త్రిపుర traits:ఒక జ్ఞాపకపు ఛాయ!

నాటి-నేటి త్రిపుర

tripura_336x190_scaled_cropp

ఎవరైనా సమకాలీన రచయిత గొప్ప అక్షరంగా పరిచయమయ్యాక, నన్ను తరచి తవ్విపోశాక, చెప్పరాని చనువై మనసయ్యాక, ఆ రచయితని వ్యక్తిగతంగా కలవడానికి ఆరాటపడను. తీరా కలిస్తే- సిరా మరకలు కూడా అంటని కుదురైన జమాబందీలానో, మహా పోతరం కమ్మిన ఆరోగ్య సూత్రంలానో, అతి భద్రమైన జీవిత బీమాలానో, ఫక్తు డీఏ ఎరియర్‌లానో, జున్ను ముక్కల్ని దాష్టికంగా కప్పెట్టిన మిరియాల పొడిలానో ఎదురవుతాడేమోనన్న జంకు వల్ల కావచ్చు; లేదా దురద పుడితే నాలానే గోక్కుంటున్నాడేమిటన్న లౌకిక విస్మయాలతో సదరు రచయిత (కవి) చవకవుతాడేమోనన్న నా వెరపు వల్ల కావచ్చు- నాలోకి తెగబడిన రచయితని బయట కలవాలని ఎగబడను.

కానీ త్రిపురని కలుసుకోవాలని ఆత్రపడకపోవడానికి పై శంకలేవీ కారణాలు కాదు; వస్తు-రూప ద్వంద్వానికి అంతు చిక్కని, నెపం వంటి కేవల రూపాన్ని మించి ప్రచ్ఛన్నంగా పరుచుకొని సారమై నిలిచిన త్రిపుర రాతల లోంచి ఆయన మూర్తిమత్వాన్ని ఊహిస్తూ… గుట్టలుగా పోగుపడ్డ నా appraisals  వల్లనే ఆయనని కలవాలని వెంపర్లాడలేదు. ‘త్రిపుర ఎలా ఉంటారు?’ అన్న ప్రశ్న త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది.

“మెత్తగా నల్లగా చుంచులాంటి ముఖాలు. రహస్యంగా నక్కలాంటి ముఖాలు. అప్పుడే చంపిన గేదెని చీరుతున్న పులి ముఖాలు. దుమ్మలగొండి ముఖాలు. బెదిరిన కుందేలు ముఖాలు. సన్నగా పగగా పాము ముఖాలు. మార్కోవిచ్ సిగరెట్ ప్యాకెట్ మీద ముఖం లాంటి ముఖాలు. డిటెక్టివ్ ముఖాలు. దొంగ ముఖాలు.”

బింబం మాటున సత్యాన్ని అద్దం వెనక వార్నిష్‌ని గోకి తెలుసుకోవాలన్న ఆయన ఉత్సుకతకి అక్షరాలై బద్దలైన అద్దంలో మన ఇన్నిన్ని ముఖాలు చూపెట్టిన త్రిపుర ముఖం ఎలా ఉండి ఉండొచ్చు?

-బిత్తరపడి చేజారిన బాల్యంలోంచి చేజేతులా చేసుకున్న యవ్వనానికి పారిపోయిన కాలనాగు శేషాచలపతి. ‘మృదువైన కాంతిలో పడగెత్తి నాట్యం చేసే’ నాగుబాము శేషు convulsive స్ఫురద్రూపంతో వణికిస్తుందా?

-గదుల్లో ఇమడని ధ్యానం, చింతన చినబోయిన మౌనం, దారులు ఒగర్చే యానం- భాస్కరం. అనుభవాలు అంటని, రంగులు ముంచని, మనసు మళ్లిన ‘ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రొఫెట్’ భాస్కరం ఒంటరితనంలా వణికిస్తుందా?

-పోటీ… పొగరు… పంతం… పరుగు… పాముల నిచ్చెన్ల బండ బతుకు కొత్త altruistic  గమ్యాల దిశగా తీసుకున్న యూ టర్న్- వీరాస్వామి. ‘పసుపు కాని, ఆకుపచ్చ కాని, మిరమిట్లు గొలపని, నాలుగు ముఖాల అందం’- జర్కన్ వంటి వీరాస్వామిలా విలువ, ఖరీదు అర్థం కానట్టుంటుందా?

-‘కనిపించని ద్వారం’మీద దిష్టిచుక్క కాదు, నిన్నలోకి నెర్రెలిచ్చిన తలపోతల అద్దంలో ‘పాపిటి దగ్గర గరుకు నల్లటి పుట్టుమచ్చ’ మాత్రమే కాదు, కొంకర్లుబోయిన ముఖంలో కవళికలు మారినా కాంతి తరగని కళ్ల కింది నల్లని వలయం- నారాయణ. కెరటాల హోరులో బదుళ్ల నిశ్శబ్దాన్ని భరించలేకి ఆ ప్రళయ తరంగ తాండవంలోకి జారిన నారాయణ ఒకానొక బుడగై చిట్లినట్టుంటుందా?

-‘పిలకలు, కిర్రుచెప్పులు, చెవులకి కుండలాలు, ఆరవేసిన అంగవస్ర్తాలతో’ భగవంతం సనాతనత్వంలా ఉంటుందా?

కళ్లు ‘బోధిసత్వ అవలోకితేశ్వరుడివిగా, ఒళ్లు హెర్క్యులస్‌ది’గా గొప్ప విరోధాభాసలా ఉంటుందా? పోనీ ఇవేమీ కాకుండా, ఇన్ని అక్షర అతిశయోక్తుల్ని కలగన్న సుబ్బారాయుడిలా next door సుబ్బారావులా సాదాసీదాగా ఉంటుందా? సీజరు కాని, జుడాస్ కాలేని, ఎటుకీ చెందని ఆ ముఖాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడు పొంచి చూసేయాలి. నా ఎడతెగని ఎక్స్‌పెక్టేషన్ల కుంచెలతో గీసుకున్న ముఖాలతో పోల్చి చూసుకోవాలి.

కనక, త్రిపురను చూడటం కంటే, తొంగి చూడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అందుకే ఆయనను కలిసిన దాని కంటే పొంచి చూసిన సందర్భాలే ఎక్కువ. వైజాగ్‌లో నేనున్నప్పుడు రామలక్ష్మీ ఎస్టేట్స్‌కి అలా ఉట్టినే వచ్చి వెళ్లిపోతుండటం చూసి లక్ష్మి గారి కళ్లలో ‘మిలియన్ డాలర్ల ఆశ్చర్యం.’  ‘బెంగాలీ కథల మీ అనువాదం అద్భుతమ’ని (నిజమే కావచ్చు) ఎన్నిసార్లు చెప్పగలను?

ముఖాముఖినో, పొంచి ఉండో చూడడానికి త్రిపుర ఇప్పుడు లేరన్న ఆలోచ తెరలుతెరలుగా సంవేదనై కమ్ముతుంటే అనిపిస్తోంది – ఆయనతో ఇంత ముడివడిపోయానా అని.

నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే కవులు, రచయితలు… అన్నమయ్య, కృష్ణశాస్త్రి, బాదెలేర్, చలం, బుచ్చిబాబు, ఫ్లెబర్, మొపాసా. వీరందరూ నేను పుట్టకముందే నన్ను దొంగిలించిన తీవ్ర నేరం వల్ల నా వాళ్లయ్యారు. అటువంటి సారూప్యాలేవీ లేని కాఫ్కా, త్రిపుర, మో… వంటివారు కూడా నా వాళ్లు కావడం నాకెప్పుడూ ఆశ్చర్యమే.

వాళ్ల ప్రపంచాలు ఆత్మాశ్రయాలనే ఆరోపణల మాటున అత్యంత విశాలమైనవి. వారి రచనల ద్వారా వారు చేసిన అన్వేషణ అనంతమైనది. ఆధునికత అనే ఔషధం వికటించి కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ వీరిని బాధించినంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు. త్రిపుర విషయానికొస్తే,  ‘భౌతికంగానూ, మానసికంగానూ ఈ కథల పరిధి చాలా పెద్దది’(పాలగుమ్మి వారి మాటల్లో). ఆయన పాత్రలు చాలా elitist, ఐతే ఆర్థికంగా, లేదా తాత్వికంగా. శేషు లాంటి దాష్టికరాయుళ్లకి బెలూచిస్థాన్, జర్మనీలు స్పిరుచ్యువల్ హోమ్స్, భాస్కరం వంటి ఏక్ నిరంజన్‌లకి ‘తెల్లగా నిర్మానుష్యంగా ఉందనిపించే సైబీరియా’ స్పిరిచ్యువల్ హోమ్. రాణీవాసపు చెర వైభవాల లలితాదేవి, విమల ప్రభాదేవీలు, ఇన్‌గ్రెడ్ బెర్గ్‌మెన్‌లా ఉండే జాహ్నవులు, Monty Clift లా ఉండే శివరామన్‌లు… అవే కావు, మురికివాడలు, గల్లీలు, పేదరికం, నక్సలిజం… కూడా ఉన్న ప్రపంచం త్రిపురది. అందులో ‘గొలుసులు-చాపం-విడుదల భావం’ ఒక్కటే నాది. మా హోమియో డాక్టర్ (నా గురువుగారు కూడా) ఎన్‌వీ బ్రహ్మం గారు- నేను Argentum nitricum కేసు అనేవారు.

