బిల్లి

shahjahana

 ‘నఖాబ్’ తీసి ముస్లిం స్త్రీ ‘దర్దీ’ స్వరాన్ని వినిపించిన  తెలుగు రచయిత్రి షాజహానా. కవిత్వంలోనే కాకుండా, కథల్లో కూడా ఆమె తనదయిన గొంతుకని వెతుక్కుంటోంది. అస్తిత్వ ఉద్యమాల దశాబ్దంలో కవిత్వంలోకి అడుగుపెట్టిన షాజహానా అతి తక్కువ సమయంలోనే గుర్తింపు పొంది, అంతర్జాతీయ వేదికల మీద కూడా తన స్వరాన్ని వినిపించారు.

*

రెహానా వాళ్లాయనది చిన్న గవర్నమెంటుద్యోగం. దాంతో  ట్రన్స్‌ఫర్లు తప్పనిసరై జిల్లా అంతా తిరుగుతుంటారు. ఆ సందర్భంగానే ఈ పెద్ద నగరానికి వచ్చారిప్పుడు. ట్రాన్స్ఫరైనప్పటి నుండీ లెక్కలేసుకుంటూనే ఉన్నాడు రహీమ్. తక్కువ కాలం వెదుకులాటలో మూడంతస్తుల పైన ఇల్లు దొరికింది. ఊపిరి పీల్చుకున్నాడు రహీమ్.

చిన్న చిన్న ఊళ్లలో అందరూ చక్కగా మాట్లాడేవాళ్లు . ఇప్పుడిక ఎవరైనా మాట్లాడతారో లేదోనని బెంగగా వుంది రెహానాకి. మొత్తానికి వాళ్లు లారీడు సామానుతో సహా దిగిపోయారు. ఆ మూడంతస్తుల మెట్లెక్కుతుంటే చిన్నప్పుడు  చార్మినార్ మెట్లే గుర్తొచ్చాయి ఆమెకి. ఇంకా ఎన్ని మెట్లెక్కాలి? అన్నట్లు కోపంగా చూస్తుంది మాటిమాటికి. కిందవాళ్ల వాటా ముందునుంచే మెట్లెక్కాలి. మెట్ల పక్కన తులసికోట. ఒక మూల పిల్లి ఒకటి అరమోడ్పు కళ్లతో పడుకుని ఉంది. వీళ్ల అలికిడికి కళ్ళు తెరచి చూసి కూడా చూడనట్లు నిర్లక్ష్యంగా పొర్లింది వెల్లకిలా.

శనివారం, ఆదివారం రెండ్రోజులు  ఇంట్లో సామాను సర్దుకోవడంతో సరిపోయింది ఇద్దరికీ. బయట పూలకుండీలను సరిగ్గా కొంచెం ఎండ తగిలేలా ఉంచింది రెహానా. చుట్టు పక్కల పరిసరాల్ని గమనిస్తే ఎవరూ ఎవర్నీ పట్టించుకోని పరిస్థితి కనప్డింది రెహానాకి. భర్త ఆఫీసుకెళ్లాక తను ఒంటరేనని అర్ధమైంది ఆమెకి.

మొదటి వారం రోజులు బద్ధకంగా గడిచాయి. మళ్లీ ఆదివారం వచ్చింది. రహీమ్ మంచి మాంసం అర కిలో తెచ్చాడు. స్టౌ మీద తుకతుక ఉడుకుతూ చుట్టుపక్కలకి ఘుమఘుమ వాసనల్ని వెదజల్లుతుంది కూర. కొద్దిగా మసాలా, కొతిమిర వేసి దించేసింది రెహానా.

మధ్యాహ్నం అన్నం తిని ఎక్కడికో వెళ్లాడు రహీమ్. ఆమె ఒక్కత్తే ఉంది.

ఇంతలో కిందింటి పిల్లి ‘మ్యావ్’ అనుకుంటూ లోపలికొచ్చింది. ‘ఇష్ష్’ అంటూ బైటికి గెంటింది రెహానా. అది పోయినట్టే పోయి మళ్లీ వచ్చింది. నోరు నొప్పి పుట్టేటట్టు ‘ఇష్ష్! ఇష్ష్!’ అని ఎంతన్నా అది ఇంచు కూడా కదల్లేదు. పైగా తోక చివరి భాగాన్ని ఊపుతూ ఆమె కాళ్లను రాసుకుంటూ తిరగసాగింది. అంతకు ముందు వాళ్లిద్దరికీ ఎన్నో రోజుల పరిచయ బంధం ఉన్నట్లు.

