అందరి కుటుంబాలనీ ఆదుకోవడమే ఆయన జీవితాదర్శం….

మా అమ్మ, నాన్న గారు

మా అమ్మ, నాన్న గారు

1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర గ్రామం) మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయారు. దానితో సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. ఆ తరువాత మరొక ముఫై ఏళ్ళు మా బంధువులందరి కుటుంబ బాధ్యతలనీ ఆయనే తన సర్వశక్తులూ ఓడి, ఎక్కడా ఓడకుండా నిండు కుండలా అందరినీ గట్టెక్కించి, అందరికీ జీవితంలో మంచి బాటలు వేసి నడిపించి, ఆఖరి రోజులలో మా కళ్ళ ముందే అలసి పోయి సొలిసి…పోయారు మా నాన్న గారు. మా పెద్దమ్మాయి పుట్టిన కబురు తెలిసాక, అమెరికాలో పుట్టిన మొట్టమొదటి మనవరాలు ఎలా ఉంటుందో అనే కోరిక తీరకుండానే 1983 లో ఆయన పోయారు. అప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్ళు. ఆయనే మా “బాబయ్య గారు”. మా కుటుంబంలో నాన్న గారిని బాబయ్య గారు…(బాబయ్యారు) అని పిలవడం అప్పుడు అలవాటు. మా నాన్న గారు మా పిల్లలు ముగ్గురిలోనూ ఎవరినీ చూడ లేదు. కన్న తండ్రికి కన్న పిల్లలని కూడా చూపించ లేక, ఆఖరి క్షణాలలో ఆయన్ని చూడలేని ఈ “త్రిశంకు స్వర్గం” లో నా పరిస్థితిని తల్చుకున్నప్పుడల్లా “ఈ అమెరికా ఎందుకు వచ్చాం రా” అని మధన పడుతూనే ఉంటాను.

మా తాత గారు సంపాదించిన ఆస్తిపాస్తులు, చేసిన దాన ధర్మాల వాగ్దానాలు అన్నీ ఏకైక కుమారుడిగా ఆయనకి వారసత్వ బాధ్యతలుగా రావడం, వాటిని ఆయన మన:స్ఫూర్తిగా స్వీకరించి సంపూర్తిగా నిర్వహించడమే మా నాన్న గారి జీవితానికి నిర్వచనం. ఆయన చెయ్య లేని పని ఒకే ఒక్కటి. ఆ ప్రస్తావన తరువాత తెస్తాను. మా తాత గారు సూర్య ప్రకాశ రావు గారు పుట్టినప్ప్పుడే తల్లిని పోగొట్టుకుని, బీదరికం అనుభవిస్తూ, మేనమామ కుంటముక్కల హనుమయ్య గారి ప్రాపకం, పిఠాపురం రాజా వారి ఆర్ధిక వేతనాలతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, తరువాత మద్రాసు లా కాలేజీ లో చదువుకునే రోజులలోనే మా బామ్మ గారు (కాట్రావులపల్లి) ఆది లక్ష్మి మాణిక్యంబ గారిని పెళ్ళి చేసుకున్నారు.