‘ఎందులోనూ ఏ చెయ్యీ బాగా ఎట్టకుండానే ఎళ్దామనుకుంటాను, మన దారిని మనం. అయితే అన్నిట్నీ గుద్దేస్తూ.

…ఎందుకు అన్నిట్నీ గుద్దేస్తుంటారూ? కళ్లకి చూపు తక్కువా, వొళ్లు ఊపు ఎక్కువా? మతిమరుపా, కండ కావరమా, మదవా రోగమా? అసలు తత్వమే అంతా? నడుస్తూ యింట్లోనే అందర్నీ అలా గుద్దేయడమేమిటి? బుర్ర దువ్వుకుంటూ అద్దాన్నే గుద్దేయడం… అలా గుద్దుకుంటూ నడిస్తే గాని…’- ఇవే లక్షణాలు!

‘మెదడులోని మతడల్ని చూశావా ఎప్పుడేనా, తమ్ముడూ, మెదడులోని మెకానిజం? ఆలోచింపజేస్తుందే ఆ మెకానిజం? చూళ్ళేదూ, అవును నీకెందుకూ అలాటివి. పోయి, వీధుల్లో ఆడపిల్లల్ని చూస్తానంటావ్ కాబట్టి నీకేం తెలీదు, వెళ్ళి చూడు…’

– వాళ్లన్నయ్య ఆ కథా నాయకుడితో అన్నాడా, త్రిపుర నాతో అన్నారా?

(పై కథని మినహాయిస్తే) త్రిపుర కేవలం శైలీగత కారణాలతోనే నాకు దగ్గరయ్యారా? నాకూ సరైన స్పష్టత లేని ఈ ప్రశ్నే బహుశా ఆయనని, ఆయన రచనల్ని కొన్నిసార్లు scepticalగా చూసేలా చేసిందేమో.

ఉపరితలంలో చూస్తే ఆయన కథలు రాసిన కాలం 1963- 73 (ఆ తరవాత నాదీ అని పైన చెప్పుకున్న కథ 1981లో, 1987లో మరొకటి). అంటే 1928లో పుట్టిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర్రావ్ అనే త్రిపుర తన 35-45 ఏళ్ల మధ్య ఓ 13 కథలు రాశారు. సాధారణంగా రచయితలు తమ యవ్వన ప్రాదుర్భావ వేళ కవిత్వం రాస్తారు. జలపాతం ఉధృతిని మైదానం నెమ్మదించాక వచనం వైపు మళ్లుతారు. కానీ త్రిపుర విషయంలో ఇది తిరగబడింది. ఆయన 50 ఏళ్లు పైబడ్డాక కవిత్వం మొదలెట్టారు (తన 47వ పుట్టినరోజు నాడు 1975లో రాసిన సెగ్మెంట్స్ ఇంగ్లీష్ దీర్ఘ కవిత సెమీ ఆటోబయోగ్రాఫికల్). ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తన 70వ పడిలో రాశారు కవిత్వం. ఇటువంటి విలోమ ప్రయాణం గురజాడలో మాత్రమే ఉంది. అయితే, గురజాడ సీరియస్ సాహిత్యవేత్త. అంటే త్రిపుర నాన్ సీరియస్ అని కాదు. సవాలక్ష వ్యాపకాల వల్ల తాను రాయాలనుకున్న, ‘రాయవల్సిన’ దాంట్లో పదో వంతు మాత్రమే రాసినా (యుగకర్త, మహా కవి వంటి విశేషణాలు తీసేసి చూసినా), గురజాడ ఓ సాహిత్య ఉద్యమకారుడు.

ఈ విధంగా చూస్తే, త్రిపుర సాహిత్యం తెలుగు పాఠక లోకానికి ఏమవుతుందో గానీ, త్రిపురకి మాత్రం తన సాహిత్యం ఓ passing cloud, ఆ మబ్బు రాల్చే సాంత్వన జల్లు అయితే కావచ్చు. అసలు తానొక రచయితగా కూడా claim చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు (తనమీద, తన రచనల మీద రచయిత చేసుకునే ఏ తెలుపు నలుపు క్లెయిమ్స్ అయినా పట్టించుకోవాల్సిన అవసరం పాఠకుడికి లేదనుకోండీ). ఆయనకి తన రాతలంటే ఖాతరు లేదు గానీ సాహిత్యం, ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంతో జన్మాంతర బంధం, ఆత్మగత సంబంధం. గురజాడని ఆధునికతకి ఒక కొండ గుర్తుగా తీసుకుంటే ఆయన మొదలు, స్వాతంత్ర్యానికి ముందటి వరకూ పుట్టిన కవులూ రచయితలు (ముఖ్యంగా బ్రిటిషిండియాలో ఉన్న కోస్తాంధ్ర రచయితలు) అందరూ ఇంగ్లీష్ సాహిత్య ప్రేమికులే. అందులోనూ వ్యాహాళికి నాయుడుపేట నుండి మద్రాసు వెళ్లి ఆల్బర్ట్ కామూ, సార్ర్త్‌లతో తిరిగి రాగలిగిన వెసులుబాటున్న పెద డాక్టరు గారబ్బాయి త్రిపుర పేరు ప్రత్యేకంగా ప్రస్తావించవలసిందేముంది? ఎమ్మే ఇంగ్లీష్ చేసిన కలోనియల్ బుర్రలు రెండాకులు ఎక్కువ చదవడంలో విడ్డూరమేముంది? ఉంది! ఆ విషయంలో త్రిపుర మహా తేడా. బెనారస్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ అర్ధాంతరంగా ఆపేసేనాటికి కూడా ఆయనకి వ్యవసాయంలో ఓనమాలు తెలియవు; ఫీల్డ్ ఫిజియాలజీ చేయవలసి వచ్చిన నాటికి అసలు వరి కంకే తెలియదు. పాత గురువు గారి సలహా మీద ఎమ్మే ఇంగ్లీష్ ఆనర్స్‌లో చేరడం-ఎకడమిక్ ఎదుర్రాయి కొట్టుకోవడం కాదు.

అలాగని అది తోవ చూపించిన వేలు కూడా కాదు. రెక్కమాను శిథిలమైన కూడలిలోకి ఆయనని నడిపించిన చేయి. ఏ తోవ ఎటు పోతుందో వెదుక్కోవడమే ఆయన చదువు.

అధ్యయన విషయంలో కూడా త్రిపుర గొప్ప తేడా మనిషి. ఆయన ఏ పుస్తకాన్నీ ఏకబిగిన చదవగలిగేవారు కూడా కాదు (ముఖ్యంగా తనని డిస్కవర్ చేసి సారూప్యాల్ని ఘనంగా ఎత్తిచూపిన బెకెట్, కాఫ్కా, కామూ వంటి రచయితల్ని). కొన్ని పుస్తకాలు ఏళ్లు గడిచినా పేజీలుగా ముందుకు నడవని సందర్భాలు కోకొల్లలు. తెల్లని కాగితాల మీద కథలని చీమలబారుల్లా ఎడమ నుంచి కుడికి పరుచుకున్న అక్షరాల్ని వాటి నిజ రూపాలతో దర్శించడమనే శాపాన్ని ఆయన జన్మతః పొందారు.  Genuine poetry can communicate before it is understood అన్న టీఎస్ ఎలియట్ రివలేషన్‌కి మరికొంత పొడిగింపు త్రిపుర అభిశప్తానుభవం: ‘పూర్తి’గా చదవకముందే ఎన్నో గ్రంథాల ఆత్మదర్శనం కావడం.