దాని బాధ చూడలేక ఆకలేస్తుందేమోనని, రాతెండి ప్లేట్లో రెండు మూడు పలుచటి మాంసం ముక్కలు, కోస్తున్నప్పుడు పక్కకి పెట్టిన మాంసం తుక్కు అంతా తీసుకెళ్లి బయట పెట్టింది రెహానా. వెంటనే బయటికెళ్లింది పిల్లి. చక్కగా ప్లేటుని  చూసి తినడం ప్రారంభించింది. తిన్న తరువాత రెండుసార్లు అటుఇటు పచార్లు చేసి కిందికెళ్లిపోయింది.

అది మొదలు ప్రతిసారి మాంసం వండినప్పుడల్లా పిల్లి రావడం, రెహానా మాంసం పెట్టడం అలవాటైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆదివారం పిల్లి ప్లేట్లో మాంసాన్ని విదారగిస్తుంది. కిందింటి పిల్లి యజమాని మందపాటి చద్దర్లు డాబాపై ఆరేసుకోవడానికి వచ్చింది. ఆవిడ రెహానా వాళ్లింటి ముందు నుంచే పైకెళ్లాలి కాబట్టి యాదృచ్చికంగా వచ్చి పిల్లిని చూసింది.

దాని ముందున్న ముక్కలని చూసింది. వచ్చినంత వేగంగా కిందికి వెళ్లిపోయిందామె.

“ఏమైనా మర్చిపోయిందేమో” స్వగతంగా అనుకునేలోపు కిందనుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. ఏమిటా అని రెహానా నాలుగు మెట్లు కిందికి దిగింది. రెహానాని చూసి మొహం తిప్పుకుంటూ ఆవిడ “ఇన్ని రోజులూ చక్కగా పాలు, పెరుగూ  పోసి పెంచాను. చండాలపు తిండి పెట్టి మా పిల్లిని అపవిత్రం చేసిందే. అయినా వెనుకా ముందు చూసుకో అక్కర్లా? ఎవరి పిల్లి  ఏంటి అని? మా ఇంట్లో పిల్లలతో సమానంగా పెరిగిన పిల్లి. మడీ, ఆచారం అన్నీ ఔపోసన పట్టిన పిల్లి అది. ఇన్నాళ్ల దాని నిష్టని ఒక్క రోజులో గంగలో కలిపింది కాదు. అయినా ఆ ఓనర్‌కి ముంధునుంచీ చెప్తూనే ఉన్నాం తురకలకి అద్దివ్వద్దనీను. అయినా వింటేనా.. వెధవకి డబ్బు ఆరాటం. అయినా రానీ. అతని సంగతీ తేలుస్తాను” చేతులు తిప్పుతూ ఆవిడ రెహానాని కడిగేసింది ఇంకా చాలా మాటలతో.

పిల్లి తన వంక పాపం అన్నట్లు చూస్తున్నట్టనిపించింది రెహానాకి.

“అది కాదండీ.. నాకు తెలీక” అని రెహానా ఏదో చెప్పబోయేంతలో “దాక్షాయణి ఏం జరిగిందే? రమ్మని పిలిచావూ.. వచ్చేలోగా ఎక్కడికి వెళ్లావు? ఏమిటా గలాటా? అలగా జనంలాగా.. ముందు ఇంట్లోకి  తగలడు” అనుకుంటూ బైటికొచ్చాడు వాళ్లాయన.

ఆమె రుసరుసలాడుతూ నావైపు , పిల్లి వేపు కూడ అసహ్యంగా చూస్తూ లోపలికి వెళ్లిపోయి కోపంగా తలుపేసుకుంది. ఆమె వెనుకే లోపలికి వెళ్లబోయిన పిల్లి ఏమీ అర్ధం కాక నిలబడిపోయి “మ్యావ్” అంది దిగులుగా..

 

 

+++++++++++++++++++

 

కూరగాయలు కొందామని కిందికి దిగుతుంది రెహానా. పిల్లి దాక్షాయణి వాళ్ళ గడపదాటి లోపలికెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దాని సామ్రాజ్యం కదా మరి. సుడిగాలిలా దూసుకొస్తుంది ఆమె.

“అప్రాచ్యపు ముండా! ఏం మొహం పెట్టుకుని వస్తావే ఇంట్లోకి. నువు మలినమైపోయింది కాక మమ్మల్ని కూడా మలినం చేద్దామనే.. ఫోవే.. చీ.. పో! అవతలికి, నీకివాళనుంచి అన్నం లేదు సున్నం లేదు” అంటూ నిర్దాక్షిణ్యంగా పిల్లి ఇవతలికి కట్టేముక్కతో నెట్టి తలుపులు ధడేల్మని వేసుకుంది దాక్షాయణి.

