడిని కమ్మేసినట్టుంటున్ది అలాగే యీ సమాధుల చుట్టూ వుండే ఒక్కో భావ వీచిక మీ పదాల్లో అత్యంత సహజంగా ప్రవహించింది… వర్మా జి

  • ఉత్తేజం గా ఉంది. సమాధుల లో నుండి సూక్ష్మ సందేశం అందుకున్నట్లు ఉంది.
    అభినందనలు .

  • mercy margaret says:

    మీ కవితల్లో ఉండే విలక్షణత , ఈ కవితలో కూడా చూపించారు. వండర్ఫుల్ పోయెమ్ అన్నా..

  • రమాసుందరి గారు, నాగరాజు రామస్వామి గారు, నారాయణస్వామి గారు, డా.ఇస్మాయిల్ గారు, కత్తి మహేష్ కుమార్ గారు, వాసుదేవ్ గారు, పద్మాశ్రీరాం గారు, కోడూరి విజయ కుమార్ గారు, అనురాధ గారు, సోదరి శశికళ గారు, జయశ్రీనాయుడు గారు, వనజ తాతినేని గారు, సిస్టర్ మెర్సీ మార్గరెట్ మీ అందరి కవితాత్మీయ స్పందనతో నాకు స్ఫూర్తినిస్తు నా రాత మెరుగు పడేందుకు మీ అమూల్యమైన అభిప్రాయం అభినందనలతో ఆశీర్వదిస్తున్నందుకు అభివందనాలు.

    వాసుదేవ్జీ నా రాతలలో మొనాటనీ ఫీలవుతూ ఇలా ప్రయత్నించా. మీకు నిరాశ కలిగించినందుకు క్షంతవ్యుణ్ణి.

    నా కవితను సారంగ వేదికపై ప్రచురించి ఇంతమంది ఆత్మీయులు పెద్దల మాటను పొందే అవకాశం కల్పించినందుకు అఫ్సర్ సార్ కు మన:పూర్వక కృతజ్నతలు తెలియచేసుకుంటున్నా..

  • V.Ch.Veerabhadrudu says:

    చాలా చక్కని కవిత. ఆవేదన ఎంత బలంగా ఉంటే అభివ్యక్తి అంత స్పష్టంగా అంత సూటిగా ఉంటుంది.

  • Sai Padma says:

    అంతర్గత సమాధుల్ని ..ఎలా శుభ్రం చేయాలో .. అంత సమాధానపడేలా చెప్పారు.. సూటిగా ఉంది వర్మ గారూ .. !!

  • jyothirmayi malla says:

    అక్షరాలను అస్త్రాలుగా పదునెక్కించిన వారెవరో

    పుటల మద్య నిప్పులు చెరుగుతూ దాగినట్టుంది

    నెత్తురంటిన అక్షరాల పూత వేలి చివర మెరుస్తూంది

    చాలా బాగుంది టైటిల్ సూపర్ అండ్ ఆప్ట్

  • రవి says:

    వర్మ గారు,
    కవిత చాలా బాగుంది, అభినందనలు.

    -రవి

  • Garimella Nageswararao says:

    కవిత చాలా బాగుంది . .వర్మగారు..అభినందనలు

  • మీ ఆత్మీయ స్పందన పదధ్వనితో స్ఫూర్తినిచ్చిన సాయి పద్మ గారూ, జ్యోతక్క, రవి సార్, గరిమెళ్ళ నాగేశ్వర రావు గారూ ధన్యవాదాలు..

  • ఆలస్యంగా ఇక్కడికి వచ్చాను
    అప్పటికే సమాధిని శుభ్రం చేసేసారు

    ఇప్పుడు
    నేవెలిగించాల్సింది
    నూనె దీపాన్నో, ఓ క్రొవ్వొత్తినో

    వెలిగినది కాంతిని ఇవ్వకుండా వుండదుకదా!
    ఆ కాంతిలో
    శుభ్రపర్చాల్సింది ఎదో తెలియదు కానీ
    మిత్రమా !
    ఇక్కడే సమాధులవద్దే
    అలా కూర్చొని
    కొన్ని త్రవ్వుకుంటూ
    గాయపడిన జ్ఞాపకాలకు ఇప్పుడైనా
    కన్నీటి లేపనమద్దుదాం !

