‘జ్ఞాపకాలే మైమరుపు’

బాపూ రమణల మధ్య సత్యం మందపాటి

  హైదరాబాద్ లామకాన్ లో శుక్రవారం సాయంత్రం   ముళ్ళపూడి వెంకట రమణ 82 వ పుట్టిన రోజు Kinige , కథ గ్రూప్ ల సంయుక్త నిర్వహణలో జరుగుతోంది. ఈ సందర్భంగా రమణగారి స్మరణ వ్యాసాలు ఈ వారం ప్రత్యేకం . 

ఎవరైనా శాస్త్రీయ సంగీతంలో కృషి చేస్తూ వుంటే, బాలమురళి కృష్ణలాగా పాడాలనుకుంటారు. దాదాపు ప్రతి కార్టూనిస్టు బాపూగారిలా బొమ్మలు వేద్దామనుకుంటాడు. క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడూ తను కూడా తెండూల్కర్ లాగా అడాలనుకుంటాడు. అదేరకంగా కథలు వ్రాసే నాబోటి వాళ్ళు రమణగారిలా వ్రాయలనుకుంటారు. ముఖ్యంగా హాస్య కథలు వ్రాసేవాళ్ళు. కనీసం ఒక్క కథయినా ఆయన బాణిలో వ్రాస్తే, వ్రాశారని ఎవరైనా అంటే, ఇక వారి జన్మ తరించినట్టే!        

నేనూ చేశాను ఆ పని. గోపాలం, భామ అనే పేర్లు పెట్టి భార్యాభర్తల మధ్య జరిగే తీయటి చేదు నిజాల్ని హాస్యం రంగరించి మూడు కథలు వ్రాశాను. శయనేషు రంభ, కార్యేషు దాసి, కరణేషు మంత్రి అని. ఆంధ్రభూమి వారపత్రికలో ఆ కథలు ప్రచురింపబడ్డాయి. కొంతమంది పాఠకులు రమణగారి శైలిలో వున్నాయి అంటే, ఎవరూ చూడకుండా ఎగిరి గంతేసినట్టు కూడా గుర్తు. ఈ మధ్యనే యువ జంట సీత, సీతాపతిలతో భోజ్యేషు మాత కూడా వ్రాస్తే స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. ఇదెందుకు వ్రాశానంటే కథా రచయితల మీద రమణగారి ప్రభావం ఎంత వుందో చెబుదామని. మరి అది ప్రభావమా, కాపీనా అనే వాళ్ళు కూడా వున్నారు. ఇక్కడ నేను కానీ, ఇంకొకరు కానీ అయన కథలని కాపీ కొట్టటం లేదు. ఆయన రచనా శైలిని మాత్రమే. ఇలా భుజాలు తడుముకునే నాలాటి వాళ్ళ గురించి కూడా రమణగారు అన్నారు, కాపీ రైటు అంటే కాపీ కొట్టటం రైటు అని!

రమణగారి రచనల గురించి ఇక్కడ చెప్పటం, హనుమంతుడి ముందు గుప్పికంతులు వేసినట్టే! అందుకే ఆయన రచనల మధుర స్మృతులు మీకే వదిలేస్తున్నాను.

పంథొమ్మిది వందల అరవై – డెభైలలో అనుకుంటాను, రమణగారు గవర్నమెంటాలిటీ అనే కథ వ్రాశారు. ఆయన వ్రాసిన కథలు, పుస్తకాలూ అప్పటికే జీర్ణించుకుని ఆయనకి వీరాభిమానిగా మారిపోయిన నాకు, ఆ కథ ఎంతో నచ్చింది. అదీకాక ఆంధ్రప్రదేశపు ప్రభుత్వంలో రెండేళ్లు ఉద్యోగం వెలగబెట్టి, ఇక బెట్ట లేక, ఆ లంచాల అరాచకాన్ని భరించలేక, తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరాను. అమెరికా వచ్చాక ఆ ఆంధ్రప్రదేశ ప్రభుత్వంలోని నా చేదు  అనుభవాల్ని కాస్త హాస్యం, వ్యంగ్యం రంగరించి, గవర్నమెంటాలిటీ కథలు అని పధ్నాలుగు కథలు వ్రాస్తే, రచన మాసపత్రికలో శాయిగారు శీర్షికగా ఒక సంవత్సరం పైన ప్రచురించారు. ఎంతో మంది మిత్రులూ అభిమానులూ ఆ కథలు నచ్చాయనీ, పుస్తక రూపంలో తెమ్మని అడిగారు. రమణగారి చేత  ముందు మాట వ్రాయించుకొని, ఆ పుస్తకాన్ని ప్రచురించాలని ఆశ పడ్డాను. ఆయనకి వ్రాతప్రతి పంపించి, ముందు మాట వ్రాయగలరా అని అడిగితే, గలను అన్నారు, టీవీ భాగవతం సీరియల్ వ్రాస్తూ ఎంతో బిజీగా వుంటూ కూడాను. మళ్ళీ ఇంకోసారి సంతోషంతో ఎగిరి గంతులు వేయాల్సి వచ్చింది.