‘ఆలోచన’కి ‘తెలుసుకోవడాని’కి మధ్య అఖాతాన్ని గెంతి, దుమికి ‘సీసాలో బాతు పైకి వచ్చేసింది’ అని మాండో రూపంలో చెప్పే జవాబులు సృజన సాహిత్యంలోనో, తాత్విక వాఙ్మయంలోనో కుదురుతుందేమో కానీ ఇలా ఒకానొక పచ్చి వచన వ్యాసంలో ప్రతిపాదించడం ‘గేమ్ రూల్’ కాదని, అబ్సర్డ్ అని ఇంగిత జ్ఞానం నాకు లేకపోలేదు. అయితే త్రిపుర విషయంలో ఆయన సాహచర్యం వల్ల, అంతకుమించి, ఆయనను పొంచి చేసిన అపరాధ పరిశోధన తరహా పరిశీలన వల్ల నేను గ్రహించిన సత్యమది.

గ్రంథ సారాన్ని దివ్య చక్షువులతో గ్రహిస్తారన్న మిత్‌ను గానీ, ’రాబో’ సినిమాలో యంత్రుడిలా అలా అలవోకగా పుస్తకాలని స్కాన్ చేసిపారేస్తారన్న సోషియో ఫాంటసీనో ఏకరువు పెట్టడం లేదు నేను. ప్రభావాలకి గురికావడంలో కూడా తన, తన ముందు తరం రచయితల (ఒక్క తెలుగులోనే కాదు)కి కూడా త్రిపుర పూర్తిగా భిన్నమైన వారని గ్రహించినట్లు విన్నవించుకోడమే నా అభిమతం. శామ్యూల్ బెకెట్ ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ప్రభావంగా చెప్పుకునే ‘భగవంతం కోసం’ రాసేనాటికి ఆ నాటకాన్ని త్రిపుర చదవలేదు. దానిమీద వచ్చిన సమీక్ష (కూడా) చదవలేదు, చూశారంతే. విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ మలయాళీ కాకా హోటల్లో కూర్చుని కబుర్లాడుకునేటప్పుడే – భగవంతం పదమూడో నంబర్ బస్సులోనో, ఇటు ఏడో నంబర్ బస్సులోనో వస్తాడని త్రిపుర ఎదురు చూశారు. నాటి ఎదురుచూపు కథగా ఆకారం తీసుకోవడానికి ‘వెయిటింగ్ ఫర్ గోడో’ అన్న శీర్షిక ఒక ప్రేరణ వంటి నెపం. అలానే, ఆయనకి కాఫ్కా రచనల కంటే Kafkaesque తనమే ఎక్కువ చేరువని ఆయన కాఫ్కా థీమ్ కవితా సంకలనం (త్రిపుర కాఫ్కా కవితలు) చెప్పకనే చెబుతుంది.

తన సృజనాత్మక రచన విషయంలోనే కాదు, ఆయన ప్రసంగాలలో కూడా ఇదే ఒరిజినాలిటీ కనబడుతుంది. ఓసారి విజయవాడలో యూజిన్ అయొనెస్కో మీద ప్రధాన ప్రసంగానికి ‘మో ఆయనను ఆహ్వానించారు. మూడు గంటలు పైగా సాగిన నాటి ప్రసంగంలో ది న్యూ టెనెంట్, ది చైర్స్, ది లెసన్, అమెడీ వంటి అయొనెస్కో నాటకాల ప్రస్తావనైతే ఉంది గానీ, స్థూలంగా ఆ ప్రసంగమంతా అయొనెస్కో ఆత్మతో (అప్పటికి అయొనెస్కో చనిపోయాడు) త్రిపుర చేసిన సంభాషణ; ఏ అకడమిక్ పుస్తకాల్లో కనిపించని వ్యాఖ్యానం, ప్రకాశంగా చేసిన స్వగతం. ఈ సమావేశానికి హాజరు కూడా కాని విలేకరులు తమ సాహితీ ‘source’ల ద్వారా కనుక్కుని రాసిన వార్త శీర్షిక ఇది: అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం!

 

**      **      **      **

సౌరభమ్ములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, గాడ్పేల విసురు, ఏల సలిలమ్ము పారు… అన్న కవిత గుర్తుకు తెస్తూ, రచన కూడా ఒకానొక ప్రాకృతిక ధర్మమేమో అన్పించేలా సృజన చేసిన త్రిపుర స్వయంప్రకాశకత్వాన్ని సూక్ష్మంగానైనా గ్రహించాను. నాకు తెలిసిన అక్షర ప్రపంచంలో మహా కవుల్ని, గొప్ప రచయితల్ని కలిశాను గానీ, నేను దర్శించిన తొలి ‘ఒరిజినల్’ రచయిత త్రిపురే. ఆ రెవలేషన్ తాలూకు ఉద్వేగం జ్వరంలా నిలువెల్లా కమ్మిన ఓ సందర్భంలో ఒక catharsis ఉపశమనం లాంటి సాష్టాంగ దండప్రమాణం చేశానాయనకి.  ‘a’uthor గా కూడా గుర్తింపుకి ఇష్టపడని తనని ‘A’uthor గా డాబు చేసిన నా సాష్టాంగ నమస్కారం ఆయనని చాలా గాయపరిచింది. ఆ భంగపాటుని ఎంతమాత్రం దాయనితనం ఆయన కళ్లలో ప్రస్ఫుటంగా కన్పించి మళ్లీ కలవడానికి కొంతకాలం ముఖం చెల్లలేదు.

పాద నమస్కారాల కాలం పరిఢవిల్లుతున్నందువల్ల ఆయన నన్నప్పుడు ఆశీర్వదించి తన అనుంగు శిష్యుడిగా స్వీకరించి అక్కున చేర్చుకున్నా అంతకంటే ఎక్కువ సిగ్గుపడేవాడ్నే. అంటే, ఆ క్షణం ఒక్కటే ఒక స్థితి; ముందు వెనకలు పొడిగింపులు లేని స్థితి, ఆయనకైనా, నాకైనా. రచయితగా ఆయన విస్తృతిని నేను దర్శించిన ఆ క్షణంలోనే, రచయితగా తన పరిధిని ఆయన ప్రదర్శించారు. అటువంటి అపురూపమైన క్షణం వెలిగించగలగడం ఒక్క త్రిపురకు తప్ప తెలుగుదేశంలో మరొకరికి సాధ్యమవుతుందని అనుకోను. జీవితాన్ని గాఢంగా తరచి, మథించి, శోధించి, అనుభవించి, అంతలోనే తామరాకు మీద నీటిబీట్టులా తటస్థమవడమే సాహితీ తత్వవేత్త త్రిపురలోని వెలుగునీడలు. కాలక్రమణికతో గణాంకాల బట్టీ త్రిపురని చూస్తే చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. 85 ఏళ్ల నిండైన జీవితంలో (63 ఏళ్లు సాహిత్యంతో, తత్వ శాస్త్రంతో మమేకమై ఉండి కూడా) ఆయన పట్టుమని పదిహేను కథలకి మించి ఎందుకు రాయలేదు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బెనారస్ హిందూ వర్సిటీలో వామపక్ష రాజకీయాల్లో ఉండి, ఆ తరవాత ఉద్యోగరీత్యా దేశదేశాలూ తిరిగి, అగర్తలాలో నక్సల్స్‌తోనూ సంబంధాలు పెట్టుకొని, ఒకపక్క మార్క్స్‌నీ మరోపక్క బుద్ధుడ్నీ మధ్యలో స్పినోజా, షొపన్ హావర్‌లనీ చదువుకున్న త్రిపుర తన 35 వ ఏట (1963) వరకూ రాయాలని అనిపించకపోవడమేమిటి? 45వ ఏడు వచ్చేసరికి, అంటే పదేళ్లలో 13 కథలు రాసేసి, ఇహ కలం మూసేయడమేమిటి? లెడ్జర్ బుక్కు జీవితంలో లౌకిక, సాంసారిక బ్యాలెన్స్ షీటు తయారు చేసుకునే భద్రమైన జీవితాన్ని ప్రేమించేవాడైతే తనని తాను Segments గా నిర్దాక్షిణ్యంగా కోసుకుని చూసుకునేవారా?

