తెలుగు వాడి నవ్వు నరం…

mullapudi budugu

(రమణ గారు కన్ను మూసినప్పుడు..)

 

తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది.

తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు.

మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , “ఓ ఫైవ్” కోసం మన చుట్టూ గ్రహంలా తిరిగే అప్పారావుల “నోటు” మాటలు విన్నప్పుడల్లా, చటుక్కున అక్కడ ముళ్ళపూడి ప్రత్యక్షమయిపోతారు. కాబట్టి, ముళ్ళపూడికి కన్నుమూతా, పెన్నుమూతా లేవు.
ముళ్ళపూడి నవ్వుల నావలో ఈ ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది? బుడుగుతోనేనా? ఆ నోటు బుక్కు సైజు పుస్తకం, కాస్త పెద్దచ్చరాలు, మధ్యలో బాపు వొయ్యారి గీతల్లో ప్రాణం పోసుకొని వివిధ భంగిమల్లో బుడుగూ, సీగాన పసూనాంబ..చూస్తున్నప్పుడే కాదు, పుస్తకం మూసి, రమణాక్షరాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా కన్ను కొట్టినట్టుండే కొంటె గీతలు…అటు నించి వాక్యాల వెంట ప్రాణాలని లాక్కుపోయే రమణ గారి

మాటలు…బొమ్మ ముందా, మాట ముందా అంటే ఎటూ తేలని సందిగ్ధం. మొత్తానికి బుడుగు ఒక అనుభవం. మనలోపలి చిలిపితనాలని, కొంటె కోణాన్ని నిద్రలేపే రసార్ణవం.
వాక్యాలు అందరూ రాస్తారు. డయలాగుల లాగులు రైటర్ టైలర్లంతా కుడతారు. కాని, కొన్ని లాగులు అరువు లాగుల్లా వుంటాయి. బరువు మూటల్లా వుంటాయి. కాని, ఈ టైలరు అసలు ఎలాంటి కొలతలూ తీసుకోకుండానే మనసుకి కొలత పెట్టి డయలాగులు కుట్టేస్తాడు.

ముళ్ళపూడి డయలాగులు వదులూ కావు, బిగువూ కావు. మనసుకి వొదిగి పోతాయి. కాబట్టే, తెలుగు వాక్యం ఆయన దగ్గిర చాలా కాలం ఆగిపోయింది. ఆయన వొంపు సొంపుల రేఖల నించి తప్పించుకోవడానికి దానికి చాలా కాలం పట్టింది. ఆ మాటకొస్తే, ఆ వాక్యం ఇంకా అక్కడే ఉండి పోయిందేమో అనీ అనిపిస్తుంది. కనీసం మన నవ్వులు అక్కడ చిక్కడిపోయాయి.

(25 ఫిబ్రవరి 2011, ‘ఆవకాయ’ నించి..)

Download PDF

2 Comments

  • somarajusharma says:

    గురువు గారు సారంగ రచనలు చదువుతుంటే సమయం తెలేయడంలేదు. చాల బాగున్నాయి.

    • కల్లూరి భాస్కరం says:

      మీ సంక్షిప్త నివాళి బాగుంది అఫ్సర్ గారూ, “ఓ ఫైవ్ కోసం మన చుట్టూ గ్రహంలా తిరిగే అప్పారావుల ‘నోటు’మాటలు విన్నప్పుడల్లా…” అన్న వాక్యం చదవగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. కవి అజంతా గారు, బాపు, ముళ్ళపూడి రమణలు మద్రాసులో ఒకే గదిలో ఉండేవారనో, లేదా రోజూ ఒకచోట కలుసుకునేవారనో విన్నట్టు జ్ఞాపకం. “ఓ ఫైవ్ ఉందా” అన్న మాట అజంతా గారిదేననీ, ఆయననే అప్పుల అప్పారావుగా ముళ్ళపూడి సృష్టించారనీ విన్నాను. అప్పుల అప్పారావే పాత అందాల రాముడు సినిమాలో రాజబాబు పాత్ర రూపంలో అవతరించాడు. కవులకు సంబంధించిన ఇటువంటి ముచ్చట్లు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు చాలా రంజుగా చెబుతూ కడుపుబ్బ నవ్వించేవారు. ఆయన ద్వారా ఇవన్నీ జాగ్రత్త చేస్తే బాగుంటుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)