మా అమ్మ,, నాన్న గారి పెళ్లి సుభ లేఖ

1900  లో ఆయన కాకినాడ లో కృతివెంటి పేర్రాజు పంతులు గారి దగ్గర జూనియర్ లాయర్ గా చేరారు. ఆలస్యంగా చదువు మొదలుపెట్టడం వలన అప్పటికే ఆయన వయస్సు ముఫై దాటింది. తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో ఆయన కాకినాడలో ఇప్పటి గాంధీ నగరంలో (అప్పటికి అది పిఠాపురం రాజా వారి పేరిట వెలిసిన రామారావు పేట.) ఒక్కొక్కటే 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు.  ఆ తరువాత ద్రాక్షారామం దగ్గర ఇంజరం గ్రామంలో 40 ఎకరాలు పొలం కొని దగ్గర బంధువు ఒకాయనకి (పండ్రవాడ గవర్రాజు) యాజమాన్యం ఇచ్చారు. కానీ, మా తాత గారికి స్వగ్రామమైన దొంతమ్మూరు గ్రామం మీద ఉన్న అభిమానంతో అక్కడ 350 ఎకరాలు ఒక్క సారిగా అమ్మకానికి రావడంతో, పైగా అది హనుమయ్య గారి మిరాసీ పక్కనే ఉన్న భూమి కావడంతో మా తాత గారు ఆ పొలం కూడా మార్చ్ 30, 1922 నాడు కొన్నారు.   బొబ్బిలి సంస్థానానికి చెందిన ఎస్టేట్ లో ఒక భాగమైన ఈ పొలానికి వారి బంధువులైన చెలికాని ధర్మారాయణం గారి దగ్గర ఈ పొలం కొన్న దగ్గర నుండీ మా తాత గారికి లాయర్ వృత్తి మీద శ్రద్ధ తగ్గి వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది.

ఆ ఆసక్తితో బొబ్బిలి రాజా గారి దగ్గర మామిడి తోటలు వెయ్యడానికి మరొక 1000  ఎకరాల బంజరు భూములకి పట్టా మా తాత గారు కౌలుకి తీసుకున్నారు.  కేవలం మూడు, నాలుగేళ్ల సమయంలో అత్యధికంగా ఆర్ధిక పెట్టుబడి పెట్టి, వ్యవసాయం లో అనుభవం లేని మా తాత గారు ఆ సమయంలో దురదృష్టశాత్తు  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక మాంద్యంలో—ది గ్రేట్ డిప్రెషన్ – లో తను కూడా కూరుకుపోయారు.  సుమారు 1923 మా బాబయ్య గారు నుంచి  1940  దాకా మా తాత గారు విపరీతమైన ఆర్ధికపరమైన కష్టాలు పడ్డారు.

కానీ మొండి పట్టుదలతో, అకుంఠితమైన దీక్షతో, అన్ని ఆర్ధిక లావా దేవీలనీ అధిగమించారు. కుటుంబ బాధ్యతలను అన్నింటినీ పరిపూర్తిగా నిర్వహించారు. అందులో ఏకైక కుమారుడిగా మా నాన్న గారి సహకారమూ, సమర్ధవంతమైన నిర్వహణా లేక పోతే ఈ నాడు ఆ కుటుంబాలన్నీ ఎలా ఉండేవో నేను ఉహించనే లేను.