అంత బిజీగా వున్నా రమణగారు ముందుమాట అద్భుతంగా వ్రాశారు. నా కథలు పధ్నాలుగూ త్రాసులో ఒక పక్కన పెట్టి, ఆయన వ్రాసిన రెండు పేజీలు ఇంకో పక్కన పెడితే, తులసిదళంలా అదే బరువు తూగుతుంది.

“అసలు ఈ గవర్నమెంటాలిటీలూ, ఈ అవినీతి భాగోతాలూ మన వేదాలలోనే వున్నాయిష. వేదాలేమిటి, వాటిని పల్కించిన పురుషోత్తముడు సాక్షాత్ శ్రీమహావిష్ణువువారి వైకుంఠద్వారంలోనే ఆరంభామయాయిష! కలియుగంలో ఇదేమీ గొప్పకాదు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత బాలరూప ఋషులను, ద్వార పాలకులు జయవిజయులు గడప దగ్గరే, మద అహంకారాల కొద్దీ పో పొమ్మని అవమానించారు. దానితో వాళ్ళు కోపగించి, మామూళ్ళు ఇచ్చే బదులు, వాళ్లకి మామూలయిన శాపం ఇచ్చారు. విష్ణుమూర్తి పరుగున వచ్చి, తప్పు తన సేవకులదయినా వైకేరియన్ లయబిలిటీ సూత్రం ప్రకారం, బాధ్యత యజమానిగా తనదేనని చెప్పి, ఋషులని సముదాయించాడు. ఆయన ఆశ్రిత పక్షపాతం అంతటిది. దరిమిలాను ఏడు జన్మల కాలం భక్తులుగా, మంచివాళ్ళుగా బ్రతుకుతూ స్వామికి దూరంగా వుండలేమనీ, రాక్షసులుగా పాపాలూ పాడు పనులూ చేసి మూడు జన్మల్లోనే వెనక్కొచ్చేస్తామనీ వాళ్ళు వేడుకుంటే, వాళ్ళ ‘ఇది’కి పొంగిపోయిన స్వామివారు ‘సరే! అలాగే కానీయండి’ అన్నారు. దానివల్ల ఆ సేవకులు రాక్షసులై పుట్టి ముల్లోకాలనూ నానా హింసా పెట్టారు. సేవకులపై స్వామి కరుణ అమాయకులపై హింసకు అలా దారి తీసింది. తప్పు చేసినా తన వాళ్ళని కాపాడటం అనే గవర్నమెంటాలిటీ కూడా ఆ కాలంలోనే వుండేదష మరి!”

“మొత్తం మీద ఒక్క నిజాన్ని అందరూ గుర్తించటం శ్రేయస్కరమని తోస్తుంది. లంచం తీసుకునేవాడిది తప్పు అయితే, ఇచ్చేవాడిది తప్పుముప్పావు.. నిజానికి వీళ్ళందరూ కలిసి నడిస్తే, లంచం తీసుకునే వాళ్లందరూ చితికిపోతారు. కానీ వీళ్ళు, మనవాళ్ళు – కలవరు కదా! ఐకమత్యం లేదు గదా! అది లేకనే కదా గవర్నమెంటు. దానివల్లనే కదా గవర్నమెంటాలిటీ!” అన్నారాయన.

