‘చెర’గని జ్ఞాపకం…చెరబండ రాజు!

cherabandaraju1
venu

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్

 

(జూలై 2:  ప్రసిద్ధ కవి చెరబండ రాజు వర్థంతి )

చిన్నా పెద్దా అందరమూ ప్రేమగా ‘చెర’ అని పిలుచుకుంటుండిన చెరబండరాజు చనిపోయి అప్పుడే ముప్పై ఒక్క ఏళ్లు గడిచిపోయాయి. చెర పుట్టినరోజు తెలియదు.“ హైదరాబాదుకు తూర్పున, అంకుశాపురం గ్రామంలో పదిహేను రోజుల ప్రసవవేదనలో అమ్మ చచ్చిపోతుందనగా నేలమీదికి కసిగా విసిరివేయబడ్డాడు. ఎప్పుడో తేదీ లేదు. బంగారమొడ్డించే పల్లెవాసుల చల్లని చూపుల్లో, పైరుపచ్చని పొలాల గట్ల మెద్ద కాలిబాటల చీలికల్లో పెరిగాడు. ఎదురైన ప్రతి హృదయానికీ అంకితమవుతాడు. సాగర తీరాల ఇసుక తిన్నెల మీద ఒంటరిగా కూర్చోవడం, వానలో నానడం, ఏకాకిగా ఉండడం, విషాదం ఇష్టం. మనిషికోసం పడి చస్తానంటాడు. ఒక్క భగవంతుని మీదే కసి, పగ” అని దిగంబరకవులు మొదటి సంపుటంలో పరిచయం రాసుకున్న నాటికైనా, చివరి వరకూ అయినా పుట్టినతేదీ తెలియనే లేదు. జ్ఞాపకం ఉన్న సంఘటనలను బట్టి పుట్టిన సంవత్సరం 1944 అని చెప్పుకునేవాడు. అది సరైనదే అయితే చెర ఇప్పుడు 69 నిండి డెబ్బైలలో ప్రవేశిస్తుండేవాడు.

చెరను బహుశా 1972లో మొదటిసారి చూసి ఉంటాను. అప్పటినుంచి 1982 జూలై 2న చనిపోయేదాకా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మానసాకాశం మీద ఎప్పటికీ చెరగని అరుణారుణతారలు. మనిషిని చూసినది పది సంవత్సరాలే, అందులోనూ ఆయన రెండేళ్లు ముషీరాబాద్ జైల్లోనూ, రెండేళ్ల కన్న ఎక్కువే గాంధీ రోగ నిలయం (గాంధీ ఆస్పత్రికి ఆయన పెట్టిన పేరు) లోనూ గడిపాడు. ఆయనను కలిసింది కూడా సభల్లో, అంబర్ పేట ఇంట్లో, జైలులో, కోర్టులలో, ఆస్పత్రిలో అప్పుడప్పుడూ మాత్రమే గనుక మొత్తంగా నెల కూడ ఉండదేమో. కాని వెయ్యి పున్నముల వెలుగు అది. ఆయన జీవితం మీద, కవిత్వం మీద ఎన్నో చోట్ల మాట్లాడాను, రాశాను. మాట్లాడినప్పుడల్లా , రాసినప్పుడల్లా కొత్త స్ఫురణకు వీలు కల్పించే నవనవోన్మేష స్ఫూర్తి అది.

ఆయన ఎక్కువకాలం గడిపిన అంబర్ పేట కిరాయి ఇల్లు ఇప్పుడు లేదు. ముషీరాబాద్ జైలును కూల్చేసి గాంధీ ఆస్పత్రి చేశారు. గాంధీ రోగనిలయాన్ని కూల్చేసి ఎవరికి రియల్ ఎస్టేట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఆయన ఉద్యోగం నుంచి తొలగింపుకూ, అనారోగ్యానికీ గురయితే తెలుగు సమాజం అసాధారణంగా స్పందించి ఆయన సహాయనిధి సేకరించి కట్టించి ఇచ్చిన రెండుగదుల చిన్న ఇల్లు కూడ ఇప్పుడు అపార్ట్ మెంట్ గా మారిపోయింది. ఆయనకు అన్నివిధాలా సంపూర్ణంగా సహచరిగా ఉండిన శ్యామలక్క అకాలంగా అనారోగ్యంతో మరణించింది. ఆయన కంటిపాప ఉదయిని కాన్సర్ పీడితురాలయి ముప్పై ఏళ్లు నిండకుండానే ప్రాణాలు కోల్పోయింది. కొడుకు కిరణ్ తప్ప భౌతికంగా చెర జ్ఞాపకం అని చూపదగినవి దాదాపుగా ఏమీ లేవనే చెప్పాలి. కాని చిరస్మరణీయమైన చెర కవిత్వం ఉంది.

