ఏడుగురు అన్నదమ్ములు – రాక్షసి

samanya1resize

సామాన్య

చాలా చాలా కాలం క్రితం ఊరికి కాస్త దూరంగా , అడివికి కాస్త దగ్గరగా ఒక చిన్న మైదానంలో ఒక పూరిల్లు ఉండేది. ఆ ఇంట్లో అమ్మ నాన్న లేని ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. పనీపాట చేసుకుంటూ , వాళ్ళే వంటాగింటా చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు.

అప్పుడేమయిందీ  ఒకరోజు పొద్దునే అడవి దిక్కు నుండి ఒక అమ్మాయి నడుచుకుంటూ వాళ్ళింటికి వచ్చింది. అప్పటికే ఆకాశం చుక్కల్తోనూ , చంద్రుడితోనూ మిలమిలమంటుంది, అడవి చీకటితో గబ్బ గీమంటోంది  అప్పుడు ఆ అమ్మాయి ఈ అన్నదమ్ముల ఇంటికి వచ్చి “ఏవండీ…… ఏవండీ మరేమో నేను దారి తప్పేశాను, మా ఇంటికి వెళ్ళలేకున్నాను, కాస్త మీ ఇంట్లో ఉండనిస్తారా ?” అని అడిగింది. ఆ మాట విని ఆపిల్లని  నుండి పై వరకు ఓసారి చూసి అన్నదమ్ములన్నారూ ……. “అమ్మాయీ మా ఇంట్లో మేమందరం అబ్బాయిలమే. నీకు చోటీయడం బాగుండదు , అందుకని నువ్వు మాలో ఒకర్ని పెళ్ళిచేసుకో అప్పుడింక ఏ బాధా ఉండదూ ” అన్నారు. అందుకు ఆ అమ్మాయి “సరే అట్లాగే” అన్నది. ఇహ  ఆరుగురు అన్నలు చిన్నవాడ్ని చూసి “నువ్వు చేసుకో తమ్ముడూ” అన్నారు. అందుకు వాడన్నాడూ “అన్నల్లారా ఇప్పుడీ అమ్మాయిని నేను పెళ్ళిచేసుకుంటే ఆమె మీ అందరికీ మరదలవుతుంది . ఇంట్లో ఉండాలన్నా,  ఆమె చేతి తిండి తినాలన్నా అందరికీ ఇబ్బందే. అదే ఈవిడ్ని అన్న పెళ్లి చేసుకున్నాడనుకోండి, అప్పుడు మన ఆరుగురికి వదిన అవుతుంది. వదిన తల్లిలాటిది కనుక మనం సుఖంగా ఉండొచ్చు ” అని. తమ్ముడి తెలివైన మాట అన్నలకు చాలా నచ్చింది. అట్లా ఆ అందమైన అమ్మాయి పెద్దాయనకు భార్య అయిపోయింది.

కాలం సాగిపోతూ ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. అప్పుడేమయిందీ ఒకరోజు ఆ అమ్మాయి భర్తతో “ఏవయ్యా, ఏవయ్యా దారి తప్పి వచ్చిన నన్ను బొట్టు కట్టి ఇంటి దాన్ని చేసేశారు. అప్పుడు సరే ఒక్కదాన్ని మా ఇంటి దారి తెలుసుకోలేకపోయాను , ఇప్పుడు ఇంటాయనివి నువ్వున్నావు కదా, పద మా ఇంటికొకసారి వెళ్లేసి వద్దాం” అన్నది. భర్త కూడా సరేలే మా అత్తగారిల్లు ఎట్లా ఉంటుందో చూసేసి వద్దాం అని చెప్పి సరే అన్నాడు.

ఒకరోజు భార్య భర్త ఇద్దరూ అడివిదారి గుండా ప్రయాణం మొదలుపెట్టారు. వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్లకి దారిలో నిండా పళ్ళతోనూ చిలకలతోనూ నిండి వున్న మామిడి చెట్టు ఒకటి వాళ్లకి కనిపించింది  అమ్మాయి ఆగి “అబ్బ ఎంత బాగున్నాయో మామిడి పళ్ళు అదిగో కొంచం కిందగా ఉంది  , నాకు కోసిపెట్టవయ్యా ” అని మొగుడ్ని అడిగింది. అందుకు మొగుడు సరే అని చెప్పి చాలా ప్రయత్నించాడు. కానీ పాపం పండు అందలేదు. ఇంక నిరాశ చేసుకుని మళ్ళీ బయల్దేరారు.