 satyam1

తర్వాత చాల రోజులకి ఇండియా వెళ్లాను. బెంగుళూరులో పని పూర్తిచేసుకుని, మద్రాసు మీదుగా గుంటూరుకి బయల్దేరాను. కాస్తో కూస్తో ముఖాముఖి పరిచయం వుంది కనుకా, వారి భక్తుడిని కనుకా, కొంచెం చనువు తీసుకుని ముందుగానే బాపు-రమణగార్లకు ఫోన్ చేశాను. వీలయితే మద్రాసులో దిగి ఒక మధ్యాహ్నం మీతో గడపాలని వుంది, మీకు ఫరవాలేదా అని అడిగాను. ఫరవా లేదంటే లేదన్నారు బాపుగారు. అయ్యో తప్పకుండా రండి అన్నారు రమణగారు. మా ఇల్లు ఎక్కడ అంటే ఆటో అతనికి తెలీదు, మాముట్టి ఇంటికి ఎదురుగా అని చెప్పండి ఏ ఇబ్బందీ లేకుండా తీసుకువస్తాడు అన్నారు బాపుగారు.

ఆయన చెప్పినట్టుగానే, మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగగానే ఆటో ఎక్కి మాముట్టి ఇంటికి పోనిమ్మన్నాను. ఆటో అంకుల్ (ఇప్పుడు ఇండియాలో ఆటోవాడు అనకూడదు) నావేపు ఒక మలయాళం చూపు విసిరి, మెరీనా బీచ్ మీదుగా మాముట్టి ఇంటికి తీసుకు వెళ్లాడు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలయింది. ఆ ఎండలో, తెల్లటి చొక్కా లుంగీ వేసుకుని, ఇంటి ముందర ఎండలో నుంచొని వున్నారు రమణగారు. నన్ను చూడగానే, నవ్వుతూ “అమ్మయ్య! వచ్చేశారా, రండి” అంటూ ఆహ్వానించారు.

నేనూ చేతులు జోడించి “నమస్కారం, గురువుగారు. ఎండలో నుంచున్నారేమిటి సార్!” అన్నాను.

“ఏం లేదు. మీకు ఈ రోడ్లు కొత్త కదా.. కనుక్కోవటం కష్టమేమోనని.. “ అన్నారాయన.

“అదేమిటి సార్! అమెరికానించీ ఇక్కడికి వచ్చినవాడిని, స్టేషన్నించి మీ ఇంటికి రాలేనా.. పెద్దవారు ఎండలో నిలబడ్డారు..” అన్నాను నొచ్చుకుంటూ.

ఆయన నవ్వి, భుజం మీద చేయి వేసి “పదండి!” అని ఇంట్లోకి తీసుకు వెళ్లారు.

బాపూగారికి కూడా నమస్కారం చేశాను. రమణగారు బాసింపట్టు వేసుకుని కుర్చీలో కూర్చుంటే, బాపుగారు బాసింపట్టు వేసుకుని నేలమీద కూర్చున్నారు. నేనూ బాపుగారికి ఎదురుగా బాసింపట్టు వేసుకోకుండా, వజ్రాసనం వేసుకుని నేల మీదే కూర్చున్నాను.

ఆ మధ్యాహ్నం నేను ఏనాటికీ మరువలేని రోజు. సాహిత్యం, సంగీతం, సినిమాలు… ఎన్నో విషయాలు.  బాపు-రమణగార్లతో మాట్లాడటమే ఒక పెద్ద ఎడ్యుకేషన్. నేనూ ఎన్నో పుస్తకాలు చదివాను కనుక, తెలుగు సాహిత్యం అంటే  నాకు ప్రాణం కనుక, ప్రతి నిమిషం ఒక అనుభూతిని మిగిల్చింది. మందహాసాల నించీ అట్టహాసాల దాకా పడీ పడీ నవ్వించిన రోజు. భలే మంచి రోజు! పసందైన రోజు!!

“గోదావరి కథలు చదివారా?” అని అడిగారు రమణగారు. లేదన్నాను.

“అదేమిటి. మీరు తప్పకుండా చదవాలి. ఉండండి నా కాపీ ఇస్తాను” అని అది తెచ్చి ఇచ్చారు.

“అయ్యో! ఇది మీ పుస్తకం. మీరు వుంచుకోండి. నేను విశాలాంధ్రలో కొనుక్కుంటాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు. తీసుకోండి” అన్నారాయన.

“పోనీ, చదివి పోస్టులో తిరిగి పంపిస్తాను” అన్నాను.

“లేదు, అచ్చంగా వుంచుకోండి” అన్నారు నవ్వుతూ.