‘అమ్మమ్మ ఇందిరమ్మ చేసింది సాలుపొమ్మా’ అని గానానికి అనువుకాని, శ్రుతిలయలు తెలియని సన్నని గాత్రంతోనే ఆయన పాడిన పాటలు, ‘పాడుతాం పాడుతాం ప్రజలే మానేతలనీ ప్రజాశక్తి గెలుచుననీ’ అనీ, ‘విప్లవాల యుగం మనది, విప్లవిస్తె జయం మనది’ అనీ, ‘ఈ మట్టిని తొలుచుకొనీ విప్లవాలు లేస్తున్నై, ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వాగతాలు’ అనీ ఆయన చేతి సంకెళ్లనే సంగీత సాధనాలుగా మార్చి కూర్చిన అద్భుతమైన లయబద్ధమైన కవితానినాదాలు ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి.

cherabandaraju1

విప్లవ రచయితల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఎమర్జెన్సీ విధించే దాక అంటే 1970 జూలై నుంచి 1975 జూన్ దాకా  ఐదు సంవత్సరాలలో హనుమకొండ-వరంగల్ లలో కనీసం యాభై సభలు, సమావేశాలు జరిగి ఉంటాయి. నేను 1973 జూన్ తర్వాతనే చదువు కోసం హనుమకొండ వచ్చాను గాని అంతకుముందరి సభలు కూడ చూశాను. అటువంటి సభల్లో ఏదో ఒకదానిలో, బహుశా చెర 1971లో మొదటిసారి ప్రెవెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టయి విడుదలైనాక జరిగిన సభలోనో, లేదా మరేదైనా సభలోనో చూసి ఉంటాను. ఇక నేను హనుమకొండకు చదువుకు వచ్చినాక నాలుగు నెలలకే అక్టోబర్ లో విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. విరసం నాయకులందరినీ మూడు నాలుగురోజులపాటు సన్నిహితంగా చూడడం, వారి మాటలు, కవితలు, ఉపన్యాసాలు వినడం అప్పుడే. అందరితో, ముఖ్యంగా చిన్నపిల్లలతో స్నేహం చేసే చెర ప్రభావం ఆ సభల్లో పుస్తకాల దుకాణం దగ్గర కూచున్న నా మీద పడడం చాల సహజంగా జరిగింది.

ఆ సభలు జరిగిన రెండు మూడు రోజులకే ఒక రోజు పొద్దున్నే ఇంటికి వచ్చిన పోలీసులు మామయ్య (వరవరరావు) ను అరెస్టు చేసి తీసుకుపోయారు. అదే సమయంలో హైదరాబాదులో చెరను కూడ అరెస్టు చేశారు. అప్పటినుంచీ చెర మా కుటుంబ సభ్యుడే అయిపోయాడు. ఆ నిర్బంధం నెలన్నరలోనే ముగిసింది గాని, మరొక ఆరునెలలకు చెరనూ మామయ్యనూ సికిందరాబాదు కుట్రకేసులో ముద్దాయిలుగా కలిపి పెట్టారు. ఇక ముషీరాబాదు జైలులోనో, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోనో చెరను రెగ్యులర్ గా కలుస్తుండేవాళ్లం. కొన్నాళ్లకే చెర బెయిల్ మీద విడుదలై ఎమర్జెన్సీ విధించేదాకా జరిగిన సభల్లో పాల్గొన్నాడు. ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగిన రాడికల్ విద్యార్థి సంఘం మొదటి మహాసభల నాటికి జైలులో ఉన్నాడో విడుదలై పాల్గొన్నాడో గుర్తు లేదు గాని, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో జరిగిన నాలుగైదు ఆర్ ఎస్ యు సభలకు ఉపన్యాసకుడిగా వచ్చాడు. ఏప్రిల్ లో తెలుగు మహాసభల దగ్గర శ్రీశ్రీతో పాటు నిరసన ప్రదర్శన జరిపి అరెస్టయ్యాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ రెండు సంవత్సరాలూ జైల్లో, కోర్టుల్లో కలవడమే.