సెగ్మెంట్స్ ఒక సెమీ ఆటోబయాగ్రఫికల్ కవిత. 1975లో తన 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ దీర్ఘ కవిత రాశారు త్రిపుర. ప్రపంచ ప్రఖ్యాత పెరూ మహాకవి César Vallejo కవిత  »El alma que sufrió de ser su cuerpo’  శీర్షికే ఎపిగ్రాఫ్‌గా మొదలవుతుంది దీర్ఘ కవిత. 46 ఏళ్లు మాత్రమే బతికిన  వల్లెజో  (1892`1938) తన జీవిత కాలంలో వెలువరిచినవి కేవలం మూడు సంపుటాలే (అందులో ఒకటి ఆయన మరణానంతరం విడుదలైంది). కానీ ఆధునిక కవుల్లో ప్రపంచవ్యాప్తంగా అంతటివాడు లేడన్న పేరు. మౌలికంగా ఆయన విప్లవ కవి, స్వయంగా స్పెయిన్ అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున పోరాడిన యోధుడు. చే గువేరాని అత్యంత ప్రభావితం చేసిన కవి  వల్లెజో. అమెరికా చే గువేరాని మట్టుపెట్టాక, చేగువేరా సంచీలో దొరికిన పుస్తకంలో తన స్వదస్తూరీలో రాసుకున్న  వల్లె, నెరూడా వంటి అతి కొద్దిమంది కవితలు బయటపడ్డాయి. మన మహాకవి శ్రీశ్రీ కూడా  వల్లెజో కవిత్వాన్ని అనువాదం చేశారు. అయితే, త్రిపుర ఎంచుకున్న  వల్లె కవిత పూర్తిగా భిన్నమైంది, తాత్వికంగా చాలా గాఢమైనది,  వల్లె దాదాపు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు రాసినది. ఆ కవితా శీర్షికకి అర్థం ‘దేహమై క్షోభ పడ్డ ఆత్మ’. అంతుచిక్కని రుగ్మతతో అర్ధాంతరంగా కన్నుమూసిన  వల్లెజో దేహాత్మల ద్వంద్వాన్ని ప్రదర్శిస్తూ, అంతలోనే ఆ ద్వైతాన్ని రద్దు చేయడమే ఆ కవిత.

సెగ్మెంట్స్ కవిత రాసేటప్పటికి త్రిపుర మనఃస్థితి కూడా అంతటి సంక్షోభమయమే, సంవేదనాత్మకమే.

1950 ప్రథమార్ధం నాటికే బెనారస్‌లో చదువు, ఉద్యోగం, విరమణ కూడా అయిపోయాయి. 1954`57 వరకు మాండలే (బర్మా)లో ఉద్యోగం;  1957`59 మధ్య మదనపల్లి, విశాఖల్లో చిన్న మజిలీల తరవాత ఆయన అగర్తలా (త్రిపుర)లోని మహారాజా బీర్‌బిక్రమ్ కాలేజీలో చేరారు. ఆయనకి నక్సల్స్‌తో సంబంధాలుండేవి, వారికి సాయం చేయడానికి బ్యూరోక్రసీతో సన్నిహితంగా మెలిగారు కూడా. ఆయనలో ‘జుడాస్’ ఎలిమెంట్ లేకపోవడం వల్ల తమ రహస్య బృందంలో ‘జుడాస్’ని కనిపెట్టలేక, ఆ ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించి, మతి చెడి పిచ్చాస్పత్రి పాలయ్యారు. ఇదంతా ఆయన వెదుకులాట. తోవలు వెదుక్కున్నారు, కనుక ఎదురు దెబ్బలూ తిన్నారు, అసలు తోవంటూ ఏదీ లేదన్న తాత్విక స్థితికి చేరుకున్నారు 1963`73 మధ్య రాసిన 13 కథల్లో, ఆ కథల్లో కదలాడిన భాస్కరం, శేషు, వీరాస్వామి, రాజు, మున్నీ, ముక్తాదేవి, కల్యాణి… అనేక పాత్రలతో ఆయన చెప్పాలని ప్రయత్నించిన వాక్యం

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేదు’.

ఆ ప్రకారం చూస్తే కథలకి కలం మూసేసిన రెండేళ్లకి రాసిన Segments ఆయన అర్ధాంతర సాహిత్య ప్రస్థానానికి ఒక ముగింపు; ఆత్మకథలో ఆఖరి అంకం. ఏదో తనకి సానుకూలమైన సమాధానం చెప్పుకుని తప్పుకోవడమో, సౌలభ్యం చూసుకుని తప్పించుకోవడమో కాదు, దారి లేదని తెలుసుకోవడం. తనకు తాను కూడా మిగలని స్థితిలో శాంతి లేదు, సుఖం అంతకంటే లేదు. వెయ్యి యుద్ధాలతో తలపడే తెగువును మించినదేదో ఉండాలి, ఆ లోన పెనుగులాటని తట్టుకోవడానికి.

సోదరుడు Abel ని హత్య చేసి కూడా, »…am I my brother’s keeper? అంటూ దేవుడ్నే బుకాయిస్తాడు Cain. »…am I my brother’s keeper?? అన్న వాక్యాన్నొక allusion లా వాడతారు త్రిపుర తన  Segmentsలో. ప్రలోభాలకి లొంగి  ద్రోహం చేసి తమ్ముడి దుర్మణానికి కారణమవడమే కాకుండా, తన మతిస్థిమితం కోల్పోవడానికి కూడా కారణమైన ‘జుడాస్’ ల ప్రస్తావన ఉండే గానీ, వారి మీద నింద లేదు; స్వీయనింద ఉంది.

Couldn’t you too have died you’re your brother did,/ or at least bled… (నువ్వూనూ నీ తమ్ముళ్లానే/ చావలేకపోయావా?/ కనీసం గాయపడనైనా లేకపోయావా? ..అనువాదం ‘మో’)

YOUR WERE CLEVER / you did not spill a single/ drop of your brother’s / blood coarsing in your arteries..  అంటూ తనని తాను నిర్దాక్షిణ్యంగా చీల్చుకుంటారు. ఓ నిరపాయకర ప్రేక్షకుడిగా కేవల సానుభూతిపరుడిగా రణక్షేతాన్ని చూడడం, తమ్ముళ్ల త్యాగాన్ని భద్రంగా కీర్తించడం ఆయనను ఆత్మనిందకు పురిగొల్పుతాయి. కానీ కన్ఫెషన్‌తో కుమిలిపోతున్న ఈ కవి స్వాభావికంగా ఏకాకి.

..the skeletal arms of giant trees/ bend close from either side darkly to embrace me/ into/ their land of ‘No’/ which’s but/ a heartbeat away/ gurgling its marshy messages:/ soft black whispers./ “vanish into Zero the Perfect State”

సంపూర్ణమైన సున్నాలోకి అదృశ్యమవ్వాలనే వాంఛ మరో పక్క. ఇదీ ఆయన పెనుగులాట. సామాజికతకి, ఆత్మాశ్రయతకి మధ్య ఆయన నలిగిపోయారు. I see now CLEARLY/ my mirror reflects my terrible shame…..  అని కుంగిపోతారు తన నలభయ్యేడు సాయంతనాల సాంధ్యధూళిలో.

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేద’న్న దిగులే ఆయన చేత సెగ్మెంట్స్ అనే ఎపిలోగ్ రాయించింది. ఆ తరవాత రాసిన కథలు (గొలుసులు-చాపం-విడుదల భావం  1981;  వలస పక్షుల గానం  1987), కవిత్వం (బాధలూ సందర్భాలూ 1990; త్రిపుర కాఫ్కా కవితలు  2001) ఆయన తనని ఏకాంతపరచుకునేందుకు మీటుకున్న ఏక్‌తార సాంత్వన సంగీతం మాత్రమే.

**      **      **      **

పట్టుమని పదమూడు కూడా లేని ఆయన కథల్ని text కి సంబంధం లేకుండా context పరంగా చూస్తే మరొకటి స్ఫురిస్తుంటుంది. అదేమిటో చెప్పాలంటే, ముందు ప్రదీప్ చౌధురి గురించి, ఆయనకి త్రిపురతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవాలి. పశ్చిమబెంగాల్ సాహిత్య ప్రపంచంలో 1961`65 మధ్య వచ్చిన ఉప్పెన- హంగ్రీ జనరేషన్. మన దిగంబర కవులకు మల్లే హంగ్రీ జనరేషన్ కవులు మలయ్‌రాయ్ చౌధురి, అతని సోదరుడు సమీర్‌రాయ్ చౌధురి, శక్తి చటోపాధ్యాయ, దేవీరాయ్ (హరధోన్ ధార) కూడా అమెరికా ‘బీట్ జనరేషన్’తో ప్రేరణ పొందారు. అయితే బీట్ కవుల్లో ‘పేరుమోసిన’  ఎలెన్ గిన్స్‌బర్గ్ మన కాశీఘట్టాలు, కలకత్తా వీధుల్లో తిరిగి, మన అఘోరాలతో, బూడిద స్వాములతో చెట్టపట్టాలేసుకుని బతికినప్పటి (1963) వరకూ బీట్ కవిత్వాన్ని హంగ్రీ జనరేషన్ కవులు చూడనేలేదని కొందరు సాహిత్య చరిత్రకారులు వాదిస్తారు. ఈ వివాదాలు సాహిత్య పరిశోధకులకే వదిలేసి స్థూలంగా చెప్పుకుంటే, పశ్చిమబెంగాల్ హంగ్రీ జనరేషన్, మన దిగంబర కవులూ, కొలంబియా Papelipolas, స్పానిష్ Generation µ68 వంటి కవి బృందాల ఆక్రోశం, ఆగ్రహాల్లో సారూప్యాలున్నాయి.