ఆవిడ తిట్టింది పిల్లినా, తననా … అనుకుంటూ  కిందికెళ్లిపోయింది  రెహానా.

ఆ రాత్రంతా పిల్లిని గురించి ఒకటే కలలు రెహానాకి.

విచిత్రంగా కొన్ని పిల్లులు జందెం వేసుకుని ఉన్నాయి. జందెం వేసుకున్న పిల్లులు వేసుకోని పిల్లుల మీదికి యుద్ధానికొస్తున్నాయి. యుద్ధంలొ ఎవరు గెల్చారో ఓడారో తెలీదు.

మొత్తానికి ప్రతీ పిల్లికీ గాయమై రక్తం కారుతుంది. అది కూడా జీవహింసే కదా.. కలవరిస్తుంది రెహానా. ఆ  యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె పిల్లుల మీద పరిశోధించి పురాతన గ్రంధాలు చదివి శోధించి విలువైన పరిశోధనా వ్యాసాలు రాసి  పత్రికలకు పంపి పుస్తకంగా వేసింది.

ఒక సంఘం వారు పిలిస్తే పిల్లుల గురించి సభలో ఇలా మాట్లాడింది. “పిల్లులన్నీ మాంసం తినేవే. కానీ కొన్ని కొన్ని పిల్లులు కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని మానేసినై. అన్నీ ఒక్కలాగే ఎందుకుండాలి. వాటికంటే మనం గొప్పవిగా కనపడాలని. అయితే వాటి జీన్స్‌లో మాంసం తిన్న ఆనవాళ్లు ఆ కోరిక గుప్తంగా ఉండి అవకాశం  వచ్చినప్పుడు బయట పడతాయి” ఆమె ఉపన్యాసం ముగియకుండానే వేదిక నాలుగువైపుల నుండీ జందెం పిల్లులు దాడి చేశాయి. వేదిక కూలి రెహానా మీద పడింది.

కెవ్వుమని అరిచింది రెహానా. ఆమె అరుపులకి ఆమే భయపడి దిగ్గున లేచి కూర్చుంది.

పక్కన వాళ్లాయన గండు పిల్లిలా చూస్తున్నాడు మొహంలో మొహం పెట్టి.

“ఏంటా అరుపులు! ఎవరైనా వింటే పొద్దున్నే తాగి గొడవ చేస్తున్నాననుకుంటారు.. రాత్రంతా పిల్లులు కొట్లాడినట్లు నా మీదికి కాళ్లు చేతులు విసిరింది కాక.. హారర్ సినిమాల్లో లాగా కెవ్వుమని అరవడాలేంటి?” విసుక్కున్నాడు రహీమ్.

ఆఫీస్ ఏర్పాట్లు అన్నీ అయ్యాక రహీమ్ వెళ్లిపోయాడు. చిన్నగా రెండు మెట్లు  దిగి తొంగి చూసిన రెహానాకి అక్కడ పిల్లి ముందు ప్లేటు ఎండిపోయి కనబడింది.

పాపం అది రాత్రంతా ఏమి తినలేదులా ఉంది అనుకోగానే మనసంతా బాధతో నిండిపోయింది రెహానాకి.

మధ్యాహ్నం సమయంలో వాకిలి ముందు ఏదో కదలాడుతున్నట్టుగా ఉంటే.. చూస్తే  పిల్లి. నీరసంగా ఉన్నట్లుంది అరుపు సరిగా రావడం లేదు. గబగబా ఇంట్లో ఉన్న ఎండురొయ్యలు తెచ్చి ప్లేట్లో వేసి పెట్టింది. ఆబగ తినేసింది పాపం పిల్లి. ఇంక అది ఆమె వెనుకే తిరగసాగింది. తర్వాత కుండీల పక్కన మంచి ప్రదేశం చూసుకుని ఆరామ్ గా నిద్రపోయింది.

ఆ రోజు నుండి దాక్షాయణి ఇంటిముండు ఎన్నడూ తచ్చాడుతూ కనబడలేదా పిల్లి.