ఎమర్జెన్సీ తర్వాత చెర బతికింది సరిగ్గా ఐదు సంవత్సరాలు, అందులోనూ రెండు, రెండున్నర సంవత్సరాలు ఆస్పత్రులలోనే ఉన్నాడు. మిగిలిన కాలమంతా ఎన్నో చోట్ల ఎన్నో సభల్లో కలుసుకుంటూ ఉండేవాళ్లం. 1979లో మా బాపును తీవ్రమైన లివర్ సంబంధిత సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చేర్చి, పది పదిహేను రోజులు ఉన్నప్పుడు చెర కూడ ఆపరేషన్ కోసం అక్కడే ఉన్నాడు. అప్పటికే రాయడం మొదలుపెట్టిన నాకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, నా కలం పేరు మీద ఆయన వ్యాఖ్య, ఆ గొంతు నా చెవుల్లో ఇప్పటికీ ధ్వనిస్తూనే ఉంది.

చెర జీవితం గురించి తలచుకున్నప్పుడల్లా ఆ విస్తృతీ, వైవిధ్యమూ చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. బతికినది నిండా ముప్పై ఎనిమిదేళ్లు కూడా కాదు. అందులో మూడు సంవత్సరాలు జైలుకూ మూడు సంవత్సరాలు అనారోగ్యానికీ, ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆర్థిక ఇబ్బందులకూ, కేసులకూ పోతే, పదిహేను సంవత్సరాలు సాహిత్య, సామాజిక జీవితానికి ముందరి వ్యక్తిగత జీవితానికి పోతే ఆయన సాహిత్య, సామాజిక జీవితానికి మిగిలింది అటూ ఇటూగా పదిహేనేళ్లు మాత్రమే. కాని ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండు సాహిత్య ఉద్యమాలకు ప్రధాన భాగస్వామి అయ్యాడు. ఏడు కవితా సంపుటాలు అచ్చు వేశాడు, ఒక డజను దాకా కథలు రాశాడు. మరో డజను నాటికలు, నాటకాలు రాశాడు. మూడు నవలలు రాశాడు. ఒక అసంపూర్ణ నవల వదిలిపోయాడు. ఉపన్యాసాల కోసం, కవితాపఠనం కోసం రాష్ట్రమంతా తిరిగాడు. విప్లవ రచయితల సంఘానికి ఒక సంవత్సరం కార్యదర్శిగా పనిచేశాడు. హైదరాబాదులో విప్లవోద్యమానికీ, విప్లవ విద్యార్థి యువజనోద్యమాలకూ, జననాట్యమండలికీ పెద్దదిక్కుగా ఉన్నాడు.

ఈ పనులన్నీ కూడ ఏదో చేశాడంటే చేశాడన్నట్టు కాకుండా మనసు పెట్టి చేశాడు. శ్రద్ధగా చేశాడు. తెలుగు పండిత శిక్షణ పొంది, ప్రాచీన సాహిత్యం చదువుకున్నా, పాఠాలు చెప్పినా, వచన కవిత్వం మీద పట్టు సాధించాడు. ఎప్పటికప్పుడు వస్తుశిల్పాలను పదును పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 1969లో వ్యతిరేకిస్తూ కవిత రాసినవాడే, 1972 నాటికి తన ఆలోచనలోని పొరపాటు గ్రహించి తెలంగాణ ఆకాంక్షలను సమర్థిస్తూ కవిత రాశాడు. నిరంతర సాధనతో తన వస్తువులను తానే మార్చుకున్నాడు. వస్తువు ఎంపికలో వైవిధ్యం సాధించాడు. అప్పటికి విప్లవ సాహిత్యోద్యమం కూడ సంకోచించిన అంశాలను వస్తువులుగా తీసుకుని రచన చేశాడు. వచన కవితా రూపంతో తన లక్ష్యం నెరవేరదనుకున్నప్పుడు తనను తాను మార్చుకుని పాట వైపు పయనించాడు. తన పాటలు తానే పాడాడు. నిర్బంధంలో చేతికి సంకెళ్లతో కోర్టుకు తీసుకు వస్తున్నప్పుడు అప్పటిదాకా విప్లవకారులకు, విప్లవ రచయితలకు అలవాటైన నినాదాల స్థానంలో సంకెళ్ల దరువుతో కవితా పాదాలు అల్లడం మొదలుపెట్టాడు. అలా రాసిన ఏడెనిమిది పాటల్లో ప్రతి చరణమూ ఆ తర్వాత విప్లవోద్యమ ఊరేగింపులలో నినాదంగా మారింది.

