ఆఫ్రికన్ వ్యాసవాల్మీకులు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)శిశువు చిత్రనిద్రలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు

అన్న శ్రీశ్రీ కవితా వాక్యం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది.  పురాచరిత్రలో, పురావస్తువులలో ‘ప్రాచీనస్మృతులూచే చప్పుడు’ వినగలిగే చెవి ఉన్నవారందరికీ ఎలెక్స్ హేలీతో చుట్టరికం కలుస్తుంది.  అతని కథ సొంత కథలానే అనిపిస్తుంది. రోసెట్టా శిలను చూసినప్పుడు అతని కళ్ళలో తళుక్కుమన్న మెరుపునూ, అతని హృదయస్పందననూ వారు పోల్చుకోగలరు. న్యూయార్క్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి వెళ్ళినప్పుడు, వేల సంవత్సరాల క్రితం శిలగా ఘనీభవించిపోయిన ఒక వృక్షఖండాన్ని చూసి నేను అటువంటి సంచలనానికే లోనయ్యాను. అక్కడే బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి శిక్షాస్మృతిని చెక్కిన శిలను చూశాను. ఆధునిక చరిత్రకారులను ప్రామాణికంగా తీసుకుంటే హమ్మురాబి(క్రీ.పూ. 1750) మన మహాభారత కాలానికి కూడా వెనకటి వాడన్న సంగతి గుర్తొచ్చి కన్నార్పకుండా దానినే చూస్తూ ఉండిపోయాను.

ఇప్పటికీ ఎలెక్స్ హేలీ మన బంధువే నన్న విశ్వాసం మీకు కలగకపోతే ఇంకో విషయం చెబుతాను.  అతను తన పూర్వీకుడైన కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎక్కడికో కాదు; మనమూ, మనతోపాటు ప్రపంచమంతా ఒకనాడు జీవించిన గతంలోకి! గణసంస్కృతిలోకి!  గణదశలో ప్రపంచ మానవాళి ఒకే అనుభవాలను, ఒకే విధమైన సెంటిమెంట్లను, చివరికి ఒకే విధమైన పురాణగాథలను పరస్పరం పంచుకున్నారు.

ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యపోకండి… ఎలెక్స్ హేలీ  తన పూర్వీకుని జన్మస్థలానికి వెళ్ళి అక్కడ దర్శించినది మరెవరినో కాదు;  మన వాల్మీకినీ, వ్యాసునీ, వైశంపాయనునీ; గ్రీకుల హోమర్ ను, హెసియాడ్ నే! పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో 1966లో అతను దర్శించిన ఆ వ్యాస/వాల్మీకి/ హోమర్ పేరు:  కెబ్బా కంజీ పొఫానా!

విషయంలోకి వద్దాం.

కుంటా కింటే నుంచి ఏడు తరాలుగా అందుతున్న ఆఫ్రికన్ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవో కనిపెట్టగలమా అన్న ప్రశ్న తన ముందు వేళ్లాడుతున్న దశలో, కన్సాస్ నగరంలో ఉంటున్న కజిన్ జార్జియా ఏండర్సన్ ను హేలీ కలుసుకున్నాడు. తన చిన్నప్పుడు హెమ్మింగ్ ఇంటి వసారాలో అమ్మమ్మ ముచ్చట్లలో పాల్గొన్నవారందరిలో ఆమె చిన్నది. ఎనభై ఏళ్ల వయసులో అనారోగ్యంతో మంచం పట్టింది. హేలీ తన ఆలోచన చెప్పగానే సంభ్రమాశ్చర్యాలతో  ఒక్కసారి లేచి కూర్చుంది. “మంచి పని చేస్తున్నావు బిడ్డా,  పైనుంచి మీ అమ్మమ్మ, మిగితా పెద్దలూ నిన్ను చల్లగా చూస్తారు” అంటూ దీవించింది.

ఆ తర్వాత హేలీ వాషింగ్టన్ డీ,సీ. లో ఉన్న జాతీయ పురాపత్ర ప్రదర్శనశాలకు వెళ్ళి,  అమెరికా అంతర్యుద్ధం(1881-1885) తర్వాత నార్త్ కరోలినాలో సేకరించిన జనాభా వివరాలు కావాలని అడిగాడు. క్షణాలలో అతనిముందు మైక్రోఫిల్మ్ చుట్టలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని మిషన్ లో ఉంచి తిప్పడం ప్రారంభించాడు. 1800 ల నాటి పాతకాలపు రాత పద్ధతిలో రాసిన పత్రాలవి. ఒక చోట అతని కళ్ళు మంత్రించినట్టు ఆగిపోయాయి. ‘టామ్ ముర్రే, బ్లాక్, బ్లాక్ స్మిత్- ఇరేన్ ముర్రే, బ్లాక్, హౌస్ వైఫ్-…’ అనే పేర్లు కనిపించాయి. వాటి కిందే అమ్మమ్మ అక్కల పేర్లు ఉన్నాయి. హెన్నింగ్ ఇంటి వసారాలో చిన్నప్పుడు విన్న పేర్లే అవి! అప్పటికి అమ్మమ్మ పుట్టనే లేదు.

