ఒకే అసంబద్ధ నాటకం..మరోసారి, మీ కోసం…

deraa

కేతిగాడు మరోసారి తెరతీశాడు
తాళవాద్యాలతో భజనబృందం సిద్ధమైంది
నగరం నడిబొడ్డు లోని  ప్రేత సౌధం వేదికగా-
పాత్రధారులు గళ విన్యాసం ప్రదర్శించారు

వొకరిద్దరు ఔత్సాహికులు ఓవరాక్షన్తో-
ప్రేక్షకాదరణ కోసం పాకులాడారు
మేకప్, మడత నలగని చీరలతో-
ఒకరిద్దరు నటీమణులు కాసింత గ్లామర్నద్దారు
నోరుపారేసుకుని, గోడలు దూకి..
ఫ్రైడే బ్యాంగ్ తో డైలీ సీరియల్ను రక్తికట్టించారు
అక్కడక్కడ చొరబడిన యాక్షన్ సన్నివేశాలు
బాటసారులను ఒకింత ఉద్వేగపరిచాయి
చతురంగబలాలను ప్రయోగించి..
జనాన్ని దాచేసి ఓటమినొప్పుకున్నాడు ప్రతినాయకుడు
ప్రజలకు పట్టకపోయినా, నాటకం రసవత్తరంగా సాగిందని..

పాత్రధారులే వేదిక దిగి కాసేపు చప్పట్లు కొట్టుకున్నారు
కామెర్ల కళ్లకు పచ్చజెండాలు కప్పుకుని
ఒకర్నొకరు ఘనంగా అభినందించుకున్నారు
నాటకాన్ని పదేపదే తిలకించిన..
అమరులు మాత్రం-
సిగ్గుతో మరోసారి చావుకు సిద్ధమయ్యారు!

5192479564_f9b7264107_o

Download PDF

6 Comments

  • aparna says:

    గుడ్నెస్! బావుంది, కన్ఫ్యూజ్ చేసే కవితల్లాకాక బాగా అర్థమైంది. నవ్యలో సరసి కార్టూన్స్ లా ఈ కవిత కూడా, ‘మనమీదేనర్రోయ్…’

  • “పాత్రధారులే వేదిక దిగి కాసేపు చప్పట్లు కొట్టుకున్నారు” ఈ మధ్య కాలంలో చదివించిన కవితల్లో ఇదొకటి. కంగ్రాట్స్ మిత్రమా!

  • బాగుందండి,…

  • రవి says:

    కవిత బాగుంది.

    “నగరం నడిబొడ్డు లోని ప్రేత సౌధం
    ….
    వొకరిద్దరు ఔత్సాహికులు ఓవరాక్షన్తో-
    ప్రేక్షకాదరణ కోసం…
    …..
    పాత్రధారులే వేదిక దిగి కాసేపు చప్పట్లు కొట్టుకున్నారు
    కామెర్ల కళ్లకు పచ్చజెండాలు కప్పుకుని
    ఒకర్నొకరు ఘనంగా అభినందించుకున్నారు”

    ఇదంతా జరిగిన/జరుగుతున్న కథలాగుందే!?

