పులి – పంది సావాసం

samanya1resize

సామాన్య

ఈ కథలన్నీ నేను దాదాపు ఆరేడు నెలల ముందు విన్నాను. కథలు చెప్పిన ఆదివాసీలు కథల్ని సాద్రీ భాషలో చెప్పారు . చుట్టూ బెంగాలీ ప్రపంచం వున్నా వీరిది దీవి లాటి ప్రత్యేక ప్రపంచం అని చెప్పా కదా ,అయితే వీరి దైనిక అవసరాల నిమిత్తం వారానికో సారి ఆ తోటల చుట్టు  పక్కల సంతలు జరుగుతాయి . వీటిని ”బగానేర్ హాట్ ”[తోట సంతలు ] అంటారు . ఆ సంతల్లో అంగడి పెట్టే  వ్యాపారస్తుడు తప్పకుండా సాద్రీ  వచ్చిన వాడై  ఉంటాడు . అంచేత  బెంగాలీ భాషతో సంపర్కం చెందాల్సిన పని లేకుండా ఆదివాసీలు తమ అవసరాలను తీర్చుకుని మళ్ళీ తోటల్లోకి వెళ్లి పోతారు . అందువల్ల ఇన్ని ఏళ్ళు గడిచిపోయినా వీరికి నామ మాత్రపు బెంగాలీ కూడా రాదు. అందుకని ఈ కథల్ని వారు సాద్రి భాషలో చెప్తుంటే రికార్డ్ చేసుకునీ,అప్పటికప్పుడు నా బెంగాలీ దుబాసీ చేత అర్థం చెప్పించుకునీ విన్నాను ,మళ్ళీ తెలుగులో నా తరహాలో రాసాను .

ఇంత శ్రమ చేశా కదా అని చెప్పి ఇవి అద్భుతమైన  జానపద కథలు అని నేను చెప్పను. మనుషులం ఎన్నో అంతరాలను ఏర్పరచుకున్నాం .నేనెక్కువ,నువ్వు తక్కువ,వాడు మరీ తక్కువ అని .కానీ అదేమిటో ఏ దేశపు  జానపద కథను తీసినా అన్నీ ఒక్కలానే వుంటాయి . అన్నింటిలో  కన్పించే మానవ హృదయ వేదనలూ ,ఆనంద హేలలు ఇంచుమించు ఒక్కటే . ఈ కథలన్నీ విన్న తరువాత నాకు అనిపించింది ఏమిటంటే మనది మానవ జాతి అంతే .ఈ అంతరాలన్నీ వృధా అని . అక్కడెక్కడో పల్లెటూర్లో వుండే మా అమ్మమ్మ చెప్పిన కథకీ , ఇక్కడి క్లెమెంట్ కెర్ కెట్ట  చెప్పిన కథకీ సాపత్యం ఉండటానికి కారణం అదే . అందుకే ఈ కథలు మీరు ఇంతకు ముందు విన్నవి లాగా అనిపిస్తే ఆ తప్పు నాది కాదని నిశ్చయంగా చెప్పగలను.

-సామాన్య

***

  అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి రెండు పిల్లలు ఉండేవి. దాంట్లో పెద్ద పిల్ల కొంచం కాళ్ళూ చేతులూ ఆడటం మొదలుపెట్టాక అమ్మకు చెప్పకుండా షికారుకు బయల్దేరింది. అట్లా వెళ్లి వెళ్లి ఒక బురద గుంటలో పడిపోయింది. బురద గుంటలో ఒక పంది తన అరడజను పిల్లల్తో ఈదులాడుతూ ఉండింది. పులిపిల్ల పడిపోవడం చూసి మాతృ హృదయంతో దాన్ని తీసుకొచ్చి బయట వదిలింది. పులిపిల్ల ఆరోజుకి వెళ్ళిపోయినా రేపు మళ్ళీ బురదగుంట వద్దకు వచ్చింది. అట్లా అట్లా ఈ పులిపిల్లకి పంది పిల్లల్లో పెద్ద పంది పిల్లకి స్నేహితం కుదిరింది.

కాలం జరిగి జరిగి పులికి, పందికి పెళ్లిల్లయ్యాయి. పులి భార్య, పంది భార్య కూడా స్నేహితులయ్యారు. మరికొన్ని రోజులకి పులి భార్య కడుపున రెండు పులిపిల్లలు, పంది భార్య కడుపున ఎనిమిది పంది పిల్లలు పుట్టాయి. కాని పులి పులే కదా దానికి గున గునలాడుతూ కనిపించే పంది పిల్లల్ని తినాలని కోరిక కలిగింది కాని పంది స్నేహితుడు కదా ఎట్లా తినడం ? అందుకని ఒక ఆలోచన చేసింది పులి.

ఒకరోజు పందిని కుటుంబంతో సహా కలిసి విందుకి రమ్మని పిలిచింది. విందు అయిన తర్వాత ఎవరైనా కాసేపు కునుకు తీస్తారు కదా అప్పుడు పంది పిల్లల్ని తినేయాలని పథకం పన్నింది. పంది కుటుంబం పులి ఇంటికి విందుకి వచ్చింది. కానీ ఈ పథకం అంతా విన్న పులి పిల్లలు రహస్యంగా పందికి “మీరు విందు తర్వాత పడుకోకండి మా అమ్మానాన్న మీ పిల్లల్ని తినేయాలని అనుకుంటున్నారు ” అని చెప్పేశాయి. విందు జరిగింది కానీ పంది కుటుంబం మాత్రం నిద్రపోలేదు. ఇది చూసి చూసి పులి ఇక లాభం లేదనుకోని పందితో “అలా షికారుకి వెళ్లోద్దాం పద మిత్రమా” అని చెప్పింది.

రెండు కుటుంబాలూ షికారుకి వెళ్ళాయి వెళ్ళే దారిలో ఒక కాలువ అడ్డం వచ్చింది, “ముందు నువ్వు దాటు మిత్రమా” అన్నది పంది. అది చెప్పినట్టే పులి కుటుంబం అవతలి గట్టుకి చేరి “ఇక మీరు రాండి పంది మిత్రమా” అన్నది. అందుకు పంది “ఓ పులీ ఎవరు నీకు మిత్రుడు? విందు తర్వాత మేము పడుకుంటే మా పిల్లల్ని తినేసేయ్యాలి అనుకున్నావు నువ్వు ” అన్నది. అందుకు పులి “పంది మిత్రమా నీ మిత్రుడిని అలా అనుమానించ వచ్చా ? వాళ్ళు చిన్న పిల్లలు ఏదో అనాలనుకొని నీకు ఏదో చెప్పి ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అన్నది. అందుకు పంది భార్య “ఓ అన్నా పులీ ! చెప్పింది సత్యమైతే చిన్న చెప్పినా పెద్ద చెప్పినా వినాల్సిందే కదా” అన్నది. అట్లా ఆ రెండు కుటుంబాల స్నేహం ముగిసిపోయింది.

 

Download PDF

1 Comment

  • బాగుంది కథ.. ఇలా లోకల్ ఫ్లేవర్ తోటి కథలు చదువుతుంటే మళ్ళీ చిన్నతనం నాటి కథల కుతూహలాలు నిద్ర లేస్తాయి

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)