Statusquoని నడ్డి విరిచి, ధ్వంసం చేసి కొత్త దారి వేయాలన్న వారి ఉద్రేకాల్లో పోలికలున్నాయి. అటువంటి హంగ్రీ జనరేషన్ కవులలో ప్రదీప్ చౌధురి ఒకడు. మాతృభాష బంగ్లాతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచిలలో కూడా అదే స్థాయి అభివ్యక్తి ఉన్నవాడు.అందరిలోనూ బహుశా చిన్నవాడైనందు వల్లనేమో కొంచెం దుందుడుకువాడు కూడా. 13,14 ఏళ్లకే కవిత్వం మొదలెట్టి ‘చెడి’పోయాడు. నలభయేడేళ్లకే చనిపోయిన బీట్ కవి, రచయిత Jack Kerouac తో మమేకమైనవాడు (Kerouac స్మరణలో శుద్ధ కవిత్వమై, పచ్చి వచనమై కూడా తేలిపోయినవాడు). తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తా వదిలి ఢిల్లీ, అగర్తలాల్లో చదువుకున్న ప్రదీప్‌కి పాఠాలు చెప్పినందుకే కాదు, ప్రేరణ అయినందువల్ల కూడా త్రిపుర గురువు అయ్యారు, మిత్రుడయ్యారు, తరవాత సహోద్యోగి కూడా అయ్యారు (ప్రదీప్ కొంతకాలం జూనియర్ లెక్చరర్‌గా మహారాజా బీర్‌బిక్రమ్ కళాశాలలో పని చేశారు). ఈ గురుశిష్యుల మైత్రి ఆనాటి నుంచీ కొనసాగింది. త్రిపుర Segments(1975)ని ప్రదీప్ తాను నడిపే త్రిభాషాపత్రిక ‘స్వకాల్’ లో 1979లో ప్రచురించారు కూడా.

ప్రదీప్ గురించి త్రిపుర నాకు చెప్పిన అనేక సంగతుల్లో ఒకానొక అప్రధానమైన సంఘటన:

పేరున్న ఓ కళాశాల వారు విశ్వకవి రవీంద జయంతి సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రదీప్‌ని ముఖ్య అతిథిగా రవీంద్రుడి మీద ప్రధాన ప్రసంగానికి ఆహ్వానించారు. ఆర్భాటమైన ఆవరణ, మంద్రంగా రవీంద్ర సంగీతం, రంగులన్నీ అక్కడే పుట్టాయా అన్నట్టున్న శోభాయమానమైన ఆ ప్రాంగణం చుట్టూ ఒక చెయ్యి త్రిపుర భుజం మీద వేసి, మరో చేత్తో నాటు సారా ప్యాకెట్లు తాగుతూ కలియదిరుగుతున్నాడు ప్రదీప్. అప్పటికే నిలదొక్కుకోలేని స్థితిలో తప్పతాగి ఉన్న ప్రదీప్, త్రిపుర ఎంత వారించినా వినకుండా జేబులోంచి ప్యాకెట్ల మీద ప్యాకెట్లు తీస్తూ తాగుతూనే ఉన్నాడు. సభ ఆరంభమై ముఖ్య అతిథి ప్రదీప్‌ను వేదిక మీదకి ఆహ్వానించారు నిర్వాహకులు. అతికష్టంమీద వేదిక మీద మైకు దగ్గరకు వెళ్లిన ప్రదీప్, భళ్లున పెద్ద వాంతి చేసుకుని,  ‘రవీంద్రుడు బెంగాలీ సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి చేసిన కాంట్రిబ్యూషన్ పట్ల నా అభిప్రాయం ఇదే’ అన్నాడు(ట).

త్రిపుర కథలని contextual గా చూస్తే- తెలుగు కథ స్తబ్ధత మీద, వస్తు-రూపాల మొనాటనీ మీద నిరసనగా భళ్లున కక్కిన వాంతి అని అనిపిస్తోంది. తెలుగు కథకి గురజాడ కంటే ముందు ఓ సాంఖ్యాయన శర్మ, లేదా మరో భండారు అచ్చమాంబ కథలు రాశారంటూ సాహితీ పరిశోధకులు నిగ్గుతేల్చుతున్నారు గానీ, ఆ తొలినాటి కథకుల ఔత్సాహిక తప్పటడుగుల్ని పక్కన పెట్టి, సీరియస్ కథకి pioneer గా గురజాడని తీసుకుంటే 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమై, రెండు, మూడు, నాలుగో దశకాల్లో ఉచ్ఛ దశకు చేరుకున్న తెలుగు కథ, 1950ల్లో నెమ్మదించి, ఆ దశకం చివరి నాటికి క్షీణ దశకి చేరుకుంది. ఆధునికతకి ముందటి కంటే ఆధునిక యుగంలో కాలం నడకలో వడి హెచ్చింది. అంతకుముందు పరిణామాలన్నీ ఒకెత్తు, ఒక్క 20వ శతాబ్దపు మార్పులన్నీ ఒకెత్తుగా దూకిన కాలంలో పుట్టి, కలం పట్టిన వారిలో కూడా అదే దూకుడు ఉండాలి. దశాబ్దంలోపే దూసుకొస్తున్న కొత్త తరం వెనకటి తరం కంటే ఎక్కువ సౌకర్యాలు పొందే సుఖానికే కాదు, మరింత చిక్కని సంక్లిష్టతలు ఎదుర్కోవాల్సిన కష్టానికీ సిద్ధం అవాల్సి వచ్చింది. వెనకటి తరం వేసిన దారిలో కొంత అనాయాసమైన ప్రయాణం చేస్తూనే, ఆ దారిని మరింత వెడల్పు చేయాల్సిన తరాలు, అలా చేయకపోగా దానిని ఒక ఇరుకు డొంక చేసేశాయి. కథంటే ప్రాపగాండా, ముందే సిద్ధం చేసుకున్న ఒక ప్రతిపాదన, ఎత్తులు నిర్ణయమైపోయిన శకుని పాచిక. పాత్రలు తాను ఆడించినట్లు ఆడే తోలు బొమ్మలు, తానొక సృష్టికర్త. కథ చెప్పే గొంతుకలో గొప్ప గోరోజనం. ఆ కనిపించని కన్ను, తెర వెనక మూకీకి తెలియని సంగతులే లేవు, చూడని లోతులూ లేవు, ఆడా మగా తేడాల్లేకుండా పాత్రల అంతరంగాల అల్లకల్లోలాల్ని అక్షరాల్లోకి అలవోకగా ఆవిష్కరిస్తుంది.

Leo Tolstoy ‘వార్ అండ్ పీస్’ కథానాయిక నటాషా పాత్రకి పూర్తి ప్రేరణగా పరిశోధకులు నిర్ధారించిన ఆయన చిన్న మరదలు  Tanya Behrs ఆయననొక ఉత్తరంలో నిలదీస్తుంది-  ‘సైనికాధిపతుల్ని, యోధుల్ని, భూస్వాముల్ని పాత్రలుగా మలచటంలో ఎంతో నేర్పు ఉండొచ్చు. కానీ ప్రేమలో మునిగి ఉన్న ఒక స్త్రీ మనసులోకి మీరెలా తొంగిచూడగలరు?’ అంటే ఆధునిక సాహిత్యం అనుభవాత్మకమే కానీ, ఊహాత్మకం, వ్యూహాత్మకం కాదని, కాకూడదన్నదే టాన్యా నిలదీత అంతరార్థం. రాయడానికి ముందు తన పాత్రలు చెప్పేది శ్రద్ధగా వింటానని Charles Dickens అంతటి మహా రచయిత వినయంగా ప్రకటించిన చోటే author- authority కి పర్యాయపదమైపోయాడని,  ‘కొత్తా దేవుడి’ అవతారమెత్తాడని  Roland Barthes (Death of the author)  వంటి విమర్శకులు గోలపెట్టారు. రచయిత అంటే author కాదని, అతనొక

scripter మాత్రమేనని అన్నారు. రచనతో పాటు పుట్టాడే తప్ప సర్వాంతర్యామిలా సకలం తెలిసిన మిడిసిపాటుతో ‘వివరించటం’, ‘ప్రబోధించటం’ కూడదని గగ్గోలుపెట్టారు.