న్యూయార్క్ లో ఉంటున్న హేలీ వాషింగ్టన్  పురాపత్ర ప్రదర్శనశాలకు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు, డాటర్స్ ఆఫ్ అమెరికన్ రివల్యూషన్ లైబ్రరీకి తరచు వెళ్ళడం ప్రారంభించాడు. ఇంతకీ ఆ ఆఫ్రికన్ పదాలు ఏ భాషకు చెందినవన్న ప్రశ్న మాత్రం చిక్కుముడిగానే ఉంది. ఆఫ్రికాలో అనేక తెగలు మాట్లాడే భాషలున్నాయి. తమ పూర్వీకులది ఏ భాషో తెలుసుకోవడం ఎలా? న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో అనేక భాషలవారు ఉంటారు. సాయంత్రం అంతా ఇళ్లకు వెళ్లిపోయే సమయంలో సమితి కార్యాలయానికి వెళ్ళి కనిపించిన ప్రతి ఆఫ్రికన్ కూ ఆ మాటలు వినిపించి అవి ఏ భాషవో చెప్పమని అడుగుతూ వచ్చాడు. అలా వారం రోజుల్లో పాతికమందిని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఒక మిత్రుడి సాయంతో డా. జాన్ వాన్సినా అనే పేరు సంపాదించాడు. బెల్జియంకు చెందిన వాన్సినా కొంతకాలం ఆఫ్రికన్ గ్రామాలలో తిరిగి మౌఖిక సంప్రదాయం గురించి పుస్తకం రాశాడు. విస్కాన్సిన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. హేలీ ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని మ్యాడిసన్ వెళ్ళాడు. హేలీ నోట విన్న ఆ ఆఫ్రికన్ మాటలూ, అమ్మమ్మ ద్వారా అవి తనకు అందాయని అతను చెప్పడం మౌఖిక చరిత్రకారుడైన వాన్సినాను ఆకర్షించాయి. మరో ఆఫ్రికన్ నిపుణుడితో మాట్లాడి, అవి మాండింకా భాషాపదాలని తేల్చాడు. మాండింగో జనం ఆ భాష మాట్లాడతారు. ‘కాంబీ బోలోంగో’ అనే మాటలోని ‘కాంబీ’ గాంబియా నదిని సూచిస్తుందన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా హెలీకి ఎబౌ మాంగా అనే ఆఫ్రికన్ విద్యార్థి గురించి తెలిసింది. అతను న్యూయార్క్ కు అరగంట దూరంలో ఉన్న హామిల్టన్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అవి మాండింకా పదాలేనని అతను కూడా ధ్రువీకరించాడు.

హమ్మయ్య, తమ పూర్వీకులు ఎక్కడివారో తెలిసింది! వారు గాంబియా నది ప్రవహించే గాంబియా అనే దేశానికి చెందినవారు. ఇక నిర్దిష్టంగా ఏ గ్రామానికి చెందినవారో తెలియాలి. ఎబౌ మాంగాతో కలసి హేలీ సెనెగల్ రాజధాని డాకర్ కు, అక్కడినుంచి గాంబియాకు వెళ్ళాడు. అదో చిన్న దేశం. రాజధాని బంజూల్. ఆ దేశచరిత్ర తెలిసినవారిని కొందరిని కలుసుకున్నాడు. మా దేశంలో పాత ఊళ్ళ పేర్లు, శతాబ్దాల క్రితం ఆ ఊళ్ళలో మొదట స్థిరపడిన కుటుంబాల పేర్లతోనే ఉంటాయని వారు చెప్పారు. ఒక మ్యాప్ తెప్పించారు. అందులో ‘కింటే కుండా’ అనే ఊరు పేరు, దానికి దగ్గరలోనే ‘కింటా కుండా జానేయా’ అనే ఊరు పేరు కనిపించాయి.