1907 లో కాకినాడలో పుట్టిన మా నాన్న గారు అక్కడే చదువుకున్నారు.  మా తాత గారు 1921 లో కొన్న నాలుగేళ్ళకి  1925 లో స్థలంలో ముందుగా ఆగ్నేయం మూల ఒక ఐదు గదుల చిన్న ఔట్ హౌస్ కట్టుకుని ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 1926 లో పెళ్లి అయ్యాక,  మా అమ్మ ఆ ఇంటికే  1930 ప్రాంతాలలో కాపరానికి వచ్చింది. వారి పెళ్లి శుభ లేఖ ఇందుతో జతపరుస్తున్నాను. మా నాన్న గారు, చదువుకొంటున్నా, మా తాత గారికి నిలదొక్కుకొనడంలోనే సహాయం పడడంలోనే ఎక్కువ సమయం గడిపే వారు. కాకినాడ తరవాత, మద్రాసు, త్రివేండ్రం లలో చదువుకుని 1937 లో మా నాన్న గారు లా డిగ్రీ పూర్తి చేసి మా తాత గారికి చేదోడు వాదోడుగా ఉండడానికి కాకినాడలో ప్రాక్టీస్ పెట్టారు. ప్రాక్టీస్ పెట్టారన్న మాటే కానీ. ఆయన జీవితానికి ఏకైక  ధ్యేయం మా తాత గారిని అన్ని కష్టాల నుంచీ గట్టేక్కించడమే.  అందుకు అన్ని కోర్టు తగాదాలు పరిష్కరించడం, ఆస్తి పాస్తులు నిలబెట్టుకోవడం, , మా తాత గారు బంధువులకి చేసిన వాగ్దానాలని నెరవేర్చడం , అంతే గాక, మమ్మల్ని..అంటే తన సొంత తొమ్మండుగురు పిల్లలనీ పెంచి, పెద్ద చేసి చదివించడం, పెళ్ళిళ్ళు చెయ్యడం…వీటన్నింటి తోనే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. అటు మా అమ్మ కూడా మా అమ్ముమ్మకీ, మూర్తి రాజు తాత గారికీ ఏకైక సంతానం కావడంతో మా అమ్మ కి సంక్రమించిన సారవంతమైన జేగురు పాడు పొలాలు కూడా మా నాన్న గారే చూడ వలసి వచ్చేది. అలాగే 1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయినప్పుడు సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. టూకీగా చెప్పాలంటే మా నాన్న గారు ఒంటి చేత్తో, మూడు దూర గ్రామాలలో (గొల్లప్రోలు దగ్గర దొంతమ్మూరు పొలాలు, ద్రాక్షారం దగ్గర ఇంజరం, రాజమండ్రి దగ్గర జేగురు పాడు) విసిరేసినట్టు ఉన్న 2000  ఎకరాల వ్యవసాయం, చేసి, అప్పులు తీర్చడానికి దూరంగా ఉన్నవి అమ్మేసి, మా తాత గారి కోరిక ప్రకారం తన ఐదుగురు అప్పచెల్లెళ్ళ కుటుంబాలని, ఇతర బంధువులకీ తానే పెద్ద దిక్కుగా ఆదుకోవడం, వారి పిల్లలని చదివించడం, అన్నింటినీ మించి మా తొమ్మండుగురినీ పెంచి పెద్ద చేసి, మా కాళ్ళ మీద మేము నిలబడేలా తీర్చి దిద్దిన మా నాన్న గారికి ఎన్ని జీవన సాఫల్య పురస్కారాలు ఇస్తే సరిపోతుంది?  ఎన్ని నోబుల్ బహుమతులు, ఆస్కార్ లు ఇస్తే ఆయన అప్రకటిత విజయాలకి సరితూగుతాయి?

నాకు తెలిసీ మా నాన్న గారు ఎప్పుడూ ఎక్కడికీ “వెకేషన్ ‘ కి వెళ్ళ లేదు. పొలాలు చూసుకోడానికి గుర్రం మీదో, గుర్రబ్బండి మీదో వెళ్ళే వారు. రోజుల తరబడి చెట్ల కిందనే కేరేజ్ లో వచ్చిన అన్నం తిని, నిద్ర పోయే వారు. కనీసం ఒక సారి ఆయన గుర్రం మీద నుంచి కింద పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నా చిన్నప్పుడు ఆ గురబ్బండి అవశేషాలు మా తోటలో ఉండేవి. మా తాత గారివీ, బామ్మ గారివీ అస్తికలు కలపడానికి కాశీ వెళ్ళారు కానీ, మా నాన్న గారు తన కర్తవ్యాలని విస్మరించి పుణ్యం కోసం పాకులాడడానికి సకల తీర్దాలు సేవించ లేదు. ఇంట్లో కూడా వినాయక చవితి లాంటి పండగలే తప్ప చీటికీ, మాటికీ వ్రతాలు చేసేసి దేవుణ్ణి ఎప్పుడూ ఇబ్బంది పెట్ట లేదు. కథలు, కవిత్వాలు వ్రాయ లేదు.

ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే కాంగ్రెస్ మహా సభలు జరిగినప్పుడు గాంధీ గారు  1923  లో కాకినాడ వచ్చినప్పుడు, మా నాన్న గారు తన మిల్లు బట్టలన్నింటినీ నిప్పుల్లో వేసేసి, అప్పటి నుంచీ జీవితాంతం ఆయన ఖద్దరు బట్టలే కట్టారు. ఆఖరికి కోర్ట్ కి వేసుకునే నల్ల కోటు, గౌను, బౌ, పూజా, పునస్కారాలకీ, ఒకటేమిటీ, అన్నీ ఖద్దరే. ఆయన కట్టుకున్న పంచెలు, కండువాలు కొన్ని నా దగ్గరే హ్యూస్టన్ లో ఉన్నాయి.

ఆడ పిల్లలలకి ఆస్తిలో వాటాలు ఇచ్చే సాంప్రదాయం కానీ, చట్టరీత్యా కానీ లేని ఆ రోజులలో, మా నాన్న గారు తన ముగ్గురు అక్కలకీ, ఇద్దరు చెల్లెళ్ళకీ తగిన వాటాలు ఇచ్చి మా తాత గారి, బామ్మ గారి కోరిక నిలబెట్టారు. అంతే గాక వారందరినీ, వారి పిల్లలనీ మా ఇంట్లోనే ఉంచుకుని చదివించారు. అందులో మా అమ్మ సహకారం నూటికి నూట యాభై  శాతం అని వేరే చెప్పక్కర లేదు. అలాగే మా బామ్మ గారి చెల్లెలు (మా చెల్లంబామ్మ గారు, రాజమండ్రి) కుమారుడు మా నాన్న గారికి వరస కి తమ్ముడుయిన మా సూరీడు బాబయ్య గారినీ, మా చిట్టెన్ రాజు బాబయ్య తో సహా మా తాత గారి సవితి తమ్ముళ్ళ పిల్లలందరినీ మా నాన్న గారే చదివించి, పెళ్ళిళ్ళు చేసారు.

వ్యక్తిగతంగా, మా నాన్న గారికి కొన్ని మంచి, తమాషా అలవాట్లు ఉండేవి. ఉదాహరణకి ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు  ఆ రోజు డబ్బు లెక్కలు ఆదాయం, వ్యయం అణా పైసలతో సహా చిన్న  2 “ x 3 “  కాగితాల మీద ఖచ్చితంగా రాసి చూసుకునే వారు. తేడా వచ్చిందో అయిందే అందరి పనీ! మాకు ఆయన్ని చిల్లర ఖర్చులకి డబ్బు అడగడానికి ఎప్పుడూ  భయమే! ఇప్పటి లాగా వారానికింత “అలవెన్స్” అంటూ ఉండేది కాదు. యాభై మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎలవెన్సా , పాడా? మేము ఎప్పుడైనా పరీక్షలు పాస్ అయి పోయాక స్నేహితులతో సరదాగా సోడాలు తాగడానికి బేడా, పావలా కావలసి వచ్చినప్పుడు ముందు మా అమ్మ చేతో, మా చిట్టెన్ రాజు బాబయ్య చేతో అడిగించే వాళ్ళం. అత్యవసర పరిస్తితులలో ఆయన అలా తోట లోకి వెళ్ల గానే ఆయన డబ్బు పెట్టుకునే పెట్టె తీసి ఆ బేడా, పావలా తీసుకుని పారిపోయే వాళ్ళం. ఇక ఆ రాత్రి ఆయనకి  లెక్క తేలక అందరినీ అడిగి, ఆఖరికి మా దగ్గర నిజం రాబట్టి “అడిగితే ఇవ్వనా?” అని కోప్పడే వారు. అడిగితే ఇస్తారు అని తెలుసు కానీ , అడగడానికే భయం! ఆ రోజుల్లో మా చిన్న పిల్లల మనస్తత్వాలు, పెద్ద వాళ్ళంటే ఉండే భయభక్తుల గురించి మా అమెరికా పిల్లలకి నేను ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్లకి అర్ధం కాదు.