గొప్ప రచనలు ఏవైనా ఏ కాలంలోనైనా సిద్ధాంతాలకి precursors లాంటివే గానీ, సైద్ధాంతిక దిశానిర్దేశం నుంచి పుట్టనే పుట్టవు. 1960 దశకం చివరి దశలో పుట్టి, మరో దశాబ్దం ఆలస్యంగా భారతదేశంలో ప్రవేశించిన రోలాండ్ బార్త్ వంటి కొత్త తరం విమర్శకుల స్ఫూర్తి 1963 నాటికే త్రిపుర రాసిన కథలలో between the lines తొణికిసలాడటం ఓ అద్భుతం.

రచనతో పాటే పుట్టటం అన్న స్ఫూర్తిని మరో రకంగా అన్వయించుకుని,  ‘నేను’ కేంద్రకంగా, డాబుసరిగా ఒక సొంత డప్పులా, అద్దం ముందూ ఆత్మవంచనలా ‘ఉత్తమ పురుష’ కథల శైలి కూడా కదం తొక్కింది (తొక్కుతోంది) తెలుగు సాహిత్య సీమలో.

“మీలో ఒక గొప్ప గుణముంది. ఏ అనుభవాన్నీ కాదనరు. కానీ వాటిని మీ రక్తంలోకి అరబడనీయరు. అవునా?’ అన్నాడు, మళ్లీ రాత్రి అనుభవం నా కళ్లలో ఇంకా మిగిలి ఉందేమో అని పరీక్షగా చూస్తూ.

అవునో కాదో అప్పుడు చెప్పలేకపోయాను. జవాబు ఇదీ అని ఊహించుకుని మాటల్లో చెప్పదలచుకుంటే, చెప్పడానికి ప్రయత్నిస్తే ఒఖ్ఖసారిగా గర్వం,  ‘అహం’ తెలియకుండా వెనకపాటుగా ముట్టడి చేసి… మాటల్లో విపరీతమైన ‘ట్విస్ట్’, అసత్యం… బంగారు పూత… వెలిగే అసత్యం. ‘నిజం’ యొక్క కఠోరత్వాన్ని కప్పి పుచ్చే అసత్యపు ఆకర్షణ… ఇవీ, నిజం యొక్క అసలు వెలుగును చూడలేక బెదరడం, భయం; మనసుతో ‘తెలుసు’కోగలిగినా,  ‘తెలుసుకోవడం’ నా శిక్షణలో ఒక భాగమైనా, ’నేను’ అన్న మాటలలో ఖంగుఖంగుమని సత్యం ఎప్పుడూ మోగదని, ఏది నిప్పులాగ నిజమో, ఏది వేషధారణో చెప్పలేననీ…”

 

ఇది జర్కన్ కథలో వీరాస్వామి, కథకుడు భాస్కరం మధ్య సంభాషణ, స్వగతం. ఇదే సాహిత్యంలో ఉండాలని త్రిపుర పదేపదే ప్రస్తావించే కన్ఫెషనల్ ఎలిమెంట్. ‘నేను’ని నిర్దయగా చీల్చి చూసుకోవడం. స్వోత్కర్ష గొప్ప సుఖమే గానీ, ఈ నేరాంగీకారం ఎంతమాత్రం సులువు కాదు.

‘యవ్వన ప్రౌఢ దశల్లో నేను తిరిగిన ప్రదేశాలు, పడ్డ మధనలు కథల్లో ప్రాణం పోసుకున్నాయి. ముఖ్యంగా నేను విద్యార్థిగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న రోజులు, ఆ రోజుల్లో నాకు బాగా చనువైపోయిన నగువా, యూనివర్సిటీ గేట్, యూనివర్సిటీ ఘాట్, బిర్లా, బ్రోచా హాస్టల్సు, దశాశ్వమేథ్ ఘాట్, గల్లీలు, గంగ, ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను. ఈ కథకుడు రాయగలిగాడు. నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా. ఈ కథకుడు ఆ బంధాన్ని స్పష్టంగా బయటపెట్టడానికి సిగ్గుపడలేదు, సంకోచించలేదు. అందుకు నా జోహారులు’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు రాసిన ముందుమాటలో. స్వాభావికమైన వినయం, విస్తృతమైన అధ్యయనం వల్ల అబ్బిన జ్ఞానం వల్ల సర్వశక్తిమంతులమని, అపరబ్రహ్మలమని పాలగుమ్మి వంటి మహా రచయితలు అహంకరించలేదు గానీ వారు కూడా రచనల్లో తమని దాచుకోవడానికే ప్రయత్నించారు. గొప్ప సాహితీవేత్త కావడమే కాకుండా, బెనారస్ నేపథ్యముండటం వల్ల కూడా పాలగుమ్మిని ‘త్రిపుర కథల’ ముందుమాటకు ఎంచుకున్నారేమో అత్తలూరి నరసింహారావు.

నిజానికి బెనారస్ విశ్వవిద్యాలయం పాలగుమ్మి జీవితంలో ఓ మజిలీ కాదు, అతి ముఖ్యమైన మలుపు. బెనారస్‌కి ముందు పాలగుమ్మి మీద సంప్రదాయ సాహిత్య ప్రభావం ఎక్కువ. సంస్కృత వాఙ్మయం కూడా కరతలామలకం. ఆయన అప్పటికే అష్టావధానాలూ చేసేవారు. బెనారస్ విశ్వవిద్యాలయం ఆయన ఆలోచనల్ని ఆధునికత వైపు మళ్లించింది. ఈ మార్పు పాలగుమ్మి సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవ్వాలే గానీ ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు, త్రిపుర కథలకి రాసిన ముందుమాటలో తప్ప (‘ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను’). ఆ విధంగా ‘త్రిపుర కథలు’ ఆయన నాస్టాల్జియాని కెరలించాయి. ‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా’ అన్నారాయన. నిన్నామొన్నటి వరకంటే ఎప్పటివరకు? 1980లో ఈ పరిచయ వాక్యాలు రాయకముందటి వరకు; ఇంకొంచెం hypothetical గా చెప్పుకుంటే ‘త్రిపుర కథలు’ తనని పట్టి కుదపక ముందువరకూ అనుకోవచ్చేమో. ఎందుకంటే, ఆ ‘నిన్నామొన్నటి’ తరవాత కలిగిన కొత్త ఎరుకతో పాలగుమ్మి ఏ రచనా చేయలేదు. కనుక ఎంత కాదన్నా పాత నమ్మకాలు, అలవాట్లు ఓ పట్టాన పోవు కాబట్టి ‘ఇటువంటి కథలు నేను రాయగలనా’ అని నిట్టూర్పు వంటి ప్రశంసతో ముగించారు పాలగుమ్మి.

చైతన్యవంతమైన 1980ల నాటికే అలా ఉంటే, అప్పటికి 20 ఏళ్ల క్రితం, ఆధునిక కథాసాహిత్యం నిలవ నీరైపోయిన 1960లలో ఎంత స్తబ్ధత, మొఖం మొత్తే మొనాటనీ ఉండి ఉండొచ్చు? గబ్బిలాలై వేలాడే నిన్నటి నమ్మకాలు, పాత హాంగోవర్లు, మార్పు పట్ల ససేమిరాలు, ముఖం తిప్పేసుకోవడాల మీద ప్రదీప్ కక్కిన నిరసన వంటివే త్రిపుర కథలు కూడా. ‘అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం’ అంటూ రాసేసిన విలేఖరుల మిడిమిడి జ్ఞానాన్ని పోలిన అజ్ఞానంతోనే- ఆయనని ప్రముఖ అబ్సర్డ్ రచయితగా చేసి, తనకి సంబంధం లేని విశేషణాల భుజకీర్తులు తగిలించిన తెలుగు సాహితీ ప్రపంచం పట్ల ఏవగింపు కూడానేమో.

అయితే, ఊసిన కారాకిళ్లీ మరకలో ఎరుపు మెరుపులు చూసినట్టు, ఆ కథల టెక్స్ట్‌లోని వచన కవిత్వాల జమిలీకి వ్యామోహపడి, తన నిగూఢ తాత్విక శైలీ విన్యాసానికి వ్యసనపడింది తెలుగు సాహిత్యం. పాపులర్ అయ్యే ప్రమాదం తప్పింది గానీ, context  అర్థం కాని సాహిత్యలోకానికి ఓ cult figure గా మిగిలారు త్రిపుర.