ఆలోచిస్తుంటే చెర కవిత్వం గురించీ, కవిత్వ శక్తి గురించీ, జీవితం గురించీ ఇప్పటికి చాలమంది చాలా చెప్పి ఉన్నప్పటికీ ఇంకా అన్వేషించవలసిందీ, వివరించవలసిందీ, విశ్లేషించవలసిందీ ఎంతో మిగిలి ఉన్నదనే అనిపిస్తున్నది.

అవును, చెరస్మరణ చిరస్మరణీయం.

—ఎన్.వేణుగోపాల్

 

Download PDF

4 Comments

 • Sowmya says:

  బాగా రాశారండీ, చెరబండరాజు గారి గురించి. నేను ఇదివరలో ఈయన గురించి వినడమే కానీ ఎప్పుడూ ఈయన రచనలు చదవలేదు. మీరు ఆయన గురించి చెప్పింది చదువుతూ ఉంటె కుతూహలం కలుగుతోంది.

 • bhasker says:

  చాలా మంచి ఆర్టికల్ రాసారు డియర్ వేణూ!
  భాస్కర్ కూరపాటి .

 • rajani says:

  నిజంగానే చేర బండరాజు మా అందరితో చిన్న పిల్లలం అనుకోకుండా స్నేహం చేసే వాడు కొండలు పగలేసినం అంటూ మేం ఎప్పుడు పాటలు పాదుతూ ఉండే వాళ్ళం చేర చిరస్మరనీయుడే .

  • vijayaranganatham says:

   వేణు
   చాల రోజుల తరువాత ఈ article చూసాను…పాతగ్యాపకాలు ఒక్కసారిగా పెల్లుబికాయి. చేర మీసలో అరెస్ట్ అయినప్పటి నుండి చాల ఎక్కువ చనువు ఏర్పడింది ఆయనతో. బాగా గుర్తుంది..1970 అనుకుంట జ్వాల నిఖిల్ & చేర ని అరెస్ట్ చేసి రాత్రి 11 గంటలకి సీతరామ్బాగ్ ఇంటికి తీసుకుని కృష్ణారావు ఇన్స్పెక్టర్ పోలీసులతో వచ్చాడు. ముగ్గురు పొద్దుటి నుండి ఏమి తినలేదు. అమ్మ వాళ్ళకి Annam పెట్టింది కాని అయన అభ్యంతరం చెప్పాడు. విషం కలిపి పెడతారని ఏదో అన్నాడు. మా అమ్మ తెగ తిట్టేసింది. మేము మా పిల్లలని చంపుకునేంత దౌర్భాగ్యులం కాదు అంది. నేను ఆ ముగ్గురి కన్చాల్లోని ఒక్కో ముద్దని తిన్నాను. తరువాత వాళ్ళు తిన్నారు. వేల్లిపోతున్నప్పుడు చేర నాతో శ్యాము ఒక్కతే ఉంది చూసుకో అన్నాడు. ఆ రాత్రి నిఖిల్ భార్య యామిని శ్యమలని కలవటానికి విద్యానగర్ కి వెళ్ళాను. అలా ఎన్నో గ్యాపకాలు. చేర జైలు లో ఉన్నప్పుడు శ్యామల తో అన్నిపనులకి తిరగటం….ఎక్స్ట్రా ఇంటర్వ్యూ ల కోసం ట్రై చేయటం… ఆయన్ని మరవలేము.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)