అంతేకాదు, ఆయనకి నా గవర్నమెంటాలిటీ కథలు బాగా గుర్తున్నాయి.

“అందులోని మీ సరస్వతీ నమస్తూభ్యం కథ నాకు బాగా నచ్చింది. అలాటి విషయం మీదే నామిని సుబ్రహ్మణ్యం నాయుడుగారు చదువులా చావులా అని ఒక పుస్తకం వ్రాశారు. మీకు బాగా  నచ్చుతుంది. నా దగ్గర ఒక కాపీ వుంది. తీసుకోండి” అని, వద్దన్నా వినకుండా అది కూడా తెచ్చి ఇచ్చారు.

తర్వాత వారితోపాటే అక్కడ భోజనాలు. భాగ్యవతిగారు, శ్రీదేవిగారు దగ్గర వుండి ఎంతో అప్యాయంగా,

ఆత్మీయంగా అన్నీ అడిగి, అడిగి వడ్డించారు.

భోజనాలయాక మళ్ళీ రమణగారు కుర్చీలో, బాపుగారు నేల మీదా బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. “ఇక వెడతాను సార్! ట్రైనుకి సమయమయింది. వెళ్ళేముందు మీ పాదాలకి దణ్ణం పెట్టి వెడతాను. కాళ్ళు

చాపండి” అన్నాను, ఆ బాసింపట్టు లోపల భద్రంగా దాచుకున్న పాదాలను  చూస్తూ.

“మీరు అమెరికా వాళ్ళు, షేక్ హ్యాండ్ ఇవ్వండి చాలు” అన్నారు రమణగారు.

“నేను అమెరికాలో వుంటున్నా, భారతీయుడినే సార్! కాళ్ళు చాపరూ..” అన్నాను.

ఆయన కాళ్ళు క్రిందికి దించారు. పాదాభివందనం చేశాను.

“బాపుగారూ, మీరూ కాళ్ళు చాపండి” అడిగాను.

“నేను నా కాళ్ళు ఇవ్వనుగాక ఇవ్వనుగాక ఇవ్వను” అన్నారు బాపుగారు కాళ్ళు ఇంకా ముడుచుకుంటూ.

“అదేమిటి సార్! నాకు తృప్తిగా వుంటుంది.. మీరు కాళ్ళు చాపేదాకా నేను వెళ్ళను. తూర్పు వెళ్ళే రైలు తప్పిపోతుంది. ప్లీజ్..” అన్నాను.

ఆయన పాదాలు ముందుకి పెట్టారు. నేను పాదాలకి నమస్కరించాను.

రమణగారు చెప్పులు వేసుకుంటూ, “రండి మా కారులో వెడదాం” అన్నారు.

“వద్దండీ ఈ ఎండలో మీరెందుకు.. నేను ఆటో తీసుకు వెడతాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు.. పదండి” అన్నారు రమణగారు.

వాద ప్రతివాదాలయాక, న్యాయవాది బాపుగారు “పోనీ వెంకట్రావ్ రాడులెండి. మా డ్రైవర్ మిమ్మల్ని దించి వస్తాడు” అన్నారు జడ్జిమెంట్ ఇస్తూ.

కారులో స్టేషనుకి వెడుతుంటే, నా కెందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బాపు రమణలు వారివారి రంగాల్లో ఎంతో గొప్పవాళ్ళు. చిత్రకళారంగంలోనూ, సినిమారంగంలోనూ, సాహిత్యంలోనూ తిరుగులేని మనుష్యులు. ప్రప్రంచ ప్రఖ్యాత ప్రముఖులు. వయసులో నాకన్నా ఎంతో పెద్దవారు. మరి నేనో.. రమణగారి బుడుగు భాషలో చిన్నవాడిని, ఎంతో చితకవాడిని. అసలు నేను వాళ్లకి ఏమవుతాను? స్వంత ఇంటి మనిషిలా నా మీద ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎందుకు చూపించాలి? రమణగారు మిట్ట మధాహ్నం మండుటెండలో అలా నుంచొని ఎదురు చూస్తున్నారే, ఎందుకు? దానికి ఒక్క మాటలో ఒక్కటే సమాధానం. అది వారి సంస్కారం. అక్కడ నేను.. నేను కాకుండా ఇంకెవరైనా వున్నప్పుడు కూడా, బాపు రమణగార్లు అలాగే గౌరవమిస్తారు. ఆ గౌరవం నాకు దక్కింది కానీ, వాళ్ళు ఇచ్చిన గౌరవం నిజంగా వారి సంస్కారానికి! వారి సహ్రుదయతకి!