 

 -షాజహానా

Download PDF

17 Comments

 • షాజహానా …చాలా రోజులకు ‘ బిల్లీ’ రూపం లో దీదార్
  సారంగ కు షుక్రియ .
  “ఆ రోజు నుండి దాక్షాయణి ఇంటిముండు ఎన్నడూ తచ్చాడుతూ కనబడలేదా పిల్లి.” దటీస్ -షాజహానా :)

 • రెహమాన్ says:

  “పిల్లులన్నీ మాంసం తినేవే. కానీ కొన్ని కొన్ని పిల్లులు కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని మానేసినై. అన్నీ ఒక్కలాగే ఎందుకుండాలి. వాటికంటే మనం గొప్పవిగా కనపడాలని. అయితే వాటి జీన్స్‌లో మాంసం తిన్న ఆనవాళ్లు ఆ కోరిక గుప్తంగా ఉండి అవకాశం వచ్చినప్పుడు బయట పడతాయి” ఇది రచయిత కరడుగట్టిన అంతరంగం మాత్రమే … నిజం కాకపోవచ్చు .

 • ఎశాల శ్రీనివాస్ says:

  ఇదీ నిజం -సంపూర్ణ మానవ ఆవిశ్కరనలో – మున్గాల్లు చేతులు గా మారటం – కాలిన మాంసం త్తిన్న తర్వాతే మానవ మెదడు అభివృద్ధి జరిగింది అనేధీ మనవాభివృద్ది శాస్త్రం చెబుతుంది. సమాజాభి వృద్ది క్రమంలో తమ ఆధిపత్యం కోసం చతుర్వర్ణం – కులాలు వచ్చినట్లే, ఆహార రాజకీయాలు వచ్చి చేరి కొన్ని కులాలను, మతాలను తక్కువ, హీనంగా చూడటం మొదలెట్టి ఆధిపత్య స్తిరీకరణను చేకున్నై. …….ఈ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టే ఈలాంటి కథ రాసిన షాజహానా గారికి – సాహిత్యాభి నందనాలు
  -ఇంకా లోతుగా కథను పర్శీలించే అవకాసం కూడా ఉంది

 • రెహమాన్ says:

  అయివుండచ్చు .. వర్ణ వ్యవస్థ తో రాలేదు.మనిషి ఆరోగ్య పరిశోధనలో వచ్చింది.కానీ అవకాశం ఉండీ తినని వాళ్ళు చాలామంది ఉన్నారు.కారణం వాళ్లకి సహించక పోవడమే..అలాగని శాకాహారులని తక్కువ చేయకూడదు కదా.. ఒక వ్యతిరేక భావనతో కథ రాసుకుని అందరికి తినాలని ఉంటుంది అంటే ఎలా? ఈ భావనతో ఏకీభావించలేము. ప్రస్తుత సైన్సు శాకాహారం మంచిది అని చెప్తోంది. విదేసియుల్లో కూడా చాలా మంది శాకాహారులు ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి.

 • Vijaya Bhanu Kote says:

  సూటిగా తగిలే కథ ఇది :) చాల బాగా రాసారు షాజహానా

 • మంఛి కథే కాకపోతే కాస్త ఔట్ డేటెడ్..!! మైనార్టీ కథలు ఇప్పుడు ఎదిగిన ఎత్తులకి ఇంకా చాలా కిందే మిగిలిపోయిన కథ. ఇలా రెండు సామాజిక వర్గాల మధ్య వున్న వ్యత్యాసాలను ఎద్దేవా చేస్తూ రాసే కథలను చాలా కాలం క్రితమే దాటేశామని నా అభిప్రాయం.

 • యాజి says:

  భలే చమత్కారంగా ఉంది! నేను సంపూర్ణ శాకాహారినైనా, నాకేం ఎవరినీ ఎద్దేవా చేసినట్లుగా అనిపించలేదు: వాస్తవికతకు దగ్గరగా, కొంచెం భుజాలు తడుముకొనేటట్లు చేసినా!

 • skybaaba says:

  ‘అరిపిరాల’ వారు అంత సులభంగా ఇచ్చిన స్టేట్మెంట్ కి ఆశ్చర్యం వేసింది. సమాజంలో ఇంకా పచ్చిగా ఉన్న సమస్య అది. ఇంతదాకా ఆ విషయం పై ఎక్కువ కథలే రాలేదు. ”బిల్లి’ కథ మంచి కథలుగా భావించే ఇప్పటి 10 కథలతో సమానమ్” అని మొన్నే నాతో బల్లెడ నారాయణ మూర్తి అనే కథకుడు అన్నాడు.. అలాంటి సబ్జెక్టు అంత డైరెక్ట్ గా, అంత సులభంగా రాయడం బాగుందన్నాడు.. ఆ సబ్జెక్టు మీద కథలు రాయడానికి ఇష్టపడని వారు ఇలా మాట్లాడేయడం సరి కాదేమో.. పైగా తాము రాస్తున్న కథలే అవుట్ డేటెడ్ ఏమో ఒకసారి చెక్ చేస్కుంటే మరీ మంచిది. సమాజంలో ఉన్న అసలైన సమస్యల్ని వదిలి పై పై కథలు రాసేవాళ్ళు పెట్టే విమర్శల్ని ‘బహుజన కథలు’ రాసేవాళ్ళు పట్టించుకోవద్దని మనవి…
  ఇక రహమాన్ మాంచి శాకాహారి అనుకుంటాను. పాపం ఆయనకు ఎక్కడో తాకినట్లుంది ఈ కథ. బాధ పడకండి రహమాన్ శర్మ గారూ..!