ఆ తర్వాత, తను కలలో కూడా ఊహించని ఒక విషయం వారు చెప్పారని హేలీ అంటాడు. వందల ఏళ్ళకు విస్తరించిన వంశచరిత్రలను చెప్పే గాథికులు ఇప్పటికీ మారుమూల గ్రామాలలో ఉన్నారనీ, వారు మౌఖిక చరిత్రను వల్లించే సజీవ పురావస్తు పత్రాలని వాళ్ళు చెప్పారు. అదో వ్యవస్థ. గాథికులలో పెద్ద, చిన్న తేడాలు ఉంటాయి. పెద్ద గాథికునికి సాధారణంగా అరవై, డెబ్భై ఏళ్ళు ఉంటాయి. అతని కింద శిష్య గాథికులు ఉంటారు. నలభై, యాభై ఏళ్ల తర్వాత వాళ్ళు పెద్ద గాథికుని హోదాను అందుకుంటారు. వీరు కొన్ని ప్రత్యేక సందర్భాలలో గ్రామ-తెగ-కుటుంబ-వీర గాథలను గానం చేస్తారు.  నల్లజాతీయులు నివసించే ఆఫ్రికా అంతటా ఈ మౌఖిక గాథికులు ఉన్నారనీ, పునరుక్తి లేకుండా మూడు రోజులపాటు ఆఫ్రికా చరిత్రను చెప్పగలిగినవారు కూడా వీరిలో ఉంటారనీ వారు హెలీకి చెప్పారు. చివరగా, కింటే తెగ గాంబియాలో ప్రసిద్ధమే కనుక ఒక గాథికుని గుర్తించి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. న్యూయార్క్ కు తిరిగొచ్చిన హేలీ ఆఫ్రికా చరిత్రను నమిలి తినడం ప్రారంభించాడు.

DeniseArt

గాథికుల దగ్గర కాసేపు ఆగుదాం. హేలీ వారిని griot  అనే మాటతో సూచించాడు. ఆ మాటకు, ‘A storyteller in Western Africa who perpetuates the oral tradition and history of a village or family’ అని ఒక నిఘంటువు అర్థం చెప్పింది. ఫ్రెంచ్ guiriot, బహుశా పోర్చుగీస్ criado, లాటిన్ creatus లకు ఆ మాటతో సంబంధం ఉన్నట్టు చెప్పింది. criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థమూ, creatus అనే మాటకు పెంచబడినవాడు లేదా శిక్షణ పొందినవాడు అనే అర్థాలు ఇచ్చింది. అలాగే, సృష్టించడం అనే అర్థం ఉన్న create అనే మాటకు, creatus కు సంబంధం ఉంది. అదే నిఘంటువు griot అనే మాటకు, ‘(In Western Africa) a member of a caste responsible for maintaining an oral record of tribal history in the form of music, poetry and storytelling’ అని మరికొంత వివరణ ఇచ్చింది.  జార్జి థాంప్సన్ తన ‘Studies In Ancient Greek Society’ అనే రచనలో ‘Ritual origins of Greek Epic’ గురించి రాస్తూ ministrel అనే మాట ఉపయోగించాడు.

మన విషయానికి వస్తే, పురాణ ఇతిహాసాలలో ‘సూతుడు’ అనే మాట ఉంది. రెండు భిన్న కులాలవారికి పుట్టిన సంకీర్ణవర్ణంగా సూతులను పేర్కొంటారు. వాల్మీకిని బోయగా, వ్యాసుని బెస్తకన్యకు పుట్టినవాడుగా చెప్పడం వారి సంకీర్ణవర్ణానికి సూచన. పోర్చుగీస్ criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థం కూడా ఇవ్వడం ఇక్కడ ఆసక్తికరం. కులవ్యవస్థలో పనివాళ్లు కింది కులానికే చెందుతారు. గ్రీకు పురాణ కథకులు హోమర్, హెసియాడ్ లను జార్జి థాంప్సన్ ministrels అన్నాడు. griot అనే మాటతో సహా ఈ మాటలన్నీ స్థూలంగా ఒకే అర్థం చెబుతున్నాయి. స్వల్ప భేదాలు ఉండచ్చు కానీ వీరంతా గణసమాజం సృష్టించిన ఒకే వ్యవస్థకు చెందినవారు. గణపురుషులు, గణ వీరుల గాథలను; వంశచరిత్రలను సంగీత, కవిత్వయుక్తంగా గానం చేయడం వీరి వృత్తి. మళ్ళీ మనదేశంలో ప్రతి కులానికీ ఆశ్రిత కులాలు అనే వ్యవస్థ ఉంది. ఆశ్రిత కులాలవారు తమను పోషించే కులస్థుల చరిత్రను, కుల పురాణాలను గానం చేస్తారు. వీరందరినీ ఏ పేర్లతో పిలిచినా,  ప్రస్తుతానికి ‘గాథికులు’ అనే ఒకే మాటతో పిలుచుకుందాం. ఆఫ్రికన్ గాథికులకు ఉన్నట్టే మన గాథికులకూ శిష్యపరంపర ఉంది. వ్యాసుని శిష్యులు:  సుమంతుడు, జైమిని, పైలుడు, శుకుడు, వైశంపాయనుడు. వ్యాసుడు ఈ అయిదుగురికీ భారత కథనంలో శిక్షణ ఇచ్చాడు. అయితే వైశంపాయనుని కథనమే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక వాల్మీకి కుశలవులకు రామాయణ కథనంలో శిక్షణ ఇచ్చాడు.

అంతలో, కింటా కుంటే వంశచరిత్ర చెప్పే గాథికుని గుర్తించామనీ, గాంబియా కు రావలసిందనీ హేలీకి కబురు వచ్చింది.   అనంతర కథ తర్వాత.

-కల్లూరి భాస్కరం

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)