    • ఇప్పుడు
      నేవెలిగించాల్సింది
      నూనె దీపాన్నో, ఓ క్రొవ్వొత్తినో

      మీతో పాటు నేను కూడా జాన్ సార్.. మీ ఆత్మీయ స్పందనకు నమస్సులు..

  • ns murty says:

    వర్మగారూ,

    మీ కవిత చదువుతుంటే మీరు ఎత్తుకున్న ఉపమానాన్ని చాలా నిశితంగా వర్ణించిన తీరుకి నేను ఎదో పాత ఆంగ్ల కవిత చదువుతున్నానా అనిపించింది. అంటే మీది అనుకరణ అని కాదు నా ఉద్దేశ్యం. వస్తువుని ఉపమిస్తున్నప్పుడు చాలా అరుదుగా కనిపించే నైశిత్యం, చెప్పాలనే తపనా కనిపిస్తోందని. మరీ ముఖ్యంగా “నిద్రిస్తున్న యోధుడి గాయంలోంచి చిగురిస్తున్న మోదుగు పూల మృధు స్పర్శ లోలోకి పాకుతూ గుండెలయను పెంచుతూ నరాలలో రక్తకణ కాసారాన్ని ఉడుకెత్తిస్తూంది” అన్న చోట. మనకి తెలియకుండానే మనమధ్య చాలా సమాధులు మొలిచేశాయి. కాలం చేసిన సమాధులతోబాటు, కొన్ని ఆరోగ్యకరమైన సంస్కారాలకి కొందరు యత్నపూర్వకంగా సమాధులు కట్టేసారు (కడుతున్నారు) కూడా. ఇప్పుడు సమాధుల్ని తుడవడం కంటితుడుపుచర్య కాకుండా, అందులో నిద్రించే వ్యక్తుల త్యాగాలని గుర్తుంచుకుని వారి ఆదర్శాల మార్గంలో నడవడానికి ఎవరి బలవంతమూ లేకుండా మనంతట మనం తీసుకోవలసిన నిర్ణయం. అది కూడా మన ఆత్మసంతృప్తికోసం. మంచి సందేశాత్మక కవిత.

    అభివాదములతో

    • మీ విశ్లేషణాత్మక ఆత్మీయ స్పందన స్ఫూర్తినిస్తుంది సార్. నమస్సుమాలతో..

      • m s chalam says:

        డియర్ వర్మ

        నీ కవితలు చదవాలని చాలా చాలా కోరిక గా ఉంది .చాలా బాగుంది .వ్యాసాలు రాయడానికి ప్రయత్నించు .

        విష్ యు అల్ ది బెస్ట్

        చలం

      • Thank you Sir. మీరు ఇలా కవిత్వం చదువుతామనడమే చాలా హేపీగా వుంది. వ్యాసాలు రాయడానికి నా విశ్లేషణా శక్తి ఇంకా సరిపోదనుకుంటా.

  • balasudhakarmouli says:

    kavitha- paramaadbhutham… mee kavithaasakthi anthaa … ee kavitha nindaa parachukundi… naakaithe- chaalaa inspirationgaa vundi varma gaaru…

  • Ayubkhan says:

    Vermaji me SMS chudaganay meme kavitha chdavalanay tapana modalayindi Samadhulu Na nunchi melukuva techi mee padalavetam alavelutunu vunna enta udvegam Mundo Antarctic ardrata ok kola vakyam sajeevs mai kanulammundu pachitramay kadlaadutundi tudi nundi chivari varaku mee kavitha manasuto rastunnaru kabatti adi manasuku hatukundi g’day ok sari ottukunudi Jaan nisar Aktha Garu annatlu Mai akelahi chalthraha raha mudkar dekhato khafila bantagaya,, aadab mee

  • K.WILSONRAO says:

    మనసుల్లోని మలినాల్ని కడిగేయడమే ఈ కవితలోని సమాదుల్ని శుబ్రం చేయాలి అనడంగా భావించావోచ్చా వర్మ గారు. కవిత నా మనసుకు హత్తుకుంది

    Wilsonrao .K

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)