  • chitra says:

   స్కై బాబా గారూ నమస్తే . అభిప్రాయ ప్రకటన మంచిదే . షాజహానా గారు రాసి ప్రపంచం మీద వదిలిన తర్వాత అందరికీ కూడా అభిప్రాయ ప్రకటన స్వేఛ్చ ఉందని నేను గుర్తిస్తున్నాను . అరిపిరాల వారి మీద మీ వ్యంగం నాకు అర్ధం అయ్యింది . కానీ రహమాన్ గారి మీద మీ విసురు అర్థం కావడానికి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను మాట్లాడడం. తప్పేముంది మీ వ్యంగ్య శక్తి కి నా ప్రత్యెక అభినందనలు. బ్రాహ్మలని మించిన వర్గ శత్రువులు ముస్లిం సోదరులకు లేరని తెలిసింది . చిత్ర

   • skybaaba says:

    చిత్ర గారు,
    రెహమాన్ అనేది దొంగ పేరు అని అర్ధం కావడం లేదూ..
    అందుకే అలా పెట్టా..

  • రెహమాన్ says:

   బాబూ..skybaba.. నీకు అలా అనిపించిందా..? پاگل نہیں، آدمی !

 • రెహమాన్ says:

  శాకహారిని శర్మ ని చేసారు skybaaba గారు?

 • షాజహానా. మనిషి లోపని అంతరంగాన్ని పట్టి ఇచింది ఈ కథ. నాకు సాహిత్యం తో ఎక్కువ పరిచయం లేదు కానీ ప్రొఫెసర్ వీణ శాత్రుగ్న తో పరిచయం ఉంది. ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గ పని చేస్తున్నారు. ఆవిడ ఏమంటారంటే ‘భారత దేశం లోని పెద్ద వారిలోని మాల్ న్యూట్రిషన్ అధిగమించాలంటే తప్పకుండ ఆవు మాంసం అందరు తినాలి’

 • karthik ram says:

  మంచి కథ ., తురకలు అనుభవించే ఇంటి కష్టాలు స్వయం గా చూసా నేను ., ఇప్పటికి రోజుకి 50 రూపాయల తో రోజువారి దినుసులు కొనే వారు నాకు తెలుసు ., దళితుల కన్నా వీరు చాల కింద స్తాయిలో వున్నారు . కాలం మారింది కాని భాద అలాగే వుంది .

 • Raj says:

  శాఖా హారం మనిషి లోని భగవంతుని బయటకు చూపెడుతుంది. (“నేను శాకహారిని కాను , బ్రాహ్మణున్ని అంత కంటే కాను “). ఇక్కడ మా అమెరికాలో ఖరగారం లో ఖైదీలకు శాకాహారం ఇస్తున్నారు ఇది చాల రీసెర్చ్ చేసిన తరువాత. శాకాహారం క్రైమ్ ను నిరసిస్తుంది. మనిషిని కొట్టాలి , చంపాలి అనే ఆలోచనలు దరికి రానివ్వవు. మతం మనిషి చే తాయారు చేయబడింది కాబట్టి మన భాద్యత ఏమంటే దానికి మంచి ని కలుపుతూ, మనవ జాగృతి ని పెంచుకొంధం. కథలను కథలు గా నే చూడాలి మళ్ళీ కథలను కథలు గా నే వ్రాయాలి.

 • zareena begum says:

  బిల్లీ కథ చాల బాగుంది చాల సహజంగా ఓ సంగటనల సాగి పోయింది చాల తక్కువ రచనల్లో ఇంత సహజత్వం కనిపిస్తుంది.కంగ్రాట్స్

 • Kiran Vibhavari says:

  ఇక్కడ శాఖాహారం మంచిదా కాదా అనేది సమస్య కాదు..రచయిత్రి చెప్పదలుచుకున్నది వేరే. శాఖాహారం తినే వర్గం వారు తినని వారిని ఏ విధంగా చూస్తున్నారు. ఒక మతం వారి మీద యెటువంటి prejudice ఉన్నాది అనేది ఇక్కడ అంశం.
  రచయిత్రి చాలా బాగా రాశారు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)