అట్లా నడిచి వెళ్తూ ఉండగా ఈసారి గలగలామని పారుతున్న వాగు ఒకటి వాళ్ళకి కనిపించింది. భార్య వెళ్లి వాగులో కడుపు నిండా నీళ్ళు తాగి మొహమూ  కాళ్ళూ చేతులూ కడుక్కుని చెట్టు నీడకి చేరింది. మొగుడ్ని కూడా వెళ్ళు వెళ్లి ముఖం కడుక్కో” అని చెప్పింది. అతను వెళ్లి ముఖం కడుక్కున్నాడు. ఇంకేముందీ ఆ నీళ్ళు కళ్ళకి తగలగానే వాడి కళ్ళు పొయ్యాయి. గుడ్డివాడైపోయాడు, అప్పుడు చెట్టు క్రింద కూర్చుని ఉందే వాడి భార్య,భర్త కళ్ళు పోయాయని తెలుసుకోగానే రాక్షసిగా మారిపోయింది. పెద్ద పెద్ద పొడుగు పళ్ళు , తెల్లటి వళ్ళు , ఎర్రటి జుట్టు అమ్మో రాక్షసి ఎంత భయంకరంగా వుందో…… కళ్లుపోయి అలమటిస్తున్న భర్తని పట్టుకుని విరుచుకు తినేసింది. తినేసి భుక్తాయాసం వచ్చి కాసేపు చెట్టుకింద పడుకుని అట్లాగే నిద్రపోయింది. ఆ తరువాత లేసి మూతి కడుక్కుని ఇంతకు ముందులాగే అందమైన తెల్లటి అమ్మాయిలాగా మారిపోయి ఇంటికెళ్లిoది .

అన్నదమ్ముళ్ళు ఒక్కటే వచ్చిన వదినను చూసి ఆశ్చర్యపడి “అన్నేడి వదినా ఒక్కదానివే వచ్చావే” అని అడిగారు. అందుకు ఆ రాక్షసి ఏమన్నదీ “మీ అన్న అత్తగారింట్లో హడియాగి జీయా(సారాయం) తాగుకుంటూ ఉండిపోయాడు,రమ్మంటే రావటం లేదు. మీకెవరు వండి పెడతారని చెప్పి నేను వచ్చేశాను. వస్తాడులే వెనకే” అని చెప్పింది.

కొన్ని రోజులు గడిచాయి. రెండోవాడు చూసి చూసి “వదినా వదినా, ఇది దుక్కులు దున్ని నాట్లు వేసే కాలం కదా, ఇంటికి పెద్ద దిక్కు అన్న లేకపోతే ఏం బాలేదు పద తీసుకొద్దాం” అని చెప్పి వదినని బయల్దేరదీసాడు.

పోయినసారిలాగానే ఆ వదిన మామిడి చెట్టు దగ్గరికి రాగానే మామిడి పండు అడిగింది, అది అందకపోయేసరికి వాగు దగ్గర ముఖం కడుక్కోమని చెప్పి కళ్ళు పోగానే వాడినీ విరుచుకుతినేసింది. అట్లా ఒక్కసారికి ఒక్కడ్ని తినేసింది. ఇంక ఒకేఒక్కడు మిగిలాడు ఏడవవాడు వాడికి మొదటి నుండీ ఏదో అనుమానంగా ఉంది. కానీ విషయం మాత్రం ఏమీ తెలీదు. సరే అని చెప్పి వదినతో బయల్దేరాడు. వదిన యధావిధిగా మామిడి పండు అడిగింది , అది అందలేదు , వాగులో ముఖం కడుక్కోమంది , వాడు కడుక్కోలేదు , కానీ ఆ రాక్షసి ఏమనుకున్నదీ వాడు కడుక్కున్నాడు , కళ్ళు పొయ్యాయి అనుకున్నది.

అనుకుని రాక్షసిగా మారిపోయింది. రాక్షసిని చూడగానే వాడికి జరిగిందంతా అర్ధమైపోయింది. ఇంక వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారిలో మామిడి చెట్టు వచ్చింది అప్పుడు వాడు ” ఓ మామిడి పండూ నువ్వే గనుక సత్యమైనదానివైతే నన్ను నీలో దాచేసుకో” అన్నాడు. మామిడి పండు వాడ్ని దానిలోపల దాచిపెట్టేసింది. రాక్షసి ఆ పండుకోసం ఎగరడం మొదలుపెట్టింది. అప్పుడో చిలక వచ్చి ఆ పండుని కోసుకెళ్ళి నదిలో వేసేసింది. రాక్షసి దానికోసం పరిగెత్తడం మొదలుపెట్టింది. చివరికి ఒక ఊరొచ్చింది. అప్పుడు ఆ పిల్లవాడు పండులోంచి బయటికి వచ్చి ఊర్లో వాళ్లకి విషయం చెప్పాడు. ఊర్లో వాళ్ళు కర్రల్తో, గొడ్డళ్ళతో వచ్చి ఆ రాక్షసిని కొట్టి చంపేసారు.

కథనం : సామాన్య

Download PDF

4 Comments

  • karthik says:

    మంచి జానపదాలు చెప్తునందుకు సామాన్య గారు మీకు కృతఙ్ఞతలు …

  • Lakshmi Prasanna says:

    సామాన్య గారు మీ కధలు చాల బాగున్నై .

  • sarada says:

    సామాన్య నేను శారద ని నెంబర్ పొఎన్ది నాకు పోను ఛాయావ

  • Ranganaayakulu. Rapuri says:

    చాలా బావున్నాయండి.

Leave a Reply to Ranganaayakulu. Rapuri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)