ఇక మా తాత గారు చుట్ట కాల్చే వారు కానీ మా నాన్న గారికి ఆ అలవాటు కూడా లేదు. ఆయనకున్న ఒకే అలవాటు పనులన్నీ ఆఖరి క్షణం దాకా వాయిదా వేసి వారు. నాకు కూడా అదే ‘అలవాటు’ వచ్చింది. ఆఖరికి కోర్ట్ లో వెయ్య వలసిన దావాలు, ప్రతి వాదాలు, అర్జీలు అన్నీ కూడా రేపు “కాల దోషం” పట్టిపోతుంది అనే దాకా ఆలోచిస్తూనే ఉండే వారు. ఆ ముందు రోజు రాత్రి దస్తావేజు రాసే వారు. ఇది నాకు ఖచ్చితంగా ఎందుకు తెలుసు అంటే ..నాకు వయసు వచ్చాక అర్ధరాత్రి దాకా నేను కూడా ఆయన  గదిలోనే కూచుని ఆయన వ్రాసిన దస్తావేజులు చదివి ..తప్పులు దిద్దేవాడిని. …ఎందుకంటే “రాజా గాడికి తెలుగు, ఇంగ్లీషూ రెండూ బాగా వచ్చును.” అనే వారు మా నాన్న గారు. అప్పుడప్పుడు ఆయన వాడి, నేను ప్రతివాదిగా రిహార్సల్స్ కూడా చేయించే వారు. అవన్నీ నా జన్మలో మర్చిపోలేని జ్జాపకాలు.

మా నాన్న గారికి మరొక తమాషా అయిన అలవాటు ఉండేది. అదేమిటంటే ఎప్పుడైనా ఏ బజారుకో ఇంకెక్కడికైనా వెళ్ళవలసి వస్తే, ఖద్దరు పంచ, కండువా వేసుకుని శుభ్రంగా తయారు అయి వీధి గుమ్మం దగ్గర నుంచునే వారు. ఆయన్ని చూడగానే మా పేటకి కొత్తగా వచ్చిన ఓ రిక్షా వాడు బేరం కోసం ఆగే వాడు. “బజారుకి ఎంత?” అని వాణ్ణి అడిగి, “లేదులే, నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఉత్తినే అడిగాను “ అని పంపించేసే వారు. వాడు బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయే వాడు. అలా ఆయన వీధి గుమ్మం దగ్గర కనీసం గంట నుంచుని వచ్చే, పోయే ట్రాఫిక్ నీ, జనాల్నీ చూస్తూ, ఆ తరువాత ఏ ఖాళీ రిక్షా వచ్చినా ఎక్కేసే వారు. మా గాంధీ బొమ్మ దగ్గర ఎప్పుడు ఉండే రిక్షా వాళ్లకి ఈయన అలవాటు తెలుసు కాబట్టి, ఆయన వీధి గుమ్మంలోకి వచ్చి నుంచున్న గంట దాకా దగ్గరకి వచ్చే వారు కాదు. “ఒక్క వెధవా రాడేం” అని ఆయన విసుక్కునే వారు. మా నాన్న గారు చాలా అరుదుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జరిగే ఈ తతంగం చాటు మాటు నుంచి చూసి మేము నవ్వుకునే వాళ్లం.