తర్వాత ఏడేళ్ళకి, 2007లో హైదరాబాదులో వంగూరి ఫౌండేషన్ వారి ప్రప్రధమ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు జరిగింది. అక్కడ బాపు రమణల స్నేహానికి షష్ఠిపూర్తి ఘనంగా జరిపారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజు. బాపు రమణగార్లని పరిచయం చేస్తూ, ఒక వ్యాసం వ్రాసి చదవమంటే, వెంటనే ఒప్పేసుకుని నా ప్రాణం పెట్టి చక్కటి వ్యాసం వ్రాసి, వారిని పరిచయం చేశాను. ఆ రోజే నా ఎన్నారై కబుర్లు ఒకటి, మరోటి పుస్తకాలు బాపు రమణగార్లు ఆవిష్కరించారు.

అంతకన్నా నాకు జీవితంలో కావలసిందేముంది!

రమణగారి రచనల్లో నన్ను బాగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. సరదాగా వ్రాస్తూనే, హఠాత్తుగా సాంఘిక, రాజకీయ, మానవతావాదంతో చెంప చెళ్లుమనేలా కొట్టి మరిచిపోకుండా చేసే రచనా చాతుర్యం.

మచ్చుకి కొన్ని: (అంటే అరడజను)

“నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో”

“సిఫార్సులతో కాపురాలు చక్కబడవు”

“సత్యాన్వేషికి సమాధానమేమిటని ఒక గణిత శాస్త్రజ్ఞుడిని అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అంటాడు”

“పగటి కల అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. మనసులో పేరుకుపోయిన దురాశలనీ నిరాశలనీ, అందీ అందని ఆశలుగా పరిమార్సివేసే మందు. మితంగా సేవిస్తే, గుండెకూ, కండకూ పుష్టినిచ్చే దివ్యౌషధం”

“టైము అనగా కాలము. చాల విలువైనది. బజార్లో మనం మిరపకాయలు కొనగలం. చింతపండు కొనగలం. ఇడ్లీలు, కిడ్నీలు కొనగలం. గొడుగులు, గోంగూర కొనగలం. బాల్చీలు, లాల్చీలు కొనగలం. కానీ కాలాన్ని మాత్రం కొనలేం. కాలాన్ని వృధా చేయటం క్షమించరాని నేరం”

“వారానికి అర్ధ రూపాయి ఇస్తే, రోజూ హోటల్ భోజనపు ఎంగిలాకులన్నీ నువ్వొచ్చే వరకు వుంచి, నువ్వు రాగానే పడేస్తా!”

ఇలాటివి చదువుతుంటే, శ్రీశ్రీలా ఆకలేసి కేకలే వెయ్యఖ్కర్లేదు, రమణగారిలా ఆకలేసినప్పుడు జోకులేసి కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది.

దటీజ్ రమణ!

వెంకట రమణ!!

ముళ్ళపూడి వెంకట రమణ!!!

మీరు ఎక్కడికీ వెళ్ళలేదు సార్!

ఇక్కడే సజీవంగా వున్నారు!

మీ రచనల్లో!

తెలుగు సాహిత్యంలో!

మా హృదయాల్లో!

0                           0                           0

 

Download PDF

2 Comments

  • sarada says:

    nijamgaa chaalaa chaalaa bagundandee. rachayitaki dhanyavaadalu. meeru anntlu ramana garu ekkadikee vellaledu. ikkade mana madhye vunnaru.aiyinaa mana andarinee vadilivesi aayana ekkadaki velataarandee?

  • indira says:

    చాలా బాగుందండి.ఆ మహానుభావుల గురించి ఎవరైనా ముందు వారి సింప్లిసిటీ,అభిమానం గురించి చెప్పినతరువాతే వారి బొమ్మలు,రచనలు మొదలైన వాటి గురించి చెప్తారు.రమణగారి రచనలు,సినిమాలు చూస్తున్నప్రతిసారి ఎంతో ఎంజాయ్ చేస్తాం.బాపు రమణలు తెలుగువారినెన్నడూ వీడివెళ్ళలేరు..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)