  • కొత్త కవి మిత్రులారా విశేషించి కవి సంగమం మిత్రులారా. ఇక్కడ ఒక కవితానుభూతిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ లంకెలో ఉన్న కవితను చూడండి. కవి చెప్పదలచుకున్న వస్తువును ఎక్కడా వాచ్యంగా చెప్పలేదు. కనీసం ఒక్క మాట కూడా అనలేదు. కాని కవిత మొత్తంలో ఒక ధ్వని సంపుటం ఉంది. ఈనాడు ప్రతిరోజూ జరుగుతున్న రాజకీయ చిత్రాన్ని రోజు చూస్తున్న వారికి కవిత ఠక్కున గుండెకు తగులుతుంది. తెలంగాణా విషయం పైన జరుగుతున్న రాజకీయ చర్చల గురించి ఖిన్నుడై ఆవేదనతో కవి కవితను రాశాడు. కాని ఎక్కడా ఉద్యమానికి సంబంధించిన విషయానికి సంబంధించిన ఒక్క మాట కూడావాచ్యం చేయడు. ఒక్కొక్క అంశంలో అతను చెప్పదలచుకున్న విషం అద్భుతమైన ధ్వనితో రక్తి కట్టింది. ఇక్కడ రాసిన కవిత వచనంలో ఉందా లేదా గణవిభజన తో కూడిన పద్యంలో ఉందా అన్నది కాదు కావలసింది. వాచ్యం చేస్తున్న పైపై పదాల తో లోలోపల ఏ అర్థాలను ఇమిడించాడు కవి అంతే కాదు ఎంత అందంగా ఎంత వ్యంగ్యాన్ని ఎంత ధ్వనిని కాకువును పండించాడు అనేది ఇక్కడ ప్రధాన విషయం. తెలుగులో ఉన్న వచన కవితా కళలో ఇదొక పద్ధతి ఈ పద్ధతిలో కవితలు రాసిన మంచి కవులు మనకు ఉన్నారు. వచన కవితా నిర్మాణంలో ఉన్న మంచి పద్ధతులలో ఇది ఒకటి. ఇక కవిత చివరలో ఉన్న చివరి చరణం చూడండి మూడు పాదాలున్నాయి. నాటకాన్ని పదే పదే తిలకించిన — అమరులు మాత్రం —- సిగ్గుతో మరొకసారి చావుకు సిద్ధమయ్యారు. ఈ చరణం ఒక టార్చి లైటు వేసి పైనున్న అన్ని చరణాలవైపు కాంతి ప్రసరింప చేస్తున్నట్లుగా ఉంది. చూడండి ఇదీ కవితా రచనా కళ. పై చెప్పిన నాటకం మొత్తానికి అర్థాన్ని పేలేలా చేసేది ఈ మూడు పాదాలే. తెలంగాణా విషయం మీద ఇంత మంచి కవిత ఇటీవలి కాలంలో రాలేదు. కవి నిజంగా నిజంగా నిజంగా అభినందించ దగిన కళాకారుడు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఇదే కవితను ఇంకో సందర్భానికి అనుసంధానించి చూస్తే మొత్తం కవితకు ఇంకొక అర్థం రావచ్చు. చదివే ప్రేక్షకుడు మరొక కాలంలో చదివితే ఇంకొక అర్థం రావచ్చు. అందుకే కవిత పాఠ్యాన్ని రాసి వదిలిన కవి చెప్పని అర్థాలు తర్వాతి కాలంలో ఆ కవిత పాఠకులకు అందించవచ్చు. దీన్నే ఆర్గానిక్ క్వాలిటీ అని అంటారు. అంటే జీవలక్షణం అన్నమాట. ఒక విత్తులో జీవం ఉన్నట్టు ఒక కవితలో అంతర్గతంగా ఉండే జీవలక్షణం. ఎక్కడ ఆ విత్తు పడితే అక్కడి పద్ధతి ప్రకారం అది పెరుగుతుంది. నా అనుభూతిని మీతో పంచుకునే చిన్ని ప్రయత్నం ఇది తిరిగి వీలైనప్పుడు మరికొన్ని వచన కవితా కళలను గురించి మాట్లాడుకుందాం. దేశరాజు కవితను గురించి మరికొన్ని విషయాలు ఇంకా చెప్పాలని ఉంది. మనం చాలా కవితల్ని చూచి ఉంటాం. కవి కొన్ని వాక్యాలను ఇలాంటి వ్యంగ్యంతో మొదలు పెడతాడు. ఇంకొక చరణానికి పోయేటప్పటికి అక్కడ విషయాన్ని వాచ్యం చేస్తాడు అంతే కాదు పేర్లు చెబుతాడు లేదా సంఘటనలు పైకి పూర్తిగా తెలిసేలా వాచ్యం చేస్తాడు. అయితే విషయాన్ని వాచ్యం చేస్తూ కూడా పద చిత్రాలను వేస్తూ కవితను పండించవచ్చు. కాని ఆశైలి ఆ రచనా కళ పద్ధతి వేరే. కాని ఇలా కవితను ఎన్నుకున్నప్పుడు ఒక అనుస్యూతి అంటే కంటిన్యుటీ ఉండేలే అంటే కవితా నిర్మాణంలో అనుస్యూతితో కూడిన నిర్మాణం ఉండేలా చూస్తూ విషయాన్ని ప్రస్తారం చేయాలి. ఈ అనుస్యూతి తోనే కవిత ఒక చక్కని అనుభూతి గుళిక అవుతుంది. ఈ దృష్టితో మనం వెనుకకు చూస్తే వచన కవులు ఎక్కడ పేలవం అవుతారో విఫలం అవుతారో తెలిసిపోతుంది. అలా చూడండి ఒకసారి. పులికొండ సుబ్బాచారి.

  • desaraju says:

    ధన్యవాదాలు.. పులికొండవారికి.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)