అలాంటి అలవాటే ఇంకోటి ఉండేది మా నాన్న గారికి. అదేమిటంటే పని వాళ్లకి జీతాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు “పెద్దబ్బాయ్ యింకా పొలం నుంచి రాలేదు. వాడు వచ్చాక కనపడు” అనే వారు. పెద్దబ్బాయ్..అంటే మా పెద్దన్నయ్య మా నాన్న గారి దగ్గర వ్యవసాయం చెయ్యడం మొత్తం నేర్చుకున్నాక, మా నాన్న గారు రిటైర్ అయ్యారు. మా పెద్దన్నయ్యే పంటలు అమ్మాక మా నాన్న గారికి సొమ్ము అప్పజేప్పే వాడు. అన్నింటినీ పోస్ట్ పోన్ చేసే అలవాటు ఉన్న మా నాన్న గారు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులకి కూడా మా పెద్దన్నయ్య పొలం నుంచి రాలేదు అని వంక పెట్టె వారు. ఇది అందరికీ సరదాగానే ఉండేది. కానీ, మా పొలాలన్నీ వర్షాధారం పొలాలు కాబట్టి ఒక ఏదు పంటలు పండీ, రెండేళ్ళు పండకా వాటి మీద నుంచి వచ్చే ఆదాయం నిలకడగా ఉండేది కాదు. అమెరికా నుంచి నేనూ, మా తమ్ముడూ ఆర్ధికంగా ఎంత సహాయం చేసినా మా నాన్న గారికి వేరే ఆదాయం లేదు కాబట్టి తన ఆఖరి రోజులలో మానసికంగా ఇబ్బంది పడ్డారు అని నా అనుమానం.

మరొక ఆశ్చర్య కరమైన విశేషం ఏమిటంటే, మా నాన్న గారు తన మొత్తం జీవితంలో మహా అయితే ఐదారు సినిమాలు చూసి ఉంటారు. అందులో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ఒకటే ఆయన చూసిన హిందీ సినిమా.  మా చిన్నప్పుడు ఏ కళని ఉన్నారో ఒక రోజు నన్ను, మా తమ్ముడినీ “ఒరేయ్ ఇవాళ అదేదో రోజులు మారాయ్ అనే వ్యవసాయం సినిమా వచ్చిందిట. చూద్దాం “ అన్నారు. అది వినగానే మేమిద్దరం ఆఘమేఘాల మీద తయారు అయిపోయాం. నేను ఆ రోజు స్పెషల్ కాబట్టి పొట్టి లాగు బదులు పైజామా వేసుకున్నాను. “రిక్షా కుదుర్చుకోడానికి మీకు ఎలాగా గంట పడుతుంది. మీరు వెళ్ళి వీధి గుమ్మంలో నుంచోండి. ఈ లోగా నేను తయారయి వస్తాను అంది మా అమ్మ. మొత్తానికి అందరం రిక్షా ఎక్కాం. మా అమ్మా, నాన్న గారు, మా తమ్ముడూ సీటులో కూచున్నారు. ఇంక చోటు లేక నేను రిక్షాలోనే ముందు ఉన్న ఇనప రాడ్ పట్టుకుని నుంచుని నెహ్రూ గారి లాగ ఫీలయిపోతూ క్రౌన్ టాకీస్ కి వెళ్ళాం. అక్కడ తెలిసింది . రోజులు మారాయ్ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుని అంతకు ముందు వారమే అది వెళ్ళిపోయి “అక్కా చెల్లెళ్ళు” అనే మరొక సినిమా ఆడుతోంది అని. ఇక తప్పక మేము ఆ సినిమా చూసాం. నేను మా నాన్న గారితో చూసిన ఒకే ఒక్క సినిమా అదే! ఆ సినిమాలో రమణా రెడ్డి చేసిన మేజిక్కులు మా నాన్న గారికి నచ్చాయి.

మా బాబయ్య గారు పోయి ముఫై ఏళ్లయినా, కుటుంబ సంక్షేమం, బంధువుల బాగోగులే తన జీవితంగా మలచుకున్న మా నాన్న గారి నుంచి నేర్చుకోవలసినది యింకా చాలా ఉంది. నేను అమెరికా రావడం వలన ఆయనకి ఎక్కువ సేవ చెయ్యగలిగానా, లేక అక్కడే ఇండియాలోనే ఉండిపోయి ఉంటే ఆయన్ని యింకా బాగా చూసుకునే వాడినా అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)