నరేష్ నున్నా

 

Download PDF

22 Comments

 • Anil reddy says:

  డియర్ నరేష్,

  చాల బాగా రాసారు….త్రిపుర గురించి….చే కి ఇష్టమైన వల్లెజో గురించి, ప్రదీప్ రవీంద్రుడి మీద ప్రసంగ సందర్బం చాల ఆసక్తిగా వున్నై. ‘త్రిపుర ఎలా ఉంటారు?’ అన్న ప్రశ్న త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది. మంచి నివాళి….

  అనిల్

 • sattarsaheb says:

  చాలా మంచి పోస్ట్ రీడ్ మస్ట్

 • మొన్న మరో కథకుడు నన్ను అడిగినప్పుడూ నేను అన్నది అదే..త్రిపుర..తెలుగు సాహిత్యంలో ఒక కల్ట్ ఫిగర్. అందరూ ఆయన రచనలని ఇష్టపడకపోవచ్చు..కాని ఇష్టపడ్డవారు..వాటిలో మునిగిపోతారు. మళ్ళీ బాటిల్లో బాతుల్లాగా పైకి తెలుతుంటారు. ఇక ఆ అభ్జర్డ్ కథకుడి మీద అబ్జర్డ్ వ్యాసాల పరంపర ఎంత అబ్జర్డ్గా ఉంటుందో చూస్తు ఉండవచ్చు.
  Thank you for a nice piece on his works especially.

 • aparna says:

  “అయితే, ఊసిన కారాకిళ్లీ మరకలో ఎరుపు మెరుపులు చూసినట్టు, ఆ కథల టెక్స్ట్‌లోని వచన కవిత్వాల జమిలీకి వ్యామోహపడి, తన నిగూఢ తాత్విక శైలీ విన్యాసానికి వ్యసనపడింది తెలుగు సాహిత్యం. పాపులర్ అయ్యే ప్రమాదం తప్పింది గానీ, context అర్థం కాని సాహిత్యలోకానికి ఓ cult figure గా మిగిలారు త్రిపుర.”

  మొదలు, ముక్తాయింపు బావుంది. మధ్యలో ప్రస్తావించిన విషయాల పట్ల మీకున్న పరిజ్ఞానం, ఆలోచన, అనుభవం కొంతన్నా నాకు అలవడితే బావుండునని ఉంది. :)

  • naresh nunna says:

   మీకు ఒఠ్ఠి థాంక్స్ చెప్పి ఊరుకుంటే, మీరు నాకు ఆపాదించిన పరిజ్ఞానం, ఆలోచన, అనుభవం వగైరాలని నేను గొప్ప గోరోజనంతో అంగీకరించినట్టవుతుంది కాబట్టి, మోడెస్టుగా కాకుండా నిఝంగానే అటువంటివేమీ లేవు అని విన్నవించుకుంటున్నా అపర్ణ గారు…
   కందమూలాలే కాదు, ఆకులు అలములు గూడ తినకుండా అనేకవేల సంవత్సరాలు రుద్రుని కోసం తపస్సు చేసినందువల్ల పార్వతికి అపర్ణ అని పేరు వచ్చిన విషయం మీకు తెలిసిందే. అపర్ణ అని పేరున్న వారు అనుకున్న దాన్ని దాని అమీతుమీ తేల్చి సాధించగలరని నా అనుభవం చెబుతోంది. కాబట్టి, ‘….. కొంతన్నా నాకు అలవడితే బావుండునని ఉంది’ అన్న ఆలోచన ఉపసంహరించి, దేన్నైనా సంకల్పించండి చాలు. :-)

 • mythili says:

  త్రిపుర గారు నన్ను ఇంప్రెస్ చేయలేదు. ఇది ఒక సరళరేఖాపథంలో కాకుండా అటూ ఇటూ బిందువులని కలుపుతూ సౌష్టవం ఉన్న అష్టభుజి గా,కొన్ని చోట్ల సౌష్టవం లెదనిపించే అభాసా ట్రెపీజియం గా విస్తరించిన ఎలిజీ.వ్యక్తిగతంగా నాకు ఇలా రాస్తే ఇష్టం ..కొన్ని స్కాటలాజికల్ ఉదాహరణలని వదిలేస్తే .

  • naresh nunna says:

   సాహిత్యం పట్ల ఎంతో ప్రగాఢమైన అనుబంధం ఉన్న మిమ్మల్ని త్రిపుర ఇంప్రెస్స్ చేయలేక పోవడం విచారకరం. నా వ్యాసం మీకు నచ్చినా కూడా, అది ఆనందాన్ని ఇవ్వలేదు, మైథిలి గారు..

 • వేలమూరి శ్రీరామ్ says:

  నరేష్ గారూ ,, నేనింకా మలెన షాక్ లో నుండే తెరుకోలేదండీ ,మీరు మళ్ళీ మరొక షాక్ ఇచ్చారు ,
  అసూయ గా ఉంది ,, వ్యాసం అద్భుతం గా ఉంది

  • naresh nunna says:

   మాటవరసకి మీరు అసూయ అంటున్నా అది అభిమానానికి పర్యాయం గానే వినిపిస్తోంది శ్రీరామ్ జి.

 • ramanajeevi says:

  నరేష్
  ప్రతి వాక్యాన్ని పట్టి పట్టి చదివాను. యెంత లోతుగా ఎంత గాడంగా రాసారు! బహుశా తెలుగు సాహిత్యం లో మీ లాంటి వాళ్ళు చాలా అరుదు. అభినందనలు.

 • K.K. Ramaiah says:

  త్రిపుర గారి గురించి ఇంత అద్భుతమైన, ప్రఘాఢమైన, విశ్లేష్ణాత్మకమైన వ్యాసం రాసినందుకు నరేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.ప్రతి వాక్యాన్ని పట్టి పట్టి చదివాను అన్న త్రిపుర గారి రమణజీవితో ఏకీభవిస్తున్నా. త్రిపుర గారి ఎలిజీగా తప్పక చదవవలసిన వ్యాసం; త్రిపుర గారితో దశాబ్దాల పరిచయం, త్రిపుర గారి పట్ల, వారి రచనల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగిన ప్రతిభావంతుడైన నరేష్ నున్నా గారే రాయగల వ్యాసం.

 • naresh nunna says:

  Ramana Jeevi, K K Ramaiah garlaki,

  Thank u very much.

 • అగంతకుడు says:

  నేను కూడా మిమ్మల్ని చూడటం కంటె తొంగి చూడటానికే ఇష్టపడతాను నరేష్ గారూ. దూరంగా ఉండి గమనించడం..వగైరా. మీ ధోరణి చూస్తుంటే ముఖాముఖితో భంగపడతానేమోనని భయంగా ఉంది. ఇకపోతే త్రిపుర కథలని వర్తమాన కథలమీద వాంతిలా మీరు అర్థం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. నాకు తెలిసి త్రిపురకు సాహిత్య కథా ధోరణులతో పనిలేదు. ఆయనకు లేని వాంతి మీకెలా వచ్చిందో. ఆయా వికారాలన్నీ మీవే కాని త్రిపురవి కాడానికి ఆస్కారం లేదు. ఇకపోతే మీకు త్రిపుర పరిచయంలో కలిగిన భంగపాటు ఆయన వ్యక్తిత్వం చేత కనుమరుగయ్యిందేమో గాని త్రిపురని, ఆయన కథలను అర్థం చేసుకోడంలో మీరు ఇంకా భంగపాటుకు గురౌతున్నారని మీ వ్యాసం చదివితే తేటతెల్లమౌతుంది.

 • కల్లూరి భాస్కరం says:

  నరేష్ గారూ మీవ్యాసం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలుగోవంతు వ్యాసం మిగిలి ఉండగానే ఈ స్పందన రాయాలనిపించింది. చాలా లోతైన విశ్లేషణార్హమైన వాక్యాలున్నాయి. ఒక పుస్తకానికి సరిపోయే విషయాలు చర్చించారనిపించింది. మనం ప్రధానస్రవంతి అనుకునే సాహిత్యానికి సమాంతరంగా, అసమ్మతిగా అక్కడక్కడ ఒంటరి దీవుల్లా మిగిలిపోయిన కవులు, రచయితలు, సాహిత్యాలను తడిమి నమోదు చేయాల్సిన అవసరముంది. అప్పుడే అది ఒక కాలపు సమగ్ర సాహిత్యచరిత్ర అవుతుంది. ప్రదీప్ అనే ఆయన రవీంద్రుడిపై ప్రసంగరూపంలో భళ్ళున కక్కుకోవడం గొప్ప ప్రతీకాత్మకం. మనది సాలెపురుగు మనస్తత్వం. సాలెపురుగు తన లాలాజలం(కరక్టేనా?)తో తన గూడు తనే కట్టుకుని అందులో కూర్చుంటుంది. మనలో మెజారిటీ జనం అభిమానాలు, నమ్మకాలు,నిర్ధారణలు అలాగే ఉంటాయి. మెజారిటీ అభిప్రాయం సమాజాన్ని, చరిత్రను వందలు, వేల సంవత్సరాలపాటు ఘనీభవ స్థితిలో ఉంచుతుంది. అంతకంటే బలవత్తరమైనది ఉండదు. ఇది మీ వ్యాసంపై ప్రథమ, ఉపరితల స్పందన మాత్రమే. ఉండలేక రాశాను.

