వెన్నెముక

  (మన ప్రపంచం మనకు బాగా అర్థంకావాలంటే ఇతర ప్రపంచాల ఆనవాళ్ళు తెలియాలి కనీసం! ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  ఇతర భాషలలో అద్భుతమయిన కవిత్వం వస్తోంది. ఆ కవిత్వ పరిచయ వేదిక  ఈ – ‘అనునాదం’. మిగిలిన భారతీయ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల నించి అనువాద కవిత్వానికి మా ఆహ్వానం. మీ అనువాద కవితలు – మూల కవి క్లుప్త పరిచయం, చిత్రంతో – ‘సారంగ’కు పంపండి. )
*
ఈ వారం అనువాద కవిత: మరాఠీ కవి కుసుమాగ్రజ్ ‘వెన్నెముక’
kusumagraj

 

కొంతమంది కవిత్వం మాత్రమే రాస్తారు, ఇంకా కొంతమంది ఆ కవిత్వమే జీవితంగా బతికేస్తారు. అలాంటి జీవితాల్లో కవిత్వమూ, వ్యక్తిత్వమూ కలిసిపోయి- రెండీటి మధ్య ఎల్లలు చెరిగిపోతాయి. రాసిన వాక్యాల నీడలో నడిచిన పథికుడు ఆయన. కడదాకా స్వేచ్చనే ఊపిరిగా,సిద్ధాంతంగా బతికిన పోరాటజీవి  1912 లో పూనాలో పుట్టిన కుసుమాగ్రజ్ 1999లో నాసిక్ లో కన్నుమూసారు. “నాసిక్ అనగానే నాకు కుసుమాగ్రజ్. ఆయన వాక్యాల్లో కలలు కంటాను నేను, ఆ కలవరింతల్లో నిద్రపోతాను నేను.  ఆయన కవిత్వంలో మేలుకుంటాను నేను” అన్నారు గుల్జార్ నాసిక్ వెళ్ళినప్పుడు!

*

 

“మాస్టారూ, గుర్తు పట్టారా నన్ను?”

వర్షంలో తడుస్తూ వచ్చారెవరో.
తడిసి ముద్దైన బట్టలు, కారుతున్న చూరులా జుట్టూ
క్షణం కూర్చున్నాడు మౌనంగా.. పైకి చూసి నవ్వాడు
“అనుకోని అతిథిలా గంగమ్మ తల్లొచ్చింది
నాలుగు రోజులుండి వెళ్ళింది
పుట్టింటికొచ్చిన ఆడపడుచులా
నాలుగ్గోడల మధ్యా బొంగరంలా తిరిగింది
వొట్టి చేతుల్తో ఎలా వెళుతుంది?
పొయ్యార్పేసి, గోడలు తలుపులతో సహా
ఉన్నవీ లేనివీ అన్నీ పట్టుకెళ్ళింది
భార్యా నేనూ మిగిలాం ఇంట్లో
పోతూ పోతూ, ప్రసాదంలాగ
రెప్పల కింద నాలుగు నీటి చుక్కలుంచిపోయింది
మా ఆవిడకీ నాకూ వాదనలు
మట్టి ఎత్తిపోసి గోడని ఎలాగో నిలబెట్టి వచ్చానిలాగ”
జేబు మీదకెళ్ళిన నా చేతిని చూసి నవ్వాడతను మళ్ళీ
“అబ్బెబ్బే… డబ్బుకోసం కాదు మాస్టారూ..
వొంటరిగా అనిపిస్తుంటే వచ్చానంతే
ఇల్లు కూలింది గానీ వెన్నెముక విరగలేదింకాను
ఒక్కసారి వెన్ను మీద చెయ్యేసి నిమురుతారని,
“పోరాడవోయ్” అని ధైర్యం చెప్తారని… అంతే!
——————————-
మరాఠీ: కుసుమాగ్రజ్
హిందీ: గుల్జార్
తెలుగు: సత్యభామ పప్పు
Download PDF

6 Comments

  • Sai Rachakonda says:

    మూలం ఎలా వుందో తెలియదు కాని, సత్య భామ గారు, మీ అనువాదం స్వేచ్చగా, తేలికగా, చక్కగా వుంది. మూలం లోని భావం చిన్న మాటలలో పెద్దగా బాగుంది.

  • Nag says:

    చాలా బాగుందండీ, సత్యభామ గారు!

  • రమణ బాలాంత్రపు says:

    అమ్మా సత్యభామా
    నీ తెలుగు సేత యొక్క అందం చూసి మూలం ఇంకా ఎంత గొప్పగా ఉండి ఉంటుందో అనిపిస్తోంది. ఒక్కోసారి – చాలా అరుదుగానే అయినా – అనువాదం మూలం తో సమ ఉజ్జీగా ఉండవచ్చు, లేదా కొండొకచో దాన్ని మించి పోయి ఉండవచ్చు. (పోతంగాగారి భాగవతం ఒక ఉదాహరణ).
    నీ కవిత, మూలంతో పోటీపడి గెలిచి ఉంటుందని నేను భావిస్తున్నాను.
    రమణ మావయ్య

  • ns murty says:

    సత్యభామ గారూ,

    మీ అనునాదం చాలా బాగుంది. మూలం లోని అంతర్యం తెలుగులోకి బాగా వచ్చింది.

    అభినందనలు.

  • శారద says:

    మీ అనువాదం చాలా బాగుంది సత్య భామ గారూ!

  • Radha says:

    సత్యభామ గారూ,
    కవిత చాలా బాగుంది. గురువుగా అతని జీవితం ధన్యమైంది కదా! ఇంత మంచి కవితను అందించినందుకు థాంక్స్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)