  • naresh nunna says:

   Kalluri garu,

   I am overwhelmed by the comment from an erudite writer, Sri Kalluri Bhaskaram garu….

   regards,
   naresh

 • naresh nunna says:

  ఆగంతుకుడు గారూ….
  మీ వ్యాఖ్య చూస్తుంటే, నేను అనుకున్నది సరిగా convey చేయలేక పోయానేమో అనిపిస్తోంది.
  1. “ఆయన కథల్ని text కి సంబంధం లేకుండా context పరంగా చూస్తే మరొకటి స్ఫురిస్తుంటుంది”
  అంటే.. నాకు స్ఫురిస్తుంది అని. దీనితో త్రిపుర గారికి సంబంధం లేదని మీరు ప్రత్యేకంగా అనవలసిన పని లేదు.
  2. ప్రదీప్ చౌధురి ప్రస్తావన మీద కొంత వివరణ ఇస్తాను: బెంగాలీ సామాజిక, సాంస్కృతిక జీవనాలపై తీవ్రంగా పడుతున్న రవీంద్రుని ప్రభావాన్ని ప్రదీప్ వంటి యువకులు చీదరించుకున్నారు. తనని తాను ‘రక్షించు ‘ కోవడానికి పడిన యాతన తన కొడుకు పడకూడదని, అతనిని బెంగాల్ కి దూరంగా పెంచాడు. మన ఆంధ్రా యూనివర్సిటి లో చదివించాడు. ఆనాటి సభలో ప్రదీప్ చేసుకున్న వాంతి – సత్యసౌందర్యాత్మకమైన, ఒద్దికైన మెయిన్ స్ట్రీమ్ పట్ల ఒక నవకవన తరం ప్రతినిధి తెలిపిన నిరసనే గానీ, వికారం కాదు (scatological గా ఉందన్న మైథిలి గారూ, మీరూ వింటున్నారా). త్రిపుర చెప్పిన విషయం కాబట్టి ప్రస్తావించడమే కాకుండా, వాంతిని సాధారణార్థంలో (చదవరులు) తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే అది రాశాను.
  3. “నాకు తెలిసి త్రిపురకు సాహిత్య కథా ధోరణులతో పనిలేదు” అన్నారు మీరు. మీతో ఇప్పుడే కాదు, ఆ వ్యాసంలో కూడా ఏకీభవించాను. మరొక మాట కూడా అన్నాను: తనని ఒక రచయితగా కూడా ఆయన గుర్తించడం ఇష్టపడరని; ఆ విషయంలో ఆయన ఇష్టాయిష్టాలని ‘గౌరవించాల్సిన’ పనిలేదని కూడా అన్నాను. పునరుక్తి అయినా చెప్పాలి: త్రిపుర గారి రచనల context ని నేను అర్థం చేసుకున్న తీరు మాత్రమే అది!
  4. “మీకు త్రిపుర పరిచయంలో కలిగిన భంగపాటు ఆయన వ్యక్తిత్వం చేత కనుమరుగయ్యిందేమో గాని ….”
  ఇది నాకు అర్థం కాలేదు. నేను పాదాల మీద పడటం గురించి ఆయన బాగా నొచ్చుకున్నారు. సిన్సియర్ గా అది ఆయన కళ్ళలో కనిపించిందని చెప్పడంలో కూడా నేను ఫెయిల్ అయ్యానా అనిపించింది మీ వ్యాఖ్య చూశాక.
  5. “త్రిపురని, ఆయన కథలను అర్థం చేసుకోడంలో మీరు ఇంకా భంగపాటుకు గురౌతున్నారని మీ వ్యాసం చదివితే తేటతెల్లమౌతుంది.”
  ఎటువంటిదైనా, ఒక కంక్లూషన్ కి వచ్చారంటే, ఎంతో శ్రద్ధగా నా వ్యాసం చదివినట్టే కాబట్టి, అందుకు థాంక్స్. నా అవగాహనా లోపానికి ప్రస్తుతానికి ఏమీ చేయలేను గానీ, ఉన్న అవగాహనని ఐనా సరిగా వ్యక్తం చేసే మరింత అభ్యాసం చేసే దిశగా మీ కామెంట్ తో నన్ను నడిపిస్తున్నందుకు మరో సారి ధన్యవాదాలు.

 • అగంతకుడు says:

  నరేశ్ జి
  మీ సహృదయతకు ధన్యవాదాలు. మీ స్ఫురణ, మీరు ఎంచుకున్న పోలిక చాలా ఘోరంగా ఉంది. అది మాకు నచ్చాలని లేదుగా. పనిలో పనిగా పెట్టుకున్నట్లు ఉంది.
  ఇక మీ అభ్యాసం.. ఎందుకో మీరు రాసింది మొదటి సారి నాకెప్పుడూ అర్థం కాదు. నాలుగైదు సార్లు చదువు కోవాల్సిందే. మీ శులభశైలిని అర్థం చేసుకోలేని నేనొక మందమతిని.

 • ns murty says:

  కనక ప్రసాద్, మీరూ త్రిపురతో మీ పరిచయాన్ని బాగా రికార్డు చేశారు… మీ మీ కోణాల్లో, అభిరుచులతో. “ఈమాట”లో కనకప్రసాద్ రచనలో సాహిత్య కోణం కంటే, ఆత్మీయ కోణమే ఎక్కువ ఉంది. మీరు త్రిపుర స్మృతి మాటున త్రిపురనీ, అతని కవిత్వాన్నీ, అతని కథలనీ బాగా Contextualize చేశారు. నిజానికి ఏ సాహిత్యకారుడైనా తనరచనలపై వచ్చే ప్రతిస్పందనలవల్లే బ్రతికి ఉంటాడు… తనని తాను ఎలాప్రకటించుకున్నా, ప్రకటించుకోకపోయినా.

  మన స్వంత అభిప్రాయాలు చెప్పడం, ఆ చెప్పింది తగిన ప్రాతిపదికలతో, సమర్థవంతంగా చెప్పడమే ఈ నాడు పరిశోధకులలో అభిలషించవలసిన లక్షణం. ఈ వ్యాసం ఆ ప్రమాణాలకి తగ్గట్టు ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం.

  అభివాదములతో

 • నరేష్ గారూ
  మీ వ్యాసం చదివాను. బాగుంది, నచ్చింది, వంటి పాలిపోయిన మాటలను చెప్పలేను గాని త్రిపుర జీవితం, ఆయన దిగులు, ఒంటరితనం, కథలు, కవిత్వం, ఆలోచనలు, అన్నీ random గా కలిపికుట్టిన కలగూరగంప మీ వ్యాసం. మైథిలి గారన్నట్లు ఇదొక సరళరేఖ కాని ట్రెపీజియం అయినా ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. (గత వర్తమాన సాహిత్యంపై మీ అసహనం అనే చేదుతో కూడా ). ముఖ్యంగా ఆయన రచనలని మీరు చూసిన తీరు (ఉదా: సెగ్మెంట్స్ రాసిన సందర్భం), ఆయన సాంగత్యంలో మీరు తెలుసుకున్న జ్ఞాపకాలు, time passing period చాలా touching & impressive గా ఉంది.
  త్రిపురగారి మీద చాలా మందివి వ్యాసాలు, ఇంటర్వూలు చదివాను. ఒక్కొక్కరికి ఒక్కోలా ఎవరికి కావలసిన వాళ్ళకి (చీకటిగదులు ) వాళ్ళలా ఎటుతిప్పి చూసినా అలానే కనిపించేలా ఉన్నాడు ఆ నిర్వికల్పి. అది మనుషులపట్ల ఆయనకు ఉన్న దయ కావచ్చు.

  చివరలో context అర్థం కాని సాహిత్యలోకానికి మిగిలారు త్రిపుర అన్నారు. ఇది ఎవరిమీదన్నా సెటైరా?

  కేవలం త్రిపుర గారి కథల మీద మీరొక ప్రత్యేకవ్యాసం రాస్తే చూడాలని ఉంది.
  -బి . అజయ్ ప్రసాద్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)